తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-5

0
7

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

ఆశీః ప్రశంస

[dropcap]త[/dropcap]మ పెండ్లి వేళ వేదిక

దమి నొండొరుగాంచి సిగ్గుతలయెత్తఁగ సొం

పమరిన సీతారాములు

తమ పేరిటి సుకవిచంద్రు దనిపెడు గాతన్‌.

గండపెండేరంబు గనియె బెద్దన, కాని కనకాభి షేకంబు గాంచ లేదు

కనకాభిషేకమ్ము గాంచిన శ్రీనాథుఁ, డేనుఁగునెక్కి యూరేగ లేదు

ద్విరదంబు నెక్కిన తిరుపతి వేంకట కవులును విజయాశఁ దవిలినారు

ఎన్నియో బిరుదంబు లెంద ఱందిఱొకాని తిక్కనగురుత సాధింపరైరి

ఏగి ప్రభువుల వేడి చేయించుకొనగ

గారవంబు లేరేరికో గలిగెగాని

యిన్నియును పిల్చి కవులె నీకీయ గంటి

సుగుణసాంద్ర ! సీతారామ సుకవిచంద్ర !

అకలంకమగు గుణనికురుంబ మమరస్ర, వంతికి మిక్కిలి వన్నె పెట్టు

బ్రవిమల ధీరవర్తనమది గణ్యమై, ఫణి భూషణునకేని వంకదిద్దు

సత్త్వ సంస్థిత సుకవిత్వ మాధుర్యంబు, తేనె కేఁజవినించు తీపినిచ్చు

నొనరించు సుకృతులు ఘన సుమనస్సుల, కత్యధికామోద మమరగూర్చు

నట్టి నీ కిట్టి సన్మానమెచ్చుగాదు

సరస! యభినవతిక్కన బిరుదవిభవ !

తుమ్మలాన్వయ కలశాబ్ధి తుహినకరణ !

సుగుణసాంద్ర ! సీతారామ సుకవిచంద్ర !

జనవినుత ప్రశస్త గుణ సంగతి నొప్పెడి కావ్యమన్నచో

ఘనకవి భావనాగురుత గాంచు నమూల్య సజీవరక్తమే

యనుదురు పెద్ద లట్టి భవదస్రకణాలి మహాత్మరూపజీ

వన చరితాత్మకం బగుచుఁబావనతన్‌ భజియించె నయ్యరే !

శ్రీ పూతలపట్టు శ్రీరాములరెడ్డి

~

ఆదర్శకవి

ఆధునిక కవులలోనేగాక, ఆంధ్రకవులలోనే ఒక విలక్షణకవి చౌదరిగారు. ఆయన ప్రతిభావంతుడే కాదు, వ్యుత్పన్నుడుకూడ. పరిశోధకుడగుటతో పాటు చరిత్ర కారుడుకూడ. ధర్మ ప్రబోధకుడైన శిల్పి. స్వస్థాన వేషభాషాభిమానే కాడు. మూర్తీభవించిన ఆంధ్రమాతృస్థానీయుడు. స్వరాష్ట్రాభిమానే కాడు, స్వాతంత్య్ర ప్రియుడు. అంకితములో ఆదర్శమూర్తి.

          ఆయన విశిష్టత యేమి? ఆయన గ్రంథాలలోని గుణ మెద్ది? ఆయన రచనలలో గొప్ప వేవి? ఆయన గొప్పతన మెందున్నది? ఈ ప్రశ్నలకు సమాధానమే యీ వ్యాసములోని ముఖ్య విషయము.

విశిష్టత

          ప్రఖ్యాతులైన ప్రతివారిలోనూ యేదో విశిష్టత వుంటుంది. అయితే చౌదరిగారిలోని విశిష్టత యెద్ది ? ఆయన సంప్రదాయబద్ధుడైన కవి యయ్యు, సంస్కరణాభిలాషి. ప్రాచీన కావ్యములలోని పదములు వాడుటలో ప్రవీణుడైనట్లే. దేశీయములు వాడుటలో నేర్పరి. ఆవేశమే కాదు. భావుకత్వముకూడా ఆయనలో బాగుగా గలదు. ఆయనలో దీక్షతో పాటు దక్షతవున్నది. ప్రాచీనుల కవితా శిల్పముతోబాటు ఆధునికుల భావాలుకూడా గలవు. అనుభవముతోపాటు ఆదర్శాన్ని కూడా చూపెట్టగలడు. ప్రాచీనుల ప్రాభవాన్ని ప్రస్తుతించుటతో పాటు ఆధునికుల ఆధిక్యాన్ని చెప్పుటలో గూడా చతురుడు.

