తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-14

0
9

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

కమ్మ తెలుగుంగవీ ! స్వాగతమ్ము నీకు

[dropcap]ఇ[/dropcap]ది కారణయుగము. ఇందేవిషయ ముగ్గడించినను లిఖించినను విపుల విమర్శనమున కగ్గమగుచున్నది. ప్రతివిషయము నొకరు నిర్ణయించుదాని కింకొకరు వ్యతిరేకులగుచున్నారు. అందువలన నీ నవీనయుగమున గవి యెవరో? కవిత్వ మెట్టిదో? యిదమిత్థమని తేల్చుట కయితిగాకున్నది. ఒక కవి, తనకొఱకే కవిత్వ మల్లుకొందుననియు మఱియొకడు కవిత్వ మానందదాయకము కాబట్టి యానందదాయకమగు రచనయంతయు గవిత్వమే యనియు నింకొకఁడు ప్రకృతి సౌందర్యవర్ణనమే కవిత్వమనియు నిట్లనేకులనేక రీతుల గవిత్వ లక్షణము లుగ్గడించుచున్నారు. మొత్తముమీద గవిత విషయమున బ్రాచీనుల లక్షణము లొకపుంతకు నర్వాచీనుల లక్షణము లింకొకవంకకు నడుచుచున్నవి. ప్రాచీనులు కావ్యమునకు లక్షణము లేర్పఱిచి యీ హద్దులలోనే కావ్యముండవలయునని శాసించిరి. ఆ కవిత్వము కేవలము ప్రభువుల కొఱకు బండితుల కొరకు మాత్రమే యుపయోగపడినది. కాని ప్రజాసామాన్యమున కుపయోగ పడలేదని చెప్పక తప్పదు. అప్పటి కవులు స్వతంత్రులు కాక రాజాధిరాజుల యనుగ్రహమునకు లోనయి వారి యభిప్రాయము ననుసరించి కావ్య రచన మొనర్చుచు వచ్చిరి. అందుచే గవుల స్వకీయాభిప్రాయము లంతగా గ్రంథస్థములు చేయుటకు వలనుపడ లేదు.

ఇది ప్రజాయుగము. ఇందు ప్రజానీకమును రంజింపజాలని యెట్టి రచనలును సర్వ జనాంగీ కార్యములు గావు. ఈకాలమున బూర్వపద్ధతులతో రచింపబడిన కావ్యములు హాస్యాస్పదములు గాక తప్పవు. ఇప్పుడు ప్రజలలో భావపరివర్తనము, సంఘసంస్కారము, వర్గ చైతన్యము గలిగింపవలసిన బాధ్యత సాహిత్య పరులయందున్నది. సాహిత్యము ప్రజాభావ ప్రతిబింబము. సాహిత్యపరులయిన రచయితలు ప్రజాసామాన్యమునందు భావవిప్లవము గలిగింప నడుము గట్టవలసియున్నది. కవి దేశశాల పరిస్థితుల నెఱిగి సంఘ శ్రేయస్సు కొరకు నుత్తమకావ్యములను రచింపవలయును. ఇట్టి యుదాత్త రచన, మానవసంఘమెల్లను సాదరముగ శిరసావహించును.

ఈ పట్ల మన చౌదరిగారు ప్రాచీనార్వాచీనకవితారీతు లెఱింగినవారు. అసలు కావ్యమునకు వస్తువు ప్రధానమైనది. అందుచే లోకోత్తరపురుషుడును నుదాత్తుడును నగు గాంధీ మహాత్ముని నాయకునిగా నెన్నికొని వారి యాత్మకథను బద్యకావ్యముగా, రచించి తన కవితారీతి సార్థక పఱుచుకొనిరి.

దేశకాలములను గుర్తెఱిగినచౌదరిగారు రాష్ట్రగానమును రచించి తన రాష్ట్రాభిమానము నకుంఠిత దేశభ క్తియు వెల్లడించిరి.

ప్రత్యేకాంధ్రరాష్ట్రమును బడయవలయునని యువ్విళ్ళూరుచున్న యాంధ్రజాతి వీరి రాష్ట్రగానముపై నెంతయో యాదరాభిమానముల జూపినది. చౌదరిగారు రాష్ట్రగానమును రచించుటచే నాంధ్రదేశ మా బాలగోపాలమునకు నెఱుకపడి రనుట యతిశయోక్తి గానేరదు. చౌదరిగారి కపోతోపాఖ్యానమందలి యాతిథ్యగాధ పాఠక జనహృదయరంజకమై భూతదయార్ద్రతను వెల్లడించుచున్నది. ధర్మజ్యోతియను కావ్యము యథార్థ గాధాబోధకమై తన పిత్రూణమును దీర్చుకొనుట కెంతయు సాధనభూతమైనది. తక్కుగల వీరి ఖండకావ్యములు తన కవితాభిమానమును దేశభక్తిని దేట తెల్లము చేయుచున్నవి. తెలుగుదేశ మీ రీతి కవులను గుర్తించి సన్మానింప దొఱకొనుటెంతయు ముదావహము.

శ్రీ ముక్కామల రాఘవయ్య

~

మా తిక్కన

ముమ్మరమైన సంస్కృతి సముజ్జ్యలనవ్యకవిత్వతత్త్వముల్‌

దిమ్ముకొనన్‌ తెలుంగుల హృదిం గయిసేసిన నీ యనన్య సా

ధ్యమ్మగు సత్కళారచన తథ్యము చాటెను నీ కులమ్ములో

కమ్మదనమ్ము నీకలము గైకొనె నంచును తెల్గు నేలలన్‌.

తీయమావిచివుళ్లు దిన్న కోయిలచిమ్ము, మధురగీతలలోని మార్దవమ్ము

పూవు దేనియ ద్రావి పొంగిభృంగము రేపు, పృథురాగములలోని మధురిమమ్ము

పరిపక్వఫలముల గరచి కీరముచిల్కు, పల్కు ముద్దులలోని ప్రాభవమ్ము

చిమ్మ చీకటి మెక్కి దిమ్ముగా నిలకోడి, తీయు నాదములోని దివ్యతత్త్వ

మెల్ల గరగించి నీ కైత నేర్పరించి

జగతి సమ్మోహనమ్ముగ సల్పినావు

తెల్గుభాషకు వన్నెలు దెచ్చినావు

ఆంధ్రకవిలోక సమ్రాట్టవయ్య నీవు

కళలు వెలార్చు నీ కలము కల్పన లెల్ల ననంతదీప్తితో

కలకలలాడె సత్కవితగన్న యశస్సులు నిన్ను జేరె ని

ష్కలుషమనస్సుతో సుకవికాండము బ్రహ్మరథంబుపట్టె ని

చ్చలును సదాశ్రయంబుగొనె శారద నీదు కళాముఖమ్మునన్‌.

ఎన్ని కనకాభిషేకంబు లెన్ని బిరుదు

లెన్ని దినోత్సవంబుల నెన్ని సేసి

నీ ఋణమ్మును దీర్చగా నేర్తుమయ్య

ప్రతిఫలంబుల కందని ప్రతిభ నీది.

