తొలగిన తెరలు-8

0
13

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[నెల రోజులు ఉత్తరాది యాత్రలు చేసి వస్తామని ఇంట్లో చెప్పి బయలుదేరుతారు సందీప్, నందిని. ముందుగా కాశీకి ఫ్లయిట్‍లో వెళ్తారు. ఆ గగన విహారాన్ని తనలో తానే వర్ణించుకుంటుంది నందిని. సన్నగా వినిపిస్తున్న ఆమె కవితాత్మక భావనలు విని మురిసిపోతాడు సందీప్. ఫ్లైట్ జైపూర్ వెళ్ళి అక్కడ నుండి వారణాసి చేరుతుంది. రూమ్‍కి చేరగానే ముందు వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటారు. కేదార్ ఘాట్‌లో స్నానం చేసి, హరిశ్చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగానికి అభిషేకం చేసి మెట్లు మీద కూర్చుంటుంది నందిని. చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ తారసపడతారు.  గురుశిష్యులిద్దరు మాట్లాడుకుంటూంటారు. నమశ్శివాయ అనే మంత్రం ఎలా వచ్చిందో గురువుగారు శిష్యుడికి వివరిస్తారు. ఇంతలో అక్కడికి ఇద్దరు స్త్రీలు వచ్చి ఒకరినొకరు పరిచయం చేసుకుని మాట్లాడుకుంటారు. కాశీలోనే ఉండిపోవాలంటే నెలకు ఎంత ఖర్చవుతుందో అని ఒకామె అడుగుతుంది. ఇద్దర్లోకి పెద్దావిడ ఆమెకు వివరాలు చెప్తుంది. కాసేపటికి ఆ పెద్దావిడ వెళ్ళిపోయాక, రెండో ఆవిడ నందినిని పలకరించి మాట్లాడుతుంది. తాను ఒంటరిననీ, కాశీలో మరణిస్తే పుణ్యం అని ఇక్కడికి వచ్చాననీ, వివరాలు తెలిస్తే చెప్పమని అడుగుతుంది. ఇంతలో ఆమె వెంట వచ్చిన మరో స్త్రీ వచ్చి ఆమెను తనతో తీసుకువెడుతుంది. నందిని ఆలోచనలో పడుతుంది. సందీప్ మట్టి పిడతలలో లెమన్ టీ  తెచ్చి ఇస్తాడు. మర్నాడు నందిని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వెడుతుంది. అక్కడ అన్నీ చూస్తుండగా, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నందినికి. ఏమైంది తనకి ఆలోచిస్తుంటే, కారణం లీలగా స్ఫురిస్తుందామెకు. తాను గర్భం దాల్చినట్టు గ్రహిస్తుంది. యూనివర్శిటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శివాలయంలో శివుడిని దర్శించి, అపోహలను తొలగించి సరైన దారిలో నడిపించమని ప్రార్థిస్తుంది. అప్పుడే ఆమె మొబైల్ మోగుతుంది. మాధవి నుంచి. ఒక మెసేజ్, ఒక ఆడియో ఫైల్ వస్తాయి. బాగా నీరసంగా అనిపించటంతో ఆటో మాట్లాడుకుని గదికి వచ్చేస్తుంది. లాప్‍టాప్‍లో ఆఫీసు పని చేసుకుంటున్న సందీప్, ఒక ఆపిల్ పండు కోసి నందినికి ఇస్తాడు. అతనితో మాట్లాడాలని అనిపించినా, సందీప్ పనిలో లీనమవడంతో, నిద్రపోతుంది నందిని. – ఇక చదవండి]

[dropcap]‘గం[/dropcap]గా ఆరతి’ కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద క్రమం తప్పకుండా ఒకే సమయానికి ఇస్తారు.

బ్రహ్మదేవుడు గంగానది ఒడ్డున పది అశ్వమేధ యాగాలను చేసిన ప్రదేశం కనుక దీనిని దశాశ్వమేధ ఘాట్ అంటారు.

