తొలి భారతీయ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రీబాయి ఫూలే

7
11

[box type=’note’ fontsize=’16’] ది. 03 జనవరి 2021వ తేదీ సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]ప్రా[/dropcap]చీన భారతంలో స్త్రీ విద్యకి ఉన్న ప్రాముఖ్యత వివిధ కారణాల వల్ల మధ్యయుగంలో చాలవరకు తగ్గింది. ఆధునిక యుగంలో మళ్ళీ అభివృద్ధిపథంలో అడుగుపెట్టింది. ఆధునిక భారతదేశంలో స్త్రీ విద్య కోసం పునాదులు వేసిన స్త్రీ పురుషులెందరో ఉన్నారు. వారందరిలో తొలి భారతీయ ఉపాధ్యాయిని శ్రీమతి సావిత్రీబాయి ఫూలే గొప్ప మహిళా శిరోమణి.

వీరు ఉపాధ్యాయిని గానే కాదు. సేవాతత్పరురాలు, వివిధ సంస్థల నిర్వాహకురాలు, సంఘ సంస్కరణాభిలాషి, కవయిత్రి కూడా!

వీరు 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన బొంబాయి రాష్ట్రం (నేటి మహారాష్ట్రలోని) సతారా జిల్లా నవ్‌గాన్ గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీ ఖండోజీ నెవేషే పాటిల్. అప్పటి ఆచారాల ప్రకారం 9 ఏళ్ళ వయసులోనే జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది.

జ్యోతిరావు ఫూలే ఆధునిక భావాలు కలవారు. భార్యని చదివించారు. ఆయనే గురువుగా మారారు. వారిద్దరి ఆశయాలు ఒకటయ్యాయి.

శ్రీమతి సావిత్రీబాయి ఫూలే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. మహిళలకు మాత్రమే కాదు, ఆమె కుటుంబానికి, సమాజానికి, తద్వారా దేశానికి, తరతరాల వారి అభివృద్ధికి మహిళా విద్య దోహదం చేస్తుందని ఆ దంపతులు విశ్వసించారు.

ముఖ్యంగా అణగారిన వర్గాలవారు అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి జరుగుతుందని నమ్మారు. 1848వ సంవత్సరంలో బాలికా పాఠశాలను పూనాలో స్థాపించారు. బాలికలకు ఉపాధ్యాయిని నేర్పితేనే బాగుంటుందని ఆశించారు ఫూలే! సావిత్రిని ఉపాధ్యాయినిగా పాఠశాలలో నియమించారు. ఈ సంఘటనతో వారి కుటుంబాలకు దూరమయారు. అయినా పట్టు వీడలేదు. అణగారిన వర్గాల వారి విద్యే పరమావధిగా కంకణం కట్టుకున్నారు.

సనాతనులు, ఛాందసులు సావిత్రీబాయిని వేధించేవారు. పేడ, రాళ్ళు, కోడిగుడ్లు వంటివి విసిరి ఆమెను భౌతిక దాడులకు, వేధింపులకు గురిచేశారు (ఇటువంటి వికృత చేష్టలు ఎప్పుడయినా గర్హనీయమే!). ఆమె చేతి సంచిలో మరొక చీర పెట్టుకుని బడికి వెళ్ళేవారు. బడిలో ఆ చీర కట్టుకుని తిరిగి వచ్చేటపుడు ఉదయం ఖరాబయిన చీరని కట్టుకునేవారు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది కదా! విసిగి వేసారిన సావిత్రీబాయి ఒక రోజు వేధించిన వ్యక్తి చెంప ఛెళ్ళుమనించారు. అక్కడితో ఆగడాలు ఆగాయి.

కొంతకాలం తరువాత వారికి సమాజం నుండి సహాయ సహకారాలు లభించాయి. వివిధ మతాలు, సామాజిక వర్గాల వ్యక్తులు బడుల కోసం స్థలాలను ఇవ్వడం దగ్గరి నుండి కావలసిన సౌకర్యాలను కల్పించారు. సుమారు 50 పైనే వీరు స్థాపించిన పాఠశాలలు పిల్లలకు విద్యను అందించాయి.

వీరు కేవలం మహిళా విద్య కోసమే గాక, సమాజంలో పేరుకునిపోయి పట్టిపీడిస్తున్న మూఢవిశ్వాసాల పట్ల కూడా దృష్టి సారించారు. బాల్యవివాహ నిషేధం, అస్పృశ్యతా నివారణల కోసం కృషి చేశారు.

