తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-7

0
9

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

మా యూరికవి

[dropcap]క[/dropcap]వితాసింహులు బండితేంద్రులు మహాకావ్యాళి నిర్మాత లీ

భువి పైనుండిరికాని నీదు కవితాపూరంబు మాధుర్య మా

కవిబృందానికిఁ జిక్కబోదుగద వాక్చాతుర్యభావాలతో

నవ సౌందర్యము పొందుపర్చితివి యాంధ్రబ్రాహ్మికిన్‌ చౌదరీ !

మాధుర్యధుర్యమై మానసంబునకింపు, గలుగ జేయును నీదు కావ్యఫణితి

పాటవంబునుగల్గి పరవీరవారమున్‌, బరుగెత్తజేయు నీ పలుకు ములికి

పరసంస్కృతిని మెచ్చు ప్రజలలో బూర్తిగా, నింపు జాతీయత నీదుకలము

అప్రతిమానమై యాంధ్రులలో వేడి,నెత్తురు జిందించు నీదు ప్రతిభ

తెలుగువారల దీనత తీరిపోయె

కొఱతలన్నియు మీరుంటఁ బఱియలయ్యె

తెలుగు నాడెల్ల జేజేలు పలుకుచుండ

రమ్ము గైకొమ్ము భక్తి నీరాజనమ్ము,

మూలనొదిగియుండి మూల్గుచునున్నట్టి

తెలుఁగుజాతి కపర తిక్కనార్య !

ప్రాణ మిచ్చినావు రాష్ట్రగానము వ్రాసి

తుమ్మలాన్వయాబ్ధి తుహినకిరణ !

కమ్మని కైతను జెప్పుచు, కమ్మకులంబునకు బేరుగావించుచు తె

ల్గమ్మకు బెంపును గూర్చుచు నిమ్మహి విలసిల్లుమయ్య హే కవిచంద్రా!

శ్రీ నాగళ్ళ గురుప్రసాదరావు

~

హైమపూజలు

ధారారమ్యము  నీకవిత్వఝరి, సీతారామమూర్తీ! మహో

దారప్రక్రియ గండపెండెరముచేతన్‌ భధ్రశుండాల వా

హారోహోత్సవ వైభవస్ఫురణచే హైమాభిషేకంబుచే

సూరుల్‌ ధీరులు గౌరవించి రిచటన్‌ చోద్యంబు లేదేమియున్‌.

కవనతపంబు దుర్లభము కాకలు తీఱిన వాడవందు భూ

ధవులకు లేని కీర్తిరమ తావకలాలనపాలనంబులన్‌

దవిలి సుఖించె నాంధ్రభువి, దానిని గాంచియె గాదె అర్హవై

భవమున గౌరవించె నిటు; ప్రజ్ఞలు వంద్యము లెందు మిత్రమా!

తపమున వ్రాసి, యెట్టులనొ దానిని వెల్వరుపంగ జేసి య

చ్చపు మది బంపిగూడ నొక జాబున కేనియు నోచనట్టి పెన్‌

తపసులు సత్కవీశ్వరు లుదారులు ధీరులు గల్గుభూమి, నీ

దుపదము హైమపూజలకుఁ దోచుట కెంతయు మిన్ను ముట్టితిన్‌

నీ కవితారసాభ్యుదయ నీరథియై యతుల ప్రకార కీ

ర్త్యాకరమై త్రిలింగ భువిహర్షమునందుత ! నీ గృహంబు ల

క్ష్మీకలితంబు, దివ్యకవి శేఖరజాలక జన్మభూమియై

మాకు నితాంతహర్షమును మాటికిఁ గూర్చుత దైవసత్కృపన్‌

సుకవివి పాండితీ విభవశోభితమూర్తివి నీకృతంబులై

సకలదిశావకాశముల సన్నుతకావ్య సుగంధవీచికల్‌

ప్రకటములయ్యె; నేడిచటఁ బండితవర్గము రాజసత్కవి

ప్రకరము సేయు గౌరవము ప్రాజ్యము పూజ్యము స్తుత్య మారయన్‌

అంతియగాదు వర్తనమునందున నీవు విశాలబుద్ధివై

యెంతయు నొప్పుసత్క వివి, యేమియు దంభము లేద; యల్పదు

స్స్వాంతుల వేడ బోవని వచఃపరిపూతుడ వీవు, వాక్కళా

కాంత ! మదీయమిత్ర ! కవిగౌరవభూషణ ! స్వస్తి నీకగున్‌.

