తిమిరనాశని

0
11

[box type=’note’ fontsize=’16’]2019 దీపావళికి సంచిక ప్రచురించదలచిన ‘కులం కథలు’ సంకలనంలో ప్రచురణకై అందిన కథ ఇది. ‘కులం కథ’ పుస్తకంలో ఎంపిక కాలేదు, సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతోంది.[/box]

[dropcap]వెం[/dropcap][dropcap][/dropcap]కటేశ్వర్లు ఎలియాస్ వెంకడుకి ఐదు సంవత్సరాలు. వెంకడు దాసు కొడుకు. దాసు చెప్పులు కుడుతు వచ్చిన సంపాదనంతా భార్య లచ్చికి ఇస్తాడు. దాసుకి దుర్యవసనాలు ఏమిలేవు. లచ్చి కూడా కొంత సంపాదించి, భర్త ఇచ్చిన డబ్బులతో కలిపి, ముగ్గురు పిల్లలతో సంసారం గుట్టుగా నడిపుతుంటుంది. అందరిలో పెద్దవాడు వెంకడు. చాలా తెలివిగలవాడు. వయసుకు మించిన ఆలోచనలు. వాళ్ళు వుండే చోటును దళితవాడని ఎందుకంటారో, ఊరికి దూరంగా వారికి అర్థం కాలేదు. తన వాడ మురుగు కాలవలతో, దోమలతో, సరైన రోడ్లు లేక మురికి కూపంగా ఎందుకుందో, ఎవరూ ఎందుకు పట్టించుకోరో వాడి చిన్న బుర్రకు సమాధానం దొరకలేదు. మిగతా ఊరంతా మంచివీధులతో, పెంకుటిళ్లు, దాబాలు, మేడలతో వుంటే తనుండే చోటులో అన్ని పూరిగుడిసెలు ఎందుకున్నాయో తెలియడం లేదు. ప్రతి కుటుంబంలో ఒకరో, ఇద్దరో ఎప్పుడూ రోగాలతో ఎందుకు  బాధపడుతుంటారో, వైద్యులు ఆ వాడకు వచ్చి ఎందుకు చికిత్స చేయరో అంతు పట్టడం లేదు. తండ్రిని అడిగినా, “అదంతేలేరా, నీకు తెలియదు” అంటూ సమాధానం దాట వేశేవాడేగాని తనకు సంతృప్తికరమైన సమాధానం చెప్పేవాడు కాదు. చెప్పులు కుట్టడానికి కావలిసిన సరంజామా కోసం అప్పుడప్పుడు తండ్రితో పట్నం వెళ్ళినప్పుడు, అక్కడి మేడలు, రోడ్లు, కార్లు చూసి ఆశ్చర్యపోయేవాడు. తమ వాడ గూడ అట్లాగే వుంటే బావుండుననుకునే వాడు.

ఆ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల వుంది. ఆ పాఠశాలకు ముకుందరావుగారని ఒక ఉపాధ్యాయుండేవాడు. ఆయనకి ఆదర్శభావాలు ఎక్కువ. చదువుతోనే పురోగతి సాధ్యమని నమ్మేవాడు. కుల, మత, ధనిక, పేద తేడాలు లేకుండా అందరూ చదువుకోవాలనే జిజ్ఞాస కలవాడు. ఎటూ అగ్రకులాల పిల్లలు చదువుకుంటారు, కాని చదువుకు దూరంగా వుండేది దళితవాడులోని పిల్లలే, వారిలో కూడ అద్భుత ప్రతిభ కలవారుంటారు. ఎటోచ్చి, ఆ ప్రతిభను గుర్తించి సానబెట్టాలి. ఆ ప్రతిభను గుర్తించాలంటే, వాళ్ళు కూడ పాఠశాలకొచ్చి చదువుకుంటేనే కాని తెలియదు.

