సాహిత్యైకజీవి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు

2
12

[dropcap]గుం[/dropcap]టూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో 1934 ఫిబ్రవరి 10న తుమ్మపూడి కోటీశ్వరరావు జన్మించారు. మధ్యతరగతి కుటుంబ జీవనం, వినయం, చదువే ధ్యేయంగా మసులుకునేవారు. ఆ నెమ్మదితనం ఆయన జీవితాంతం కొనసాగింది. విజయవాడ ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో బి.ఏ. చదివేటప్పుడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రియశిష్యుడిగా ప్రాచీన సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా సాహిత్యాలలో ఎం.ఏ. చదివి, ‘ఆముక్తమాల్యద’ పై పరిశోధన చేసారు. వారికి పరిశోధన పర్యవేక్షకులు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య దివాకర్ల వేంకటావధాని గార్లు. కోటీశ్వరరావు గారికి కవిత్రయం, నాచనసోమన, కృ‌ష్ణదేవరాయలు సాహిత్యమంటే చాలా అభిమానం.

కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, శ్రీకాళహస్తి ప్రభుత్వ కళాశాలలో శాఖాధ్యక్షునిగా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, తర్వాత శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో శాఖాధిపతిగా పనిచేసి, 1994లో ఉద్యోగ విరమణ చేశారు.

సృజనాత్మక అధ్యాపకులు:

ఉత్తమ అధ్యాపకుడిగా, మంచి గురువుగా ఆయనకు విద్యార్థులలో మంచి పేరు ఉంది. “మంద్ర స్వరంలో ఆయన పాఠం చెబుతుంటే విద్యార్థులు మంత్రముగ్ధులై వినేవారు, పాఠం ఆకర్షణీయంగా చెప్పడం వారి కళ” అని వారి వద్ద ఎం.ఏ. చదివి, తర్వాత వారి వద్దనే పరిశోధన చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అంటారు. మేమిద్దరం ఉద్యోగ విరమణ చేసినా, నేను ఆయనకు ఎప్పుడూ విద్యార్ధినే అంటారాయన.

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు గారికి అలంకార శాస్త్ర పరిజ్ఞానం అపారం. పద్యాన్ని రాగయుక్తంగా చదవితే విద్యార్థులు మైమరిచి పోయేవారు. ముఖ్యంగా భవభూతి ఉత్తర రామాయణం లోని కరుణ రసాత్మకమైన శ్లోకాల వంటివి చెప్పేటప్పుడు లీనమైపోయేవారు. కానీ వెంటనే విద్యార్థుల స్ధాయికి దిగివచ్చి, శ్రావ్యంగా వ్యాఖ్యానించేవారు. ఆయన పాఠాల్ని ప్రత్యక్షంగా నేను వినకపోయినా వారి విద్యార్థులు చెప్తే తెలుసుకున్నాను.

 

సంస్కృత కావ్యాలు, రసశాస్త్రం, వైజ్ఞానిక, ప్రాచీన కావ్యాలు, ‌సాహిత్యేతర కళలూ ఆయనకు కరతలామలకం అయినా, ఆధునిక సాహిత్యం అంటేనూ అభిమానం ఉంది. ఆయన ఇప్పటి తెలుగు సాహిత్య విమర్శకులలో, కవులలో, నాటక రచయితలలో, నవలా రచయితలలో మేటి.

పరిశోధకులకు పర్యవేక్షకులు

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు మంచి అధ్యాపకులే కాదు, ఆదర్శవంతమైన పరిశోధక పర్యవేక్షకులు. యాభై మందికి(30 పిహెచ్.డిలు, 20 ఎం.ఫిల్‌లు) పైగా పరిశోధకులకు పర్యవేక్షణ చేసారు ప్రత్యక్షంగా. పరోక్షంగా – తనను కలిసిన, తన ఇంటికి వచ్చిన ఏ పరిశోధకుడికైనా అడిగిన విషయాలను శ్రమ అనుకోకుండా వివరించేవారు. “రాసి పెట్టే గైడ్ కాదు. రాచి రంపాన పెట్టే గైడూ కాదు”. పరిశోధకులు తమకు తామే పరిశోధన చేసుకోవడానికి అవసరమైన జ్ఞాన వాతావరణం కల్పిస్తారాయన. నిరంతరం సాహిత్యం గురించే చర్చిస్తూ వారిలో ఆలోచనలు రేకెత్తిస్తారు. వారు వ్రాసుకొని వచ్చిన దానిని వారినే చదవమని చెప్పేవారు. నచ్చితే “బాగుంది” అంటారు క్లుప్తంగా. లేకుంటే “ఇంకోసారి ఆలోచించు” అంటారు మృదువుగా. విద్యార్థుల పరిశోధన తను అనుకున్నంత స్థాయిలో రాలేదని భావిస్తే మళ్ళీ మళ్ళీ వ్రాయించి వారిని, వారి పరిశోధనలని చెక్కుతారు, భవిష్యత్తులో మంచి శిల్పాలుగా నిలిచేలా. అద్భుతమైన తర్ఫీదు నిచ్చే అరుదైన అధ్యాపకుడు, ఆదర్శవంతమైన పర్యవేక్షకుడు ఆయన.

