తిరుమలేశుని సన్నిధిలో… -6

0
13

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

యస్.వి. దృశ్య శ్రవణం ప్రాజెక్టు

శ్రీ వెంకటేశ్వర దృశ్య శ్రవణ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా మే 11న 2005లో శ్వేత భవనంలోని క్రింది అంతస్తులో చేరాను. అక్కడ నా వద్ద ఒక సూపరిండెంట్ (సత్యసాయి భక్తుడు), ఒక సీనియర్ అసిస్టెంట్, మరో ఐరుమంది పరివారం ఉన్నారు. ప్రధానంగా ఇందులో రెండు విభాగాలు – (1)  దృశ్య శ్రవణ విభాగం (2) యస్.వి. రికార్డింగ్ విభాగం.

దృశ్య శ్రవణ విభాగంలో ఆడియో, వీడియో క్యాసెట్ల అమ్మజం జరుగుతుంది. వివిధ తిరుమల బ్యాంకులు మా వద్ద సి.డి.లు, వి.సి.డి.లు అరువుకు తీసుకుని, వాటి అమ్మకాలను మూడు నెలలకొకసారి జమ చేసేవారు. తిరుమల ఆలయం లోపల కూడా విమాన వెంకటేశ్వర స్వామికి నమస్కరించే స్థలం పక్కనే ఒక సి.డి. అమ్మకం కౌంటర్ వుండేది. దాని స్టాక్ రిజిస్టరు రోజూ సూపరిండెంట్, నేను పరిశీలించేవాళ్లం. నగదు రూపంలో వసూళ్ళను బ్యాంకులో జమ చేసేవారు.

యం.యస్. సుబ్బులక్ష్మి చేత పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి హయాంలో నాకు ముందున్న కామిశెట్టి శ్రీనివాసులు పర్యవేక్షణలో సుప్రభాతాది సి.డి.లు. రికార్డు చేశారు. ఆమె తన రాయల్టీని స్వామికే అర్పణ చేసింది. మదరాసు లోని ఒక ప్రసిద్ధ ఆడియో కంపెనీ ఆ సి.డి.లను అమ్మకానికి తీసుకెళ్ళి వాటి మీద రావల్సిన మొత్తం రెండు మూడేళ్ళుగా జమ చేయలేదు. నేను మదరాసు వెళ్ళి వాళ్ళ రీజినల్ మేనేజర్‌తో మాట్లాడి లక్షలాది రూపాయలు జమ చేయించాను. తర్వాత బ్రహ్మోత్సవాల వి.సి.డి.లు కూడా తయారు చేయించాము. అవి బాగా అమ్ముడుపోయాయి. వివిధ ఉత్సవాల వి.సి.డి.లు కూడా రథసప్తమి వంటివి బాగా ప్రచారంలోకి వచ్చాయి.

రికార్డింగు ప్రాజెక్టు:

నేను 2005 – 2008 మధ్యకాలంలో మూడేళ్ళు ఈ దృశ్య శ్రవణ ప్రాజెక్టులో పని చేశాను. 2007లో దృశ్య శ్రవణ ప్రాజెక్టును రెండుగా విభజించారు. రికార్డింగు ప్రాజెక్టుకు మిత్రులు కామిశెట్టి శ్రీనివాసులు అధిపతిగా వచ్చారు. దృశ్య శ్రవణ విభాగం నాది. వున్న సిబ్బందిని ఇద్దరం చెరి సగం పంచుకొన్నాం. సూపరిండెంట్ రెండిటికీ ఒకరే. వేణుగోపాలరావు అనే సాత్వికుడు సీనియర్ అసిస్టెంట్‍గా వచ్చాడు. మొదటి రెండేళ్ళలో నేను 800 అన్నమయ్య సంకీర్తనలు స్వరరచన చేయించి వివిధ గాయనీ గాయకులచే రికార్డింగ్ చేయించాను. బాలకృష్ణ ప్రసాద్, రంగనాథ్, నాగేశ్వర నాయుడు వంటి ఆస్థాన కళాకారులతో బాటు నిత్య సంతోషిని, శోభారాజు వంటి ప్రసిద్ధ గాయకుల చేత రికార్డులు చేయించి విడుదల చేశాము.

వేదాల రికార్డింగు:

రికార్డింగ్ యూనిట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో రెండు స్టూడియో గదులలో నా పర్యవేక్షణలో నడిచేది. అక్కడ వేదాలు కొన్ని వందల గంటలు రికార్దు చేసి సి.డి.లు విడుదల చేశాము. అంతరించిపోతున్న వేద సంపదను అలా పరిరక్షించగలిగాము. వేద నాదామృతం పేర – ఋగ్వేదం – జటలోని ఒకటి నుండి నాలుగు అష్టకాలను ఆరు ఎం.పి.3లో యస్. దామోదర భట్టు, జి.కె. రామమూర్తి ఘనాపాఠీలచే రికార్డు చేసి విడుదల చేశాము.

