తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలు

0
8

[box type=’note’ fontsize=’16’] మహా పండితులు, బహుభాషావేత్త అయిన డా. తిరుమల రామచంద్ర గారి ఆధ్యాత్మిక రచనలను ప్రస్తావిస్తున్నారు విశ్వర్షి వాసిలి ఈ వ్యాసంలో. గత సంచికలోని “ఆధ్యాత్మికత : తిరుమల రామచంద్ర” వ్యాసానికి ఇది కొనసాగింపు. [/box]

[dropcap]తి[/dropcap]రుమల రామచంద్రగారి ఆధ్యాత్మిక రచనలను పరిశీలిస్తున్నప్పుడు మనం పరిగణించాల్సింది “ప్రాకృత వాఙ్మయంలో రామకథ” అనే వ్యాసాన్ని. 1977 మే మాసంలో వైట్‌ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి కళాశాల ఏర్పాటుచేసిన ‘రామాయణ సుధాలహరి’ సదస్సులో చదివిన పత్రం ఈ వ్యాసం. ఇది కేవలం వ్యాసం మాత్రమే కాదు. నామకః చెప్పిన నాలుగు మాటలు కావు. పదుగురు మెప్పుకోసం రాసింది అసలే కాదు. తిరుమల రామచంద్రగారి గుండె లోతులనుండి ఉప్పొంగిన ఆధ్యాత్మిక వాహిని ఇది. ఒక హైందవ సంప్రదాయ రచన ఇతర సంప్రదాయాల జోక్యంతో ఎలా రూపం మార్చుకుందో అక్షరీకరించిన భావలయ. తాను నిలదొక్కుకున్న సంప్రదాయాన్ని ఇతర సంప్రదాయవాదులు మసిపూసి మారేడుకాయ చేశారన్న ఆక్రోశం వారి మాటలలో వినిపిస్తుంది. వారి మాటలను ఆలకించండి –

“ప్రాకృత సాహిత్యంలో రామకథ మూడుపాయలై పారింది. దీనిలో మొదటి పాయ బౌద్ధ సంప్రదాయానుసారి; రెండవది జైన సంప్రదాయానుగామి; మూడవది వాల్మీకి సంప్రదాయానువర్తి. ఈ మూడింటినీ సంగ్రహంగా నివేదిస్తున్నాను:

“ఏ దైవ దుర్విపాకమో, ఏ బుద్ధిజాడ్య జనితోన్మాదమో గాని, బౌద్ధ జైన సాహిత్యాలు వాల్మీకి రామాయణ సుధాస్వాదన వంచితాలయాయనే దుఃఖంతో ఈ వ్యాసం ప్రారంభిస్తున్నందుకు మీ మన్నన వేడుతున్నాను. దైవ దుర్విలసితం కాకపోతే బౌద్ధులు, జైనులు వాల్మీకి రామాయణాన్ని అమూలకంగా, అనపేక్షితంగా మార్చవలసిన అవసరం లేదు. రామకథతో తమ మతంవారు అకృష్టులవుతారనే ఈ మార్పులు చేశారా? – అనే సందేహమూ కలుగుతుంది. కానీ రామాయణ భారతాల వంటి మహోన్నత వస్తువులను విడనాడడానికి వారి మనస్సు ఒప్పలేదు; వాటిని స్వాయత్తం చేసుకోవాలనే ఉత్కంఠ మరొకవైపు. కనుకనే దానికి మార్పులు, చేర్పులు కూర్చి స్వాయత్తం చేసుకొన్నారు; కానీ తాము వాస్తవ రసాస్వాదన వంచితులయ్యారు; తదనంతర ప్రజలను వంచితులను చేశారు.”

ఇలా నాటి వారి ఉపన్యాసం ప్రారంభమయ్యింది. మొదట్లోనే ఎంతో బలంగా తమ వాణిని వినిపించారు రామచంద్ర గారు. ఈ ప్రారంభంనుండే మనం తెలుసుకోవచ్చు రామచంద్రగారు ఎంతటి ఆధ్యాత్మిక సంపన్నులో, ఎంతటి హైందవ సంప్రదాయవాదో. మహాకావ్యాలైన రామాయణ, భారతాలు వారి వ్యక్తిత్వంపై ఎంతటి బలమైన ముద్ర వేశాయో ఈ నాలుగు వాక్యాలను బట్టి చెప్పేయొచ్చు.

