నండూరి పార్థసారథిగారు – నేను..

5
8

[ది 2024 జూన్ 14న మృతి చెందిన ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ నండూరి పార్థసారథి గారికి నివాళి అర్పిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]నం[/dropcap]డూరి పార్థసారథి గారితో వ్యక్తిగత పరిచయం అయ్యేకన్నా ముందరి నుంచీ ఆయన నాకు తెలుసు!!!

ఆయన రాసిన రాంబాబు డైరీ చదువుతూ ఎంత నవ్వుకున్నానో..

జర్నలిస్టుల జ్ఞానాజ్ఞానాలను ఆయన బయట పెడుతూనే మానవ మనస్తత్వంలోని సూక్ష్మాంశాలను ఒడిసిపట్టుకుని ప్రదర్శించిన తీరు నన్ను ఎంతగానో ఆకర్షించింది. అంతేకాదు, నవ్వించటం ఎంత కష్టమైన పనో నాకు తెలిపింది.

రాంబాబు డైరీ చదవటం ఒక అపూర్వ అనుభవమైతే, అది నేను చదివినప్పటి అనుభవం మరపురానిది.

నేను మొదటి సారి ఆ పుస్తకం అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదివేను. నాతో పాటూ ఓ మిత్రుడున్నాడు. నేను  చదివి నవ్వుతూ అతనికి చదివి వినిపించటం, ఇద్దరం పడీ పడీ నవ్వటం. అది చూసి లైబ్రరీలో ఇతరులు కూడా వారు చదువుతున్న పుస్తకాలు పక్కనపెట్టి, నేను చదివివినిపిస్తున్నది విని నవ్వటంకోసం మా చుట్టూ గుమిగూడటం నేను మరవలేను. నాకు సాధారణంగా అంత త్వరగా నవ్వురాదు.  బహుశా జీవితంలో మొత్తం నవ్వులు ఆ రోజే నవ్వేశానేమో!!! అంతకుముందు, ఆతరువాత అంతగా నవ్వలేదెప్పుడూ.. కొస  మెరుపు  ఏమిటంటే, మా నవ్వులగోల చూసి మమ్మల్ని వారించేందుకు వచ్చిన లైబ్రేరియన్ కూడా మాతో కలసి నవ్వటం!!!!

ఆ తరువాత ఆయన రచించిన సాహిత్య హింసావలోకనం చదివాను. నాకు సాహిత్య మాఫియాముఠాలు, అరసవిరసకురసనీరసనోరస రచయితల గురించి సాహిత్యలోకం పరిచయం కాకముందే పరిచయం చేసిందా పుస్తకం.

ఇదంతా నేను రచనలు ఆరంభించకముందు జరిగింది.

నేను రచనలు ఆరంభించి పదిమందికీ తెలిసిన తరువాత ఒక రోజు నాకు ఓ ఫోను వచ్చింది. “నేను నండూరి పార్థసారథి మాట్లాడుతున్నాను. హిందీ సినిమా పాటల గురించి మీరు రాసిన వ్యాసాలు చదువుతున్నాను. నేను సికిందరాబాదు వైపు వస్తున్నాను, మిమ్మల్ని కలవచ్చా?” అనడిగారు.

ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు!

మా అఫీసు పక్కనే వున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర కలిశాము. నాతో మాట్లాడుతున్న ఆయనలో రాంబాబును, సాహిత్యహింసావలోకనం సృష్టికర్తను చూడాలని ప్రయత్నించి విఫలమయ్యాను. రచనలో రచయితను వెతకటం, రచయితలో రచనను చూడటంలో నిష్ణాతుడనన్న నా నమ్మకం ఆరోజు వమ్మయింది.

ఆ రోజు ఆయన నేను కొన్ని గంటలపాటు హిందీ సినిమా పాటల గురించి, పాటలలో సాహిత్యం గురించి మాట్లాడుకున్నాం. నుంచుని కాళ్ళు నొప్పులు పుడితే కూచుని కాఫీ తాగుతూ మాట్లాడుకున్నాం!

