మానవ జీవితాల్లోని వివిధ కోణాలను స్పృశించిన ‘తూర్పు నుంచి పడమరకు’

0
12

[dropcap]డా.[/dropcap] నెల్లుట్ల నవీనచంద్ర కెనడాకి 1964 లోనే వెళ్ళినా భారతదేశంపై గౌరవం, తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువ కోల్పోలేదు. టొరంటోలో ‘కథావేదిక’, ‘కవితావేదిక’ ఏర్పాటు చేసి ఖండాంతర సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆసక్తితో కథలు, కవిత్వం రాస్తున్నారు. కథా సంకలనాలను ప్రచురిస్తున్నారు. ‘లేఖిని’ రచయిత్రుల వేదిక నిర్వాహకురాలు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మితో కలిసి సంయుక్తంగా ఇటీవల కథల పోటీ నిర్వహించారు. దేశ విదేశాల నుండి 125 కథలు వచ్చాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం, సీనియర్ రచయితలు వాణిశ్రీ, వసుంధర లతో సహా వర్ధమాన రచయితలు పోటీకి కథలు పంపించారు. న్యాయనిర్ణేతలుగా శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, శ్రీ పి.వి. రమణ వ్యవహరించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు పది కన్సొలేషన్ బహుమతులకు కథలు ఎన్నిక చేసారు. పోటీ నిర్వహణతో ఆగిపోక ఎంతో శ్రమ కోర్చి బహుమతులు పొందిన వాటితో కలిపి మొత్తం 32 కథలను ‘తూర్పు నుంచి పడమరకు’ అని ఒక సంకలనంగా తీసుకొని రావడం చాలా ముదావహం.

ఈ 32 కథల్లో ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా, వైవిధ్యమైన కథాంశాలతో, మానవ జీవితాల్లోని వివిధ కోణాలను స్పృశించడం జరిగింది. ఈ కథా సంపుటిని అంతర్జాల సమావేశంలో జూన్ 14న ప్రముఖ రచయిత్రి డా. రాధికా శ్రీవల్లి ఆవిష్కరించడం జరిగింది. ఈ వ్యాస రచయిత్రి (ప్రొ. సిహెచ్. సుశీలమ్మ) అధ్యక్షత వహించి, కథలను సమీక్షించారు. కథావేదిక గురించి డా. నెల్లుట్ల నవీనచంద్ర వివరించారు. పోటీకి సంబంధించిన వివరాలను, సాధక బాధకాలను శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి తెలియజేసారు. న్యాయనిర్ణేతలిద్దరు ప్రసంగించారు. ముందుమాటలో డా. కొండపల్లి నీహారిణి పేర్కొన్నట్లు – “ఈ కథా గుచ్ఛం సువాసనంతా జీవితమే”.

ప్రథమ బహుమతి పొందిన కథ బి. లక్ష్మీ గాయత్రి రాసిన ‘పెళ్ళి పుస్తకం’. కోపం అనేది మనిషికి హానికరమే కాక, కుటుంబ సభ్యులకు కూడా భరించరానిది అవుతుంది. సంసారం అల్లకల్లోలమై పోతుంది. సాటి ఉద్యోగులతో, ఇరుగుపొరుగు వారితో సత్సంబంధాలు కోల్పోతారు. అలాంటి పరిస్థితి నెదుర్కొన్న ఒక తండ్రి తన కుమారుడికీ తన వారసత్వంగా ‘కోప’ లక్షణం రావడంతో, తన గతాన్ని సున్నితంగా తెలియజేసిన కథ.

చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి కూడా మగవారికున్న వెసులుబాటు స్త్రీలకు లేదు సమాజంలో కానీ, కుటుంబ వాతావరణంలో కానీ. ఎ.సి.రూమ్‌లో ఒంటరిగా తనకు ఇష్టం వచ్చినట్టు ఉండాలని, అద్దంలో తనను తాను తనివితీరా ‘పూర్తిగా’ చూసుకోవాలన్న ఆమె కోరిక – భర్త చనిపోయాక తీరింది. ద్వితీయ బహుమతి పొందిన దేశిరాజు రవికుమార్ ‘అవాంఛితం’ కథ ఇతివృత్తం. భర్త ఏదో రోజు, చేసి ఏదో పని మీద బయటకు వెళ్ళకుండానే ఉంటాడా! ఆయన చనిపోయాక గది లోకి వచ్చి చీర మార్చుకొనేటప్పుడు ఆ కోరిక తీరింది అనడం అంతగా సమంజసంగా లేదు.

తృతీయ బహుమతి పొందిన కథ వెంకటమణి ఈశ్వర్ ‘పూర్ గాడ్’. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాలను తన ఆధీనంలో ఉండాలని ‘అగ్ర’ రాజ్యం భావించడం, ప్రపంచంలోని అన్నిటి పైనా పేటెంట్ హక్కు తానే ‘దోచుకోవాల’ని భావించడం గమనిస్తూనే ఉన్నాం. ఆ క్రమంలో ఉచ్ఛం నీచం, మంచీ చెడులు, ప్రజల క్షేమం, పర్యావరణ వంటి విషయాలు పట్టించుకునే విచక్షణ లేకున్నదని ఈ కథ లోని ముఖ్యాంశం.

ఓ. సూర్య ప్రసాదరావు రాసిన కథ ‘పదమూడు గంటలు’. గుంటూరు జిల్లా తెనాలి మొదటి నుండి వివిధ కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ఆయా కళాకారుల వివరాలతో కూడిన కథ. ఇలా స్థానిక కళాకారుల, సంస్థల వివరాలు పదిలపరచడం చాలా అవసరం. భవిష్యత్ తరాలకు ఇలా ప్రతి ఊరు, జిల్లా సాహిత్య సాంస్కృతిక విశేషాలు రికార్డు చేయడం మంచిది.

మనుషులు ఎంత దృఢమైన వ్యక్తిత్వం కలిగివున్నా ఒక్కోసారి కొన్ని పరిస్థితుల వల్ల, ఏమీ చేయలేని నిరాశా నిస్పృహలకు లోనౌతారు. ఆ నైరాశ్యంలో బ్రతుకు చాలించాలన్న తీవ్రమైన ఒత్తిడికి గురౌతారు. అలాంటి సమయంలో కుటుంబ సభ్యుల లేదా స్నేహితుల ఓదార్పు మాటల వల్ల కోలుకునే అవకాశం ఉంది. నైరాశ్యం, నిరాసక్తత తొలగిపోయి, భవిష్యత్తు పట్ల ఆశ, ఆసక్తి కలిగి, ఉత్సాహవంతంగా తయారయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఈ సంపుటిలో ఇలాంటి ఇతివృత్తంతో రెండు కథలున్నాయి. డా. పార్థసారథి చిరువోలు రాసిన ‘అస్తిత్వం’ కథలో ఒక ఉద్యోగి తన ఆఫీసు వాతావరణంలో ఇమడలేకపోతే, స్నేహితుని మాటలతో తేరుకొంటాడు.

గంటి ఉషాబాల కథ ‘దృష్టి’లో భర్తను కోల్పోయిన ఇందిర సర్వస్వం కోల్పోయినట్లు నిస్త్రాణగా ఉంటుంది. స్నేహితురాలు మాలతికి కూడా తనలాంటి పరిస్థితే ఎదురైతే, ఆమె ఎలా ఆశావహ దృక్పథంతో ఉత్సాహం తెచ్చుకుందో చూసి తన జీవన సరళిని ఆనందంగా మార్చుకుంటుంది.

