తొలగిన తెరలు-4

0
14

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[నందిని, సందీప్‍ల పెళ్ళి అయ్యాక, స్పందన పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్పందన ఓ ఐటి కంపెనీలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ, కంపెనీని ఉన్నతస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తుంటుంది. కంపెనీ ఎదుగుదలలో స్పందన పాత్ర ఎంతో ఉందని ఆఫీసులో అందరూ అంటారు. మరుద్వతితో పాటు బ్యాంకులో పనిచేసే అసిస్టెంట్ చందన – స్పందన కోసం ఓ సంబంధం చెబుతుంది. బెంగళూరుకి చెందిన రైతు భూస్వాములకు చెందిన ఏకైక కుమారుడు కిరణ్ కుమార్ గురించి వివరాలు అందిస్తుంది. స్పందన తల్లిదండ్రులు వాళ్ళతో ఫోన్‍లో మాట్లాడుతారు. జాతకాలు కూడా కలవడంతో పెళ్ళిచూపులకి ఆ కుటుంబం వస్తుంది. అందరికీ ఆమోదం కావడంతో ముహూర్తాలు పెట్టుకుంటారు. అయితే సందీప్‍కి చేసినంత సింపుల్‍గా స్పందన పెళ్ళి చేయడం కుదరదు. మగపెళ్ళివారు ఆర్భాటంగా చేయమనడంతో తప్పక, కిరణ్ స్పందనల పెళ్లి అత్యంత వైభవంగా జరుగుతుంది. అత్తవారింటికి వస్తుంది స్పందన. తొలిరాత్రి కిరణ్ ప్రవర్తనలో ఏదో తేడా కనబడుతుంది స్పందనకి. అతను తాగి వచ్చాడని గ్రహిస్తుంది. తమ ఇంట్లో ఎవరికీ ఈ అలవాటు లేదు. మనసు గాయపడుతుంది. తరువాత స్పందన పుట్టింటికి వస్తారు. భర్త అలవాటు గురించి అందరికీ తెలిసిపోతుందేమోనని భయపడుతుంది స్పందన. మీ అలవాటు మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా దయచేసి మేనేజ్ చేయగలరా అని ఒక చిన్న కాగితం మీద రాసి అతనికిస్తుంది. కుదరదని మలిరాత్రే చెప్పేస్తాడు కిరణ్. అతను ఇంతకీ తాగుతాడా? తాగుబోతా? అని తనలో తాను ప్రశ్నించుకుంటుంది స్పందన. అమ్మ నాన్న ఆ కోణంలో ఎందుకు కనుక్కోలేదోనని అనుకుంటుంది. ఏం చేయాలో తోచదు, విడాకులు తీసుకుందామా అని అనుకుంటుంది. మనసంతా గందరగోళంగా తయారవుతుంది. వదిన నందినితో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది. సంభాషణ మొదలుపెట్టగానే అమ్మ, వదినని పిలవడంతో ఆగిపోతుంది. ఇంతలో వాళ్ళ పనిమనిషి సింహాద్రి అక్కడికి వస్తుంది. సింహాద్రి మొగుడు కూడా తాగుబోతే. అటువంటి వాడితో ఇరవై ఏళ్లుగా ఎలా గడుపుతోందో? తెలుసుకోవాలని స్పందనకి అనిపిస్తుంది. తదేకంగా సింహాద్రినే చూస్తున్న స్పందనకు హఠాత్తుగా ఓ సంఘటన జ్ఞాపకం వస్తుంది. – ఇక చదవండి]

[dropcap]చా[/dropcap]లా రోజుల క్రితం స్పందన తను పనిచేసే కంపెనీలో ఒక వర్క్‌షాపు ఏర్పాటు చేసింది.