హైందవ సాహిత్యం ముఖ్యంగా వాల్మీకి రామాయణం సుధాస్వాదనకు అద్వితీయ మహాకావ్యం. అటువంటి రామాయణ సుధాస్వాదనకు బౌద్ధ జైన సాహిత్యాలు వంచితాలయ్యాయని వాపోయారు. పైగా బౌద్ధులు, జైనులు చేసిన ఈ కార్యాన్ని జీర్ణించుకోలేక వాటిని వారి దైవ దుర్విలసిత చేతలుగా అభివర్ణించారు. పైగా బౌద్ధులు, జైనులు వాల్మీకి రామాయణాన్ని అమూలకంగా, అనపేక్షితంగా మార్చివేశారని నిర్ద్వంద్వంగా తేల్చేశారు. ఇంతటి అకృత్యానికి కారణం బౌద్ధులకు, జైనులకు తమ మతానుయాయులు అకృష్టులవుతారనే భయమే నంటారు. రామాయణ భారత మహావస్తువులను స్వాయత్తం చేసుకోవాలనే ఉత్కంఠనే కారణమంటారు. మార్పులతో, చేర్పులతో తమ పనిని చక్కబెట్టుకున్నారని కేవలం భావోద్వేగంతో కాక ఎంతో పరిశోధనాత్మకంగా నిరూపించారు. అయినా తిరుమల రామచంద్రగారి మనసు సాంత్వన పడలేదు, అందుకే బౌద్ధులు, జైనులు రామకథను తమ కనుకూలంగా స్వార్థంతో మార్పులు చేర్పులు చేసి వాస్తవ రసాస్వాదన వంచితులయ్యారు అని తమ ఆక్రోశాన్ని అక్షరబద్ధం చేశారు. అంతేకాదు తదనంతర ప్రజలను వంచితుల్ని చేశారని చెప్పటానికి ఏమాత్రం తడబడలేదు. సాధారణంగా ఎవరినీ నొప్పించను ఇచ్చగించని రామచంద్రులవారు ఇంత ఘంటాపథంగా గళం విప్పారంటే వారు రామకథ విషయంలో ఎంతలా క్షోభపడ్డారో ఇట్టే గ్రహించవచ్చు.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రామకథ విషయంలో తిరుమల రామచంద్ర గారు తాను నమ్మిన మతాన్ని ఆదరించి తక్కిన మతాలైన జైన, బౌద్ధాలను నిరాదరించారనుకోవటం పొరబాటే అవుతుంది. రామ కథను మార్చిన తీరు విషయంలో జైన, బౌద్ధ అనుయాయులపై రామచంద్రగారు కాస్త పరుషంగా మాట్లాడారేకానీ ఆ మతాలపై ఏమాత్రం చిన్నచూపు లేదు. కాబట్టే జైన, బౌద్ధ వాఙ్మయాలపై వారు నాలుగైదు గ్రంథాలు రచించారు. పదులకొద్దీ వ్యాసరచన చేశారు. “ధర్మదీక్ష” అన్న పేరున ‘బుద్ధ భగవానుని భవ్యచరితము’ అన్న ఉపశీర్షికతో 1965 లోనే బౌద్ధ మహాయాన సంప్రదాయమైన లలితవిస్తార మహాసూత్రాన్ని అనుసరించి చేశారు. పాళీ సంస్కృత మూలమైన ఈ రచనను బులుసు వెంకటరమణయ్య గారితో కలిసి తెనిగించారు. ఈ కోవలోవే బోధిసత్వావధానం, బుద్ధుడి జీవితం మొదలైన గ్రంథాలు. పరిశోధన పరంగా తిరుమల రామచంద్ర గారికి స్వ-పర భేదం ఉండదనటానికి ఈ ఉదంతమే తార్కాణం.