సాయంత్రం అయిదున్నరకే నందినీ, సందీప్ గంగాతీరం చేరారు.

హారతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఒక విశిష్ట అతిథి గంగానదికి పూజ చేసిన తరువాత హారతి ఇవ్వడం ప్రారంభమవుతుంది. హారతి ఇచ్చే మండపాలపై పూజాసామాగ్రి సర్దుతున్నారు. ప్రధాన మండపానికి అటు మూడూ, ఇటు మూడూ మొత్తం ఏడు మంటపాలు ప్రధాన మండపములో సత్య సాయిబాబా ఫోటో, శీతలాదేవి ఫోటో, శివుని విగ్రహాలు, శంఖాలు, ధూపానికి, దీపాలకు, హారతులకూ అన్నీ అమర్చబడి ఉన్నాయి.

ఒకే రకమైన పట్టు పంచెలు కట్టుకుని విజ్ఞానమే వారి యొక్క తేజస్సుగా కళకళలాడుతూ వేదిక మీదకు వచ్చారు. అందరూ కలిపి పూజ చేసిన తరువాత వారి వారి మండపాల వద్దకు వెళ్లారు. రకరకాల శివస్తుతి చేస్తూ గంగా హారతి ఇచ్చారు. డమరూ వాద్యం, చిరుగంటల నాదం, సంగీతకారుల వాయిద్యాల రవళి, స్తుతులకు అనుగుణంగా తాళం వేస్తున్న భక్తులు ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత వెల్లువెత్తి గంగమ్మ తల్లి ప్రతి సాయంత్రం తనను తాను శుద్ధి పరచుకుంటూ తన బిడ్డలే కదా అని మన తప్పులను క్షమించేస్తోంది.

ఎంతైనా అమ్మకదా! నదీరూపంలో ఉన్న అమ్మ! చేతులెత్తి నమస్కరించి బయలుదేరారు.

***

కాశీ నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారనాథ్ చూడడానికి నందిని, సందీప్ ఉదయాన్నే ఆటోలో బయల్దేరారు.

జింకలవనంగా పేరు పడిన ఈ ప్రదేశంలో చెట్టు కింద తన శిష్యులు ఐదుగురికి తాను పొందిన ముక్తి మార్గాన్ని జ్ఞానోపదేశం చేస్తున్నట్లున్న విగ్రహాలు సజీవమూర్తులుగా భాసించాయి. దీన్నే ‘ధర్మచక్రప్రవర్తనం’ అంటారు.

బుద్ధుని చూస్తూ ఉంటే నందిని మనసు అత్యంత ప్రశాంతంగా అపరిమిత ఆనందంతో నిండిపోయింది. చిన్నప్పుడు శ్రీరామారావు మాస్టారు బాలవికాస్ తరగతులలో చెప్పిన గౌతమబుద్ధుని కథ తలచుకుంటూ అక్కడే కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయింది.

బుద్ధుడు మూర్తీభవించిన సత్యము, శాంతి, ప్రేమ, కరుణ, త్యాగము, అహింసలకు ఆలవాలము.

బుద్ధుడు జన్మించి ఎన్నో వేల సంవత్సరములు గడిచినప్పటికీ బౌద్ధ ఇతిహాసము మనకు మరింత రుచికరంగా, రాసిన వారి కలములు మరింత పదును ఎక్కునట్లుగా ఉంటుంది. దాశరధి కృష్ణమాచార్యులు గారు రాసిన ‘మహాబోధి’ ఖండకావ్యం లోని పద్యాలు మనసులో మెదిలాయి.