రాజకీయంగా, ఆర్థికంగా సమాజాన్ని ఆక్రమించి, మొత్తాన్ని తినేసే ‘చెదపురుగులు’ వంటి వారు ఉన్నారు. ఎదిరించాలనే ఆవేశం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఒక పార్కుకు వాకింగ్, లాఫింగ్ కోసం వచ్చే కొందరు సీనియర్ సిటిజన్స్ ఈ అవినీతి చెదల నిర్మూలనకు నిర్ణయించుకొంటారు. చివరికి వారు సఫలీకృతులయ్యారా అన్నది పుట్టగంటి గోపీకృష్ణ కథ ‘చెద పురుగు’ చదివి తెలుసుకోవాలి.

ప్రభుత్వ శాఖల్లో కావాలని కానీ, అసంకల్పితంగా కానీ ఏదైనా పొరపాటు జరిగితే – పై ఉద్యోగులు తమకు అనుకూలంగా క్రింది ఉద్యోగులపై ఎలా నెట్టేస్తారో చెప్పే కథ అద్దేపల్లి జ్యోతి రాసిన ‘జీవన చిత్రం’.

అంగవైకల్యం కలిగిన వారిని తోటివారు అవహేళన చేయడం అమానుషం. కాలు కుంటి కానీ వ్యక్తిత్వం నిటారైన అమ్మాయిని తన రూమ్‌మేట్స్ మాటలతో చిన్నబుచ్చుతుంటే – ఆమె చిన్ననాటి స్నేహితుడు అండగా నిలబడతాడు. చిన్నతనం నుండి ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తి, స్వచ్ఛమైన మనసుకు ఆకర్షితుడై, ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరించి ఆ రూమ్‌మేట్స్ కళ్ళు తెరిపిస్తాడు అన్నది సయ్యద్ సలీం ‘చంద్ర వంక’ కథ.

అంకిత భావంతో విద్యార్థులకు పాఠాలతో పాటు మంచీ చెడులు బోధిస్తూ శిల లాంటి వారిని శిల్పంగా మరల్చితే, ఆ టీచర్ వారి గుండెల్లో నిలిచి పోతారు అని చెప్పే గంటి సుజల గారి ‘శిల్పి – శిల్పం’ కథ..

“ఎప్పుడైనా ఆ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా” అంటూ తనను, తన పేదరికాన్ని అవహేళన చేసిన అమ్మాయి వల్ల నిజ జీవితాన్ని అవలోకించుకుని, పట్టుదలగా చదివి జీవిత ప్రణాళిక వేసుకున్న రాఘవ కథ జి.యస్. లక్ష్మి రాసిన ‘అద్దంతో అంతర్మథనం’..

ఉద్యోగార్థం తప్పనిసరిగా ఆఫీసుకి వెళ్ళవలసి వచ్చి భానూ తన పసిబిడ్డ సంరక్షణ కోసం తెలిసిన అమ్మాయిని ఆయాగా ఉంచితే – ఆమె ఈర్ష్యాసూయలతో ఆ బిడ్డను యాచకులకు పొద్దున ఇచ్చి గప్‌చిప్‌గా సాయంత్రం తెచ్చేసేది. భానూ తన బిడ్డను ఎలా కాపాడుకుందో తెలిపే ఆదూరి హైమవతి ‘సహనావవతు’ కథ..

తాతయ్య చనిపోతే అందరూ ఏడుస్తున్నా, కంటి వెంట నీటి చుక్క రాని మనవడు అచ్యుత్. ఏనాడూ ఎవరినీ ప్రేమించ(లే)ని తాతయ్య – తనకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఎవరకీ పెట్టక తన గదిలోనే కూర్చొని తినే తాతయ్య – తన సుఖం ఆనందం మాత్రమే చూసుకునే తాతయ్య అచ్యుత్ పసిమనసులో ముద్ర వేసుకొనివున్నాడు. తన తల్లిని ‘కోడరికం’ పేర రాచిరంపాన పెట్టిన తాతయ్యని క్షమించలేక పొయాడు అచ్యుత్ ‘నాకు తెలిసిన రాముడు’ రత్నాకర్ పెనుమాక రాసిన కథలో..