***

హిందీ ప్రభాకర, ఆయుర్వేదభూషణ, విద్వాన్, డా. తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలలో “హిందువుల పండుగలు, పర్వములు” అన్న గ్రంథాన్ని పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో ఇలా పండుగలు, పబ్బాల పైన ఎన్ని పుస్తకాలు లేవు, ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం రాసిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదవాలా – అని ఈ తరం అనుకోవచ్చు. వీరికి నా సమాధానం చదవాల్సిందే అని. కారణం ఈ గ్రంథం సరదాగా రాసింది కాదు, పేరు ప్రఖ్యాతులకోసమో, నాలుగు డబ్బులు వెనకేసుకోవటానికో రాసినది అసలే కాదు. వారి మాటలలోనే చెప్పుకోవాలంటే “మనసు మరుగున తారాడు మెళకువలను వెలువరించుటకు మాటలే కాక మరి ఎన్నియో మార్గము లున్నవి. వానిలో ఒకటి పండుగలు. ప్రకృతిలో నేర్పడు వివిధ పరిణామములు, పరంపరాగతములగు పూర్వ గాథలు, నభోమండలమున నగపడు నక్షత్ర గ్రహాది సన్నివేశములు, తమ పర్యవేక్షణ ఫలములన్నియు నిత్యజీవితమున మేళవింపజేసి వానికి నిత్యత్వము సంతరింప జేయవలెనను అభిలాష మొదలగున వెన్నియో జున్ను కట్టగా రూపొందినవి పండుగలు.” అని అంటారు తమ మనవి మాటలలో.

వీరి ఈ మాటలను బట్టి తిరుమల రామచంద్ర గారి ఈ గ్రంథరచనా ఉద్దేశం అవగతమవుతోంది. ముఖ్యంగా వారి పరిశీలన, పరిశోధనా దృక్పథం తేటతెల్లం కావటమే కాక వారి చూపు, అవగాహన, అవలోకనం అందివస్తోంది. మనసు మరుగున తారాడు మెళకువల్ని వెలువరించే మార్గాలుగా పండుగలను చెప్పటం ఒక్క రామచంద్రగారికే సాధ్యమైంది. అంతేకాదు, ప్రకృతి పరిణామాలను, పరంపరాగతమైన పూర్వగాథలను, ఆకాశాన మురిపించే నక్షత్ర గ్రహ సన్నివేశాలను అద్దంపట్టేవి పండుగలు అంటారు.

అందుకే –

“రచన శ్రీ తిరుమల రామచంద్రాచార్యులొక్కరే చేయగలిగి నట్లున్నదని వ్రాయుటకంటె మరేమి వ్రాయగలను? విషయము ప్రామాణికమై, విస్తరమై, రచన నిర్మలమై యున్నది…” అని రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారన్నా-

“శ్రీ రామచంద్రగారు ప్రతివిషయమును గూర్చి ఇతరులకు మిగులకుండ వ్రాసిరి.” అని విశ్వనాథ సత్యనారాయణగారు అన్నారన్నా – అక్షర సత్యం. ముప్పై పండుగలను గురించిన ఉత్తమ రచన ఇది. విషయ వైవిధ్యమున్న సంపుట మిది.

మనం వినాయక చవితినాడు వ్రత కల్ప పుస్తకంలో వినాయకుడు గజాననుడు ఎందుకయ్యాడో చదువుకుంటాం. మనిషి మొండానికి ఏనుగు తలను తగిలించటం తెలుసు. ఇక్కడ తిరుమల రామచంద్రగారు శైవాగమ – సుప్రభేదాగమంలోని వినాయకోత్పత్తి వృత్తాతాన్ని ఇలా ఉల్లేఖిస్తారు –

“శివుడే వినాయకునకు చెప్పుచున్నట్లున్న మాట లివి: నేను ఉమతో పాటు హేమ వనమున విహరించుచుండగా ఒక ఏనుగుల జంట క్రీడించుట చూచితిని. దానిని చూచిన పిదప నేను మగఏనుగు నాకారమును, పార్వతి పిడిఏనుగు నాకారమును స్వీకరించి క్రీడించితిమి. అప్పుడు పార్వతి గర్భము ధరించగా గజానను డుదయించెను.” (పుట 5) ఇంతేకాక నన్నెచోడుని కుమారసంభవం నుండి, గణనాయకాష్టం నుండి కూడా మరో రెండు గజానున వృత్తాంతాలను రామచంద్రగారు ఉటంకిస్తారు. వినాయక చవితినాడు చంద్ర దర్శనంతో కలిగే మిధ్యాపవాద దోష నివారణకు కావలసిన ఉపపత్తులను పురాణ వాఙ్మయం నుండి చూపటం సాహిత్యశోధకులకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. ఇక, స్కంద, భవిష్యోత్తర పురాణాలలో వినాయకవ్రత విధానాలు ఎలా ఉటంకింపబడ్డాయో చెప్పటమే కాక నామలింగ శాసనంలో అమరసింహుడు ఇచ్చిన వినాయక పర్యాయ పదాలను కూడా పేర్కొనటం ఒక్క రామచంద్ర గారికే చెల్లింది. అదీ వారి పరిశీలన, పరిశోధన, అవలోకన, అవగాహన. తొలి పండుగ వినాయకచవితి వ్యాసంలోని ఇన్ని విషయాలను పరిశోధనాదృక్పథంతో చేర్చిన తిరుమల రామచంద్ర గారి ముద్ర ఈ గ్రంథంలోని ముప్పై పండుగలు, పర్వాలలో కనిపిస్తుంటుంది.

