తొలగిన తెరలు-7

0
16

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[ఒకరోజు నవీన్ ఫోన్ చేసి అర్జంటుగా రమ్మంటాడు సందీప్‍ని. అక్కడికి వెళ్ళిన సందీప్‍  అనారోగ్యంతో ఉన్న నవీన్‍ని చూసి నిశ్చేష్టుడవుతాడు. ఏడాది వయసుండే బాబుని ఎత్తుకుని వినీల కనబడుతుంది. పరిస్థితి ఇలా ఉంటే తమకెవరికీ ఎందుకు తెలియజేయలేదని వినీలని అడుగుతాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేయబోతుంటే, వినీల ఆపుతుంది. తనకి ఆఖరి క్షణాలని నవీన్‍కి తెలుసననీ, అందుకే వద్దని అంటుంది. మరికొందరు స్నేహితులకి సందీఫ్ ఫోన్ చేసి పరిస్థితి వివరించినా ఎవరూ రారు. ప్రాణాలు పోయేముందు తన బాబు కోసం సాయం చేయమని సందీప్‍ని అడుగుతాడు నవీన్. మాట ఇస్తాడు సందీప్. అంతే, నిశ్చింతగా చనిపోతాడు నవీన్. తదుపరి జరగవల్సిన కార్యక్రమాలు జరిపిస్తాడు సందీప్. నెలకి పదివేలు వినీలకి పంపుతానని చెప్తాడు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మాట తీసుకుంటుంది వినీల. ప్రతీ నెలా బ్యాంకులో తన ఎకౌంట్ నుంచి వినీల ఎకౌంట్‍కి డబ్బు వెళ్ళేలా ఏర్పాటు చేస్తాడు సందీప్. ఇది జరిగి ఐదేళ్ళయి పూర్తవుతాయి. పిజి పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు సందీప్. నందిని పెళ్ళి చేసుకున్నాడు. – ఇలా ఆడియోలో మొత్తం అన్ని వివరాలు లాయర్ మాధవికి వెల్లడిస్తాడు సందీప్. అంతా విన్న మాధవి వాళ్ళిద్దరినీ కలపడానికి తన వంతుగా మరో ప్రయత్నం చేయాలనుకుంటుంది. సందీప్, నందిని ఇద్దరిని కలిసి తన వద్దకు ఫార్మల్ కౌన్సిలింగ్‍కి రమ్మంటుంది. వచ్చాక, విడాకుల ప్రక్రియని అర్థమయ్యేలా వివరిస్తుంది. నందిని అనుమానాలు తొలగించేందుకు తాను సిద్ధమని అంటాడు సందీప్. వినడానికి ఇష్టపడదు నందిని. వారిద్దరి మేలు కోరే వ్యక్తిగా ఒక నలభై రోజుల పాటు నచ్చిన ప్రదేశాలు చూసి రమ్మని, తిరిగి వచ్చాకా కూడా విడిపోవాలని భావిస్తే తాను సాయం చేస్తానని చెబుతుంది. చివరికి ఒప్పుకుంటుంది నందిని. కాశీ వెడదామని సందీప్‍తో అంటుంది. – ఇక చదవండి]

[dropcap]నం[/dropcap]దిని ప్రయాణానికి అంగీకరించగానే సందీప్ ఇద్దరికీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసాడు. సందీప్ అమ్మా, నాన్నలకు చెప్పాడు.

“మేము ఒక నెల రోజులు ఉత్తరాది యాత్రలు చేసి వస్తాము” అని.

సరే! బయలుదేరారు.

సందీప్‌కి విండో సీట్ వచ్చింది కానీ నందినినే కూర్చోమన్నాడు. తెల్లవారుజామున బయలుదేరడం వలన తెల్లవారడం, సూర్యోదయం, మబ్బులు, నింగీ, నేలా మధ్యలో వర్షపు జల్లులూ, ఆకాశంలో విరిసిన ఇంద్రధనుస్సు కనులున్నవారి అదృష్టం. నందిని తన గగన విహారాన్ని తనలో తానే వల్లించుకుంది.

మానవమేధ సృజించిన లోహ విహంగంపై ఆకాశం లోకి ఎగిరా!

ఇది నా ఊరేనా?ఇళ్ళన్నీ కుప్పపోసినట్లు

ఇంటికీ ఇంటికీ మధ్యన హద్దులే లేనట్లు

పచ్చదనమే లేనట్లు ఒక్క చెట్టు కూడా కానరాదేం? అంతా కాంక్రీటు అరణ్యమే!