          ఆయనలో దైన్యము, యాచనా లేనట్లే, ఆయన రచనలలోనూ, అవి కన్పించవు. నిర్జీవ పదములు, పడికట్టురాళ్ళు. ఆయన రచనల్లో, పట్టుకుందామన్నా పట్టుబడవు.

          వస్తువరణములో యెంత జాగ్రతపడునో, రచనా విధానములోనూ, అంత మెలకువతోను, ప్రవర్తించును. వేయేల? ఆయన రచనలు స్వయంపాక మువలె పవిత్రములైనవేగాక, నలభీమ పాకమువలె స్వాధిష్టములు గూడ.

          ఆయన శక్తిసంపన్నుడేగాదు. ఆశావాదిగూడ. ఆధునిక కవులలో కొందరకు ప్రాచీన సాహిత్యములో ప్రవేశములేదు. మరికొందరకు ప్రజాసముదాయముతో సంబంధము లేదు. ఇవి రెండువుంటే గాని కవి రాణించడు. చౌదరి గారు సవ్యసాచి.

          ఆయన రచనలన్నీ జాతీయములే. విజాతీయ వస్తువుగానీ, సంప్రదాయములుగాని భావములు గాని లేవు. ఆయన రచనలలో తెలుగుపలుకుబడి కావలసి నంత ఆలదు. చౌదరిగారి కవిత్వములో తేటదనముతో పాటు, చాటుదనముకూడ కలదు.

ధర్మ బోధాత్మక శిల్పము

          కవిత్వమున కానందము పరమ ప్రయోజనమందురు కొందరు. ఆ గుణము సంగీతానిది కాని కవిత్వానిది కాదని నా వినీతాభిప్రాయము. అయితే సాహిత్యములో కూడా ఆ గుణము లేకపోలేదు.

          చౌదరి గారి రచనమునకు మొత్తంమీద ధర్మబోధాత్మక కవిత్వమని పేరు పెట్టదగును. ఆ ధర్మము దేశధర్మము కావచ్చు. జాతిధర్మము కావచ్చు. స్వధర్మము కావచ్చు. అందుచేత ఆయన రచన అంతా గణబద్ధమైన బోధ అని అనుకొనరాదు. చౌదరి గారి ధర్మబోధకు శిల్పచాతుర్యమే కావ్యత్వ మిచ్చినది.

రచనలలో గొప్పవి

          ఏకవినైనా నీ రచనలలో గొప్పవి యేవి అని ప్రశ్నిస్తే సహజముగా అన్నీ సమానమేనంటాడు. తల్లి తన సంతానాన్ని సమదృష్టిని భావించినట్లే కవి భావమున్నూ; కాని విమర్శకుని దృష్టిలో అవి అన్ని యేకరాశికి చెందవు. ఎట్టి విఖ్యాతకవి యైనా ఆయన రచనలు సమానాదరణ భాజనములుగావు. కవి కులగురువగు కాళిదాసు కావ్యాలన్నీ గౌరవింపబడుచున్నవా? కాళిదాసత్రయమన్నారు. కొందరు. కాళిదాసును ప్రపంచ విఖ్యాతునిగా చేసినది అభిజ్ఞాన శాకుంతలమే. ”కాళిదాసస్య సర్వస్వమభిజ్ఞాన శాకుం తలమ్‌” అన్నారుగదా.

          చౌదరిగారు ‘పెద్దకాపు’తోను, ‘పరిగపంట’ తోను తృప్తినందక ‘ఆత్మార్పణము’ కావించి ‘ధర్మజ్యోతి’ వెలిగించి, ‘రాష్ట్ర గానము’ చేసి ‘ఆత్మకథ’ నల్లుటతో నాగక ‘అమరజ్యోతి’ కూడా వెలిగించారు.