సమాజంలోని విభిన్న వృత్తి – ప్రవృత్తులలో ఉన్న మహిళలందరికీ వారి అనుభవాలను పంచుకునే అవకాశంతో పాటు తాము ఈరోజు ఇంత గొప్ప స్థాయికి చేరేందుకు సహాయపడిన వ్యక్తులను గురించి లేదా ఆటంకాలు ఏర్పడితే వాటిని ఎలాగా ఎదుర్కొన్నారు? అనే విషయాలను ఒక కాగితంపై ప్రశ్నావళి తయారు చేసి పదిహేను నిమిషాలలో వ్రాయడానికి అందించింది.

మన గురించి అడిగేవారెవరుంటారు? అని అందరూ ఇమోషనల్ అయ్యారు.

నిజంగా మన గురించి, మన గడిచిన జీవితం గురించి తలచుకుని కాగితంపై పెట్టాలి అంటే ఒక పరీక్షా సమయమే!

అయినప్పటికీ ఎందరో మహిళలు విభిన్న వృత్తులవారు విభిన్న వయసుల వారు తమ చదువు గురించి ఉద్యోగం గురించి అనుభవాలను రాయాలని ప్రయత్నించి పదిహేను నిమిషాలకు బదులుగా అరగంట తీసుకున్నారు.

స్పందన అందరి దగ్గరా రాసిన కాగితాలను తీసుకుని వారు రాసిన దాని గురించి మాట్లాడమని ఒక్కొక్కరికీ పది నిమిషాల చొప్పున సమయం కేటాయించింది. నిజంగా అది ఒక అపూర్వ అనుభవం.

సింగిల్ పేరెంటుగా తాము తల్లిదండ్రులలో ఒక్కరితోనే ఉండవలసి రావడం, ఇంటి పనుల వలన చదువు ముందుకు సాగకపోవడం, చదువుకున్న తర్వాత ఎక్కడా ఉద్యోగం రాక, కూలి పనులకు పోలేక, దొరికిన చిన్న ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఎంతో కష్టపడి పనిచేసి నిరూపించుకోవలసి రావడం, కొందరైతే వివాహం కూడా అయిపోయి ఒక పాప పుట్టిన తర్వాత ‘ఆడపిల్ల’ పేరుతో వదిలేసిన భర్తలను ఏమీ చేయలేక పుట్టినిల్లు చేరి దయనీయంగా బ్రతకడం చెప్తూ ఉంటే, చెప్తూ వెక్కివెక్కి ఏడుస్తుంటే అందరి హృదయాలు బరువెక్కాయి.

నిజమే! ప్రతి స్త్రీ కథ ఒక రామాయణం, ఒక మహాభారతం.

ఆ రోజు సమావేశం అంతా అయిపోయాక ముగింపు మాటలు తాను ఇట్లా పలికింది.

“ఫ్రెండ్స్! సుమారుగా 50 మంది స్పందించి నేను నా వ్యక్తిగత అభిరుచితో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కంపెనీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అడిగిన రెండు ప్రశ్నలకు మీరు రాసిన సమాధానాలు నాకు చాలా చాలా చాలా నచ్చాయి. ఎందుకంటే మీరు బాగా ఇష్టపడే స్త్రీ ఎవరు? అలాగే మీరు బాగా ఇష్టపడే పురుషుడు ఎవరు?

కొంతమంది గాయని భారతరత్న శ్రీమతి ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారు, పద్మవిభూషణ్ పి.సుశీల గారు కూచిపూడి నర్తకి శోభానాయుడు మొదలైన స్త్రీ మూర్తులు గురించి, డా. అబ్దుల్ కలామ్ గారు, గాన గంధర్వ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అలా వేరే వేరే ప్రముఖులు గురించి రాసారు. చాలా సంతోషం.

కానీ కనీసం ఒక పది మంది విభిన్నంగా ఆలోచించి నాకు మా అమ్మ అంటే ఇష్టం నాకు మా నాన్న అంటే ఇష్టం అని రాసారు. నిజంగా అభినందనీయులు ఎందుకంటే అమ్మ నాన్నతోనే మన ఉనికి.

ప్రతి విజయవంతమైన అడుగు వేసేటప్పుడు మన గతాన్ని గురించిన చిన్న అవగాహన కూడా పెంచుకోవాలి.

