తులసీ రామాయణంలో అవాల్మీకాలు-4

2
6

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న ‘తులసీ రామాయణంలో అవాల్మీకాలు’ అనే వ్యాస పరంపర.]

యుద్ధకాండ

[dropcap]తు[/dropcap]లసీదాసు యుద్ధకాండకు ‘లంకాకాండ’ అని పేరు పెట్టాడు. బాలకాండలో లాగా యుద్ధకాండలో కూడా చాలా కల్పనలు చేశాడు తులసీదాసు. వాల్మీకి రామాయణంలో విభీషణుడు రావణుడిని హితోపదేశం చేయటం, రావణుడు అతడిని లంక నుంచీ వెళ్ళగొట్టటం, విభీషణుడు రాముడిని శరణు వేడటం మొదలైన ఘట్టాలు యుద్ధకాండలో వస్తాయి. కానీ తులసీదాసు ఇవన్నీ సుందరకాండ లోనే చెప్పేస్తాడు. సేతువు నిర్మాణం పూర్తి అయిన తర్వాత రాముడు “ఇక్కడి భూమి శ్రేష్ఠమైనది. నేను ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేస్తాను” అని చెప్పి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజచేస్తాడు. “ఈ లింగం రామేశ్వర లింగము అనే పేర ప్రసిద్ధమౌతుంది. శివుడికి ప్రియమైన వాడు నాకూ ప్రియమైన వాడే! శివుడిని ద్వేషించి, నన్ను పూజించేవాడిని స్వప్నంలో కూడా నేను అనుగ్రహించను” అని చెబుతాడు. అయితే ఈ సన్నివేశం అవాల్మీకం. వాల్మీకి అలాంటి విషయం ఏమీ చెప్పలేదు.

వారధి నిర్మాణం జరిగింది అనే సమాచారం దూతలు చెప్పగానే రావణుడు పదినోళ్ళతోనూ సముద్రుడి పది నామాలు (పయోధి, జలధి, ఉదధి, నీరనిధి, తోయనిధి, వనధి, నదీశు, సింధు, కంపతి, వారీశ ) చెబుతూ “సముద్రం పైన వారధి నిర్మాణం జరిగిందా ఇది వాస్తవమా!” విస్మయంగా అడుగుతాడు. మండోదరి భర్తను చూసి “స్వామీ! హిరణ్యాక్ష హిరణ్య కశిపులను సంహరించిన మహావిష్ణువే శ్రీరాముడుగా అవతరించాడు. ఆయనతో విరోధం మనకి క్షేమం కాదు. సీతను అప్పగించి శరణు కోరండి” అని అనేక విధాలుగా బ్రతిమిలాడుతుంది. అయినా రావణుడు పెడచెవిని పెడతాడు. ఇవన్నీ అవాల్మీకాలే!

ఇంకొక సందర్భంలో రాముడు కపిసైన్యంతో సువేల పర్వతం పైన విడిసి ఉంటాడు. యుద్ధం ఇంకా ప్రారంభం కాలేదు. వారధి నిర్మాణంలో అలసిపోయిన వానరులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆకాశంలో నిండు చంద్రుడు వెన్నెలను కురిపిస్తున్నాడు. అప్పుడు రాముడు “చంద్రుడిలోని మచ్చకు కారణం ఏమిటో మీ బుద్ధిబలంతో చెప్పండి” అని అడిగాడు. హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వారందరూ “చంద్రుడిని రాహువు గ్రహించేటప్పుడు ఆ మచ్చ పడింది” అని ఒకరూ, “భూమి నీడ చంద్రుడి మీద ప్రతిబింబిస్తూ ఉన్నది” అని మరొకరు ఇలా రకరకాలుగా చెప్పారు. అప్పుడు రాముడు “బ్రహ్మదేవుడు రతీదేవి ముఖం తీర్చిదిద్దేటప్పుడు చంద్రుడి లోని కొంత భాగం అరగదీసి దిద్దాడు. అందువల్ల రంధ్రం ఏర్పడింది. అంతేకాదు, పాలకడలి మథించేటప్పుడు పుట్టిన విషమును చంద్రుడు తన హృదయంలో ఉంచుకున్నాడు. అందువల్లనే చంద్రకిరణాలు విషపూరితాలు అయి విరహంలో ఉన్న స్త్రీ పురుషులని కాల్చివేస్తున్నాయి” అని చెబుతాడు. ఇక్కడ రాముడి మానసిక స్థితిని తెలియజేయటానికి కవి ఈ సంఘటన కల్పించాడు అని అర్థం చేసుకోవాలి తప్ప ఉబుసుపోక కబుర్లు చెప్పుకోవటానికి అని అపార్థం చేసుకోకూడదు.