సమయాభావం వల్ల స్థాలీపులాక న్యాయంగా ఒక్క వినాయక చవితిని గురించిన రామచంద్ర గారి అనుశీలనను మాత్రమే చూపి మరొక అనువాద గ్రంథమైన “శ్రీరంగ” పరిశీలనకు పూనుకుంటున్నాను.

***

“దేహో దేవాలయః ప్రోక్తహ” దేహమే దేవాలయం అన్నారు సాధకులైన యోగులు. దేహంలోని మూలాధారం మొదలు సహస్రారం వరకు ఉన్న స్థితిపై ప్రాణాయామంతో ప్రాబల్యం సాధించి అమృత బిందు సంయోగానికి ఆయత్తుడవుతాడు యోగి. ఈ దేహాన్ని బట్టే ఆగమ శాస్త్రజ్ఞులు దేవాలయాన్ని రూపొందించారు. ఈ కోవెలలో గోపురాలు, మెట్లు, శిల్పాలు, స్తంభాలు, తీర్థాలు, ఉత్సవాలు, వాహనాలు, నిత్యపూజా నైవేద్యాలు – అన్నీ యోగదృష్టిలో ఏర్పరచినట్టివి. కాలక్రమాన ఈ దృష్టి అంతరించింది.” అని అంటారు “శ్రీరంగం దేవాలయం, నిర్మాణం” అన్న గ్రంథాన్ని అనువదించిన తిరుమల రామచంద్రగారు తమ మనవి మాటలలో. తమిళ మూల రచయిత శ్రీ రంగం సిద్ధర్ ఈ గ్రంథాన్ని సిద్ధుల పద్ధతిలో తత్వవివరణగా రచించారు.

అవును, తిరుమల రామచంద్ర గారన్నట్లుగా దేవాలయాలు మానవ దేహ ప్రతిబింబాలు. అటువంటి దేహాలయాన్ని కాదని కేవలం దేవాలయాల వెంట పడి దేవాలయాల ఔన్నత్యాన్ని ధూప దీప నైవేద్యాలకే పరిమితం చేసుకుంటున్నాం అన్న అంతరార్థం ‘కాలక్రమాన ఈ దృష్టి అంతరించింది’ అన్న వారి మాటలలో తొంగిచూస్తోంది. అసలు యోగాన్ని చిన్నచూపు చూస్తున్నారన్న ఆవేదనా వారిమాటలలో ధ్వనించింది. దేవాలయాలలో నిలదొక్కుకోవాల్సిన ఈ యోగదృష్టికి దృష్టిదోషం ఎలా సంభవించింది? అన్నది ప్రస్తుత పరిశీలనాంశం కాదు కానీ తిరుమల రామచంద్రగారి పైనాలుగు మాటలను చదివినతర్వాత ప్రస్తావించాల్సి వచ్చింది.

ఈ సందర్భంలో తిరుమల రామచంద్రగారిని గురించి కొంత చెప్పుకోవాలి. వారి కట్టు బొట్టు ఒక సంప్రదాయ రూపాన్ని మనముందు నిలబెడుతుంది. వారి ఆలోచనలు అభ్యుదయ వాకిళ్ళను తెరుస్తుంటాయి. వారి ఆచరణ ఆచారాల ముసుగులను తొలగిస్తూ తాత్విక విచారణ చేసేలా ఉంటుంది. సంస్కృతీ సంప్రదాయాన్ని యోగసాధనను ముడివేసిన ఆధునిక మునిపుంగవుడు తిరుమల రామచంద్ర. సంధ్యావందనాదులకు ఎంత ప్రాముఖ్యమిచ్చారో అంతే ప్రాధాన్యం ఉదయ సాయం సంధ్యల యోగ సాధనకు ఇచ్చేవారు. ఈ అభ్యాసం బహుశా వేటూరి ప్రభాకర శాస్త్రిగారి అంతేవాసిగా ఉండటం వల్ల సిద్ధించినటువంటిది.

