త్రివిక్రమునిపై త్రిభాషావర్ణనలు

1
13

[శ్రీ ఇ. ఎన్. వి. రవి రచించిన ‘త్రివిక్రమునిపై త్రిభాషావర్ణనలు’ అనే వ్యాసం అందిస్తున్నాము.]

మ.

రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

***

పైని పద్యం మహాకవి పోతనామాత్యుడు రచించిన శ్రీమదాంధ్రమహాభాగవతంలో వామనవృత్తాంతము లోనిదని, వామనావతారుడైన హరి బలిని మూడడుగుల నేల యాచించి, ఆపై త్రివిక్రమునిగా అంతకంతకూ పెరుగుతూ బ్రహ్మాండం అంతటా వ్యాపిస్తున్న క్రమంలో రవిబింబం ఆయనకు వివిధదశల్లో ఎలా అమరింది అని కవి వర్ణించిన తీరు. ప్రసిద్ధమైన ఈ పద్యం తెలుగు సాహిత్యంతో ఏ కాస్త పరిచయం ఉన్న పాఠకుడికైనా తెలిసి ఉంటుంది.

ఆ పద్య తాత్పర్యం ఇది.

వామనుడు బ్రహ్మాండ మంతా నిండేట్టు పెరుగుతూపోతున్న క్రమంలో, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడు. అది ఎలాగంటే ఆ సమయంలో సూర్యుడు క్రమక్రమంగా

  1. త్రివిక్రమునికి గొడుగులా,
  2. తర్వాత శిరోమణిలా,
  3. తర్వాత చెవిపోగులాగా,
  4. పిమ్మట కంఠాభరణంలా,
  5. ఆ పిమ్మట బంగారు భుజకీర్తిలా,
  6. ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా,
  7. అపైన మొలలోని గంటలా,
  8. అనంతరం మేలైన కాలిఅందెలా,
  9. చివరికి పాదపీఠంలా

– పోల్చడానికి తగి ఉన్నాడు.

***

ఆ పద్యాన్ని వివరిస్తూ, మాన్యులు, విద్వన్మణి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు “పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం” అన్న అపూర్వమైన వ్యాసం వ్రాశారు. ఆ వ్యాసంలో

ఆ పద్యం సారాలంకారానికి నిదర్శనం అని, ఆ పద్యపు మాతృక సంస్కృతాలంకారికుడైన రాజానక రుయ్యకుని అలంకారసర్వస్వం అనే గ్రంథానికి విమర్శిని అన్న పేరిట వ్యాఖ్య వ్రాసిన ‘జయరథుడిద’ని, ఆ వ్యాఖ్యలో సారాలంకారానికి ఉదాహరణగా ఈ సంస్కృత శ్లోకాన్ని చెప్పాడని సోపపత్తికంగా వివరించారు.

ఆ సంస్కృతం త్రివిక్రమ వర్ణన ఇది.

స్రగ్ధర.

కిం ఛత్త్రం కిం ను రత్నం తిలక మథ తథా కుణ్డలం కౌస్తుభో వా

చక్రం వా వారిజం వే త్యమరయువతిభి ర్యద్బలిద్వేషిదేహే

ఊర్ధ్వే మౌలౌ లలాటే శ్రవసి హృది కరే నాభిదేశే చ దృష్టమ్

పాయా త్త ద్వోఽర్కబిమ్బం స చ దనుజరిపు ర్వర్ధమానః క్రమేణ.

బలిద్వేషి అయిన వామనావతార విష్ణువు శరీరం పెరుగుతూ పెరుగుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న అప్సరసలు – అదిగో, సూర్యబింబం

  1. ఆయనకు పట్టిన గొడుగై ఉన్నది కదూ!
  2. అదిగో అంతలో అది ఆయన శిరసుమీది రత్నమై ఉంది కదూ!
  3. నుదుటిమీది తిలకమై ఉంది కదూ!
  4. చెవియందలి కుండలమై ఉంది కదూ!
  5. వక్షఃస్థలాన్ని అలంకరించిన కౌస్తుభరత్నమై ఉంది కదూ!
  6. పాణితలమందలి సుదర్శన చక్రమైంది కదూ!
  7. నాభిదేశాన ఉన్న పద్మమై కనబడింది కదూ!

