తిరుమలేశుని సన్నిధిలో… -18

0
10

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

శ్రీనివాసుని కొలువులో పండితమండలి

[dropcap]తి[/dropcap]రుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో దశాబ్దులుగా ఎందరో పండితులు తమ సేవలందించారు. స్వామి సన్నిధిలో కొలువు చేయడం, స్వామి ఉత్సవాలలో పాల్గొనడం ఒక మహత్తర భాగ్యంగా భావించారు. స్వామి దర్శనమనే నిధి లభించిందని సంబరపడ్డారు. ఎందరో కవి పండితులు దేవస్థాన సంస్థలలో ఉద్యోగులుగా పనిచేశారు. మరికొందరు పదవీ విరమణానంతరం ఆయా విభాగాలలో కొంతకాలం కొలువుదీరి తమ అనుభవాలను స్వామి సేవలో వినియోగించారు.

విశ్రాంత ఉద్యోగులు:

దేవస్థానంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ చెందిన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించే సంప్రదాయం వుంది. ప్రచురణల విభాగంలో సుప్రసిద్ధ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి (గుంటూరు) భాగవతం ప్రాజెక్టులో పనిచేశారు. ఆధునిక కవిశేఖరులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైరయిన డా. నండూరి రామకృష్ణమాచార్యులు భాగవత ప్రచురణలో పాల్గొన్నారు. ఆకాశవాణిలో సుప్రసిద్ధులు, బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేసి విరమించిన సంగీతవేత్త బాలాంత్రపు రజనీకాంతరావు అన్నమాచార్య ప్రాజెక్టులో కొంతకాలం సేవలందించారు. విద్వాన్ విశ్వం (ఆంధ్రప్రభ) స్వామి సేవలో పాల్గొన్నారు.

వివిధ ప్రాజెక్టుల అధికారులు:

దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టులు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి హయాం నుండి నెలకొల్పబడ్డాయి. ఆయా ప్రాజెక్టులలో విశ్రాంత ఉద్యోగులను నియమించారు. ప్రచురణల విభాగంలో గౌరిపెద్దరామసుబ్బశర్మ (ప్రాచ్య కళాశాల), సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రాచ్య పరిశోధనా సంస్థలో వేటురి ప్రభాకరశాస్త్రి వంటి మహా పండితులు అన్నమాచార్య సంకీర్తనా సంపుటాలు వెలికి రావడానికి ఎంతో కృషి చేశారు. వారి అవిరళ కృషి ఫలితంగా ఆ కీర్తనలన్నీ ముద్రించబడ్డాయి.

2016 ప్రాంతంలో ఆచార్య రవ్వా శ్రీహరి (ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి) రెండేళ్ళ లోపు ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. వేదిక హయ్యర్ స్టడీస్ అధికారిగా కొద్ది నెలల పాటు ఆచార్య శలాక రఘునాథశర్మ ఉన్నారు.

ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యులు డా. కె. సర్వోత్తమరావు కొద్ది సంవత్సరాలు సేవ చేశారు.

తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులో పండితుడుగా ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఆచార్య కె. జె. కృష్ణమూర్తి ఒక దశాబ్దికిపైగా 2005-2019 పని చేశారు. వెంగమాంబ సాహిత్యంపై విశేష కృషి చేసిన కృష్ణమూర్తి వెంగమాంబ రచనలైన వేంకటాచలమహత్యాది 25 గ్రంథాలను పరిష్కరించి ప్రచురించారు.

ప్రచురణల విభాగంలో ప్రస్తుతం డా. జి. ఆంజనేయులు (పూర్వ ప్రిన్సిపాల్), కట్టా నరసింహులు, నరసింహాచార్యులు పనిచేస్తున్నారు. వయోవృద్ధులు, కవితావతంసులు అయిన ముదివర్తి కొండమాచార్యులు వివిధ విభాగాలలో పండితులుగా నియమితులయ్యారు. గూడూరు జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ చేసి, దాదాపు 30 సంవత్సరాలు స్వామి సేవలో తరించారు. ప్రతి సాయంకాలం అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీతను పలువురు శిష్యులకు బోధించారు. భారత, భాగవతాది ప్రచురణలకు ప్రూఫులు దిద్దారు. ఆయనకు ఆ జీవితకాలం ఉద్యోగం కల్పిస్తూ బోర్డు ఆమోదం తెలిపింది. కానీ అనారోగ్య రీత్యా ఆయన 2017 నుంచి విశ్రాంతి తీసుకొంటున్నారు.