వేటూరి ప్రభాకర శాస్త్రిగారు మాస్టర్ సి.వి.వి. యోగానుయాయి. మాస్టర్ సి.వి.వి. భృక్త రహిత తారక రాజయోగాన్నే చివరి శ్వాసవరకు అనుష్టించినవారు. వేటూరి వారు, తిరుమల వారు మద్రాసులో ఉన్న రోజులలో ప్రభాకరుల ఇంట ఉదయ సాయం సంధ్యలలో జరిగే యోగసాధనలో నిత్యం పాల్గొంటుండేవారు. అలా తిరుమల రామచంద్ర గారికి మాస్టర్ యోగసాధన అలవడింది. ఆ సాధన రామచంద్రగారి సాహిత్య సేద్యంతో పాటు ఈ భౌతికాన్ని వీడేవరకు సాగింది. అందుకే శ్రీరంగం సిద్ధర్ రాసిన “శ్రీరంగం దేవాలయం, నిర్మాణం” గ్రంథం సిద్ధుల పద్ధతిలో జరిగిన తత్వ విచారణగా తిరుమల రామచంద్ర గారిని ఆకర్షించి తెలుగులోకి తర్జుమా చేయాలనే సంకల్పాన్ని ఉదయింపచేసింది.

కొడగు కొండలులో పుట్టిన కావేరి నది – ముక్కొమ్బి దగ్గిర రెండు పాయలుగా చీలటం – తిరిగి కల్లనై వద్ద రెండు పాయలు ఒక్కటి కావటం – అక్కడి నుండే అయిదు పాయలుగా ప్రవహించటం – ఈ అయిదు పాయలకు వేరు వేరు పేర్లు ఉండటం – వాటి మధ్య ఏర్పడిన ద్వీపంలో శ్రీరంగ క్షేత్రం నెలకొనటం మనందరికీ తెలిసిన భౌగోళిక నేపధ్యం. ఈ నేపథ్యంతోనే ఈ శ్రీరంగ క్షేత్ర గ్రంథమూ ప్రారంభమై అయిదు వాక్యాలతో నేపథ్యం ముగిసి తత్వ వివరణ ప్రారంభమవుతుంది. ఈ తత్వ వివరణ తిరుమల రామచంద్ర గారి ఆంధ్రీకరణలో చూద్దాం –

“కొడగుకొండలు బ్రహ్మ స్థితిని సూచిస్తున్నవి. బ్రహ్మ స్థితి ఒక్కటే. ముక్కొమ్బి అనేచోట మూడు పాయలుగా చీలటం ఇడ, పింగళ, సుషుమ్నా నాడులను సూచిస్తున్నది. మధ్యన ఏర్పడిన ద్వీపం భ్రూమధ్యం. కల్లనై నుంచి ఐదు పాయలుగా చీలడం ఐదు జ్ఞానేంద్రియాలకు సూచన. ఇవి మనను క్రిందివైపు తీసుకొని వెళ్ళుతాయి. గనుక మనం నదీ ప్రవాహం వెంబడి క్రిందివైపు వెళ్ళక ఎదురీది పైచూపుతో మీదికి వెళ్లి బ్రహ్మమును కలుసుకునే పద్ధతిని శ్రీరంగ దేవాలయ నిర్మాణం వివరిస్తున్నది.”

ఇదీ భౌగోళిక నేపథ్యానికి యోగిక తత్వ వివరణ. అవును, యోగ సాధకుడు తన పంచేంద్రియ చర్యలకు, చేతలకు ఎదురీదితే తప్ప ఫాలభాగాన ఇడ పింగళ నాడుల సంగమాన్ని అనుభూతించలేడు. ఇక్కడి నుండి ఇడ పింగళ నాడులు తమ దిశను మార్చుకుంటే తప్ప సుషుమ్న నాడితో సంయోగించి బ్రహ్మ దర్శనాన్ని పొందలేడు. బ్రహ్మత్వం సిద్దించదు. కాబట్టి యోగసాధకుడు ఊర్ధ్వగమనంతో సాగితే తప్ప బ్రాహ్మిస్థితిని చేరుకోలేడు.