శ్రీ అన్నంరాజు వేంకటేశ్వరరావు

~

బంగారుకలము

ఎందరు సత్కవుల్‌ మహి జనించి చరించుట గాంచ లేదు వా

రందరు నిన్నునుంబలె ప్రజాదర మింతగ నొందియుండిరే?

ఉందురుగాక కోటికొకడుండునొ యుండడొ సత్కవీంద్ర ! నీ

చందము నందము న్గనిన, పొంగునుగాదె యెంతయున్‌ స్వాంతము.

మనుజుల కంకితం బిడుట మంచిదె, కాదని సత్కవుల్‌ పురా

తను లెటులో వచించిన విధంబు రుచింపక యే కసాయికో

ధనమున కాసచెంది కవితన్‌ వెల కమ్ముట కొల్ల కీడ్యవ

ర్తనగలచోట స్వార్థరహితమ్ముగ నంకిత మిత్తు సత్కవీ!

కలదు యుష్మద్రాష్ట్రగానమ్ము నిఖిలాంధ్ర, జనుల నుఱ్ఱూత లూపిన దినంబు

కలదు ధర్మజ్యోతి కనుసన్నలో తెలుం, గులు త్యాగమును నేర్చుకొన్న దినము

కల దాత్మకథలోన కదలి నన్నయ్యతి, క్కనకవుల్‌ నాట్యమాడిన దినంబు

కలదు కొందరు పెద్దకాపు రమ్యోక్తిని, కొనియాడి యారతిచ్చిన దినంబు

కలదు నీ చేతి బంగారు కలమునుండి

దివ్యకావ్యమ్ము లొదవి నర్తించుదినము

తెలుగువాణీతపమ్ముల ఫలముగాగ

నవతరించితి సీతరామాఖ్య నీవు.

శ్రీ తోటకూర వేంకటేశ్వరరావు

~

సమ్మోదము

తుమ్మల సీతారామయ

కమ్మని కవనంబుపల్కి గౌరవములలో

నిమ్ముగ నూరేగుటచే

సమ్మోదము గల్లె తెల్గుజాతికి నెల్లన్‌.

శ్రీ పడాల నాసరాచార్య సిద్ధాంతి

~

పుష్పాంజలి

”పూజ్యమూర్తి” శ్రీ సీతారామమూర్తి కవితారామమూర్తి. ఈ కవితారామమున గల్పతరువు కలదోయేమొ ! పూచి కాచి ఫలించి పరిపక్వ మంజులమై మనోరంజకమై యలరారుచున్నది.

వయస్సుమీరినను వన్నె కెక్కిన పద్యపుష్పములే యీ కల్పతరువున గలవు. పఠించిన బండ్లు తినినట్లే! వాసించిన బూలసోన వర్షించినట్లే !

ఈ వైపరీత్యముం జూడుడు ! అమరలోకమున గల్పతరువుండి మహనీయుల మహిమాతి శయముచే గోర్కెల నందించువారి మహిమయే అమరజ్యోతియై వెలుగొందు. ఇందో ! కవితారామమున గల్పతరు వింతకుమున్ను దీనాతిదీనమై అమరలోకమున నాటలాడు జ్యోతియైనది. కాననే అమరజ్యోతి వీరిచేతి కవితాజ్యోతియైనది కన్నీటిధారచే ఈ జ్యోతి ఆరదు. దీరదు. అహింసాజ్యోతి ననుచు హింసావేత్తలకు హితమార్గములఁ జూపుచున్నది. చూడుడు!

నీ పరమోపవాస మశనిప్రతిమంబయి శైలసాగర

ద్వీపవిశిష్ట విశ్వజగతిన్‌ వడకించుతఱిన్‌ భయార్తులై

పాపులు బల్లెముల్‌ మరతుపాకులు బాకులు పెట్టి తావక

శ్రీ పదపీఠిపై నొరగి సిగ్గలిరేమి తపస్సురా ప్రభూ !

అంతియగాదు ! ఈ తుమ్మలవారు తమ్ములమగు మాకుం ప్రేమమూర్తి. విద్యావేత్తల వినోదింప జేయు సరసులు. సామాన్యులకు సన్నిహితులై చక్కనిమాటల మక్కువతో జెప్పు సాహితీపరులు. మొక్కవోనిమాట, చిక్కు లేనిభాష, అంతులేని ఆదరము, చెంతచేర సాయము, వీరిపాలి నిజరూపము. కాననే సామాన్యముల మనముల వీరిపలుకులు ముద్దు లొలుకును.

ఈ కరుణామయుని కనకాభిషేకము భాషామతల్లి కత్యధిక ప్రేమాభిషేకము వీరి గజారోహణోత్సవము కవితాకోటికత్యంతోత్సాహకరము.

ఆశుకవిత వేనోళ్ల వినియుంటిమి. కాని వీరు కావ్యలక్షణ సమన్వితమై మహాకావ్య మా యనంబడు శైలిం బరగి సులభమై మధురమై శావ్యమై గంటకు నూటయిరువది పద్దెముల వేగము గల యాశువును, సీతా వివాహకథతో నొక్కుమ్మడి గ్రుమ్మరించి పెద్దలకు పారవశ్యము నందించిరి. శ్రీ భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భాన పొన్నూరులో చౌదరిగారు ప్రజామోదముం బడసిన పెద్దకాపు. ఈ పెద్ద కాపే పెద్దకాపు కృతికర్త ఈ కృతికర్తే ”రైతు” రాజ్యంబున కర్హుడను మహాత్ముని వాక్యంబును ప్రకటించిన రైతు. కవి కాపగుట కాలధర్మము కాలేదా? పోతనామాత్యుడు. ఇందు వైపరీత్వం బరికింపుడు కాపే కవి యైనాడు. ఇట్టి పెద్ద కాపుం బెంచుకొనుట మన ధర్మము.

ఆంధ్రప్రభచే నమృతంపురాశి యనిపించుకొని యాంధ్రలోకమున జాటబడినదీ పెద్దకాపు. ఆంధ్రుల కాదర్శమై కవిబ్రహ్మ తిక్కనం దలపించు నభినవ తిక్కన లభించె మనకు.

ఈకర్ణగీతాదులం జూడుడు! కర్ణానందములె వీనుల విందగుచు, మాటల పొందగుచు, సారస్వతాభిమానుల సరస నడయాడుచు సుధా మాధురీ గరిమ నందించుచున్నవీ పద్దెములు.

అంకితములోనే చక్కని పొంకము. ”అహింసారణమని” ప్రారంభించినాఁడు.

స్వతంత్ర భారతమనుటలో ”పూనవోయీ” ! మల్లెపూల దోసిళ్లు. పాడవోయీ! వీర భక్తిగీతాలు మన రాష్ట్రమనుటలో యాచనా దైన్య మెఱుఁగని యాంధ్రజాతి యింతదిగ జారునే యెంత వింతపుట్టె. ”

”కర్ణా ! నీవఖిలార్థవేదివని పల్కం జెల్లదేమైన నాకర్ణింపందగు ”-అభినవతిక్కన

”నీవు వృద్ధజనోపసేవివి ధర్మసం వేదివి తెలియంగ వినుము”- కవిబ్రహ్మ తిక్కన

వ. ఈసమర సముద్రంబు దరియ నీది నిన్నుం గనియెదఁ గాదేని సూర్ధ్వలోకంబునం -కవిబ్రహ్మ తిక్కన.

