తిరిగిరాని వసంతం…

0
7

[dropcap]గు[/dropcap]డిసె ముందు దిగాలుగా నిలబడ్డాడు సాంబయ్య. ఎందుకో గానీ… తాను లేని ఆ గుడిసె చీకటి గుహలా నోరు తెరచుకొని అతడ్ని భయపెట్టసాగింది. నులక మంచం మేసుకొని తలపాగాలో చెక్కిన సగం కాలిన బీడిముక్కను వెలిగించి ఆఖరి దమ్ము లాగి వదిలాడు. సాయమ్మ తాలుకు దట్టమైన జ్ఞాపకాల పొగ అతడ్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది.

తానెన్నో పనులు చేసి ఇల్లు చక్కబెట్టేది. మిరప చేన్లకు, పత్తి చేన్లకు కైకిలి పోయేది. వంచిన నడుం ఎత్తకుండా వరి నాట్లు వేసేది. కలుపు తీసేది. కట్టెలు కొట్టేది. మామిడితోటంతా శుభ్రం చేసి పాదు తవ్వి నీళ్లు మళ్లించేది. కోడి పెట్టలను సాకేది. మొన్న చేన్లకి వెళ్లినపుడు తెచ్చిన మిరప్పండ్లతో కారం నూరి కమ్మటి పచ్చడి చేసింది. లేత మామిడి సక్కును ఉప్పు వేసి ఊరవేసింది. తానుంటే… దండెంపై ఉతికి ఆరేసిన బట్టలు, నీళ్లు నింపిన తోట్టిలు, నవనవలాడే మొక్కలు, కళ్లాపి జల్లిన వాకిలిలో తీర్చిదిద్దిన ముగ్గులతో గుడిసె పచ్చటి కళతో వెలిగిపోయేది.

తనకి ఏం కావాలన్నా అన్నీ క్షణాల్లో అమర్చి పెట్టేది. మొన్న ఎపుడో ఉలిశెల పులుసు తినాలని ఉందన్న గొంతెమ్మ కోర్కె కోరినపుడు, చీర కొంగులో మడత పెట్టుకున్న డబ్బులతో ఉలిశెలు కొనలేకున్నా ఎండిన రొయ్యలు, ఎర్రగడ్డలతో కమ్మటి పులుసు చేసి తన నోటికి విందు, శరీరానికి పసందును అందజేసింది. బహుశా ఆ డబ్బు (తనకి తెలియదుకాని) ఏ కోమటోల్ల దుకాణంలోనో పప్పుల, ఉప్పుల బాకీకై దాచి ఉంచిందై కావచ్చు. అయినా తన నేనాడు పల్లెత్తు మాటనేది కాదు. పెండ్లీడు వచ్చిన బిడ్డకు పెళ్ళి చేసేదాకా అన్నట్టు ఇల్లు పట్టుకొని ఉందా? పెళ్ళి కాగానే తన బాధ్యత తీరిపోయిందని వెళ్లిపోయిందా? ఎక్కడికి వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి తనింట్లో సంధ్యా దీపమై వెలిగిపోయేది. తాను – ఏనాడైనా తను తిన్నదా? లేదా? అని పట్టించుకునేవాడు కాదు. తనకు మాత్రం ఏది ఉంటే అది ఊర్చి కడుపు నింపేది. ఏ రోగమో, నొప్పో వచ్చినా కషాయాలు, పసరలు మందులతో తగ్గించుకొనేది. కరెంటు బిల్లు కట్టమని తానిచ్చిన డబ్బులని బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి, సారా పొట్లంతో ఇంటికి వచ్చినప్పుడు… తాను ఏవేవో లోపల ఇంకిన అసంతృప్తులతో చూసిన చూపును అర్థం చేసుకోలేకపోయాడు. బహుశా సాయమ్మ తనని చూడటం అదే చివరిదా? అలజడికి లోనైన ఆలోచనలతో సరిగా జ్ఞప్తికి తెచ్చుకోలేకపోయాడు.