నాటి సమాజంలో బాల వితంతువులు ఎక్కువ. వితంతువులకు ఎదురయే సమస్యలను గమనించారు. నాటి వితంతువులు మృగాళ్ళ అత్యాచారాలకు గురై/ఆత్మహత్యలకు పాల్పడడం ఎక్కువగా జరిగేది. కొంతమంది గర్భవతులై ఆత్మహత్యలకు పాల్పడేవారు. వీరి కోసం ‘ఆత్మహత్యా ప్రతిబంధక గృహాల’ను ఏర్పాటు చేశారు. వారి బిడ్డలను సాకారు. ఒక వితంతువు బిడ్డను దత్తత చేసుకున్నారు కూడా! అతనిని డాక్టర్ చదువు చదివించారు.

మహిళలంతా ఒకచోట సమావేశమై మాట్లాడుకునేటందుకు 1852లో ‘మహిళా సేవా మండళ్ళ’ను ఏర్పాటుచేశారు

వితంతువులకు శిరోముండనం ఒక దురాచారంగా ఉండేది. దీనిని రూపుమాపడం కోసం వీరు క్షురకుల చేత సమ్మె చేయించి ఆపించారు. ఇది ఒక చారిత్రక విజయం. ఇలా సంస్కరణపథంలో ముందుకు దూసుకుపోతున్న సమయంలో—

1890వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన మహాత్మా జ్యోతిరావు ఫూలే మరణించారు. అపుడు జరిగిన సంఘటన అఖండ భారతదేశంలో అంతకు ముందు జరగలేదు. దహనక్రియలు జరపటానికి బంధువులు, దాయాదులు వాదులాడుకున్నారు. ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు స్వయాన నిప్పంటించి భర్త అంత్యక్రియలు నిర్వహించారు. సమాజం నివ్వెరపోయింది. అయినా ధీరగా నిలబడింది.

ఆమె తన పనులను ఆపలేదు. అప్పటి వరకూ భర్తతో కలిసి పనిచేసిన ఆమె మొత్తం కార్యనిర్వహణాభారాన్ని భుజానికెత్తుకున్నారు. సత్యశోధక సమాజం బాధ్యతలను పూర్తిగా స్వీకరించారు.

సమాజంలోని అనాథ, పేదబాలల కోసం శిబిరాలను ఏర్పాటుచేశారు. ఈ సంఘ సంస్కరణాభిలాషను మెచ్చుకుని కొంతమంది ధన ధాన్య వస్త్రాలను దానం చేసి శిబిరాల నిర్వహణకు సహాయం చేశారు.

వీరు కవయిత్రి కూడా! ‘కావ్య ఫూలే’, ‘సుబోధ రత్నాకర్’ అనే రెండు కవితా సంపుటాలను వెలువరించారు.

సుమారు 125 సంవత్సరాల క్రితమే 2000 మంది పిల్లలతో శిబిరాలను నిర్వహించి వారికి కావలసిన సౌకర్యాలను అందించడం చాలా గొప్ప.

1897వ సంవత్సరంలో దేశమంతా వ్యాపించినట్లే పూనాలోను ప్లేగు వ్యాధి విజృంభించింది. ఊర్లు ఊర్లు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ప్లేగు వ్యాధి బాధితులకు సేవలను అందించారు సావిత్రీబాయి. ఈ మహమ్మారి ఆమెనూ వదలలేదు. 1897 మార్చి 10వ తేదీన ప్లేగు వ్యాధి పీడితురాలై మరణించారు.

ఈ విధంగా భారతదేశంలో తొలి ఉపాధ్యాయిని, వివిధ సేవారంగాలలో సేవలందించిన సంఘ సంస్కర్త, మహా మనీషి. సుమారు 175 సంవత్సరాల క్రితమే మహిళా విద్యకు అంకురార్పణ చేసిన మహోపాధ్యాయిని, కవయిత్రి శ్రీమతి సావిత్రీబాయి ఫూలే జ్ఞాపకార్థము భారత తపాలా శాఖ రూ. 2.00ల విలువతో స్టాంపును విడుదల చేసింది.

వీరి శతజయంతి సందర్భంగా 1998 మార్చి 10వ తేదీన ఈ స్టాంపు విడుదలయింది.

వీరి జయంతి ది. 03-01-2021 సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here