తుమ్మెదా.. ఓ.. తుమ్మెదా!

0
11

[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘తుమ్మెదా.. ఓ.. తుమ్మెదా!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“నా[/dropcap]యనా కార్తీ, నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు, నాలుగు గంగరావి పువ్వులు తెచ్చిపెట్టు. మందులోకి కావాలి..” చెప్పింది అమ్మ.

“అలాగే అమ్మా” అని బుక్సు పట్టుకుని కాలేజీకి బయల్దేరాను.

సాయంత్రం కాలేజీ అవగానే గంగరావి చెట్టు దగ్గరకు వచ్చాను. అక్కడ ఉన్న మేదర ఆవిడని “ఏవండీ గంగరావి పువ్వులు కావాలి” అడిగాను. ఆవిడ పాకకు చేర్చి ఉన్న కర్ర తీసుకుని, ఆ కర్రతో చక చకా పువ్వులు కోసి నాకు ఇచ్చింది. నేను ఆ పువ్వులను అమ్మకి ఇచ్చాను.

ఒక రోజు హోమియో మందులు తేవడం కోసం సాయంత్రం కాలేజీ అయ్యాకా సైకిల్ మీద మార్టేరు హోమియో స్టోర్స్‌కి వెళ్లాను. ఆ హోమియో స్టోర్స్‌కి చాలా పేరు ఉంది. సినిమా నటులు అల్లు రామలింగయ్య, పాలకొల్లు వచ్చినప్పుడు, మార్టేరు తప్పకుండా వచ్చి కావాల్సిన హోమియో మందులు కొనుక్కుని మద్రాస్ పట్టుకువెళ్తారు. నేను హోమియో మందులు తీసుకుని బయటకు వచ్చేసరికి రాత్రి ఏడు గంటలు అయ్యింది. వెన్నెల రాత్రి అవడం వలన దారి బాగానే కనిపిస్తోంది.

గంగరావి చెట్టు కింద నులక మంచం మీద చిన్నపిల్లాడిని పడుకోబెట్టి, ఆమె పాట పాడుతూ పిల్లాడిని జోకొడుతోంది. ఆ పాట వినగానే, నేను సైకిల్ దిగి రోడ్డు వారనే నిలబడ్డాను.

‘తుమ్మెదా.. ఓ తుమ్మెదా !
ఏడనున్నావే తుమ్మెదా, నన్ను మరిసినావా తుమ్మెదా
నా బాబు నీకోసం ఎదురు సూత్తన్నాడు
బేగి రావే తుమ్మెదా! బేగి రావే తుమ్మెదా!
సందమామ నడిగి ఎన్నేల్ని తేవే,
సుక్కల నడిగి తళుకులన్నీ తేవే,
నా బాబు నీకోసం ఎదురు సూత్తన్నాడు
బేగి రావే తుమ్మెదా! బేగి రావే తుమ్మెదా!
పాల సంద్రాన్నడిగి పాలు తేవే
జాము చెట్టు నడిగి, జాం పండు తేవే
నా బాబు నీకోసం ఎదురు సూత్తన్నాడు
బేగి రావే తుమ్మెదా! బేగి రావే తుమ్మెదా!’

కాలువ నీటి మీద నుంచి వస్తున్న చల్లని గాలికి, గంగరావి చెట్టు ఆకులు సుతారంగా కదులుతున్నాయి. ఆకాశం నుండి చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. తల్లి మధురంగా పాట పాడుతూ ఉంటే, మంచం మీద చిన్న పిల్లాడు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. ఎంత అదృష్టవంతుడు ఆ పిల్లాడు, అని అనుకున్నాను.

శబ్దం రాకుండా సైకిల్ కొంత దూరం నడిపించి, ఆ తర్వాత ఇంటికి వచ్చి, హోమియో మందులు అమ్మకి ఇచ్చాను. ఆ రాత్రి నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. గంగరావి చెట్టు కింద, మేదర ఆవిడ పాడిన ‘తుమ్మెదా’ పాట చెవుల్లో మధురంగా ధ్వనిస్తూనే ఉంది.

***

నేను మా కాలేజీలో ఎన్.ఎస్.ఎస్.లో చేరాను. ఆ సంవత్సరం ఎన్.ఎస్.ఎస్. జాతీయస్థాయి శిబిరం మహారాష్ట్ర లోని అమరావతిలో నిర్వహిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పాల్గొనే బృందంలో, మా కాలేజీ తరుపున నన్నూ ఎంపిక చేసారు.