లంకలో ఒక శిఖరము పైన రావణుడి విలాసమందిరం ఉన్నది. అక్కడ నృత్య సంగీతాలతో వినోదంగా కాలం గడుపుతూ ఉంటాడు. అప్పుడు రావణుడి కిరీటమూ, మండోదరి కర్ణ భూషణాలు తళుకు తళుకు మని మెరుస్తూ మేఘాల మధ్య కనిపిస్తూ ఉంటాయి. దూరాన సువేల పర్వతం పైన ఉన్న రాముడు అది చూసి “దక్షిణ దిక్కువ మేఘాలు దట్టంగా అలముకున్నాయి. మెరుపులు మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి చూడు. బహుశా వడగండ్ల వాన కురుస్తుందేమో!” అన్నాడు. “అది మెరుపూ కాదు, మేఘ సముదాయమూ కాదు, రావణుడి కిరీట కాంతులు, మా వదిన గారి కర్ణాభరణ ద్యుతులు. అయన శిరస్సు పైన నల్లటి ఛత్రం ఉన్నది. అది మేఘ సముదాయంలా కనిపిస్తూ ఉన్నది. అక్కడి మృదంగ తాళ ధ్వనులే మేఘాల గర్జనలా వినిపిస్తున్నాయి” అని చెప్పాడు విభీషణుడు. రావణుడి అహంకారం గుర్తించి వెంటనే రాముడు ఒక బాణం వేశాడు. అది వేగంగా వెళ్లి రావణుడి కిరీటం, మండోదరి చెవి కమ్మలు తెగిపడేటట్లు చేసి మళ్ళీ వచ్చి రాముడి అమ్ముల పొదిలో చేరుతుంది. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోతుంది.

ఆ విషయం అక్కడ ఎవరూ గమనించలేదు. ఇవి హటాత్తుగా ఎలా నేలరాలినాయి? అని ఆశ్చర్యపోతాడు. ఇదేదో అపశకునం అనుకుంటారు. మండోదరి కూడా “ఈ అపశకునాలు మంచిది కాదు, రాముడితో వైరం మానండి. నా మాంగల్యం రక్షించండి” అని విచారంగా వేడుకుంటుంది. భార్య మాటలు విని బిగ్గరగా నవ్వి “మండోదరీ భయం మాను. ఈ చరాచర విశ్వం అంతా నా గుప్పిట్లో ఉంది. దేవతలు, శివ బ్రహ్మలు కూడా నా వశంలో ఉన్నారు” అని చెప్పి నిర్లక్ష్యంగా వెళ్ళిపోతాడు రావణుడు.

యుద్ధ ప్రారంభానికి ముందు రాముడు అంగదుడిని రాయాబారానికి పంపిస్తాడు. “నువ్వు వాలి తనయుడవా! నీ తండ్రి కుశలంగా ఉన్నాడా!” అని అడుగుతాడు రావణుడు. “నా తండ్రి కుశలంగా ఉన్నాడో లేదో నువ్వే స్వయంగా నా తండ్రి దగ్గరకు వెళ్లి కనుక్కుందువు గాని ఒక్క పదిరోజులు ఆగు. రాముడితో విరోధం పెట్టుకుంటే ఏమౌతుందో కూడా చెబుతాడు” అని అంటాడు అంగదుడు పరిహాసంగా.

వాల్మీకంలో అంగద రాయబారం సన్నివేశంలో సూటిగా రాముడి సందేశం వినిపించి, రావణుడి సమాధానం తీసుకుని వెంటనే వెళ్ళిపోతాడు అంగదుడు. కానీ తులసీ రామాయణంలో మాత్రం ఇద్దరి మధ్య సుదీర్ఘమైన సంవాదం జరుగుతుంది. రావణుడు రాముడిని నిందించటం చూసి కుపితుడైన అంగదుడు రెండు చేతులతో నేల మీద టపటపా కొడతాడు. దానితో భూమి కంపిస్తుంది. సభలో వారంతా అసనాల మీద నుంచీ కిందపడి భయంతో పరుగులు తీస్తారు. రావణుడు కూడా సింహాసనం మీద నుంచీ కిందపడితే పది తలల మీద కిరీటాలు నేలమీద దొర్లిపోతాయి. గబగబా కొన్నిటిని తలమీద పెట్టుకుంటాడు. అంగదుడు కొన్నిటిని చేజిక్కించుకుని దూరంగా విసరివేస్తాడు. అవి వెళ్లి వానర సమూహాల మధ్య పడిపోతాయి. అవి చూసి వానరులు “పగలే చుక్కలు రాలుతున్నాయా!” అంటూ గంతులు వేస్తారు. అవి తీసుకువెళ్ళి రాముడికి చూపిస్తారు.

