తొలగిన తెరలు-1

0
17

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[dropcap]సు[/dropcap]దూరంగా రెండు వంతెనల మధ్య నుండి విశాలమైన మైదానం గుండా ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి. వరణ, అసి రెండు నదుల కలయికతో వారణాసి అయింది కానీ..

గంగమ్మ తల్లిగానే కోట్లాది ప్రజల పాపాలను ప్రక్షాళన చేస్తూనే ఉంది.

ఎంతమంది సాధు సంత్ల నిర్జీవ కళేబరాలను తనలోని జీవచరాలకు ఆహారంగా అందించిందో.

వరదల ధాటికి నగరమంతా మునిగిపోకుండా అత్యంత ఉన్నతమైన కోటగోడలూ, ఎత్తయిన భవనాలు.

ఊరిని ఏటిని కలుపుతూ నిర్మించబడిన అసి ఘాట్, తులసి ఘాట్, నారద ఘాట్, కేదార్ ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ నిర్మించిన ప్రసిద్ధులైన వారి పేర్లను తెలుపుతూ వ్రాయబడిన ఎనభైనాలుగు పైగా ఘాట్‌లూ, ఉన్నతమైన మెట్లు, ఘాట్ లను కలుపుతూ నడిచేందుకు రహదారులు ఎంత అందమైన ప్రదేశం!

కాశీ నగరం మొదటిసారిగా వచ్చిన నందిని, సందీప్‌లు అసీఘాట్ నుండి నడక మొదలుపెట్టారు.

గంగ ఒడ్డున మెట్లపై కూర్చుని అత్యంత సుందరమైన ప్రకృతి దృశ్యాలను తమ నైపుణ్యంతో కాన్వాసుపై ఎక్కించే చిత్రకారుల బృందము.

బహుశా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ విభాగం విద్యార్థులు కాబోలు. జీవకళ ఉట్టిపడే విధంగా చిత్రిస్తున్న వారి వదనాలలోని ప్రశాంతత ఆకర్షించింది ఆమెను.

చేతిలోని కెమెరాను ఆన్ చేస్తూ వారి వైపు చిరునవ్వుతో చూసింది ఫోటో తీసుకోనా? అని అడుగుతున్నట్లు వారిలో ఒకరు చిరునవ్వుతో తల పంకించాడు.

మిగిలినవారు చూడనేలేదు. వారిని చూస్తూంటే ఆమెకు ముచ్చటేసింది.

వారు చిత్రించే చిత్రానికి వస్తువేదైనా – అది గంగాతీరమూ, నావలూ అయినా, ఉదయాస్తమయాలలో నింగిని ప్రకాశించే సూర్య, చంద్రబింబాలైనా, కోటలూ, పేటలూ అయినా, సాధుసంతులూ, అఘోరాలైనా, నగర జీవనమైనా, విశ్వేశ్వరుని స్వర్ణ శిఖరమైనా, సాక్షాత్ ఆదిదంపతులనైనా ప్రాణం పోస్తున్నారు.

లలిత కళలు జీవితానికి ప్రాణాధారము.

చిన్నగా పాటను కూనిరాగం తీస్తోంది.

‘లలితా కళారాధనలో
వెలిగే చిరుదివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను’

కొంచెం ముందుకు వెళ్ళేసరికి క్షేమేంద్రఘాట్ అని కనిపించింది.

వావ్! తన సాహిత్య గురువు ‘అధ్యయన భారతి’ డా.మూర్తిగారి పరిశోధన అంశం క్షేమేంద్రుని ఔచిత్యమే!

‘వేయివిద్యలు వెలసిన వీధియందు/
రేగిపోయిన ధూళినై సాగిపోదు
పరమగురువులు నేర్పిన పాఠమెల్ల/
బ్రతుకు బ్రతుకంత తలచుచు పరవశింతు!’

అని పాడుకున్నారు.

