తోకలేని పిట్ట

0
13

[అక్టోబర్ 9 – ప్రపంచ తపాలా దినత్సవం సందర్భంగా ‘తోకలేని పిట్ట’ అనే రచనని అందిస్తున్నారు కె. హరి మధుసూదన రావు.]

[dropcap]దే[/dropcap]శ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికుని కబురు అందుకున్న తల్లిదండ్రుల ఆనందం, ఉద్యోగ నిమిత్తం వేరువేరు చోట్ల ఉంటున్న భార్యాభర్తల వియోగబాధ, చదివిన దాన్నే ఎన్నిసార్లు చదివినా తనివితీరని ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమలేఖలను మోసుకొచ్చే పోస్ట్ మ్యాన్ కోసం గుమ్మం వద్దే వేచి చూస్తూ ఉన్న రోజులు మళ్ళీ రావు. పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చే జాబులను చదువు రాని గ్రామీణులు అతని చేతనే చదివించుకొని శుభవార్తలకు ఆనందం పట్టలేక పోవడం, అశుభవార్త విని గట్టిగా ఏడ్వడం వంటివి నేడు దూరమయ్యాయి. రాశాను ప్రేమలేఖలెన్నో- దాచాను ఆశలన్ని నీలో, ఇదే నా మొదటి ప్రేమలేఖ – రాశాను నీకు చెప్పలేక, శుభలేఖ రాసుకున్నా యెదలో ఎపుడో అంటూ ఎందరో సినీ కవులకు కవితా వస్తువయిన ఉత్తరం ఆధునిక టెక్నాలజీ నేపధ్యంలో కొంత దూరమైనా దాని తీపి గుర్తులను నేడు జ్ఞాపకం చేసుకుందాం.

ఉత్తరం పుట్టుక:

కాళిదాసు మేఘసందేశం కావ్యంలో యక్షుని వియోగ బాధను తన ప్రేయసికి తెలుపుటకు సహాయపడిన మేఘుడితో ఉత్తరం పుట్టుక కావ్యాలలో ప్రారంభమైంది. పూర్వం రాజులు సందేశ వాహకులు, గూఢచారుల చేత మాత్రమే కాకుండా పావురాల ద్వారా కూడా సందేశం పంపుకునేవారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ గుర్రాల ద్వారా సమాచారాన్ని పంపే పద్ధతిని ప్రవేశ పెట్టాడు. షేర్షా కాలంలో దీనికోసం ప్రత్యేకంగా సింధూ నుండీ ఢాకా వరకూ ఒక వ్యవస్థని నెలకొల్పాడు. ప్రపంచంలో మొదటి పోస్ట్ ఆఫీస్ 1712లో స్కాట్లాండ్ లోని శాంక్ హర్‌లో ప్రారంభమైంది. భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ 1727 లో ఉత్తరాలు పంపే పద్దతిని ప్రవేశ పెట్టారు. మొదటి పోస్టాఫీసు 1774 లో కలకత్తా లో ప్రారంభమైంది.

స్ఫూర్తి:

స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీజీ ప్రముఖ నాయకులకు వ్రాసిన ఉత్తరాలు ఎంతో స్ఫూర్తిని అందిస్తాయి. ఒక తండ్రి తన కూతురికి వ్రాసిన ఉత్తరాలే అయినా నెహ్రూ ఇందిరకు వ్రాసిన ఉత్తరాలు భారతదేశ భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్లు చూపెడతాయి.

పిన్ కోడ్:

సులభంగా త్వరగా ఉత్తరాలు గమ్యస్థానాలకు చేరడానికి 1972 ఆగస్టు 15వ తేదీన పిన్ కోడ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. పిన్ కోడ్‌లో ఆరు అంకెలు ఉంటాయి. మొదటి అంకె రీజియన్ లేదా జోన్‌ని రెండవ అంకె సబ్ రీజియన్ లేదా సబ్ జోన్‌ని మూడవ అంకె జిల్లాను చివరి మూడు అంకెలు డెలివరీ పోస్టాఫీసుని సూచిస్తుంది. దేశంలో మొత్తం 9 పిన్ కోడ్ జోన్‌లు ఉన్నాయి.

స్టాంపుల గురించి:

కవర్ పోస్ట్ చేయాలంటే పోస్టేజ్ స్టాంప్ అతికియ్యాల్సిందే. మొదటి పోస్టల్ స్టాంప్‌ని సర్ రోనాల్డ్ హిల్ 1840లో మే 1 వ తేదీన ఒక పెన్నీ ధరతో విక్టోరియా రాణి చిత్రంతో బ్రిటన్‌లో రూపొందించాడు. భారతదేశంలో బ్రిటీష్ ప్రభుత్వం 1901 లో ఫిబ్రవరి 1వ తేదీన మొదటి పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేశారు. స్వాతంత్రానంతరం 1947లో నవంబర్ 21వ తేదీన భారతదేశ జెండా క్రింద జైహింద్ నినాదంతో మొదటి స్టాంప్‌ని ముద్రించారు. గాంధీ బొమ్మ మీద 80 కి పైగా దేశాలలో స్టాంపులను విడుదల చేశారు.