2005లో దృశ్యశ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా ఆకాశవాణి, దూరదర్శన్ అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా డా. ఆర్. అనంతపద్మనాభరావు మూడేళ్ళు పనిచేశారు. 2008-2010 జూన్‌లో హైకోర్టు ఆదేశాల మేరకు దాదాపు 25 మంది రిటైరయిన ఉద్యోగులను విరమణ చేయించారు.

హిందూ ధర్మప్రచార పరిషత్ (డి.పి.పి):

విశేష కార్యక్రమాల ద్వారా ధార్మిక ప్రచారానికి ఈ సంస్థను నెలకొల్పారు. తొలినాళ్ళలో భీమవరం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన డా. ధూళిపాళ అర్క సోమయాజి ఈ సంస్థ కార్యదర్శిగా కొన్ని సంవత్సరాలు పని చేశారు. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల అధ్యాపకులు, సంస్కృతాంధ్ర పండితులు సముద్రాల లక్ష్మణయ్య గారు 15 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. అనంతరం గత 15 సంవత్సరాలుగా ఆయన పురాణ వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి. మలయాళస్వామి వారి ప్రత్యక్ష శిష్యులు. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీరిని మహామహోపాధ్యాయ పట్టంతో సత్కరించింది.

లక్ష్మణయ్య తర్వాత 2005లో డా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి అయ్యారు. ఆయన ధర్మవరం ప్రభుత్వ కళాశాల తెలుగు అధ్యాపకులుగా పదవీ విరమణ చేశారు.

ధర్మప్రచార కార్యదర్శిగా రెండేళ్ల పాటు డా. రాళ్ళబండి కవితాప్రసాద్ ఉద్యోగించారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరక్టరుగా ఉంటూ ఇక్కడికి డెప్యుటేషన్‌పై వచ్చి మళ్ళీ స్వస్థానానికి చేరి 2016లో ఆకస్మిక మరణం పొందారు. ఆ తర్వాత డా. చిలకాటి విజయరాఘవాచారి కార్యదర్శిగా రెండేళ్ళు పని చేశారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగరం, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రయాగ రామకృష్ణ (ఆకాశవాణి వార్తావిభాగం) ఒక సంవత్సర కాలం కార్యదర్శిగా చేసి తర్వాత ప్రచురణల విభాగంలో కొంతకాలం వుండి విరమించుకున్నారు. ప్రస్తుతం హేమంత్ కుమార్ ఈ విభాగం పనిభారంలో కార్యదర్శి రమాప్రసాద్ గారికి సహకరిస్తున్నారు. డా. అప్పజోడు వెంకట సుబ్బయ్య, మాడుగుల నాగఫణిశర్మ, యం.వి. శాస్త్రి ఇందులో లోగడ వ్యవహరించారు.

అన్నమాచార్య ప్రాజెక్టు:

పి.వి.ఆర్.కె. ప్రసాద్ 1980లలో ప్రారంభించిన ఈ సంస్థ తొలి డైరక్టరుగా కామిశెట్టి శ్రీనివాసులు నియమించబడ్డారు. ఈయన శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, గోవిందరాజు కళాశాలలో తెలుగు అధ్యాపకులు. వీరి తర్వాత సుప్రసిద్ధ సహస్రావధాని డా.  మేడసాని మోహన్ 2017 వరకు డైరక్టరుగా ఉన్నారు. వీరు ఇద్దరూ తమ సర్వీసు కాలంలోనే ఈ పదవి నధిష్టించారు. 2018 చివరలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ఆచార్యులు డా. భమిడిపాటి విశ్వనాథ్ ఈ పదవిలో నియమితులయ్యారు.

ప్రాచ్యకళాశాల:

దేవస్థానం అనుబంధ సంస్థ అయిన వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ప్రిన్సిపాల్‌గా, అధ్యాపకులుగా ఎందరో పండితులు పనిచేశారు. వారిలో సుదర్శన శర్మ, సముద్రాల నాగయ్య, కె.ఎస్.ఆర్.దత్త, డి. నాగసిద్ధారెడ్డి, గౌరిపెద్దిసుబ్బరామశర్మ వంటివారు ప్రముఖులు.

ఆర్ట్స్ కళాశాల:

దేవస్థానం ఆర్ట్స్ కళాశాలలో ఎందరో పండితులు, మేధావులు సేవ చేశారు. సింగరాజు సచ్చిదానందం, ముట్నూరి సంగమేశం, ధర్మయ్య పేర్కొనదగినవారు.