ఎగురుతున్నా ఇంకొంచెం మీదకి

పైన నీలాకాశం క్రింద వెండి మబ్బులు.

నింగీ నేలా ఏకమైనట్లే!

క్రింద అగాధ సాగరజలాలు

ఉవ్వెత్తున లేచిపడే అలలు

ఇప్పుడు చిన్నచిన్న ఏటితరగల్లా!

అఖండ జీవనది ఒక చిన్న కాలిబాటలా!

అది ఎండిపోతే?? అమ్మో! కోట్లాది మందికి నీరో?

ఇళ్ళనూ గ్రామాలను రాష్ట్రాలనూ విడదీసిన హద్దులేవీ?

ఈ పొలం ఈ తోటా, ఈ ఎకరాలూ

నావీ.. నావీ.. అని కొట్లాడుకుని

రక్తపుటేరులు పారించి

చరిత్రలో నరహంతకులుగా

మిగిలిన ఆ స్వార్థపు జీవులు ఏరీ?

అందుకే భూమి నాది అంటే

భూమాత ఫక్కున నవ్వుతుంది.

సన్నగా వినిపిస్తున్న ఆమె కవితాత్మక భావనలు విని మురిసిపోయాడు సందీప్. ఫ్లైట్ జైపూర్ వెళ్ళి అక్కడ నుండి వారణాసి చేరింది.

వారణాసిలో దిగి రూమ్ చేరగానే ధూళి దర్శనం అని శివయ్యను చూడడానికి బయల్దేరారు. ఇక్కడే ఉన్నాడని అనుకోవడం భ్రమ! కైలాస పర్వతం నుండి కన్యాకుమారి వరకు ఆయన లేనిదెక్కడ?

ఏమి చేతురా లింగా!

గంగ ఉదకము తెచ్చి నీకు

లింగ పూజలు చేద్దామంటే

గంగనున్న చేప కప్ప

ఎంగిలి అంటున్నాయి లింగా!

కమ్మని సంగీతంతో పాడాలనుకున్నాను

ఓంకారనాదం నీవని మరచిపోయాను.

ఆదిభిక్షువు వానినేమికోరేది?

బూదినిచ్చేవాడినేది అడిగేది?

***

కార్తీక సోమవారం.

కేదార్ ఘాట్‌లో స్నానం చేసి, హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగానికి అభిషేకం చేసి మెట్లు మీద కూర్చుంది నందిని. చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చి రకరకాల మాటలు చెప్పుకుంటూ కాసేపు కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు.

ఒక పురోహితుడు, అతని శిష్యులు కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు – నమ శివాయ అనే మంత్రం ఎలా వచ్చిందంటే పంచభూతాత్మకమైన అయిదింటి యొక్క మొదటి అక్షరాలతో వచ్చింది.

న భో. – ఆకాశం

మ రుత్ – వాయువు

శి ఖి – అగ్ని

వా లి – నీరు

య జ్యా – భూమి

గురుశిష్యుల సంభాషణలు ఒక పక్క వినిపిస్తున్నాయి.

తన దగ్గరలో ఒకామె కూర్చుంది. ఆమె అచ్చు తన నాయనమ్మ లాంటి ఆహార్యంతో ఉంది. ఆమెను చూస్తూంటే ఆశ్చర్యం వేసింది.

ఇంకా ఈరోజుల్లో ఇలా పాటిస్తున్నారా??

ఈ నిర్బంధ వైధవ్యాన్ని అణచివేయాలని సంఘ సంస్కర్తలు చేసిన పోరాటాలన్నీ వృథాయేనా??? ఎవరు నిర్బంధం చేసి ఉంటారు??

పొడవుగా, సన్నగా, ఆరోగ్యంగానే ఉన్నారు ఆమె.

ఇంతలో ఇంకొక ఆమె వచ్చారు. మాతృభాషలో తనివితీరా మాట్లాడుకోవాలంటే ‘కేదార్ ఘాట్’ వేదిక అని వాళ్ళిద్దరికీ తెలుసు కాబోలు. ఇంటిపేర్లు గోత్రాలుతో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

“మీరు కాశీ లోనే ఉండిపోతారట కదా! ఎంత అదృష్టవంతులో! కాశీలో మరణం అంటే సరాసరి విశ్వనాధుని పాదాల చెంతకే” కొత్తగా వచ్చిన ఆమె అన్నది.

