కాశ్మీర్ మారణహోమంలో ప్రాణాలు అర్పించిన హిందూ పండిట్లకు శాక్రమెంటోలో నివాళి

0
9

కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్ లోయనుండి బలవంతంగా వెళ్ళగొట్టబడి 30 ఏండ్లు అయిన సందర్భాన్ని గుర్తుచేసుకొంటూ 50 మందికి పైగా ఎన్నారైలు, మరియు కాశ్మీర్ హిందూ పండిట్లు, పలువురు ప్రవాసాంధ్రులు 2020 జనవరి 19 న కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో లో ఉన్న అసెంబ్లీ భవనం ఎదుట నిరసన ప్రదర్శన చేసారు. 19 జనవరి 1990 సంవత్సరంలో కాశ్మీర్ లోని పండితులను ఉగ్రవాదులు హెచ్చరించిన రోజు, కాశ్మీర్ నుండి విడిచి వెళ్లిపోండి లేకపోతే మీ ప్రాణాలు అని వారిని బలవంతంగా కాశ్మీర్ నుంచి పంపించిన రోజు. 1990 సంవత్సరంలో కాశ్మీర్లో రాత్రిపూట ఉగ్ర మూకలు రెచ్చిపోయి, సాగిన హింసకు కాశ్మీర్ పండిట్ల కుటుంబాలు చెల్లాచెదురై పోయాయి. ఉగ్ర మూకల విధ్వంసాన్ని తట్టుకోలేక తలో దిక్కున వెళ్ళిపోయారు కాశ్మీర్ పండిట్లు.

ఈ విషాద సంఘటనకు నిరసనగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ అమెరికాలో పలు నగరాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కాశ్మీరీ పండిట్లపై 1990 లో జనవరి 19 న జరిగిన అత్యాచార సంఘటనల గురించి కాశ్మీర్ నుండి వెళ్ళగొట్టబడి శాక్రమెంటోలో తలదాచుకొంటున్న స్థానిక కాశ్మీరీ పండిట్ లు కార్యక్రమానికి హాజరైన ఎన్నారైలకు విపులంగా వివరించారు. దివ్యదీప్ వాధ్వా చేసిన ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత హిందూ అమెరికన్ ఫౌండేషన్ డైరెక్టర్ ఈసన్ కటిర్, వక్తలను సభకు పరిచయం చేశారు. గ్రేటర్ శాక్రమెంటోలో నివసిస్తున్న ప్రవాస కాశ్మీరీ పండితులు, ఆ కాళరాత్రి రోజు కాశ్మీరీ పండిట్ సమాజానికి ఏమి జరిగిందో సమావేశమైన ఎన్నారైలకు పూసగుచ్చినట్లు వివరించారు. జనవరి 19, 1990 న జరిగిన సంఘటనలను గుర్తుచేసుకొంటూ బాధిత వక్తలు “ఉగ్రవాదంకు ప్రభావితం అయిన అల్లరి మూకలు విచ్చలవిడిగా పాల్పడ్డ లూటీలు , బెదిరింపులు, హింస, అత్యాచారాలు మరియు హత్యలు మూలంగా మూడు లక్షల యాభైవేలమంది కాశ్మీరీ పండిట్లు బలవంతంగా మాతృభూమి నుండి వెళ్ళగొట్టబడ్డారు” అని చెప్పారు.

 హెవెన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ (HWPL) సభ్యుడు గ్రెగ్ బెర్నార్డ్, కాశ్మీర్ లో పండిట్ల పై జరిగిన హింసాత్మక సంఘటనలను తీవ్రంగా ఖండించారు. వారు తమ మాతృభూమికి సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. HWPL అనేది 170 దేశాలలో పలు శాఖలతో కూడిన అంతర్జాతీయ శాంతి సంస్థ, ఇది ప్రపంచ శాంతి మరియు యుద్ధ విరమణ కోసం స్థాపించబడింది.

స్థానిక ప్రసిద్ధ కాశ్మీరీ పండిట్ ఇందర్ కావ్, హిందువులందరికీ కాశ్మీర్ ఎందుకు ముఖ్యమో వివరిస్తూ లోతైన చరిత్రను ప్రస్థావించారు. పురాతన కాలం నుండే గొప్ప పండితులు, సాధువులు, యోగులు, ఆది శంకరాచార్యులతో సహా పలువురు తత్వవేత్తలు, మరియు హిందూ యోగి స్వామి వివేకానంద తదితరులు సంపూర్ణ హిందుత్వం అవగాహనకు, సంపూర్ణ జ్ఞానం – ఆధ్యాత్మికతను పొందడానికి కాశ్మీర్‌ను సందర్శించారు అని ఆయన చెప్పారు. వీరందరూ ఆధ్యాత్మిక సాధనకు కాశ్మీర్ అనువైన ప్రదేశంగా భావించారు అని చరిత్ర మనకు చెబుతుంది అని ఆయన వివరించారు. కాశ్మీర్లో ఉన్న అనేక హిందూ ఆధ్యాత్మిక ప్రదేశాల పేర్లు కాశ్మీరీ హిందూ పండిట్ల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా మార్చబడ్డాయి అని, ఇది వారి గుర్తింపును తొలగించే బలవంతపూర్వక ప్రయత్నం గా ఆయన అభివర్ణించారు.