ఒకరోజు లెక్చరర్ సంజీవరావు గారు స్టాఫ్ రూమ్‌కి పిలిచి, “కార్తికేయ, నువ్వు పాటలు బాగా పాడతావు కదా, ఒక పాట బాగా ప్రాక్టీసు చెయ్యి, అమరావతిలో పాడుదువు గాని” అని చెప్పారు. ఆయనలా చెప్పగానే, నాకు ‘తుమ్మెదా’ పాట గుర్తుకు వచ్చి సంతోషంగా “అలాగే సార్” అన్నాను. మరుసటి నెలలోనే మేము అమరావతి వెళ్ళాలి.

నేను మేదర ఆవిడ దగ్గరకు వెళ్లి ‘తుమ్మెదా’ పాట కావాలని అడిగాను. ఆరోజు బుధవారం. ఆమె భర్త సంతలో బాణాకర్రలు అమ్మడానికి వెళ్ళాడు.

ఆవిడ నా మాటలకు చిన్నగా నవ్వి “మా దగ్గర పుస్తకాలు ఉండవు బాబూ. ఆ పాట మా అమ్మ నాకు నేర్పినాది. అయినా ఆ పాట మీరెప్పుడు విన్నారు?” కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది.

“మొన్న వారం రోజుల క్రితం, మీరు మీ అబ్బాయిని నిద్రపుచ్చుతూ పాడుతుంటే విన్నాను. పై నెలలో పెద్ద పాటల పోటీ ఉంది. అందులో నేను ఈ పాట పాడాలనుకుంటున్నాను” అన్నాను నేను.

“నా పాట మీకు అంత బాగా నచ్చినాదా?” అని అడిగింది ఆమె. అలా అడిగినప్పుడు ఆమె మొహం సంతోషంతో వెలిగిపోవడం నేను గమనించాను. ‘అవును’ అన్నట్టు తలూపాను.

“అయ్యో, మీరు నిలబడే ఉన్నారు, కూసొండి బాబూ” అని చిన్న బల్ల ముందుకు జరిపింది. వెదురు బొంగులతో చేసిన బల్ల అది. దాని మీద కూర్చుని, బాగ్ లోంచి నోట్ బుక్, పెన్ను తీసుకున్నాను రాసుకోవడానికి.

చంద్రమ్మ గొంతు సవరించుకుని ‘తుమ్మెదా.. ఓ తుమ్మెదా’ అని పాడటం ప్రారంభించింది.

నేను చక చకా పుస్తంలో రాసుకున్నాను. తర్వాత నేను రాసుకున్నది ఓ సారి పాడి చంద్రమ్మకి వినిపించాను. ఒకటి రెండు చోట్ల నా పాట సరిచేసింది.

నాలుగు రోజులు గడిచాకా నా స్నేహితుడు బాబ్జీ దగ్గరకు వెళ్లి టేప్ రికార్డర్ తెచ్చుకున్నాను. చంద్రమ్మ ఇంటికి వెళ్ళగా, ఆమె భర్త రాజయ్య నిచ్చెన మెట్లకు అవసరమైన కర్రల్ని పెద్ద కత్తితో ముక్కలుగా నరుకుతున్నాడు. చంద్రమ్మ చెప్పింది “ఈ బాబు తుమ్మెద పాట కోసం వచ్చారు. మొన్న నువ్వూ పెద్దోడు సంత కేల్లినారుగా. అక్కడెక్కడో పెద్ద పాటల పోటీ ఉన్నదంట. ఈ పాట అక్కడ పాడతారంట. మొన్న ఆ పాట పుస్తకంలో రాసుకున్నారు. నానే పాడి ఇనిపించినాను” అని.

ఆమె మాటలకి ఆమె భర్త పెద్దగా నవ్వాడు. చేతిలో కత్తి కింద పెట్టాడు. “నీ పాట అంత బాగా నచ్చీసినాదా, ఈ బాబుకి?” అన్నాడు. అవునన్నట్టు సిగ్గుపడుతూ తలూపింది చంద్రమ్మ. “ఇప్పుడెంటి పని బాబూ?” అడిగాడు నన్ను.

“నేను ఈ పాట ప్రాక్టీసు చేస్తుంటే తప్ప్పులు వస్తున్నాయండి. అందుకని చంద్రమ్మ గారు ఓ సారి ఆ పాట పాడితే, రికార్డు చేసుకుని అలా పాడుకుంటాను” అన్నాను భయం భయంగా. ఎందుకో అతని గిరజాల జుట్టు, పెద్ద మీసం చూస్తే భయంగా ఉంటుంది. ‘అలాగే’ అన్నట్టు తలూపాడు రాజయ్య.

