తొలగిన తెరలు-9

0
16

[దండెంరాజు ఫౌండేషన్ వారు నిర్వహించిన చిరు నవలల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన ‘తొలగిన తెరలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. చివుకుల శ్రీలక్ష్మి గారు ఈ నవలని వారణాసి నేపథ్యంలో రచించారు.]

[‘గంగా ఆరతి’ కోసం దశాశ్వమేధ ఘాట్ చేరుకుంటారు సందీప్, నందిని. హారతిచ్చేవారు ఒకే రకమైన పట్టు పంచెలు కట్టుకుని, విజ్ఞానమే వారి యొక్క తేజస్సుగా కళకళలాడుతూ వేదిక మీదకు వస్తారు. అందరూ కలిపి పూజ చేసిన తరువాత వారి వారి మండపాల వద్దకు వెళ్తారు. రకరకాల శివస్తుతి చేస్తూ గంగా హారతి ఇస్తారు. మర్నాడు సారనాథ్ చూడ్డానికి వెళ్తారు నందిని, సందీప్. అక్కడ జింకలవనంగా పేరు పడిన ప్రదేశంలో చెట్టు కింద తన శిష్యులు ఐదుగురికి తాను పొందిన ముక్తి మార్గాన్ని బుద్ధుడు ఉపదేశిస్తున్నట్లున్న విగ్రహాలు వారిని ఆకర్షిస్తాయి. దాశరధి కృష్ణమాచార్యులు గారు రాసిన ‘మహాబోధి’ ఖండకావ్యం లోని పద్యాలను గుర్తు చేసుకుంటుంది నందిని. ప్రధాన మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసి, కాసేపు కూర్చున్నాకా బయటకి వస్తారు. సారనాథ్‍లో మగ్గాలపై నచ్చిన రంగులో చీరలు నేసి, అమ్మే కొట్టుకి ఆటో అతను తీసుకువెళ్తాడు. మామగారికి ఒక మంచి షాల్, అత్తగారికీ, అమ్మకూ, స్పందనకు, సింహాద్రికి చీరలు తీసుకుంటుంది నందిని. షాప్ యజమానితో మాట్లాడి ఆన్‌లైన్ పేమెంట్ చేసి, ఇంటి అడ్రస్‌కి కొరియర్ పంపించే ఏర్పాట్లు చేస్తాడు సందీప్. నందినికి మెహందీ కలర్‍లో జరీ వర్క్‌తో మెరుస్తున్న చీరని కొంటాడు. మర్నాడు తులసీఘాట్‍కి వెళ్ళి రామచరిత్ మానస్‍ని తలచుకుంటారు. అక్కడున్న హనుమంతుని ఆలయాన్ని సందర్శించారు. తమ బంధాన్ని విచ్ఛిన్నం కానీయవద్దని కోరుకుంటాడు సందీప్. క్రింద వడిగా ప్రవహించే గంగమ్మను చూస్తూ మెట్లమీద కూర్చుని చాలాసేపు గడిపి రీఛార్జ్ అవుతారిద్దరూ. మర్నాడు కార్తీక పౌర్ణమి. ఒక పురోహితుడు వచ్చే ఆ రోజు గంగాస్నానం చేస్తే శుభప్రదమని చెప్పగా, సరేనంటారు. ఒక పెద్దావిడ వచ్చి గంగాస్నానం ఎలా చేయాలో చెప్పి, నందినికి పసుపు కుంకుమ ఇస్తుంది. పురోహితుడు సంకల్పం చెప్పించి స్నానాలు చేయించి, ఇరువురికీ విభూది కుంకుమ అక్షతలు కలిపి బొట్టు పెట్టి దక్షిణ తీసుకుని వెళ్ళిపోతాడు. నందిని దోసిలి నిండా నీరు తీసుకుని – తన అపోహలు తొలగిపోయాయని, ఇకపై తాము అన్యోన్యంగా ఉంటామని, నా కడుపులో బిడ్డ సాక్షిగ చెప్తున్నాను – అని  గంగమ్మతో అంటుంది నందిని. ఆ మాట విన్న సందీప్ సంతోషిస్తాడు. వాళ్ళ మధ్య ఉన్న తెరలు తొలగిపోతాయి. – ఇక చదవండి]

[dropcap]స్నా[/dropcap]నం చేసి బయటికి వచ్చిన ఆ దంపతులకు పురోహితులు స్థలమహాత్మ్యాన్ని గురించి క్లుప్తంగా ఇలా చెప్పారు.

“అమ్మా! ఈ కాశీ మహత్యాన్ని శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు. వినండి. విశ్వేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది.

‘స్వామీ! సమస్త దేవతలకు వారి వారి నివాస స్థానాలు ఉన్నాయి. మన ఇల్లు ఎక్కడ ఉంది?’ అని అడిగిన ప్రశ్నకు శివుడు అప్పటికప్పుడు నిర్మించి తన అర్ధాంగికి కానుకగా ఇచ్చిన పురమే కాశీనగరము.