విశ్వశాంతిని స్థాపించడానికి ‘సర్వమానవ సౌభ్రాతృత్వం’ అనే మార్గం అత్యున్నతమైనదని తెలియజేసాడు. ఎందుకంటే

“లోకమెల్ల శోకమయము

జరా మృత్యు జన్మ భయము

బాధాస్పద బహుగాథా సంకులం

తీవ్ర మోహాస్పద దుఃఖ భావ పంకిలం”

అని తలచిన గౌతముడు

రాజ్యమును, కీర్తిని, భార్యను, పుత్రుని విడిచి అర్ధరాత్రి దివ్య తేజస్సును వెతుక్కుంటూ విశ్వకళ్యాణం కోసమై అడవులకు బయలుదేరాడు. సకల మానవాళికి దివ్య శాంతిపథమును చూపుటకై తపము చేసాడు.

అతి తీవ్ర తపస్సు చేస్తున్న బుద్ధుని ఎవ్వరూ తపోభంగం చేయలేకపోయారు. వైశాఖ పూర్ణిమనాడు చీకటులంతరించి, తపము ఫలించిన బుద్ధుని కాంతి లోకాలెల్ల వ్యాపింపగా, నిరంజనా నదీతీరమున దేవతలు విమానములెక్కి బుద్ధుని చూడాలని వచ్చారు. అప్సరసలు కాలినడకన వచ్చి అతనికి సేవలు చేసారు. భూమిపైనున్న సకల ప్రాణులు, బ్రాహ్మణాది చాతుర్వర్ణ ప్రజలు భేదభావములు మరచి తథాగతుని శరణువేడిరి.

బుద్ధుడు తపము చేయు సమయాన మనోవీధిలో తనుగాంచిన పంచ స్వప్నములు జ్ఞప్తికి తెచ్చుకొని. ఎన్నో పరీక్షలకు నిలబడి, అరిషడ్వర్గాలపై విజేతగా నిలిచిన తనవద్దకు వచ్చినవారికి ఇట్లు చెప్పెను.

వజ్రధార కన్న వాగ్దార నిశితంబు,

తూపు కన్న రమణి చూపు వాడి,

క్రోధవహ్ని కన్న రుచిరహాసము వేడి,

శాంతి జయకరమ్ము క్రాంతికన్న.

(దాశరథి కృష్ణమాచార్య)

నందిని ప్రధాన మందిరం చుట్టూ ప్రదక్షిణ చేద్దాము అనుకుంది. ఆలయం చుట్టూ 32 బౌద్ధ ప్రతిమలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇంతలో బౌద్ధ నేపాలీయులు చాలామంది వివిధ వాద్యపరికరాలతో వచ్చి ప్రధాన మతగురువుని అతని పాదాల కింద కాషాయరంగు వస్త్రాలు పరుస్తూ, ఛత్రచామరాలతో ఆలయ ప్రవేశం చేయించారు.

ప్రశాంతత నిండిన ఆ ప్రభాతవేళ అందరికీ ఒక నమస్కారం చేసి బయటకు నడిచారు వీరిద్దరూ.

సారనాథ్‌లో మగ్గాలపై నచ్చిన రంగుల్లో చీరెలు నేసి, అమ్మే షాపు చూపిస్తానని ఆటోవాడు తీసుకెళ్ళాడు.

ముందు వద్దు అనుకుంది. కానీ ఇంటి దగ్గర అందరికీ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ లోపలకు అడుగుపెట్టింది.

అద్భుతమైన చీరలను అలవోకగా నేసే ఆ నేతపనివారి నైపుణ్యాన్ని మెచ్చుకుంటూ, మామగారికి ఒక మంచి షాల్, అత్తగారికీ, అమ్మకూ, స్పందనకు, చీరలు తీసుకుంది. సింహాద్రికి కూడా చీర తీసుకుంటున్న ఆమె శ్రద్ధకు ముచ్చటేసింది సందీప్‌కి.

షాప్ యజమానితో మాట్లాడి ఆన్‌లైన్ పేమెంట్ చేసి, ఇంటి అడ్రస్‌కి కొరియర్ పంపించే ఏర్పాట్లు చేశాడు.