తన రచనల ద్వారా సుగంధభరిత చందనమై ప్రజల మనోవీధిలో ఆఘ్రాణించబడుతూనే ఉన్నారు. కథ, కవిత్వం, వ్యాసం, అనువాదం, సంకలనం, విమర్శ ఏదైనా నిత్య అధ్యయనశీలిగా, పరిశోధకునిగా తనదైన ముద్రను నిలుపగలిగిన మేధావి.

ఆచార్యులవారి పర్యవేక్షణలో పి.హెచ్.డి. పట్టం కొరకు క్షేమేంద్రుడు చెప్పిన ఇరవైఏడు రీతుల ఔచిత్య ప్రస్తానాన్ని పింగళి సూరన కావ్యాలకు అన్వయిస్తూ సిధ్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.

తన పరిశోధనా గ్రంథము ఆచార్యులవారికే అంకితమిచ్చారు.

“అత్యంత క్లిష్టమైన ఈ పరిశోధనలో రచనలో, ప్రణాళికలో, విషయచర్చలో, విశ్లేషణములో, క్రోడీకరణములో, సత్యసాధనలో, సారాంశసమీక్షణలో, నాగరికమైనదృష్టితో ప్రజ్ఞను ప్రదర్శించినాడు.” అని సాక్షాత్ పర్యవేక్షకులైన ఆచార్యులవారి ప్రశంసలు అందుకున్నారు.

ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపట్ల సమాన ఆదరణ చూపిన సద్విమర్శకుడు. సమీక్షకునిగా స్వీయనియంత్రణను కలిగిఉండడం, ప్రతిభ, విశ్లేషణ, విమర్శ కలగలిపిన ప్రత్యేకశైలి అతనిది. సంస్కృత విమర్శాప్రమాణాలను ఆంధ్రసాహిత్య సమీక్షారీతులను తెలుగుభాషకు ఔచిత్యపరంగా అందచేసి విమర్శకు పట్టంకట్టిన మహనీయుడు.

మంచికవి కావాలంటే సృజనాత్మక ప్రతిభ అవసరం అనీ, మంచి సాహిత్య విమర్శకుడు కావాలంటే కింగ్ ఫిషర్ లాంటి ఒడుపూ, లాఘవం, సునిశిత ప్రజ్ఞా విశేషం కావాలనీ భావించారు.

గురువుగారిని తలచుకోగానే ఉత్సాహంగా అనిపించింది.

గురువుని తలచుకుంటూ క్షేమేంద్రుడుకి హృదయ పూర్వకంగా నమస్కరించి విగ్రహానికి గబగబా ఫోటోలు తీసింది. తననూ, క్షేమేంద్రుని కలిపి అందమైన ఫోటో తీసిన సందీప్ని గమనించలేదు ఆమె.

నది ఒడ్డున కట్టేసిన నావలు, మోటార్ బోట్లు, డబల్ డెక్కర్ మోటార్ బోట్లు ప్రముఖులకోసం పెద్దబోట్లూ, సామాన్యుల కోసం చిన్నబోట్లూ ఎదురు చూస్తున్నాయి. వాటి యజమానులు నౌకావిహారం చేయడానికి రమ్మని అందరినీ పిలుస్తున్నారు.

గంగాతీరం ఒడ్డున నడిచే వెళ్లాలని ఆమెకు అనిపించింది. అయినా అతని వైపు చూసింది. అతడు అప్పటికే సరంగుతో మాట్లాడి నావ ఎక్కేసాడు.

ఆమె మౌనంగా అతని వెనుక నావలో ఎక్కింది. సహాయం అవసరం అయింది కానీ బోటు వాడి చేతికి హాండ్ బేగును అందించి తను జాగ్రత్తగా ఎక్కి కూర్చుంది. సూర్యాస్తమయ కాంతులు నదీజలాలలో పడి రంగు రంగులుగా మెరుపులీనుతూ ఆమె కళ్ళలో, బుగ్గలపైన ప్రతిఫలిస్తున్నాయి.