చాలామంది అవగాహన లేక ‘స్త్రీలు అణచి వేయబడుతున్నారు’ అంటారు. కానీ మనం వేదకాలం, మధ్యకాలం, ఆధునికకాలం అని తీసుకున్నప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు అన్ని రంగాలలో స్త్రీలు తమ వంతు ప్రతిభను చూపించారు. చూపిస్తున్నారు.

పొలం దున్నడం నుంచి విమానం నడిపే దాకా, బాణం పట్టింది మొదలు శతఘ్నులు పేల్చేదాకా, శ్రామికురాలి నుండి రైళ్ళు నడిపేదాకా, గనుల్లో పని చేసిన దగ్గర నుండి కలెక్టర్ దాకా, వంటింట్లో కట్టెలపొయ్యి ఊదిన దగ్గర నుండి ప్రయోగశాలలో ప్రమాదకరమైన జబ్బులకు మందులు కనిపెట్టేదాకా, కన్నీళ్ళు కార్చే స్థాయి నుండి కలం పట్టి ఆత్మకథలు రాసుకునేదాకా, చదువురాని మొద్దు అన్నస్థాయి నుండి చట్టసభలలో బడ్జెట్లు సమర్పించేదాకా, పాఠశాలకు నడిచి వెళుతూనే ఒలింపిక్స్‌లో పరుగెత్తి పతకాలు తెచ్చినదాకా..

మన మహిళల ఈ ప్రయాణం ఎంతో అందమైనది. పడుతున్నా తిరిగి రెట్టింపు బలంతో లేస్తోంది. ముందు తరాలకు దారి చూపుతోంది.

మహిళలకు శారీరకంగా గల కొన్ని బలహీనతలు సాకుగా చేసుకుని కొన్ని అరాచకాలు మనమీద చేస్తున్నారు. అవి ఆనాడే కాదు ఈనాడు కూడా కొనసాగుతున్నాయి అంటే సమాజం సిగ్గు పడాలి. మనం కాదు. వీటి వలన మనం నిరాశ పడకుండా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవాలి. అవకాశాలు అందరికీ వస్తాయి. వాటిని ఏవేవో కారణాలతో వదులుకోకండి.

ఇది ఆరంభం కావాలి. అందరికీ విజయాలే కలగాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఎప్పుడైనా ఆపద వస్తే ఆత్మహత్యలు చేసుకోకండి. నా నెంబర్‌కి ఫోన్ చేయండి. నా ఆసరా పొందండి” అంటూ తన నెంబర్ ఇచ్చింది.

ఆ సాయంత్రం కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న స్పందన తనలో అంత ఆవేశం ఉందా? అని ఆశ్చర్యపడింది. ముందు నుంచి ఉందా? లేక వాళ్ళందరి కథలూ వింటూంటే తనలో కలిగిందా? ఆలోచిస్తూనే ఇల్లు చేరింది.

ఇంటికి వచ్చాక స్పందన ఇల్లు తుడుస్తున్న సింహాద్రి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది.

“అవునే! సింహాద్రి! నువ్వు ఇంత కష్టపడతావు. పిల్లలిద్దరినీ ఒకడిని ఇంటర్మీడియట్, ఒకడిని పదో తరగతి చదివిస్తున్నావు కదా! మీ ఆయనేమో పన్లోకి వెళ్ళి తెచ్చిన డబ్బులు తాగేస్తూ ఉంటాడు కదా! నీకు చికాకుగా ఉండదా?” ప్రశ్నించింది.

“ఎందుకుండదమ్మా? అలాగే అలవాటైపోయింది.”

“అతను తాగుతారని నీకు మొదటిసారిగా ఎప్పుడు తెలిసింది?”

“పెళ్లయిన రెండు మూడు నెలలకు..”

“అంటే పెళ్లయ్యాక నేర్చుకున్నాడా?”

“లేదమ్మా! ముందు నుంచే ఉండి ఉంటుంది. ఇలాంటివి ఒక్కరోజులో రావు కదమ్మా!”