“సారనాథ్ వచ్చినవాళ్లు గుర్తుగా స్నేహితులకు చీర కొనివ్వాలిట!” అంటూ అక్కడ ఉన్న మెహందీ కలర్ పై సన్నని జరీ వర్క్‌తో మెరుస్తున్న చీరపై చెయ్యి వేసాడు.

నందిని దృష్టి కూడా అప్పుడే ఆ చీరపై పడి ఆమె కూడా ఆ చీరపై చేయి వేసింది. ఆమె చేతిని స్నేహపూర్వకంగా టచ్ చేసి

“తీసుకో నందూ! స్నేహితునిగా నీకు బహుమతి..” అన్నాడు.

నిజంగానే నందినికి ఆ చీర చాలా నచ్చింది. అతనికి చెప్పాలనుకున్నది చెప్పలేక మనసులోని భావాన్నంతా కనులలోకి తెచ్చుకుని అతడినే చూస్తూ

“థాంక్యూ! దీపూ!” అంది అప్రయత్నంగా.

మాటలు మంత్రాలైతే అతనికి ఆమె అర్థమైపోయినట్లే!

***

తులసి ఘాట్ దగ్గర చాలా క్రింద వరకూ మెట్లు దిగితేనే గాని గంగమ్మను చేరలేము. కానీ అక్కడి నుండి చూస్తే తులసీదాస్ రాసిన ‘రామచరిత మానస్’ గుర్తుకువస్తుంది.

సాధు సజ్జనులను కాపాడడానికి అధర్మాన్ని అణచివేయడానికి భగవంతుడు ఏ విధంగా అవతారాలు ఎత్తుతూ ఉంటాడో భగవంతుని లీలలను ప్రకటితం చేయడానికి తమ జీవితాలనే ఉదాహరణలుగా నిలిపే కారణజన్ములు కూడా అవతరిస్తూ ఉంటారు.

మతాల మారణహోమం జరిగే నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరి సుఖశాంతులను కోరుతూ రచింపబడి భగవానునిచే ‘సత్యం శివం సుందరం’ అని సంతకం చేయించుకున్న గ్రంథరాజము.

సంపూర్ణ భారతీయ సంస్కృతిని తెలుసుకోవాలంటే మానవతా విలువలతో కూడిన రామచరితమానస్ ఆకళింపు చేసుకోవాలి.

తులసీదాస్ తాను చిన్నప్పుడు విన్న ఆధ్యాత్మిక రామాయణం కీర్తనలు, భగవద్గీతసారము కలిపి రాసిన ‘రామచరితమానస్’ అలాగే పదవ తరగతి వరకు హిందీ పాఠ్యాంశంలోని తులసి దోహాలు గుర్తుకు రాక మానవు.

ఎంత చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా రాసాడో!! అంతేనా! ఈ గంగమ్మ ఒడ్డునే శ్రావ్యంగా వారికి చదివి వినిపించాడు కూడా అంటే మనస్సు ఆనందంతో ఉప్పొంగుతుంది. అదిగో! అదిగో! ఆ చెట్టు మీద వానర రూపంలో ఉన్న హనుమ వృద్ధుడిగా అందరికంటే ముందు వచ్చి కూర్చుని, పురాణపఠనం అంతా అయాక ఆఖరున వెళ్ళేవాడు. అంటే ఆ చెట్టుగాలి పీల్చుకుంటే జీవితానికంతకూ సరిపడే ఆక్సిజన్ ఇస్తుంది.

రామ్ నామ్ మణిదీప్

ధరూ జీహ్ దేహరీ ద్వార

తులసీ భీతర్ బాహేరహూ

 జౌ చాహసి ఉజిఆర్// దోహా:21

లోపలా, బయటా కూడా ప్రకాశమే కావాలనుకుంటే ముఖమనే ద్వారమున నాలుక అనే గడపపై రామనామము అనే మణి దీపమును ఉంచుము.