          అయితే ఆయన సప్తసంతానములలో ప్రశస్తిగాంచినది రాష్ట్రగానము, ‘అద్దిరా!’ అనిపించినది, ఆంధ్రావళిని మోదమును పొందించినదియు అదియే.

          రాష్ట్రగానము కేవలము ఆంధ్రరాష్ట్రవాంఛ గాదు. అది ఆంధ్రుల సర్వస్వము. ఆంధ్రుల సర్వస్వముతోబాటు  సీతారామమూర్తిగారి సర్వస్వము కూడా. సీతారామమూర్తిగారికి తెలుగుబాస అన్నను తెలుగువారన్నను అధికాభిమానము. అభిమానమేకాదు ఆవేశముకూడా అధికము. ఆయన ఆంధ్రులలో తాను ఒక్కడుగా తలచడు. ఆంధ్రమాతృస్థానము పొందగలిగా డాయన. అందుచేతనే ఆయనకు కమ్మ, కాపు, బ్రాహ్మణ, అబ్రాహ్మణ, సాగరాంధ్ర, పార్వతాంధ్ర, స్వదేశాంధ్ర, ఖండాంతరాంధ్ర అనే భేదము లేదు. రాజకీయపాక్షికతలేని ఆంధ్రాభిమాని. ఆయన అందుచేతనే రాష్ట్రగానము అంత వుజ్జ్వలముగా వ్రాయగలిగాడు. పండితులు ప్రజలు, సరిసరి అని తలలూపిన సాటిలేని మేటిగ్రంథ మది. ఆయన రచనల్లోనే కాదు, ఆంధ్రులను గురించి వెలువడిన సాహిత్య సృష్టిలో సానలుదీరిన జాతిరత్న మది.

          అటు తర్వాత ప్రాముఖ్యమైనది ఆత్మకథ. మహాత్ముని గురించి యెంద రెందరో యెన్నెన్నో, కృతులు. కల్పించారు. కాని ఆ అహింసామూర్తిని, ఆసియా జ్యోతిని, జాతిజనకుని, విశ్వకళ్యాణమూర్తిని, గురించి కావ్యముగా వ్రాయతలరపెట్టినవారు చౌదరిగారు తక్క మరొక్కరు లేరు. వస్తు విశిష్టతతోపాటు శిల్ప చాతుర్యము కూడా చెన్నారుటచే పసిడికి పరిమళ మబ్బినట్లయినది.

          ఆత్మకథ మన ఆంధ్రభాషకు అలంకార మన్నారు. మన విశ్వకళా పరిషదుపాధ్యకక్షులు.

          గొప్పతనము:- ఆంధ్రసాహిత్య స్రవంతి దేశి కవిత, మార్గకవిత, అను రెండుపాయలుగా ప్రవహించినది. ప్రజాసాహిత్యమైన దేశికవిత, ప్రజాశ్రేయమై ప్రవర్తిల్లినది. పండిత సాహిత్యమైన మార్గకవిత, రాజాశ్రయమున రాణించినవి. తొల్లింటి మార్గకవులలో ప్రథమకవి రాజగురువు. మధ్యమకవి రాజమిత్రుడు, తుదికవి రాజ సేవకుడు.

          కవులలో కొందరు భుక్తికి, మరికొందరు ముక్తికి ఆశ పడి అంకితము నిచ్చారు. నరాంకితము యివ్వ రాదన్న వారికి భగవంతుడు బాధిస్తాడని భయంతప్ప మరొక మహదాకాంక్ష లేదు. కొందరు యిహానికి ఆశ పడ్డట్లే, మరికొందరు పరానికి పాటుపడ్డారు. చౌదరిగారు ఆంధ్రకవులందరిలోనూ, అంకితములో ఆదర్శమైన మార్గమవలంబించారు. ఆయన గ్రంథాలు అన్నీ నరాంకితములేగాని, స్వార్థ ప్రేరితములుగావు. సజ్జనులకు, త్యాగులకు, అంకితమిచ్చాడు. వారు ఆయనను అందలా లెక్కిస్తారనిగాని, అగ్రహారా లిస్తారని గాని ఆశతో యివ్వలేదు.

