తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-8

0
6

[box type=’note’ fontsize=’16’] శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారికి కనకాభిషేక సన్మానం జరిగిన సందర్భంగా 1948 సంవత్సరంలో ప్రచురించిన జ్ఞాపకసంచికను సేకరించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీ పెద్ది సాంబశివరావు. [/box]

అభినవతిక్కయజ్వ

[dropcap]’అ[/dropcap]భినవ తిక్కయజ్వ’ బిరుదాంకము నంది, తెనుంగు జాతికిన్‌

శుభముల గూర్చినారలు; వసుంధరకున్‌ భవదీయసత్కృతుల్‌

విభవములై చెలంగు; సుకవీశ్వర ! యీ కనకాభిషేకమున్‌

ప్రభుత గజాధిరోహణము భద్రము లౌత ! యశఃప్రదంబులై

తుమ్మలవంశ వారిథి విధుండవు సత్కవితాప్రభావమున్‌

కమ్మని తెన్గుతీరు నుడికారపు సొంపులు; కొత్త కొత్త శ

బ్దమ్ములు పూర్వజన్మ సుకృతంబులు భావము లద్దిరయ్య ! మీ

సొమ్ము తెనుంగు వాణి కవిసుందర ! యింక జయంబుఁ గాంచుమా!

పరుగులువారు భావపరిపాకరసామృతసారవాహినీ

స్ఫురణము; గానమాధురి యపూర్వగుణ శ్రవణానురంజకం

బరయ, పదార్థ సంపద మహామహిమాన్విత మద్దిరా, కవి

త్వరమ వరించె కోరి నిను వర్ధిలు మార్య ! చిరాయురున్నతిన్‌

లలితపదన్యాస మలఘుభావోల్లాస, మనుపమరచన ”మాత్మార్పణమ్ము”

ప్రథిత విఖ్యాతమ్ము పృథుగుణోపేతమ్ము, కల్యాణచరిత మా ”గాంధిచరిత”

నిత్యనిర్మల నీతినియతి ”ధర్మజ్యోతి” పలుసరకుల పంట ”పరిగ పంట”

దేశభాషాసక్తి దేశీయగుణరక్తి, రంజిల్లు గానమ్ము ”రాష్ట్ర గాన”

మౌర కవిచంద్ర! వినుత మహాకవీంద్ర !

కొనుము సన్మాన మిట్టులే ఘనత గనుము

భవ్యగుణపూత స్వాతంత్య్ర భరతమాత

సకల శుభముల నొసంగి నిన్‌ సాకుగాత !

సభ మహాకవి సన్మానసంచితంబు

అతిథి ”యభినవ తిక్కనయజ్వ” సుకవి’

గద్దె నమరిన మహిముండు కట్టమంచి

విభుడు భాగ్యంబు లిక వేర వెదకనేల ?

శ్రీ బూదూరు రామానుజులు రెడ్డి

~

పూలమాల

తిక్కనామాత్యుని తెలుగు పందిళ్ళలో, విరబూచుపూవుల మురిపమరసి

పొందామరాకులో పొదవి పోతన యీయ, అల్లస నవనీత మందుకొనుచు

కవిసార్వభౌముని కావ్యవీధులనొప్పు, కస్తూరి వాసన ప్రస్తుతించి

పేశలోక్తులు పల్కు పెద్దనార్యుని పద్య సంగీతమాధురిన్‌ పొంగిపోయి

ఆంధ్రభారతి భవ్య దేవాలయాన

సాహితీతోరణంబుల సంచరించు

నీదు విన్నాణమునుగాంచి చౌదరీంద్ర

ఆచరింతురు ప్రణతుల నందుకొమ్ము.

ఆంధ్రుల సర్వంకషాభివృద్ధినిదెల్పి తెలుగుబిడ్డల ప్రబోధించినావు

ఐకమత్యంబున నలరు భాగ్యంబుల, తెలుగునేలకు నీవు దెలిపినావు

జీవచ్ఛవంబులై చివుకు నాంధుల కీవు, ఉత్సాహమంత్రంబు నూదినావు

అరవమూకల నేల ననుకరింప నటంచు, చాటినా వాంధ్రుల శౌర్యచరిత

తెలుగువారల కెల్లప్డు తెలుగుదనమె

ఆశ్రయం బని పల్కి నీ వాంధ్రజనని

గౌరవంబును గాపాడ గోరినావు

మాయు రే మాతృప్రేమ ! తుమ్మలకవీశ !

భారత ప్రతిబింబగౌరవం బార్జించె, కలికి పల్కుల నీదు తెలుగుకవిత

బోసినోటి మహర్షి పూతచారిత్రంబు వర్ణించి నీనాణి వన్నె కెక్కె

భారత జాతీయ భావసంపద లెల్ల, అలరుచున్నవి నీదు కలము నందు

సకలాంధ్ర దేశమున్‌ సమ్మోదమున దేల్చె, కళలకల్యాణి నీ కావ్యకన్య

అన్ని విధముల ధన్యుడ వౌదు వీవు

ఆయురారోగ్య విభవంబు లందుమయ్య

దీవన లొసంగు నీకిదే తెలుగుతల్లి

సత్కవీ ! నేటిసన్మానసమయమందు.