“ఆ! ఉంటున్నాను పది సంవత్సరాలుగా. కానీ మరణం ఎక్కడో ఎవరు చెప్పగలం? మా దూరపు బంధువు ఒకరు పద్దెనిమిది సంవత్సరాలు కాశీలో ఉండి, కుటుంబ సభ్యులతో పండుగ గడపాలి అని వారం రోజుల కోసం ఇంటికి వెళ్ళిన మనిషి కాలు జారి పడి అక్కడే మరణించారు.” నిరాశగా అన్నారు నాయనమ్మలాగా ఉన్నామె.

“ఎక్కడ ఉంటున్నారు? నెలకు ఎంత ఖర్చవుతుంది? ఏ ఆశ్రమం బాగుంటుంది?” ప్రశ్నలు సంధించింది కొత్తగా వచ్చిన ఆమె.

“గర్భావాసం ఉంటారా?” నాయనమ్మ అడిగింది.

గర్భావాసం అంటే తల్లి కడుపులో బిడ్డ ఉన్నట్లుగా తొమ్మిది నెలల తొమ్మిది రోజుల తొమ్మిది గంటలు కాశీ నివాసం. కొందరు చాతుర్మాస కాలము ఇక్కడే ఉండి హరిహరులను పూజించుకుంటారు. కొందరు తొమ్మిది రాత్రులు ఉంటారు. ఎన్నాళ్లు ఉండాలో నిర్ణయించుకున్నాక వాటికి సంబంధించిన పూజా విధి విధానాలు చేసుకుంటారు.

“ఇక్కడ రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి. భోజనంతో కలిపి ఉన్నవి, మనమే వండుకునేందుకు అవకాశం ఉన్నవి, ఇద్దరు ముగ్గురుతో కలిపి ఉండవలసినవి, ‘పిండి కొద్దీ రొట్టె’.” అంటుండగా

“వెళ్దాం పదవే విశాలీ!” అంటూ ఇంకొక ఆమె వచ్చి నాయనమ్మను తీసుకువెళ్లి పోయారు.

కొత్తగా వచ్చిన ఆమె గుండెల్లో పుట్టెడు దుఃఖంతో గంగానదిని చూస్తూ ఉండిపోయింది. కొంతసేపటికి తేరుకుని నందినివైపు తిరిగింది.

“చూడమ్మా! నీకు తెలుగు వస్తుందా?” అనుమానంగా ప్రశ్నించింది. తల ఊపింది నందిని.

ఎప్పటి నుంచో కడుపులోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని వెలిపేసింది.

“నాకు ఎవరూ లేరమ్మా! భర్త పిల్లలు లేరు. ఒక గదిలో అద్దెకు ఉంటున్నాను విశాఖపట్టణంలో. అక్కడ కంటే కాశీలో మరణిస్తే పుణ్యం అని అంటున్నారు కదా! అందుకని ఇక్కడే ఉండిపోదాం. అని అనుకుంటున్నాను. అందుకే అందరినీ వివరాలు అడుగుతున్నాను. నీకు ఏమైనా తెలిస్తే చెప్పమ్మా!” వింటున్న నందిని నవ్వింది.

ఇంతలో ఇంకొక ఆమె దేవుడి దర్శనం చేసుకుని వచ్చినట్లుంది. “సౌభాగ్య వదినా! ఇక్కడ ఉన్నావా? పద పద వెళ్దాం.” అంటూ ఆమెను తీసుకుని వెళ్ళి పోయింది.

‘కోటానుకోట్ల ప్రజలు కోటానుకోట్ల సమస్యలు అసలు నీకు మనశ్శాంతి ఉంటుందా శివయ్యా!’ అంటూ నవ్వుకుంది.

నందినికి వాళ్ళు తొమ్మిది రాత్రులు తొమ్మిది గంటలు అనగానే ఏదో గుర్తుకొచ్చింది.

తాము తదియ రోజు విమానంలో బయలుదేరారు. రాత్రికి రూమ్ లోకి చేరారు. అక్కడినుంచి లెక్కపెడితే తను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన రోజు ఏకాదశి ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళింది. అంటే కాశీలో తాము నిర్దేశిత సమయం ఉండగానే ఫలితాన్ని ఇచ్చేసాడా? కొండలా భయపెడుతున్న సమస్య దూదిపింజలా గాలికి ఎగిరిపోయిందా?

అంటే నలభై రోజులు దీక్షా ప్రయాణం పూర్తి అయితే చాలా బాగుంటుంది అన్నమాట.

ఏవో లెక్కలు కట్టుకుంటూ ఆలోచనల్లో ఉన్న నందిని దూరంగా సందీప్ లెమన్ టీ మట్టి పిడతలో పట్టుకుని వస్తున్నాడు.