శ్రీ అయితం కాళీవరప్రసాదరావు

~

కల్యాణమస్తు

ఏ యుగాల నాడొ స్మృతిపథంబున గూడ

జాఱిపోయి యున్న గౌరవంబు

నాంచికొంటివమ్మ! యాంధ్రీ మహాదేవి !

స్వర్ణయుగము తెల్గుజాతి కిద్ది.

ఏనాడో యలకృష్ణభూధవుడు భద్రేభంబు నెక్కించి స

న్మానించెన్‌, గనకాభిషేకమున సంభావించె మా తెల్గు ధా

త్రీ నాథుండని యెంచి హర్షరసవార్ధిం దేలు నాంధ్రాళి నే

త్రానందంబుగఁ గాంచు నేడు భవదీయ ప్రాజ్యసమ్మానముల్‌.

బాసట సుంత లేక పరభాషల రాయిడి కోడి వన్నెకుం

బాసిన యాంధ్రభారతి నభంగురగౌరవదివ్యభర్మసిం

హాసనమందు నిల్పిన మహామహిమన్‌ మహనీయ వైభవ

శ్రీ సముదీర్ఘ గౌరవసమృద్దుల నందగ గంటి సత్కవీ !

ప్రాచీన ప్రథితాంధ్రకావ్యకలనాభంగీప్రసంగంబు ల

ర్వాచీనోజ్జ్వల భావబంధములచే రంజిల్లగా జేసి స

ధ్రీచీనంబగు నవ్య కావ్యరచనారీతుల్ ప్రపంచించు వా

గ్వైచిత్రుల్‌ భవదీయకీర్తిలతికం బ్రాకించె నాంధ్రావనిన్‌

బహుభాషార్ణవ మంధనక్రమవిధాపారీణు డాంధ్రావనీ

బహుకాలార్జిత పుణ్యమూర్తి, కవితాప్రాశస్త్యనిర్ణాయక

స్పృహణీయుండల కట్టమంచి కులవర్ధిష్ణుండు నిర్ణేతయై

బహుమానించుట చాటదే భవదపారప్రౌఢకావ్యప్రథన్‌.

కల్యాణమన్తు తిక్కన మహాబిరుద వి, ద్యోతిత కవితా మహోదయునకు

దీర్ఘాయురస్తు గాంధీ పూజ్యపాదు గా, థా ప్రపంచైక వైతాళికునకు

ఆరోగ్యమస్తు రాష్ట్రాందోళన క్రియా, బహుధావి నిర్ణయ పండితునకు

ఫలసిద్ధిరస్తు సంకలిత ధర్మజ్యోతి, సందీపితోత్తమ చరిత నుతికి.

అనవరత కనకాభిషేకాది వివిధ

బహుళ సమ్మాన సంతతిప్రాప్తిరస్తు

సారసాహిత్యమహిత కేదారభూమి

బఱిగపంటల గూర్చి సత్పండితాళి

కామెత లొసంగు, సరసహృదంతరునకు

తుమ్మలాన్వయుండ ! కమ్మని తెలుగులో

సరసకవితలల్లఁ జాలువాడ !

సీతరామమూర్తి! చెలిమి మై మాయిచ్చు

నమృతసూక్తి మణులనందికొనుము.

