తిరుమలేశుని సన్నిధిలో… -8

1
13

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

వివిధ ప్రాజెక్టులు:

‘శ్వేత’ బిల్డింగ్‌లో ప్రస్తుతం 2017 నుంచి మొదటి రెండు అంతస్తులలో దాదాపు అన్ని దేవస్థానం ప్రోగ్రాం ప్రాజెక్టులను ఒక గొడుగు క్రిందకి తెచ్చారు. జేఈఓగా లోగడ పనిచేసి రిటైర్ అయిన నందివెలుగు ముక్తేశ్వరరావు ఈ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిగా రెండేళ్లు వ్యవహరించారు. లోగడ పరిపాలనా భవనంలో, ప్రెస్ కాంపౌండ్‍లో, వివిధ ప్రాంతాలలో బయట వున్న అన్ని ప్రాజెక్టులను ఈ భవనంలోకి మార్చారు. ఒక్కొక్క ప్రాజెక్టు వివరాలలోకి వెళ్దాం.

దాస సాహిత్య ప్రాజెక్టు:

పి.వి.ఆర్.కె. ప్రసాద్ కార్యనిర్వహణాధికారిగా వున్న సమయంలో అనేక ప్రాజెక్టులను దూరదృష్టితో మార్గదర్శనం చేశారు. అప్పట్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఒకటే వుండేది. ప్రసాద్ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రారంభించారు. ఇవి రెండూ పెద్ద ప్రాజెక్టులు. అవిగాక పురందర దాస కీర్తనలు ప్రచారం చేయడానికి దాస సాహిత్య ప్రాజెక్టు సంకల్పించారు. వాగ్గేయకారులైన కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నడ హరిదాసుల తత్వాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసే ఉద్దేశంతో ఆరంభించారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల కాలంలోని బృహత్తర సందేశాన్ని సామాన్య ప్రజలకు సాధారణ కన్నడ భాషలలో అందించడానికి కీర్తనలు రచించారు. శ్రీనివాసుని ఘనతను కీర్తించడానికి ఎన్నో వేల కీర్తనలు వ్రాశారు. అట్టివారిలో పురందరదాసు, కనకదాసు, విజయ దాసు, శ్రీపాదరాజు, వ్యాసరాజు, వాదిరాజు, గోపాలదాసు, జగన్నాథ దాసాది భక్త కవులు ద్వైత సిద్ధాంతానికి చెందిన మధ్వాచార్యుల బోధనలను అందించడానికి దాదాపు 400మంది సంకీర్తనాచార్యులు కృషి చేశారు.

దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా కర్ణాటక హరిదాసుల బోధనలు, ఆధ్యాత్మిక తత్వము, నీతి సూత్రాలను ప్రత్యేకించి శ్రీ వేంకటేశ్వరుని భక్తి తత్వాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వారు ప్రచురణలు, ఆడియో క్యాసెట్లు, ప్రదర్శనలు, మెట్లోత్సవాలు, మత సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రాజెక్టు విడుదల చేసిన ప్రచురణలివి:

  • బాలసాహిత్యం శీర్షికలో కర్ణాటక హరిదాసుల సంక్షిప్త జీవిత చరిత్రలు
  • వివిధ భాషలలో జీవిత చరిత్రలు, వ్యాస సంకలనాలు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు యక్షగానాలు ఏర్పాటు చేశారు.
  • స్వరపరిచిన హరిదాస కీర్తనల ద్వారా ప్రచారం.
  • సహస్ర దీపాలంకార సేవ కార్యక్రమంలో తిరుమలలో ప్రతిరోజు సాయంకాలం ఒక గాయకుడు/గాయని ఒక కీర్తన పాడే వ్యవస్థ.
  • సృష్టి రహస్యం, దేవతలు, ఓంకారం, కేశవ వంటి చిరు గ్రంధాలు.
  • ఇతర వాగ్గేయకారులతో కన్నడ హరిదాసుల కీర్తనలు సమీక్ష అధ్యయనం.
  • అరుదైన హరిదాస రచనల ప్రచురణ.

(నేను రికార్డింగ్ ప్రాజెక్టులో సమన్వయకర్తగా పురందరదాసు కీర్తనల ఆడియో క్యాసెట్లు ఎక్కువ సంఖ్యలో 2005 -2007 మధ్య విడుదల చేశాను).

ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం హరిదాసుల ఆరాధన ఉత్సవాల నిర్వహణ. ఆ సందర్భంగా ప్రవచనాలు హరికథలు, సంగీత కచేరీలు, భజనలు ఏర్పాటు చేసి జయంతులు/వర్ధంతులు జరుపుతారు.

