తోడు – నీడ

1
12

[dropcap]పి[/dropcap]ల్లలందరు వాకిట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే వింటూ చాలా రోజుల తమ ఇంట్లో అందర్ని ఒకే దగ్గర కళ్ళార చూసుకొంటున్నానన్న ఆనందం లక్ష్మమ్మ మొహంలో కదలాడుతున్నది.

అటుగా వచ్చిన చిన్నకూతురు పద్మ తల్లినే చూస్తూ ఆమె మొహంలోని సంతోషాన్ని పసిగట్టి “ఏమైందమ్మా అందరిని అలా చూస్తున్నావు?” అంటు దగ్గరకు వస్తుంది.

“ఎన్నో రోజులైంది కదమ్మా మీరందరు ఇలా మనింటికి వచ్చి, అందరిని ఇలా చూస్తుంటే సంబరం కలుగదా మరి?” అంటున్న తల్లితో, “ఇలా అందరం రావటంతో పిల్లలతో సందడిగా వుంది కదా” అంటూ ఎప్పుడూ ఏవో పనులని, పిల్లలకు ట్యూషన్లని, సెలవుల్లేవని చెప్పే పిల్లలు తల్లి పోరు పడలేక అందరు అనుకొని దసరా సెలవులకు అమ్మా నాన్నల దగ్గరకు రావటం మంచిదైంది, అమ్మ సంతోషంగా ఉంది అనుకుంటుంది.

లక్ష్మమ్మ, రామయ్య దంపతులకు సంతానం ఇద్దరు ఆడపిల్లలు విజయ, పద్మ, కొడుకు మురళి. అందరికి పెళ్ళిల్లయి పిల్లలతో హాయిగా ఎక్కడి వాళ్ళక్కడ ఉద్యోగాలు చేసుకొంటు బతుకుతున్నారు. ప్రతి పండక్కి తమ దగ్గరకు రమ్మంటుంది లక్ష్మమ్మ. అలా రావటం వీలుపడక ఎవరికి వీలైనప్పుడు వారొచ్చి వెళ్తుంటారు. కాని ఈ పండక్కి అందరు అనుకొని రావడంతో ఇల్లంతా పిల్లలతో సందడిగా కళకళలాడుతోంది. అందరు రావటంతో లక్ష్మమ్మకు చేతినిండా పనితో అలసిపోయినా ఆమె మొహంలో వెలకట్టలేని ఆనందం కనపడుతోంది.

తల్లికి చిన్న చిన్న పనుల్లో సాయం చేసినట్టే చేస్తున్నారు. కాని పట్టుమని పది నిమిషాలలో పిల్లలు పిలవడంతో వెళ్ళిపోతున్నారు. పిల్లల అవసరాలు, అక్కా చెల్లెళ్ళ ముచ్చట్లతో సరిపోతున్నాయి. అయ్యో అమ్మ ఒక్కతే చేస్తుంది అనుకోవడం, ఎవరో ఒకరు స్నేహితులో, బంధువులో వచ్చి పలకరించటంతో ముచ్చట్లతో మునిగిపోవడం చేస్తున్నారు. కూతుళ్ళతో పాటు కోడలు. అందుకే ఎవరినీ ఏమీ అనకుండా తన పని తాను చేసుకొంటూపోతూనే వుంది. అరమరికలు లేని కుటుంబంగా హాయిగా గడిచిపోతుంది.

ఈసారి పండగ చాలా సంతోషంగా గడిచిపోయిందనుకుంటు బ్యాగులు సర్దుకుంటున్నారు. పది రోజులు పది నిమిషాల్లా గడిచిపోయినవి. పిల్లలందరు ఒకచోట చేరడం అందరికి నచ్చింది. అంతకంటే ఎక్కువ అమ్మమ్మ ఇల్లు చుట్టు చెట్లు, ఆటలాడుకునేంత ఖాళీ జాగా, పట్టణాలలో వున్నట్లు అన్ని వసతులున్న ఇల్లు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పట్టణానికి తీసిపోని ఇండ్లతో ప్రశాంత వాతావరణంతో మనసుకు నచ్చినట్లు ఇండ్లను మార్చుకొంటున్నారు. అయినా చిన్ననాటి స్నేహితులు కలవడంతో ముచ్చట్లు తమ పిల్లల్లో పెరిగిన ఆత్మీయ భావంతో అందరి మనసులు తేలికైనవి. ఎవరికి ఎవరు తెలియని పట్టణ జీవితానికి పల్లెలోని పలుకరింపులకు తేడాను గమనించిన పిల్లలు మళ్ళీ పండక్కి అందరం ఇక్కడికే వద్దామంటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వాళ్ళు మాటలు వింటూ, సంతోషాన్ని గమనిస్తూ పనిచేసుకుంటున్న లక్ష్మమ్మ హఠాత్తుగా పడిపోవడంతో పిల్లలందరు పరుగెత్తుకుంటు వచ్చి ‘అమ్మమ్మ పడిపోయిందం’టూ చెప్పడంతో తమ పనులాపేసి తల్లి దగ్గరకు వస్తూ ఏమైందంటూ అందరు తల్లి చుట్టు చేరి సపర్యలు చేస్తు కలగాపులంగా మాట్లాడుతున్నారు.

