థర్డ్ సిన్

2
10

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘థర్డ్ సిన్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శం[/dropcap]కర్ మంచి డ్రామా ఆర్టిస్ట్. మరొక 10 రోజుల్లో నాటక పోటీలు జరగబోతున్నాయి. గురజాడ క్షేత్రంలో వారం రోజుల్నించీ రిహార్సల్స్ చేస్తున్నాడు తన టీమ్‍తో. ఈ నాటక పరిషత్ పోటీలు ఏడాదికి ఒక సారి జరుగుతాయి. వృత్తి రీత్యా, ఆర్టీసీలో కండక్టర్‌గా చేస్తున్నాడు.

రెండు రోజులు జ్వరంగా ఉండి ఇల్లు కదలలేదు. సడన్‌గా బాగా నీరస పడిపోవడం, కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడంతో దగ్గర లోనే వున్న స్వాతి నర్సింగ్ హోమ్‌కి ఇంట్లో వాళ్ళు తీసుకుని వెళ్ళేరు. అతని దగ్గర తల్లి, తమ్ముడు వుంటారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు.

డాక్టర్ శ్రీధర్ పేషెంట్‌ని పరిశీలించి, రక్త పరీక్షలు చేసేక, డెంగీ జ్వరం అని తేల్చేడు. ఐ.సి.యు.లో ఉంచేరు. శంకర్ బాగా నీరసంగా వున్నాడు. ఫ్లూయిడ్స్, ఆంటీబయోటిక్స్‌తో వైద్యం మొదలు పెట్టేరు. ప్లేట్‌లెట్స్ కూడా ఎక్కించారు.

మూడు రోజులు గడిచేక, కాస్త తేరుకున్నాక, రూమ్‌కి షిఫ్ట్ చేసేరు. మరొక వారం హాస్పిటల్ లోనే ఉండాలి అన్నారు. ఐ.సి.యు.లోనూ, అతను రూమ్‌కి షిఫ్ట్ అయ్యాక కూడా, డ్యూటీలో వున్న నర్స్ శ్యామలే. ఆమెకి అతన్ని చూస్తే తన చనిపోయిన తమ్ముడు బలరాం గుర్తుకు వస్తాడు. అతనికి దగ్గర ఉండి సపర్యలు చేసేది. శ్యామలని చూస్తే, తన అక్క వనజ లాగ ఉంటుంది అనేవాడు శంకర్. అతని అక్క ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది.

డాక్టర్ శ్రీధర్ వృత్తి రీత్యా మంచి డాక్టరే కానీ స్త్రీ లోలుడు. అందంగా, ఒంటరిగా వుండే శ్యామల మీద ఉంటాయి అతని కళ్ళు ఎప్పుడూ. అనేక సార్లు ఆమెతో తప్పుగా ప్రవర్తించేడు. ఆమెకి అతని చేష్టలు చికాకు తెప్పించేవి. ఎన్నో సార్లు వుద్యోగం వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నా, ధైర్యం చేయలేక పోయింది. కారణం.. వున్న వుద్యోగం పొతే, ఇల్లు గడవడం కష్టం. పైగా తన మీద ఆధారపడ్డ తల్లిని చూసుకోవాలి. ఈ హాస్పిటల్ అయితే, తల్లి అనారోగ్యానికి కూడా ఉచితంగా వైద్యం దొరుకుతుంది. అందుకని ఆమె అతని బాధలు పంటి బిగువన భరిస్తూ వస్తోంది.

శంకర్‍ని చూస్తే తోడబుట్టిన వాడిని చూసిన అనుభూతి కలిగేది. అందువల్ల, శంకర్ ఆ హాస్పిటల్‌లో వున్న సమయంలో ఎక్కువ అతని దగ్గరే డ్యూటీ వేయించుకుంది.

మరో రెండు రోజుల్లో శంకర్‍ని డిశ్చార్జ్ చేస్తారు అనగా, ముందు రోజు రాత్రి జరిగిన ఘోర సంఘటన ఆమె జీవితాన్ని కకావికలం చేసింది.

ముందు రోజు రాత్రి శంకర్ తమ్ముడికి అత్యవసర పని పడి ఒంగోలు వెళ్ళవలసి వచ్చింది. అతని తల్లి సీతమ్మ క్యారేజ్ పట్టుకుని వచ్చి కొడుక్కి తినిపించి, హాస్పిటల్‌లో పడుకుందామని నిర్ణయించుకుంది. కానీ, శ్యామల ఆమెని వారించింది.

“మీరు పెద్దవారు, అంత శ్రమ పడద్దు, ఒక్క రాత్రికే కదా, ఈ రాత్రికి నేను శంకర్‌ని చూసుకుంటాను” అంది శ్యామల.