శ్రీ బోడేపూడి వేంకటరావు

~

చౌదరీ

మార్మ్రోగినది దివ్యమంజీర ఝణఝణ త్కారమ్ము నై రాష్ట్రగానరవళి

ఉరవణించినది భావోచితమ్మగుచు, సత్యాహింసదయల మహాత్ముగాథ

శబ్దించి మించె నజాండభాండమునిండి కఱకైన మీ పెద్ద కాపుగొంతు

ఏరించినది దివ్వహృదయాల రత్నాల పదజాల మెల్ల మీ పఱిగెపంట

అష్టదిగ్గంతిదంతనీహార హీర

సారడిండీరమల్లికా సదృశకీర్తి

శ్రావ్యమై, భావ్యమయ్యె మీ కావ్యసరణి,

ఆంధ్రకవిచంద్ర ! జోహారు లందికొమ్ము.

తెలుగుం జోదుల కోరమీసముల నుద్దీపించు శౌర్యమ్ము, నీ

కలమందు న్వెలయించి నాడవు భళీ, కవ్యగ్రణీ! నిండు వె

న్నెల సెల్లా ధరియింపజేసితివి, యాంధ్రిన్‌, నీకవిత్వమ్ము, తె

ల్గుల జైతన్యుల జేసి వేసినది నిగ్గుం గూర్చుచుం చౌదరీ !

శ్రీ కొండవీటివేంకటకవి

~

కళానిధి

తుమ్మలవంశవార్నిధి విధుప్రధ ! నీ కవితాస్రవంతిగా

నమ్ము రసజ్ఞ మానస వనమ్ముల గ్రమ్మి, సుగంధభావభా

రమ్మున మత్తిలించి, మధురమ్మగు శాబ్దికవీచికానికా

యమ్మున డోలగట్టి యనయమ్ము సుఖమ్ముల నిద్ర దేల్చెడిన్‌.

పదలాలిత్యమునందు బోతనకవి బ్రహ్మంబుతో, భావనా

భ్యుదయప్రజ్ఞను సూరనార్యునకు, శబ్దోదారగాంభీర్య సం

పద శ్రీనాథునకుం దెలుంగుబొలుపుం బ్రాప్తింప దిక్కన్నయొ

ప్పిదముల్‌ రాయగనేర్పు నీకయిత హృద్యీధిం బ్రచారించెడున్‌

పరువౌ సత్కవితాపథమ్మున కవిబ్రహ్మాంకముంజెంది, యా

దరణీయంపు గుణంబులన్‌ సుజనతాత్పర్యంబు నార్జించి, యాం

ధ్రరసన్‌ జీవనయుక్తజేయు ధిషణగ్రైవేయు నీపాటి స

త్కరణీయంబున గౌరవించుట యలంకారంబె యాంధ్రాళికిన్‌.

అరిశిలాభిదపవిస్ఫురణ నాశ్రితజనా నందమౌ రాష్ట్రగానంపు సొంపు

ఖలమానసాఘనిర్దళనభావాంభఃపవి, త్రమ్ము నాత్మకథానకమ్ము టిమ్ము

జవరాలి సవరంపు నవుమో మివతళించు, చిఱునవ్వు పంటయా పఱిగెపంట

కాయమానలతావితాన మీనుసుమప్ర, తానపేయము గవితాపథమ్ము

నట్టి సుగుణంబులం బురాయించి, నీదు

కీర్తివెలయించి రసికహృద్యర్తిత మగు

గౌరవము బాహిరము జేసె గాక నేడు

నంత కెక్కు డదేమి? కవ్యగ్రగణ్య!

తగునయ్యా ! భవదీయసారకవితా తన్వీ రుచిప్లావితం

బగు నీ యాంధ్రధరాతలంబు హృదయాప్యాయంబుగా, నూలుపో

వుగ నీకుం గయి సేయు నీదృశవిధంబున్‌, ధీనిధీ ! కొండయం

తగఁ బత్రిం దెమలింతురే హరిని ! సీతారామకవ్యగ్రణీ!