“మరి మీ ఇంట్లో కనుక్కోలేదా?”

“అడిగితే మాత్రం చెప్తారా? మా పిల్లాడు చాలా మంచివాడు అంటారు. లేకపోతే సంబంధం చేసుకోరు కదా!” నవ్వింది.

“సరే! మరి తాగుడు మానమని నువ్వెప్పుడూ అడగలేదా?”

“ఎందుకు అడగనమ్మా! అడిగితే ఇదే ఆఖరు. మరి తాగను అంటాడు. మళ్లీ తాగి వస్తాడు. మళ్లీ అడుగుతాను. కూలి పని కదా! ఒళ్ళునొప్పులుగా ఉంది అందుకే తాగాను.” అంటాడు.

“మరి తాగి వచ్చి గొడవ చేస్తాడు కదా అందరికీ వినోదంగా ఉంటుంది కదా! అప్పుడు ఏం చేస్తావు?”

“తాగి వచ్చి చాలా గొడవ పెడతాడు. పిల్లల ముందు నన్ను కొడతాడు. తాగుడు ఎక్కువై ఇల్లంతా వాంతులూ, కంగాళీ చేస్తాడు. ఇల్లంతా శుభ్రపరిచి, వాడికి స్నానం చేయించి, మజ్జిగ ఇచ్చి పడుకోమంటాను. అయినా నేను బయట ఇరుగుపొరుగుకి తెలియకుండా జాగ్రత్త పడతాను. తెలిసిన వాళ్ళు అడిగినా ప్రత్యేకం నా బాధలన్నీ చెప్పుకోను.”

“ఎందుకని?”

“ఎందుకమ్మా అందరికీ చెప్పడం? విన్నప్పుడు బాగానే ఉంటుంది. వింటారు. జాలి చూపిస్తూ మాట్లాడతారు. వెనకాతల చులకనగా చెప్పుకుంటారు. నా గౌరవం నేను నిలుపుకోవాలి కదా!”

విచిత్రంగా అనిపించింది స్పందనకు.

తనతో అబద్ధం చెప్తుందేమో? అని అనుమానం కూడా వచ్చింది.

“అయితే నేను కూడా తాగుతాను. అని బెదిరించక పోయావా?” చిన్న పిల్లలాగా అడుగుతున్న స్పందనను చూసి పకపకా నవ్వడం మొదలెట్టింది. చాలాసేపు కళ్ళలో నీళ్ళు వచ్చేదాకా నవ్వింది.

“నవ్వడం ఆపి చెప్పు.” అంది.

“అప్పుడు ఆడికీ, నాకూ తేడా ఏంటమ్మా! ఇప్పుడు నా రెక్కల కష్టంతో ఇంత అన్నమైనా తింటున్నాము. లేకుంటే సంసారం వీధిన పడడమే! చూస్తున్నాము కదా! మా ఊరంతా అదే తీరు.” సాధారణీకరణ చేసేసింది. సమస్యలోనే పరిష్కారం కూడా ఉంటుందన్నది ఇందుకేనా?

“ఇలాంటి వాడితో ఎందుకు కలిసి ఉండడం. నువ్వే కష్టపడి సంపాదిస్తున్నావు. నువ్వు పిల్లలతో కలిసి వెళిపోతే వాడికే నష్టం. అప్పుడు వాడికి నీ విలువ తెలుస్తుంది. దారికొస్తాడు. నీకు ఎప్పుడూ వాడి నుంచి విడిపోవాలి అనిపించలేదా?”

“లేదమ్మా! నేను నా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాను. ఒక గూడు, భర్త, పిల్లలు ఉన్నారు. సంఘంలో అదొక గౌరవం. విడిపోతే అందరికీ చులకనే! మాలో మారు మనువులు ఉన్నాయి. అయినా ఇంకో మొగుడికి మాత్రం ఏ అలవాట్లూ లేవనీ ఉండవనీ ఎలా చెప్పగలం? పైగా వాడు కూడా ఎప్పుడు వదిలేస్తాడో అని భయం! అందుకే మా అమ్మా, నాన్న లేకపోయినా కష్టపడి అన్నా, వదినా చేసిన పెళ్లి. ఇష్టమున్నా మానినా కలిసి ఉండటం వలన వాళ్లకూ, నాకూ కూడా గౌరవం.

