తోబుట్టువు

0
17

[మాయా ఏంజిలో రచించిన ‘Kin (for Bailey)’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(తనకంటే ఒక సంవత్సరం పెద్దవాడైన సోదరుడు బెయిలీని ఉద్దేశించి మాయా రాసిన నోస్టాల్జిక్ కవిత ఇది. తోబుట్టువుల నడుమ ఉండే సాన్నిహిత్యం, బాల్య స్మృతుల తలపోత, కొంత విషాదపు ఛాయ ఇందులో కనిపిస్తాయి. తిరిగి ఆ కమ్మని కాలం చూడగలమనే ఆశావహ భావంతో కవిత ముగుస్తుంది.)

~

[dropcap]అం[/dropcap]తకు మునుపెన్నడో మనం
రక్తసంబంధపు ఒంటరి వలయాలలో చిక్కుకొని ఉన్నాం
మొదటి మంచు కురిసింది
బురదతో కూడిన నదుల ముందర
మేఘాలు వాన విత్తులు చల్లాయి
అప్పట్లో ఆచ్చాదన లేని అడవుల్లో
పురుషులు నగ్నంగా పరుగిడేవారు
నీలపు నలుపు రంగు చర్మంతో
ఈవ్, లిలిత్
షీబా వెచ్చని కౌగిట్లోకి చేరేవారు
నేను.. నీ చెల్లెలిని

అపరిచితులను అచ్చంగా
సోదరుల మూసలోనికి
మార్చేందుకు నన్ను వదిలిపెట్టావు
వాళ్ళు చెల్లించాల్సిన పన్నులు
పెట్టాల్సిన ఖర్చులు
ఎన్నడూ చెల్లించలేదు

నువు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు
విధ్వంసంలో పుట్టుక బీజం ఉండి ఉంటుంది
నువు చావడానికే పోరాడావు

దక్షిణ అడవుల్లో
మనం నడచిన నిశ్శబ్దపు నడకలు
నాకింకా గుర్తున్నాయి
మితి మీరిన ఆసక్తి గలిగిన
పెద్దల పెద్ద చెవుల నుంచి కాపాడుకోవడానికి
మంద్రస్వరాలతో మనం చేసిన
సుదీర్ఘ మంతనాలు బాగా గుర్తున్నాయి

నువు చెప్పింది నిజమై ఉండొచ్చు
బీభత్స భయానక ప్రాంతాల నుండి
నెత్తుటి అరుపుల నేలల నుండి
నువు నెమ్మదిగా తిరిగి రావడం
నా హృదయాన్ని వేదనతో పరుగులెత్తించింది
……………………………………
నాకిప్పుడు
మళ్ళీ చిన్నపిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి
‘ఆర్కాన్సాస్’ మసక వెలుగులో
మెరిసే మిణుగురులు చేస్తున్న
చిరు చిరు పేలుళ్ళు వింటున్నాను నేను!!

~

  1. ‘బెయిలీ’- మాయా అన్నయ్య
  2. ‘ఆర్కాన్సాస్’ – మాయా తన బాల్యంలో సోదరునితో కలిసి నివసించిన ఊరు.

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


ప్రపంచమంతటికీ సుపరిచితమైన కవయిత్రి మాయా ఏంజిలో. నిర్భీతి సాహసాలతో కలిసిన దాపరికం లేని తన ఆత్మకథలతో చదువరులను నివ్వెరపరిచిందామె.

నల్లజాతి వారి సహజ సౌందర్యం, చెప్పిందే చేసి, చేసిందే చెప్పే మాయా నిజాయితీ, నిక్కచ్చితనం ఆనాటి సమాజాన్ని ఎంతగానో అకట్టుకున్నాయి. తన రచనలు, ప్రసంగాలు, థియేటర్ ప్రదర్శనలతో గొప్ప వైవిధ్యం ప్రదర్శించి సొసైటీని ఉత్తేజపరిచిందామె. 20వ శతాబ్దపు నల్లజాతి మహిళలు తమను తాము విశ్లేషించుకునేలా ఒక బలమైన లోచూపునిచ్చింది.

కవయిత్రిగా, గాయనిగా, నటిగా, డాన్సర్‌గా, ఎడ్యుకేటర్‌గా, దర్శకురాలిగా, పౌరహక్కుల ఉద్యమకారిణిగా, జీవితాన్ని పలు కోణాలనుంచి దర్శించిన మాయా ఇలా ఎన్నో విషయాలు విలువలు ఉద్బోధించేది:

  1. మీతో మీరు సత్యంగా ఋజువర్తనులై ఉండండి.విభిన్నంగా ఆలోచించేందుకు వెనుకాడకండి.
  2. మీ మాటలు, చేతలు ఇతరులను ఉత్తేజపరిచేలాగా ఉండాలి.
  3. మీ దయనీయ గాథని, అనుభవాలతో సహా పంచుకొండి. అది ఇతరులలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రోది చేస్తుంది.
  4. ఎవరికీ తెలియని ఓ విషాద గాథను నీలోనే దాచుకోవడం కంటే గొప్ప బాధ ఇంకేమీ లేదు.

మాయా రాసిన ‘I know why the caged bird sings’ పుస్తకం 2 సంవత్సరాలు best seller గా నిలిచింది.

ఒక ప్రతిష్ఠాత్మక film కి స్క్రీన్ ప్లే రాసిన మొట్టమొదటి నల్లజాతి మహిళ మాయా.

మాయా తను చేసిన spoken word albums కొరకు 1993, 1995, 2002 సంవత్సరాలలో 3 Grammy awards తీసుకొంది. National Medal of Arts -2000 సంవత్సరంలో Bill Clinton ద్వారా అందుకొంది.

2010లో – Presidential Medal of Freedom Award ప్రెసిడెంట్ ఒబామా చేతుల మీదుగా స్వీకరించింది.

ఇంకా అనేకానేక అవార్డులను అందుకున్న మాయా వలన ఆ అవార్డులకే విలువ పెరిగింది.

“You Can’t Use Up Creativity, the More You Use the More You Have” – అని తరచుగా చెబుతుండే మాయా కొన్ని తరాలను తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఉత్తేజితం చేసింది అని చెప్పక తప్పదు.

గమనిక:

అద్భుతమైన, అత్యంత పరిణతితో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన కవయిత్రి మాయా ఏంజిలో. ఆమె మనోవీధుల్లో సంచరించి తన హృదయ భావ శకలాలను ఏరుకొని అనువదించుకొని ఆనందించే అవకాశం నాకిచ్చిన ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి కృతజ్ఞతలు. ‘సంచిక’ టీమ్ సభ్యులు శ్రీ కల్లూరి సోమ శంకర్ గారికి ధన్యవాదాలు.

మాయా ఏంజిలో 50వ కవితతో ఈ అనువాద పరంపర ముగుస్తున్నది. ఇక ముందు ఇతర కవుల కవిత్వానువాదాలు మీ ముందుంటాయి. – హిమజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here