ఆ గ్రామంలో చదువుకునే వయస్సు వచ్చి, బడిలో చేరని వాళ్ళందరి ఇళ్లకెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి చదువుకొనటం వల్ల ఉపయోగాలు చెప్పి బడిలో చేర్పించేవాడు. ఆ క్రమంలోనే దళిత వాడకి వచ్చి దాసు ఇంట్లో చదువుకునే వయస్సున్న వెంకటేశున్నాడని తెలిసి ముకుందరావు గారు దాసు ఇంటికి వెళ్ళాడు. ముకుందరావుగారిని చూడగానే దాసు ఏదో పని చేస్తున్నవాడు గాభరాగా లేచి నిలబడి –

“ఏంటయ్యగారు మీరు మాఇంటికొచ్చారు? కబురంపితే నేనే రానా అయ్యగారూ?”

 “ఇది కబురు పంపించే పని కాదురా”

“అదేమిటయ్యగారు అలా అంటారు. ఏ పనయితేనేమండి అయ్యగారూ, ఈ మురికి కాలువలు దాటుకుంటూ, ఇరుకు పూరిగుడిసెలోకి మీరు రావటం నా మనసుకు చాలా కష్టంగా ఉందయ్య గారూ”

“సరేలే, అసలు విషయానికొస్తాను”

“ఏంటయ్యగారు అది?”

“అదేరా, నీ కొడుకు వెంకడు లేడూ వాడు…..”

“ఏంటయ్యగారు, వాడేమన్నా తప్పుడు పనిచేశాడా? ఇంటికి రానియ్యండి. వాడి మక్కెలిరగ దొబ్బుతాను” అని నాలుక్కరుచుకుంటాడు.

“నేను చెప్పేది సరిగా వినిపించుకోకుండా వాడి మీదకు ఒంటి కాలిమీద లేస్తావేమిటి, వాడేమీ తప్పుడు పని చెయ్యలేదుకాని, నేను చెప్పేది సావధానంగా విను”

“చెప్పండయ్యగారు”

“ఇప్పుడు వెంకడుకి ఎన్నేళ్ళు?”

“మొన్ననే ఐదు నిండినయ్యండి అయ్యగారు”

“మరైతే వాడిని బడికి పంపించవేమిటి?”

“మాకుందుకండీ ఈ సదువులు, వాడేమన్నా ఉద్యోగాలు సెయ్యాలా, ఊళ్ళేలాలా? నాతోపాటు ఆడికి కూడా చెప్పులు కుట్టే పని నేర్పితే, నాకు సాయంగా వుంటాడు. నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉంటాడు”

“అదేమిటిరా అలా అంటావు? చదువుకుంటే సంస్కారమొస్తుంది. మంచి చెడు తెలుస్తుంది. పెద్దపెద్ద ఉద్యోగాలు చెయ్యొచ్చు. మీరందరు ఇంతకన్నా బాగా బతకొచ్చు”

“అయినా మాకెవరిస్తారండి ఉద్యోగాలు. ఈడెప్పుడు సదువు పూర్తి సేస్తాడూ, ఎప్పుడు సంపాదిస్తాడు, నాకెప్పుడు సాయంగా వుంటాడు? సదువుకుని ఉద్యోగం రాకపోతే, మా కులవృత్తి సెయ్యడానికి నామోషి, అటు వుద్యోగం లేకుండా, ఇటు కులవృత్తి చెయ్యకుండా, రెంటికి చెడ్డ రేవడవుతాడు బాబూ, మాకెందుకీ కూడు పెట్టని సదువులు, వాడిని ఒగ్గేయండి బాబూ”

“చూడూ, ప్రభుత్వం తప్పని సరిగా ఐదేళ్ళు నిండిన వాళ్ళంతా బడిలో చేరాలని చట్టం చేసింది. చదువుకునే వయస్సు వచ్చిన తరువాత బడికి పంపించకపోతే అది నేరం”అన్నాడు ముకుందరావు.

