యువభారతి వారి ‘తిమ్మన కవితా వైభవం’ – పరిచయం

0
8

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

తిమ్మన కవితా వైభవం

[dropcap]న[/dropcap]న్నయ భారతరచనతో ప్రారంభమైన తెలుగు కవితాస్రవంతి పదహారవ శతాబ్దారంభంలో విశాలమైన మహానదిగా ప్రవహించసాగింది. కవులు – పురాణేతిహాసాలలోని కథలను యథాతథంగా తెలుగుచేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రసిద్ధమైన ఒకే ఒక్క కధను తీసుకుని, శృంగార వీర రసప్రధానంగా, అష్టాదశ వర్ణనా సముపేతంగా మలచి, ‘ప్రబంధ’ మనే నూతన కావ్యప్రక్రియను అవతరింప జేశారు. ఈ అవతరణలో, ప్రజల దైనందిన జీవితంలోని కష్టసుఖాలనూ, సమకాలీన జీవిత  వృత్తాంతాలనూ, వాచ్యంగానో, వ్యంగ్యంగానో ఉట్టంకించడానికి కవులకు అవకాశం లభించింది. సమాజంలో సౌందర్య, సౌశీల్య, ఆర్ద్రత, అభిమానాలు మూర్తీభవించిన వ్యక్తులెందరో కవులకు తారసిల్లారు. ఈ తారసిల్లిన నవ్య రూప స్వభావాలను, హావభావాలను, భాషా విన్యాసాలను పురాణ పాత్రలకు పులిమి, సజీవమైన పాత్రలుగా చిత్రించగలిగారు ప్రబంధ కవులు.

పెద్దన వరూధినీ ప్రవరులు, తిమ్మన సత్యభామా నారదులు, తెనాలి వారి నిగమ శర్మ, సూరన్న కుచిముఖి, సుగాత్రీ శాలీనులు, చేమకూర వారి సుభద్రార్జునులు, ఇంకా ఇలాంటివెన్నో పాత్రలు ఇప్పటికీ తెలుగు రసికులకు  ఉత్సాహాన్నీ, ఉత్కంఠనూ, ఆనందాన్నీ కల్గిస్తూనే ఉన్నాయి. సామాజంలో ఎక్కడో, ఏ మూలనో, ఈ పాత్రలు పొడకట్టుతూనే ఉంటాయి.

ఈ కోవకు చెందిన ప్రబంధమే,  సంస్కృతంలో  ‘హరివంశము’ లో  68 – 76 అధ్యాయములలోని కథను ఆధారంగా చేసుకుని,  నంది తిమ్మన రచించిన ‘పారిజాతాపహరణం’.

తిమ్మన 1522 ప్రాంతాల వరకు శ్రీకృష్ణ దేవరాయల వారికి ఆస్థాన కవి, విద్యాధికారిగా ఉన్నాడు.  ఈ ప్రబంధంలో తిమ్మన పాత్రల ప్రవర్తనలో ఎంతో ఔచిత్యాన్ని పాటించాడు. కావ్యంలో కవి తానై పాత్రల గుణగణాలను వర్ణించడం చాలా తక్కువ. కేవలం క్లుప్తంగా పాత్రల పరిచయం చేస్తాడు. తర్వాత ఆయా పాత్రల ప్రవర్తనల వల్లనే వారి వారి గుణగణములు వ్యక్తం ఔతాయి.  తిమ్మన అవలంభించిన నాటకోచిత వైఖరిలో ఇది ఒక ముఖ్యాంశం. దీని వలన పాత్రలు విస్పష్ట రేఖలతో మన కన్నుల ఎదుట ప్రత్యక్షమౌతాయి.

తిమ్మన రచించిన ‘పారిజాతాపహరణం’ నిజంగానే పారిజాతం లాగానే ఎప్పటికీ వాడిపోక సువాసనలను గుబాళిస్తూనే ఉన్నది. తిమ్మన సత్యభామ స్వాభిమాన సీమ.  ఈ ప్రబంధంలోని కొన్ని పద్యాలకు డా. బి. వి. కుటుంబరాయ శర్మగారు రసాత్మకంగా చేసిన వ్యాఖ్యానమే ఈ చిన్ని పుస్తకం.  డా. కుటుంబరాయ శర్మ గారు తెలుగులో, సంస్కృతంలో, ఇంగ్లీషులో మంచి అభినివేశం ఉన్న పండితులు. తెలుగు నవల వ్యుత్పత్తి వికాసాలను గురించి వీరు చేసిన పరిశోధనా వ్యాసంగం పండితుల మన్ననలను పొందింది.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/timmana-kavitha-vaibhavam-yb-gln/page/3/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here