భయదంబగు సంగర సాగరంబునుజ్జ్వల భుజ శౌర్యనౌక నిరపాయగతిం దరియించి నిన్ను నవ్వల గనుగొందు గానియెడ స్వర్గమునం గనుగొందు మాధవా !        – అభినవ తిక్కన

కృతమెఱుకలో మిక్కుటంబగు తెలుఁగునుడికారమెఱుక. అందలి ఈభావములే నాభావములు.

          మెచ్చనివా డెవ్వడు కల

          డచ్చపు టొయ్యారమునకు నాదరువై వె

          ల్గిచ్చిన మీకృతినీర్ష్యకు

          మచ్చరమున కంజలించు మానిసి తక్కన్‌.

          ”మరుమ్రోయ న్గన తెల్గు వీణియల యుష్మద్రాష్ట్రగానమ్ము” ఆ పఱిగ పంటయనం దగు కావ్యమా సుధాసదనము అభినవతిక్కనా ! మీ యశమే ఆ సుధాసదనము.

శ్రీ కొత్తపల్లి వేంకటరత్నం

~

ధన్యుడవోయి నీవు!

రాష్ట్రగానంబును రహిపుట్ట గానంబు, లొనరింపదే నీ తెలుంగునాడు

ఆత్మకథనుగాంచి యానందముప్పొంగ, కులుకదే నేటినీ తెలుఁగునాడు

పఱిగపంటను గాంచి సరిగ ముత్తెముల పం, టనుచు మురియుగాదె తెనుగునాడు

”ధర్మ!! కృతినిగాంచి ధర్మమార్గంబును, నలవఱచు కొనదె తెలుగునాడు

ఈదృశ సుధామయ ప్రబంధ బంధురామశరణి సుధీవరులు మెచ్చ మంతుకెక్కి

యాంధ్రులకొక చైతన్య మొసంగినావు తెలుగుబాసకొక వెలుగు దెచ్చినావు

తెలుగు తల్లికి నోముల ఫలమ వీవు

జాతి కుజ్జీవ మొసగిన జేతవీవు

జీవితంబును సాహితీ సేవకొరకు

బదిలపరచినట్టి కళాతపస్వి వీవు

సాహితీలోకాన జతురుండవగుటచే, వభినవతిక్కన్నబిరుదు గంటి

కవులందు మేటివిగా నెంచబడుటచే, గనకాభిషేకంబు గాంచితీవు

అతులిత శేముషీ ప్రతిభోన్నతుడవౌట, గండపెండేరంబు గాంచితీవు

ఆంధ్రుల కందర కల్లారు ముద్దౌటనా గజారోహణంబు గనితీవు

మేటిమన్ననలం గాంచి మెప్పుగొన్న నీ సుగుణ సుమగంధ ధునిన్‌ మునింగి

కమ్మ వంశంబు గాంచె నఖండకీర్తి, ఓ సుకవివర్య ! ధన్యుడవోయి ! నీవు

శ్రీ గవిని గోపాలకృష్ణయ్యచౌదరి

~

హితోక్తి

నీసత్కవితాచాతురి, నీసత్సంగతియు, నీ మనిషిత్వమ్మున్‌

వాసించు నితోధికముగ, శ్రీ సీతారామమూర్తి ! స్థిరతమకీర్తీ!

దక్కించె  ‘సభినవతిక్కన ‘ బిరుదంబు, యజ్వనిర్దుష్టమార్గైక దృష్టి,

చేకూర్చెఁ ‘గనకాభిషేక’ సన్మానంబు, సార్వభౌమాదేశ సంస్మరణము,

నెనయించె ‘గండపెండెర’ ధారణమ్ము, పితామహకల్పనాద్వైతనిష్ఠ,

యొదవించె ‘భద్రగజోత్సవ’ భాగ్యంబు, బాలసరస్వత్యుపాస్తి ఫలము,

ఓయి ! యీనాట నీదె పైచేయి! హాయి ! కృతము మఱవక, గర్వసంగతి నెఱుగక

సంప్రదాయమ్ము విడువక, స్వప్రతిభను, జాటగలవారె పైకి రాజాలువారు.

శ్రీ పిశుపాటి నారాయణశాస్త్రి

~

మహాకవి

”జయన్తి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః,

నాస్తియేషాం యశఃకాయే జరామరణజం భయమ్‌.”

పఠన శ్రవణముల మూలము సహృదయాహ్లాద వికాసము లుప్పతిల్లజేయు రమ్యతర విరచనము కవిత్వము. ఆదికవుల మనఃకుసుమగుళుచ్ఛంబుల స్వభావముగ నుద్భవించి పొంగిపొరలి వారి ప్రతిభా విశేషంబున స్వచ్ఛత నంది స్రవించునమృతరసవాహిని. అది రసిక జనానుభవయోగ్యమై వారి బరవశుల జేయు మధుధ్రవము. అది కవిజనుల పాలి కల్పలతిక.

కవి మనోవీధి నేదియేని వస్తువు ప్రవేశించెనేని ఆది సాటిలేని యలంకార విలసనములతో నూతన సౌందర్యమున వెలుంగుచు లోక సమ్మోదదాయి యగుచుండును. కవి ప్రతిభాకల్పిత భావనాత్మక ప్రపంచమే లోకోత్తర చమత్కార కారియగు కావ్యసృష్టి యందురు రసికవరులు.

ఆనందమయ విజ్ఞాన వికాసవిభవసంధాయియగు సత్కావ్య నిర్మాణకర్తృత్వ సామర్థ్య విశేష భాసురుడు కవి స్రష్టయ.

శిల్పి, చిత్ర కారాదుల రచనముల పోల్కి గాక ప్రళయాంతమున సయితము మొక్కపో శాశ్వతమై యలరారునది కవివరుసృష్టి కార్యమే.

గ్రంథారామ యదృచ్ఛా విహారమున వివిధ విషయ పల్లవఖాదియై రసపిపాసువులహృదయవిలసన క్షమగాన కళాకోవిదము కవికోకిలము.

నానావిధ బాధలకు విచారములకు నహంకారమునకు, గాణాచియై భారవహనమాత్ర ఫలప్రదాయియై యనేక మార్గముల నశ్వరమగు సామ్రాజ్యము నందిన ఘనతకు విఱ్ఱవీగు రాజునకంటే అధికతర సౌఖ్యానంద సంధాయియు, శాశ్వత యశస్కరమునగు కవితాసామ్రాజ్య భూషితుడగు కవిరాజు ధన్యతముడు.

”సుకవితా యద్యస్తి రాజ్యేనకిమ్‌”అనిరి బుధులు.