“నీకెందుకమ్మా శ్రమ” అంది సీతమ్మ.

“పర్వాలేదు.. మీరు ఉదయం కాఫీ, టిఫిన్ తీసుకుని రండి” అంది శ్యామల.

నైట్ డ్యూటీకి వచ్చిన శ్యామల శంకర్‌కి మందులు ఇచ్చి ఏమయినా కావలిస్తే, పిలవమని చెప్పి, పక్కనే వున్న నర్సింగ్ స్టేషన్‌లో కూర్చుంది. ఆ రోజు వార్డ్ మొత్తం ఎవరూ లేరు. ఆ ఫ్లోర్‌లో శంకర్ తప్ప పేషెంట్స్ కూడా లేరు. మధ్యాహ్నం ముగ్గురు పేషెంట్స్‌కి డిశ్చార్జ్ ఇచ్చేడు డాక్టర్.

తెల్లవారుఝామున ఇంటికి వెళ్తూ శంకర్ నిద్రపోతున్నట్లు భావించి, శబ్దం చేయకుండా తలుపు దగ్గరకి వేసి, వెళ్లి పోయింది శ్యామల.

ఉదయాన్నే రూమ్ క్లీనింగ్‌కి వచ్చిన వార్డు బాయ్ అరుపులతో ఆ వార్డు మారుమోగిపోయింది. పరుగెత్తుకు వచ్చిన డ్యూటీ డాక్టర్ మంచం మీద చచ్చి పడి వున్న శంకర్‌ని చూసి హతాశుడయ్యాడు.

పోలీస్ టీమ్ రావడం, సంఘటన పరిసరాలు పరిశీలించడం జరిగింది. శంకర్ పక్కన సీపింగ్ పిల్స్ సీసా ఖాళీగా ఉంది. తలగడ కింద ఒక సూయిసైడ్ నోట్ కనపడింది. అందులో ఇలా రాసి ఉంది:

“శ్యామల ప్రేమ కోసం పరితపిస్తున్న నన్ను ఆమె తిరస్కరించడం నేను తట్టుకోలేక పోతున్నాను. ఆమె లేని జీవితం నాకు వద్దు. అందరికీ సెలవు.”

అది ఆత్మహత్యగా నిర్ధారించుకున్నారు పోలీసులు. శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించి, విచారణ మొదలు పెట్టేరు.

ఇన్‌స్పెక్టర్ కమలాకర్ హాస్పిటల్ లో అందరినీ, ప్రశ్నించేడు. శ్యామల శంకర్‌ని ప్రేమగా చూసేది అని, కానీ అది అక్క తమ్ముళ్ల ప్రేమ లాగా ఉండేది అని చెప్పేరు తప్ప ఏ విధమయిన అనుమానం వ్యక్తం చేయలేదు.

అతని తల్లిని ఊరుకోబెట్టడం ఎవరి వల్ల కావడం లేదు. తన డ్యూటీ ప్రకారం ఆమెని ప్రశ్నించాలి కనుక, ఆమెని కూడా ప్రశ్నించేడు ఇన్‌స్పెక్టర్. ఆమె కూడా శ్యామలని తన బిడ్డలా భావించేదాన్ని అని, తన కొడుకుని తమ్ముడి లాగే చూసేది అని చెప్పింది. శంకర్ తమ్ముడు వూరి నుండి వచ్చేక అతన్ని కూడా ప్రశ్నించాడు. అతను కూడా తన అన్నయ్యకు ప్రేమ వ్యవహారాలు లేవు అన్నాడు.

డాక్టర్ శ్రీధర్‌ని ప్రశ్నించినప్పుడు, అతను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసేడు.

శంకర్ హాస్పిటల్‌లో జాయిన్ అయిన దగ్గర నుండీ శ్యామల శంకర్ దగ్గరే డ్యూటీ చేసింది అని, అడిగి మరీ శ్యామల ముందు రోజు డ్యూటీ శంకర్ వున్న వార్డులో వేయించుకుంది అని, చెప్పేడు. పైగా తరచూ ఆమె శంకర్‍ని కలుస్తూ ఉంటుంది అని చెప్పాడు. “వాళ్లిద్దరి మధ్య ఏ సంబంధం ఉందో నాకు తెలియదు” అన్నాడు.

కమలాకర్ శ్యామలని కూడా ప్రశ్నించేడు. ఆమె శంకర్ మరణం చూసి తట్టుకోలేకపోతోంది. ఆమె కూడా శంకర్‌ని తన చనిపోయిన తమ్ముడి లాగా అనుకుంటానని చెప్పింది. ఆమె మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది.