          ”కృత మెఱుక చాలునస్మ

          న్మతి కింపగు, కబ్బమిచ్చి మణి గొంట జగ

          ద్ధిత శీలుండొదవ నయా

          చితముగనే నిడుదు నా సృజించిన కవితన్‌.

          ”నరునకు గబ్బమిచ్చుట యనాదృతకృత్యమటంచు సత్కవీ

శ్వరులు  పురాతనుల్‌ నుడువుచంద మదేమొ రుచింప దింతయున్‌

 సిరులకు నాశజెంది యొక చెన్నికిచ్చుట మచ్చగాని, స్వా

 ర్థరహిత బుద్ధి నిధ్ధగుణరాశి కొసంగిన దోసమున్నదే ?”

          స్వీయాంకిత ధర్మమును, ధర్మజ్యోతి ద్వారా ద్యోతకం చేశాడు చౌదరిగారు. కాసులకు దాసులైన కవులనుండి మనము యేమి వున్నత భావముల ఆశించి పొందగలము? తన కవితవలన తాను తరించ లేనివాడు యితరులను యేమి తరింపజేయగలడు?

          ఈ సత్యమే కవిరాజు కలమునుండి కమనీయముగ జాలువారినది.

          ”కవుల స్వాతంత్య్రమే మంటగలసిపోయె

          పొట్టకూటికి వరువట్లు పుట్టినపుడే

          యడ్డమైన దేవురుగొట్టు నాశ్రయించి

          భయములేకుండ కవులెట్లు వ్రాయగలరు?”

          సీతారామమూర్తిగారితోపాటు ప్రజాశ్రేయోభిలాషులయిన కవులనందరను సన్మానించుట సముచితమైన ప్రజాధర్మము.

          ఇట్టి కవుల ‘సన్మానించకుంటే స్వతంత్రకవు లెట్లు ఉద్భవిల్లగలరు.

          ”దోయిలిడిపత్ర ఫలపుష్ప తోయమైన

          నీయనేరని దేశమందే విధాన

          పుట్టగలరు స్వతంత్రులౌ దిట్టకవులు

          లేరు లేరంచు గునిసిన లేచిరారు.”

          అని సూతపురాణము నూచించుచున్నది..

          నేటికైనా యీకవికి సముచితమైన సన్మానము చేయుట సంతోషించదగిన సంగతి. ఇట్టి కవులను గౌరవించుట మనలను మనము గౌరవించుటగా యెంచుట మంచిది.

          కవులు, కర్షకులు, లోక శ్రేయోభిలాషులే, కవులు కలాన్ని బడితే, కర్షకులు హలాన్ని పట్టారు. ఒకరు క్షేత్రాలను దున్నే వారు, మరొకరు హృదయ క్షేత్రాలను దున్నే వారు.

          కర్షకులు నవధాన్యాలు పండించి భౌతిక దేహాన్ని పోషిస్తారు. కవులు నవరసాలు సృష్టించి, ఆత్మోన్నతి గల్గిస్తారు. విచారకరవిషయమేమంటే, యీ యిరువురకు లోగడ మన దేశములో సంబంధం లేకుండా పోయింది. కర్షకుడు, కత్తిగలవాడికి లోబడ్డాడు, కవి కాసులుగలవాడికి దాసుడయ్యాడు. అయినదేమో అయినది. యికనైనా వీరిర్వురు, పరస్పర శ్రేయోభిలాషులై ప్రవర్తిల్లిన లోకకళ్యాణము చేకూరగలదు,

          నేడు కవులు’ కష్టజీవులను గురించి కథలల్లుతున్నారు. కృషీవలుడు, పల్లెపట్టు, కష్టజీవి, క్షేత్రలక్ష్మి, పరిగ పంట, యిట్టివి. ఇది సంతసింప తగినదే కాని చేయతగినపని యింతకంటె అనేకము గలదు.