అనుకొంటున్నప్పటి ఆ సూర్యబింబమూ, ఆ రాక్షసశత్రువైన శ్రీమహావిష్ణువూ మిమ్మల్ని రక్షిస్తారు గాక! – అని ఆశీస్సు.

ఇతర విశేషాలకై ఏల్చూరి మురళీధరరావు గారి “పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం” వ్యాసాన్ని ఆలంలో ఆసక్తిపరులు వెతికి చదువుకొనవచ్చును.

***

పైని తెలుగు పద్యానికి, సంస్కృత శ్లోకానికి సమాంతరమైన పద్యం ప్రాచీన కన్నడ సాహిత్యంలో, నేమినాథపురాణం అన్న గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని వెలయించిన కన్నడకవితిలకుడు నేమిచంద్రుడు. ఈ కావ్యం జైనకావ్యమైనప్పటికి ఇందులో త్రివిక్రమ వర్ణన ఉన్నది. ఆ కన్నడపద్యం ఇది.

చం.

అదె హొసపొన్న సత్తిగెయదల్లదు రత్నహటత్ కిరీటవ

ల్లదు వరవజ్ర కుండళవదల్లదు కౌస్తుభ రత్నమంతద

ల్లదు కరచక్ర వల్లదదు నాభిసరోజ మెనల్ దినేశ బిం

బద నెలె కర్గి తప్పి నవనుక్రమదిం బెళదిం త్రివిక్రమమ్. (నేమినాథపురాణమ్ ౬.౨౮)

ಅದೆ ಹೊಸಪೊನ್ನ ಸತ್ತಿಗೆಯದಲ್ಲದು ರತ್ನಹಟತ್ ಕಿರೀಟವ

ಲ್ಲದು ವರವಜ್ರ ಕುಂಡಳವಲ್ಲದು ಕೌಸ್ತುಭರತ್ನಮಂತದ

ಲ್ಲದು ಕರಚಕ್ರವಲ್ಲದದು ನಾಭಿಸರೋಜಮೆನಲ್ ದಿನೇಶ ಬಿಂ

ಬದ ನೆಲೆ ಕರ್ಗಿ ತಪ್ಪಿ ನವನುಕ್ರಮದಿಂ ಬೆಳದಿಂ ತ್ರಿವಿಕ್ರಮಮ್. (ನೇಮಿನಾಥ ಪುರಾಣ ೬. ೨೮)

అది (ఆ కనబడుతున్న రవిబింబం) ఈతని

  1. క్రొత్త చిహ్నమైన గొడుగా? – కాదు.
  2. ఈతని రత్నకిరీటమా? – కాదు.
  3. వరవజ్రకుండలమా – కాదు.
  4. కౌస్తుభమణియా? – కాదు.
  5. హస్తాలంకారమైన సుదర్శనచక్రమా? – కాదు.
  6. బహుశా నాభిలో వికసించిన కమలమేమో!

ఏలనన, ఆ సరోజం సూర్యదర్శనంతో వికసితమవుతున్నది. ఇలా పోల్చదగిన క్రమంలో త్రివిక్రముడు పెరుగుతున్నాడు.

పద్య ఛందస్సు చంపకమాల. కన్నడ చంపకమాలలో యతిమైత్రి అవసరం లేదు. ప్రాసనియమం పాటించబడింది. సంస్కృతంలో లాగ పాదాంతవిరామం తెలుగులో వలెనే, కన్నడలోనూ నియతం కాక, దేశీయమైన శోభను ఇస్తున్నది. హొసపొన్న, వరవజ్ర, కరచక్ర, నెలె తర్గి ఈ శబ్దాలు కన్నడ చంపకమాలకు కొత్త గతిని ఇస్తున్నాయి.

***

కన్నడపద్య నేపథ్యం.