వెళ్ళబోతూ ఆగి, అడిగారు “మా రసమయిలో హిందీ సినిమా పాటల సాహిత్యం గురించి రాయకూడదూ?” అడిగారు.

“అందరూ గాయకులు, సంగీత దర్శకులు, నటీనటుల గురించి రాస్తారు. నేను గేయ రచయితలు వారు తమ గేయాల్లో చూపిన చమత్కారాల గురించి రాస్తాను” అన్నాను.

మళ్ళీ మా మధ్య ఒక్కో రచయిత వారు ఎలాంటి చమత్కారాలను, సాహిత్యాన్ని తమ గీతాల్లో పొదిగారో చర్చ ఆరంభమయింది. అయితే, ఆయనకు ఫోను రావటంతో, ఆయన కోసం ఎవరో ఎదురుచూస్తూండటంతో ఆయన వెళ్ళిపోయారు.

అలా ఆరంభమయిన మా పరిచయం రసరమ్య త్రోవలలో రసమయ స్రవంతిలా ప్రవహించింది.

నెల నెలా నేను వ్యాసం రాసి పంపగానే, దాన్ని డీటీపీ చేసిన తరువాత ఆయన చేసే ఫోను కోసం ఎదురుచూసేవాడిని.

ఒక్క పదం కూడా తప్పు రాకూడదన్నది ఆయన పట్టుదల. వ్యాసంలో ఉర్దూ పదాలు, వాటి అర్థాల గురించి అడిగేవారు.  నేను రాసిన భావం సరైనదేనా లేదా అని గుచ్చి గుచ్చి అడిగి మరీ నిర్ధారించుకునేవారు. ఎక్కడయినా అన్వయం కుదరలేదని ఆయనకు అనిపిస్తే దాన్ని వివరించేవాడిని. ప్రూఫ్ అయిన తరువాత ఇద్దరం సినిమా పాటల గురించి గంటలు గంటలు మాట్లాడుకునేవారం. రసమయికి రాసి నేను ఎంతగా ఆనందించేవాడినో, ఆయనతో ఈ చర్చల వల్ల అంతకన్నా ఎక్కువగా సంతోషించాను.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

నవ్యలో హారర్ స్టోరీలు, డిటెక్టివ్ కథలు, శైశవగీతి వంటివి రాసేప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్ళినప్పుడల్లా, పార్థసారథి గారింట్లో గంటకు తక్కువ కాకుండా గడిపేవాడిని.

ఆ సమయంలో ఆయన తన అనుభవాలు, తాను రాస్తున్న ఇతర రచనల గురించి చెప్పేవారు. మా మధ్య వయసు తేడా వున్న భావన కలిగేది కాదు.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

ఆయనకు కచ్చితమైన అభిప్రాయాలు, నిర్దిష్టమైన భావాలుండేవి. వాటితో రాజీపడేవారు కారు.

అయితే ఒకరోజు ఆయన ఫోనుచేసి రసమయి ఆపేస్తున్నానని చెప్పారు.

నేను వద్దన్నాను.

కానీ, ఆయన సమస్యలు ఆయన చెప్పారు. అన్నీ సమంజసమైనవే. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపుతున్నారని అర్థమయింది. మూడు నాలుగేళ్ళ అనుబంధం వున్న నాకే బాధగా వుంటే, ఆ పత్రికను అన్నీ తానే అయి నడుపుతున్న ఆయనకెంత బాధవుంటుందో ఊహించగలను.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

అయితే, రసమయిని నాకిస్తే నేను నడుపుతానని అడగకుండా వుండలేకపోయాను. పత్రిక స్థాయి, నాణ్యతల విషయంలో రాజీపడకుండా నడుపుతానని ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నించాను. కానీ,  నేను పత్రికను అదే స్థాయిలో నడపగలనన్న నమ్మకం ఆయనకు కలిగించలేకపోయాను. రసమయిని నడపటంలో ఆయన పాటించిన విలువలు, నాణ్యతలను సంచికలోనూ అమలు పరచాలని ప్రయత్నిస్తూంటే అర్థమయింది, ఆయన రసమయిని నాకు అప్పగించకపోవటం నిర్ణయం వెనుక వున్న అనుభవం!