“ప్రభుత్వానిదేముంది బాబూ, ఎన్నో సట్టాలు చేస్తుంది. మా కడుపు నిండే మారగం మేము సూసుకోవాలి కదా? అయినా మేము దళితులం, కడగొట్టుజాతి వాళ్ళం. మా కట్టాలు ప్రభుత్వానికి ఎట్టా ఎక్కుద్ది బాబూ?”

“నేను చెబుతున్నాను కదా, వెంకడ్ని బడిలో చేర్పించు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా, వాడికి మంచి భవిష్యత్తుంది” అన్నాడు.

“మమ్మల్నిలా వదిలేయండి బాబు. మా తిప్పలు మేము పడతాం. ఇంకెవరినన్నా సూసుకోండి బాబు” అన్నాడు దాసు.

“వెంకడి సంగతి మేష్టారు సూసుకుంటానన్నారు కదా. మేష్టారు చెప్పినట్టుగా సేయొచ్చు కదా” అంది అక్కడే వున్న దాసు భార్య లచ్చి.

“నీకేం తెలీదు, నువ్వండసే” అని విసుక్కుంటూ, “మాబాగా సెప్పొచ్చావ్. ఈడు బడికెళ్తే దళితుడని వీడిని వేరుగా, నేలమీద కూర్చోపెడతారు. ఆళ్ళతో బాటు కూర్చోనియ్యరు. ఆళ్ళతో ఆడుకోనివ్వరు. ఆళ్ళతో కలవనివ్వరు. వాళ్ళు తాగే కుండలో నీళ్లు తాగనివ్వరు. ఎందుకొచ్చిన బాధ మనకు. అక్కడ అవమానాలు పడేకన్నా గమ్మునుండటం మేలు. మన కులవృత్తి సేసుకుంటూ ఆడి బతుకేదో ఆడు బతుకుతాడు”

“అవ్వన్నీ నీకు ఎందుకు దాసూ? నేను చూసుకుంటాను కదా. వాడిని బడికి పంపించు. ఒక్కొక్కసారి మన లక్ష్యాలు సాధించుకోవటానికి ఇవ్వన్నీ పట్టించుకోకూడదు. ధైర్యంగా ఎదురొడ్డి నిలవాలి. ముందుకు సాగిపోవాలి”

“మీరెన్నన్నా సెప్పండి. ఆడిని బడికంపను బాబూ”

“ఈ విధంగా భయపడినట్లయితే, జాషువా మహాకవయ్యేవాడా? మీ జాతి బాగు కోసం సమాజంతో పోరాడేవాడా?”

“ఎవరు సారూ? ఆ జాషువా కవి గురించి ఇవరంగా చెప్పండి” అన్నాడు దాసు.