ఫైవ్ స్టార్ హోటల్ వంటి హంగులు, ఆర్భాటాలున్న కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఎంతెంత బిల్లు వేసినా ఒక్క మాట రాదు మనకు. రోడ్డు పక్కన అమ్ముకునే వారి దగ్గర గీచి గీచి బేరాలాడతాం అనేది ‘బేరం’ సి.యస్.ఏ. షరీఫ్ కథ..

కన్నతల్లి పై ప్రేమ ఉండదు, ఆమె ఒంటరిగా ఎలా ఉందో కనీసం కనుక్కోరు. పెంచుకొంటున్న బొచ్చు కుక్కకి స్నానాలు, ఇంజెక్షన్‌లు, ఆరోగ్యపరమైన సకల సౌకర్యాలకు వేలాది రూపాయలు వెచ్చించే పెద్ద మనుషుల చిన్న మనసుల్ని వర్ణించిన పద్మజ రంగరాజు రాసిన ‘డాగ్ పార్క్’ కథ..

ప్రతి పనీ ప్రభుత్వమే చేయాలని, లేదా, పక్కవారు చేయడం లేదని విమర్శిస్తూ ఉక్రోషంతో ఉపన్యాసాలిస్తారు చాలా మంది. పక్కనున్న మట్టిని తెచ్చి రోడ్డు మీద ఉన్న గుంతల్ని పూడుస్తున్న ఒక రిటైర్డ్ టీచర్ చర్య వారికి మంచి పాఠం అవుతుంది. దాసరి మోహన్ కథ ‘గుంతలు’ అంతటితో ఆగలేదు. ఆ టీచర్ తన మనవడి చేత కూడా పనిచేయించడం వల్ల – ఆ కుర్రవాడు భవిష్యత్తులో తను చేయగలిగిన పని తాను చేసుకుంటూ, ప్రతి దానికీ ఇతరులపై ఆధారపడకూడదని చెప్పిన కథ..

మంచి పుస్తకాలు చదవాలని, సంగీతం వీణ నేర్చుకోవాలని చిన్నప్పటినుంచి ఎంతో ఆశ ఆ‌సక్తి ఉన్న వడ్రంగి కుర్రవాడు వేణు ఆర్థిక పరిస్థితి వల్ల, తండ్రి మాట ఎదురు చెప్పే పరిస్థితి లేక వుడ్ వర్క్ చేస్తున్న ఒక దారుశిల్పి. తన వృత్తినే దైవంలా భావించి, తన కళాత్మక ఆలోచనలను మేళవించి అందంగా, మనసు పెట్టి పనిచేసి అందరి అభిమానాన్ని పొందుతాడు. ఎదుగుతాడు. కొంత కాలానికి తను ప్రాణప్రదంగా భావించే పుస్తక పఠనం, సంగీతంతో సేదతీరుతాడు వసుంధర రాసిన ‘వేణుగానలోలుడు’ కథలో..

దిగువ మధ్యతరగతి, మెతక వైఖరి గల ఒక తండ్రి జ్వరంతో బాధపడుతున్న తన కూతుర్ని దక్కించుకోడానికి ఏ పరిష్కారం ఆలోచించాడో, గతంలో తన భార్య విషయంలోనూ ఏం ఆచరించాడో- వడలి రాధాకృష్ణ రాసిన ‘గొంగళి పురుగు’ కథ కొంత అసహజంగా ఉంది. వ్యక్తిపరంగా కానీ, వైద్యపరంగా కానీ అంగీకారయోగ్యమా అన్నది ఆలోచించాలి.

