తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-10

0
8

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

పుణ్యమూర్తి!

[dropcap]శ్రీ[/dropcap]నివాసంబయి చెలగు శ్రీ తుమ్మల, వంశాబ్ది శశిభంగి వరలినావు

ఉభయభాషాజ్ఞాన విభవంబు గడియించి, పండిత పట్టంబు బడసినావు

అలరు కృతులగూర్చి యభినవతిక్కన, యను దివ్యబిరుదంబు నందినావు

గురుడవై సద్విద్య గరపి విద్యార్థుల, పట్ల వాత్సల్యంబు బఱపినావు

సభల నవధానములు పెక్కు జరిపిజరిపి, యార్జన మొనర్చినావు యశోర్ధరాశి

సద్గుణుడవీవు త్యాగివి చతురమతివి, పుణ్యమూర్తి! సీతారామమూర్తి సుకవి!

సద పేక్షంగని నీకృతుల్‌ చదివితిన్‌ స్థాలీపులాకక్రియన్‌

పదలాలిత్యము కల్పనాగరిమ భావ ప్రౌఢిమం బెంతయో

ముదమున్‌ గూరిచె ”రాష్ట్రగానమును” సొంపుల్‌ మీర నిర్మించినా

వది గాంచన్‌ భవదాంధ్రభక్తి విశదంబౌగాదె యెవ్వారికిన్‌

కూరిమి బెద్దనార్యునకు గూర్చె నొకానొకనాడు గొప్ప స

త్కారము కృష్ణరాయ లటు కావ్యము చేకొనువేళ గండపెం

డేరము నిచ్చెనంచు వినుటేకద ! అట్టిమహోత్సవంబు గ

న్నారము నీకుగల్గ సుదినం బిదిగాదె తలంప సత్కవీ!

ఒనరు కనకాభిషేకమహోత్సవంబు, మున్నహో కవిసార్వభౌమునకు జరిగె

నట్టి సన్మానసిద్ధియు నమరె నీకు, ధన్యుడవు తెల్గుతల్లి కీర్తనము కతన.

సత్యలోకాశేష సౌభాగ్య మెందాక, భారతీనిలయమై పరిఢవిల్లు

వైకుంఠమందిరవైభవ మెందాక, నిందిరాసదనమై యిం పెసంగు

రజత శైలోన్నత ప్రాభవ మెందాక, గౌరీనివాసమై పేరుగాంచు

రవితుహినాంశుతారాగణ మ్మెందాక, దివ్యప్రభలతోడ దేజరిల్లు

నవని నందాక నీకృతు లలరుగాత ! విజయమే ప్రొద్దు నీకు లభించుగాత!

ఆయురారోగ్య సంపద లావహిల్ల శ్రీనివాసుండు నిన్ను రక్షించుగాత !

శ్రీ ముక్తినూతలపాటి శీతారామయ్య

~

కవిరాణ్మౌళి

సౌగంధికాసూనసౌరభసంపద, బిసశిరీషవినూత్న పేశలంబు

మంజులపీయూషమాధుర్యవిభవంబు, హిమకౌముదీ శైత్యసమరసంబు

కమనీయపాధోధిగంభీరభావంబు, కరుణామృత ప్రవాహరమవిభూతి

పరిపూర్ణవిజ్ఞానబంధురగరిమంబు సుమనససౌభాగ్యశోభనంబు

నచలనిజబోధతత్త్వమం దనువుకొల్పి

యాంధ్రజనులకు దెల్పు వేమన్న యోగి

కీర్తివిధుని సీతారామమూర్తికవిని

మనుచుగావుత నానందమగ్ను జేసి.

కమ్మనిరాష్ట్రగానసుధ కర్ణపుటంబుల సోక నాంధ్రలో

కమ్మున గొప్పగా సరసకావ్యముఖంబునఁ గూర్చి యిచ్చె మా

తుమ్మలవంశదుగ్ధ ఘనతో యధిచంద్రుడు సత్కవీంద్రబృం

దమ్ముల మేటిచౌదరి గుణంబుల పేటి విశాలదృష్టితోన్‌

అభినవ శ్రీతిక్కనాభిఖ్యబిరుదాంక,శోభితుం డత్యంత సూక్ష్మబుద్ధి

గాంధీమహాత్మాత్మగాధకల్పితధాత, రాష్ట్రగాన కవిత్వరచననేత

పావనతుమ్ములపాధోధిశశి బహు, గ్రంథనిర్మాత సత్కవినుతుండు

పూజ్యసీతారామమూర్తిచౌదరి కవి, రాణ్మౌళి పాండిత్యరవిసమాను

డగుచుఁ గవి గండపెండేరమందు వేళ

నొప్పి కనకాభిషేకమహోత్సవంబు

భద్రదంత్యుత్సవము నేత్ర పర్వమయ్యె

సహహ ! యాంధ్రుల భాగ్య మేమనగవచ్చు?

సుకవుల్‌ తెలుగున గౌరవ

నికర శ్రీగాంచి మనగ నెగడిరి గద ! పూ

నిక తుమ్మలసీతారా

మకవిప్రవరుం డనూనమహిమ జెలంగన్‌.