కమలాకర్‌కి అర్థం కావడం లేదు. తమ్ముడిలా చూసుకునే వ్యక్తి ‘ఆమె ప్రేమ తిరస్కరించింది అని అందుకే మరణిస్తున్నాను అని చనిపోవడం ఏమిటి?’ ఇలా ఆలోచిస్తున్న కమలాకర్ –

శ్యామలని “మీకు ఎవరయినా శత్రువులు ఉన్నారా” అని అడిగేడు. డాక్టర్ శ్రీధర్ అక్కడే ఉండడంతో, ఆమె బెదురు చూపులతో.. తల అడ్డంగా ఊపింది.

ఇంత సంఘటన తమ హాస్పిటల్‌లో జరగడం, అందులో శ్యామల పేరు బయటకి రావడంతో హాస్పిటల్ మేనేజిమెంట్ ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది.

ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా శంకర్ శవం దగ్గర దొరికిన వుత్తరం లోని హ్యాండ్ రైటింగ్ అతనిదే అని తేల్చింది.

ఇన్‌స్పెక్టర్ కమలాకర్ శంకర్ పని చేస్తున్న RTC డిపార్ట్‌మెంట్‍కి వెళ్ళేడు. అక్కడ కూడా అతని గురించి మంచిగానే చెప్పేరు. అతనికి ప్రేమ వ్యవహారం ఉండేదా అంటే ఆశ్చర్యంగా చూసేరు తప్ప, అక్కడ అంతా “తెలియదు” అనే సమాధానం వచ్చింది.

బయలు దేరి వచ్చేస్తుంటే, అతని సహోద్యోగులు మాట్లాడుకున్నదాన్ని బట్టి ఇన్‌స్పెక్టర్‌కి తెలిసింది, శంకర్ తీరిక వేళల్లో నాటకాలలో పోటీలకు వెళ్తూ ఉంటాడని.

సురభి నాటక సమాజం వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళేడు. నాగరాజు అనే డైరెక్టర్‌ని కలిసేడు. వాళ్ళు కూడా శంకర్‌కి ఇలా జరిగింది అని తెలిసి, చాలా బాధపడ్డారు. దసరాకి వాళ్ళు వేయబోయే నాటకంలో ప్రధాన పాత్ర శంకర్‌ది అట. దసరా దగ్గిర పడుతోంది, ఇప్పుడు శంకర్ వేయాల్సిన పాత్ర వేరే ఎవరు వేయాలా అని తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది.

తిరిగి వచ్చేక, కమలాకర్ చేసిన ఎంక్వయిరీలో డాక్టర్ శ్రీధర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసేయి.

శ్రీధర్‍కి అందమయిన భార్య వున్నా, డ్యూటీలో వున్న ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తించడం అలవాటే అని తెలిసింది. అతని బావ గవర్నమెంట్‌లో మినిస్టర్‌గా ఉండడంతో అతని జోలికి ఎవరూ వెళ్లరు. అతని కన్ను ఈ మధ్య ఒంటరిగా ఉంటున్న శ్యామల మీద పడింది అని, ఆమె అతన్ని తిరస్కరించింది అని తెలిసింది.

ఒక ఆయా భయం భయంగా ఈ విషయాలు తెలిపింది. కానీ, శంకర్ హాస్పిటల్ జాయిన్ అయిన రోజే, తన మామగారు చనిపోవడంతో తన స్వంత వూరు వెళ్లిపోయినట్లు చెప్పింది.

ఈ కేసు ఎలాగయినా ఛేదించాలని కంకణం కట్టుకున్నాడు కమలాకర్.

ఆ రోజు మళ్ళీ డిపార్ట్‌మెంట్‍ కి వెళ్లి తనకు కావలసిన కొన్ని సాక్ష్యాలు సేకరించి, కేసులో బలంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. డాక్టర్ శ్రీధర్‌ని కస్టడీ లోకి తీసుకోవాలని అనుకున్నాడు. పై ఆఫీసర్ వారించేడు. “మినిస్టర్ గారి బావమరిది, ఏ ఆధారం ఉందని అరెస్టు చేయగలవు. అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకోకు” అని సలహా ఇచ్చేడు.

ఆ ఆదివారం డ్యూటీ సెలవు కమలాకర్‌కి. బీచ్‌కి వెళ్ళేడు. కార్ పార్క్ చేస్తున్నప్పుడు నాగరాజు మరో ఇద్దరితో కలిసి ఎదురు పడ్డాడు.

ఇన్‌స్పెక్టర్‍ని చూసిన నాగరాజు మర్యాద పూర్వకంగా నమస్కరించేడు.

“మళ్ళీ వారం మా నాటకం ‘ప్రేమ తపస్సు’ ప్రదర్శించబోతున్నాం.. దయచేసి రండి”. అని పిలిచేడు.

