తొలగిన తెరలు-3

0
15

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[సందీప్, నందినిల పరిచయం చిత్రంగా జరుగుతుంది. ఓ వృద్ధురాలికి ఒంట్లో బాలేదని ఆసుపత్రికి తీసుకువస్తుంది నందిని. ఆమెకి పరీక్షించిన వైద్యులు ఆమెకి రక్తం ఎక్కిస్తే మంచిదని అంటారు. నందిని అంతకుముందు నాలుగురోజుల క్రితమే వేరెవరికో బ్లడ్ అవసరమంటే ఇస్తుంది. మళ్ళీ తనే ఇవ్వలేదు కాబట్టి డోనార్స్ లిస్టులో ఎవరికైనా ఫోన్ చేయమని నర్సుని అడుగుతుంది. మీరే ఫోన్ చేసుకోండి అంటూ లిస్టు ఇస్తుంది ఆ నర్స్. తొమ్మిదో నెంబరు పేరుకి చెయ్యాలని అనుకుంటుంది నందిని. ఆ పేరూ, నెంబర్, మొబైల్ లోకి ఎక్కించుకుని రింగ్ చేస్తుంది. కానీ ఆ వ్యక్తి ఫోన్ తీయడు. ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాను. అర్జంటా? అని మెసేజ్ చేస్తాడు. అవునని జవాబిస్తుంది. ఓ అరగంటలో సందీప్ వచ్చి రక్తం ఇస్తాడు. ధన్యవాదాలు చెప్తుంది నందిని. పర్వాలేదని చెప్పి కాసేపు కూర్చుని వెళ్ళిపోతాడు సందీప్. ఆమె రూపం అతడిని ఆకర్షిస్తుంది. మీ అవ్వ బాగున్నారా అని ఆ సాయంత్రం నందినికి మెసేజ్ చేస్తాడు. కొన్నాళ్ళకి వాళ్ళ మధ్య స్నేహం పెరుగుతుంది. బ్యాంకు ఉద్యోగస్తులైన సూర్యారావు, మరుద్వతి దంపతులకు సందీప్, స్పందన పిల్లలు. తామెంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల పెంపకంలో అత్యంత జాగ్రత్త వహిస్తారా దంపతులు. పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేస్తారు. ఇద్దరి క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ముందు స్పందనకు పెళ్ళి చేద్దామని భావించినా, సందీప్, నందినిల ప్రేమ గురించి తెలిసాక, కుమారునే పెళ్ళే తలపెట్టారు. మొదట నందినికి తండ్రి లేడని సందేహించినా, ఆమెని చూశాకా, తన అంగీకారాన్ని తెలియజేస్తుంది మరుద్వతి. పెళ్ళిని ఆదర్శంగా, మిత వ్యయంతో జరిపించాలని ఆ నలుగురూ అనుకుంటారు. అనుకున్నట్టే వివాహం జరిగిపోతుంది. – ఇక చదవండి]

[dropcap]త[/dropcap]రువాత స్పందన పెళ్ళికోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రముఖ ఐటీ కంపెనీలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న స్పందన చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటుంది. అనేక కార్యక్రమాలు చేస్తూ కంపెనీని ఉన్నతస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తుంటుంది.

భారతదేశంలోని కొత్త కంపెనీల వార్షిక టర్నోవర్ దృష్టిలో పెట్టుకొని రేటింగ్ ఇచ్చినప్పుడు వీరి కంపెనీ హ్యాట్రిక్‌గా రెండు సార్లు ద్వితీయస్థానంలో, ఒకసారి ప్రథమ స్థానంలో నిలిచింది. అందుకు కారణం స్పందనయే అని ఆఫీసులో అందరూ అంటారు.

మరుద్వతితో పాటు బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ చందన చాలా మంచి సంబంధం అని బెంగళూరుకి చెందిన రైతు భూస్వాములకు చెందిన ఏకైక కుమారుడు కిరణ్ కుమార్ గురించి వివరాలు అందించింది. వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, వివరాలు చూసి కనుక్కుంటామని తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది. జాతకాలు నప్పితేనే ముందుకు వెళ్దామని అనుకున్నారు.

ఈలోగా వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడారు.