“నీకు ఆ మహాకవి గురించి అంతా వివరంగా చెపుతాను. జాషువా, ఆయన పూర్తి పేరు గుఱ్ఱం జాషువా, వీరయ్య, లింగమాంబలకు సెప్టెంబరు, 28న 1895వ సంవత్సరంలో గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. ఆ రోజుల్లో దళితులకు చాల ఆంక్షలుండేవి. అగ్రకులాల గుప్పిటలో సమాజం వుండేది. దళితులు చదువుకుంటే మాట వినరని, భూస్వాములు వారిని బడికి పోనియ్యకుండా వెట్టిచాకిరి చేయిస్తుండేవాళ్ళు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో జాషువా చదువుకుని ప్రాథమికోపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించి, ఉభయ భాషా ప్రవీణుడై, తెలుగు పండితుడిగా జీవితం ప్రారంభించాడు. సమాజంలో దళితుల దుస్థితి చూసి, అసమానతలపై ఏవగింపు కలిగి, వర్ణాశ్రమాలు సమాజంలో పైచేయి కలిగి వున్న అగ్రకులాల సమాజంలో హక్కుల సాధనకై ఉద్యమించాలని, దళితులలో ఆత్మగౌరవం పెంపొందించాలని ఈ బృహత్కార్యానికి, అక్షరమే సరైన ఆయుధమని తలచి, దురాచారాలని ఖండిస్తూ, దళితులలో చైతన్యం కలిగించే దిశగా అనేక పద్య, గద్య కవితా సంపుటాలని రచించాడు. గాంధీగారంటే అమితమైన గౌరవం. ఆయన ఆశయాలైన దళితులకు దేవాలయ ప్రవేశం, హరిజనోద్ధరణ, చరకా ఝంకారం, సర్వమత సమానత్వం ఆకర్షించాయి. దళితులకు సమానవకాశాలు, కులమత ఆర్థిక వివిక్షతలు రాబోయే కాలంలో తొలగిపోగలవని విశ్వసించాడు. కవితాభిమానులు, సాహితీ సంస్థలచే వేయికి పైగా సన్మానాలు పొందాడు. అనేక బిరుదులు పొందాడు. గండపెండేరం ధరించి, కనకాభిషేకాలు పొంది, గజారోహణం చేసి, పగటి దివిటీల పల్లకీలో ఊరేగాడు. గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతోను, రాష్ట్రపతి పద్మభూషణ్ బిరుదుతోను జాషువాను సత్కరించారు. విశ్వనరుడిగా ఎదిగిన జాషువా నవయుగ కవిచక్రవర్తి బిరుదాంకితుడైనాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. 1971, జులై 14వ తేదీన కీర్తిశేషులైనాడు.”

“ఇప్పుడు చెప్పు దాసూ, నీలాగే నిరాశగా వుండి వుంటే, జాషువా ఇంతలా ఎదిగేవాడా, దళితుల జీవితాల్లో వెలుగు నింపేవాడా?”

“మీరింతలా చెబుతుంటే, నేను కాదనను మాష్టారూ, ఇక వెంకడిని మీ సేతుల్లో పెడుతున్నాను మాష్టారు. వాడి బాధ్యతంతా మీదే” అన్నాడు దాసు.

“సరే అయితే, వెంకడిని రేపట్నించి బడికి పంపించు. వాడి చదువుకు కావలసినవన్ని నేను సమకూరుస్తాను. అంతేకాదు, తరగతిలో కూడా దళిత పిల్లల్ని అగ్రకులాల పిల్లలు ఏమీ అనకుండా చూస్తాను. జాషువా కవి ఫొటో ఒకటి పంపిస్తాను, గోడకి తగిలించి, ‘మీ అంతటివాడిని కావాలి. నాకు మీరే ఆదర్శం’ అనుకుంటూ రోజూ దణ్ణం పెట్టుకొని బడికి రమ్మని చెప్పు వెంకడికి” అన్నాడు ముకుందరావు.

“అలాగే అయ్యగారు” అంటూ, వీధిచివర వరకు వచ్చి ముకుందరావుగారు కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలుచున్నాడు దాసు.

***

వెంకడు బడికి వెళ్ళాడు, ముకుందరావుగారు వెంకడిని పిలిచి, “ఒరేయ్ నీ పేరు ఇవాల్టి నుంచి వెంకటేశ్వరరావు. అదే పేరుని హాజరు పట్టీలో రాస్తున్నాను” అన్నాడు.

“కాని మీరు మాత్రం నన్ను వెంకడనే పిలవండి, నాకు అదే బావుంటుందన్నాడు” వెంకటేశ్వరరావు ఉరఫ్ వెంకడు.

