ప్రేమ కొన్నిసార్లు అందని ఫలం అవడమే సరి అయిన ముగింపు అన్న పాయింట్‌పై వచ్చిన సినిమా ‘తూర్పు పడమర’

1
9

[dropcap]మ[/dropcap]నుష్యుల మధ్య ప్రేమ అనే భావం ఎంత సుఖాన్ని ఆనందాన్ని అందిస్తుందో, అదే ప్రేమ అంతులేని ప్రశ్నార్థకార అయోమయ జగత్తులోకి లాక్కువెళ్ళి జీవితాలను అతలాకుతలం కూడా చేయగలదు. అందుకే ప్రేమ ఎలా పుట్టినా, ఎవరిపై కలిగినా అది క్షీణించిపోకుండా ఉండాలంటే మనుష్యులలో విజ్ఞత అవసరం. చాలా సందర్భాలలో మనసు మేధను ఆక్రమించుకుని హృదయం తప్పు నిర్ణయాలను తీసుకోవడం వలన ప్రేమ పంజరంగా మారిన వైనాలు విన్నాం చదువుకున్నాం. ప్రేమలో ఆ తీయదనం, అ గొప్పదనం ఎప్పటికీ నిలిచి ఉండాలన్నా, వ్యక్తి మానసిక ఉన్నతికి జీవిన సాఫల్యానికి ఉపయోగపడే గొప్ప భావనలా కలకాలం మదిలో నిలుపుకోవాలన్నా, ప్రేమ విజ్ఞతల కలయిక జీవితాలలో అవసరం. అదే మనిషి జీవితంలో సాధించే గొప్ప విజయం కూడా. అందువలన ప్రేమ పెళ్ళికే దారి తీయవలసిన అవసరం లేదు. ప్రపంచ బంధాలలో ఒకటిగా అది ప్రదర్శింపబడే అవసరం లేదు. ప్రేమ వల్ల పొందే మానసికానందం అన్ని సందర్భాలలో శరీరాల కలయిక తోనే సాధ్యం అనుకోవడం కూడా తప్పే. కొన్నిసార్లు పెళ్ళి చేసుకుని జీవించడం మొదలుపెట్టిన వ్యక్తులు తాము ఒకరికి ఒకరం అయినా తమ జీవితాలలో ప్రేమ మాత్రం మాయమయ్యింది అని గుర్తించిన సందర్భాలు అనేకం. కారణం ప్రేమ అనే భావం ఎప్పటికీ గుభాళిస్తూ ఉండాలంటే అలాంటి మానసిక, శారీరిక వాతావరణంతో పాటు అవకాశం, పరిసరాల ప్రభావం కూడా పని చేస్తాయి. ప్రతికూలమైన పరిస్థితులలో చాలా సార్లు ప్రేమ ఓడిపోతుంది. లేదా జీవితంలో అది ఒక చోట నిలచిపోతుంది. అందుకే ప్రేమను ప్రేమగా నిలుపుకోవడానికి వివాహం, కలిసి జీవించడం మాత్రమే సూత్రాలు అవ్వవు. పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరం వచ్చేనప్పుడు పాటించే విచక్షణ చాలా వరకు ప్రేమను గెలిపిస్తుంది.