యుగాలనాటి సత్య హరిశ్చంద్రుని ఘాట్. సత్యం కోసం, ఇచ్చిన మాట కోసం చక్రవర్తి పదవిని కాదని కట్టుబట్టలతో భార్యాబిడ్డలతో అరణ్యాల బాట పట్టిన రాజా హరిశ్చంద్రుడు భార్యా బిడ్డలను అమ్మి వేసి, తనను తాను కాటికాపరిగా ఒకరి కింద పని చేసింది. ఇక్కడే! యుగాలనాటి రుజువులు ఈనాటికీ అక్కడ నిత్యమూ దహింపబడే కళేబరాలే!

ఆమె ఒంగుని చేతిని బయట పెట్టి గంగాజలం తీసుకుని తలపై జల్లుకుంది. అతనిపై కూడా జల్లాలని అనుకుంది. కానీ..

ఆమె ఏమి చేస్తుందో అని కుతూహలంగా చూడసాగాడు. ఆమె అతనివైపు చూడకుండా నావ నడిపేవాడిపై జల్లుతూ అంతటా చిలకరించినట్లుగా చేసింది. అతనిపై కూడా పడే ఉంటాయని తెలుసు. గమనించనట్లుగా ఒడ్డువైపే చూపు సారించింది.

గంగానదీ నీళ్లలో గులాబులు అమర్చిన చామంతి పూలదండ కొట్టుకుని వస్తోంది. దాని మధ్యలో ఏదో తేలుతున్నట్టుగా ఉంది.

ఏమై ఉంటుంది? అని ఆమె మరింత పరిశీలనగా చూసింది.

అది ఒక పెద్ద ఫోటో ఆల్బమ్. అదేంటి నీళ్లలో పడేసారు అనుకుంటూ ఉండగా అది కొట్టుకుంటూ ఆమె వైపు వచ్చింది. సహజమైన కుతూహలంతో దానిని అందుకోవాలని అనుకుంది.

ఇంతలో అతడు “నందూ! వద్దు!” అన్నాడు.

ఆమె ఒక్క క్షణం అతని వైపు చూసి మళ్లీ ముందుకు వంగింది.

ఆల్బమ్ ఆమె చేతిలోకి వచ్చింది.

“పూలదండ ఆ కాలుతున్న శవానికి వేసినది. ఆ ఫోటో ఆల్బమ్ కూడా వారిదే కావచ్చు. అందుకే తీయవద్దు అన్నాను”  అని తనలో తానూ అనుకున్నట్లుగా అన్నాడు అతడు.

ఆమె వినిపించుకోనట్లుగా పేజీ తిప్పింది.

అందమైన నలుపు తెలుపుల షహనాయీ వాద్య పరికరం.

సంభ్రమంతో మరొక పేజీ తిప్పింది.

రాష్ట్రపతితో పురస్కారము అందుకుంటున్న ఒక యువకుని ఫోటో.

ఆమె పేజీలు తిప్పుతూనే ఉంది మసక వెలుతురులో. అదే యువకుని సన్నాయి వాద్యప్రదర్శనలూ, ప్రతిభ చూపిన అతనిని ప్రశంసిస్తూ పత్రికలలోని వార్తలు కటింగ్స్, ఫోటోలు చాలా అందంగా పేర్చబడి ఉన్నాయి. ఆమెకు ఆశ్చర్యం వేసింది.

అతనితో పాటు ఒక అందమైన అమ్మాయి ఇరువురూ వివాహదండలు వేసుకుని పక్కపక్కన నిలబడిన ఫోటో ఉంది. అతని భార్య కావచ్చు.

ఆఖరి పేజీలో రోగగ్రస్థుడైన ఒక వ్యక్తి ఫోటో ఉంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని మృత్యుఘడియలు లెక్కిస్తున్నట్లు ఉంది. పక్కన షహనాయీ దుమ్ము పట్టి బల్లపై ఉంది.