జాతకాలు చాలా బాగా నప్పాయని తెలియగానే అందరికీ ఆనందం. అబ్బాయి, అమ్మాయిలు ఫోటోలు చూసుకున్నారు. ఫోనులో మాట్లాడుకున్నారు.

బెంగుళూరు నుండి వాళ్ళ కుటుంబం ముగ్గురూ, పెళ్ళికొడుకు తాతయ్య వచ్చారు. ఆ భూస్వాముల సిరిసంపదలూ, ఊళ్ళో వాళ్ళకున్న హోదా అన్నీ అందరికీ వచ్చేసాయి. స్పందన చదువూ, ఉద్యోగం వాళ్ళకు నచ్చాయి. ఇంకేముంది?

ఆనందంగా పెళ్ళి ముహూర్తాలు పెట్టేసుకున్నారు.

కానీ..

సందీప్‌కి పెళ్ళి చేసినంత సింపుల్‌గా స్పందనకు కుదరలేదు. వాళ్ళు ముందే చెప్పారు. పెళ్ళి బెంగళూరుకు దగ్గరలో ఉన్న వాళ్ళ పల్లెటూరులో చేయాలని. వాళ్ళ పద్ధతిలో చేయాలని. ఊళ్ళో భూస్వాములు, ఒక్కడే కుమారుడు కనుక బంధువులు ఎక్కువ మంది వస్తారని. వీళ్ళు అంగీకరించారు. అంతకంటే చేయదగ్గది ఏముంది గనుక.

కిరణ్ స్పందనల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.

***

కోటి ఆశలతో కొత్త పెళ్ళికూతురు అత్తవారింట అడుగుపెట్టింది. ఇంటి నిండా బంధుజనం హాస్యాలూ, ఛలోక్తులూ, ఆనందాల వెల్లువ! అలసిన వారు జాగాలు వెతుక్కుని కునుకులు తీస్తున్నారు. యువతకి పిల్లలకి నిద్రలు రావేమో! అరుపులూ, కేకలూ, జోకులూ, కిలకిల నవ్వులు వినిపిస్తున్నాయి.

అవును మరి!

పెళ్లంటే పందిళ్లు సందళ్ళు తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు, మొత్తం కలిపి నూరేళ్లూ..

సాయంత్రం అవుతుంటే ముత్తైదువుల గుసగుసలూ, పువ్వుల ఘుమఘుమ వాసనలూ, ఇల్లంతా వింత పరిమళాలూ..

ఇంతసేపూ అల్లరిచేసిన పిల్ల జట్టంతా ఎక్కడికి వెళ్లి పోయారో?

ఒక రకమైన నిశ్శబ్దం. ఎనిమిది గంటలకు ముహూర్తంట!

పురోహితుడు వచ్చి సాయంత్రం పూజ చేయించి వెళ్ళిపోయాడు.

ఇంకా ఈ ఆధునిక యుగంలో కూడా సంప్రదాయాన్ని వీడని కుటుంబం హోటల్ ఛాయలను కూడా అంగీకరించని పెద్దరికం. పాటించే చిన్నతరం..

గది తలుపులు మూసుకున్నాయి.

స్పందన మది తలుపులు తెరిచి ఎదురుచూస్తోంది. దూరంనుండే కిరణ్ స్పందనను పరిశీలనగా చూస్తున్నాడు. అతని చూపు చూసి ఉలిక్కి పడింది స్పందన.

అదేంటి? ఆ చూపు!!

అది ప్రేమా?? లాలనా?? కాదే మరి!!!

“స్పందనా నాకు పిలిచేందుకు వీలుగా అనవరతము నీ నామ జపం చేసేందుకు రెండక్షరాల మంచిపేరు రాణీ! అని పిలవనా?” అతడి నుండి వచ్చిన మొదటి మాటలకు ఉలిక్కిపడింది.

“అందరూ నన్ను ‘చిన్నీ’ అని పిలుస్తారండీ!”

“హ..హ..హ..” అతని ధోరణి ఆమెకు అదోలా తోచి మౌనం వహించింది.

వికసించి విరియాల్సిన మొగ్గ ముడుచుకుపోవడం మొదలుపెట్టింది.