***

తెల్లారగట్ల… గుడిసెపైకి ఎక్కన సందడి చేస్తున్న కోళ్ల చప్పుడికి మెలకువ వచ్చింది సాంబయ్యకి. తడిక తొలగించుకొని బయటకు వచ్చాడు. రాత్రి… గుల్ల కింద కమ్మడం మర్చిపోయిన కోడి పెట్టలు ఎక్కడికి వెళ్లాయో ఏమో గానీ… సాయమ్మ టైముకు చల్లే నూకలకి అలవాటు పడి, అవి దొరకకపోగా పెరడంతా కెలుకుతూ… మట్టి తవ్విపోయసాగాయి. తెల్లారగానే… తనకి వేపపుల్ల అందించి ఉడుకు నీళ్ల కొప్పెర ఇచ్చేది. పుల్ల విరుచుకొని పెరట్లో ఉన్న పొయ్యి వంక చూశాడు. పిల్లి… మెత్తటి బూడిదలో హాయిగా ముడుచుకుంది. చాయ కొరకు నాలుక పీకసాగింది. పాత తువ్వాల దులుపుకొని ముఖం తుడుచుకొని టీ కై డబ్బులున్నాయేమోనని చూసుకొని బయలుదేరాడు. దూరంగా బుడ్డోడి టీ కొట్టు! ఉడుకు చాయ గాజుగ్లాసుల్లో అటూ ఇటూ పోస్తూ కన్పడ్డాడు. సాయమ్మ మీద అలిగి తానెన్నో సార్లు డాబుసరిగా వీడి దగ్గర చాయ బాకీ పెట్టితాగాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. వెళ్తే ఏమంటాడో? లేదా… సాయమ్మ ఇంటి నుండి వెళ్లిపోయిన సంగతి వీళ్లకి తెల్సిపోయిందా? ఎంత నామోషి తనకి. వెళ్లిన తనకేం కాదు కాని… ఊర్లో నలుగురి మధ్య తిరగాల్సిన తనను చూసి జనం నవ్వుకోరూ? సాయమ్మ ఉంటే తనకి ఎంత ధీమా… ఎంత ధైర్యం… తనకేం మొగోడ్నినని తలెత్తుకొని పంచె లేసుకొని, పొన్ను కర్రతో దర్పంగా ఊర్లో కెళ్లి బలాదూర్‌గా అడ్డమైన పెత్తనాలన్నీ చేసుకొని తిరిగి తిరిగి వచ్చేవాడు. తానే టైముకి ఇంటికెళ్లినా తినడానికి ఏదైనా వండి ఉండేది. ఇప్పుడు… ఎవర్నైనా పలకరిద్దామన్నా ధైర్యం చాలటం లేదు సాంబయ్యకు. ‘వాళ్లు’ పెదవి విప్పి ఒక్కమాట అనకపోయినా చూపులతో శల్యపరీక్ష చేస్తారు. ఏది ఏమైనా… తను ఇలా… వెళ్లిపోవటం సాంబయ్యకు మింగుడు పడటం లేదు. అది తన అసమర్థతగా భావించసాగాడు.

***

సాయమ్మ అందగిరితో కలుపుగోలుగా ఉండేది. ఇరుగుపోరుగు కూలీలతో పంట చేలకు వెళ్లేది. వచ్చేటప్పుడు కాయగూరలు, దినుసులు తెచ్చుకొనేది. ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి ఏదో చెయ్యాడినపుడే సర్దుకొని చెయ్యాలని అనేది. ఇటు ఊర్లో తన అడ్డమైన బాకీలు వంతుల వారీగా తీర్చేది. తన వైపు నుండి అన్నీ రాజీలే! మరి… తనలాగే తాగొచ్చి ఇల్లు పట్టించుకోకుండా గోల చేస్తూ పెళ్ళాలను కొట్టి సాధించేవాళ్లు లేరా? అంటే ఉన్నారు. ఇరుగుపొరుగున ఉన్న ఎల్లయ్య, కొమురయ్యల కంటే తానింకా నయమని సాంబయ్య అభిప్రాయం. మరి… వాళ్ల పెళ్ళాలు ఇలా ఇల్లొదలి వెళ్లలేదేం? అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు అతడు. కుటుంబ జీవనంలో ఎలాంటి తర్కాలుండవనీ… కేవలం సర్దుకొని రాజీపడిపోతూ… ఎన్ని అసంతృప్తులున్నా… ఇద్దరొక చోట ఉంటేనే… సమాజం మర్యాదగా చూస్తుందని తెలియకనా? …తను వెళ్లిపోయింది. సాయమ్మ వస్తే… ఎందుకిలా చేశావ్? అని నిలదీసి అడిగి బావురుమనాలని ఉంది అతనికి. టీ కొట్టు సమీపించింది. బుడ్డోడిని అడిగి టీ తీస్కోని తాగసాగాడు. బుడ్డోడు పేరుకు తగ్గట్టుగా ఎత్తు తక్కువ. చిన్న స్టూల్ పై నిలబడి చాయ కాచుతుంటాడు. కొట్లో వాడి భార్య చెక్కర, పాలు అందిస్తూ, ఖాళీ గ్లాసులను కడుగుతుంది. సాంబయ్య కట్టాల్సిన యాభై బాకీని గుర్తు చేశాడు వాడు. అలాగేనంటూ ఇపుడు తాగిన టీకి డబ్బులిస్తూ… లోనకు వెళ్లున్న బూబమ్మను చూశాడు.