చెబితే వినదు. రెస్ట్ తీసుకొమ్మంటే ఏదో ఒక పని చేస్తూనే వుంటుంది. ఈ పది రోజులేగా పని. మీరందరు ఎక్కడివాళ్ళక్కడా వెళ్ళితే నాకేం పనంటు తమను పని చేయనివ్వలేదంటు బాధపడుతూ, పనులెక్కువయ్యాయి, బాగా అలసిపోయింది. అసలేమైన తిన్నదో లేదో అందుకే పడిపోయిందేమో అనుకుంటు తల్లి మొహం చల్లటి నీళ్ళతో తుడుస్తున్నారు. కొంచెం తేరుకుంటున్న లక్ష్మమ్మకు పిల్లల మాటలు లీలగా వినబడుతున్నాయి. వారి మాటలు వింటున్న అమె మనసులో ఒక విచిత్ర భావన కలిగింది. ఆలోచిస్తే ఏముంది అందరు తన పిల్లలే. చేసేది ఒక వంటే. వారి ఇష్టాయిష్టాలను గుర్తుపెట్టుకొని చేసి పెట్టడంలోనే పని ఎక్కువైంది.

నాలుగు రోజులు వచ్చి వెళ్ళే పిల్లలకు పని ఏమి చెప్పాలి అనుకుంటుంది. అప్పటికి ఆయన అంటూనే వున్నాడు ఆరోగ్యం జాగ్రత్తంటు. తన చేతితో చేసి పెడితే తృప్తి అని. అతనికి బజారు పనులు, తనకు ఇంటిపనులు తప్పవు. వారికి ఏ పని తగలకుండా చెయ్యటంతో వచ్చిన అలసట ఇది. అయినా ఈమధ్య నీరసంగా ఉంటోంది. ఉండదా మరి? అరవైకి దగ్గర పడుతున్నా ఏ పని చేయాలన్న కొంచే ఆలోచించాల్సి వస్తుంది. అయినా తప్పదు, చేయాలి. మూలకున్న ముసలమ్మను ఏదో ఒక చేతనైన పని చేయాల్సిందే. ఆడవాళ్ళు కూర్చుని తింటే ఎవరు ఓర్చుకోలేరు. చేతనైన పని చేయవచ్చుగా అంటారు. మగవాళ్ళకు పని చెప్పాలంటే ఆలోచిస్తారు.

తన పిల్లలంటే దూరంగా వున్నారు కాని, ఉద్యోగం చేసే పిల్లలు ఇంటి నుండి వెళ్ళిన తరువాత ఇంట్లో ఎన్ని పనులుంటాయో! పాపం పక్కింటి పార్వతమ్మ బాధ చూస్తే తెలుస్తుంది. పిల్లలు చిందర వందరగా పడేసిన వస్తువులు కోడలు వంటచేసి బాక్సుల్లో పెట్టుకోవడంతో సరిపోతుంది. అవన్ని శుభ్రం చేసి బయట పడేసే వరకు ఆమెకు పనే కాని ఎవరూ ఆమెది ఒక పనిగా లెక్కపెట్టరు. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఏం చేస్తుంది పక్కోళ్ళతో ముచ్చట్లు లేక టి.వి. చూస్తుంది అంటారట. ఆరోగ్యం బాగా లేదందనుకో చెబితే వినదు. పనులన్నీ చేస్తూ చేతకాదంటావు అంటూ ఇంటిల్లిపాది అనే మాటలకు తలవంచాల్సిందే. నా పని అంతే.

ఇంట్లో పని మనుషులున్నా చేసే పని తప్పటం లేదన్నాననుకో ఈ పనులన్ని నిన్నెవరు చేయమన్నారంటు ఒక్కొక్కరి కోపం తారాస్థాయికి చేరుతుంది. అందుకే ఎవరికి చెప్పి ప్రయోజనం లేదనుకుని పిల్లలుంటే పది రోజులేగా పని అనుకొని తన పని తాను చేస్తూ పోతే ఆరోగ్యం ఈ స్థితికి వచ్చిందనుకుంటు మగతగా ఆలోచిస్తున్న లక్ష్మమ్మ బి.పి. లెవల్ పెరిగిందంటు, భయపడాల్సిందేమీ లేదు, విశ్రాంతిగా వుండాలంటు డాక్టర్ చెప్పే మాటలు వినపడుతున్నాయి. కాని కళ్ళు తెరచి చూడలేక అలా ఉండిపోయింది.