కుడిఎడమల నుండి వరుణ అసి నదులు గంగలో కలుస్తాయి. మధ్యలో ఉన్న ప్రాంతమే వారణాసి, కాశి అదే సప్తపురులలో మిన్న అయినది.

ఈ కాశీ నగరములో సకల దేవతలు నివాసముంటారు.

‘అనంతమైన మహిమలు గల ఈ పురము యొక్క విశేషాలు చెప్పండి.’ అని పార్వతి అడుగగా శివుడు ఈ విధంగా చెపుతాడు.

ఈ కాశీ పురములో నేను స్వయంభూ లింగంగా వెలసి విశ్వేశ్వరలింగంగా పూజలందుకుంటాను.

మనము ఎప్పుడూ కాశీ విడిచిపెట్టకుండా ఇక్కడే ఉంటాము కనుక ఈ పురాన్ని ‘అవిముక్త క్షేత్రము’ అంటారు.

అదే విధంగా ప్రళయ సమయములో ప్రపంచమంతా మునిగినా నా యొక్క త్రిశూలము కొసపై ఈ వారణాసి నగరం నిలబడి ఉంటుంది.

ఈశ్వరునకు అమితానందము కలిగించును కనుక దీనిని ‘ఆనందకాననం’ అని కూడా అంటారు.

ఈ కాశీ నగరము నిండా అనంతంగా వ్యాపించి యున్న శివలింగాలు సప్తమాతృకలు, షోడశ కళలు,  అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, నవదుర్గలూ, దశమహావిద్యలూ, ద్వాదశాదిత్యులు, నవ బ్రహ్మలు, వినాయకుని యాభైఆరు గణాలు, విష్ణుమూర్తి ప్రతిష్ఠ చేసినవి.”

అని ఆ పురోహితులు నందినీ, సందీప్ లకు కాశీపురము యొక్క గొప్పతనాన్ని తెలిపారు.

వేదన తొలగిన స్వచ్ఛమైన మనసులతో విశ్వేశ్వర దర్శనానికి బయలుదేరారు చేతిలో ఒక రాగి పాత్రతో గంగా జలాలు తీసుకుని.

తెల్లవారుజాము నుండి ఐదు సార్లు స్వామికి ఆహ్లాదాన్ని కలిగించే వాద్య పరికరాలు షహనాయీ, వేణువు, మృదంగం, శంఖం, డమరూ స్వామి ఎదురుగా వాయిస్తూ పరవశించిపోతున్నారు ఆ వాద్యకారులు.

షహనాయీ వాయిద్యం వినగానే నందిని మదిలో ‘ఉస్తాద్’గా పిలువబడే బిస్మిల్లాఖాన్ గుర్తొచ్చారు.

ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు, సాంప్రదాయ వేడుకలలో వాయించే సన్నాయిని కచేరీల స్థాయికి తీసుకువెళ్ళిన ఘనత అతనిదే! సరస్వతిమాతను అర్చించడానికి భాషాపరమైన, మతపరమైన భేదాలు లేవని తన రక్తంలో భారతీయ సంగీతమే ప్రవహిస్తోందని షహనాయీ ప్రజల మధ్య శాంతి ప్రేమలను అందించే సాధనంగా భావించాడు.

అనేక దేశాలు పిలిచి ఎన్నెన్నో గౌరవాలు ఇస్తానన్నా కాశీ విశ్వనాథుని విడిచి రాలేనన్న మహా దేశ భక్తుడు. భారతదేశ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ఈ దేశభక్తునికి అందించారు.

జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం జరిగినప్పుడు జెండా ఎగిరిన తర్వాత బిస్మిల్లా ఖాన్ షహనాయీ వాద్య కచేరి తప్పనిసరిగా ఉండేది అతని జీవన పర్యంతం కొనసాగుతూనే వచ్చింది.

పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రుడు. కాశీ విశ్వనాథుని సన్నిధిలో షహనాయి వాయించి అతనిని పరవశింప చేసాడు. సమకాలీన విద్వాంసుల మన్ననలందిన సంగీతవాద్యకారుడు.

అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వేణుగాన విద్వాంసుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా ఇతని వాద్యము ‘గోల్డెన్ రాగా’ కలెక్షన్ పేరుతో అందరికీ పరిచయమే. ఇతని బాసురీ వాదన ప్రభాత సమయంలో వినడం ద్వారా శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుంది. వీరిని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన వారు కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు.

అతనే దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ సినిమా కోసం పాట రాసిన సీతారామశాస్త్రిగారు, పాడినవారు గానగంధర్వుడు బాలసుబ్రమణ్యంగారు, సంగీతం శ్రీ హరిప్రసాద్ చౌరాసియాగారు ఈ కళాసంగమం  తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం.

ఎందరెందరో మహనీయులను అక్కున చేర్చుకున్న కాశీ నగరవాసి అన్నపూర్ణ సహిత శ్రీ విశ్వనాథునికి  ఎన్ని ప్రణామాలు అర్పించగలము?