సాహిత్యైకజీవి

ఆచార్య తుమ్మపూడి వారికి చదువుకునే రోజుల్లో తెలుగు సాహిత్యం పట్ల ఏర్పడిన ఆసక్తి, అభిమానం దాదాపు చివరి రోజుల వరకు (నెల క్రితం జూమ్‌లో మాట్లాడారు) కొనసాగింది. తెలుగువారు గర్వించే విజయనగర రాజ్య చరిత్ర, సంస్కృతి పట్ల అభిమానం ఎక్కువ అయినా, సంస్కృతాంధ్ర సాహిత్యాలను, ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యాలను, భారతీయ పాశ్చాత్య అలంకార శాస్త్రాలను లోతుగా అధ్యయనం చేసారు. సాహిత్యాన్ని ఇతర లలితకళలతో సమన్వయం చేసి అధ్యయనం చేయడం ఆయన ప్రత్యేకత. అలంకార శాస్త్రం, తత్త్వశాస్త్రం, ధ్వని రస వక్రోక్తి సిద్ధాంతాలు, మనస్తత్త్వ శాస్త్రం, తాంత్రిక విద్య వంటి వాటి ‘వెలుగు’లో అధ్యయనం చేసి అనేక గ్రంథాలు వెలువరించారు. వారు రచించిన ‘విద్యా’ గ్రంథాలు చదవడమే కష్టం, అలాంటిది అర్థం చేసుకోవడం సాధారణ పాఠకుల తరం కాదు. వేదాలు, ఉపని‌త్తులు, పురాణేతిహాసాలను జీర్ణం చేసుకొని తెలుగు వారికి ఆయన అందించినది – మనకు ‘తరతరాల ఆస్తి’. దాదాపు 51 గ్రంథాలు రచించారు.

తెలుగు శాఖాధ్యక్షునిగా, తెలుగు పాఠ్యప్రణాళికా సంఘాధ్యక్షునిగా, ప్రిన్సిపాల్ (ఎస్.కె.యు)గా, మానవీయ శాస్త్రాల విభాగం డీన్‌గా, పాలకమండలి సభ్యునిగా, అకడమిక్ సెనేట్ సభ్యునిగా, గెస్ట్ లెక్చరర్‌గా, తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా, తెలుగు విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యునిగా, తెలుగు అకాడమీ లైజన్ ఆఫీసర్‌గా, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యునిగా, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, మైసూర్ బెంగుళూరు విశ్వవిద్యాలయం పాఠ్యప్రణాళికా సభ్యునిగా, ఇంకా అనేక హోదాలలో తన సేవలు అందించారు.

బహు గ్రంథకర్త

వేదనాస్పందము, కుమార భారతి, తిరువెంబవై – మాణిక్య వాచకర్ రచన, కుందమాల, బాలచరిత (నాటకానువాదాలు), సాహిత్య విమర్శ, ఆముక్తమాల్యదా సౌందర్యం, సంవిధాన చక్రవర్తి, ఎర్రన నాచన సోమనల కవితా తారతమ్య పరిశీలన, శ్వేతపద్మం, సాలభంజిక – భారతీయ పాశ్చాత్య సాహిత్య సిద్దాంతాల విశ్లేషణ, వేయిపడగలు మణిప్రభలు, శ్వేతచ్ఛత్రం, శేఫాలికలు, పురాణ విద్య, ప్రబంధవిద్య, విశ్వనాథ కల్పవృక్షం – శాంతరసం మొదలైన (క్లిష్టమైన) గ్రంథాలు, మరికొన్ని వ్యాఖ్యానాలు, జీవిత చరిత్రలు, తాత్త్విక రచనలు ఎన్నెన్నో – బహుశా ఇంత విస్తృతమైన, లోతైన తాత్త్విక రచనలు చేసినవారు సమకాలీన కాలంలో ఎవ్వరూ లేరు.

పురస్కారాలు

ఆయన చేసిన విశేష సాహితీ కృషికి తూకమేసే వారు ఎవరూ లేరు. అయినా అనేక పురస్కారాలు ఆయన చెంతకు చేరాయి.

  • ఉత్తమ అధ్యాపక పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
  • ఉత్తమ విమర్శ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం.
  • ఉత్తమ రచయిత పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం.
  • కవిప్రభ, విశ్వనాథ ప్రతిభా భారతి.
  • భాషా సమ్మాన్, కేంద్ర సాహిత్య అకాడమీ.
  • జాషువా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
  • కళారత్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

తెలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని కృషి చేసిన ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు గారు తన 89 వ ఏట 24.8.2023 గురువారం నాడు కన్నుమూ‌సారు.

వారికి హృదయపూర్వక అశ్రునివాళి. 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here