నానాసుమసమూహమునుండి మధురసము నాకర్షించి కొనివచ్చి కోశమున నింపి ప్రజానుభూతి కనువు చూపు మధుకరము పోల్కి దన భావనాబలంబున బహువస్త్వంతర్గత సూక్ష్మాతిసూక్ష్మ బహువిధరసబిందువుల నాకర్షించి కావ్య కోశముల బూరించి రసికజనానుభవ సాధ్యము గావించు మహోపకారి కవికిశోరుడు.

తత్తద్దేశ కాలానుభవములగు నాచారములు, జీవిత విధానములు సాంఘికార్దిక రాజకీయాది పరిస్థితులు మున్నగు సమస్తాంశములు భావికాల జనులహృత్ఫలకముల హత్తుకొనునట్లు రసోల్బణముగ ముద్రించు ముద్రాపకుడు కవివరేణ్యుడు.

అవసరానుసరణముగ దేశజాత్యభ్యున్నతికను ప్రబోధ సస్య ప్రవృద్ధికి మధుర రచనా రూపశామృతము జిలికించు సుధాకిరణుఁడు కవిశీత కిరణుడు.

ఇహపర సాధన మనోరధులయి వన వాసేంద్రియ దమనాది బహుక్లేశానుభూతి సాధ్యమైన తపఃఫల మును దాపసోత్తములు దూర్వాస విశ్వామిత్రాదులతి క్రోధాద్యంత శ్శత్రువర్గమునకు వశులై వ్యర్ధము గావింప నియ్యకొనరు. అట్లే సార్థక జీవులగు కవి తాపసులును నతిశ్రమ సాధ్యమైన తమ కవిత్వఫలమును నిరర్థకము గావించుకొన నిచ్చగింపరు. ఇచ్చగింతురో వ్యర్థ శ్రము లగుగురు. అపప్రథ కవకాశ మిత్తురు. కవులు లోక క్షేమంకరులు.

చిరయశఃకాయులగు కవిరత్న కోటిలో వన్నెం జెలఁగు యమూల రత్నజాలము మన అభినవ తిక్కన. తుమ్మలకవి రసవత్కావ్యరచనా పటిష్టత్వమున నందెవేసిన చేయి.

ఆంధ్రజాతిని తన దివ్య వాగమృత రసస్రవంతుల ముంచి తేల్చి మేల్కొలిపిన జాతీయకవి సత్తముడు మన సీతారామమూర్తి చౌదరి.

”జగ మెరిగిన బాపనికి జందె మేల” అనినట్లే మహాకవి సహజ శాశ్వతయశ స్సంపన్నుడే,

కవిత్వ సామ్రాజ్య పీఠికా సంస్థితుడగు నీ మహాకవిని గజారోహణోత్సవ, కనకాభిషేక, గండపెండెర సమర్పణాది, సత్కారములచే బ్రోత్సహించి ఆంధ్రజాతి ఆత్మరసజ్ఞతను, కృతజ్ఞతను వెలువరించి స్వీయధర్మము నిర్వర్తించుకొనుటయే కాక లోకమునకు విధ్యుక్త ధర్మ నిర్వహణమున మార్గదర్శి యగుచున్నది. వాసినొసఁగుచున్నది. ఈ అభినవతిక్కన తుమ్మల సీతారామమూర్తి మహాకవి చిరాయురారోగ్య భాగ్య సంశోభితుడగుచు దన సహజలోకసేవాపరాయణతతోనే తత్కాలావళ్యకములగు శాంతిసహన సౌమ్యాది సద్విషయ సంశోభితోత్తమ రచనా పటిష్ఠత్వము వెలయించి తన దివ్యవాక్సుధాప్రవాహము నాంధజన హృదయ క్షేత్రముల వెల్లివిరియించి సద్భావ ఫలప్రాప్తి నందించుగాత.

ఇమ్మహాకవి సద్రచనా సామర్ధ్యమును, ఏతత్సత్కార హేతువగు నాంధ్రజాతి రసజ్ఞతయు భారత లోకమున కాదర్శప్రాయమై విలసిల్లుఁగాక.*

శ్రీ జంపాల వేంకటనృసింహము

~

గ్రంథాలయ సేవాఫలము

శ్రీ సీతారామమూర్తిగారు తమ చిన్ననాడు స్వగామమగు కావూరులో చదువుకు సరియగు సౌకర్యములేక సమీపగ్రామమైన చందవోలులో విద్య నభ్యసించుటకు ప్రయత్నించినారు. అచ్చటను దీనికి సరియగు అనుకూలము లభించనందున వీరు తమ చదువుకు స్వస్తి చెప్పవలసివచ్చినది. ఈ తరుణములో కావూరునందు శ్రీ సీతారామాంధ్ర గ్రంధాలయము వెలసినది. దీని స్థాపకులలో వీరును ఒకరుగ నుండినారు. ఏకదీక్షగా వీరు పదునైదేండ్లీ సంస్థను నిర్వహించారు. గ్రంథభాండాగారికుల ప్రధానధర్మమైన గ్రంథపరనమును వీరు చక్కగా నెరవేర్చి దీని ద్వారా భాషాజ్ఞానమును ప్రపంచజ్ఞానమును పెంపొందించుకొన్నారు. స్వయంకృషి ద్వారా మాతృభాషలో చక్కని పాండిత్యమును, రసవంతముగ కవిత్వము చెప్పగల నేర్పును సంపాదించి నారు. తాము నేర్చిన విద్యను సార్ధకము చేసికొనుటకై జాతీయోద్యమమునకు తమ జీవితము నంకితము చేసినారు. పూజ్య బాపూజీ బోధల కనుగుణ్యముగ తమ జీవితమును నడుపబూని కాంగ్రెసు సేవలో చిరకాలము పాల్గొన్నారు. మహాత్ముని కత్యంత ప్రియతమ మగు ఖద్దరుదీక్షను గైకొన్నారు. వారి జన్మస్థానమగు కావూరులో లోకమాన్య బాలగంగాధరతిలకు పేరిట నెలకొల్ప బడిన జాతీయపాఠశాలలో ఉపాధ్యాయులుగ కొంతకాలము పని చేసినారు. జాతీయతను ప్రోత్సహించునట్టియు, భారతీయ నాగరకతా ప్రశస్తిని చాటునట్టియు కవితల నల్లినారు. వీరి ”రాష్ట్ర గానము” జాతీయతా వ్యాప్తికి గొప్పగా దోహదము చేసినది, లోక పూజ్యుడైన . గాంధీజీ ఆత్మకథను వీరు కావ్యముగనల్లి తమ కవితాప్రౌఢిమను చాటుకొన్నారు. కవిగా తమ కీర్తిని స్థిరపరచుకొన్నారు. వీరు తమ కావ్యములను ధనమున కాశించి యెవ్వరికిని కృతి నిచ్చియుండ లేదు, వీ రిటీవల ప్రకటించిన”పెద్ద కాపు” అను కృతిని గాంధీజీ ప్రియభక్తుడగు శ్రీ యెర్నేని సుబ్రహ్మణ్యము గారికి సమర్పించినారు. శ్రీ సుబ్రహ్మణ్యముగారితో వీరికి సన్నిహిత సంబంధము లేకున్నను నిర్మాణ కార్యక్రమముపట్లను దీక్షతో దీనిని నిర్వహించు కార్యకర్తలపట్లను వీరికిగల సహజమైన అభిమానమే వీరినీ పనికి పురికొల్పినది. నిజముగా వీరొనర్చిన యీ పని ఉభయ తారకమైనదిగ నేను భావించుచున్నాను.