అందుకే నా పిల్లలు నన్ను చూసినా చూడకపోయినా వాళ్ళని ప్రయోజకులను చేయడం నా ఉద్దేశం. అంతేకాదు. నా మొగుణ్ణి మార్చే ప్రయత్నాలు కూడా నేను ఆపను.

తాగుడు అలవాటు తప్పుతుందని ప్రతి ఏడాది శబరిమలకు నలభై రోజుల దీక్షతో మా ఊరివాళ్ళు అందరితో పంపిస్తూ ఉంటాను. ఎంత ఖర్చైనా సరే! ఎందుకంటే కనీసం దీక్ష రోజులలో తాగుడు జోలికి పోడు కదా!

అమ్మా! ఇంతకీ ఇవాళ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు?”

“ఏం లేదు ఇవాళ మా ఆఫీసులో కొంతమంది ఆడవాళ్ళకు ఒక పరీక్ష పెట్టాను. నిన్ను కూడా తీసుకెళ్ళవలసింది. అందరూ ఎంత బాగా మాట్లాడారో?”

సింహాద్రికి గల కాన్ఫిడెన్స్‌కి ముచ్చటేసింది. నీ పిల్లలకు ఏమైనా కొని పెట్టు అని ఐదువందల రూపాయలు ఇచ్చింది.

***

స్పందనకు అవన్నీ ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. తను చాలా హుందాగా వ్యవహరించాలి. ఆవేశం పనికిరాదు. ఆలోచిస్తూ కిందకు వచ్చింది.

సందీప్ నందినిని పిలిచి రెండు మాటలు చెప్పాడు. “నందూ! వీలు చూసుకుని స్పందనతో కొంచెం మాట్లాడు. మళ్ళీ రేపు వాళ్ళ ప్రయాణం కదా!”

అలాగే! అంటూ స్పందనను తన గదిలోకి తీసుకు వెళ్ళింది.

“చిన్నీ! ఇందాకా పువ్వులు కోస్తున్నప్పుడు అడిగావు కదా! మాట్లాడుకుందామా?”

“ఏం లేదు వదినా! అందరు ఆడపిల్లలకు ఉన్న సమస్యే! పుట్టింటి వాతావరణం నుండి అత్తవారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎదుర్కోక తప్పదు. అక్కడి మనుషులు, స్వభావాలు, వాతావరణం, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, పద్ధతులు అన్నీ చాలా వరకు తేడాగా ఉంటాయి. కొంతమంది తొందరగా సర్దుకుపోతారు. కొంతమంది వీళ్ళతో మనం కలిసి ఉండక్కర్లేదు. నా భర్త నేను వేరేగా మాకు నచ్చినట్లు ఉంటాము అనుకుంటారు. అంతే!” అంది.

“నిజమే! నువ్వన్నట్లు. కానీ ఇందాక నువ్వే చెప్పావు కదా! చిన్న చిన్నవి అయితే ఫర్వాలేదు. సర్దుకుపోవచ్చు. కానీ పెద్ద సమస్య అయితే ఎలా? అని కదా!”

“అవును వదినా! నా సమస్య ఇది” అంటూ తన ఆలోచనలను క్లుప్తంగా చెప్పింది. “మన ఇంట్లో ఇంతవరకూ తెలియనిది. నేను ఎంత వరకు భరించగలను? అతనిలో మార్పు వస్తుందా? ముందే విడిపోవడం మంచిదా? రేపు హనీమూన్‌కు బయలుదేరుతున్నాము అంటే అతని పట్ల నా దృక్పథంలో ఒక స్పష్టత లేకపోతే వెళ్లడం కూడా వృథా కదా!”

