తోపులాట

10
10

[dropcap]గు[/dropcap]ర్తింపు గండపెండేరాల గొప్పహడావిడది
ప్రతిభావంతుల క్యూ లైన్ బహు పెద్దది
వెనక ఒత్తిడి పెరిగితే వరస చెదిరిపోతుంది
ఎవరుముందో, ఎవరువెనకో లెక్కపోతుంది

అప్పుడే వచ్చిన వాడు ముందుంటాడు
అవార్డుకోసం ఒక్కంగలో స్టేజి పైనుంటాడు
సణిగేవారు అసమర్థుల జాబితాకెక్కుతారు
ప్రశ్నించినవారు ఓర్వలేనివారవుతారు

పురస్కారాల చాకోలెట్ సంచీ సంస్థ
కీర్తికెక్కిన సాక్షాత్ రాజరాజవుతుంది
అందుకున్నవాళ్లంతా సరస్వతీపుత్రులే
మిగిలిన వాళ్లంతా అంతంతమాత్రులే

సీనియారిటీ,క్వాలిటీ శుష్కవేదాంతాలు
స్ట్రగుల్ ఫర్ అఛీవ్‌మెంట్లో ఎన్నోపోరాటాలు
సర్వైవల్లో సరిగ్గా ఇమిడినవారే గెలుపుగుర్రాలు
తక్కినవారు పరుగురాని నేలబారు తాబేళ్లు

పతకానికి కావాల్సింది సుదీర్ఘ పథకం
అస్మదీయపొదల్లో లాగాల్సిందే సంబంధం
దారేదయినా గమ్యం చేరడమే ముఖ్యం
సాధించడం మాత్రం సత్తా నిరూపణ కాదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here