స్టాంపులలో రకాలు:

  1. స్మారక స్టాంపులు: ఒక ప్రసిద్ద వ్యక్రి, సంఘటన గుర్తు చేసుకోవటం కోసం విడుదల చేసేవి. వీటిని ఒకసారి మాత్రమే ముద్రిస్తారు.
  2. డెఫినిటిఫ్ స్టాంపులు: ఇవి రెగ్యులర్ స్టాంపులు
  3. సర్వీస్ స్టాంపులు: ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉపయోగించేవి.
  4. సి.ఆర్.ఎఫ్. (CRF) స్టాంపులు: సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంపులు పరీక్షల కోసం ఉపయోగించేవి.
  5. మింట్ స్టాంపులు: లోహంతో చేసిన ఈ స్టాంపులను రద్దు చేశారు.
  6. ఫిలాటెలీ స్టాంపులు: స్టాంప్ కలెక్షన్ అభిరుచి కలిగిన వారికోసం ముద్రించే స్టాంపులు. వీటికోసం ఫిలా టెలీ అకౌంట్‌ని హెడ్ పోస్టాఫీసులో ఓపెన్ చేసుకోవాలి. అలా చేసిన వారితో 200 రూపాయలు కట్టించుకొని 150 రూపాయలకు స్టాంపులను ఇస్తారు. విదేశీ స్టాంపులు కావాలంటే వెయ్యి రూపాయలు కట్టాలి. ఫిలాటెలీ స్టాంపులు విడుదలైనప్పుడు వారికి తెలియజేస్తారు.
  7. మై స్టాంపులు: పోస్టాఫీసులో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా వారి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రుల ఫోటో, పేరుతో ప్రత్యేకంగా కొంత రుసుముతో ముద్రించేవి.
  8. పోస్టల్ స్టాంపులు: పార్సల్ కవర్ల కోసం వాడేవి.
  9. రెవిన్యూ స్టాంపులు: బండ్ల కోసం, బిజినెస్ కోసం ఉపయోగించేవి.

అనేక సేవలు:

ఇంటర్నెట్, మెయిల్స్, ఎస్.ఎమ్.ఎస్.లు మొదలగు వాటివల్ల, సరళీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో ప్రైవేటు రంగంలో అనేక కొరియర్ సర్వీస్‌లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చినా ఉత్తరం తన ఉనికిని కోల్పోలేదు. ఆఫిషియల్ మ్యాటర్స్ ఇప్పటికీ ఉత్తరాల రూపంలో అందుతున్నాయి. నేడు పోస్టాఫీసు తన ఉనికిని నిలబెట్టుకోవడానికి అనేక సేవా కార్యక్రమాలతో వినియోగదారుల కోసం ముందుకు వస్తోంది. బ్యాంకులు అందించే సేవలు రికరింగ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, లోన్లు, అటల్ పెన్షన్ యోజన, ATM సేవలు, భీమా సేవలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మొదలగు ఎన్నో సేవలను అందిస్తోంది. స్పీడ్ పోస్ట్, IMTS, ఎక్స్ ప్రెస్ మనియార్డర్, e-పోస్ట్ సేవలు మొదలగునవి అందిస్తోంది. విదేశాలలో ఉన్న NRI లకోసం వరల్డ్ నెట్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తినుబండారాలు, వస్తువులు, మందులు మొదలగునవి పంపుకోవచ్చు. ఇలా ప్రజలకు అవసరమైన అన్నిముఖ్యమైన సేవలను అందించడంలో ముందుంది.

అగ్రగామి:

ప్రతి ఏడువేల మందికి ఒక పోస్టాఫీసు, ప్రతి 21 కిలోమీటర్ కి ఒక పోస్టాఫీసు భారతదేశంలో ఉంది. లక్షా యాభై ఐదు వేల పోస్టాఫీసులు కలిగిన భారతదేశం ప్రపంచంలో పోస్టాఫీసులు ఎక్కువగా ఉన్నదేశాలలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తోంది.

తపాలా దినోత్సవం:

స్విట్జర్లాండ్ లోని బెర్న్‌లో 1874 అక్టోబర్ 9వ తేదీన యూనివర్సల్ పోస్టల్ యునియన్ (UPU) స్థాపించారు. దీనికి గుర్తుగా ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 9వ తేదీని ప్రపంచ తపాలా దినోత్సవంగా ప్రకటించింది. మొదటి ప్రపంచ తపాలా దినోత్సవం జపాన్ రాజధాని టోక్యోలో 1969 అక్టోబర్ 9వ తేదీన జరిపారు. భారతదేశంలో 1874 అక్టోబర్ 10వ తేదీన వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో మొదటి పోస్టాఫీసు ప్రారభించడం వలన అక్టోబర్ 10వ తేదీని భారతదేశ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 15 వరకు తపాలా వారోత్సవాలు జరుపుకుంటున్నారు. ఉత్తరం మన మదిలో ఉన్నంత కాలం పోస్టాఫీసు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here