“సరే! నా హృదయరాణివి కదా! రాణీ! అనే పిలుస్తాను!” అంటూ దగ్గరగా వచ్చాడు.

అతని నుండి ఏదో గమ్మతయిన వాసన! సెంట్.. కాదు మరి..

ఆమె ఆలోచించసాగింది. గదిలోని పూల పరిమళమా! కాదే!

అతడు ఇంకా దగ్గరగా వచ్చి ముందుకు వంగాడు.

వెంటనే ఆమెకు అర్థమైపోయింది. అతడు డ్రింక్ తీసుకున్నాడు.

ఇంట్లో అన్నకి ఈ అలవాటు లేదు. నాన్న కూడా తాగడు.

ఓ మై గాడ్!

ఆమె గుండెల్లో ఒక పెద్ద బండరాయి సముద్రంలో తుఫాను పెద్ద పెద్ద అలలు చిన్న పగులు వేసిన మనసు..

ఆ తరువాత సహకరించని మనసూ, శరీరమూ.. ఒక పెద్ద పగులు!

***

పుట్టింటికి వచ్చినా తన ఆశల పెళ్లిపందిరి కూలిపోయిందని ఎవరితో చెప్పాలో తెలీక అన్యమనస్కంగానే గడిపింది.

కిరణ్ బాడీ లాంగ్వేజ్‌ని అమ్మ పసికట్టేయగలదు. అందుకే అతడిని జాగ్రత్తగా ఉండమని చెపితే..

ఏమంటాడో?? ఎలా తీసుకుంటాడో?? తమ ఇంట్లో నలుగురూ కలకలలూ, కిలకిలలే తప్ప సీరియస్‌గా వాదించుకోవడాలూ, దెప్పిపొడుచుకోవడాలూ, అలా చేయకు ఇలా చేయకు అని చెప్పుకోవడాలూ ఉండవు.

మరిఎలా?? అతనికి తెలియజేయడం??

ఒక్క చిన్న కాగితంపై “మీ అలవాటు మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేయగలరా దయచేసి” అని రాసింది.

“చిన్నీ! కిరణ్‌ని పిలువమ్మా! హాల్లో అందరూ కాఫీలకు కూర్చున్నారు.” అమ్మ మాటలకు తలవూపి గదిలోకి వెళ్ళింది.

అస్తవ్యస్తంగా పడుకున్న అతనిని చూస్తూనే మొహమాట పడింది.

ఆమె కాలిమువ్వల సడికి ఇటు తిరిగిన అతడు మంచం మీద నుంచి లేచి ఆమెను అందుకోబోయాడు.

 “అమ్మ కాఫీకి పిలుస్తోంది.” మెల్లగా అంటూ అతడిపై ఆ కాగితాన్ని విసిరేసి రివ్వున వెనుతిరిగింది.

“రాణీ!” అతని పిలుపు ఆమె వినలేదు హాల్లోకి వచ్చేసింది.

ఆ సాయంత్రం కాఫీల ప్రహసనం ముగిసింది.

కానీ..

రెండోరోజు రాత్రే ఆమెకు చెప్పేసాడు.

“చూడు! మీ ఇంట్లో అందరూ చాలా మడివాళ్ళలాగా ఉన్నారు. నాకు అలవాటు ఉంది. మా ఇంట్లో అందరికీ తెలుసు. మా స్నేహితులు అందరం అప్పుడప్పుడు మజా చేసుకుంటాం. ఆఫీస్‌లో కూడా నా పోస్ట్ బట్టి కంపెనీ మీటింగ్ లలో తీసుకోవాల్సి ఉంటుంది. నీకు తెలిసి ఉండడం మంచిది. అర్థమైందా! మీ ఇంట్లో ఒకటి రెండు రోజులైతే నేను నటిస్తాను. కానీ నా విధానానికి నువ్వు అలవాటు పడాలి” అంత ఖచ్చితంగా చెపుతున్న అతనితో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు స్పందనకి.

ఈమారు మనసుకి కొంచెం దిగులేసింది.

***

స్పందన మనసు చాలా చాలా ఊగిసలాడుతోంది.