శ్రీ కడివేటి నరసారెడ్డి

~

అభినందనము

ప్రభుడయి యెల్లలోకముల బాలనసేయుచు నాత్మ రాజ్యస

ద్విభవము బొందజాలక మదిన్‌ దురపిల్లెడు మానవాళి దు

ష్ప్రభవముగాంచి జాలిగొను శాశ్వత తేజము మేలుగూర్చి మా

యభినవ తిక్కనార్యుని సమంచితరీతుల బ్రోచుగావుతన్‌.

జిలిబిలి తేనెపల్కుల నూత్నభావంబు, లతిప్రౌఢముగ జెప్పు ననువు గలిగి

సొంపైన నడకల నింపుగూర్చెడు నట్టి తీరుతీయని మంచిధార గలిగి

వినువారి కాహ్లాదమును నొసంగెడు సర, సం బగు పాత్రపోషణము గలిగి

యర్థగాంభీర్యంబు ననుపమవ్యంగ్యంబు నెఱిజూపనేర్చిన నేర్పుగలిగి

పండితులు పామరులుగూడ బహువిధముల

జెలగునట్లుగ గవితను జెప్పినాడ

వౌర ! తుమ్మలవంశక్షీరాబ్దిచంద్ర

బుధవిధేయ ! సీతారామమూర్తివర్య !

తొలిభాషాప్రియులైన భూపతులు సంతోషంబులో సత్కవీం

ద్రులకుం గాన్కలొసంగి వాహముల నారోహించి యూరేగ జే

సి లసత్కీర్తుల గాంచి రట్టి ఘనతం జేకూర్చి దిగ్వ్యాప్త కీ

ర్తుల బెంపొందిరి యాంధ్రభూప్రజలె సూరుల్‌ మిమ్ము సేవించుటన్‌.

శబ్దశాసనమహాశబ్దశోభితుఁడు న, న్నయ రాజరాజేంద్రనరవిభుండు

కవిబ్రహ్మతిక్కన కవివరేణ్యుండును, మనుమసిద్ది నృపాలమండితుండు

కవిసార్వభౌమవిఖ్యాతుండు శ్రీనాథు డల, కొండవీటి ధరాధిపుండు

ధన్యాంధ్రకవితాపితామహుం డలసాని యమలుండు కృష్ణరాయ ప్రభుండు

నొకరిచేత మరొక్క రీయుర్వియందు, స్థిరతరంబగు సత్కీర్తి జెందినటుల

నధికులగు వారు మీ కనకాభిషేక, సంఘమును బొందు ధరణి శాశ్వతయశంబు

తెలుగుభాషకు వన్నెల దీర్చి దిద్ది యిట్టి కనకాభిషేకంబు లెన్ని యేని

పలుప్రదేశంబులందున బడయునటుల మీకు దీర్ఘాయు వొసగుత లోకవిభుడు

శ్రీ అంబి వేంకటప్పయ్య

~

కవిసార్వభౌముడు

ఉద్ది కవిసార్వభౌమున

కెద్దీ ? కనకాభిషేక మెపుడెపు డనుమా,

బుద్దిగల కోర్కెలెల్లను

సిద్ధించెగదన్న యిపుడు సీతారామా!

కాకవి బ్రహ్మరాకాసిమూకలదోల దరి, కొన్న సుకవి సుదర్శనమ్ము

సరస సత్కవులకు సచివాగ్రగణ్యుండు, భాషావధూళిరోభూషణమ్ము

రాష్ట్ర ప్రజా మనోరాజవీధుల వెంట, బ్రియమార నూరేగు పెండ్లికొడుకు

రసవత్ప్రబంధసారసగంధులనుగూడి, క్రీడించి మోదించు కోడెకాడు

గాక ఎవ్వాడు కనకాభి షేక మొంది

గండపెండేర మీరీతి గాల మెరయ

జేయనోపును సత్కవిశ్రేణియందు

ధన్యు డీతని బొగడ నాతరమె భరము

వ్యాస వాల్మీకి శ్రీకాళిదాసు మాఘు

తిక్కనార్యుని నన్నయ దక్కుగలుగు

మేటికవులను జూడనిలోటు మాకు

తీరె నినుజూడ నభినవతిక్కనార్య!

ఝుమ్మని యమృతము దొణికెడి

కమ్మని నీ రాష్ట్రగాన కవితాశక్తిన్‌

తుమ్మలవంశమునకు పే

రిమ్మహి సమకూర్చితౌర యిద్ధ చరిత్రా!

పుర మేగన్‌ గజ మెక్కి తక్కుకవులున్‌ బుణ్యాత్ము లెల్గెత్తి నీ

బిరుదుల్‌ చాటగ గండ పెండియర మీ పేరోలగమ్మందు నీ

చరణాబ్జంబును నాశ్రయించుటయు నీ స్వర్ణాభిషేకం బహో!

తరమా నీయశ ముగ్గడింప నిల ? సీతారామమూర్తీ ! తగన్‌

శ్రీ తుమ్మల కోటయ్య

~

ధీరోదాత్తుడు

జయము అభినవ తిక్కనార్యా!