వింటున్న నందిని ఒక క్షణం ఆలోచనలో పడింది. ఇది చాలా చర్చించాల్సిన పెద్ద విషయం. మన చుట్టూ ఈ మధ్య కాస్త ఎక్కువ సంఖ్యలోనే మాంసము, మద్యము, మగువ, తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందువలన అడ్జస్ట్ కాలేని భార్యాభర్తలు మ్యూచ్యువల్ అండర్‌స్టాండింగ్‌తో విడిపోతున్నారు. అమ్మాయిలకు అర్థమవుతోంది. ఉన్నది ఒకటే జీవితం. ఉద్యోగం, కెరీర్, పిల్లలూ సంబాళించుకునే పరిస్థితిలో అత్తవారినే దూరం చేసుకుంటున్నారు. వారిమీద ప్రేమలేక కాదు. సమయం సరిపోక.

మరి సంసారం నిర్వహణలో అతని అలవాట్లు వలన సహాయం చేయలేకపోతే అతను కూడా వద్దు అనేదే పరిష్కారంగా భావిస్తున్నారు.

అలా విడిపోయిన వారి పరిస్థితి ఏమిటని ఇతరుల జీవితాలు తెరిచి చూడడం మంచిదికాదు.

ఇక్కడ ఇతరుల ఉదాహరణలు కాకుండా తనకు తానే ఒక అవగాహనకు రావడం మంచిదేమో? ఎందుకంటే స్పందన చదువుకున్నది. ఉద్యోగస్థురాలు. ఒక పెద్ద సంస్థకు అధిపతిగా చాలా ప్రపంచాన్ని చూసే ఉంటుంది. ఉదాహరణలు ఇవ్వడం వలన ప్రయోజనం ఉండదు.

మంచి క్రమశిక్షణలో పెరిగిన స్పందనకు హుందాగా ఆలోచించడమే తెలుసు కనుక ఆ విధంగానే సంభాషణ నడపాలి.

“చిన్నీ! కొన్ని అలవాట్లు తప్పు అని కొన్ని అలవాట్లు ఒప్పు అని మనకు చిన్నప్పటినుంచి చెప్పటం వలన ఆ అలవాటు లేని వారిని మంచివారిగా అలవాటు ఉన్న వారిని చెడ్డవారిగా నిర్ణయించడం కూడా కరెక్ట్ కాదేమో?

కిరణ్ చెప్పాడు కదా ఆఫీస్ పరంగా తప్పనిసరిగా కొన్ని చేయవలసి వస్తుందని. విదేశాలలో చలి విపరీతమైనప్పుడు ఆడవారు కూడా తీసుకుంటారు. అది తప్పుగా వారు భావించరు.

అలవాటు యొక్క ఎక్స్‌ట్రీమ్ ఎండ్‌ని చూసి ఇప్పుడు భయపడుతున్నావు కానీ అతను అప్పుడప్పుడు తాగడం అనే అలవాటున్న వాడైతే సర్దుకు పోవచ్చు.

ఇప్పుడు నీ కెరీర్‌కి ఈ వివాహం అడ్డంకి కాకూడదు కదా! రెండింటినీ సంబాళించుకోలేక చాలా మంది భర్తతో పాటు అమెరికా వెళ్ళినా తాము ఉద్యోగం చేయకుండా వేరే వ్యాపకాలు కల్పించుకుంటున్నారు.

ప్రస్తుతం విడాకులు అనే ఆలోచన రానివ్వకు. అతనితో నీ మిగతా జీవితం ఎలా ఉంటుందనే దానిపై తిరిగి వచ్చాక ఒక నిర్ణయానికి వద్దాము. భగవంతుని దయవలన ఇదంతా వడ్లగింజలో బియ్యపు గింజలాగా సమసిపోతే ఆనందం. యు ఆర్ ఎ గ్రేట్ లీడర్. యు కెన్ లీడ్ హిస్ లైఫ్!” తనపై నమ్మకంతో వదిన పలికిన మాటలకు జవాబుగా

“అవును వదినా! నేను ఈ సమస్యను విజయవంతంగా హాండిల్ చేయగలను అనుకుంటున్నాను.”