          మనజాతిపిత గుజరాతీ రచయితలకొక సలహా యిచ్చాడు. వారు వూహాగానము చేయక, ‘రైతుజీవితానికి సంబంధించిన సాహిత్యాన్ని సృష్టిస్తూ వారి ఆలోచనలు పవిత్రమగునట్లు వారిసంపద, పెంపొందునట్లు, ప్రయత్నిస్తూ సజీవమగుభాషలో వారికి పాటలు, పద్యాలు రచించి వారిని అభివృద్ధి పంధాలోనికి తెమ్మని తెలిపాడు.

          బాపూజీ ఆశయములం దభిమానముగల చౌదరి గారు తదాశయసిద్ధికై కృషి యొనర్ప కర్షకుల అభిలాష.

శ్రీ గొర్రెపాటివెంకటసుబ్బయ్య

~

అభ్యుదయము

శ్రీయుం దేజము, కవితా

స్ఫాయదఖండాంధ్రభూయశః పరిపూర్ణ

శ్రేయమ్ములు, దీర్ఘాయు

ర్దాయము నుంగల్గి మనగదయ్యా సుకవీ !

అరవిచ్చు విరులతీయఁదనమ్ము చిలికించు, నెత్తావిమత్తిల్ల నేర్చెనేమొ

సోకినంతన మేను సోలించుపండు వె న్నెల రేలలో బ్రయాణించెనేమొ

సెలయేటిజల్లులో జెలువారుచల్లంద నమ్ముఁ జేకొని వెలిజిమ్మునేమొ

 కనుల పండువు గూర్పగా జాలునామని, యందాల జాలులో నలరె నేమొ

నీకవిత్వ లతాంగి అన్నింట జాణ, యౌచు పాఠకహృదయ సింహాసనముల

రాణియై నవ్యభావ సామ్రాజ్యసీమ, పాలనము సేయుఁగీర్తి సౌభాగ్యగరిమ.

ఉపాధ్యాయమిత్రుడు

~

మణిత్రయము

రచియించితివి లెస్స రాష్ట్రగానము దెల్గు, బిడ్డల హృదయాల బెరిమ పెరుగ

ఆర్జించితివి రాణ నభినవ తిక్కన్న, విఖ్యాతి రచనలో వెలుగు జూపి

సంతరించితి వెందు సత్కవీంద్రుల కీర్తి

బరువైన కవుల యాదరము వడసి

సంతసించితిలోన సన్మానసభలలో గొప్పగా నెల్లూర నప్పికట్ల

వ్యాధులాధుల బైకొన్న పట్టులందు

సరస కవితామతల్లి యౌషధముగాగ

నూతనోత్సాహశక్తుల నూత్నమనగ

వెల్లడించుచు శేముషి వేవిధాల

ప్రౌఢి కెక్కితి విచ్చ బ్రాచీన సంస్కృతి బాటించి కావ్యాల బ్రధితసరణి

పాటింపవైతివి ప్రాచీన భావాలు కులవర్గదృష్టి సంకుచితమంచు

సేవించితివి పెల్చ శ్రీకరంబనియెంచి ప్రజల దేశంబు దెప్పరముగాగ

సత్కరించితివీవె సత్కారమందక కృతికన్య నొరుల కంకితమునిచ్చి

యౌర వర్ణింప దరమె యుదారగరిమ

చౌదరీ ! నీ తలపు సువిశాల మవని

సాగి యీరీతి కవితా ప్రశస్తి వెలసి

చల్లగానుండు మీ పురుషాయుషమ్ము

మంచిచెడ్డల జూచి మహితత్వ మొనగూర్చు సత్యజీవిక నీకు నిత్యతృప్తి

కష్టసుఖాలెంచకయె దయన్నించుట జీవితంబందు నీశిష్ట గుణము

లాభనష్టములకు లాతియై సుఖమిచ్చు విథినిర్వహణ నీదు నిధియె సుమ్ము

ముందు వెన్కలంగూర్చి యందంబు సమకూర్చు ముద్దైన కయిత నీయొద్ద గలదు

కొదువ లేదింత గొనముల గొప్పగలదు

కలదు సామగ్రి వసుధలో వలయునదియు

అదియు నవ్వారిగాగ బూర్ణాయు వొసగి

యొసగి భాగ్యంబు భాగ్యంబు నోము నిన్ను,

శ్రీ పెనుమర్తి వేంకటేశ్వరశాస్త్రి

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here