మన దేహంలో నెలకొన్న ఈ యోగిక తత్వం శ్రీరంగ ఆలయ నిర్మాణంలో ఎలా పొందుపరపబడిందన్నదే ఈ గ్రంథంలోని విషయం.

శ్రీరంగ దేవాలయానికి మనం అమ్మా మంటపం నుంచి బయలుదేరితే మొదట చేరుకునేది పులి మంటపం. ఈ మంటపంలో పదహారు స్తంభాలు పదహారు చంద్ర కళలకు ప్రతీకలు. తర్వాత చేరుకునేది రాయ మంటపం. ఈ రాయమంటపాన్ని చేరుకునే దిశలో నాలు స్థంభాలున్న మూడు మంటపాలు దాటుతాం. అంటే పన్నెడు స్థంభాలన్న మాట. ఈ పన్నెండు స్తంభాలు సూర్య కళను సూచిస్తుంటే మొదటనే దాటివచ్చిన మంటపం చంద్రకళను సూచిస్తుంది.

ఇక – భూమి మట్టానికి క్రిందగా వుండే పాతాళ కృష్ణుల మంటపాన్ని కుండలినీ కేంద్రంగానూ, ఇక్కడి ఎనిమిది స్తంభాలు మన దేహంలోకి మన శ్వాస ఎనిమిది అంగుళాల మేర చేరడాన్ని సూచిస్తోందని యోగ తత్వ వివరణ కావిస్తారు. మన దేహంనుండి నిశ్వాస నాలుగంగుళాల శ్వాసగా బయటికి వెళ్తుంటుంది. బయటికి వెళ్లే ఈ శ్వాసను దేహంలోనే నిలుపుకోవాలని సూచించేదే నాలుగు ముఖాల గోపుర ద్వారం. ఆ తర్వాత ఉండే ఏడు గోపురాలలో మొదటి ఆరు గోపురాలు పరమాత్మను చేరుకునే దశలో దాటే ఆరు దశలను, ఏడవది పరమాత్మ స్థానాన్ని సూచిస్తోంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే కుడివైపున కూరత్తాళ్వార్ సన్నిధి ఉంటుంది. ఈ కూరత్తాళ్వార్ ఇంద్రియాలను జయించిన మహా యోగి. ఇలా యోగసాధనకు ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం అవసరమని కూరత్తాళ్వార్ సన్నిధి సంకేతిస్తోంది.

దేవాలయంలోని నాథముని సన్నిధి యోగసాధనలో నాద ప్రాధాన్యతను తెలియచేస్తుంటుంది.

తర్వాతి ఆండాళ్ అంటే గోదాదేవి సన్నిధి యోగసాధనలో శక్తి చాలన ఆవశ్యకతను చూపుతుంటుంది. దగ్గిరలో ఉండే యోగివాహులు అనబడే తిరుప్పాణాళ్వారు హరిజనుడు. యోగసిద్ధి పొందినవాడు. యోగసిద్ధి విషయంలో కుల మత ఆచారాలేవీ అడ్డురావని చెబుతున్నట్టుంటుంది ఇక్కడి యోగివాహుల విగ్రహ స్థాపన.

తిరుమల రామచంద్ర గారి మాటలలో ఇంకొంత వివరణ – “కార్తిక గోపురానికి, చక్రత్తాళ్వార్ కోవెలకు మధ్యన ఉన్నది అమృత కలశం. ఇక్కడ మంటలు కాల్చడం యోగాగ్నిని తెలియజేస్తుంది. చక్రత్తాళ్వార్ యోగాన్ని ఆచరించి చూపినారు. యోగం నుంచి యోగాగ్నిని సహస్రారానికి (బ్రహ్మ రంధ్రానికి) కొనిపోయి, అక్కడే మనస్సును నిశ్చలంగా ఉంచితే అమృతం లభిస్తుంది. గరుడాళ్వార్ అమృతకలశాన్ని తన వద్ద ఉంచుకొనడం దీనిని సూచిస్తుంది.”