యువకులుగా నున్నప్పుడు శ్రీ సీతారామమూర్తి గారు చేపట్టిన గ్రంధాలయ సేవయే వీరి అభివృద్ధికి కారణ మైనదని వీరి ముఖతః విని నేను అమితానందమును పొందినాను. నాడు గ్రంథపరనము ద్వారా తెలిసికొన్న ముఖ్యధర్మములను ఆచరణలో పెట్టి సంఘసేవకై కృషి సల్పుటకు వీరు పూనుకొన్నారు. స్వయంకృషి ద్వారా మానవుడెట్లు అభివృద్ధినంద గలడో వీరు తమ జీవితము ద్వారా నిరూపించినారు. వీరిని ప్రస్తుతపు స్థితికి తెచ్చినది కనకాభిషేకమున కర్ణుడైన కవిగ నొనర్చినది గ్రంథాలయ సేవయే యని గ్రహించి ఆంధ్ర దేశములోని గ్రంథాలయ సేవకులందరు స్వయంకృషి ద్వారా తాము జ్ఞానవంతులై తమ జ్ఞానమును స్వార్ధము కొరకుగాక సంఘపు మేలుకొరకుపయోగించి శ్రీ సీతారామమూర్తిగారి వలెనే ధన్యజీవు లయ్యెదరు గాక!

కవిజీవితము

శ్రీ సీతారామమూర్తిగారు గుంటూరుజిల్లా రేపల్లె తాలూకా, కావూరు గ్రామములో తుమ్మల నారయ్య- చెంచమ్మ అను పుణ్యదంపతులకు 25-12-1901 జన్మించినారు. అయిదు సంవత్సరముల బాల్యము ననుభవించి 1906 నవంబరులో ప్రాథమిక పాఠశాలలో చేరిరి. బహ్మశ్రీ కావూరు శ్రీరాములుగారు అచటి గురువులు. ఆయన చదువులో, సౌజన్యమునందును పేరుగలవారు. ఆయనశిక్షణలో  అయిదు సంవత్సరము లున్నారు మన కవిగారు. వాచకాల చదువే అచట ప్రధానము. కాని కవిగారికి వారి తండ్రిగారి కోరికపై  శ్రీరాములుగారు ప్రత్యేకముగా ఇరువది, ముప్పది శతకాలు, భారతములోని నలచరిత్ర, భాగవతములోని ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణము, గజేంద్రమోక్షము, కుచేలోపాఖ్యానము బోధించిరి.

అమరము కొంత, ఆంధ్రనిఘంటుత్రయము వల్లిపించి ఏ పద్యమైనను మన కవిగారు రెండుసార్లు చదివి ఆనాడప్పగించువారు. వీరి తండ్రి నారయ్యగారు దేవభక్తి, ధర్మానురక్తి మున్నగు సుగుణంబులు మూర్తీ భవించిన పుణ్యపురుషులు. ఈయన చరిత్రలో నొకభాగమే మన కవిగారు రచించిన ధర్మజ్యోతి. ఈయనకు చదువురాదు, అక్షరములే రావు. కాని నిత్యము పురాణ శ్రవణము చేయుచు జ్ఞానము పాండిత్యము సంపాదించి ఇతరులు చదువుచుండగా తాను భారతాదుల కర్థము చెప్పుచూ పెద్ద పౌరాణికుడుగా నుండెడివాడు. ఈ విషయములో కవిగారిట్లు వర్ణించిరి.

”చదువుకయున్న నేమి బుధసత్తములుబ్బగ నర్థభావ సం

పద వికసింప భాగవత భారతముల్‌ వివరించు హృద్యముల్‌

తదమల కావ్యపద్యములు ధారణకగ్గము చేసి వేనవేల్‌

చదువు నతండు తచ్చ్రవణ సాహితి దుశ్శక మెట్టి వారికిన్‌.

కవిగారు ప్రాథమిక పాఠశాలలో చదువుకాలమున తండ్రి వీరిచే రాత్రి పూట భాగవతాదులు చదివించుచు తాను శ్రోతలకు వివరించుచు తన యిల్లొక పురాణ గోష్టిగా చేయువాడు. ఇచటనే కవిగారికి సాహిత్యవాసన అంటినది. 1911లో మన కవిగారు ప్రాథమిక పాఠశాలలోనున్న కాలమున కావూరు ప్రక్కనగల చెరుకుపల్లిలో సుప్రసిద్ధులగు కారెంపూడి రాజమన్నారు కవిగారు అవధానము చేసిరి. ఆ సభకు మన కవిగారును వెళ్లిరి, ఆనాటిసమస్యలలో ”శునకమ్మయ్యెను విష్ణుదేవుడు హహా …. నత్తఱిన్‌” అనునది యొకటి. అవధానిగారు త్రిపురాసుర సంహారకథకు దీనిని సంధించి ”ఈశున కమ్మయ్యెను… అని చక్కగా పూరించిరి. ఈ యనుభవముతో చౌదరి గారు బడికి వచ్చి సాటివిద్యార్థులను గూర్చుండ బెట్టి ఈ సమస్యనే ఏదోవిధముగా పూరించి పద్యమును బూర్తి చేసిరి. ఆనాడే వీరికి కవితావాసన అంటినది.

సీతారామమూర్తి గారికి 1911 లో ప్రాథమిక విద్య ముగిసినది. తర్వాత ఏమి చేయవలయు నను విచారము కల్గినది తండ్రిగారికి. తెనాలి తాలూకా పెదపూడిలోనున్న తన యల్లుడు శ్రీ జాస్తి సుబ్బయ్యగారికి బిడ్డ నప్పగించినాడు. ఆ సుబ్బయ్యగారు గట్టిసాహిత్వముగల పౌరాణికుడు. వేదాంతవిద్యలో దిట్ట. సత్ప్రవర్తనకు పెట్టిన పేరు. వారిని గురించి కవిగారిట్లు వ్రాసిరి.