దగ్గరగా వచ్చే వరకు గమనించనే లేదు. గంగాతీరంలో లెమన్ చాయ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నందినికి ఎక్కువ సార్లు తాగాలని అనిపిస్తోంది.

***

‘బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం’ అని ఆర్చి పైన రాసి ఉన్న బోర్డు కాంతులీనుతూ ఆహ్వానిస్తోంది.

ఆ కూడలిలో పండిత్ మదన్ మోహన్ మాలవ్యగారు విగ్రహం నుండి చిరునవ్వుతో ఆహుతులను పలకరిస్తున్నారు.

ఆటో దిగి అడుగులు వేస్తున్న నందినిని చిరుగాలికి తలలూపుతూ సుమ బాలలు పరిమళ స్వాగతాన్ని అందించాయి.

అరవై నాలుగు కళలకు పుట్టినిల్లు అయిన కాశీలో అందరికీ విద్య అందాలనే సంకల్పంతో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నిర్మించిన విద్యాలయం.

ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. కాశీరాజు నరేష్ గారు విద్యాలయానికి కావలసిన స్థలాన్ని కేటాయించగా 1916లో పండిత్ మదన్ మోహన్ మాలవ్యాగారు శ్రీమతి అనిబిసెంట్ సహకారంతో స్థాపించారు. కాశీరాజు నరేష్‌ని ఉపకులపతిగా నియమించారు.

పేరులోనే ‘హిందూ’ అని ఉన్నప్పటికీ అన్ని మతస్తులు అన్ని దేశాల వారు అన్ని వయసుల వారికి ఇందులో ప్రవేశం ఉంది. అనేక విభాగాలు ఉన్నాయి.

ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలతో అలరారే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా గర్వించదగిన పేరు ప్రఖ్యాతులు పొందిన అనేకమంది దేశ విదేశీ విద్యార్థులనూ, అధ్యాపకులనూ, పరిశోధకులనూ ఆకర్షిస్తున్న సరస్వతీ మందిరం.

ఇక్కడ చదువుకున్న విద్యార్థులు భారత దేశ అత్యున్నత పురస్కారాలను పొందారు. సుమారు ఇరవై సంవత్సరాలు ఈ విశ్వవిద్యాలయానికి కులపతిగా పనిచేసిన పండిత్ మదన్ మోహన్ మాలవ్యగారికి భారతదేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ లభించింది.

ఆలోచిస్తూ నడుస్తున్న నందినికి ఒక్కసారి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది.

అదేంటి? తనకు ఎప్పుడూ ఇలా జరగలేదే??

ఆరోగ్యవంతురాలిగా అమ్మ తనను ఎంత బాగా పెంచిందో!

తాను ఏమైనా తింటూ ఉంటే ఎందుకు తినాలో, ఎందుకు తినకూడదో విపులంగా చెప్పేది.

అలాగే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో అమ్మదే ప్రధాన పాత్ర.

చిరునవ్వుకు గల శక్తి ఏమిటో? మాటలకు గల మహిమ ఏమిటో? చెప్పింది.

ఆశ, అత్యాశ, దురాశలకు గల తేడా చెప్పింది. అన్నిటికంటే సహనం గొప్ప సంపద ఎలాగో ఉదాహరణలతో వివరించింది.

అందుకే తనకు జరిగిన అన్యాయాన్ని పెదవి విప్పి ఎవరికి చెప్పలేదు.

తన నిర్ణయాన్ని గానీ, తమ మధ్య ఒప్పందాన్ని గానీ తమ ఇరువురి మధ్యే ఉంచింది.

ఇంక నడవలేక అక్కడే లాన్‌లో కూర్చుండిపోయింది.

ఎందుకిలా?? ఏమైంది???

ఆలోచిస్తూంటే కారణం లీలగా స్ఫురించి అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు విరిసింది.

నిజమా! ఇన్నాళ్ళకు.. పెళ్ళైన ఇన్నేళ్ళకు.. ఆ శివయ్య ఇలా కనికరించాడా???

బేగ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీసి కొంచెం నీళ్ళు తాగాక తగ్గినట్లు అనిపించింది.

నిజంగా ఎంత మంచి కుటుంబం! తనను ఎంతలా అక్కున చేర్చుకుంది. ఏ రోజూ ఇంట్లో గానీ.. ఎవరితో గానీ.. ఆ ప్రస్తావనే రాకుండా జాగ్రత్త పడేవారు.

పెళ్ళైన వెంటనే భర్తలో లోపాలని భార్యా, భార్యలో లోపాలని భర్తా నిందించుకుని డాక్టర్లు చుట్టూ, లేదా లాయర్లు చుట్టూ తిరిగే ఈ అసహనంతో కూడిన ప్రజలకు – భార్యాభర్తల ప్రేమానురాగాలే సంసార రథానికి ఇంధనమని ఎలా చెప్పగలం?