పక్కన వున్న అతన్ని పరిచయం చేసి, “ఇతని పేరు దయాకర్, ఇతనే శంకర్ వేయాలన్న పాత్ర వేస్తున్నాడు. ఈవిడ పేరు వసంత. ఈమె అతని ప్రేమికురాలి పాత్ర వేస్తున్నారు” అన్నాడు.

వాళ్లిద్దరూ మర్యాద పూర్వకంగా కమలాకర్‌కి నమస్కరించారు

“అలాగే” అని చెప్పి, ఇంతకీ “శంకర్ చనిపోకపోయి ఉంటే, ఈమె, శంకర్ ఈ నాటకంలో వేసి వుండేవారు అనుకుంటా” అన్నాడు కమలాకర్.

“అవునండీ, వాళ్లిద్దరూ రిహార్సులు కూడా బాగా చేసేరు” అన్నాడు నాగరాజు.

“పదండి, బీచ్‌లో కూర్చుని మాట్లాడుకుందాము” అని వాళ్లతో కదిలేడు.

అందరూ ఇసుకలో కూర్చున్నారు. అప్పుడు కమలాకర్ మళ్ళీ అడిగేడు.. “కథ ఏమిటో తెలుసుకోవచ్చా..?” అని.

“పోటీలో వుండే నాటకం.., ముందుగా కథ చెప్పేస్తే, మీకు ఆ రోజు ఉత్సాహం ఉండదు” అన్నాడు నాగరాజు నవ్వుతూ.

“పర్వాలేదు, నేను ఆ రోజు క్యాంపుకి వెళ్తే రాలేను.. ఒకసారి స్క్రిప్ట్ ఉంటే చూపించండి” అన్నాడు. నాగరాజుకు తప్పలేదు. బాగ్ లోంచి స్క్రిప్ట్ తీసి చూపించేడు.

కమలాకర్‌కి వెంటనే స్ఫురించింది. తన ఫోన్‌లో వున్న స్కాన్ తీసిన ఒక ఉత్తరం నాగరాజుకి చూపించేడు.

“ఇది ఎక్కడ దొరికింది మీకు?” అన్నాడు నాగరాజు.

“శంకర్ చనిపోయినప్పుడు అతని పక్కన దొరికిన వుత్తరం అది” అన్నాడు.

“లేదు, ఇది శంకర్ తన రిహార్సల్ కోసం రాసుకున్నాడు. నాటకంలో ప్రియురాలి మోసం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే సమయంలో సాగర్ పాత్ర పక్కన ఈ వుత్తరం ఉండాలి. నాటకంలో సహజత్వం కోసం, ప్రింట్ చేసిన లెటర్ చదవకుండా, తానే రాసుకుంటానని అతనే రాసుకున్నాడు. రిహార్సల్ దగ్గర నుండీ సహజత్వం మెయిన్‌టైన్ చేసే తత్త్వం శంకర్‌ది, నాటకంలో అతని ప్రియురాలి పేరు శ్యామల” అన్నాడు నాగరాజు.

ఇన్‌స్పెక్టర్ కమలాకర్ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేయి ఇప్పుడు.

శ్యామల తనకి లొంగడం లేదని, డాక్టర్ శ్రీధర్ శంకర్ బాగ్‍లో దొరికిన నాటకం స్క్రిప్ట్‌లోని ఈ వుత్తరం ఉపయోగించుకుని, శంకర్‍ని హత్య చేసి, ఆ నేరం శ్యామల మీదకి నెట్టేసేడు అన్నమాట.

హ్యాండ్ రైటింగ్ శంకర్‌ది అవడంతో, ఎవరికీ అనుమానం రాదు. పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుని, శ్యామల మీద కక్ష సాధించాలి అనుకున్నాడు శ్రీధర్. ఇరువురి కుటుంబాలు పేదవాళ్ళు కావడం శ్రీధర్ తెగింపుకి కారణం. పైగా, కేసుని తన పలుకుబడితో తాను అనుకున్నట్లు నడపచ్చు అని డాక్టర్ ధీమా అని అర్థం అయింది కమలాకర్‌కి .

పట్టుదలగా, ముందుకి వెళ్లిన ఇన్‌స్పెక్టర్ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోగలిగేడు. శంకర్ స్లీపింగ్ పిల్స్ మింగి చనిపోలేదు. స్లీపింగ్ పిల్స్ ద్రవరూపంలో కరిగించి, ఆ ద్రవాన్ని, మందు అని చెప్పి, శంకర్‌తో తాగించింది డాక్టర్ శ్రీధర్ అని తెలుసుకున్నాడు.

తగిన అన్ని సాక్ష్యాలతో, శ్రీధర్‌ని కస్టడీ లోకి తీసుకున్నాడు ఇన్‌స్పెక్టర్ కమలాకర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here