మానవ పుస్తకాలయం. హ్యూమన్ లైబ్రరీ. వృద్ధాప్యం, వృద్ధులు, పెద్దలు, సీనియర్ సిటిజన్స్ అంటే – అనుభవాలతో పండిపోయిన వారు. ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకొన్నవారు. కాని వృద్ధాప్య సమస్యల వల్ల ఒక్కోసారి వారు డిప్రెషన్‌కి లోనవడం జరుగుతుంది. వారి జ్ఞానం సమాజానికి అవసరం అని ఉత్సాహపరిస్తే, తమ జీవితానుభవాలను నలుగురికి పంచుతారు. ఒక మానవ పుస్తకంగా మారిపోతారు. యువతరం ఆ మానవ పుస్తకాన్ని ‘చదివి’ జ్ఞానం సంపాదించుకోగలరు అంటారు ఎమ్. సుగుణణారావు ‘మానవ పుస్తకం’ కథలో..

చిన్ననాడే వైధవ్యం పొందిన కనకమ్మ తన మేనకోడలికీ తన పోలికలతో పాటు తన రాత కూడా వచ్చి వైధవ్యం పొంది పుట్టినిల్లు చేరడంతో ఎంతో బాధపడింది. తను పొందిన వివక్ష ఆమెకు రాకూడదని ఎలాంటి నిర్ణయం తీసుకుని ఔన్నత్యాన్ని పొందిందో తెలిపే కథ వాణిశ్రీ రాసిన ‘ఋణానుబంధం’..

కొడుకుకి నచ్చిన అమ్మాయి కులాంతరమైనా వివాహానికి అంగీకరించిన జాహ్నవి వారిద్దరికీ తన ప్రేమను పంచింది. కోడలు గర్భవతి అయితే ఎంతో సంతోషించింది. కానీ కోడలు ఆ సమయంలో చిన్ననాటి నుండి తనకు అలవాటైన నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు జాహ్నవి సామరస్యంగా ఏం నిర్ణయం తీసుకుందో తెలియజేస్తుంది దివాకర్ల రాజేశ్వరి రాసిన ‘జాహ్నవి’ కథ..

కథావేదిక నిర్వాహకులు, ఈ కథల పోటీ, పుస్తక ప్రచురణలో శ్రమించిన డా. నెల్లుట్ల నవీనచంద్ర రాసిన కథ ‘ఈ నా ప్రకృతి కోసం’. నలుగురు విద్యార్థులు ఒక ట్రిప్‌కి వెళ్లడం, అక్కడ దొరికిన మూడు పక్షులను కాపాడాలని ఎంతో తాపత్రయపడటం, ఎన్నో ప్రయత్నాలు చేయడం వారి స్వచ్ఛమైన మనసుకు నిదర్శనం. ప్రకృతిని కాపాడుకోవాలనే గొప్ప సందేశం ఉన్న కథ.

ఒక పిల్లవాడి కిడ్నాప్, పరిశోధన ఉన్న ‘పసివాడి ప్రాణం’ కథ, ఈజిప్టు వారి జానపద కథ ‘మెరెట్ సెగెర్’, ఇంకా ‘ఎద లోపలి మమకారం’, ‘చివరి ఉత్తరం’, ‘ఖండాంతర సంబంధాలు’, ‘ముక్తి’, ‘సమర్ధ సరోజం’ వంటి మంచి కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.

కథావేదిక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఖండాల లోని తెలుగు రచయితలను కలుపుకుంటూ, అనేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తున్న నవీనచంద్ర ఈ సాహితీ స్నేహ సమీరాలు ప్రపంచ వ్యాప్తం కావాలని అభిలషిస్తున్నారు. వారి సత్సంకల్పం విజయవంతంగా నెరవేరాలని మనసారా ఆశిద్దాం.

***

తూర్పు నుంచి పడమరకు (తెలుగు కథావేదిక బహుమతి కథల సంకలనం)
కథావేదిక నిర్వాహకులు: డా. నెల్లుట్ల నవీన చంద్ర
ప్రచురణ: తెలుగు కథావేదిక, టొరంటో, కెనడా
పుటలు: 280
వెల: ₹ 150/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
nakshatra1364@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here