కన్నడకావ్యమైన నేమినాథపురాణం జైనకావ్యమని చెప్పుకున్నాం. ఈ కావ్యాన్నే అర్ధనేమి పురాణం అని అంటారు. ఎందుకంటే ఈ కావ్యంలో గాథలకు ముగింపు లేదట.

జైన తీర్థంకరులలో 22 వ తీర్థంకరుడైన నేమినాథుని చరిత్ర ఈ కథ. ఈ త్రివిక్రమ ప్రస్తావన ఆరవ ఆశ్వాసానికి సంబంధించినది. ఆ నేపథ్యం క్లుప్తంగా ఇది

ప్రసిద్ధమైన హస్తినాపురానికి రాజు మేఘరథుడు. అతని భార్య పద్మావతి. వారికి విష్ణుకుమారుడు, పద్మరథుడని ఇద్దరు కుమారులు.

మేఘరథుడు, మేఘాలను చూస్తూ, విరాగియై, విష్ణుకుమారునితో కలిసి జినమార్గం అవలంబించి తాపసిక జీవనం గడపటానికి వెళ్ళిపోతాడు. చిన్నవాడైన పద్మరథుడు రాజు అయ్యాడు. రాజ్యానికి ఈ పిన్నవాడు రాజవటం చూచి, ఆ అదను చూచుకొని శత్రురాజులు హస్తినాపురం మీదకు దాడి చేశారు. అయితే బలి అనే ఒకానొక మంత్రి మంత్రబలంతో శత్రురాజులను తరిమి కొట్టగలిగాడు పద్మరథుడు.

బలి చేసిన సాయానికి మెచ్చి పద్మరథుడు అతనికి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడు బలి 7 దినాలు తనను రాజ్యానికి రాజుగా చేయమన్నాడు. అలా రాజైన బలి అకంపనుడనే ముని అధ్వర్యుడుగా ఒక యాగం తలపెట్టాడు. ఆ యాగానికి తగిన స్థలంగా సౌమ్యగిరి పర్వతాన్ని ఎంచుకున్నాడు.

ఆ సౌమ్యగిరిపై తపస్సు చేసుకుంటున్న విష్ణుకుమారుడు బలి చేస్తున్న యాగపు హడావుడికి ఇబ్బంది పాలయ్యాడు. ఆతడు పద్మరథుని సమీపించి, తాపసవృత్తిలో ఉన్న మాబోటి వారిని కాపాడవలసిన బాధ్యత రాజైన నీది కదా, ఇక్కడ ఈ ఘోర యజ్ఞానికి ఇబ్బంది కలుగుతున్నది. దీన్ని నివారించమన్నాడు. అప్పుడు పద్మరథుడు తను ఇప్పుడు రాజు కానని నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు. అప్పుడు విష్ణుకుమారుడు ఒక వటువు రూపం ధరించి బలి వద్దకు యాచనకు వస్తాడు. వచ్చినది వటువేనని ఎంచిన బలి, ఆ వటువుకు ఈప్సితం కోరుకొమ్మంటాడు.

వామనుడు తనకు మూడడుగుల నేల దానంగా ఇవ్వమంటాడు.

బలి అంత చిన్న కోరికకు ఆశ్చర్యపడతాడు. తీసుకొమ్మంటాడు.

ఆపై కథ తెలిసిందే.

***

ఇప్పుడు సంస్కృత, కన్నడ తెలుగు వర్ణనలలో వస్తుక్రమం, సామ్యాలు, భేదాలు పరిశీలిద్దాం. చూచాయగా ఈ వర్ణనల కాలక్రమం కూడా సంస్కృతం, కన్నడ, తెలుగు – ఈ వరుసలోనే అగుపిస్తున్నది.

