తోడు నీడ

0
11

[శ్రీ కె. వి. శాస్త్రి రచించిన ‘తోడు నీడ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“శా[/dropcap]రదా! నేను చేసిన ఈ పనిని నీవు మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నావా!” అన్నాడు అనీల్.

“మీకెందుకు ఆ అనుమానమొచ్చింది. నా గురించి మీకు తెలుసు కదా! నాకు పూర్తిగా నచ్చితే కానీ, మీకు సపోర్టు చేయనుకదా! మీరు అనవసరంగా ఎటువంటి ఆలోచనలు చేయవద్దు.

మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. అనవసరమైన ఆలోచనలు వదలి ప్రశాంతంగా వుండేందుకు ప్రయత్నించండి.

మన ఇల్లు ఓ ప్రశాంతి నిలయం. చిన్న చిన్న కలతలు మామూలుగా వస్తూంటాయి” అంది.

“ఇలాంటి ముళ్లు ప్రతి ఇంటిలోనూ వుంటాయి కదూ!” అన్నాడు అనీల్.

“ఉంటాయి. మొదట్లో వాడిగా వుండి కొద్దిరోజులకు మొద్దుబారి మనకు రక్షణగా వుంటుంది. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోండి. మన పిల్లలు మన వాళ్ళు. వారు ఎలాంటి పొరపాట్లు చేసినా క్షమించడం మన ధర్మం. వాళ్ళు మనల్ని కాదని వెళ్ళిపోయినా వేరే కాపురం పెట్టినా, మనల్ని చూడటానికి రాకపోయినా! మనకన్యాయం చేశారని వాళ్ళతో వీళ్ళతో చెప్పకున్నా! లేక మనకు ఎదురుగా చెప్పినా! మీరు పట్టించుకోవద్దు. మీరు ఎలాంటి ఆందోళనలు లేకుండా వుండండి” అంటూ భర్త చెంపల్ని ఆర్తిగా రాస్తూ అంది శారద.

అనీల్ హృదయానికి సంబంధించిన చిన్న వ్యాధితో హాస్పిటల్లో చేరాడు. చిన్న ఆపరేషన్ జరిగింది. ఎవరికీ చెప్పలేదు. అంత సీరియస్ కేస్ కానందువల్ల.

విషయం తెలిసినా కొడుకు గానీ, కూతురు గానీ రాలేదు. ఫోన్‌లో వివరాలు కనుక్కొన్నారు. మేము రావాలా అమ్మా అని వాళ్ళు అడగలేదు. మీరు ఒకసారి వచ్చిపోతే బాగుండు అని శారద కూడా చెప్పలేదు. ధైర్యంగా ఉంది. అన్నీ ఎంతో నిబద్ధతతో చేస్తూంది.

శారద కళ్ళలోకి పరిశీలనగా చూసి ఆమె చేతుల్ని తన గుండెల కానించుకొంటూ “శారదా! నాకో వరం ఇస్తావా!” అన్నాడు.

“మన పిల్లలు మనల్ని వదలిపోయినా, ఆస్తిపాస్తులు ఆవిరై, ఈ లోకమే నన్ను వెలివేసినా.. నువ్వు నువ్వు మాత్రం నన్ను వదలివెళ్ళవని మాటిస్తావా?” అని చిన్న పిల్లాడిలా ఆమె ఎదలో మొహం దాచుకొన్నాడు.

‘ఎంత మగవాడైనా ఒక్కోసారి ఎంత బేలగా ఏమీ చేతగాని వాడిలా ప్రవర్తిస్తారు’ అనుకొని చలించిపోయింది అనీల్ మాటలకు.

“ఛ! ఛ! మీరిలా మాట్లాడకూడదు. ఒక చావు తప్ప మనల్ని ఎవరూ వేరు చేయరు, చేయలేరు అయినా! ఇప్పుడు మీకేమయింది. మీరు హాయిగా ఉన్నారు. మనం ఇద్దరం ఎలాంటి కలతలు లేకుండా వుంటాం. ఇది నిజం” అని అతన్ని గుండెలకు హత్తుకుంటూ చెప్పింది శారద.