బూబమ్మ భర్త దుబాయ్, మస్కట్ల లేబర్ పని చేస్తున్నాడనీ, వస్తాడనీ చెప్తుంది కానీ… ఉన్నాడో? లేదో? తెలియదు. నల్గురూ ఆడపిల్లలే! ఊర్లో తెల్సినవాళ్ల బట్టలు కుట్టి కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. మనిషి ఎంతో ధిలాసాగా కన్పిస్తుంది. భర్తలేని ఆడవాళ్ల పై ఈ సమాజానికి జాలి, సానుభూతి ఉన్నాయేమోగానీ… తనలాంటి వాడిని మాత్రం పుండులాంటి అతడి గతాన్ని క్షణక్షణమూ గర్తుకు తెస్తూ… ఛీత్కరింస్తుందీ లోకం! పెళ్లాం వెళ్లిపోయిన వాడని… నానారకాలుగా ఆడిపోసుకుంటూ వెక్కిరిస్తుంది. గుట్టుగా ఉన్న గుడెసె బతుకు రచ్చకెక్కింది.

బూబమ్మ, బుడ్డోడి పెళ్లాం ఇద్దరూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు లోపల. మధ్య మధ్యలో తనను చూస్తూ నవ్వుకోసాగారు. ఒకప్పుడు సాయమ్మ వీళ్లతో కల్సిపొరుగూరికి బట్టలు కొనడానికి వెళ్లింది. తన బిడ్డ పెళ్లి బట్టలన్నీ ఈ బూబమ్మే కుట్టింది. ఎందుకోగానీ సాంబయ్యకు చిన్నతనమన్పించింది. ఇక అక్కడ ఉండలేనట్టుగా లేచాడతను. ఏదో కూర అడిగి గిన్నెలో వేయించుకొని తన ముందే ధీమాగా వెళ్లిపోతున్న బూబమ్మను విస్మయపోతూ చూశాడు తనకు భర్త లేకున్నాహాయిగా జరుగుబాటు అవుతుంది. భవిష్యత్తు పై ఏ మాత్రం బెంగ లేకుండా పిల్లల్ని చదివిస్తూ, బతుకు ఎలా బతకనిస్తే అలా బతికేయాలి అన్నట్లు నిశ్చింతగా ఉంది. తనలాగా… భయం, దిగులుతో రేపెలా? … అన్న సందేహాస్పద బతుకు చిత్రం కాదుగా తనది. రోజులు గడిచేకొద్దీ అందరి ముందు తలెత్తుకొని తిరగలేని అతి నాజూకు న్యూనతా భావం అతన్ని కుదురుగా ఉండనీయటం లేదు. కలకన్నా జీవితం మరింత చిత్రమైనదిగా అతనికి తోచింది. ఇంట్లో ఎదిగిన పిల్ల ఉంది. ఆ తాగుడు స్నేహాలు మానేయమని, ఎవరైనా సంబంధాల వాళ్లు వస్తే పరువు పోతుందనీ, నలుగుర్లోకి అల్లరి అవుతామని ఎంతో ఇగురం చెప్పే సాయమ్మ… ఈ రోజు ఇలా… తన హదయాన్ని ముక్కలు చేసి వెళ్లిపోతుందని అసలు ఊహించలేకపోయాడు.