వెంకడు చాలా తెలివి గలవాడు. చెప్పిన పాఠం వెంటనే అర్థం చేసుకునేవాడు. క్రమక్రమంగా పదోతరగతి, తరువాత ఇంటర్, డిగ్రీ కూడా పూర్తిచేశాడు. చదువుకునే రోజుల్లోనే, వెంకడికి తమకులం వారికి (దళితులకు) సమాజంలో జరిగే అన్యాయం అర్థమవసాగింది. ఇంకా అంటరానితనం, రెండుగ్లాసుల పద్ధతి, ఊరికి దూరంగా తమ వాడలు, పూరిళ్ళతో, మురుగు కాల్వలతో దుర్గంధ భూయిష్టంగా, దోమలతో, రోగాలతో బాధలు పడటం వెంకడి మనసును కలచి వేశాయి. తమ జాతివారికి గూడ సమాజంలో సముచిత స్థానం కల్పించి, అందరిలాగే సుఖమయమైన జీవితం గడిపేలా చేయాలని నిశ్చయించుకున్నాడు. దీనికి చదువొక్కటే మార్గం, అందుకోసం ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, కష్టపడి చదవాలని నిశ్చయించుకున్నాడు.

డిగ్రీ పూర్తవగానే, ముకుందరావు గారిని కలిసి, తన డిగ్రీ పూర్తయిందని, రాష్ట్రంలోనే ప్రథముడుగా వచ్చానంటూ, ముకుందరావుగారి కాళ్ళకు దణ్ణం పెట్టాడు, ‘మాష్టారు ఇదంతా మీ ఆశీర్వాద ఫలమే’నంటూ.

“నువ్వు చెప్పక పోయినా నాకు తెలుసులేరా. ఎప్పటికప్పుడు నీ గురించి కనుక్కుంటూనే ఉన్నాను. చాలా సంతోషంగా ఉందిరా. ఇంక చెప్పరా. తరువాత ఏం చేద్దామనుకుంటున్నావ్” అని అడిగారు ముకుందరావుగారు.

అప్పుడు వెంకడు, తమ జాతివారికి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, వారి హీనమైన బ్రతుకులు, ఊరికి దూరంగా తమ జాతివారిని దళితవాడంటూ వెలివేయటం గురించి చెపుతూ “వారికేమైనా చెయ్యాలని ఉందండి. మీరే చెప్పండి మా జాతివారి పురోగతికి ఏమి చెయ్యమంటారో, నేనేం చెయ్యాలో కూడ చెప్పండి” అన్నాడు.

“అయితే, నువ్వు ఐ.ఏ.ఎస్ చదవరా. నువ్వు కలెక్టరవుతే, నీకున్న అధికారంతో మీ జాతికి నువ్వనుకున్నవన్నీ చేయొచ్చు” అన్నారు ముకుందరావు మాస్టారు.

“కాని ఐ.ఏ.ఎస్ అంటే మాటలా మేష్టారు, నాకు సాధ్యం కాదేమో మాష్టారు. అయినా చాలా ఖర్చవుతుంది కదా. అంత ఖర్చు మానాన్న భరాయించే స్థితిలో లేడండి. ఏదన్నా ఉద్యోగం చూసుకోమంటున్నాడు. లేకపోతే, కులవృత్తి చెయ్యమంటున్నాడండి” అన్నాడు వెంకడు. “ఇన్నాళ్ళు ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనం వల్ల ఫీజులకు, బట్టలకు, భోజనానికి ఇబ్బంది లేకుండా డిగ్రీ పూర్తిచేయగలిగాను.”

“ఒరే వెంకడూ, నువ్వేమీ దిగులు పడవద్దు. అవ్వన్నీ నేను చూసుకుంటానుకదా. కోచింగుకు అయ్యే ఖర్చంటావా, అదీ నేనే చూసుకుంటాను. నా శిష్యుడొకడు పోటీ పరీక్షలన్నింటికి ఐ.ఏ.ఎస్. బ్యాంకిగ్ పరీక్షలకు, ఇంకా చాలావాటికి ఒక కోచింగ్ సెంటరు నడుపుతున్నాడు. అందులో నిన్ను చేర్పిస్తాను. నా మాటంటే వాడికి చాలా గౌరవం. ఫీజు లేకుండానే నిన్ను ఐ.ఏ.ఎస్ పరీక్షలకు తయారు చేస్తాడు. ఇంక సంపాదనంటావా, ఇన్నాళ్లు ఓపిక పట్టాడుగదా మీ నాన్న. ఇంకొన్ని రోజులాగాడంటే, తప్పకుండా నువ్వు కలెక్టరవుతావు. నువ్వు అనుకున్నట్లుగానే, దళితులకు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేటట్లుగా చేయగలవు. మీనాన్నతో నేను మాట్లాడతానులే. నువ్వేమీ బెంగపడకు” అన్నాడు ముకుందరావు.