ఇలా శ్రీరంగ ఆలయాన్ని మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే షట్చక్ర స్థాన విశేషణక్షేత్రంగా యోగ తత్వ వివరణ చేస్తారు. ఇక వేయిస్తంభాల మంటపాన్ని యోగిక విశేషమైన సహస్రారానికి ప్రతీకగా చెబుతారు. తిరుమల రామచంద్ర గారు ఉభయ సంధ్యలలోను యోగసాధన కావించేవారు కాబట్టే ఈ గ్రంథాన్ని ఇంత సరళ సులభంగా తెనిగించగలిగారు. ఎక్కడా అనువాదం అనిపించని రీతిన ఆంధ్రీకరించగలిగారు.

***

మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్రగారు హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్ లోని ఇస్కాన్‌కు 1990 ప్రాంతాల్లో వెళ్తుండటం నాకు తెలుసు. ఉదయం 11 గంటల తర్వాత గానీ లేదా సాయంత్రం నాలుగు ప్రాంతాలగానీ వెళ్తుండేవారు. వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో నన్ను కలుస్తుండేవారు. బహుశా నాలుగైదు సంవత్సరాలు రామచంద్రగారు ఇస్కాన్ సాహిత్యాన్ని తెలుగులోకి తీసుకురావటంలో తమ ఆంధ్రీకరణలు సాగించి తమ కృష్ణభక్తిని చాటుకున్నారు.

బాబ్ కోహెన్ అనే విదేశీయుడు శ్రీల ప్రభుపాదుల వారితో జరిపిన సంభాషణలను PERFECT QUESTIONS – PERFECT ANSWERS పేరిట ISCON వారు ఆంగ్లంలో ప్రచురించగా భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ తరఫున తిరుమల రామచంద్ర గారు “ఉత్తమ ప్రశ్నలు – ఉత్తమ సమాధానాలు” పేరిట తెనిగించారు. ఈ పుస్తకం నుండి ముచ్చటగా ప్రభుపాదుల వారి మూడు సమాధానాలను తిరుమల రామచంద్రగారి తేటతెనుగు పదాలలో వినిపించి ఈ పత్ర సమర్పణను ముగిస్తాను. –

“మీరు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ ఉంటే, మీ దేహం భౌతికమే అయినా ఆధ్యాత్మికంగా పనిచేస్తుంది.” (పుట 50)

“భౌతిక జీవితం అంటే – ఇంద్రియాలను సంతోషపెట్టాలని కోరుకోడం – దానిని భౌతిక జీవితం అంటారు. భగవంతునికి సేవ చేయాలని కోరిక ఉంటే దానిని ఆధ్యాత్మిక జీవితం అంటారు. అదీ భౌతిక ఆధ్యాత్మిక జీవితాల మధ్య ఉన్న భేదం. మనం ఇంద్రియాలను సేవించడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఇంద్రియ సేవకు బదులు భగవంతుణ్ణి సేవిస్తే అది ఆధ్యాత్మిక జీవితం అవుతుంది.” (పుట 53)

“సంసిద్ధి – ‘సం’ అంటే పరిపూర్ణమని అర్థం. ‘సిద్ధి’ అంటే ఉత్కృష్టత. ఇంటికి చేరినవాడు – తిరిగి భగవంతుణ్ణి చేరినవాడు అంటే పరిపూర్ణత్వాన్ని పొందినవాడు అని. కాబట్టి తానీ దేహం కాదనీ, తాను ఆత్మ అనీ తెలిసికొన్నప్పుడు పూర్ణత్వం లభిస్తుంది. ‘బ్రహ్మభూతః’ అంటే బ్రహ్మను తెలిసికొన్నవాడు. అది పూర్ణత్వం. ‘సంసిద్ధి’ బ్రహ్మజ్ఞానానంతరం వస్తుంది, భక్తియుత సేవలో నిమగ్నుడై ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి ఇంతకుముందే భక్తియుత సేవలో ఉన్నవాడైతే అతనికి బ్రహ్మజ్ఞానం ఉందని అర్థం చేసికోవాలి. దానిని ‘సంసిద్ధి’ అంటారు.” (పుట 61)

నా దృష్టిలో మన తిరుమల రామచంద్ర గారు

బ్రహ్మభూతులు, సంసిద్ధులు, పూర్ణపురుషులు.

వారి ఆత్మకు నా కైమోడ్పు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here