ఆడియో రికార్డింగులు మచ్చుకు కొన్ని –

  1. అన్నమయ్య సంకీర్తనా ప్రసాదం – గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
  2. అన్నమయ్య సంకీర్తనా బృందావనం – గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్
  3. అన్నమయ్య సంకీర్తనా మాధుర్యం – ప్రియా సిస్టర్స్
  4. అన్నమయ్య పంచామృతం – ప్రియా సిస్టర్స్
  5. అన్నమయ్య సంకీర్తనా సామగానం – వేదవ్యాస ఆనంద భట్టర్

వి.సి.డి.ల విడుదల:

తిరుమల బ్రహ్మోత్సవాలకు తోడు తిరుమలలో జరిగే వివిధ ఉత్సవాల వి.సి.డి.లు బహుళ ప్రచారం పొందాయి. ఉదాహరణకు వసంతోత్సవాలు, పారువేట ఉత్సవం, రామకృష్ణ తీర్థ ముక్కోటి, సప్తగిరులలో పుణ్యతీర్థాలు, పుష్పయాగం, పవిత్రోత్సవం, జ్యేష్ఠాభిషేకం, పుష్పపల్లకి, తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశి, అద్భుత శాంతి యజ్ఞం ప్రధానాలు. రథసప్తమి, పరిణయోత్సవం స్పెషల్.

పరిసర ఆలయాలకు సంబంధించి – తిరుచానూరులో వైభవంగా కార్తీక బ్రహ్మోత్సవాలు, పంచమి తీర్థం, తిరుపతిలో కోదండ రామస్వామి కళ్యాణోత్సవం, తెప్పోత్సవాలు, బ్రహ్మోత్సవాలు బహుళ ప్రజాదరణ పొందాయి.

ఇవి గాక వంగల పట్టాభి భాగవతార్‌చే హరికథలు, విన్నకోట రమాకుమారి భాగవతారిణిచే సీతారామ కళ్యాణం హరికథ వి.సి.డి.లుగా బాగా అమ్ముడుపోయాయి. బెంగుళూరుకు చెందిన ఒక సంస్థ వారిచే శ్రీనివాస కళ్యాణం – యానిమేషన్ ఫిల్మ్ ఇంగ్లీషులోనూ, తెలుగులోను అద్భుతంగా వి.సి.డి. విడుదల చేయించాం. ఆయా ఉత్సవాలలో ప్రముఖల చేత ఇవి విడుదల చేయబడ్డాయి. ఈ విధంగా దృశ్య శ్రవణ ప్రాజెక్టులో గణనీయమైన కృషి జరిగినా, కొన్ని మానవ కల్పిత అవరోధాల వల్ల పూర్తి న్యాయం జరగలేదు.

తొలి కమ్యూనిటీ యఫ్.ఎం. రేడియో:

నా సహచర  మిత్రుడు డా. ఆర్. శ్రీధర్ మద్రాసులోని అన్నా విశ్వవిద్యాలయంలో తొలి కమ్యూనిటీ రేడియోను ప్రారంభించాడు. ఆయన నేను రేడియోలో పని చేశాం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వారు 2003-2004లో కమ్యూనిటీ రేడియో వ్యవస్థను ప్రకటించారు. విద్యాసంస్థలు, సామాజిక సేవా సంస్థలు వీటి కోసం లైసెన్సు పొందవచ్చు. 15 కిలోమీటర్ల దూరానికి ఆ ప్రసారాలు అందుతాయి.

2006లో అప్పటి కార్యనిర్వహణాధికారి శ్రీ. ఏ.పి.వి.యన్. శర్మకు ఈ పథకం వివరించి అతి పురాతన యస్.వి. ప్రాచ్యకళాశాల పక్షాన ఒక కమ్యూనిటీ రేడియో స్థాపనకు కృషి చేశాను. తిరుమలపై ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక కాటేజీని అలాట్ చేయించుకొని ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ రామయ్య ద్వారా ఢిల్లీకి దరఖాస్తు పంపాము. నేను ఢిల్లీకి వెళ్ళి సమాచార మంత్రిత్వ శాఖలో నా పరిచయాలు వాడుకొని కొంత ముందుకు జరిగాము. రామయ్య, నేను ఢిల్లీకెళ్లి సమాచార మంత్రిత్వశాఖతో ఒప్పందంపై సంతకాలు చేసి వచ్చాము.

యఫ్.యం ఫ్రీక్వెన్సీ అలాట్ చేసేది టెలీకామ్ కమ్యూనికేషన్ శాఖలోని వైర్‌లెస్ విభాగం. దానికి రక్షణ శాఖ అనుమతి అవసరం. అది సంపాదించాము. 101.3 ఫ్రీక్వెన్సీ మంజూరు చేశారు. 2007లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్ది చేతుల మీదుగా కమ్యూనిటీ రేడియో ప్రారంభించబడింది.