***

ఇప్పుడు, వెంకటేశ్వరరావు, ఉరఫ్ వెంకడు కలెక్టరుగా తన ఊరికే వచ్చాడు. ముందుగా ముకుందరావుగారి మాష్టారింటికెళ్ళి పాదనమస్కారం చేశాడు. అయన కళ్లల్లో ఆనంద బాష్పాలు చిప్పిల్లాయి. ఆనందంతో వెంకడిని (ఆయన దృష్టిలో వెంకడే మరి) కౌగలించుకున్నాడు.

“మాష్టారూ?” అని ఆశ్చర్యంతో పెద్దగా అరిచాడు.

“ఏమిట్రా అలా అరిచావు, ఏం కొంప మునిగి పోయింది?”

“మాష్టారూ మీరు నన్ను కౌగలించుకోవడమా! నేను దళితుడిని మాష్టారూ! మీరు నన్ను తాకగూడదు” అన్నాడు వెంకడు.

“ఒరేయ్! నిన్నెప్పుడన్నా ఆ దృష్టితో చూశానా? ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావ్”

“లేదండి, మీ పిల్లలతో సమానంగా చూశారు. నేనే, సంతోషంతో తబ్బిబ్బయి ఏమనాలో తెలియక అట్టా అరిచాను క్షమించండి.”

“సరే, అసలు విషయానికొద్దాము. ఇప్పుడు నువ్వు కలెక్టరువు. అంటే నీ మీద చాలా బాధ్యత లున్నాయి. మీవాళ్ళ సంగతే కాకుండా నిష్పక్షపాతంగా ఈ జిల్లాలోని ప్రజలందరి బాగోగులన్ని చూడాలి. మంచి కలెక్టరుగా పేరు తెచ్చు కోవాలి. నువ్వెళ్ళి మీనాన్న, అమ్మల దగ్గరికెళ్ళి వాళ్లకు కూడా పాద నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీర్వాదాలు కూడ తీసుకో. ఎళ్ళుండి ప్రొద్దున పది గంటలకు మంచి రోజు. ఆ సమయంలో కలెక్టరుగ బాధ్యతలు స్వీకరించు.”

“సరేనండి మాష్టారూ.”