పల్లెటూరు కదా! పార్వతమ్మ పడిపోయిందని తెలియగానే బిలబిలమంటు చుట్టుపక్కల వాళ్ళు ఆమె చుట్టు చేరారు. పక్కింటి పార్వతమ్మ, పనిమనిషి సరోజ పిల్లలతో మాట్లాడుతూ, “అమ్మా మీరొచ్చిన కాన్నుండి గింత కూసున్నది లేదు మీ అమ్మకు. పనులు తీరక ఒక్కతే తిప్పలు పడుతుంటే, నీ బిడ్డలున్నారు కదమ్మా, వాళ్ళను చేయమంటేందమ్మా” అంటే “వాళ్ళొచ్చేదే ఈ పండుగ రోజులప్పుడు. చాలా రోజులకు అందరు కలుసుకున్నారు. ఏ పని లేకుండ ఇప్పుడైనా వాళ్ళను హాయిగా ఉండనివ్వు నేను చేసుకుంటా కదా! ఐనా నువ్వున్నాక నాకేం పని” అనేది కాని ఒక్కరికి పని చెప్పకపోయె. మీరున్నారని లేసి తిరుగుతాంది కాని అన్ని పనులను నేను, సారే చేసేటోళ్ళం. అలసిపోయిందేమో కండ్లు తిరిగినయి కావచ్చు. కొంచెమేమన్న తాగియ్యరాదుండ్లి అంటు సరోజ చదివే దండకంతో-

“ఊర్కో సరోజ మేమేమన్నా చేయమన్నామా? ఏం చేద్దామన్నా మీరొద్దమ్మ అంటూ అన్ని పనులు తనమీదే వేసుకున్నది. మేమేం జేయాలం”టూ బిడ్డలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు.

వాళ్ళను ఓదార్చుతూ పార్వతమ్మ నాకంటే పిల్లలు ఎటోల్లటు పోయినంక ఇల్లు సర్దుకునుడుతోనే సరిపోతది. మీ అమ్మ నన్ను చూసే బాధపడేది. మీరొచ్చినంక ఏదో ఒకటి చేసి పెట్టాలన్న ఆరాటం. అయినా చెట్లకు నీళ్ళు పోస్తూనో, నాతో మాట్లాడుతూనో వుండేది. ఈ మధ్య పనులేం లేవు కదా! వంటే కదా నేను చేసేది అంటుంది కాని వంటే ఆమె కొంప ముంచిందంటున్న పార్వతమ్మతో, మేం చేస్తామంటే అసలు వింటూనే లేదంటు బాధపడుతున్నారు విజయ, పద్మ. ఏదో తప్పు చేసిన దానిలా తలవంచుకు కూచున్నది కోడలు సుమిత్ర.

వచ్చిపోయే వాళ్ళను పిలుస్తూ కడుపు నిండ మాట్లాడుతది. ఎందుకిట్లయిందో అంటు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు.

అయినా ఈ ఒక్కరోజు వుంటే ఇంకా రెండు రోజులు పిల్లలు నాకోసం వుంటారు. ఆ తరువాత షరా మామూలే. ఎవరి పనులు వాళ్ళకున్నవి. అందరు వెళ్ళిపోతారు. ఎప్పటిలా మిగిలేది ఇద్దరమే అనుకొంటుంది. ఐనా తనకేమన్న ఐతే వచ్చేందుకు పిల్లలు ఈ దేశంలోనే అందుబాటులో ఉన్నారు కాని దేశం కాని దేశాలలో వున్న పిల్లల తల్లిదండ్రుల గతేమిటో అనుకుంటూ బాధపడుతున్న లక్ష్మమ్మ కనుకొలికుల్లోంచి నీరు జారడం చూసిన పిల్లలు అమ్మా అమ్మా అంటూ కుదుపుతూ నీకేం కాలేదు. కొంచెం కళ్ళు తిరిగాయంతే అంటున్న ఆమె మాటలు వినబడుతూ వున్నాయి.

ఆమెకు విశ్రాంతి కావాలి. ఎవరో ఒకరు ఆమె దగ్గర ఉండండి. మిగతావాళ్ళు బయటకు వెళ్ళమన్న డాక్టర్ సలహాతో అందరు బయటకు వెళ్ళినా ఆమె చేతిని ముట్టుకొని ఎప్పటినుండో అలాగే కూర్చున్న భార్య ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్న ఆరాటంతో దిగులుగా కూర్చుండిపోయాడు రామయ్య.

