అనుభూతులతో నిండిన జ్ఞాపకాలని ఒక సారి తడిమితే..

8
10

(ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాథ్‌కు నివాళిగా వ్యాసం వ్రాయమన్న అభ్యర్ధనకు రచయిత డా. రాయపెద్ది వివేకానంద స్పందన ఇది. )

నేను విశ్వనాథ్ గారి గూర్చి నివాళి వ్రాయలేను.

ఒకటి చెబుతాను.

మూడు సంవత్సరాలు డిప్రెషన్‌లో కూరుకుపోయి, కేవలం దైవ కృప వల్ల తిరిగి మామూలు మనిషిని అయిన నన్ను మా అమ్మ ఒక చిన్న కోరిక కోరింది. అదేమిటంటే అప్పుడే విడుదల అయిన ‘స్వాతికిరణం’ చూపించమని.

1991 చివర్లో ఉద్యోగం తెచ్చుకుని, ఇరవై ఒక్క రోజుల శిక్షణకై బొంబాయికి వెళ్ళబోతున్నాను. రైలు రాత్రి ఎనిమిదిన్నరకి ఉంది. అందుకే ఆవిడ అన్నారు. “నీవు బొంబాయి నుంచి వచ్చాక చూద్దాంలే” అని.  “ఏం ఫర్వాలేదు, మధ్యాహ్నం ఆట చూస్కుని, నేను ఊరికి వెళతాను” అని చెప్పి, ఆ రోజు మధ్యాహ్నం ఆటకి  మా అమ్మని కడప  ‘మినీ రాయల్ సినీ థియేటర్’ కి తీస్కువెళ్లి ‘స్వాతి కిరణం’ సినిమా చూశాను.

ఆ సినిమా చూడాలని మా ఇంట్లో వాళ్ళందరూ ప్రత్యేకంగా ఎందుకు అనుకున్నారు అంటే, ఈ చిత్రంలో మాకు దగ్గరి బంధువు అయిన మాడుగుల నాగఫణి శర్మ గారు కొద్ది నిమిషాల పాటు ఉన్నారు అని తెలిసి, వారిని చూద్దాం తెరపై అన్నది మా ఉద్దేశం నిజానికి.

ఆ సమయంలో థియేటర్‌లో గుక్క పెట్టి ఏడ్చిన నా గూర్చి వ్రాయనా? నిర్ఘాంతపోయి, దిగ్భ్రమకి గురయ్యి, సినిమా అయిపోయాక కూడా స్థాణువులా కూర్చుండిపోయిన మా అమ్మని గూర్చి వ్రాయనా? ఇంచుమించి థియేటర్‌లో అందరి పరిస్థితి అలాగే ఉంది. కొందరు గ్రామీణులు ఆవేశం తట్టుకోలేక మమ్ముట్టి పాత్రని తిట్టిపోసిన బూతులు వ్రాయనా?

నేను జమ్మలమడుగులో ఏడవ తరగతి చదువుతుండగా ‘శంకరాభరణం’ వచ్చింది. ఏదో పని మీద బెంగళూరుకి వెళ్లిన మా అమ్మానాన్నలు అక్కడే కపాలి థియేటర్ లో ‘శంకరాభరణం’ చూసొచ్చారు. తిరిగి వారు జమ్మలమడుగుకి వచ్చిన తక్షణమే పొరుగూరు ప్రొద్దటూరుకి బస్సులో మమ్మల్నందరినీ పిల్చుకువెళ్లి  అక్కడ ఉన్న సుధా థియేటర్‌లో ‘శంకరాభరణం’ చూపించారు.

ముభావంగా ఉంటూ, ముక్తసరిగా మాట్లాడుతూ ఉండిన మా అమ్మగారు ఆ సినిమా థియేటర్‌లో ఉండుండి కళ్ళు కొంగుతో ఒత్తుకుంటూ ఉండిపోయింది. ఇక ఇంటికి వచ్చిన క్షణం నుంచి నిరవధికంగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని గంటలు. “మా అన్నయ్య గుర్తు వస్తున్నాడు సోమయాజుల గారిని చూస్తుంటే” అని చెప్పి.

కన్నీళ్ళు, తీవ్ర భావోద్వేగాలు, వేదనలు లేకుండా విశ్వనాథ్ గారి గూర్చి, వారి సినిమాల గూర్చి వ్రాయలేను.

ఒక్కో సినిమాతో ఒక్కో అనుభూతి. ఒక్కో అనుభూతిలో ఒక్కో భావం.

ఊరుకున్న ప్రాణానికి ఉరిపెట్టుకున్నట్టు, నేను నా మనసుని కలత పెట్టుకోదలచుకోలేదు. నేను చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి.

మెదడుతో చేసుకుంటూ పోతున్నాను.

అనుభూతి కలిగితేనే వ్రాస్తాను. వ్రాయటానికేం ఉంది, అనుభూతులతో నిండిన జ్ఞాపకాలని ఒక సారి తడిమితే క్షణంలో ఎన్నో వ్రాస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here