ఈ పాయింట్ మీద 1976‌లో వచ్చిన మంచి సినిమా తూర్పూ పడమర. ఇది  1975లో వచ్చిన అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమా ఆధారంగా నిర్మించిన చిత్రం. తమిళంలో ఈ కథ రాసుకుని సినిమాకు దర్శకత్వం వహించింది కే. బాలచందర్. తెలుగులో అదే కథను తీసుకుని దాసరి నారాయణరావుగారు దర్శకత్వం వహించారు. ఇది నలుగురు వ్యక్తుల కథ. జగన్నాధం ఒక ధనవంతుడు. అతని కొడుకు సూర్యం ఆవేశపరుడు, విప్లవ భావాలతో జీవితం పట్ల పూర్తి అవగాహన లేక రోజులు గడుపుతూ ఉంటాడు. సహజంగానే ఈ తండ్రీ కొడుకుల మధ్య సంబంధాలు బావుండవు. తండ్రిని కాదని సూర్యం ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అతని ఆవేశం, ఆలోచనా లేని తనం కారణంగా గొడవలలో ఇరుక్కుంటూ ఉంటాడు. ఇక రంజని ఒక పెద్ద గాయని. ఆమె కూతురు కళ్యాణి. ప్రేమలో మోసపోయి గర్భవతి అయి లోకానికి తెలీయకుండా బిడ్డని కని ఆ బిడ్డనే దత్తు తీసుకున్నానని చెపుతూ రంజని కళ్యాణిని పెంచుకుంటుంది. కాని ఎప్పుడయితే కళ్యాణికి తన పెంపుడు తల్లే నిజం తల్లి అని తెలుస్తుందో తల్లి మీద కోపంతో ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఒక పెద్ద గొడవలో దెబ్బలు తిని రంజనికి కనిపిస్తాడు సూర్యం. అతనికి సపర్యలు చేసి మామూలు మనిషిని చేస్తుంది రంజని. జీవితంలో ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయిన ఆమె జీవితంలో ఈ యువకుడు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాడు. కాని ఆమెను తాను ప్రేమిస్తున్నానని, ఆమెతోనే జీవిస్తానని అతను చెప్పినప్పుడు రంజనికి అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీయదు. అతని తొందరపాటు, అతని ఆవేశం వీటికి తోడు తన ఒంటరి జీవితంలో అతను నింపిన ఉత్సాహం వీటి మధ్య కొట్టూకుంటూ ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితిలొ అతనితో ఉంటుంది రంజని.

కళ్యాణికి జగన్నాధం పరిచయం అవుతాడు. జీవితంలో తండ్రి ప్ర్రేమే తెలీయని కళ్యాణి అతన్ని ప్రేమిస్తుంది. కళ్యాణి జీవితానికి ఒక దారి చూపాలని ఆమె వివాహం కోసం జగన్నాధం ప్రయత్నిస్తున్నప్పుడు తాను అతనినే వివాహం చేసుకుంటానని పట్టుపడుతుంది కళ్యాణి. కూతురు వయసున్న ఆ అమ్మాయి రాకతో జీవితంలో వచ్చిన ఆనందాన్ని వదులుకోలేక ఆమె నిర్ణయాన్ని ఆమోదించలేక ఇబ్బంది పడతాడు జగన్నాధం. కళ్యాణి అతనికి కావాలి కాని ఏ రూపంలోనో నిర్ణయించుకోలేని స్థితి అతనికి. ఒకసారి అనుకోకుందా రంజని ఇంటికి వెళ్ళిన జగన్నాధం ఆమె ఇంట్లో కళ్యాణి ఫోటోని ఆమెని ప్రేమిస్తున్న వ్యక్తిగా తన కొడుకుని చూసి నిర్ఘాంతపోతాడు. కళ్యాణికి, రంజనికి, సూర్యానికి కూడా ఈ బంధాన్ని వివరించి ఏం నిర్ణయం తీసుకోవాలో చెప్పమంటాడు. రంజనిని మోసం చేసిన వ్యక్తి కాన్సర్ సోకి పశ్చాత్తాపంతో రంజనిని కలవడానికి వస్తాడు. కాని సూర్యం అతని వైద్యం భాద్యత తీసుకుంటూనే రంజనిని అతనితో కలవనివ్వడు. ఒక కచేరిలో రంజని స్టేజీ మీద పాడుతున్నప్పుడు, జగన్నాధాన్ని వదిలి తల్లి పక్కకు చేరి కళ్యాణి ఆ సమస్యకు పరిష్కారం నిర్ణయిస్తుంది. ఆమె ఖాళీ చేసిన కుర్చో లోకి తండ్రి పక్కన సూర్యం వెళ్ళి కూర్చోవలసి వస్తుంది. కొన్నిసార్లు తారుమారయే సంబంధాలతో జీవితంలో రేగే అల్లకల్లోలాన్ని పరిష్కరించుకోవడానికి ఏ బంధం వైపు మొగ్గు చూపాలో నిర్ణయించుకోవలసి వస్తుంది. ఇక్కడ స్వేచ్ఛ అనో ప్రేమ గొప్పతనం అనో జగన్నాదాన్ని కళ్యాణి, సూర్యాన్ని రంజని పెళ్ళి చేసుకోవడం వల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను ఎదుర్కుని జీవించే స్థితిలో మానవుడు చేరలేడు. ఇక్కడ వయసు, ప్రేమకు అర్హత ల ప్రసక్తి రాదు. ఎవరు ఎవరినయినా కోరవచ్చు. కాని వారు తీసుకునే నిర్ణయాల పై సంఘం ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. సంఘాన్ని ఎదిరించినా తరతరాలుగా మానవ మనుగడ నిర్మితమయిన విలువలు మనిషి మదిలో తొలుస్తూనే ఉంటాయి. వాటిని మానవ జాతి నిర్మూలించుకోలేదు.