జయము తుమ్మల వంశవర్యా!

జయము అతులిత యశోధుర్యా!

జయము గురువర్యా!

కమ్మ బిడ్డవు తెనుగు జోదువు

తెలుగు వెలుగుల దెసల జిమ్ముచు

కమ్మ కయితల నల్ల నేర్చిన

కయిసరుండవురా!

అందుకోవోయి సుకవీ! అం

దుకోవోయీ సుమపూజలన్‌

ఆంధ్ర సంతతి గజముపై నిడి

యతులనుతు లొసగన్.

మిన్ను వాకను బురుడించు మేలిసొగసు

తేనేతేటల నొలికించు తియ్యదనము

సరసహృదయుల మెప్పించు చారుకవిత

కలదు కవివర ! మీకావ్యకళలయందు.

కలదు కల దొక ప్రగతి నీ కలమునందు

అద్ది సమ్మోహినీమంత్రశక్తి యేమొ

సరససాహితీ మాధురీ సాధురీతి

యేమొ యాంధ్రితపఃఫలమేమొ వంద్య!

ధీరుడ వుదాత్తుడ వతి గంభీరుడవును

కంచుకాగడా వేసి గాలించుకొన్న

యాచనాదైన్య మిసుమంతయైన లేని

ధన్యుడవునీవు సుకవిమూర్ధన్య మాన్య !

శ్రీ సుంకర శివరామయ్య చౌదరి

~

కవిరాజు

ఓ కవిరాజ ! తావళరసోల్బణసత్కవితాసుధాంబుధా

రాకమనీయ భావగుణ రంగదభంగ తరంగ ఫేనమా

లాకృత ధాతసీమ సకలంబు త్రిలింగ ధరాతలంబు ది

వ్యాకృతులైరిపో యశము నాయువు లంది భవత్కృతీశ్వరుల్‌.

శారద శర్వరీ ధవళచంద్రికలున్‌ మలయానిలమ్ములున్‌

కైరవకామినీ ముఖవికాసములున్‌ తదగారభృంగ ఝం

కారములున్‌ నవాంగనల కంకణని, క్వణముల్‌ సువాసనా

పూరములున్‌ మహోద్ధతిగ పొల్చు భవత్కవితా వనమ్ములోన్‌.

చెలువు గురిపించు కవిత సృష్టించునపుడు

తేనెలూరెడు మందార సూనములతొ

వ్రాసితీవొ యేమొ ? లేకున్న ప్రతిపదమున

భావవాహిని వెల్లువై పాఱు నొక్కొ!

శ్రీ పెండ్యాల సత్యనారాయణ

~

మామా!

నీ మాన్యత్వము నీయశోగరిమ నీ ని స్తంద్ర వాణీసప

ర్యామర్యాదయు నీయనల్పమగు మూర్తాంధ్రాభిమానమ్ము మా

మా! మేనల్లుడౌనట నా కెఱుక కౌమారంబునం దుండియున్‌

దామీ యాంధ్రులు గుర్తెఱింగిరిట సీతారామమూర్తీ! కవీ !

పండితకవిగా సంభావింపబడితివి సింహపురీ రెడ్ల సీమయందు

అతిలోకమాన్యమహాత్ముచరిత పద్య, మున నచ్చువోసితి వినుతి కెక్క

ఆర్తరక్షాదక్ష   మోదతు మఖిలభారత భూమి, యంచు నిర్మించి తాత్మార్పణంబు

వీణా సముత్థ మాధ్వీకనిస్వానమౌ రాష్ట్రగానమ్మును వ్రాయగంటి

ఆంధ్ర భాషాపరాకాష్ఠ నంది లలిత, కళల నిష్ణాతులైనట్టి కట్టమంచి

వారె అభినవ తిక్కయజ్వా యటంచు, బిలువ బిరుదందితివి నీవు విమలహృదయ!

ఏయే ఘట్టము పట్టి చూచినను నెంతేనిన్‌ రసోత్సేకమై

పీయూషాంజలి గ్రోలినట్టు లగు నావిర్భూతమా కైత భా

పాయోషామణి దిద్ది తీర్చితికదా సత్కావ్యసాహిత్యధౌ

రేయా! ఆత్మకథాదిసత్కృతులు కీర్తిం దెచ్చె నీ కెంతయున్‌.

పరభాషాపరకీయవేషములు సంప్రాపించి పైకెక్కి దు

ర్భరదాస్యాంధతం జిమ్ముచీకటులు గప్పన్‌ గుప్పలై పశ్యతో

హరులౌ నన్యులు దోచుచుండి రని స్వీయమ్మైన రాష్ట్రమ్మునన్‌

వరగానాజ్య సుదీపితం బగు ప్రదీపం బుంచి వెల్గుంచితౌ.

అహరహంబును దలపించు నాంధ్రమాతృ

పాదపూజా శుభోదయపారవశ్య

మంది నీహృది యెంత యానందపడునొ

భువిని గృతకృత్యుడవు నీవు కవివతంస !

శ్రీ జాస్తి శ్రీరాములు

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here