తిరుమలేశుని సన్నిధిలో… -17

0
10

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

పి.వి.ఆర్.కె.ప్రసాద్

[dropcap]తి[/dropcap]రుమల తిరుపతి దేవస్థానముల సుదీర్ఘ చరిత్రలో ఎందరో అధికారులు పని చేసి తమ కార్యనిర్వహణా సామర్థ్యాన్ని చాటుకున్నారు. వారిలో అగ్రగణ్యులు పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ (పి.వి.ఆర్.కె.ప్రసాద్) ఆయన 1978 – 81 సంవత్సరాల మధ్య నాలుగేళ్ల పాటు ఈ.వో.గా తిరుపతిలో పని చేశారు. తన దివ్యనుభవాల మాలికను స్వాతి వారపత్రికలో ధారావాహికంగా పాఠకులతో పంచుకొన్నారు. ‘నాహంకర్త, హరిః కర్తా’ అనే పేర అది గ్రంథరూపంలో ఎమెస్కో ద్వారా తొలుత 2003లో, ఆ తరువాత ఎనిమిదో ప్రచురణగా 2009లోను ముద్రితమైంది.

ప్రసాద్ 1941 ఆగస్టు 22న గుంటూరు జిల్లా గూడూరులో జన్మించారు. గుంటూరు హిందు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.లో గోల్డ్‌మెడల్ సంపాదించారు. వెంటనే రాయపూర్‌లోని రవిశంకర్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా చేరారు. భగవత్ నిర్ణయం ఆయన చేత ప్రజా సేవ చేయించాలని వుంది. జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలలో IAS ప్యాసయ్యారు.

ఏ పదవిలో వున్నా ఆయన తన దైన శైలిలో కార్యరంగంలోకి దుమికారు. తన ముద్రను పటిష్టంగా వేశారు. ముఖ్యమంత్రి పి.వినరసింహారావు కార్యదర్శిగా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా, టి.టి.డి కార్యనిర్వహణాధికారిగా, విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ ఛైర్మన్‌గా, ప్రధాని పి.వి నరసింహారావునకు అదనపు కార్యదర్శి హోదాలో పత్రికా సలహాదారుగా, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరర్టర్ జనరల్‌గా పని చేశారు.

వీటి అన్నింటిలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపట్టారు. కర్ణాటక సాంస్కృతిక సంస్థలు ‘రాష్ట్రరత్న’ పురస్కారాన్ని, ఉడిపి మఠంవారు ‘శ్రీకృష్ణ అనుగ్రహ పురస్కారాన్ని’, అక్కడే రాజర్షి బిరుదున్ని అందించారు. ఆయన నిజంగా రాజర్షి. హిందు ధర్మ ప్రచార మండలి అధ్యక్షులుగా దేవాదాయ శాఖలో ఎంతో కాలం పని చేసి, ఆలయాల అభివృద్ధికి దోహదం చేశారు. తిరుమలలో సాధు సమ్మేళనాల బాధ్యతను తలకెత్తుకున్నారు.

తిరుమలలో అద్బుత సంఘటనలు :

పి.వి.ఆర్.కె.గా ప్రసిద్ధులైన ఆయన తిరుమలలో గణనీయమైన కార్యక్రమాలను పూర్తి చేశారు. తిరుమల ఆలయానికి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం ముందు భక్తులు నడిచే దారి ఇరుకుగా వుండేది. చుట్టూ చిన్న చిన్న దుకాణాలు వ్యాపారం కొనసాగించేవి. వాటిని తొలగించడానికి బలవంతంగా ప్రయత్నించకుండా వారినందరినీ సమ్మతపరిచి మరో ప్రదేశంలో వారికి దుకాణాలు నడుపుకొనేందుకు వసతి కల్పించారు. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఈ కృషి వల్ల నడవదారి సౌకర్యంగా ఏర్పడింది.

ఖమ్మం జిల్లా కలెక్టరుగా పేరు తెచ్చుకొని 1977లో హైదరాబాదులోని నీటి పారుదల సంస్థ మేనేజింగ్ డైరక్టర్‌గా చేరారు. కొద్ది నెలల్లోనే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రసాద్‌ను టి.టి.డి కార్యనిర్వహణాధికారిగా ఎంపిక చేశారు. ఆ పదవిలో పని చేయాలని చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారు కూడా ప్రయత్నిస్తారు. అనుకోకుండా లభించిన ఈ పదవి ఆయనకి దైవదత్త వరం. 1978లో తిరుపతిలో చేరారు.