చంద్రమ్మ చిన్న పిల్లాడిని ఒడిలో పెట్టుకుని, వాడికేసే చూస్తూ శ్రావ్యంగా ‘తుమ్మెదా’ పాట పాడింది.

పాట పూర్తి అయ్యాకా, నేను టేప్ రికార్డర్ ఆన్ చేసి భార్యాభర్తలు ఇద్దరికీ ఆ పాట వినిపించాను. పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఫస్ట్ వచ్చిన అమ్మాయి మొహంలా, చంద్రమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది. తర్వాత వారం పోయాకా నేను చంద్రమ్మ దగ్గరకు వచ్చి ఆ పాట పాడాను.

“బాబుగారూ, మీరు సానా బాగా పాడారు. ఆ దుర్గమ్మ తల్లి దయవలన మీకు తప్పకుండా బహుమతి వత్తాది” అంది సంతోషం మొహం నిండా నింపుకుని.

అనుకున్నరోజున నేనూ, సంజీవరావు గారు ఆంద్ర విశ్వ విద్యాలయం నుండి వచ్చిన మిగతా స్టూడెంట్స్ రైలు ఎక్కి అమరావతి వెళ్ళాం. భారతదేశం లోని పదహారు రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్ధులు ఆ శిబిరంలో పాల్గొన్నారు. మూడవరోజు సాయంత్రం నేను పాడే అవకాశం వచ్చింది. “ఒక గ్రామీణ స్త్రీ తన చంటిబిడ్డను నిద్రపుచ్చుతూ పాడిన జానపద గీతం ఇప్పుడు మీరు వినబోతున్నారు” అని ఆ గీతం సారాంశాన్ని హిందీలో, ఇంగ్లీష్‌లో ముందుగా ప్రేక్షకులకు వివరించారు సంజీవరావు గారు.

నేను ముందుగా వేదికకి నమస్కరించి, ఒక్కసారి కళ్ళు మూసుకుని గంగరావి చెట్టు కింద పిల్లాడిని జోకొడుతూ చంద్రమ్మ పాడిన దృశ్యం తలచుకున్నాను. వెంటనే ‘తుమ్మెదా.. ఓ.. తుమ్మెదా, ఏడ నున్నావు తుమ్మెదా, నన్ను మరిసినావు తుమ్మెదా’ అంటూ పాడాను. పాట పూర్తి అయ్యాకా అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు.

ఆఖరి రోజున బహుమతి ప్రధానం జరిగింది. పాటల పోటీలో నాకు ప్రథమ బహుమతి వచ్చింది.

ఇంటికి వచ్చాకా, ఒక స్వీట్ పేకెట్ కొని చంద్రమ్మ ఇంటికి వెళ్లాను. ఆమె భర్త నిచ్చెనలు ఇవ్వడానికి మార్టేరు వెళ్ళాడని చంద్రమ్మ చెప్పింది. అమరావతిలో నా పాటకు వచ్చిన మెమెంటో, సర్టిఫికేట్ ఆమెకి చూపించాను. వాటిని చూసి నాకంటే ఎక్కువ సంబరపడింది చంద్రమ్మ. స్వీట్ పేకెట్ ఆమె చేతిలో పెట్టి చటుక్కున వంగుని చంద్రమ్మ పాదాలకు నమస్కరించాను. చంద్రమ్మ కంగారుపడి వెనక్కి జరిగింది. “ఇదేంటి బాబుగారూ?” అంది ఆశ్చర్యంగా.

“ఇదంతా నీ చలవే చంద్రమ్మా. నువ్వు నేర్పిన పాట నాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. నేను ఎన్ని సార్లు వచ్చి పాడినా, విసుక్కోకుండా, నా తప్పులు సరిదిద్ది నన్ను తీర్చిదిద్దావు. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను” అన్నాను భావోద్వేగంగా.

తర్వాత పదిరోజులకో సారి చంద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమెనీ, పిల్లల్నీ పలకరించడం అలవాటు చేసుకున్నాను. పండగలకు మా అమ్మ చేసే బూరెలు, గారెలు, బొబ్బట్లు వాళ్లకు ఇచ్చేవాడిని. షష్టి తీర్థంలో నా దగ్గరున్న పాకెట్ మనీతో చంద్రమ్మ చిన్న పిల్లాడికి ప్లాస్టిక్ గిలక్కాయ్, పెద్ద పిల్లాడికి, కీ ఇస్తే తిరిగే కారు కొని ఇచ్చాను. పిల్లలు వాటిని చూసి చాలా ఆనందపడ్డారు.

