‘తొల్త ముద్దెర’ కవితాసంపుటి ఆవిష్కరణ – వార్త

0
10

[dropcap]మ[/dropcap]హబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గల ఎం.వి.ఎస్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని వల్లెకి శిరీష రచించిన ‘తొల్త ముద్దెర’ కవితాసంపుటిని 6 ఏప్రిల్ 2024 న కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా హాజరైన ప్రముఖ కవి ఉదయమిత్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే శిరీష కవితారచన చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. విభిన్నమైన వస్తువులను తీసుకుని రాసిన కవితలు ఆలోచింపజేస్తాయన్నారు.

సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మావతి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు కవిత్వం రాయడం, వారిని ప్రోత్సహిస్తున్న అధ్యాపకులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎం.వి.ఎస్. డిగ్రీ కళాశాల నుంచి ఎంతోమంది కవులు ఉద్భవించారన్నారు. తొలి అడుగుతోనే శిరీష చక్కటి కవిత్వం ఆవిష్కరించిందన్నారు.

విశిష్ట అతిథి డాక్టర్ బి.వెంకటయ్య మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని తనదైన శైలిలో శిరీష కవిత్వీకరించిందన్నారు.

మరో విశిష్ట అతిథి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ కవిత్వం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించాలన్నారు. కవిత్వం ఏది రాసినా సజీవంగా ఉండాలన్నారు.

ఆత్మీయ అతిథి, కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత తగుళ్ళ గోపాల్ మాట్లాడుతూ శిరీష చక్కటి పాలమూరు మాండలికంలో కదిలించే కవిత్వం రాసిందన్నారు.

యువకవి కె.పి.లక్ష్మీనరసింహ మాట్లాడుతూ సరళమైన పదాలతోనే చిక్కటి కవిత్వం రాసిన శిరీషను అభినందించారు.

మరో యువకవి బోల యాదయ్య పుస్తక సమీక్ష చేస్తూ శిరీష కవితారచనలో విభిన్న అంశాలు కనిపిస్తాయన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను కవిత్వీకరించిందన్నారు.

ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ విఠలాపురం పుష్పలత మాట్లాడుతూ శిరీష తనదైన శైలిలో, చక్కటి అభివ్యక్తితో కవిత్వం రచించిందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ సి. నరసింహులు, డాక్టర్ బూర్గుల స్వరూప, గోవిందు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here