సార్వజనిక సత్యాల కవిత్వం – తురాయి పూలు

1
5

[dropcap]శ్రీ[/dropcap]మతి వాసరచెట్ల జయంతి గారి తాజా కవితా సంపుటి ‘తురాయి పూలు‘. ఇందులో 51 కవితలున్నాయి. వీటిలో చాలావరకు ప్రముఖ ప్రిట్, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితమైనవే.

***

“ఈ సంపుటిలోనూ కుటుంబం చుట్టూ, అమ్మా నాన్న చుట్టూ, ఊరి చుట్టూ ఆత్మీయుల చుట్టూ తిరిగినప్పటికీ, ఆమె చూపు ఇక్కడ స్పష్టతను సంతరించుకుంటుంది. మానవ సంబంధాలలోని కృత్రిమత్వాన్ని ఇట్టే గుర్తు పట్టగలిగే శక్తి సంపాదించింది. ఎంతో బలంగా కప్పబడ్డ సంప్రదాయపు దుప్పటి నుండి కూడా ఆమె కొత్త ఆలోచనలను ఇట్టే పసిగట్టగలుతుంది. మార్పు అనివార్యతను, మానవ ప్రవర్తనల్లోని డొల్లతనాన్ని చాలా సంయమనంతో ఎండగట్టడం మొదలుపెట్టింది.

~

‘తురాయి పూలు’లో కవయిత్రి బాల్యం, వ్యక్తిగత జీవితంలోని మానవ సంబంధాలే ప్రధాన కవితావస్తువు. కవయిత్రి కుటుంబం వృత్తి మూలాల్లోకి వెళ్ళడం కూడా నోస్టాల్జియాలో భాగంగానే రాయడమొక విశేషం.” అని వ్యాఖ్యానించారు ప్రముఖ కవి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి తమ ముందుమాట ‘తురాయిపూల సజాయింపు’లో.

***

“వాసరచెట్ల కవిత్వంలో అడుగుపెడితే నాన్న, అమ్మ, ఊరు, బాల్యం లాంటి కవిత్వపు ముడిసరుకులు మనల్ని నిండుకుంటాయి. ఈ స్పర్శతో హృదయం మరింత తెరుచుకుంటుంది. ఆమె అక్షరాలు మనల్ని తమతో మమేకం చేసుకుంటాయి. ఒక సృజనకు కావలసిన మౌలిక ధాతువులన్నీ ఆమె తనలోకి వంపుకున్న వైనం అర్థమవుతుంది.

~

తెలుగు సాహిత్యంలో నాన్న స్పృహ అమ్మతో పోలిస్తే తక్కువగా వుందనే వాళ్ళున్నారు. కాని జయంతి లాంటి కవయిత్రులు నాన్న అనుభూతిని కూడా బలంగా ప్రోది చేస్తూ కవిత్వాన్ని సుసంపన్నం చేస్తున్నారు. నాన్నతో పాటు అమ్మ కవితలు కూడా ఈ సంపుటిలో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి.” అని పేరొన్నారు శ్రీ కాంచనపల్లి గో.రా. తమ ముందుమాట ‘రేపటి భరోసా – వాసరచెట్ల కవిత్వం’లో.

***

సైనికుడికి దేశరక్షణ ఎంత ముఖ్యమో, సైనికుడి భార్యకి ఇంటి రక్షణ బాధ్యత ఉంటుందని ‘ప్రేమ పతాకం’ కవిత చెబుతుంది.

కాలచక్రానికి, గానుగ చక్రాన్ని పోలుస్తూ తేలీవాలాల ప్రాముఖ్యం తెలిపే కవిత ‘కొత్తగానుగ’.

తనకేమైనా తనని కనిపెడుతూ తన ఆత్మీయులన్నారన్నదే తన ధ్యాసంతా అంటారు కవయిత్రి ‘గమ్యం’ కవితలో..

“హృదయానికి…/గాయపు తడి తగిలినప్పుడల్లా/అక్షరాలను అందంగా అలంకరించడం/నాకేమీ కొత్తకాదు” అంటారు ‘గాయపు తడి’ కవితలో. ఏయే సందర్భాలలో అక్షరాలు పెల్లుబుకుతాయో ఈ కవితలో చెప్తారు.

“ఏపుగా ఎదిగిన పంటను చూసి/దేశదేహానికి ముడిసరుకవుతున్నందుకు/పత్తిపువ్వులెక్క పరమానందం చెందుతుంటరు” అంటారు రైతుల గురించి ‘తురాయిపూలు’ కవితలో.

“తేజోమూర్తిగా కనబడే/అతని చేతిలోని సుద్దముక్క/నిరంతరం కొన్ని అక్షరాలను సృష్టించి/జ్ఞాన జ్యోతులు వెలిగిస్తూనే ఉంటుంది!” అని ‘కొన్ని అక్షరాలు’ కవితలో గురువు గొప్పదనం చెబుతారు.

శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళిగా ‘సాహితీ శిఖరాగ్రం’ అనే కవితని వెలువరించారు కవయిత్రి.

“ఎదురుచూపులే/జీవితం అయినప్పుడు/పలికే ప్రతీ మాట/మౌనగీతం పాడుతుంది!” అని అద్భుతంగా వ్యక్తీకరిస్తారు ‘మౌనగీతం’ కవితలో.

“నగరం నిద్రపోతున్న వేళ/నగర వీధులన్నీ/కొన్ని జీవితాలను శాసించి/గమ్యం మరోవైపు తిప్పుతుంటాయి” అంటూ ‘నగరం నిద్రపోతున్న వేళ’ కవితలో ఆవేదన వ్యక్తం చేస్తారు.

బతుకమ్మ పండగను కళ్ళకి కట్టిన కవిత ‘పూలజాతర’. బాల్యం లోని మాధుర్యాన్ని చాటిన కవిత ‘స్మృతివనంలో బాల్యం ఓ మధుర ఘట్టం’. గూడు కట్టడంలో గిజిగాడి నైపుణ్యం ఆధునిక ఇంజనీర్లకు తీసిపోదని అంటుంది ‘వింగ్స్ ఇన్‌స్ట్రక్టర్’ కవిత.

“పక్షిరెక్కలు ఆడించినట్లు/కిటికీ చేతులు ఊపుతుంది” అంటారు ‘కిటికీ’ కవితలో. ఎంత అద్భుతమైన భావనో!

నాన్న నా ధైర్యం, మాయమైన పల్లెతనం, మా నాన్న ఆణిముత్యం వంటి కవితలలో తండ్రి ప్రేమ, వాత్యల్స్యం గొప్పగా వ్యక్తమవుతాయి.

ఇంకా చక్కన్ని అర్థవంతమైన, భావయుక్తమైన కవితలున్న ‘తురాయి పూలు’ సంపుటి హాయిగా చదివిస్తుంది.

***

తురాయి పూలు (కవిత్వం)
రచన: వాసరచెట్ల జయంతి
ప్రచురణ: చందన పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 120
ధర: ₹ 150/-
ప్రతులకు:
వి. మనోహర్
99855 25355, 9985608077
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here