సంస్కృతంఃసంస్కృతంలో కవి 7 పోలికలు చెప్పాడు. అందులో ఒక్క తిలకం లేపనవిశేషం. నాభికమలం ఆ మూర్తి స్వరూపవిశేషంలో భాగము. మిగిలినవి 5 (గొడుగు, శిరోరత్నం, కుండలం, కౌస్తుభమణి, సుదర్శనం) వివిధ ఆభరణములు. హరి అవతారమూర్తులను వర్ణించే క్రమంలో అవతారమూర్తి తో బాటు మూలమూర్తి విష్ణుదేవుని ఆభరణాలను, ఆ మూర్తిని కూడా వర్ణించటం ఉన్నదే. శ్రీకృష్ణుని ప్రముఖ వర్ణన

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్స్థలే కౌస్తుభమ్

నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, కరే కంకణమ్…..

ఈ వర్ణనలో కౌస్తుభం శ్రీహరిదైతే మిగిలిన పోలికలు శ్రీకృష్ణ మూర్తివి.

మన వామనవర్ణనలోనూ ఈ క్రమం కనిపిస్తున్నది.

కన్నడ పద్యంః ఈ చంపకమాలలో 6 వస్తువులు. గొడుగు, రత్నకిరీటం, కుండలం, కౌస్తుభమణి, సుదర్శన చక్రం, నాభికమలం. కన్నడకవి – సంస్కృతవర్ణనలో ఉన్న తిలకం కన్నడవర్ణన లో లేదు. మిగిలినది యథాతథం.

అలాగే సంస్కృత, కన్నడ వర్ణనలలో ఎత్తుగడ ఒకే తీరున ఉంది. సంస్కృతంలో ఆ దృశ్యాన్ని అప్సరసలు తిలకిస్తుండగా, కన్నడలో వర్ణన కవియే తన మనోనేత్రంతో చూసి చెబుతున్నట్టుగా ఉంది. సంస్కృతంలోనూ, కన్నడలోనూ విస్మయాన్ని క్వాక్వాక్షిప్తం చేయడంతో అద్భుతం కొంతమేరకు గుణీభూతం అయినట్లు కానవస్తుంది. (తెలుగులో ఇది పరిహరింపబడింది.)

క్వాక్వాక్షిప్తం అంటే కాకు స్వరంలో (అంటే ఆహా ఓహ, బత వంటి ఆశ్చర్యార్థక శబ్దాలతో) వర్ణనలను ఉద్యోతించే క్రమం

అట్లాగే మరొక విశేషం.

ఈ ఘట్టంలో ఎదుగుతున్నది వామనుడు. వటువు. పాఠకుడు కూడా పెరిగి బ్రహాండాంత సంవర్ధి అయిన వటువునే ఊహిస్తాడు. అయితే సంస్కృతంలోనూ, కన్నడంలోనూ కిరీటం, కౌస్తుభం, సుదర్శనచక్రం, నాభికమలం ప్రస్తావించడంతో, ఈ వర్ణన స్పష్టంగా – శ్రీ మహావిష్ణువు స్వరూప వర్ణనగా తెలిసిపోతున్నది. అంటే పాఠకుడు వటువును కాక, శ్రీమహావిష్ణువును ఊహించుకొనవలసి ఉంది. అంతే కాక, వర్ణన స్వామి యొక్క నడుము పైభాగం వరకే నిలచి ఉండడం విశేషం.

తెలుగుకవిత్వంః మూడు వర్ణనల్లోనూ విశిష్టమైన, ఔచిత్యవంతమైన, అద్భుతావహమైన వర్ణన తెలుగులోనే అని ఒప్పుకొనవలసి ఉన్నది. పోతనామత్యుడి వర్ణనలో 9 పోలికలు. ( గొడుగు, శిరోమణి,చెవిపోగు,కంఠాభరణం,బంగారు భుజకీర్తి, కంకణం,మొలలోని గంట,కాలిఅందె, పాదపీఠం). ఇదీ క్రమం. కన్నడ సంస్కృతాల్లోని కౌస్తుభం, సుదర్శనచక్రం, నాభికమలం – ఈ మూడింటిని పరిహరించి భుజకీర్తి, కంకణం మొలనూలి ఘంట, పదపీఠం – వీటిని ప్రవేశపెట్టడంతో వామనమూర్తిని, బ్రాహ్మణవటువు స్వరూపాన్ని కట్టెదుట నిలిపినట్లయింది. ఆశ్చర్యార్థాన్ని ఉద్యోతించే కాకుస్వరాలు లేవు. అయితే పద్యం చివరి పాదంలో సూర్యబింబాన్ని, వామనమూర్తి పదపీఠంగా నిలుపడంతో ఒడలు కంపించే స్థాయిలో విస్మయాన్ని ప్రతీయమానం చేశాడు కవి. దరిమిలా ఆ మూర్తి యొక్క నఖశిఖపర్యంతవర్ణన పూర్తి అయింది. వర్ణనావస్తువులు కూడా సంస్కృత కన్నడలకంటే ఎక్కువ. మొత్తంగా 9.