సూక్ష్మంలో మోక్షం అందించిన మహనీయుడు.

శ్రీ రామచరిత మానస్ భారతదేశంలోని ఉత్తమ గ్రంథాలలో అత్యుత్తమమైనది. అంతేకాక విశ్వసాహిత్యంలోనే విశిష్టస్థానం సంపాదించుకున్నది. భాష, శైలి, శిల్పం, పాత్ర చిత్రణ మున్నగు విషయాలలో ఉత్తమ కావ్య లక్షణాలు కలిగిన నవరస భరితమైన గ్రంథము. భక్తి జ్ఞాన వైరాగ్యములకు సంబంధించిన ఉపదేశములతో పండిత పామరులను అలరిస్తూ ఉంది.

మెట్లెక్కి ఆంజనేయుని విగ్రహానికి భక్తితో ఇరువురూ నమస్కరించారు.

తులసీదాస్ రచించిన ‘హనుమాన్ చాలీసా’ ప్రపంచములోని అన్ని వయసులవారి నాలుకలపై అనర్గళంగా ఆలపించబడుతోంది. అది ఒక్కటి చాలు మనిషికి నిరాశలో ఆశా దీపం వెలిగించే చైతన్య దీపిక.

అక్కడే మెట్టుపై కూర్చుని శ్రావ్యంగా ఆలపించసాగింది.

వింటున్న సందీప్ ఆనందంతో పరవశిస్తూ అంత దగ్గరగా ఉన్న ఆమె నుండి ఏ సానుకూల సందేశాలు అందుతున్నాయో – ‘ఎన్ని జన్మల పుణ్యమో మా ఇరువురి బంధము, తండ్రీ! విచ్ఛిన్నం కానీయకు’ మనస్ఫూర్తిగా అనుకున్నాడు.

పక్కనే వేదాధ్యయనం చేసే అధ్యయన కేంద్రం ఉంది. ఆ విద్యార్థులూ, వారి ఆహార్యమూ చూస్తూంటే విద్యార్థులకు కావలసినది విజ్ఞానాన్ని అందించే గురువులే తప్ప బాహ్య ఆడంబరాలు కాదని ఎప్పుడు తెలుసుకుంటారో?? అనుకుంది.

శతాబ్దాల స్మృతులు ఆ ప్రాచీన వృక్షం అందిస్తూ ఉంటే, క్రింద వడిగా ప్రవహించే గంగమ్మను చూస్తూ మెట్లమీద కూర్చుని ఎంత సమయం గడిపారో తెలియలేదు. రీఛార్జ్ అవ్వడం అంటే ఇదేనేమో!!

***

తెలతెలవారుతూంటే నిద్రలేచి, చిరు చలిగాలిలో రూంకి తాళం వేసి ఇద్దరూ బయల్దేరారు. ఒడ్డున గల అన్ని ఘాట్లలో జనం.. జనం.. నావలలో నది అవతలి ఒడ్డుకు కూడా చేరిన జనం.

ఆ రోజు కార్తీక పౌర్ణమి.

సూర్యోదయాత్పూర్వమే పవిత్ర గంగానదీ జలాల్లో స్నానం చేయాలని, పూజారులతో సంకల్పం చెప్పించుకుని అర్ఘ్యాలు వదలాలని కోరికతో ఎన్నెన్నో ప్రయాసలుపడి ఇంతటి పవిత్ర భూమిలో నిత్య నైమిత్తిక కర్మలను శ్రద్ధగా చేయాలని ఆరాటపడే జనం.

నందిని మనసులో తాము కూడా అలా చేస్తేనో అనిపించింది.