రావణుడు ఆగ్రహంతో “ఈ కోతిని చంపి, ఆ తాపస సోదరులిద్దరినీ బంధించి తీసుకురండి” అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అంగదుడు క్రుద్ధుడై సభామధ్యంలో నేలపైన పాదాన్ని మోపి, “రాముడి దాకా ఎందుకు? నువ్వు, నీ పరివారం నా కాలుని కదపగలరేమో ప్రయత్నించండి. రాముడి సంగతి తర్వాత చూడవచ్చు” అన్నాడు. రాక్షస వీరులు ఒక్కొక్కరు వచ్చి బలమంతా ఉపయోగించి అంగదుడి పాదం లాగివేయటానికి ప్రయత్నించారు. కానీ ఒక్క అంగుళం కూడా కదపలేక పోయారు. రావణుడు స్వయంగా సింహాసనం దిగి వచ్చి పట్టుకోబోతే అంగదుడు కాలు వెనక్కు తీసుకుని “నా కాళ్ళు కాదు, శ్రీరాముడి కాళ్ళు పట్టుకో! బ్రతికిపోతావు” అని హేళన చేసి, మరోసారి హెచ్చరిక చేసి ఎగిరిపోయి రాముడి దగ్గర వాలతాడు.

అంగదుడు వచ్చి వెళ్ళగానే మండోదరి మళ్ళీ భర్తని బ్రతిమిలాడుతుంది. “మొన్న ఒక వానరుడు వచ్చి అశోకవనం అంతా ధ్వంసం చేసి పోయాడు. ఇప్పుడు వచ్చిన వానరుడి పరాక్రమం కూడా చూశారు. ఇలాంటి వీరులు రాముడి సైన్యంలో ఎందరో ఉన్నారట. సీతా స్వయంవరంలో అయన శక్తిని స్వయంగా మీరే చూశారుగా! ఆయనతో శత్రుత్వం మనకి మంచిది కాదు. దయచేసి రాముడి భార్యను రాముడికి అప్పగించండి” అని చెబుతుంది. రావణుడు ఆ మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

శివుడు ఈ కధంతా చెబుతూ “వింటున్నావా గిరిజా! కాళ్ళు పైకెత్తి నిద్రించే టిట్టిభ పక్షి లాంటిదే రావణుడి గర్వం కూడా (లకుముకి పిట్ట ఆకాశం విరిగి పడితే కాళ్ళతో ఆపుకుందామని కాళ్ళు పైకెత్తి వెల్లికిలా పడుకుని నిద్రపోతుంది)” అని చెప్పి నవ్వుతాడు. “తర్వాత ఏమైందో చెప్పండి స్వామీ! నా మనసు వేగిరపడుతూ ఉంది” అంటుంది పార్వతి. రామాయణం చెప్పటం కొనసాగిస్తాడు శివుడు.

అంగదుడు రాగానే రాముడు “రావణుడికి పది కిరీటాలు ఉండగా నాలుగింటినే నా వద్దకు విసిరివేశావే!” అని అడుగుతాడు. “అవి కిరీటాలు కాదు స్వామీ! సామ దాన భేద దండోపాయాలకు ప్రతీకలు. అవి అధర్మ పరుడైన రావణుడి దగ్గర ఉండటానికి ఇష్టపడక మీ దగ్గరకు వచ్చాయి” అని చమత్కరిస్తాడు. ఇప్పుడు చెప్పిన సంఘటనలు ఏవీ వాల్మీకి రామాయణంలో లేవు. అవి తులసీదాసు కల్పితాలు.

ఇంద్రజిత్ విజ్రంభించి ‘వీరఘూతి’ అనే శక్తిని ప్రయోగించి నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అప్పడు జాంబవంతుడు “లంకలో సుషేణుడు అనే వైద్యుడు ఉన్నాడు. అతడికి ఇక్కడికి తీసుకువస్తే లక్ష్మణుడికి స్పృహ తీసుకుని రాగలడు” అని చెబుతాడు. వెంటనే హనుమంతుడు సూక్ష్మరూపంలో వెళ్లి సుషేణుడిని తీసుకువస్తాడు. అతడు లక్ష్మణుడిని పరీక్షించి ఒక పర్వతం పేరు చెప్పి అక్కడ సంజీవని అనే ఓషధి ఉంటుంది, దాన్ని తీసుకుని రమ్మని చెబుతాడు. హనుమంతుడు వెంటనే వెళ్లి ఆ ఓషధిని తీసుకువస్తాడు. దానిని ముక్కుకు వాసన చూపగానే లక్షణుడు లేచి కూర్చుంటాడు. తర్వాత సుషేణుడిని తిరిగి లంకలో దించి వస్తాడు హనుమంతుడు.

