త్రిమూర్త్యాత్మక స్వరూపం బతుకమ్మ

2
6

[box type=’note’ fontsize=’16’] తెలంగాణ సంస్కృతిలో విశేష భాగమైన బతుకమ్మ పండుగ గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు డా. దాసోజు పద్మావతి. [/box]

శ్రీలక్ష్మీ, పార్వతీ, సరస్వతీ – త్రిమూర్త్యాత్మక స్వరూపం బతుకమ్మ. బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ. పూలను ఆరాధించే విశిష్ట సంస్కృతి.

బతుకిచ్చింది బతుకమ్మ

బతుకు నేర్పింది బతుకమ్మ

నేను – నువ్వు బతకాలన్నది బతుకమ్మ

ఇది బతుకమ్మ ప్రకృతి

ఇది తెలంగాణ సంస్కృతి

ధరచోళ దేశాన ఉయ్యాలో

ధర్మాంగుడనురాజు ఉయ్యాలో…

ఈ పాటలో బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలున్నాయి.

చోళదేశాన్ని ధర్మాంగుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని భార్య సత్యవతి. వారికి నూరుమంది సంతానం. వారందరూ రాజ్య సంరక్షణలో మరణించారు. రాజ్యం పోయింది. రాజదంపతులు ఎంతో చింతించారు.

లక్ష్మీదేవి గురించి సత్యవతి తపస్సు చేసింది. అనుగ్రహించిన లక్ష్మీదేవి ధర్మాంగుని ఇంట ఉదయించింది. ఆ తల్లిని చూడ్డానికి మునులు గాయకులు వచ్చారు. ఆ చందమామ మోముగని మునులు “బతుకుగనే ఈ తల్లి మా చల్లని బతుకమ్మ” అని ప్రస్తుతించారు. ఆ పేరుతోనే తల్లిదండ్రులు పిలిచారు.

శ్రీమహావిష్ణువు చక్రాంకుడనే పేర జన్మించాడు. ఆ రాజు ధర్మాంగుని ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బతుకమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఆరువేలమంది సుందరాంగులు జన్మించారు. సత్యవతీ ధర్మాంగులు సంతసించారు. (తెలంగాణ పల్లె పాటలు, బి. రామరాజు).

తెలంగాణలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ పండగ కార్యక్రమాల్ని నిర్వహిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు అమావాస్య నుండి నవమి వరకు జరుగుతుంది. కొన్ని (ప్రదేశాల్లో) ప్రాంతాల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి పూర్వం నుండే అంటే భాద్రపద బహుళ పంచమి నుండే ‘బొడ్డెమ్మ’ ఆటలాడుతారు. కొన్ని చోట్ల బొడ్డెమ్మల్ని పేడతో గోపురాకారంగా చేస్తారు. మరికొన్ని చోట్ల భాద్రపద శుద్ధ చవితి నుండి అంటే వినాయక చవితి నుండి బొడ్డెమ్మ ఆటలాడుతారు. బతుకమ్మ పండుగకి సరిగ్గా 26 రోజుల ముందు నుండి బొడ్డెమ్మలను ఆడుతారు. బొడ్డెమ్మ కన్నెపిల్లల పండుగ. బొడ్డెమ్మను ఎంత శ్రద్ధగా పూజిస్తే అంత మంచి మొగుడొస్తాడనే నమ్మకం వుంది.

ఈ బతుకమ్మ పండుగ గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ కాకతీయుల కాలం నుంచే ఉంది. కాకతీయుల మూలపురుషుడైన గుండన చక్కని పరిపాలనతో పాటు నాగలి పట్టి పొలం దున్నేవాడు. ఓ రోజు పొలం దున్నుతుంటే అమ్మవారి విగ్రహం లభించింది. అది గుమ్మడి తోట. గుమ్మడిని సంస్కృతంలో కాకతి అంటారు. అమ్మవారు కాళికమ్మ అవతారమై కాకతమ్మగా జన్మించిందని విశ్వాసం.

కాకతమ్మ పేరుతోను ఆ రాజవంశానికి కాకతీయ అని పేరు వచ్చింది. కాకతమ్మే బతుకమ్మ. గుండన మొదలు గణపతి దేవుని వరకు అందరూ కాకతమ్మ విగ్రహానికి గుమ్మడి, కోట్ల, బంతి, చేమంతి, తంగేడు పూలతో పూజలు చేసేవారు. ఆ కాకతమ్మే పూల దేవతయై బతుకమ్మగా పూజలందుకుంటుంది.