ఈరోజు సందీప్‌కి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది అని రూములో ఉండిపోయాడు. లేకుంటే రోజూ ఇద్దరం కలిపి అన్ని ప్రదేశాలకు వెళ్ళే వాళ్ళం. ఇవాళే ఇలా ఎందుకు జరిగింది??

కాలేజీ రోజులు నుండి తనకో కోరిక!

ఎప్పటికైనా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చూడాలని. అందుకే సందీప్ రాకపోయినా ఆటోలో బయల్దేరి వచ్చేసింది.

ఎంతోమంది విద్యార్థులు జీవితంలో ఒక్కసారైనా అడుగుపెట్టాలని కలలు కనే ఆ సరస్వతీ మందిరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ఒక్కసారి చుట్టూ చూసింది.

బిర్లావారు 2007లో నిర్మించిన ఆలయం. విద్యాలయం ఆవరణలో నూతనంగా నిర్మించబడిన శివాలయం. ఉదయాన్నే ప్రశాంతవేళలో చిరుగంటల సవ్వడి వినిపిస్తోంది. నెమ్మదిగా నడుచుకుంటూ కోవెలలో అడుగుపెట్టింది.

పూజారి ఆశీస్సులు అందించి ప్రసాదం ఇచ్చాడు. కళ్ళకద్దుకుని కనులు మూసుకుంది.

స్వామీ!

‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ కాకపోయినా ఒకరి అభిరుచులు, అలవాట్లు మరొకరు నచ్చుకుని కలిసి జీవితాంతం నడవాలని పెద్దల ఆశీస్సులతో ఒకటయ్యాము.

అతను నెలనెలా పదివేలు పంపి వేరొక కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిసింది. ఆ విషయం తనతో ఎందుకు చెప్పలేదు? పోనీ ఇంట్లో వారైనా ఏదో సందర్భంలో అనవచ్చుగా!

అందుకే వాళ్ళనైనా సుఖంగా ఉండనీ! అనుకుని అతను చెప్పేది వినకుండా విడాకులు తీసుకుందాము అనుకుంది.

విడిపోదామనుకున్నాక ఈ కాశీ ప్రయాణం ఏమిటో? ఎందుకు నీ దగ్గరకు రప్పించావో? రప్పించినా నలభై రోజులు ఉండడములో ఏ పరమార్థం దాగి ఉందో నీ భవిష్యత్ ప్రణాళిక తెలుసుకునే శక్తి నాకు లేదు. కానీ..

నాలోని ఈ మార్పు నీవందించే ప్రసాదమూ. దానిని తిరస్కరించి దైవద్రోహం చేయలేను.

అతను చెప్పినది నేను వినకపోయినా తనలో ఏ మార్పూ లేదు. బహుశా నేనే తప్పుగా ఆలోచించానేమో?

స్వామీ! సరియైన త్రోవను నడిపించు.

కళ్ళలో నీరూరుతోంది.

చేతిలోని మొబైల్ మోగింది.

నెంబర్ చూసింది. మాధవి. ఒక మెసేజ్, ఒక ఆడియో కనిపించాయి. భగవంతుని సన్నిధిలో ఉండగా తమను కలిపి ఉంచాలని ఎంతో ప్రయాసపడుతున్న లాయర్ మాధవి ఫోన్ రావడం కాకతాళీయంగా అనిపించలేదు. అయినా దీపూకి చెప్పిన తరువాతే ఈ విషయం ఎవరికైనా.

ఆ సమయం భగవంతుడే కల్పిస్తాడు. నిశ్చయించుకుంది.

అంత అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని అణువణువు స్వయంగా దర్శించాలని లైబ్రరీలో గంటలు గంటలు గడపాలని అనుకున్న నందిని బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుని రూమ్‌కి వచ్చేసింది.

రూముకి వచ్చిన నందిని నీరసంగా అనిపించడంతో రాగానే పడుకుంది.

లాప్‌టాప్‌లో ఆఫీసు పని చేస్తున్న సందీప్ ఆమెను చూసి వెంటనే షెల్ఫ్‌లో ఉన్న ఆపిల్ పండు కోసి పేపర్ ప్లేటులో ఆమె ముందు ఉంచాడు.

నందినికి అతనితో మాట్లాడాలని ఎంతగానో అనిపించింది.

పనిలో లీనమైన అతడినే చూస్తూ అలా నిద్రపోయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here