కవికులచంద్రా!

శ్రీ కోవెలమూడి వేంకటేశ్వర్లు

శ్రీ వాణీనిలయంబగు

కావూరి సుకృతఫలంబ ! కవికులచంద్రా!

నీ వాక్చతురత, మధురత

లావణ్యము నీదుకృతుల లాస్య మొనర్చున్‌.

తిక్కనకవనం బభినవ

తిక్కన ! నీ హృదయసీమ దిరపడి మొలకై

మొక్కై ఘనభూరుహమై

యక్కజముగ మధురతరఫలావళి విరిసెన్‌.

అనుభవించుకొలది నతి మధురం బయి

జుంటి తేనెవోలె జున్నువోలె

దృప్తినొసగు కవిత ప్రాప్తించె నీకహో!

మూర్తి కవివరేణ్య! కీర్తిగణ్య !

తెలిసి రాంధ్రులు నిన్ను దీయని కైతలో, రాష్ట్రగానాదులు వ్రాసినపుడె

ముక్కోటితెలుగులు ముక్తకంఠముతోడ నభినవతిక్కన్న వనిరి మురిసి

కొదువేమి నీకింక గొమ్ము టేనుఁగు నెక్కి కవిచక్రవర్తివై ఘనతగాంచ

తఱుఁగేమి నీకు, నీ ధర్మకావ్యములకు గనకాభిషేకముల్‌ గలుగు టందు

గండపెండేరంపు గాంతులు దిగ్వీథి

హెచ్చ దాండవింపవచ్చు నీవు

కావ్యకన్య లెలమి శ్రావ్యగానము సేయ

నాంధ్రక వనరంగమందుఁ జేరి.

శ్రీ సీతారామకవీ!

నీ సత్కృతు లాంధ్రవాణి నిలిచినదాకన్‌

భాసిల్లుచు దేశమ్మున

వాసియు వన్నెయుఁ గడించి వంద్యము లవుతన్‌.

శ్రీ కొప్పరపు మల్లికార్జునరావుకవి (శతావధాని)

~

విప్లవకవి

”అధ్యాత్మవిద్యావిద్యానామ్‌” అను సూత్రము ననుసరించి ప్రాచీను లన్ని విద్యలకన్న బ్రహ్మవిద్య కగ్రస్థానమిచ్చిరి. బాహ్య స్వరూప మన్నమయ, జడ, భౌతికములుగా నగుపడు చున్నను అభ్యంతరమం దనిర్వచనీయచిచ్ఛక్తి, చైతన్య, ఆనందములు గలవను విషయమును బోధించునదే యధ్యాత్మ శాస్త్రమనియు వచించినారు.

ఈ యధ్యాత్మశాస్త్రమే ప్రపంఛాదికారణ శాస్త్రమగుటచే దీనినే యెల్ల రంగీకరించిరి. మానవ జీవన సిద్ధాంతము లేక నీతిశాస్త్రము దీని ననుసరించియె నిర్ణయింపబడినది. సమస్తశాస్త్రములకు, కళలకు నీ యుభయ శాస్త్రాధిపత్యము తప్పనిసరిగా నుండవలెను. లేకున్న మానవజీవన అభివృద్ధి, ఔన్నత్య, సఫలత, లనునవి గగనకుసుమములే యగును. కనుకనే వ్యాసుడు మొదలు బాణకవివరకును తరువాత భారతీయకవులలో శ్రేష్టులగు వారంద రీ రీతిగనే తమ సాహిత్యమును, ప్రజాజీవనానుకూలముగా రచించి సమాజ సేవకులై యఖండకీ ర్తి గాంచిరి.

తిక్కనాదులు పెక్కు రాంధ్రకవిశిఖామణులీత్రోవనే కావ్యరచన గావించి ఆంధ్ర ప్రజానీకమున కౌన్నత్య సఫలతాభివృద్ధుల నాస్వాదింపజేసిరి.