మరో కథనం కూడా విశేష ప్రచారంలో వుంది. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి పరమశివుని అర్ధాంగి. దక్షుడు చేసే యజ్ఞానికి పిలవకున్నా వెళ్ళింది. అక్కడ జరిగిన అవమానంతో యోగాగ్నిలో భస్మమైంది. ఆ బూడిదే పసుపురంగు గౌరమ్మగా పరిణామం చెందింది. ఆ బూడిద నుంచే వెంపలి చెట్టు పుట్టింది. అందుకే వెంపలి చెట్టును బతుకమ్మ దగ్గర వుంచే ఆచారం వుంది.

ఈ విధంగా పసుపు, వెంపలి చెట్టును గౌరమ్మకు ప్రతీకగా భావిస్తారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను, తోడుగా చిన్న బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ శిరస్సున గౌరమ్మను ఉంచుతారు. అపుడు బతుకమ్మకు చైతన్యం వస్తుంది. బతుకమ్మకు ఆత్మ గౌరమ్మ. బతుకమ్మ జీవాత్మ. గౌరమ్మ పరమాత్మ.

పరమాత్మ చైతన్యమే – జీవాత్మను కదిలిస్తుంది. ఆ దివ్య చైతన్యమే శ్రీలక్ష్మిగా, గౌరమ్మగా, భారతీదేవిగా కనిపిస్తుంది.

“శ్రీలక్ష్మి నీ మహిమలూ – గౌరమ్మా!

చిత్రమై తోచునమ్మా!

భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై

పరగ శ్రీలక్ష్మివయ్యూ – గౌరమ్మా!

భార్యవైతివి హరికి నీవు గౌరమ్మా!”

అంటూ వనితలంతా సంతోషంగా ఆడి పాడే సంప్రదాయం తెలంగాణలో స్థిరపడింది.  తెలంగాణా వారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ పండుగ జరుగుతుంది. ఆధారాలను  బట్టి కాకతీయుల కాలం నుండి పండుగ జరుగుతుందని తెలుస్తున్నా, ఇప్పటి వరకు బతుకమ్మకు విగ్రహ రూపం లేదు. ఆ తల్లి విశ్వవ్యాప్తి. ఎవరెన్ని చేసి పూజిస్తే అంత. ఒక్క పువ్వుతో చేసినా బతుకమ్మే. కోటిపూలతో చేసినా బతుకమ్మే. తొమ్మిది రోజులుండి అందరినీ ఆడిస్తుంది, పాడిస్తుంది. నీళ్ళలో కలిసిపోతుంది. మళ్ళీ సంవత్సరానికి వస్తుంది. ఆడించి, పాడించి, మురిపించి, మరిపించి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ ప్రకృతిలో ఉంటుంది. జన హృదయాలలో వుంటుంది.

ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ దాకా 9 రోజులు బతుకమ్మ పండుగ వైభవంగా జరుపుకుంటాం.

తొమ్మిది రోజులు – తొమ్మిది తీర్ల ప్రసాదాలు పెడుతాం.

1). పప్పు బెలాలు 2). రేగుపండ్లు 3). చద్ది ముద్దలు 4). నాను బియ్యం 5). అట్లు (దోశలు) 6). అమృత ఫలాలు 7). పాలకాయలు 8). రకరకాల ప్రసాదాలు 9). సద్దులే సద్దులు – సద్ద ముద్దలు ప్రధానం.

పులిహోర, పరమాన్నం, దధ్యోజనం, నువ్వులన్నం, నిమ్మపులుపన్నం, ఇలా అయిదు రకాల సద్దులు కడతారు.

ఇంటి ముందు బతుకమ్మ ఆడిం తర్వాత, ఆలయ ప్రాంగణంలో ఆడుతారు. ఉయ్యాల పాటలు, గౌరమ్మ పాటలు, మన బతుకు చిత్రాన్ని మొత్తం పాటలల్ల చెప్పుకుంట ఆడుతారు. నిమ్మజనం తర్వాత – బతుకమ్మపై పెట్టిన గౌరమ్మను (పసుపు) స్పృశిస్తారు. మంగళసూత్రాలకు మొక్కుకుంటారు. ప్రసాదాలు పంచుకుంటారు.

‘పోయిరా! బతుకమ్మ పోయి రావమ్మా’ అని నిమజ్జనవేళ పాడిన పాటను మళ్ళీ మళ్ళీ పాడుకుంటూ ఇంటికి బయలుదేరుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here