తర్వాత చదువుతో బిజీ అయిపోయాను. డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవడం, ఎం.ఎస్.సి. చదవడానికి విశాఖపట్నం వెళ్ళడం చాలా వేగంగా జరిగిపోయాయి. శలవులకు శివపురం వచ్చినప్పుడు చంద్రమ్మ ఇంటికి వెళ్లి చూసి వచ్చేవాడిని. ఆమె పిల్లలు ఇద్దరూ ఎదుగుతున్నారు.

ఎం.ఎస్.సి.అయ్యాకా నా జీవితాశయమైన పి.హెచ్.డి. చేయడానికి విశాఖపట్నం లోనే ఉండిపోయాను. శివపురం రావడం కూడా తగ్గిపోయింది. పి.హెచ్.డి.అయ్యాకా గుంటూరు లోని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాను. దసరా శెలవులకు శివపురం వెళ్ళినప్పుడు చంద్రమ్మనీ, వాళ్ళ పిల్లలనీ చూడాలని వెళ్ళిన నేను, అక్కడి దృశ్యం చూసి అవాక్కైపోయాను. రహదారి విస్తరణలో భాగంగా పన్నాసవారి కొట్టు తొలగించారు.

చంద్రమ్మ ఇల్లు, గంగరావి చెట్టు, ఆ వరసలో ఉన్న పది పాకలు కూడా అక్కడ లేవు.

నా మనసు కకావికలం అయ్యింది. రామచంద్రరావు పేట లోని పెద్దాయన సోమేశ్వర రావు గారిని అడిగాను, “ఇక్కడ గంగరావి చెట్టు దగ్గర ఉండే మేదర కుటుంబం ఏమయ్యింది?” అని.

“వాళ్ళు తమ ఇల్లు పోగానే, మారేడుమిల్లి వెళ్లిపోయారు” అని ఆయన చెప్పారు. వెంటనే నేను ఆందోళనతో టాక్సీలో మారేడుమిల్లి వెళ్లాను. చంద్రమ్మ, రాజయ్యల కోసం అడిగితే, రోడ్ పక్కనే ఉన్న వారి గుడిసెని, ఓ రోజు రాత్రి లారీ గుద్దేసి వెళ్లిపోవడంతో అందరూ చనిపోయారని చెప్పారు. ఆ మాట వినగానే, నా కళ్ళముందు పది అమావాస్యల చీకట్లు ముసురుకున్నాయి. ఒక్కసారిగా నేలమీద కూలబడిపోయాను. నా కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయి. ‘తుమ్మెదా.. ఓ.. తుమ్మెదా, ఏడనున్నావే తుమ్మెదా? నన్ను మరిసినావా తుమ్మెదా’ అంటూ నా మనసు ఆవేదనతో తల్లడిల్లింది. ఐదు నిముషాలు పట్టింది నేను తేరుకోవడానికి.

***

కార్తికేయ చెప్పడం ఆపి టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగాడు. గదిలో ఉన్న పది, పన్నెండేళ్ళ వయసు పిల్లలు అతనికేసి, అతని వెనక ఉన్న పెయింటింగ్ కేసి మార్చి మార్చి చూస్తున్నారు.

గంగరావి చెట్టు కింద మంచంమీద ఉన్న చిన్న పిల్లాడిని నిద్రపుచ్చుతూ, ఆకాశం కేసి చూస్తోంది ఓ స్త్రీ మూర్తి. నిండు చందమామ వారినే పరిశీలిస్తున్నాడా? అన్నట్టు ఉంది ఆ పెయింటింగ్.

“మీరు చాలా సార్లు ఈ పెయింటింగ్ గురించి చెప్పమని అడిగినా, చెప్పలేదు. కానీ ఈరోజు బాలల దినోత్సవం. మీ మాట కాదనలేక చెప్పాను. ఇది జరిగి పన్నెండేళ్ళు అయ్యింది. అందుకే చంద్రమ్మ పేరు మీద ‘చంద్రాశ్రయ్’ స్థాపించి, తల్లి తండ్రులను పోగొట్టుకున్న మీలాంటి వారికి ఆశ్రయం కల్పించి చదువు చెప్పిస్తున్నాను. మీలోనే చంద్రమ్మని, ఆమె పిల్లల్ని చూసుకుంటున్నాను” అన్నాడు కార్తికేయ. అతని కేసి ఆరాధనగా చూసారు పిల్లలు అందరూ.

ఆ మాటలు విని, ఒక ఆశయం కోసం పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితాన్నిఅనాథ పిల్లల కోసం ధారబోస్తున్న కార్తికేయకి నమస్కరించాడు ఆఫీస్ మేనేజర్ రాంబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here