”ఈవిధి నాంధ్రవాణి భజియింపగ నాకు నెవండు ముందరన్‌

ద్రోవలనెల్ల జూపి కడుదోడ్పడె నగ్గురువర్యు సాహితీ

సేవధిదత్త్వవిన్నికరశేఖరు భూరియశోవిభాసి మా

బావను గొల్తు జాస్తికులపావనుఁ జల్లయ సుబ్బయాఖ్యునిన్‌”

ఆయన శిక్షణలో మనకవిగారు ఒక సంవత్సరముండిరి. అపుడు అమరము పూర్తి చేసిరి. మనుచరిత్ర, వసుచరిత్ర చదివిరి. సాహిత్యము గట్టిపడసాగినది. అప్పటికి కవిగారి వయస్సు 11 సంవత్సరములు. పెదపూడినుండి యింటికి వచ్చి వ్యవసాయపు పనులలో తండ్రికి చేదోడుగా నుండవలసి వచ్చెను. వారి మనస్సులో మాత్రము విద్యాసక్తి మెండగుచుండెను. తీరికచిక్కినపుడెల్ల భారతం చదువుకొనువారు, కవ్వితము వ్రాసెడివారు.1911-18 మధ్య 5, 6 శతకములు, నాలుగు హరికథలు, రెండు నాటకములు, ఒక జంగం కథ, ఒక ప్రబంధము వ్రాసిరి. ఆ పుస్తకములు తృప్తికరములు గాక అణగిపోయినవి. వ్రాతపతులు లేకపోలేదు. ఇవి యన్నియు పౌరాణికములు.

కవిగారికి సంస్కృతము చదువవలయునను, కోర్కె బలముగా కలిగినది. ఊరిలో చెప్పువారు లేరు. గ్రామాంతరము వెళ్ళినచో భోజనాదులెట్లు? ఆ ఖర్చుల భరించుటకు తండ్రి గారు జంకిరి. వారములు చేసికొనియైన చదువవలయునని కవిగారు సంకల్పించుకొనిరి. తండ్రితో చెప్పకుండ అంగలూరు వెళ్లి 1917 లో సంస్కృత పండితులైన శ్రీ దుగ్గిరాల పురుషోత్తం గారి నాశ్రయించిరి. వారు ఆదరించిరి. వారింటిలో తినుచు నాలుగు దినము లట నుండిరి. వారము సంపాదించుట చేతగాక మార్గాంతరము లేక 5 రోజులకు ఇంటికి తిరిగి వచ్చిరి.ఆ సంవత్సరమే తండ్రి స్వర్గస్థుడు అయ్యెను. కవిగారికి వ్యవసాయభార మెక్కువయినది. విద్యాతృష్ణయు అట్లే అయినది. తనకు 4 మైళ్ళదూరముననున్న ‘చందవోలు’లో మహాపండితులు మహాకవులగు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారుండిరి. వారివద్ద చదువ కవిగారు నిశ్చయించుకొనిరి. తీరిక యేదీ? పగలంతయు పొలములో పనిచేసి రాత్రి పెందలకడ భోజనము చేసి చందవోలు వెళ్లువారు. పాఠము చెప్పించు కొని నిద్రించి తెల్లవారకముందే ఇల్లుచేరి కోతకో, కుప్పకో సిద్ధమయ్యెడివారు. శ్రీ శాస్త్రులుగారి శిక్షణలో ఒక వర్షము చదివారు. కాళిదాస త్రయము పూర్తిజేసినారు. శాస్త్రులుగారి శిక్ష చాల గొప్పది. కాబట్టి కవిగారు మంచి సాహిత్వము సంపాదించిరి. ఈ గురువుగారినిగూర్చి వారిట్లనిరి.

”ఏకశ్లోకరహస్యబోధనముచే నెవ్యాడు శిష్యున్‌ సుధీ

లోకాగ్రేసరుజేయు నవ్విబుధులు గొల్తున్‌ వెంకటప్పార్యు న

స్తోకశ్లోకమయూఖ రాజదఖిలాశున్‌ రామగాధామృతా

ఖ్యాక గ్రంథమతల్లి కాజనకు మద్గైర్వాణభాషాగురున్‌”

చందవోలు చదువు సాగక కవిగారు దిగులుపడుచుండ 1918లో కావూరున సీతా రామాంధ్రగ్రంథాలయము ఏర్పడినది. దాని స్థాపకులలో కవిగారు ఒకరు. పైగా భాండా గారికులు. రైతులకు తీరికగానుండు సమయమున నిత్యము గ్రంథాలయము తెఱచుచు అందలి పుస్తకములన్నియు చదువుచు తమ సాహిత్యమును వృద్ధి చేసికొనిరి.

ఇంతలో 1920 లో అసహాయోద్యమము వచ్చినది. కవిగారి జీవితము దాని కంకితమైనది. వారు గ్రామకాంగ్రెసు సంఘమునకు ‘కార్యదర్శి’ అయిరి. ఫిర్కాలోని కాంగ్రెసు ప్రచారకులలో వీరే ఆనాడు ప్రధానులు. 1920 నుండి 29 వరకు కవిగారు కేవలము కాంగ్రెసు సేవకులు. గుంటూరు జిల్లా కాంగ్రెసు సంఘములో ఆ పదిసంవత్సరములు వారు సభ్యులే. 1922 పన్నుల నిరాకరణలో జరిమానా శిక్షకూడ పొందిరి. 1924 నుండి 29 వరకు తమ గ్రామములోని తిలక్‌ జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయులును.

1920 నుండి కాంగ్రెసు ప్రచారమున కుపయోగించు ఖండికలను పెక్కింటిని వ్రాసిరి. తిలక్‌ నిర్యాణముపై వ్రాసిన పద్యములు ఈ శాఖలో మొదటివి. రాట్నము, ఖద్దరు, గాంధి, అస్పృశ్యత, పంబాబు వధలు, దాసు, ఆంధ్రరత్నము, ఓట్లు, భారతమాత, మున్నగు పలుశీర్షికలతో ఈశాఖ ప్రారంభమై రానురాను కవిగారిని జాతీయకవిని చేసినది.

జాతీయ పాఠశాలలో పనిచేయుచు 1925లో ”ఉభయభాషాప్రవీణ” పరీక్షకు ప్రయత్నములు సాగించిరి. 1930 లో అందు మొదటి తరగతిలో ఉత్తీర్ణులైరి. ఈ పరీక్ష కొరకు 1929లో చిట్టి గూడూరు (పర్ణశాల) లో నుండి బ్రహ్మశ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారి యొద్ద వ్యాకరణ శాస్త్రము చదివిరి. వారినిగూర్చి ఆత్మకథలో నిట్లు వ్రాసిరి.

”శబ్దశాస్త్రాదిలక్షణ సంప్రదాయ

మెవ్వ డెఱిగించె నాకు నయ్యిద్ధచరితు

బ్రస్తుతించెద బుంభావపద్మజాత

రమణి దువ్వూరి వేంకటరమణశాస్త్రి!!

1918-30 మధ్య వీరు సాగించిన కవితలో ఒకశాఖ పౌరాణికము, మరియొక శాఖ జాతీయము, పౌరాణిక శాఖలో రామశతకము, రామలింగేశ్వర శతకము, నామదేవచరిత్ర, (హరికథ) మాహేంద్ర జననము (నాటకము) మున్నగునవి చేరును. జాతీయశాఖలో గాంధీ తారావళి మున్నగు ఖండికలు, ఆత్మార్పణ కావ్యము చేరును.

కవిగారు 1930 లో యూనివర్సిటీలపట్టము సంపాదించిన తరువాత గుంటూరు జిల్లా బోర్డులో పండితులైనారు. దుగ్గిరాల, బాపట్ల, నిడుబ్రోలు హైస్కూళ్లలో పనిచేసి ప్రకృతము అప్పికట్ల హైస్కూలులో పని చేయుచున్నారు.