ఇదేమిటి? తన జీవితం? ఇలాంటి తాగుబోతుతో ముడిపడింది. స్నేహితులతో కలిసి వచ్చి ఇంట్లోనే తాగితే భరించగలదా? అసలు ఈ విషయం తెలిస్తే అమ్మానాన్న ఏమంటారో? తట్టుకోగలరా? ఎంతో ప్రేమగా చూసుకునే అన్నా, వదిన ఎంత బాధపడతారో?? అందరి విషయం ఎందుకు? తన మనస్సు ఏమంటోంది?

ఇంత పెద్ద ఇంజనీరునై ఉండి కంపెనీలో ఎడమచేతితో అన్ని పనులు చక్క పెట్టగల సత్తా ఉన్న తను, అవలీలగా జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులను తెప్పించగల తను ఇప్పుడు ఇలాంటి జటిలమైన సమస్యలో ఇరుక్కుపోయిందేమిటి? ఇందులోంచి తాను బయటపడగలదా? ఎలా?

అతడిని మారమని చెప్పాలి బ్రతిమలాడాలి. కుదరదని మలిరాత్రే చెప్పేసాడుగా!

అమ్మా నాన్నా చేత చెప్పించాలి అంటే వాళ్లకు చెప్పాలి. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. మూడు రోజులకే ముక్కలు అయిందంటే ఎంత బాధపడతారు? అవును. అతను తాగుబోతని ఎవరికీ ఎందుకు తెలియలేదు? ఇంతకీ తాగుతాడా? తాగుబోతా? అమ్మ నాన్న ఆ కోణంలో ఎందుకు కనుక్కోలేదు?

అత్తగారు, మామగారితో మాట్లాడితేనో? వాళ్ల మాట వినేవాడైతే ఇంత దూరం రాదు.

ఎలా? ఎలా? ఎలా?

సమస్య పెద్దదయినప్పుడు పరిష్కారం సున్నితంగా చేయాలి. లేకపోతే ఎండిన మోడు విరిగినట్లు మొదటికే మోసం వస్తుంది. అసలు సమస్య చిన్నదేనేమో? తానే ఎక్కువ ఆలోచిస్తోందేమో?

అందరూ తాగుతారు. సర్వెంటు సింహాద్రి భర్త తాగుతాడు. మన తోటమాలి తాగుతాడు. పాలవాడూ తాగుతాడు. ఖాళీ జాగాలో కట్టే ఇంటికి కాపలా ఉన్న వాచ్‌మన్ తాగుతాడు.

ఎటు చూసినా తాగుబోతుల ప్రపంచంలా కనబడసాగింది స్పందనకు.

అయితే ఏంటి? వాళ్ళు తాగితే వాళ్ళ ఖర్మ!

నాకు అక్కర్లేదు. నేను జీవితాంతం వీడిని భరించలేను.

అయితే ఏం చేస్తావు? మనసు ప్రశ్నించింది.

ఒక్క క్షణం ఆలోచించింది.

విడాకులుతీసుకుంటాను తటపటాయిస్తూ అంది.

అందరూ ఏమంటారు?

ఏమంటారు?

నీ క్యారెక్టర్‌నే అనుమానిస్తారు.

ఎవరో ఏదో అంటారని బంగారం లాంటి జీవితం నాది.

జీవితాంతం వీడి తాగుడును భరించాలి. వీడి స్నేహితులు ఎవరు ఎలాంటివారో తెలియదు.

ఆ తర్వాత ఏ జబ్బులు వస్తాయో?? పతివ్రతా శిరోమణిలాగా సేవలు చేయాలి. వాడేమైనా అయితే..

కొరడాతో కొట్టినట్లు ఉలికిపడింది.

ఏంటి ఆలోచిస్తోంది?

కొత్త పెళ్ళికూతురు మూడు నిద్దర్లు ముగియకముందే అశుభమైన ఆలోచనలు. అమ్మా నాన్నా నేర్పిన సంస్కారం ఏమైంది? తన ఆలోచనలలో భర్త కిరణ్‌ని వాడు వీడు అని సంబోధించడం గుర్తొచ్చింది.

ఆలోచనలు కొలిక్కిరాక తలనొప్పి పెడుతూంటే అక్కడి నుండి లేచిపోయింది. కానీ ఆమె మానసిక ఘర్షణను ఒకరు పరిశీలిస్తూనే ఉన్నారని తెలీలేదు ఆమెకు.