మెట్లోత్సవం ద్వారా వందలాది మంది భక్త బృందాలను వివిధ రాష్ట్రాల నుండి రప్పించి అలిపిరి మెట్ల మార్గం ద్వారా భజనలు చేసుకుంటూ తిరుమల చేరుస్తారు. దాస సాహిత్య సెమినార్లలో దేశం నలుమూలల నుండి విచ్చేసిన పండితులు పత్రసమర్పణ చేస్తారు. దాసోత్సవాలు ప్రత్యేకంగా జరుపుతారు. ఈ కార్యక్రమాల రూపకల్పనకు ప్రత్యేకించి కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన ఒక సలహా సంఘాన్ని పండితులతో ఏర్పాటు చేశారు. స్థానిక ఆరాధన కమిటీలు, భజన బృందాలు ఈ ప్రాజెక్టు కింద రిజిస్టర్ చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు తదితర ఉత్సవాలలో ఈ బృందాలు తిరువీధులలో నృత్యాలు చేస్తూ ఆనందం కలిగిస్తారు. భజన మండళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ‘హరే శ్రీనివాస’ అని పలకరించుకుంటారు.

ఈ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా ఏడెనిమిది సంవత్సరాలు అప్పలాచార్య పనిచేశారు. 2006లో శ్రీ ఏ.పి.వి.ఎన్ శర్మ కాలంలో ప్రత్యేకాధికారిగా శ్రీ ఆనంద తీర్థాచార్యులు నియమింపబడ్డారు. సాధారణంగా దేవస్థానంలో ప్రాజెక్టులకు విశ్రాంత ఉద్యోగులు నియమింపబడతారు కానీ ఆనంద తీర్థాచార్యులు యాభై ఏళ్లు నిండకుండానే నియమింపబడ్డారు. వీరి తండ్రిగారు రామమూర్తి కర్నూలులో అత్యంత ప్రసిద్ధ పండితులు. ఆనంద తీర్థ నైష్ఠికపరులు. బావి నీళ్ళ స్నానం మాత్రమే చేస్తారు. అందువల్ల తాను అద్దెకు తీసుకునే ఇంట్లో తప్పనిసరిగా బావి వుండేలా ఎంచుకుంటారు. వీరికి విశేష శిష్య బృందం వుంది. వారంతా పూజ్య భావంతో వీరికి పాద నమస్కారాలు చేస్తారు. కన్నడ దేశంలో విశేషంగా ఈ సంస్థ కార్యకలాపాలు విస్తరించబడ్డాయి. హరే శ్రీనివాస!

ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు:

తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1991లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీ వైష్ణవ మత సిద్ధాంతాలకు చెందిన పన్నిద్దరు అళ్వారుల జీవితాలు గ్రంథాలను ప్రచారం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆచార్య పురుషులైన ఆ మహనీయుల తత్వాన్ని సామాన్యులకు తెలియజేయడం ప్రధాన లక్ష్యం. సంకీర్తనాచార్యులు నాలాయిర దివ్య ప్రబంధకర్త బోధించిన మధుర భక్తి శరణాగతి తత్వాన్ని ప్రచారం చేయడం గత మూడు దశాబ్దాలుగా ఘనంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా వీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

శ్రీ వైష్ణవ మతాచార్యులైన శ్రీరామానుజుల దివ్య బోధనలు లోకానికి అందించడం ఈ ప్రాజెక్టు ప్రధానంగా స్వీకరించింది. ఆయన దక్షిణ దేశమంతా విస్తృతంగా పర్యటించి నాలుగువేల పాశురాలను, నాలాయిర దివ్య ప్రబంధం ప్రచారం చేశారు. ఇందులో శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ 206 పాశురాలను తొమ్మిది మంది ఆళ్వారులు, గోదాదేవి (ఆండాళ్) రచించారు. తిరుప్పావై పాశురాలను ధనుర్మాసంలో (డిసెంబర్ 16 నుండి జనవరి 25 వరకు) వ్యాఖ్యానంతో ప్రవచనాల రూపంలో యావద్భారత దేశంలో ప్రచారం చేస్తారు.

ఆనందనిలయంలో ధనుర్మాస సందర్భంగా స్వామివారికి సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు (నెలరోజులు). శ్రీ రామానుజులు వివిధ ఆలయాలలో సంప్రదాయాలను కట్టుదిట్టం చేశారు. అందులో దివ్యప్రబంధ గానానికి నిత్య కైంకర్యాలలో ప్రాధాన్యం కల్పించారు. తిరుమలలో జరిగే నిత్య పూజలకు, సంప్రదాయాలకు కూడా రామానుజాచార్యులు ఒక ఒరవడి సృష్టించారు. అది నేటికీ పాటించబడుతుంది.

తిరుమలలోనూ ఇతర ఆలయాలలోను జరిగే ఉత్సవాలలో వాహనాలకు ముందు ‘అధ్యాపక గోష్టి’ పేరుతో శ్రీశ్రీ పెద్ద జీయర్ స్వాముల వారి ఆధ్వర్యంలో ఈ దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. క్రీ.శ. 6, క్రీ.శ. 8వ శతాబ్దాల నాటి ఆళ్వార్లు శ్రీ మహా విష్ణువు యొక్క వివిధ ఆయుధాలు, సేవకుల అవతారాలుగా భావిస్తారు.