1932లో వీరు తమ దైవమగు గాంధీ మహాత్ముని ఆత్మకథను పద్య కావ్యముగా వ్రాయ నారంభించిరి. 1933లో ఒక భాగము పూర్తి చేసి దానిని 1936 లో ప్రకటించిరి. అది భారత ప్రతిబింబమని శ్రీ రామలింగారెడ్డి వంటివారు శ్లాఘించుట, రెండుమూడు విశ్వవిద్యాలయము లలో పాఠ్యమగుట అది కారణముగ వీరికి ‘అభినవతిక్కన’ బిరుదము వచ్చుటలోక మెఱుంగనిది కాదు.

1937 రాజాజీ మంత్రివర్గము హయాములో ఆంధ్రుల రాష్ట్ర వాంఛ వెల్లి విరిసినది. విజయవాడలో ప్రత్యేకాంధ్రమహాసభ జరిగినది. కవిగారు ఆ సభను జూచి ఆవేశమును పొందిరి. దాని ఫలితముగా ”రాష్ట్రగాన” మను మహోజ్జ్వలకావ్యము బయల్వెడలినది. అద్దాని సౌందర్యము, సందేశము, ఉదాత్తత ఇపుడు వివరింప నవసరము లేదు. బెజవాడ సభకు ఆహ్వాన సంఘాధ్యక్షులై తరువాత మహాసభకు ఉపాధ్యక్షులై ఆంధ్రోద్యమమును నడిపిన శ్రీ చల్లపల్లి ప్రభువులు యార్లగడ్డ శివరామప్రసాదు బహద్దరుగారి రాష్ట్ర సేవకు మెచ్చి కవిగారి కావ్యము వారికి నంకితము చేసినారు. 1938 లో ప్రథమ ముద్రణమందిన ఈ కావ్యమిపుడు 6వ కూర్పునకు సిద్ధముగా నున్నదన ఆశ్చర్యపడ నక్కర లేదు. కవిగారికి వ్యాపారదృష్టి ఉన్నచో రాష్ట్రగానము ఈసారికి 6 కూర్పులు కాదు, 60 కూర్పులు పొంది యుండెడిది.

1940 లో కవిగారు తమ తండ్రి పాలించిన ఉదాత్తధర్మము నొక దానిని వర్ణించుచు ‘ధర్మజ్యోతి’ అను కావ్యమును రచించి 1942 లో ప్రచురించిరి. కవిగారి మిత్రులు దానయ్య గారు దాని కృతిపతులు. 1947లో దీనికి రెండవ ముద్రణ జరిగినది. ఇపుడీ కావ్యరాజము ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారి ఇంటరు పరీక్షకు పాఠ్యగ్రంథము.

1948 లో తన వేలుపగు బాపూజీ నిర్యాణములో కవిగారు క్రుంగిపోయిరి. ఆ దుఃఖా వేశములో, ఆ కారుచీకటిలో వారు వెలిగించిన జ్యోతియే అమరజ్యోతి. ఇది యెంత చిన్న కావ్యమో అంత ఉత్తమకావ్యము. దీనిలో కవిగారి కవితాతపస్సు పండినదని చెప్పుటలో సందేహము లేదు. ”పూవుల తెప్పపైఁ గదలిపోయితివా ” ఇత్యాది పద్యములు పాడుకొనుచు తెలుగు బిడ్డలందఱు నేడీ కావ్యమును సేవించుచున్నారు.

”వందలు వేలు పొత్తములు వాములు వాములు చేసినంతనే

పందెము గెల్చునా కవికి బాఠకలోకపు ముద్రలేనిచో

తన కీ శరీరమిచ్చిన తల్లి చెంచమ్మగారి ఋణము తీర్చుటకై కవిగారీ కృతిని ఆమెకు పూజాపుష్పముగా సమర్పించుకొని ధన్యులైనారు.

శ్రీ చౌదరిగారు ఆత్మకథాది కావ్యములేగాక 1920 నుండి అనేక ఖండకావ్యములు గూడ వ్రాసిరి. అవి ఎప్పటి కప్పుడు సుప్రసిద్ధములైన ‘భారతి’ మున్నగు పత్రికలలో వెలువడుచు వచ్చినవి. ఏదో ఒక ధార్మికావేశము, నైతిక ప్రేరణలేనిచో మన కవిగారు కవిత్వము జోలికి పోరు. ఆ గుణములు వీరిఖండ కావ్యములలో విశేషించి కన్పడుచుండును. వీనిని గాలికి పోనీయకుండ ఒక ఆకృతికి దెచ్చుట సారస్వతమునకు లాభకారియనితలంచి 1913 లో ‘పఱిగపంట’ యను పేరుతో, 1918 లో ‘పెద్దకాపు’అను పేరుతో తమ ఖండకావ్యములను సంపుటీకరించిరి.

తమ సారస్వతక్షేత్రములో పఱిగకంకులవలె చెదరి చెదరియున్న కవిత్వమును ఒక చోటికి చేర్చి పంటపండించిరి. కావున ఒక సంపుటము ”పఱిగపంట’అయినది. గ్రామ్యభాషాదూషితమై ఉదాత్తవస్తుశూన్యమై నేడు వెలువడుచున్న వెఱ్ఱికవిత్వాలను జూచి ”నాకుదిక్కు లేదా యని వాపోవుచున్న ఆంధ్రికి మేలిరక్షగ లేదా మంచిపంటగ జేసినారు కాబట్టి రెండవది ”పెగ్గకాపు” అను పేరుతాల్చినది.

వీనిలో పఱిగపంటను నిడుబ్రోలు హైస్కూలునకు తనకున్న సంపద నెల్ల నర్పించిన కర్మయోగి శ్రీకొసరాజు లక్ష్మయ్యగారికి కాన్కగా నొసంగిరి. పెద్ద కాపును మహాత్ముని ప్రియశిష్యులు దండి సత్యాగ్రహయోధులు సేవావ్రతులునగు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యము గారికి నుడుగర గావించిరి.

కవిగారు తమకావ్యములను అంకితము చేయుటలో ఆదర్శప్రాయమైన మార్గము తొక్కినారు. వీరి కావ్యము ముద్రితమై వచ్చు వరకు అది ఎవరికి సమర్పింపబడినదో లోకమునకు తెలియదు. ఆ కృతిపతికే తెలియదు. ఆ కృతిపతి ధనవంతుడు కానక్కర లేదు. దేశారాధకుడు, సేవాజీవి, సజ్జనుడు అయిన చాలును. ఈ సందర్భములో

”కృత మెఱుకచాలు నస్మ

న్మతికింపగు కబ్బమిచ్చి మణిగొంట జగ

ద్ధితశీలుండొదవ నయా

చితమ్ముగా నిడుదు నాసృజించిన కవితన్‌”

”నరునకు గబ్బమిచ్చుట యనాదృతకృత్యమటంచు సత్కవీ

శ్వరులు పురాతనుల్‌ నుడువు చంద మదేమొ రుచింప దింతయున్‌

సిరులకు నాసచెంది యొక చెన్నటి కిచ్చుట మచ్చగాని స్వా

ర్థరహితబుద్ధి నిద్ధగుణరాశి కొసంగిన దోసమున్నదా ?”