***

ఆ సాయంత్రం సన్నజాజి మొగ్గలు కోస్తున్న నందిని దగ్గరికి స్పందన వచ్చింది.

“రా! చిన్నీ! నీకోసమే పువ్వులు కోస్తున్నాను. నీకు పెద్ద దండ అంటే ఇష్టం కదా!” అంటూనే మొగ్గలు ఒడుపుగా కోస్తూ మాల అల్లుతూ పలకరించింది. స్పందనకు ఆశ్చర్యంగా ఉంటుంది. తనైతే మొగ్గలు కోసి తర్వాత కూర్చుని తీరుబడిగా మాల అల్లుతుంది. వదిన రెండు పనులూ వెంటవెంటనే చేసేస్తుంది.

“నేను పువ్వులు కోస్తాను నువ్వు మాల కట్టు వదినా!” అంటూ ఇంకో వైపు నుంచి కోయడం మొదలు పెట్టింది.

“ఫరవాలేదులే! కొత్త పెళ్ళికూతురువి. నీకు పనులు చెప్పడమా!” నొచ్చుకుంటూ అంది నందిని.

స్పందన ఏదో చెప్పడానికి వచ్చిందని అర్థమైంది నందినికి

“అతనూ, నువ్వూ ఏకాభిప్రాయులేనా?” నాందిగా ప్రశ్నించింది.

స్పందన ముఖం మ్లానమైంది.

“అంతా బాగానే ఉంది వదినా! కానీ..”

“చిన్న చిన్నవి ఉంటాయమ్మా! మనమే సర్దుకుపోవాలి.” నందిని మాటలు వినగానే

“నిజమే వదినా! కానీ.. చిన్న చిన్నవి సరే! ఒక పెద్ద విషయంలోనే అభిప్రాయం కలవకపోతే??”

నందిని ఏదో చెప్పబోతూ ఉండగా

“నందినీ! ఒకసారి రామ్మా! చిన్నపని.” అత్తగారి కేక వింటూనే కడుతున్న మాల అలాగే వదిలేసి వెళ్ళింది.

ప్చ్! అని నిట్టూర్చింది స్పందన.

రేపే తమ ప్రయాణం. హనీమూన్‌కి అన్నయ్య వదిన టికెట్స్ ప్రెజెంట్ చేశారు.

కానీ అతని విషయంలో తను ఏం చేయాలో అర్థం కాకుండా ఎలా వెళ్ళగలదు? ఇది తన వ్యక్తిగత సమస్య! కానీ పెళ్లి మూలంగా ముడిపడిన రెండు కుటుంబాలు చూడాలి కదా! ఆలోచిస్తున్న స్పందన ఎవరో వస్తున్నట్లు చూసింది.

పనిమనిషి సింహాద్రి “అమ్మగారూ! పెద్దమ్మగారేమో పూలు కొయ్యడానికి సాయం చేయమన్నారు.” అంటూ వచ్చింది.

సింహాద్రి అన్ని పనులూ చేస్తుంది. అందరిళ్ళలో వారూ ఎంతో అభిమానిస్తారు. పేరుకి పనిమనిషి. నల్లగా ఉన్నా కళగా అందంగా ఉంటుంది. కిలకిలా నవ్వుతూ ఉంటుంది. ఇద్దరు మగపిల్లలు. కష్టపడి చదివించుకుంటోంది. తమ ఇంట్లో సుమారుగా పదేళ్లుగా పని చేస్తోంది.

కానీ దానికి భర్తతోనే ప్రాబ్లం. తాగి వస్తాడు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ మేస్త్రీగా పని చేస్తున్నాడు. తెచ్చిన డబ్బులన్నీ తాగేస్తాడు. అటువంటి వాడితో ఇరవై ఏళ్లుగా ఎలా గడుపుతోందో? తెలుసుకోవాలని అనిపించింది. కానీ తానుగా సంభాషణ ఎలా మొదలు పెట్టడం?

స్పందన మౌనంగా పూలుదండ కడుతోంది. సింహాద్రి పువ్వులు ఏరుతోంది.

తదేకంగా ఆమెనే చూస్తున్న స్పందనకు సడెన్‌గా గుర్తు వచ్చింది..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here