స్రగ్ధర వృత్తంలో పాదానికి 21 అక్షరాలైతే మత్తేభంలో 20. దాదాపుగా సమం అనుకున్నా, తెలుగులో హెచ్చు వర్ణనలు ఉండడం, ఆ వర్ణన క్రమం – చిట్టాచదివిన చందాన కాక, అపూర్వమైన మూర్తిని పొడగట్టించటం – ఇది బహుశా తెలుగుభాష సొగసుకు, పోతనామాత్యుని నేర్పుకు, ఆ మహనీయుని కల్పనాచాతురికి నిదర్శనం అనుకోవచ్చు.

***

పైన ప్రస్తావించుకున్న విషయాలను ఇప్పుడు పట్టిక రూపంలో చూద్ధాం

విషయం సంస్కృత కల్పన కన్నడ పద్యం తెనుగు కృతి
కవి జయరథుడు నేమిచంద్రుడు పోతనామాత్యుడు
కావ్యం విమర్శినీవ్యాఖ్యలో ఏకశ్లోకం నేమినాథపురాణం, షష్ఠాశ్వాసం శ్రీమద్భాగవతం, వామనవృత్తాంతము.
ఛందస్సు స్రగ్ధర చంపకమాల మత్తేభవిక్రీడితం
పోలిక రవిబింబము రవిబింబము రవిబింబము
వర్ణించినమూర్తి శ్రీమహావిష్ణువు శ్రీమహావిష్ణువు వామనమూర్తి
పోలికల సంఖ్య 7 6 9
పోలికలు గొడుగు,

శిరోరత్నం,

కుండలం, కౌస్తుభమణి, సుదర్శనం,

తిలకం,

నాభికమలం

గొడుగు,

రత్నకిరీటం,

కుండలం, కౌస్తుభమణి, సుదర్శన చక్రం, నాభికమలం

గొడుగు,

శిరోమణి,

చెవిపోగు,

కంఠాభరణం,

బంగారు భుజకీర్తి,

కంకణం,

మొలత్రాడులోనిగంట,

చక్కని కాలిఅందె,

పాదపీఠం

వర్ణనాక్రమం అప్సరసలు చూస్తున్నవిధం కవి కల్పన శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెబుతున్న క్రమం
కాలం 12 వ శతాబ్దం 12 వ శతాబ్దం 14వ శతాబ్దం

పాఠకులకు తెలుగుపద్యం గురించి తెలిసి ఉంటుంది. శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాసం మూలంగా సంస్కృతమూలం విశేషాలు కూడా తెలియవచ్చినవి.

ఈ వరుసలో కన్నడపద్యం గురించి కూడా తెలిసికొనే అవకాశం కలిగినందుకు మనకు – తెలుగుపద్యం మీద, పోతన మీద గౌరవము, ఆదరము ఇనుమడిస్తున్నది. ఏ మూలనా కూడా కవి సంస్కృతాన్ని అనుసరించిన చాయలు కానరావు. ఇది పోతన యొక్క పునస్సృజన. ఆ తర్వాతనే అనుసృజన అనుకోవాలి.