కాని యీ 20 వ శతాబ్దములో ప్రపంచమున జరిగిన పరిణామము ననుసరించి భారతదేశమును తదంత ర్భాగమగు మన యాంధ్రమాతయు ”డైలెక్ట్రికల్‌ మెటీరియలిజం” అను మార్క్స్ సిద్ధాంతముచే ప్రభావితమై శాస్త్రముకొఱకె శాస్త్రమనియు, కళకొరకే కళయనియు జీవితమునకును కళకును సంబంధము లేదనియు భేదభావాభివృద్ధియే యభివృద్ధికి మూలకంద మనియు బోధించుచు మానవులలో క్రోధ, మోహ, మద, మాత్సర్యముల రెచ్చగొట్టి సమాజమును రక్తరంజితము గావించు సాహిత్యమె యభ్యుదయసాహిత్యమని పొలికేక లిడువారే మహాదేశభక్తులనియు తదన్యులు విప్లవసాహిత్యకులు గారనియు తామె విప్లవ సాహిత్యపరుల మనియు తమకు తామె ఢంకా బజాయించుకొన నారంభించి ధన, దౌర్జన్య, ద్వేషగుణో పాసకులై పేర్గాంచుచున్నారు.

విప్లవసాహిత్యమనగా హింసాద్వేషములు పురికొల్పునదే యగుచో నందుకు సాహిత్య మవసరమా? ఎలుకను భక్షింపుమనిపిల్లికి, కప్పను తినుమని పాముకు, పామును చంపమని ముంగిసకు శాస్త్ర సాహిత్యము లుపదేశింపవలెనా? ఇట్లుపదేశించు సాహిత్యము ప్రతీపమా ! అభ్యుదయమా? విప్లవమా? ముమ్మాటికి ప్రతీపసాహిత్యమే యగును. డార్విన్‌ సిద్దాంతము ననుసరించి మానవుడభివృద్దికి వచ్చిన జంతువగుచో వానికి పాతగుణములనే బోధించుట ప్రతీపసాహిత్యముగాక పురోగామి సాహిత్య మెట్లగును?

పురోగామి లేక విప్లవసాహిత్య మనగా నీతి శాస్త్రాంకుశముగలదై మానవజీవన లక్ష్యమును బోధించి దానియందు భక్తి శ్రద్దలు గల్గించి, యింద్రియ సుఖముల త్యజించి, కామినీ కాంచనముల కధీనులుగాక అరిషడ్వర్గముల జయింప ప్రేరేపించి ధర్మప్రధానముగా పురుషార్ధముల సాధింపుడనియు, దండమును తిరస్కరించి దయను బోధించుటయగాక పరిస్థితుల జయింప నుత్సాహపరచి కర్తవ్యానందమును బోధించును.

ఇట్టి పురోగామి సాహిత్యకవులలో నగ్రగణ్యు లభినవతిక్కనగా రనుటకు ధర్మజ్యోతిలో కర్తవ్యానందుడగు చెలికానిచే

ఆ.      నింద లేవిలేక నీసొమ్ము నీచేత

          నిడు ముహూర్త మెప్పు డెప్పు డంచు

          గలవరించు నన్ను గరుణించి నేటికా

          రంగశాయి మది కొసంగె హాయి

          అని అనిపింపగలుగుట నిదర్శనము. ప్రతిమానవుడిట్లే తనవంతుకు వచ్చిన కర్తవ్యమును నెరవేర్చి కర్తవ్యానందము ననుభవింప నీపద్యము బోధించుట పురోగామి సాహిత్యముగాక మరేమగును?

          ఇట్టి కర్తవ్యనిష్ఠులగువారు పరహృదయమున సాత్విక పరిణామమును గావింపగలరు గనుకనే

క.       ఈ పసిడి నెల్లఁ గొనఁగా

          నోపుణ్యనిధీ ! మదీయ ముల్లము వెఱచున్‌

          నాపల్కు గుఱుచ సేయక

          యేపారిన పేర్మినందు మిందొక ముక్కన్‌.