సంఘాన్ని ఎదిరించి జీవించవచ్చు కాని మనస్సాక్షిని కేవలం కోరిక కోసం చంపుకోలేం. మనసులో నిత్యం ఉత్పన్నమయ్యే ప్రశ్నల తాకిడిని తట్టుకోలేం. ఇదే వాస్తవికత. అటువంటి బంధాలు ఎంతగా స్వేచ్ఛ పేరుతో, ఆధునిక భావజాలం పేరుతో ఏర్పడినా అవి చాలా వేదనను కలిగిస్తాయి. ఎందుకంటే మనిషిలోని అంతర్మథనం నుండి మనిషి తప్పించుకోలేడు కాబట్టి. నైతికత, నియమాలు, ఆదర్శాలను పక్కన పెట్టినా కొన్ని బంధాలు ఏర్పడవు అంతే. బలవంతంగా ఏర్పరుచుకోవాలన్నా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి తప్ప అవి ప్రశాంతతను ఇవ్వలేవు. అందుకే రంజని తన వద్దను వచ్చిన తన ప్రియున్ని కలుసుకుని అతను మరణించిన తరువాత అతని విధవగా బ్రతకడానికి సిద్దపడుతుంది. తన కూతురుకి తల్లిగా ఉండిపోతుంది.