సంస్కృతమూలం అలంకారిక విమర్శగ్రంథంలో పేర్కొనబడి ఉండడం మూలాన మనకు రవిబింబంబుపమింప…. పద్యానికి మాతృక అయిన కింఛత్రం,కిమున రత్నం… అన్న శ్లోకం ఒక్కటే కనిపిస్తున్నది. అయితే కన్నడ కావ్యంలో వామనావతార ఘట్టం పూర్తిగా ఉంది కనుక ఆ ఘట్టంలో మరొక పద్యాన్ని ప్రస్తావించాలి. ఆ కన్నడ పద్యాన్ని ప్రస్తావించకపోతే ఈ వ్యాసం సంపూర్తి కాదు.

మ.

మరనం ముట్టిదనిల్ల మేఘఘటెయొళ్కాల్కోదనిల్లిల్ల భూ

ధరమం దాంటిదనిల్ల బాందొఴయొళిట్టం కాల నిల్లిల్ల భా

స్కరనం మాయద మాణి సెండొదదనా యిల్లింబినం నీడిదం

తరదిం పాదమనుర్వి కొర్వి బలియం గెల్వా మనం వామనం.(నేమినాథ పురాణం ౬.౨౭)

 

ಮರನಂ ಮುಟ್ಟಿದನಲ್ಲಮೇಘಘಟೆಯೊಳ್ಕಾಲ್ಕೋದನಿಲ್ಲಿಲ್ಲ ಭೂ

ಧರಮಂ ದಾಂಟಿದನಿಲ್ಲ ಬಾಂದೊಳ್ಯೊಳಿಟ್ಟಂ ಕಾಲ ನಿಲ್ಲಿಲ್ಲ ಭಾ

ಸ್ಕರನಂ ಮಾಯದ ಮಾಣಿ ಸೆಂಡೊದದನಾ ಇಲ್ಲಿಂಬಿನಂ ನೀಡಿದಂ

ತರದಿಂ ಪಾದಮನುರ್ವಿ ಕೊರ್ವಿ ಬಲಿಯಂ ಗೆಲ್ವಾ ಮನಂ ವಾಮನಂ (ನೇಮಿನಾಥ ಪುರಾಣ ೬.೨೭)

ఆ వటువు ఎత్తైన వృక్షంలా ఎదిగినాడు.

కాదు! ఆ మేఘాల సమూహంలో పాదాన్ని ప్రవేశింపజేశాడు.

కాదుకాదు! కొండ శిఖరం కంటే పెద్దగా ఎదిగాడు.

ఉహూ కాదు! ఆకాశగంగ పై కాలు పెట్టాడు.

ఛీ! ఈ మాయవటువు సూర్యబింబాన్ని బంతిలా తంతున్నాడు.

లేదు. అంతకంటే పైకి పాదాన్ని ఎత్తినవాడైనాడు.

ఈ విధంగా బలిని గెలవాలని ఆ వామనావతారుడు రభసతో అతిశయంగా పెరుగుతున్నాడు.

ఈ పద్యం ఇదివరకటి రవిబింబపు పోలిక (అదె హొసపొన్న….) పద్యానికి ముందు పద్యం. ఈ పద్యంలో అంచెలంచెలుగా పెరుగుతున్న వామనావతారుని పాదం మాత్రమే సూచితం. అంటే తన పాదాన్ని పైకెత్తి బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తున్న వటువును ఊహించుకోవాలి. అలా పెరుగుతున్న వామనుని కాలు, మేఘాలని చీల్చుకుని, ఆకాశగంగ ద్వారా అభిషేకించబడి, ఆపై సూర్యబింబాన్ని తన్నిందని కవి కల్పన.

చాలా కమనీయంగా ఉంది కదూ!

తెలుగులో పోతన కన్నడపద్యాన్ని చూచాడో చూడలేదో తెలియదు కానీ, ఆ వర్ణనకు విభిన్నంగా మరో విశిష్టమైన పద్యాన్ని నిర్మించాడు.

శా.

ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

ఆ వటుడు చూస్తూండగానే – ఇంతైనాడు, మరింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రమండలం అధిగమించాడు, ధ్రువపదం పైకి సాగినాడు, మహర్లోకం దాటి అంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగినాడు. బ్రహ్మాండమంతా నిండిపోయినాడు.

ఇది తెలుగు వర్ణన. తెలుగు వర్ణన లో బాలుడు మొదట పెరుగుతున్నాడు.