రసమయి ఆగిపోయింది. కానీ, హిందీ సినిమా పాటల గురించి రాయటం చర్చించటం అలవాటయిన నాకు రసమయి లేక పోవటం పెద్ద లోటనిపించింది. అంతలో పోనుగోటి క్రిష్ణారెడ్డి పరిచయమవటం, ఈభూమి పత్రికలో  పాడుతా తీయగా ఫీచర్ ఆరంభించటం సంభవించింది. రసమయిలో నిడివి పరిమితి లేదు. ఒకో గేయ రచయిత గురించి నెలలపాటూ రాశాను. కానీ, పాడుతా తీయగా రెండు పేజీల్లో రాయాలి. ఒక నెల ఒక కళాకారుడి గురించి రాయాలి. ఈ ఫీచర్ కూడా పాఠకాదరణ పొందింది. పాడుతా తీయగా పుస్తకం రూపంలో వచ్చింది. కానీ, రసమయిలో వ్యాసాలు ఇంకా పుస్తక రూపం ధరించలేదు.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

అయితే, నండూరి పార్థసారథి గారితో స్నేహం కొనసాగింది.

ఫోన్లో మాట్లాడుకునేవారం.

నేను ఆయన సృజనస్వరం రికార్డు చేయాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు.

ఒకసారి అన్నీ కుదిరేయి కానీ, ఆయన ఇతరులను పిలిచారు. దాంతో సృజనస్వరం రికార్డుచేసే బదులు అందరం మాట్లాడుకున్నాం.

మరోసారి అడిగితే, అబ్బాయి వచ్చాడు, వెళ్ళిన తరువాత రికార్డు చేద్దాం అన్నారు.

నేను సంచిక పత్రికలో రాయమని ఆయనను అడిగేను. ఆయన ఆత్మకథ రాస్తున్నానన్నారు. దాన్ని సంచికలో సీరియల్‍గా వేస్తానన్నాను. కానీ, ఆయన తన రచనలను ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి అక్కడే వుంచుతున్నానన్నారు. ఆ రకంగా సంచికలో ఆయనతో రాయించాలన్న కోరిక కోరికగానే మిగిలిపొయింది.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

రామకథాసుధ కథల సంకలనం తయారు చేసే సమయంలో ముళ్ళపూడి వేంకట రమణ గారి సీతాకళ్యాణం కథను సంకలనంలో ప్రచురించేందుకు అనుమతి లభించటంలో ఆయన చేసిన సహాయం మరువలేనిది.

ఇటీవలె కొన్ని నెలల క్రితం సృజనస్వరం ప్రస్తావన మళ్ళీ తెచ్చాను. కాస్త అనారోగ్యంగా వుంది. ఆరోగ్యం బాగవగానే చెప్తానన్నారు.

రెండు మూడు నెలల క్రితం ఫోను చేసినప్పుడు, “ఇంటి దగ్గర ఏవో కన్‍స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి, శబ్దాలు బాగా డిస్టర్బింగా వుంది, ఆ నిర్మాణం అవగానే చెప్తాను, వచ్చి రికార్డ్ చేసుకోండి” అన్నారు.

Photo Courtesy: Mr. Vaddi Omprakash Narayana

ఆ రోజు రాలేదు. ఇక రాదు.

నండూరి పార్థసారథి గారి మరణ వార్త ఆలస్యంగా తెలిసింది నాకు.

ఆ వార్త వినగానే నా మనసులో మెదిలిన కొన్ని జ్ఞాపకాలివి.

రాంబాబు డైరీలు మూడు, సాహిత్య హింసావలోకనం పుస్తకాలను చదువుతూ, కన్నీళ్ళొచ్చేంతగా నవ్వుతూ.. ఆయనతో నా పరిచయాన్ని, స్నేహాన్ని గుర్తుచేసుకోవటమే ఆయనకు నేను అర్పించే నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here