తిరుమలను ఒక ఆదర్శవంతమైన యాత్రాస్థలంగా చేయడానికి ఒక మాస్టర్ ప్లాను ప్రసాద్ హయాంలో రూపొందించారు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి కూడా దానిని అభినందించారు. తిరుమల గ్రామం మొత్తం సర్వే చేయించి, జనాభా వివరాలు సేకరించి, కొండ మీద నివసిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నెల రోజుల్లో పూర్తి చేయించారు. ఒక అధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించారు. దాదాపు మూడు వేల నిర్మణాలు తొలగించారు. సన్నిధి వీధిని వెడల్పు చేశారు. 1978 నుండి 1982 మే వరకు ఆయన అహోరాత్రాలు తిరుమల పవిత్రతను కాపాడే ప్రయత్నాలే చేశారు.

అన్నమయ ప్రాజెక్టు :

తిరుమలేశునిపై తాళ్లపాక అన్నమాచార్యులు 32 వేల సంకీర్తనలు రచించాడు. చెలికాని అన్నారావు మొదలు పి.యస్.రాజగోపాలరాజు వరకు పని చేసిన అధికారులు అన్నమయ్య కీర్తనలను ప్రచురింపజేశారు. ఆ కీర్తనలను ప్రచారం చేయించాల్సిన అవసరముందని ప్రసాద్ గుర్తించారు. అప్పటికే ప్రచార బాధ్యతలు గౌరిపెద్ది రామసుబ్బశర్మ చూస్తున్నారు. దేవస్థానం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేస్తున్న కామిశెట్టి శ్రీనివాసులును అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా నియమించారు. పాటల గానానికి శోభారాజు, బాలకృష్ణప్రసాద్‌లను నియమించారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో అన్నమాచార్య కీర్తనలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. వేల సంఖ్యలో గాయనీ గాయకులు వాటిని  ప్రచారంలోకి తెచ్చారు. 2007లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభానికి అప్పటి ఈ.వో. రమణాచారి నన్ను నడుంకట్టుకొని ముందుకు సాగమన్నారు. అప్పుడు విధాన నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్ర రెవిన్యూ శాఖ (ఎండోమెంట్) ముఖ్యకార్యదర్శి డా.ఐ.వి సుబ్బారావు, టి.టి.డి ఈ.వో రమణాచారి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షులు పి.వి.ఆర్.కె ప్రసాద్ రాష్ట్ర సచివాలంయంలో సమావేశమయ్యారు. నేను మినిట్స్ తయారు చేశాను. అప్పటి ట.టి.డి బోర్డు అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి చొరవతో భక్తి ఛానల్ స్థాపనకు నాందీ ప్రవచనం జరిగింది. అప్పుడు నేను శ్రీవేంకటేశ్వర దృశ్య శ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ని. దేవస్థానం నిధుల నుండి మూడు కోట్ల రూపాయలు ఛానల్ స్థాపనకు బోర్డు ఆమోదించింది. ఛానల్ తొలి దశలో ప్రసాద్ సూచనలు సలహాలు ఎంతో దోహదం చేశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు :

అన్నమాచార్య ప్రాజెక్టు వలె దాస సాహిత్య ప్రాజెక్టు, ఆళ్వారు దివ్య ప్రబంధ ప్రాజెక్టులు కూడా ప్రసాద్ చొరవతో ఏర్పడ్డాయి. దాస సాహిత్యోద్యమం ఈనాడు దక్షిణాదిలో బహుళ ప్రచారం పొందింది. మెట్లోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నారు. అప్పణ్ణాచారిని ఈ ప్రాజెక్టు అధికారిగా నియమించారు. పురందరదాసు శ్రీవేంకటేశ్వరుని పై వేల సంఖ్యలో కీర్తనలు రచించాడు. అది భక్త బృందాల ద్వారా ఈనాడు వెలుగులోకి వచ్చాయి. గత దశాబ్దికాలంలో ఆనంద తీర్ధాచార్య ఈ కార్యక్రమాల ప్రత్యకాధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు.