ఆర్ద్రహృదయులు మనసోదరాంధ్రు లచట

కవిని పూజింప మా తెలంగాణ సీమ

భక్తి ప్రేమల నీరీతి బంపుచుండె

అఱుత దాల్పుము ఇయ్యదే అలరుదండ.

శ్రీ దేవులపల్లి రామానుజరావు

~

అభ్యుదయము

స్వాగత మనూసభావనా బలనిధాన !

స్వస్తి రసవత్కవిత్వ విద్యావినోద !

జయము నయ దయా పౌరుపోజ్జ్వలమనీష !

అభ్యుదయ మభినవతిక్కనార్య ! నీకు.

రాజితసత్కృతుల్‌ సుకవిరాజులు మెచ్చ రచించి భాషకున్‌

దేజము గూర్చునిన్ను నవతిక్కన సద్బిరుదాంకు బంగరుం

బూజ లొనర్చి, బ్రహ్మరథమున్‌ ఘటియించి యనన్యభక్తి నీ

రాజనమిచ్చి యాంధ్రులకళాదృతి ధన్యతఁ గాంచె సత్కవీ!

ఆత్మకథ లమరజ్యోతులై వెలుంగ

మాతృభాషాభివృద్ధి కాత్మార్పణంబు

సలుపు మీవంటి సత్కవీశ్వరుల నరసి

సత్కరించుటే జూతి విజ్ఞతకు సాటి.

ప్రవిమలోన్నత దివ్యభావాంబరవిహారి, కరినెక్కి వాడలం దిరుగుటేమి

అనిశబోధాసువర్ణాబ్ది దేలెడుదణి, పుత్తడి నీటిలో బ్రుంగుటేమి

అచ్చంపు మడి కైత కందె వైచినచేయి పొన్నుగుల్ల కడెంబుఁ బొదుగు టేమి

అఖిలాంధ్ర హృదయవీరారాధ్యుఁడగు సూరి చిఱుగద్దె పూజల మురియుటేమి

యని హసించెదవేమొ? మా యాత్మ నలరు

మితి యెఱుంగని గౌరవోన్నతికి వీని

స్మృతిపతాకమాత్రములుగా నెంచికొనవె

పుణ్యకీర్తి ! సీతారామమూర్తి సుకవి!

ఆంధ్రకవి పితామహు కాలియందియ శ్రుతి

అగ్రహార యాచ్ఞాగానమం దడంగె?

సార్వభౌముని బంగారు జలకపు మడి

శాలిసంకెలత్రుప్పుతో మైలబడియె.

ధీరగమ్యాపరిగ్రహదీక్షితు నిను

నండ జేరి యీ సన్మానమండనములు

సార్థకత జెందుగాత విశంకటగతి

పూజ్యవర్తి! సీతారామమూర్తి సుకవి !

పూతకవిత్వమాధ్విరసపుష్టిని మత్తిడి భ్రాతృమానసా

బ్జాతములన్‌ హరించెడు ప్రజాహితచోరుని నిన్ను బట్టి కా

ల్సేతులు క్రొంబసిండి నును శృంఖల గూరిచి కొమ్ము తేజిపై

మ్రోతలెసంగ ద్రిప్పి నిడుబ్రోలిటు శిక్ష విధింప న్యాయమే ?

తాము కళాప్రధానకవితా మధుకోశ మొకింత మూసి, ని

స్సీమ గతిన్‌ సజీవమృతి జెంది కృశించెడు నాంధ్రజాతిపై

ప్రేమఁ బ్రబోధవాజ్మయఝరిన్‌ దొరలింపు డుదారధర్మబో

ధామహితాత్మ ! భావిచరితల్‌ గుఱుతించు సువర్ణ రేఖలన్‌.

మీదు సన్మానగరిమ నామోదభరము పంచుకొని యభినందించు పరమహితులు

సుకవిరాజు సీతారామసూరిముఖుల, దివ్యవాణి మిమ్మాశీర్వదించుగాక.

ఉపాధ్యాయమిత్రుడు

~

సత్కళానిధీ

జాను తెనుంగునందుగల చక్కదనంబులు జాలువారు నీ

మానితమైన కైత రసమంజులమై అవధాత కెంతయుం

దేనెల సోనలన్‌ విరిసి తీయని భావములిచ్చునంచు నే

వీనుల విందులౌ నుడులు వింటిని కంటిని సత్కళానిధీ !

సకలాంధ్రావని సత్కవిత్వరచనాచాతుర్య ధీశక్తి నే

యొకరో నిన్‌ బురుడింతు రిట్టి ప్రతిభావ్యుత్పత్తులన్‌ సాధ్యమా ?

అకలంకమ్ము నమోఘమైన పదవిన్యాసంబునం గల్గు పొం

దికయుం దూకము నీవెఱింగితివిపో తిక్కన్నకుం దీటుగన్‌.