“చిన్నీ! ఆల్ ది బెస్ట్.” బొటనవేలు పైకి చూపింది. స్పందన చిరునవ్వుతో బయటకు నడిచింది, కిరణ్‌తో మాట్లాడాలి అనే దృఢసంకల్పంతో.

వ్రక్తులను గౌరవించడం, వారితో సౌమ్యంగా మెలగడం అమ్మ నేర్పింది. అందుకే కిరణ్‌తో ఎలా ప్రవర్తించాలి? అనేదానికి తనకు తానే ఒక నిర్ధారణకు రావాలి కదా! భార్యాభర్తల విషయాల్లో మూడో వ్యక్తి ప్రవేశం ఉండకూడదు అనేది పెద్దల అందువలన రేపటి భవిష్యత్తు కోసం ఈరోజు పునాది వేసుకోవాలి అనుకుంటూ..

“మేడమీదకు వెళ్లి కాసేపు కూర్చుందామా?” ప్రపోజ్ చేసింది స్పందన.

ఓ! ఉత్సాహంగా అంటూ అంగీకారాన్ని తెలిపాడు కిరణ్.

“కిరణ్! ఇన్నాళ్ళు విడివిడిగా నీ ఉద్యోగం, నీ కుటుంబం, నీ అలవాట్లు, అలాగే నా ఉద్యోగం, నా కుటుంబం, నా అలవాట్లు. పెళ్లి అనే ఒక బంధంతో మనం మన కుటుంబాలు, మన ఉద్యోగాలు, మన అలవాట్లు అనే ఒక సమిష్టి భావన లోకి వచ్చాము.

ఇద్దరం కలిసి ఒక రోల్ మోడల్‌గా సమాజంలో నిలబడాలి. ఒక కంపెనీలో బాధ్యతగల ఉద్యోగినిగా నాకున్న టెన్షన్ లకు కాడెద్దులు ఎండకు ఒకటి, నీడకు ఒకటి లాగే విధంగా కాకుండా కలిసి బ్రతుకుదాం.

‘తాగుడు కావాలో, నేను కావాలో తేల్చుకో’ అనే మాటలు నేను చెప్పను. ఎందుకంటే లిమిట్‌లో ఉంటూ ఎవరికీ హాని కలగనంత వరకు నీ ఇష్టం. కానీ.. శ్రుతి మించితే నేను అంగీకరించను.

ఎందుకంటే రేపు మనకు పిల్లలు పుడతారు, వాళ్లకు మంచి జీవితాన్ని అందించవలసిన బాధ్యత మన ఇద్దరిదీ. చక్కని సంసారం చేసుకుందామంటే అంగీకరిస్తావో లేదా అన్నీ తెలిసిన మూర్ఖుడిగా ఉంటావో నీ ఇష్టం.

ఒకప్పుడు చెడు అలవాట్లు ఉన్నవారు మానేసి ఆనందంగా ఉన్నవారు నాకు చాలా మంది తెలుసు.

రేపటి మన హానిమూన్ నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

ఇవాళ నేను మా అమ్మకు సాంత్వన ఇస్తాను. ఈ పెళ్ళిలో మా అమ్మ చాలా అలసిపోయింది. మన విషయం చెప్పను. నాది అలాంటి మనస్తత్వం కాదు. సమస్య నాది. పరిష్కారం దిశగా ప్రయత్నాలు కూడా నావే!

అందుకే అమ్మా వాళ్ళు ఎంచి ఎంచి స్పందన అని పెట్టారు. నా పేరు స్పందన. గుడ్ నైట్” అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతున్న ఆ అందాలరాశిని అలా చూస్తూ ఉండిపోయాడు కిరణ్.

పెళ్ళితో నాలో ఏం మార్పూ రాలేదురా! అని కొందరు గొప్పలు చెప్పుకుంటారు.

ఎందుకు రాదు? రావాలి. వస్తుంది. కొందరికి తొందరగా. కొందరికి ఆలస్యంగా.

ప్రభాత కిరణం భువిని తాకుతోంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here