ఈ సినిమాలో నాకు ఈ బంధాల మధ్య conflict ఇప్పుడు చూస్తే ఇంకా నచ్చింది. తన కన్నా చిన్న వయసు వానిపై ప్రేమ ఏంటీ అనే స్థితిలో ఇప్పుడు సమాజం లేదు. కాని తన కూతురు పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తి కొడుకుని భర్తగా ఊహించుకునే స్థితికి మన సమాజం రావడం కష్టం, వచ్చినా అవి ఆరోగ్యకరమైన సంబంధాలు అవవు. ఉదాహరణకు హాలివుడ్‌లో జరుగుతున్న ఇలాంటి ప్రయోగాలు చూద్దాం. ఊడి అలన్ లాంటి దిగ్గజాలు తమ జీవితంలో చేసిన ఇటువంటి ప్రయోగాలు వారికి ఏ మాత్రం ప్రేమను మిగిల్చాయో కూడా మనకు కనిపిస్తుంది. తన పిల్లలతో కూడి సంతానాన్ని కనడానికి మనిషి ఇంకా సిద్ధంగా లేడు. బహుశా మన సమాజ నిర్మాణంలోనే అది మనిషి మనసుకే ఆమోదం కాని ప్రక్రియ  అవుతుంది. ఈడిపస్, ఎలెక్ట్రా మొదలయిన గ్రీకు కథలు, రాజ కుటుంబాలలో సోదరుల మధ్య వివాహం, ఇలాంటి వాటి గురించి విన్నాం. చరిత్రలో జరిగాయి కాని వాటి ఫలితాలు సమస్యాత్మకంగానే కనిపిస్తాయి. తన జీవితంలో తోడు ఎంచుకునే విషయంలో మనిషి కొంత నైతికత వైపే మొగ్గు చూపుతాడు. కొన్ని ప్రాంతాలలో మేనరికం చాలా తప్పు, కొన్నిచోట్ల అది సాధారణం. కొన్ని మతాలలో చిన్నాన్న పెదనాన్న పిల్లల మధ్య వివాహం జరుగుతుంది. కొన్ని చోట్ల అది తప్పు. కజిన్‌లను వివాహం చేసుకోవడం అన్ని తెగలలో జరగదు. వీటికి విరుద్ధంగా పోరాడి వివాహం చేసుకున్న వారు ఉన్నారు. కాని ఒక తండ్రి కొడుకు అటు కూతురుని తల్లిని చేసుకోవడం అసలు ఆ అలోచన రావడమే వ్యక్తిగతంగా వారిని మానవ సమూహానికి దూరం చేస్తుంది. ఎవరు ఎవరో తెలీయనప్పుడు ప్రేమ అనిపించి ఆ బంధాన్ని వదులుకోలేం అనుకున్న వారే, వారి మధ్య పరస్పర బంధం గురించి తెలిసిన తరువాత విడిపోవడం శ్రేయస్కరం అనుకుంటారు. ఆ అలోచన యువతరంలో మొదట కలిగినట్లు ముగింపుని చూపడం చాలా బావుంది.

ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతం గొప్ప ఎసెట్. సి. నారాయణ రెడ్డి రాసిన పాటలన్నీ పెద్ద హిట్లే. శివరంజని, స్వరములు ఏడైనా. తూర్పు పడమర ఈ రోజుకీ అలరించే పాటలే. కొన్ని బంధాలు కలవవు అంతే. వాటిని కలపాలనే మొండితనం కష్టాలకే దారి తీస్తుంది అని చెప్పిన మంచి చిత్రం ఇది. ప్రస్తుతం బంధాల డెఫినేషన్స్‌నే మార్చేయడానికి పూనుకున్న తరం చూడవలసిన సినిమా ఇది.  జగన్నాధంగా సత్యనారాయణ, రంజనిగా శ్రీవిద్య, కళ్యాణిగా మాధవి, సూర్యంగా నరసింహ రాజు నటించారు. శ్రీ విద్య తమిళంలో కూడా ఇదే రోల్ చేసింది. ఆవిడ తప్ప మరొకరిని ఈ పాత్రకు ఊహించుకోలేం అందుకే తెలుగులో కూడా మిగతా నటులు మారినా అవిడను దర్శకులు అదే పాత్రకు తీసుకున్నారు. నటులు ఎంత బాలెన్స్‌డ్‌ గా నటించారంటే ఈ సినిమాలో పాత్రలు విక్టిమ్స్‌గా కనిపిస్తారు తప్ప వారిపై కోపం రాదు. ఈ సినిమా ముగింపు ఇలా కాకుండా మరోలా ఉండలేదని సినిమా చూసాక ఒప్పుకుంటాం. మోసం చేసిన ప్రియుని భార్యగా వితంతువుగా మిగిలిన జీవితాన్ని గడపాలనుకునే ఆ కాలపు సెంటిమెంట్ తప్ప సినిమాలో మరెక్కడా మనకు డిబేట్‌కు అవకాశం రాకుండా పటిష్టంగా నిర్మించిన కథ ఇది. నగేష్, మోహన్ బాబు అతిథి పాత్రలలో కనిపిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here