అను కవిగారిపల్కులు సత్కవులకు శిరోధార్యములు. ఇటు వంటి కవులు కవిత్వమువల్ల ఏమి సంపాదింపగలరు ? సంపాదింపవలయుననెడి కోరికయు ఆయనకు లేదు. పోనీ ఆయన సంపన్నుడా? కాదు. విలక్షణమైన ప్రకృతి. ఈ ప్రకృతి ఎచటనుండి వచ్చినది ? ఏ ప్రకృతియైనను నిష్కారణముగా ఊడిపడునా? తుదమొదలు లేని లేమిడిలో మునిగి యున్ననాడు చెలికాడు తనదగ్గర దాచిన పదివీసెల బంగారము కాచి కాచి ఇందులో కొంత నీవు పుచ్చుకొనుము బాబు” అని ఆ మిత్రుడెంత ప్రార్థించినను ”నీ సొమ్ము నాకేల” యని తిరస్కరించిన నారయ్య కొడుకు గాడా మనకవి ? కావుననే ”మాకున్‌ మాసంతతికిని ధర్మవ్యాసక్తియ సిరులకంటె నగ్రియ మగుతన్‌” అని చెప్పగలిగినాడు.

మనకవిగారు చక్కగ కవిత్వము చెప్పగలరని తెనుగువారందఱు ఎఱుంగుదురు. కాని ఆయన అవధాని యని, ఆశుకవి యని ఎంతమందికి తెలియును?

తెలియునట్లు ఈ రంగములో ఆయన విజృంభించ లేదు. కాని ఇరువది ముప్పది అవధానములుచేసి జయప్రదముగ నిర్వహించినారు. అవధానములలో ఆశుకవిత్వముగూడ అనివార్యము గదా! అయినచో అప్పటి మన కవిగారి ఆశు వెట్లున్నదో చూతురా?

”ఈగోడ యిసుక సున్నము

యోగించిన వస్తువంచు యోజింపకు డీ

ప్రేగులు మూల్గెడి యనదల

మైగల రుధిరాస్థు లిట్లు మనకుం దోచున్‌”

అత్యద్భుతధారణాశక్తిగల వీరి కవధానము లేమి లెక్క ? ఆ ధారణచే వీరు తన పద్యములు గాని, ప్రాచీనకవుల పద్యములుగాని, వేలకు వేలు ఈ నాడప్పగించగలరు.

ప్రత్యేకముగ అయిదారు సభలలో మన కవిగారు ఆశుకవిత్వము నడిపిరి. 1947 లో శ్రీ భావనారాయణ స్వామివారి కళ్యాణోత్సవ సమయమున పొన్నూరులో జరిగిన సభలో గంటకు 120 పద్యముల చొప్పున రెండుగంటలపాటు కవితావర్షము కురిపించిరి. ఆ కవిత్వము వారి కావ్య కవిత్వమునకు ఏమాత్రము తీసిపోని బింకముతో పవిత్రతతో సాగినదనుటకు ఆనాటి సదస్యులగు పండితకవులే సాక్షి.

ప్రజాభ్యుదయమునకు ఉపయోగించు కవిత్వము వ్రాయువారికి లోక మెప్పుడును జోహారు లిచ్చుచుండును. కావుననే ఈ అభినవ తిక్కనగారికి 1989 లో నెల్లూరు వర్ధమాన సమాజము వారు శ్రీ రామలింగారెడ్డిగారి యాజమాన్యమున సమావిష్టమైన పేరోలగములో శ్రీ తిక్కవరపు రామిరెడ్డిగారు తిక్కన పేరుతో ఒసంగు బహుమానమును సమర్పించి సత్కరించిరి, 1942లో గుంటూరు జిల్లా అప్పికట్ల పరగణావారు శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరిగారు అధ్యక్షత వహించిన మహాసభలో వీరి కవితా సేవను కొనియాడి గౌరవించిరి. ఈ సందర్భమున వారు వెలువరించిన ”అభినవతిక్కన సన్మానసంచిక ” కవిగారి సౌజన్యమును కవితాప్రశస్తిని వేనోళ్ల చాటుచున్నది. మరియు 1944 లో ముక్త్యాల ప్రభువులు వీరిని ఆహ్వానించి శ్రీ వెంపటి పురుషోత్తం యం.ఎ. గారి పెద్దరికముతో నేర్పడిన సభలో ఉదాత్తరీతిని సన్మానించిరి. ఆ వెంటనే నవ్య సాహిత్య పరిషదాహ్వాన సంఘము వారు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావుగారి ఆధ్వర్యమున తెనాలిలో జరిగిన మహాసభలో అసంఖ్యాక విద్వత్‌ కవి బృందము మోల మన కవిగారి సాహితీ శక్తిని కొనియాడి గౌరవించిరి. అనంతరము 1948 లో కృష్ణామండలమందలి ‘ముదునూరు’ పౌరులు వీరిని ఆహ్వానించి సంభావించిరి.

ఇట్టి మెచ్చు పిలుపులు ఎన్నో వచ్చుచున్నను కవిగారి ఆరోగ్యము దుర్బలమైనదగుటచే వాని నన్నింటిని పాటింప లేకపోవుచున్నారు.

అది బలిష్ఠమే యైనచో వీరు ఇంక నెన్ని కావ్యములు సృష్టించి యుండెడివారో? అయినను కవిగారెట్లో ఓపిక చేసికొని ఆత్మకథను పూర్తిచేయుచున్నారు. రెండుమూడు వేల పద్యములతో అందలి భాగములు కొన్ని అముద్రితములై యున్నవి. ”ఇతడు నా యమూల్యసంపద, ఇతడు ‘నా గారవపతాక” అని తెల్గుజాతి, తెల్గు బాస సగర్వముగా చెప్పుకోదగిన యీ జాతీయకవిని , ఈ సాధుశీలుని విశాలాంధ్రము లోని ప్రజలందఱు నేడు కనకాభిషేకము గండపెండెరము, గజారోహణోత్సవము మున్నగు ఉదాత్తసత్కారములతో నర్చించి తమకర్తవ్యమును జేగీయ మానముగా నిర్వహించి ధన్యులగుచున్నారు. ఈ సన్మానసభకు ఆంధ్ర విశ్వకళా పరిషద్ ఉపాధ్యక్షులు, విమర్శక చక్రవర్తులు కవితావిశారదులు నగు డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డి

గారు అధ్యకక్షులుగా నుండుట, అందు కవిగారికి ”సువర్ణాంజలి”, ”మాతృహృదయము” అను కావ్యములు వారి శిష్యులు సమర్పణ చేయుట కడుంగడు ప్రశంసనీయము.

జయంతి తే సుకృతినో

రససిద్ధాః కవీశ్వరాః”

శ్రీ పాతూరి నాగభూషణం

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here