అయ్యో! ఇంత ఉన్నతమైన కళాకారునికి ఇంత బాధాకరమైన పరిస్థితా? ఆమె మనసు ద్రవించింది. మౌనంగా ఆల్బమ్ నీళ్ళలోకి వదిలేసింది. మనసంతా ఆలోచనలతో నిండిపోయింది.

***

నందిని తండ్రి కామేశ్వరరావు రైల్వేలో పనిచేసేవాడు. ఈ రోజుల్లో అన్ని ఉద్యోగాలూ ఒత్తిడిని పెంచుతున్నాయి. రాత్రి భోజనం అయ్యాక సన్నగా గుండెల్లో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. కార్డియాక్ అరెస్ట్ అన్నారు డాక్టర్లు. తండ్రిని కోల్పోయింది నందిని.

తల్లి సుమతి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. సంగీతం కూడా నేర్చుకుంది. మధురమైన కంఠస్వరం ఉండడంతో రైల్వేలో అనౌన్సర్ పోస్ట్ ఇచ్చారు. అమ్మ ఉద్యోగం చేయడం లోని కష్టసుఖాలను దగ్గరగా, ప్రత్యక్షంగా చూసిన నందినికి ఉద్యోగినులైన స్త్రీలు ప్రత్యేకంగా అలవరచుకోవలసిన లక్షణాల గురించి అవగాహన ఏర్పడింది.

నిత్యమూ మనము ఎక్కువ సమయం గడిపే ఇంటి గురించిన శ్రద్ధ చాలా మందికి ఉండదు. చాలా మందికి అవగాహనే ఉండదు.

టేబుల్ మీద కాగితాలూ, పుస్తకాలూ పడేసేవారూ, కిటికీలలో కాస్మెటిక్స్ పెట్టేవారూ, సోఫాలమీద బట్టలు ఆరేసేవాళ్ళూ, ఆఫీస్ నుండి వస్తూనే కుర్చీలో బేగులు పడేసేవారూ, ఆరేసిన బట్టలు కుప్పగా పోసి, అవసరానికి అందులోంచి వెతుక్కునేవారూ, ఏ కాగితం అవసరమైనా క్షణాల్లో అందించగలిగే లాగా కాకుండా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు వెదుక్కునేవారూ వీరందరూ కాలంలోని ప్రతి సెకను విలువ అమూల్యం అని తెలుసుకోలేని వారు.

వీరిని అడిగితే వెంటనే వచ్చే జవాబు ‘టైం లేదు’.

అందరికీ ఆ ఇరవైనాలుగు గంటలే కదా ఉండేది. ఎనిమిది గంటలు నిద్రకు తీసేస్తే మిగిలిన పదహారు గంటలూ మీవే! ఉద్యోగానికి వెళ్లి రాగానే అలిసిపోయినట్లు ఆపసోపాలు పడతారు. అంటే అక్కడ కూడా టైం మేనేజ్మెంట్ సరిగా లేదన్నమాట. పనిని ఆనందంగా, ఆహ్లాదంగా చేయడం పనికి గౌరవం ఇవ్వడం అన్నమాట.

సుమతి పని చేస్తూనే ఇవన్నీ మాట్లాడుతూ ఉండేది. అమ్మ తీర్చిదిద్దిన శిల్పం నందిని.

మానసిక ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చే విద్యను నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. సున్నితమైన తన వైఖరికి తెలుగుభాష పట్ల తనకు గల ప్రత్యేకాభిమానానికి సరిపోతుందని తెలుగు ప్రధానాంశంగా డిగ్రీ, పీజీ పూర్తి చేసింది.

ఆంధ్ర విశ్వవిద్యాలయం కృష్ణా లైబ్రరీ మెట్లు ఎక్కుతూ ఉంటే ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. ఎందరో మహనీయుల కృషి ఫలితంగా ఈరోజు స్త్రీలు కూడా స్వతంత్రంగా తమకు కావలసిన చదువులు చదువుకుని అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు అని భావించింది.

నందిని, సందీప్‌ల పరిచయం చాలా కాకతాళీయంగా జరిగింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here