ఇద్దరి కళ్ళూ వర్షించాయి.

కొన్ని క్షణాల తరువాత “శారదా! మనం మన పిల్లలకి పూర్తిగా న్యాయం చేసామా?” అన్నాడు.

“చాలా! ఏ తల్లీ తండ్రీ చేసి వుండరు మనం చేసినంత” అంది శారద దృఢంగా!

తృప్తిగా ఆమె ముఖంలోకి చూశాడు.

ఆదివారం ఉదయం 11 గంటలవుతోంది. వేరింటి కాపురం పెట్టిన అనీల్ కొడుకు అజిత్, కోడలు చరిత, అదే వూర్లోనే ఉన్న కూతురు అనూష, అల్లుడు అర్జున్ వాళ్ళకు అనీల్ ఫోన్ చేయడం వల్ల వచ్చారు.

ఎందుకంత అర్జెంటుగా రమ్మన్నారు అంటూ వచ్చీరాగానే అడిగారు విసుగ్గా.

ఇక ఆలస్యం చేకుండా అనీల్ అందరితో “నేను హఠాత్తుగా మిమ్మల్ని పిలిచింది మేము తీసుకున్న నిర్ణయాన్ని మీకు తెలియజేయడానికి. ఇది మీకెంత వరకు నచ్చుతుందో తెలియదు, అయినా మా ఇద్దరికీ నచ్చింది. మీకు తెలియజేయడం మా బాధ్యత అని చెబుతున్నాము. ఇక అసలు విషయం. ఈ ఇంటిని ఓ వృద్ధాశ్రమంగా మార్చాలని అనుకొంటున్నాము. ఎక్కువమంది లేరు, ఓ పదిమందికి మాత్రమే. అనాథ వృద్ధులు. కొడుకులుండీ నిర్దయంగా ఇంటినుండీ తరిమివేయబడ్డ నిరాకశ్రయులు. హాయిగా వాళ్ళ శేష జీవితాన్ని గడపాలని. వృద్ధాశ్రమం అంటే వాళ్ళతో బాటు మేము కలిసి వుంటామన్న మాట. అందరూ ఎవరికి చేతనైన పనిని వాళ్ళు చేయవచ్చు. వాళ్ళు సొంత ఇల్లులాగా దర్జాగా వుండవచ్చు. అందరూ హక్కుదారులే ఈ ఇంటిలో. ఎవరికి కావాల్సినవి వాళ్లు వండుకోవచ్చు లేదా వండి అందరికీ పెట్టవచ్చు. ఇది మేము తీసుకున్న నిర్ణయం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఇది నా స్వార్జితం. దీనిమీద సర్వహక్కులు నాకుంటాయి. ఇక మిగతా డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీల వల్ల మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చూడు అజిత్, మనం ఈ మధ్య కొన్న ఫ్లాట్ నీ పేరే రాశాను. నీవు దానిలోనైనా ఉండవచ్చు. లేదా కిరాయికి ఇచ్చుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక అనూషకు ఇప్పటికే అన్నీ ఇచ్చేశాను. ఫ్లాట్, కారు వగైరాలు.

ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. ఓపికున్నంతవరకు మేము ఈ ఆశ్రమాన్ని నడుపుతాము. తరువాత ఆశ్రమమే మాకు సేవచేస్తుంది. ఇది మా ప్లాన్. ఇది మీకు చెప్పాలనే పిలిచాను” అని చెప్పడం ముగించాడు అనీల్.

ఆశ్చర్యంతోనూ, ఆవేశంతోను బిగుసుకుపోయారు అజిత్, అనూషలు.

కోట్లు విలువచేసే ఇంటిని కన్న బిడ్డలకి కాకుండా ఆశ్రమం చేస్తున్నందుకు వాళ్ళకు పిచ్చివాళ్ళులాగా కనిపించారు.

వాళ్ళు చేసిన పని వాళ్ళిద్దరికీ ఏమాత్రం నచ్చలేదని వాళ్ళ ప్రవర్తన తెలుపుతోంది. “మీకేమయినా పిచ్చా? డాడీ! ఈ వయసులో హాయిగా ఆస్తినంతా అమ్మేసి మా వద్ద వుండవచ్చు కదా! మా కన్నా మీకు ఈ అనాథలే ఎక్కువయ్యారా!