ఆ తర్వాత భూమిపైన, ఆకాశంలో కాలు మోపుతాడు. కన్నడపద్యంలో వామనుని పాదం వర్ణన ప్రస్తావితం. ఇదీ భేదం.

ఇక పద్యనిర్మాణంలో తెలుగు పద్యం గురించి మనబోటి పాఠకులు ఏం మాట్లాడినా ఇలా మాట్లాడే మాట వెలవెలబోతుంది. అంతటి కమనీయమైన పద్యం పోతనది. కేవలం, కేవలం చదువుకుని, అర్థతాత్పర్యాలు చింతించకుండా కూడా ఈ పద్యపు స్వారస్యాన్ని ఆస్వాదింపవచ్చు.

***

కాలం.

నేమిచంద్రుడు క్రీ.శ. 11-12 శతాబ్దాలకు చెందినవాడు. అయితే సంస్కృతంలో అలంకారసర్వస్వం రచించిన రుయ్యకుని కాలం కూడా క్రీ.శ. 11 వ శతాబ్దమని తెలుస్తూ ఉంది. అలంకార సర్వస్వానికి వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యానాలలో విమర్శిని అన్న వ్యాఖ్యానం వ్రాసినది కాశ్మీరదేశవాసి అయిన జయరథుడు. ఈతని కాలం 11 వ శతాబ్దపు ఉత్తరభాగం 12 వ శతాబ్దానికి పూర్వభాగమే కావాలి.

అంటే కన్నడకవి నేమిచంద్రుడు, జయరథుడు సమకాలికులు. కనుక ఏ కృతి ముందు వచ్చింది అన్న ప్రశ్న ఏర్పడుతుంది.

కన్నడ కవికృతిని స్వీకరించి జయరథుడు సంస్కృతీకరించుకొన్నాడా? లేక సంస్కృత వ్యాఖ్యానం చదివి కన్నడకవి ఈ కల్పనను రూపు దిద్దుకొన్నాడా ?

అలా ఉంటే జయరథుడు కల్పించిన ఉదాహరణం ఒక్కశ్లోకానికి పరిమితం. ఆ శ్లోకం అదివరకే రచింపబడిన ఇంకొక గ్రంథంలోనిదా లేక స్వీయమా అని తెలియదు.

ఇంకొక విషయం. రుయ్యకుని అలంకార సర్వస్వానికి సంజీవని పేరిట మరొక వ్యాఖ్య ఉంది. ఆ వ్యాఖ్యాత విద్యాచక్రవర్తి. ఈ వ్యాఖ్యాత కన్నడిగుడు. హొయసళ రాజాస్థానంలో ఉన్నవాడు. బహుశా నేమిచంద్రునికి సమకాలికుడు.సాటి కన్నడ కవి ద్వారా నేమిచంద్ర కవికి సంస్కృతమూలం పరిచయం అయిందా ?

ఈ ప్రశ్నలకు సమాధానం అంతుబట్టదు.

ఏది ఏమైనా మనం చెప్పుకొన్నట్టు తెలుగులో పోతనామాత్యుడు కన్నడను కానీ, సంస్కృతాన్ని కానీ దేన్ని చూచినా, ఆ మూలరూపాన్ని ద్విగుణీకృతంగా తీర్చిదిద్దినాడనన్నది నిస్సందేహంగా చెప్పుకోవాలి.

***

ధన్యవాదాలు

  1. ఏల్చూరి మురళీధరరావు గారి “పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం” వ్యాసం.
  2. భాగవతగణాధ్యాయి గారి శ్రీమద్భాగవతం జాలగూడు.
  3. కన్నడ శతావధాని గణేష్ గారి “తెలుగు సాహిత్య విహార – part3” ప్రసంగం.
  4. నేమినాథపురాణం – కన్నడ సాహిత్యపరిషత్తు. (RV Kulakarni)
  5. అలంకారసర్వస్వం – రుయ్యకుడు. విద్యాచక్రవర్తి వ్యాఖ్య. Edited by V Raghavan.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here