ప్రత్యేక కల్యాణోత్సవం :

దశబ్దాలకాలం నుండి మహా ద్వారం దాటి ముందుకు నడవగానే ఎడమ వైపున వున్న రంగ మంటపంలో కల్యాణోత్సవాలు ఆర్జిత సేవగా రోజూ నిర్వహించేవారు. అక్కడ కేవలం 25 మంది దంపతులు మాత్రమే కూర్చునే అవకాశం వుంది. దానిని బయట మరో ప్రదేశంలో నిర్వహించి రెండు వందలమంది గృహస్థులు పాల్గనే ఏర్పాటును ప్రసాద్ ఏర్పరచారు. అర్చక మిరాసీదారులను సంప్రదించి వారికి రావలసిన బహుమానాలను కట్టుదిట్టం చేసి నూతన కల్యాణోత్సవాల పద్ధతిని ప్రవేశపెట్టారు. కొత్త మంటపాన్ని నిర్మించి అధిక సంఖ్యలో గృహస్థులు పాల్గొనే అవకాశం కల్పించారు. పెద్ద కల్యాణోత్సవానికి 1250 రూపాయలు, ప్రత్యేక కల్యాణముకు 500 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తతం వెయ్యి రూపాయలకే ఈ సేవ లభిస్తోంది.

అనూహ్య సంఘటనలు :

ప్రసాద్ పరిపాలనా దక్షతకు నిదర్శనాలుగా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. తిరుమలలో పద్మావతీ గెస్ట్ హౌవుస్ నిర్మాణానికి బోర్డు సభ్యులు ఆర్.పి. గోయెంకాని వొప్పించడం, హైదరాబాదులో రామకృష్ణ మఠం భవన నిర్మాణానికి టిటిడి నిధులు 12 లక్షలు మంజూరు చేయించడానికి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని అంగీకరింపజేయడం, యం.యస్.సుబ్బలక్ష్మి స్వగృహం అమ్మకుండా నిధులు మంజూరు చేయించి ఆమె చేత అన్నమాచార్య కీర్తనలు పాడించడం వంటి కార్యకలాపాలకు శ్రీనివాసుని అనుగ్రహం ప్రసాద్ పైన ఎంతైనా వుంది.

హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ :

1981లో ఆంద్రప్రదేశ్ శాసనశభ టిటిడిలో హిందూ ధర్మపరిరక్షణ ట్రస్టును ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసింది. అది ఇప్పుడు హిందూ ధర్మ ప్రచార పరిషత్‌గా పనిచేస్తోంది. వేదధ్యాయనానికి ఉపకార వేతనాలు మంజురు చేసే పద్ధతి ప్రవేశ పెట్టారు డా. డి. అర్కసోమయాజి తొలి కార్యదర్శి. మత మార్పిడులు చేయిస్తున్నారనే అపవాదు ప్రసాద్‌పై పడింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ముందు పంచాయతీ జరిగింది. అయితే అది నిజ నిర్ధారణకు నిలబడలేదు.

వేద రక్షణ, శాస్త్ర రక్షణ పథకాలు ప్రసాద్ ప్రవేశ పెట్టారు. అవి ఒక కులం వారివి ప్రొత్సహించే ప్రయత్నాలనే నేరారోపణ ప్రసాద్‌పై పడింది. కొత్తగా 1983 జనవరిలో ముఖ్యమంత్రి అయిన యస్.టి.రామారావు ప్రసాద్‌ని పిలిపించి సంజాయిషీని అడిగారు. సముచితమైన సమాధానాలు చెప్పి ప్రసాద్ ముఖ్యమంత్రి ప్రశంసలను అందుకొన్నారు.

చిత్త శుద్ధితో, నిస్వార్థంగా చేసిన ఏ పనీ వృథా పోదు. ఆయన నిత్య ఉపాసకుడు. చివరిరోజుల్లో కోటి గాయత్రీ జపం చేశారు. ఎనిమిది పదుల వయస్సులో సహధర్మచారిణి గోపికతో కలసి ఎన్నో ఆలయాలు సందర్శించారు. ధార్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం చేశారు. ప్రశాంత జీవనం గడుపుతూ హైదరాబాదులో అనాయాస మరణం పొదారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసిన మహత్తర కార్యక్రమాలకు ఇప్పటికీ ఆధికారులు వేనోళ్ళ పొగుడుతారు. నిజమే ‘నాహం కర్తా హరిః కర్తా’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here