కర్ణాటేశుని ప్రౌఢరాయని సమక్షంబందు మిన్నందుచున్‌

స్వర్ణ స్నానము లాచరించిన కవిత్వస్వామి నీక్షింపమిన్‌

శీర్ణంబైన త్రిలింగసోదర తపశ్శ్ర లెంతయు న్నేడు సం

పూర్ణంబయ్యె నిటొక్క కాలమున నేమున్నీవు జీవించుటన్‌.

శ్రీ దురిశేటి వేంకటరామాచార్యులు

~

మహాకవీ!

నీ వొకనాడు భవ్యతపనీయ మణీమయ చారు సౌధరా

జావళి బ్రొద్దుపుచ్చిన మహాకవిమండలిలోనివాడవో

పావనకావ్యసార సుధపానము చేసిన దివ్యమూర్తివో

యేవిధి లేక యెట్లు సృజియింతు మనోహర కావ్యహర్మ్యముల్‌.

ఓ కవిపుంగవా! విమలమూర్జితమైన మహత్తరాంధ్ర భా

షాకవితావిలాసము విశాలదిశాఫలకమ్ము లందు జి

త్రీకృతమయ్యె తావకము, దీవ్యదఖండకళాప్రభూతమా

ధ్వీకమనీయమాధురికధీతివి నీ జని యెంతధన్యమో?

ఏ సుముహూర్తమున్‌ వెదకి ఏరిచి కూరిచినారొ మీమహో

ల్లాసము రాష్ట్రగానమున లాస్యము చేసినది, ఆంధ్రరాజ్య ల

క్ష్మీ సముదీర్ణవైభవవిశేషము హారతు లందుకొన్నదా

యాసము దీర్చు దివ్యకవితామృత మద్భుతమై, స్రవింపగా.

రమణీయమ్ములు యుష్మదన్వయచరిత్రల్‌, భావగాంభీర్య ని

ర్మమతాశాలి త్వదీయపూజ్యపిత ధర్మజ్యోతియైవెల్గె; నీ

వమరజ్యోతివి తెల్గుభారతికినేలా యాత్మగాధామహ

త్త్వము లాత్మార్పణ పూర్వకమ్మల గవీంద్రా !: ప్రస్తుతుల్‌ సేయగన్‌.

ఎపుడో వింటిమి గండ పెండరములన్‌ హేమాభిషేకమ్ములన్‌

నృపసింహమ్ములు సత్కరించిన కథానీకమ్ము: నే డాంధ్రకా

శ్యపి నీరాజన మిచ్చుచున్నది కవీశా ! తన్మహాసత్కృతిన్‌

విపులానంతవిశాలవీధుల బ్రధావింపన్‌ దదీయ ప్రభల్‌.

ఓ గణనీయదివ్యకవితోజ్జ్వలసుందరమూర్తి! నీ మహా

భాగత మిన్నుముట్టి మదవారణ మెక్కిన దాంధ్రసాహితీ

భోగము వన్నె కెక్కి పరువుల్‌ పచరించిన దీ మహాద్భుత

స్వాగతసత్కృతుల్‌ చిఱు నివాళిగదా ! భవదీయ సేవకున్‌

ఓయి మహాకవీ! సుకవితోర్మిపరంపర మిన్నువాకయై

పాయలు పాయలై భువనపావనమైనది తెల్గు దోటలో

దీయని పూవుదేనియల తేటలు కాల్వలుగట్టిపారగా

గోయిల గొంతుతో మధురకూజితముల్‌ పొనరింపు మింపుగా.

సరస పరిహాస మధుర ప్రసంగములకు

జొక్కి మెచ్చనివారు మచ్చునకు లేరు

సత్కవి శిఖామణీ ! నమస్కారమయ్య

అమరజీవివి నీకు దీర్ఘాయురస్తు!

శ్రీ చిన్నము రామయ్యచౌదరి

~

బంగారపు వాన

ఆరు గాలము వ్యవసాయదారు నట్లు

వాజ్మయ క్షేత్రమున బాటుపడితి వీవు

పంటలక్ష్మి బంగారపువానజల్లు

గురిసెడిని నేడు నీమీద గ్రొత్త సిరులు

రెడ్డిరాజుల ప్రీతి సమృద్ధివలన

మున్ను శ్రీనాథకవి మౌళికన్న ప్రథిమ

రెడ్డికులమాళి నీకు నర్పించె నిప్పు

డిది స్వభావము రెడ్లకు విదితమయ్యె.

సారస్వతాభిమాన మ

పారమ్ముగ వెల్లివొడిచె బహుళాంధ్రము సీ

తారామమూర్తినేఁ డిటు

కూరుచు నిది యెల్లకవులకున్‌ సంతసమున్‌.ఏ

శ్రుతిరమ్యకవిత్వశాలివై

సతత ప్రీతి బ్రజల్‌ భజింపగా

హితకోటిప్రమోద మందగా

శతవర్షంబు లెసంగు చౌదరీ!

శ్రీ వంద్యారం వేంకటసుబ్బయ్య

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here