కానీ వాల్మీకంలో మాత్రం ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వలన లక్షణుడు మూర్చపోతాడు. “హిమవత్పర్వతం పైన ఓషధీ పర్వతం ఉన్నది. అక్కడ సంజీవకరణి (మరణించిన వారిని బ్రతికించేది), విశల్యకరణి (గాయాలను నయం చేసేది), సౌవర్ణ కరణి (మచ్చలు, గాయాలు లేకుండా శరీరం ఎప్పటిలా ప్రకాశింప జేసేది), సంధాన కరణి (తెగిపోయిన అవయవాలను అతికించేది) అనే నాలుగు మూలికలు ఉంటాయి. వాటిని తీసుకురా!” అని జాంబవంతుడు చెబుతాడు, సుషేణుడు కాదు. పైగా సుషేణుడు తార తండ్రి. రాముడి పక్షంలో వాడు. లంకలో వైద్యుడు కాదు.

హనుమంతుడు సంజీవని కోసం వెళ్ళినప్పుడు మరో రమణీయమైన కల్పన చేశాడు తులసీదాసు. రావణుడు కాలనేమి అనే రాక్షసుడి దగ్గరకు వెళ్లి “హనుమంతుడు సంజీవనితో తిరిగి రాకముందే మధ్యలో అడ్డగించి, వాడిని సంహరించు” అని చెబుతాడు. కాలనేమి నెత్తి నోరు బాదుకుంటూ “హనుమంతుడు సామాన్యుడా! నీ కళ్ళముందే లంకను కాల్చలేదా! అతడిని అడ్డగించేవాడు ఎవరున్నారు? ఈ మూర్ఖత్వాన్ని మానుకో! రాముడితో మిత్రత్వమే నీకు మేలు చేకూర్చుతుంది” అని చెప్పాడు. రావణుడు ఆగ్రహంతో “నా మాట వినకపోతే ఇప్పుడే నా కరవాలంతో నీ శిరసు ఖండిస్తాను” అని అన్నాడు. “ఈ దుష్టుడి చేతిలో మరణించే కన్నా రాముడి దూత చేతిలో మరణించటమే మేలు” అనుకుని కాలనేమి అంగీకరించాడు.

హనుమంతుడు వెళ్ళే దారిలో ఒక సుందరమైన ఆశ్రమం సృష్టించి తాను ఒక తపస్వి లాగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు కాలనేమి. ఆంజనేయుడు దగ్గరకి రాగానే “ఇక్కడ దాహం తీర్చుకుని, బడలిక తొలగించుకుని వెళ్ళు” అని ఆహ్వానించాడు. ఎవరో మునీశ్వరుడు అనే భావంతో ఆంజనేయుడు కిందికి దిగి, గౌరవంగా నమస్కరించాడు. “పక్కన ఉన్న చెరువులో స్నానం చేసిరా, దాహం తీర్చుకున్న తర్వాత నీకు జ్ఞానోపదేశం చేస్తాను” అన్నాడు కాలనేమి. ఆంజనేయుడు సరస్సులోకి దిగగానే అందులో ఉన్న మొసలి ఆయన కాలు ఒడిసి పట్టుకుంది. ఆయన దానితో పోరాడి చంపివేశాడు. వెంటనే మొసలి అప్సరసగా మారి నమస్కరించి “స్వామీ! నేనొక గంధర్వకన్యను. నీ దయవలన నాకు శాపవిమోచనం అయింది. ప్రత్యుపకారం చేస్తాను. అతడు ముని కాదు, కాలనేమి అనే రాక్షసుడు. నిన్ను సంహరించి రామ కార్యానికి విఘ్నం కలిగించటానికే ఈ రూపంలో ఉన్నాడు” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆంజనేయుడు గట్టు మీదకి వచ్చి “మునీశ్వరా! ముందు మీరు గురుదక్షిణ స్వీకరించండి. జ్ఞానోపదేశం తర్వాత చేయవచ్చు” అని అతడి కంఠం తోకతో చుట్టి గిరగిర తిప్పి విసిరి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బతో కాలనేమి నిజరూపం దాల్చి రక్తం కక్కుకుంటూ మరణించాడు. ఈ కాలనేమి వృత్తాంతం కూడా అవాల్మీకం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here