ఇంతలో ఒక పురోహితుడు వారి దగ్గరగా వచ్చి

“అమ్మా! ఇవాళ హరిహరాదులకు ప్రియమైన కార్తీక పౌర్ణమి. దేవ దీపావళి. ఇంత పవిత్రమైనరోజు పవిత్ర గంగానదిలో మీరు సరిగంగ స్నానాలు చేస్తే మంచిదమ్మా!” అంటుంటే

ఆమె మనసు గ్రహించినట్లుగా

“అలాగే!” అంటూ ఆమె చేయి అందుకున్నాడు సందీప్.

ఒకరి చేయి ఒకరు పట్టుకుని నీళ్ళల్లోకి దిగారు. ఇంతలో ఒడ్డున స్నానం చేస్తున్న ఒక పండు ముత్తయిదువ దగ్గరగా పిలిచి పసుపు కుంకుమ పట్టుకొని చేతిలోకి వేస్తూ

“బేటీ! ఇలాగ స్నానాలు చేసే దంపతులు గంగమ్మ తల్లికి నమస్కరించి గోరంత పసుపు కుంకుమలు అందుకుని కొండంత పసుపుకుంకుమలు అక్షయంగా ప్రసాదించమని అనుకోవాలి.

గంగమ్మకు పసుపు కుంకుమ ఇచ్చాక బొట్టు పెట్టుకుని మొహానికి, కాళ్లకు, సూత్రాలకు పసుపు రాసుకోవాలి. అప్పుడు స్నానం చేయాలి” అని చెప్పింది.

నందిని చిరునవ్వుతో అలాగే అంది.

పురోహితుడు సంకల్పం చెప్పించి స్నానాలు చేయించి, ఇరువురికీ విభూది కుంకుమ అక్షతలు కలిపి బొట్టు పెట్టి దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారు.

“దీపూ! ఒక్క నిమిషం.” అంటూ వెనక్కి తిరిగి గంగాజలం దోసిలి నిండా తీసుకుని  గంగమ్మ తల్లి సాక్షిగా “అమ్మా! మా వలన ఏమైనా దోషాలు ఉంటే కలుషహారిణివి కరుణించు. ఏ దైవ శక్తి ప్రేరణతోనో మేము నీ సన్నిధికి చేరాము. ఇక్కడ ఈ పవిత్ర స్థలంలో నీ పావన జలాల సాక్షిగా చెపుతున్నాను.

దీపూ తన తప్పు లేదని కారణాలు చెపుతూ మాధవికి పంపిన ఆడియో నాకు పంపింది. కానీ అది నేను వినాలి అనుకోవడం లేదు. అతని మీద నమ్మకం కోల్పోయి ఇప్పటివరకు నేను పడిన వేదన చాలు.

అతను అత్యవసర పరిస్థితిలో ఎవరికో సహాయం చేసి ఉంటాడని భావిస్తున్నాను, ఆ లక్షణమే నాలో కూడా ఉంది కనుక. నాలోని అపోహ తొలగిపోయింది.

యుగాలుగా నీ పవిత్ర జలాల్లో పునీతులైన లక్షలాది భక్తులు సాక్షిగా మేము ఇది వరకులాగే అన్యోన్యంగా ఉంటూ పూర్తి ప్రేమను పొందుతామని నా కడుపులోని బిడ్డ సాక్షిగా నీకు చెప్తున్నాను.”

ఆమె పైకే స్పష్టంగా చెపుతున్న మాటలు గంగా తరంగాల ద్వారా చెవినపడిన సందీప్ ఆమెను సంభ్రమంగా చూస్తూ నిలబడ్డాడు.

తండ్రి కాబోతున్న ఆనందంతో ఒక అడుగు ముందుకు వేసి ఆమెను తన గుండెకు దగ్గరగా చేర్చుకున్నాడు.

ఇరువురి మనసుల్లో అంతవరకు అడ్డంగా ఉన్న తెరలు తొలగి తేలిక పడిన మనసులతో ఆ మధుర ఘడియలను మౌనంగా ఆస్వాదిస్తూంటే మౌనానికి గల అద్భుతశక్తి ప్రకటితమైంది.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here