ప్రాచ్యపరిశోధనా సంస్థ:

శతాబ్దికి పైగా చరిత్ర గల ఈ సంస్థ పది సంవత్సరాల ముందు వరకు దేవస్థానం పాలనలో నడిచింది. ఇప్పుడు అది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ. దేవస్థానం పాలనాకాలంలో మానవల్లి రామకృష్ణ కవి, వేటూరి ప్రభాకరశాస్త్రి, శంకరనారాయణ, ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, డా. కె. శ్రీధరబాబు, కె.జె.కృష్ణమూర్తి డైరక్టర్లుగా వ్యవహరించారు. అనేక తాళపత్ర గ్రంథాలు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. వీరు ప్రతి ఏటా ఒక జర్నల్ ప్రచురిస్తారు. ఇందులో ముదినేడు ప్రభాకరరావు మంచి పరిశోధకులు. ఇందులో పని చేసిన ఒక డైరక్టరు తర్వాతి కాలంలో సన్యసించారు.

ఆచార్య రఘునాథాచార్య:

ప్రత్యేకంగా ప్రశంసార్హులైన వ్యక్తులలో వీరొకరు. వీరు కొంతకాలం ప్రచురణల విబాగంలో సంపాదకులుగా పనిచేశారు. ఆపైన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్-ఛాన్స్‌లర్ అయ్యారు. కొంతకాలం తర్వాత కాలధర్మం చేశారు.

శ్వేత:

శ్రీ వేంకటేశ్వర శిక్షణాకేంద్రం డైరక్టరుగా ఐదారు సంవత్సరాల పాటు భూమన్ సుబ్రహ్మణ్యరెడ్ది (భూమన్) పనిచేశారు. ఈ సంస్థ డైరక్టరుగా రామకృష్ణ, ఆంజనేయులు పనిచేశారు. ప్రస్తుతం నందివెలుగు ముక్తేశ్వరరావు డైరక్టరు. ఈ కార్యాలయంలో ఆకెళ్ళ విభీషణ శర్మ చక్కని పండితులు.

సప్తగిరి:

సప్తగిరి మాసపత్రిక తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీషు భాషలలో ప్రచురింపబడుతోంది. 50 సంవత్సరాలు ఈ పడే పూర్తి చేసుకుంది. తొలి రోజుల్లో కాట్రపాటి సుబ్బారావు ఎడిటర్. తర్వాత రామమూర్తి, సి. శైలకుమార్ ఈ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రాధారమణ ప్రధాన సంపాదకులు. అల్లాడి సంధ్య పరిశోధకురాలు. ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన రావుల సూర్యనారాయణమూర్తి మంచి రచయిత.

వేద విశ్వవిద్యాలయం:

దేవస్థానం ప్రోత్సహించిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ ఏ.పి.వి.యన్. శర్మ కార్యనిర్వహణాధికారిగా ఉండగా మొలకెత్తింది. దాని తొలి వైస్-ఛాన్స్‌లర్ శ్రీ యస్. సుదర్శనశర్మ. రెండు పర్యాయాలు ఆరేళ్ళు వీరు ఆ పదవిలో ఉండి తిరిగి 2017లో  మూడో దఫా నియుక్తులయ్యారు.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులుగా పనిచేసిన ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు సనాతన ధార్మిక విజ్ఞాన విభాగానికి ప్రత్యేకాధికారి. మంచి పరిశోధకులు.

డా. కె.వి. రాఘవాచారి శ్రీ వేంకటేశ్వర వాఙ్మయ ప్రాజెక్టులో పనిచేశారు. గత రెండేళ్ళుగా పదవీ విరమణ అనంతరం డా. మేడసాని మోహన్ శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి. ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు హరివంశ పరిష్కరణ ప్రాజెక్టులో కొంతకాలం వున్నారు.  భారత పరిష్కరనణలకు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గౌరవ సంపాదకులు.

దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా గత 15 సంవత్సరాలుగా పి.ఆనందతీర్థాచార్య వున్నారు. ఆయన నైష్ఠికుడు. ఈ విధంగా శ్రీనివాసుని భువన విజయ సభా భవనంలో ఎందరో అష్టదిగ్గజ కవుల వలె రాణించారు. స్వామి సేవ వారి పురాకృత సుకృతం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here