తరువాతి ఇద్దరు వక్తలు, ప్రీతి టికూ మరియు సునీల్ కౌల్ ఇద్దరూ కాశ్మీర్ పండితులు, ఆ రోజు వారి కుటుంబానికి అల్లరి మూకలు, తీవ్రవాదుల ప్రమేయంతో జరిగిన ఘోరాల గురించి వివరించారు. కాశ్మీరీ పండితులు లోయలోని తమ మాతృభూమి కి తిరిగి రావడానికి సుముఖత వ్యక్తం చేసినందున, భారత ప్రభుత్వం వారి ఆకాంక్షను నెరవేర్చడానికి చర్యలు తీసుకోవాలని, “శాక్రమెంటో న్యూ ఇండియా గ్రూప్” సభ్యుడు శివేష్ సిన్హా అన్నారు.

మరో ఇద్దరు వక్తలు అను ముగు, మరియు కాశ్మీరీ మనస్ రే లు ప్రతి దేవాలయంలో ప్రతి సంవత్సరం హిందువులు ఈ రోజును ప్రార్ధనలు, భజనలతో జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు. ఎందుకంటే ఇతర మతాలు కూడా వారి గతాన్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా గుర్తుంచుకుంటాయి అని వారు చెప్పారు. కవి “అభినవ్ శుక్లా” కాశ్మీర్ పండితులు అనుభవిస్తున్న బాధను వ్యక్తపరిచే కవితను పఠించారు. “అసలు ఈ కొవ్వోత్తుల ప్రదర్శన ఏమిటి? ఇది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగింది, ఎవరైనా ఇంకా పట్టించుకుంటారా?” ఈ సాయంత్రం శాక్రమెంటోలో జరిగిన నివాళి ఈ రెండు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ఉత్తేజకరమైన శ్లోకాలు, విషాదం, బాధలు, కాశ్మీర్ యొక్క లోతైన ఆధ్యాత్మిక చరిత్ర, నిశ్శబ్ద ప్రార్థన, మృదువైన భజన శాక్రమెంటో లో ఉన్న అసెంబ్లీ ప్రాగణంలో ప్రతిధ్వనించాయి. శాక్రమెంటోలో నివాళికి హాజరైన వారు, కాశ్మీర్‌లో ఏమి జరిగిందో లోతుగా ఇప్పటివరకు తాము గ్రహించలేదని, ఈ నివాళి కార్యక్రమం ద్వారా ఏమి జరిగిందో తామందరం తెలుసుకోగలిగామని చెప్పారు. చరిత్రను తెలుసుకొనే ఈ అవకాశాన్ని అందించినందుకు వారు హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

        

ఉపన్యాసాల తరువాత, సమావేశమైన వారు సాంప్రదాయ భజన గీతాలు ఆలపించారు. కాశ్మీర్ ఉగ్రవాద దాడుల్లో ఇప్పటి వరకు ప్రాణాలు అర్పించిన 400 మందికిపైగా ఉన్న కాశ్మీర్ పండిట్లకు నివాళి అర్పిస్తూ కొవ్వొత్తి వెలిగించారు. కార్యక్రమానికి హాజరైనవారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, కాశ్మీర్ పండిట్ల గుర్తింపును సజీవంగా ఉంచే పోరాటంలో ప్రతి ఒక్కరూ కాశ్మీర్ పండిట్ సమాజానికి మద్దతు ఇవ్వాలని ఈసన్ విజ్ఞప్తి చేసారు. ఈ నివాళి కార్యక్రమానికి పలువురు ప్రవాసాంధ్రులు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉగ్ర మూకల విధ్వంసానికి గురై తలో దిక్కున వెళ్ళిపోయిన కాశ్మీర్ పండిట్లను, తిరిగి వారిని మాతృభూమికి చేర్చే బాధ్యత భారత ప్రభుత్వానిదే అని వారు చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేసారు.

వెంకట్ నాగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here