***

వెంకడు, (వెంకటేశ్వరరావు) కలెక్టరుగా బాధ్యతలు చేపట్టగానే, తన (దళిత) వాడలో, సిమెంటు రోడు వేయించాడు. మురుగు నిలవుండకుండా సైడు కాల్వలు సిమెంటుతో కట్టించాడు. ఆ కాల్వలోని నీరంతా ఊరిబయట పెద్ద కాలవలోకి వెళ్ళిపోయేటట్లుగా ఏర్పాటు చేయించాడు. అందరికి వారి పూరిళ్ళ స్థానంలో, పక్కా ఇళ్ళు కట్టించాడు. అదివరకు, మలవిసర్జన కొరకు ఊరిబయటకు వెళ్ళాల్సి వచ్చేది. ముఖ్యంగా ఆడవారికి చాలా ఇబ్బందిగా వుండేది. చీకటి పడేదాక ఆగి వెళ్ళాల్సివచ్చేది. ఆ చీకట్లో పురుగు, పుట్రా ఉన్నాగూడ తెలిసేది కాదు. ఒకరిద్దరయితే పాముకాటుతో చనిపోయారు కూడ. ఈ ఇబ్బందులన్ని తెలిసినవాడవటం చేత, మరుగు దొడ్లు కట్టించాడు. వీధి దీపాలు వేయించాడు. రక్షిత మంచినీరు వసతి కల్పించి, ప్రతి యింటికి కుళాయి ఏర్పాటు చేయించాడు. అంతకు ముందయితే, వూరికి దూరాన దళితులకు కేటాయించిన భావిలోంచి నీరు కష్టపడి మోసుక రావాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి యింటికి కుళాయి వేయంచి ఆ కష్టాలనుండి వారికి విముక్తి కలిగించాడు. ప్రభుత్వాసుపత్రి ఆ వూరిలో పెట్టించి ఉచిత వైద్య సౌకర్యాలు కలిపించాడు. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, నిరుపయోగంగా వున్న బంజరు భూమిని దళితులకు ఇప్పించాడు. ప్రభుత్వం కల్పించిన ఋణ సదుపాయంతో వాటిని వ్యయసాయయోగ్యంగా మార్చుకుని పంటలు పండించుకుంటూ ఒకరి క్రింద బానిస బ్రతుకులు బతకకుండా గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు.

ఇంతకు ముందు ఆ వూరిలో పదవ తరగతి వరకు మాత్రమే చదువుకునే వీలుండేది. ప్రభుత్వంతో మాట్లాడి అన్ని కోర్సులుండే కళాశాల ఒకటి ఏర్పాటు చేయించాడు. ఇప్పుడు ఆ గ్రామంలో వున్న విద్యార్థులు డిగ్రీవరకు ఆ వూళ్ళోనే చదువుకునే వీలు కలిగింది. అంతే కాకుండా, ఆ వూళ్ళో చదువుకునే వయస్సున్న పిల్లలందరు బడికి పంపించేటట్లుగా తల్లిదండ్రులను ఒప్పించాడు. అంతేకాక బడికి, కళాశాలకు కావలిసిన సదుపాయాలు కల్పించాడు.

అంతేకాకుండా జిల్లా అంతటా పర్యటించి దళితవాడలను సందర్శించి సౌకర్యాలు మెరుగుపరిచాడు. చదువుకునే వయస్సు వచ్చిన వారందరికి చదువుకునే వీలు కల్పించాడు. మధ్యాహ్న భోజన పధకానికి నిధుల కొరత లేకుండా చూశాడు. సంవత్సరానికి రెండు జతల బట్టలు (యూనిఫారమ్) పంపిణీ చేయించాడు. అంటరానితనాన్ని రూపుమాపటానికి ఎంతో కృషి చేశాడు. ఇప్పుడు వెంకడు, కాదు, కాదు వెంకటేశ్వరరావు దళితజన బాంధవుడయ్యాడు.

కలెక్టరుగారి ఆఫీసులో, గాంధి, నెహ్రూ, అంబేద్కరు ఫొటోలతో బాటు, మహాకవి జాషువా ఫొటోగూడ గోడకుంది.

ఇంట్లో గూడ జాషువా ఫొటో ఒకటి పెట్టుకుని, ‘మీరే నాకాదర్శం, మీ ఆశయాలే నావూపిరి. నేను కలెక్టరయ్యానంటే మీ అంతటి గొప్పవాడినవ్వాలనే సంకల్పం, మాష్టరుగారి కృషి అన్నీ కలిసి నన్నింతటివాడ్ని చేశా’యంటూ రోజూ దణ్ణం పెట్టుకుని కార్యాలయానికి బయలుదేరుతుంటాడు. అధికారం వుంటే ప్రజలకు మెరుగైన సేవ చెయ్యొచ్చనే మాష్టరుగారి మాటలు అక్షర సత్యాలనుకున్నాడు.

ముకుందరావుగారు తన కూతురును వెంకటేశ్వర్లుకిచ్చి వివాహం చేశారు

జైహింద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here