***

తానెన్నో సార్లు తాగి… వాగుతూ నులక మంచానికి అడ్డంగా పడిపోయి భళ్ళున వాంతులు చేసుకన్నా… తెల్లారి ఏమీ ఎరుగనట్లుగా… వాకిలంతా శుభ్రం చేసుకొని, లోటా నిండుగా నిమ్మరసం కలిపిన మజ్జిగ నీళ్ళు తాగించేది. పిల్లకు పెళ్లి చేసి పంపేరోజు సాయమ్మ ముఖంలో తృప్తితో కూడిన వెలుగు. పెండ్లికని ఒక్కత్తే రెక్కలు ముక్కలు చేసుకున్నది. కొత్త బట్టలు కుట్టించింది. తనకూ కొత్త పొడుగు చేతుల చొక్కా, కండువా, ధోవతులు కొన్నది. మామిడాకులు, కట్టి, పండివంటలు చేసి, సారె పోసి, గుళ్లోని పంతులుగారితో మాట్లాడి చాకచక్యంగా సమర్థవంతంగా బిడ్డ పెండ్లి చేయించింది. తన పని పూర్తి అయిపోగానే, ఇక ఎవరు ఏం అనుకుంటే తనకేమిటనీ, తాగుడుగాడ్ని భరించాల్సిన అవసరం లేదనుకొని వెళ్లిపోయిందా?

ఈ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులు ఉండవని సాంబయ్యకు మొదటి సారిగా అర్థమయింది. నిజానికి తానెన్నో సార్లు తనను మాటలతో, చేతలతో హింసించి బలవంతుడనని విర్రవీగినా, నిశ్శబ్దంగా భరించింది. మళ్లీ తెల్లారి… ఏమీ పట్టించుకోనట్లుగా తన పనులు తాను చేసుకొని, సద్ది మూటతో చేన్లకు వెళ్లిపోయేది. చీకటి పడగానే తిరిగొచ్చి తొట్టెలలో నీళ్లు నింపి, ముఖం కుడుక్కొని ఎర్రబొట్టు దిద్దుకున్న సందమామలా గుడెసెలె వెన్నెల దీపం వెలిగించేది. కట్టెల పొయ్యి ముట్టించి, నూకల అన్నం వండి తనకై ఎదురు చూసేది. తాను ఏనాడైనా సాయమ్మ మనస్సును అర్థం చేసుకొనే ప్రయత్నం చేసాడా? మనిషికి శరీరమే కాదు… మనసు కూడా ఉంటుంది. అదే ముఖ్యం కూడా. మనిషంటేనే…. మనసు… అని తానెందుకు మర్చిపోయాడు? ఏదైనా కోల్పోయిన తర్వాతే విలువ తెలుస్తుంది అన్నట్లుగా… సాంబయ్యకు ఆలోచించిన కొద్దీ అవేదన పెరుగసాగింది. నైరాశ్యంతో కూడన దుఃఖిత మనస్కుడయ్యాడు. సాయమ్మ లేని ఇంటి బాట పట్టాడు. చావలేక బతికినట్లుగా ఉన్న గుమ్మడి తీగ గుడిసెపై వేల్లాడుతూ కన్పించింది. చీడ పట్టిన కరివేప చెట్టు కింద పురుగులను కోళ్లు కెలుకుతూ తినసాగాయి. గుడిసెను సమీపిస్తుంటే… అతడు పట్టుకున్న పొన్నకర్ర వెయ్యి టన్నుల బరువుగా అనిపించి పక్కకు తోసేసాడు తను. న్యాయం అనేది మనషులను బట్టి, కాలప్రభావాలను బట్టి, సమయాలను బట్టి నిరూపితమైతే… తన చుట్టూ, గుడిసె చుట్టూ అల్లుకున్న బంధాలన్నీ వేటికవే వీగిపోయి…. ఆమె… తిరిగిరాని వసంతమై… అతడి బతుకు నుండి వెళ్లిపోయింది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here