మేముండగానే మీరిలా అనాథ ఆశ్రమంలో ఉండడం మీకు బాగుందా? ఎవరైనా ఏమనుకొంటారు. మీకు ఆ జ్ఞానం వుండాలి కదా” అన్న అజిత్ మాటలకు మధ్యలోనే అడ్డొస్తూ “ఎవరైనా ఏమనుకొంటారని బాధపడుతున్నారా? ఇప్పుడు మాత్రం మేము ఎలా వున్నాము. మాకు అనాథలకు తేడా ఏమిటి? వాళ్ళు ఎవరూ లేని అనాథలు. మేము అందరూ ఉండి అనాథలం” అన్నాడు అనీల్.

“మరీ అంత ఎమోషనల్గా మాట్లాడకండి డాడీ! మా పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా? మేము ఎప్పుడూ బిజీగా వుంటాము. మాకు మా పని కూడా ముఖ్యమే కదా?”

“నిజమే! కాదనను. అయితే మిమ్మల్నే నమ్ముకుని ఉన్న మా గతేమిటి. మీ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం మాకవసరం లేదు. అప్పుడప్పుడు వచ్చి పలకరించి పోతే చాలు అని ప్రతివారం ఎదురు చూస్తుంటాము. కనీసం ఫోన్ చేయలేనంత బిజీనా? పోనీ మేము చేస్తే మీటింగ్‌లో ఉన్నామనో, మరలా చేస్తామనో ఫోన్ కట్ చేస్తారు. మాకు విసుగొచ్చింది. మాకంటూ ఓ వ్యాపకం ఉండాలిగా, మమ్ము మేము మరచిపోయేందుకు. అందుకని మాలా బాధపడుతున్నవారికి తోడుగా ఉండాలనుకొంటున్నాము ఇది మా నిర్ణయం.

ఓపికున్నంత వరకు మేము ఈ ఆశ్రమానికి సేవ చేస్తాము. తరువాత ఈ ఆశ్రమమే మాకు సేవ చేస్తుంది. ఇది మీకు చెప్పాలనే మిమ్మల్ని పిలిపించాను.”

బిగుసుకుపోయారు అజిత్, అనూషలు.

వాళ్లు ఇంకా తేరుకోకుండానే శారద పని కుర్రాడిని పిల్చి ఏదో చెప్పింది.

రెండు నిమిషాల తరువాత పని కుర్రాడు వెంటబెట్టుకొచ్చిన వ్యక్తిని చూసి నిజంగా మూర్ఛ వచ్చినంత పని అయ్యింది అందరికీ.

ఆమె నీరజ. కొడుకు, కోడలు తరిమేసిన అర్జున్ తల్లి. సాక్షాత్తు అనూషకు అత్తగారు. ఇప్పుడామె రోగిష్టిగా లేదు. ఆరోగ్యంగా మంచి చీరలో హాయిగా వుంది. ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత.

“ఈవిడ మా ఆశ్రమం మొదటి మెంబరు. చూశారుగా! పాపం మీకు వీకెండ్‌లో బోలెడు పనులుంటాయి. చెయ్యాలనుకొంటే భోజనం చేసి వెళ్ళవచ్చు” అంది శారద.

మంత్రదండంతో శిలలుగా చేసిన వారిలా అయ్యారు నలుగురూ.

“ఇక మీరు వెళ్ళండమ్మా” అన్నారు అనీల్ నీరజగారితో.

ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఒక్కసారైనా కొడుకు అర్జున్‌ని కానీ, కోడలు అనూషను కానీ చూడలేదు. అసలు గమనించనట్టే ప్రవర్తించింది.

“అమ్మా! ఈ ఫర్నీచర్, మంచాలు ఎక్కడ వేయాలి” అన్న ఫర్నీచర్ షాపతన్ని చూసి అనీల్ శారద వెళ్ళిపోయారు.

మిగిలిన రెండు జంటలు ఇంకా శిలాప్రతిమల్లా అలాగే నిల్చుండిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here