కార్యక్రమ రూపకల్పన:

కేవలం సాయంకాలం మూడు గంటల వ్యవధి గల ప్రసారాలు రూపొందించాడు. 100 watt శక్తివంతమైన ట్రాన్స్‌మిటర్‌ను బెంగుళూరులోని బి.ఇ.ఎల్. (భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్) వద్ద కొనుగోలు చేసి నెలకొల్పాము. దాని సి.యం.డి. శాస్త్రి వెంకటేశ్వరుని భక్తులు. ఆయన బాగా సహకరించారు. నేను కొన్ని ప్రవచనాలు రికార్డు చేశాను. సముద్రాల లక్ష్మయ్య వంటి పెద్దల రికార్డింగులు చేశాము. కళాశాల ప్రిన్సిపాల్‌గా అప్పటికి రామయ్య రిటైరయ్యారు.

ఒక ఇంజనీర్‌ని దీనికి ఇన్‌ఛార్జిగా పెట్టారు.

తిరుమల కొండ మీద ప్రసారాలు సరిగా వినిపించకపోవడంతో తిరుపతిలోని ప్రాచ్యకళాశాల భవనంలోని తొలి అంతస్తులోకి 2009లో రేడియో కేంద్రం మార్చబడింది. కళాశాల యాజమాన్యం నుండి దానిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది తొలి కమ్యూనిటీ రేడియో. ఆ తర్వాత భీమవరం ఇంజనీరింగ్ కళాశాల తదితర ప్రదేశాలలో, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఈ రేడియోలు వచ్చాయి. వెంకటేశ్వరస్వామికి ఒక రేడియో కేంద్రం చేయడంలో నేనూ భాగస్వామినయ్యాను.

యస్.వి.బి.సి:

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (యస్.వి.బి.సి.) ఒక అద్భుత కల్పన. 2007 మే లో కె.వి.రమణాచారి తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా వచ్చారు. భూమన కరుణాకరరెడ్డి బోర్డు అధ్యక్షులు. వీరిద్దరి మానసపుత్రికయే భక్తి ఛానల్. బోర్డు ఆమోదం లభించింది. 2007 జూన్ నెలలో దృశ్య శ్రవణ ప్రాజెక్టు అధికారిగా బోర్డు తీర్మానాన్ని అనుసరించి మూడు కోట్ల మూలధనంతో ఛానల్ సంస్థను దేవస్థానానికి అనుబంధంగా కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరు చేశాం. బోర్డు అధ్యక్షులు, విజయసాయిరెడ్డి, ఈవో, యఫ్.ఏ.సి.ఏ.ఓ డైరక్టరులుగా ఛానల్ బోర్డు ఏర్పడింది. కృత్యాద్యవస్థ మొదలైంది.

లైసెన్స్ మంజూరుకు కావలసిన హంగులు సమకూర్చుకునే ప్రయత్నం మొదలైంది. అప్ లింక్ సౌకర్యం కోసం ఇస్రో లోని మాధవన్ నాయర్‌ని బెంగుళూరులో కలిశాను. రిలయన్స్ వారు రెండు జతల కేబుళ్ళు ఉచితంగా స్వామివారి సేవకు యివ్వడానికి అంగీకరించారు. ప్రసార మంత్రిత్వ శాఖ వారు లైసెన్సు మంజూరు చేసే దశలో చిన్న అవాంతరం వచ్చింది. దానిని తొలగించడానికి నేను ఢిల్లీ వెళ్ళి ప్రయత్నం చేశాను. వివిధ శాఖల అధికారులు ఎందరో సహకరించారు. 2008 బ్రహ్మోత్సవాల నాటికి ప్రసారాలు మొదలెట్టాలని రమణాచారి అభిప్రాయపడ్డారు.

ఛానల్ ఏర్పాటుకు అలిపిరి గెస్ట్‌హౌస్ భవనాలు కేటాయించారు. ప్రసార బారతి సి.ఇ.ఓ.గా పదవీ విరమణ చేసిన కె.యన్. శర్మ ఈ ఛానల్ సి.ఇ.ఓ.గా బాధ్యతలు చేపట్టారు. యంత్ర పరికరాలు, స్టూడియోలు, సిబ్బంది నియామకం శరవేగంతో మొదలయ్యాయి. 2008 లో నేను యస్.వి.బి.సి.లోకి మారాను. మూడేళ్ళ పాటు వేతనం నయాపైసా కూడా తీసుకోకుండా పనిచేయడం స్వామి కైంకర్యంలో భాగమే.

తిరుమలలో సమావేశమందిరాన్ని యస్.వి.బి.సి. స్టూడియో నిర్మాణానికి కేటాయించారు. హైదరాబాదులో మన టి.వి. స్టూడియో వారి స్టూడియోలు అద్దెకు తీసుకున్నారు. అన్ని స్థాయిలలో అధికార బలగం చేకూరి కార్యక్రమాల రికార్డింగు తీవ్రస్థాయిలో చేశారు. నేను కోఆర్డినేటర్‍గా వ్యవహరించాను. స్వామి దయావిశేషం వల్ల 2008 బ్రహ్మోత్సవాలకు ముందే జూలై 7న అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ తిరుమల ఆలయ సందర్శనకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించారు.

శుభం భూయాత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here