ఒక్కనాడు పల్లెత్తు మాట అనకుండ, చెప్పిన దానికి గంగిరెద్దులా తల ఊపుతూ తానే సర్వస్వం అనుకుంటూ బతికిన తన భార్య అలా అచేతనంగా పడి ఉండడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎంత జ్వరం వచ్చినా లేచి పనులు చేసుకుంటూనే ఉంటుంది. ఆమె ఒక్కపూట మంచంలో పడుకుంటేనే ఇలా వుంది. తనకేమి కావద్దు భగవంతుడా! కాపాడమంటూ కనపడని దేవున్ని వేడుకుంటున్న అతని కన్నుల్లోంచి కారే నీరు అతని చేతుల్లోనే వున్న ఆమె చేతులపై పడుతున్నాయి. అతన్ని ఓదార్చలేని అశక్తత డాక్టరిచ్చిన మందు పనిచేస్తుందేమో నిద్రలోకి జారుకుంది లక్ష్మమ్మ.

అయ్యో ఎంత పొరపాటు చేశాను. పిల్లలతో ఇల్లు కళకళలాడుతుంటే సంతోషంగా తన పని తాను చేసుకుంటు మానసికంగా ఆలోచనలు లేకుండ ఉందనుకున్నాను. ఈమధ్య ఎక్కువ పనిచేయలేకపోతుంది అని తెలిసే అన్ని పనుల్లో నేనో, సరోజో సహకరిస్తున్నా, తన ఆరోగ్యాన్ని మరిచి హాయిగా ఉండటంతో పట్టించుకోలేదు. పిల్లల్ని మందలించినా బాగుండు. ఐనా వాళ్ళు ఏదైనా చేస్తామన్నా చేయనివ్వక, ఇంత దూరం తెచ్చుకొంది అనుకొంటూ తనలో తాను బాధపడుతూ భార్య నుదిటిపై చేయివేసి ఆలోచిస్తున్నాడు రామయ్య.

బయట కూర్చున్న పిల్లల కన్నీళ్ళు తుడుస్తూ పార్వతమ్మ ఏం లేదు లేమ్మ భయపడకండి అంటూ వాళ్ళకు ధైర్యం చెబుతూ, ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు ఆమె దగ్గర ఉంటే బాగుంటుంది. మీ సెలవులు అయిపోకపోతే అమ్మ కోలుకున్నాక వెళ్ళండి. ఆ మాటలతో ఆలోచిస్తూ ఇప్పుడు వాళ్ళకు మన తోడు అవసరం ఉంటుంది విజయ. అక్కా నేను సుమీత్రను, పిల్లలను ఇక్కడే పది రోజుల వరకు వుంచుతానంటున్న తమ్ముని మాటలతో ఏకీభవిస్తూ అమ్మ కోలుకునే వరకు ఎవరో ఒకరం ఇక్కడే వుందామంటు నిర్ణయించుకుంటారు.

ఇల్లు సర్దుకోవాలని వెల్దామనుకున్నవాళ్ళందరు ఇంకా రెండు రోజులు సెలవులున్నాయి కనుక అందరం ఇక్కడే వుందామనుకుంటున్న పెద్దలు తీసుకున్న నిర్ణయం పిల్లలకు సంతోషాన్నిచ్చింది. అమ్మ బాగా కోలుకున్నాక మార్పు కొరకు వాళ్ళను మన దగ్గరికి తీసుకుళదాం అంటూ తల్లి పరిస్థితి చూడటానికి లోనికి వెళ్ళగా, దిగులుగా కూర్చున్న తండ్రితో తమ నిర్ణయం చెప్పడంతో సంతోషపడతాడు రామయ్య.

అలసిన శరీరం విశ్రాంతి కోరుకుంటునట్టు రెండు రోజులు మూసిన కన్ను తెరవక డాక్టర్ల పర్యవేక్షణలో కోలుకున్న లక్ష్మమ్మకు తన చుట్టూ తనకోసం, తన మాటకోసం తపిస్తున్న పిల్లల్ని చూడగానే మనసుప్పొంగి ఆనంద బాష్పాలు రాలుతుంటే దగ్గరకు రమ్మని చాచి చేయిని పట్టుకొని బావురుమన్న పిల్లలను ఓదార్చడం తన వంతైంది. అమ్మ ఎట్లుందో అన్న బెంగ తీరిన పిల్లల ముఖాల్లో సంతోషం, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు రామయ్య. రెండు రోజుల నుండి స్తబ్దుగా వున్న ఇంటిలో పిల్లల కేరింతలతో ముగిసిన దసరా సంబరాలు ఆ యింట మళ్ళీ వెళ్ళివిరిసాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here