కొన్ని వేలమందికి దర్శనం చేసుకునేందుకు అనువుగా విశాలమైన ఆవరణలో నిర్మించబడింది. చుట్టూ పాల రాతి పలకలపై గోడలకు దివోదాసు కథ చిత్రములతో లిఖించబడింది.

గంగాదేవి, బద్రీనాథ్, సత్యనారాయణస్వామి, పార్వతిదేవి, జ్ఞానవాపిలో నూతనంగా ప్రతిష్ఠితుడైన శివుడు, ఆంజనేయుడు, అవిముక్తేశ్వరుడు పరివేష్టించి ఉండగా మధ్యలో విశ్వేశ్వరుని స్వయంభూలింగం స్వర్ణ శిఖరాలతో దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంటుంది.

భక్తులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కుడ్యములపై శివతాండవ స్తోత్రం, లింగాష్టకం, చంద్రశేఖరాష్టకం, అన్నపూర్ణ అష్టకం మొదలైనవి రాయబడి ఉన్నవి.

ఒకరి వెనుక ఒకరు వరుసలో నిలబడి

శంభో శంకరా!

బంబం బోలేనాథ్!

నినాదాలతో మనస్ఫూర్తిగా ప్రార్ధించుకుంటూ తమ వంతు వచ్చేవరకూ సహనంతో వేచి ఉంటున్నారు. స్వామిని దర్శించిన వేళల అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతితో కనులూ, మనసూ ఆర్ద్రమై జన్మ తరించిన భావనతో బయటకు వస్తున్నారు.

పాశ్చాత్యపు పెనుతుఫానులకు రెపరెపలాడినా ఆ అఖండజ్యోతి నిరంతరం వెలిగేందుకు తమ చేతులు అడ్డుపెట్టే మహనీయులు జన్మిస్తూనే ఉంటారు. ఈ భారతదేశంలో జన్మించిన అందరినీ ఆ విశ్వేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుంటూ తిరుగుముఖం పట్టారు ఆ దంపతులు.

***

దేవ దీపావళి సాయంత్రం దివ్య దీపావళి ఎనభై నాలుగు ఘాట్‌లు దీపాలతో అలంకరించారు. నూనె దీపాలు, కొవ్వొత్తి దీపాలు, ఎలక్ట్రిక్ దీపాలు, రంగురంగుల నియాన్ బల్బు కాంతులు ఆరుతూ వెలుగుతూ స్వర్గ పురమును తలదన్నేదిగా ఉన్న ఆ వారణాసి వైభవం, ఆ సదాశివుని వైభోగం చూడడానికి వేయి కన్నులు చాలవు. నుతియింప సహస్ర ఫణికైనా వశము కాదు.

సందీప్ నందిని గంగా తీరానికి వచ్చారు. ఘాట్ మధ్య తిప్పి తీసుకురావటానికి బోటు ఎక్కారు.

సూర్యాస్తమయం పూర్తిగా కాలేదు. దీపాలు అక్కడక్కడా వెలిగిస్తున్నారు. సూర్యకాంతి గంగా జలాలపై పడి కాంతులీనుతోంది.

రేయీపగలూ కలిపే సూత్రం సాంధ్యరాగం

కాదా నీలో నాలో పొంగే ప్రణయం

నేలా నింగి కలిపే బంధం ఇంద్రచాపం

కాదా మన స్నేహం ముడి వేసే పరువం

కలలవిరులవనంమనహృదయంవలచిన

ఆమనికూరిమిమీరగచేరినతరుణం

కార్తీక పున్నమి నాటి చంద్రుడు కోటి కాంతులతో ఉదయిస్తాడు. అటువంటి నింగిలో చుక్కల మధ్య చంద్రుడు వెలవెల పోతున్నాడు.

దీపాల కాంతులు వెన్నెల కాంతులు గంగా జలాలపై పడి వెండి జలతారు పోగులు లాగా మెరుస్తున్నాయి.

కనులకు వెలుగువు నీవే కావా

కనబడు చీకటి మాయే కాదా

నిను గనలేని ప్రాణీ బ్రతుకే

నిజముగా చీకటియౌగా దేవా!

నందిని ఏవేవో లెక్కలు వేసుకుంది. నలభై రోజులు పూర్తి అయ్యే నాటికి ఒక తీరు అవుతుంది. కాబట్టి ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నారు.

“మరి అమ్మా వాళ్ళకూ, అత్తయ్యా వాళ్ళకూ ఎప్పుడు చెబుదాము?”

“మూడో నెల వచ్చాక.”

“మరి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాము?”

“మూడో నెల వచ్చాక.”

“మరి..”

“హలో క్వశ్చన్ బేంక్, నాకు నిద్ర వస్తోంది.”

మరు నిమిషం గాఢ నిద్రలో ఉంది.

ఆమెను ఎంత అపురూపంగా చూసుకోవాలో మొబైల్‌లో గూగులమ్మని అడగడం మొదలుపెట్టాడు. బాధ్యతగల భర్తగా.. తండ్రిగా..

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here