శ్రీకృష్ణదేవరాయల పేర ఉత్సవాలను కూడా ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. వైష్ణవ సంప్రదాయానికి చెందిన వివిధ ఆచార్యుల అవతార ఉత్సవాలు కూడా జరుపుతారు. వీటిని తిరు నక్షత్రాలని పిలుస్తారు. ఈ సంస్థ పక్షాన వచ్చిన ప్రచురణలు: తమిళంలో భగవత్ రామానుజార్య, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, శ్రీ ఆండాల్, చక్రత్తళ్వార్ జీవిత చరిత్రలు, శ్రీవైష్ణవ సంప్రదాయాలను గూర్చి, ఆళ్వార్లనుగూర్చి తెలుగు ఇంగ్లీషు భాషలలో కూడా చిరు గ్రంథాలు వెలువరించారు.

శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి వాఙ్మయ పీఠం:

తెలుగు సాహిత్య విమర్శకులలో వేటూరి ప్రభాకర శాస్త్రి అగ్రగణ్యులు. అన్నమాచార్య సంకీర్తనలను వెలుగులోకి తెచ్చి ప్రచురణ కార్యక్రమాన్ని దేవస్థానం పక్షాన మొదలు పెట్టించిన పండితుడు ఆయన. వారి కుమారులు ఆచార్య వేటూరి ఆనందమూర్తి ప్రోద్బలంతో దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ కె.వి.రమణాచారి వున్న కాలంలో 2007లో ఈ వాఙ్మయ పీఠాన్ని నెలకొల్పారు.

ఈ పీఠం ఆధ్వర్యంలో వేటూరి వారి స్వంత గ్రంథాలయాన్ని శ్వేత భవనంలోని గ్రంథాలయానికి తరలించడం, వారి అముద్రిత రచనలు ప్రచురించడం, సెమినార్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. జయంతి, వర్ధంతులు జరిపారు. 2008 ఫిబ్రవరి 9న వారి 120వ జయంతి సందర్భంగా తిరుపతిలో ‘శ్వేత’ భవనానికి ఎదురుగా వేటూరి శిలావిగ్రహాన్ని ఆవిష్కరించి రెండు గ్రంథాలు వెలువరించారు. సుగ్రీవ విజయం పరిష్కరణ కూడా ప్రచురించారు. ఈ ప్రాజెక్టుకు కొంతకాలం డాక్టర్ పమిడికాల్వ చెంచు సుబ్బయ్య ప్రత్యేక ఆధికారిగా ఉన్నారు.

మాతృశ్రీ వెంగమాంబ ప్రాజెక్టు:

భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ శ్రీ వేంకటేశ్వరుని మహత్యాన్ని రచించింది. ఎన్నో కీర్తనలు కూడా వ్రాసింది. వెంగమాంబ రచనలపై పరిశోధన చేసిన డా.కృష్ణమూర్తి డైరెక్టర్‌గా 2007 మే లో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. వెంగమాంబ కీర్తనలను రికార్డింగు ప్రాజెక్టు ద్వారా క్యాసెట్లు విడుదల చేశాను (2007). ఆరు సీడీలు, ఆరు గ్రంథాలు వెలువడ్డాయి. శ్రావణ శుద్ధ నవమి నాడు ఏటా ఆమె వర్ధంతి జరుపుతారు. తిరుమలలో వెంగమాంబ సమాధి ఆధునికీకరించారు. తరిగొండలో ఉత్సవాలు జరుపుతారు. ఎమ్.ఆర్.పల్లి  కూడలిలో 2007 ఆగస్టులో వెంగమాంబ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ప్రాజెక్టు పర్యవేక్షణలో సారంగపాణి పదాలకు కూడా కల్పించారు.

పురాణ ఇతిహాస వాఙ్మయ ప్రాజెక్టు:

సముద్రాల లక్ష్మణయ్య ప్రత్యేకాధికారిగా ఈ ప్రాజెక్టు నడుస్తోంది. అష్టాదశ పురాణాలను తెలుగు వ్యాఖ్యానంతో ప్రచురించడం, సంస్కృత రామాయణం, సంస్కృత భాగవతం వివరణాత్మకంగా అందించడం జరుగుతోంది. 55 మంది పండితులు 18 పురాణాలలోని దాదాపు 3లక్షల 70వేల శ్లోకాలకు వ్యాఖ్యానాలు తయారవుతున్నాయి.

శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు:

డాక్టర్ మేడసాని మోహన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పక్షాన అన్నమయ్య సంకీర్తనలకు సరళ వ్యాఖ్యానం తయారవుతోంది. డాక్టర్ జి.దామోదర నాయుడు ఆధ్వర్యంలో సనాతన ధార్మిక విజ్ఞాన విభాగం విద్యార్థులకు ధర్మ ప్రబోధ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇలా స్వామివారి కైంకర్యంలో మరెన్నో. అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు క్రిందకు 2016 జనవరిలో తీసుకువచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here