          అని బేహారి యనవలసివచ్చినది. అన్నంతమాత్రముచే – చెలికాని హృదయ ముబ్బి తబ్బిబ్బులు గాక వినయముగా తన యల్పసేవకై యిట్లనశక్యమా?

          శిబివలె మేనికండలను జీల్చితి నెట్లు! మరున్నదీ కుమారు

బలె నఖండ రాజ్యరమ రోసితి నొక్కొ? దధీచిమౌని య

ట్ల బెదరు లేక వెన్నెముక లాగితి నోటు త్రిశంకుసూతు భం

బలుకరాని కష్టముల గీడ్పడి సుక్కితినేమి? సెప్పుమా.

అని యనహంకారముగా బలికించుటయ గాక జీవనలక్ష్యశుద్ధి నుద్ఘాటించెను. సమాజ సేవకు లీ పద్యమును చదివినంతనే తమ మనము నందలి యహంకారమును కుంచపఱచు కొనవలయునని యభిలషింపరా? ఇట్టి కోరిక శాంతికి మూలముగాదా? యీ భావము అలవర్చుకొన్న నాడు సత్యశివసుందర జీవితముల్‌ మొదల్కొనుట అసంభవమా!

ఒక పుట్టుగుంక తన తా

లికి వచ్చిన రెండురూకలే డెబ్బది వే

లకు బెంచె, బెంచినది హా

టకమా? వివరింపు ముత్కటం బగు నఘమా!

అనుటలో కవిగా రెంత ముణ్ణముగా ప్రస్తుత పరిస్థితుల నవగత మొనరించుకొనియున్నారో లెస్సగ తెలియబడుచున్నది.           ఇంతియెగాక, పేదతనముఁ జూచి కవి ఎంత సంతప్తహృదయు డయ్యెనో చూడుడు,

గీ.       ఎవనియెముక లీ మేడల కిటుకలయ్యె

          నెవని రక్తంబుచే గోడలిట్లు బిగిసె

          నతనికా యిట్టి పరమ హేయంపు బ్రతుకు

          వానికా యట్టి దుర్మరణానుభూతి!

          ఈరీతి పరబాధానుభవ మెరుగు కవి యయ్యును, సత్త్వగుణాభి వర్ధితుండగుటచే మాల్కొ మాయా భౌతికవాదము ననుసరింపక సాత్త్విక పరిణామకాంక్షి.తుడగుట వలననే

ఆ       చెమటనోడ్చి నరుడు జీవింపదగుగాని

          తేరసొమ్ము మెక్కి త్రేపరాదు

          బానిసీడు కుడుచు పరమాన్నమునకంటే

          నుచిత మిచ్చకొలది నొదవు గంజి

యని ఉత్తమమానవజీవన లక్ష్యమును బోధింప గల్గొన్నాడు. ఇట్టికవులే సమాజ సేవకులు వీరి కావ్యము లే సంఘకళ్యాణ కారకములు. ఇట్టికళలే జీవనోప యోగకరములు. కావున నట్టి కళాసష్టలకు కనకాభిషేకములేగాదు వజాభి షేకములు గావించినను సమాజము తమ ఋణమును తీర్చుకొన జాలదన్నచో నత్యుక్తిగా నేరదు. ఆంధ్ర ప్రజానీక మింతద్విగుణీకృతోత్సాహముతో వీరికి కనకాభిషేకము గావించుచున్నందుకు తోడియాంధ్రులను ఆంధ్రమాత యనుంగు ముద్దు బిడ్డడగు నీయభినవతిక్కనను హృదయపూర్వకముగా నభినందించుచు వీరికి భగవంతు డాయురారోగ్య ఐశ్వర్యముల నొసగుగాకని ప్రార్థింతును.*

శ్రీ చల్లయ్య

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here