భిన్న సంస్కృతుల సమ్మేళనం టర్కీ-1

1
6

[box type=’note’ fontsize=’16’] “జ్ఞాపకాలను తట్టిలేపే పురాతన కట్టడాలు, కనుచూపుమేర ఆవిష్కృతమయ్యే అద్భుత దృశ్యాలు, విస్తుపోయేలా ఉన్న ప్రపంచ వింతలు, రయ్యిన దూసుకుపోయే పొడవైన రహదారులు.. వేలాది మందిని తనలో దాచుకున్న భూగర్భ నగరాలు.. వీటన్నింటిని తలదన్నేలా ఉన్న ఆధునిక వాణిజ్య సముదాయాలు.. అన్నీ కలిసి ఒకేసారి ఊరిస్తూ… రా రమ్మల్ని పిలుస్తుంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా… అదుగో అలా మమ్మల్ని ఊరిస్తూ… ఎప్పుడెప్పుడు అక్కడ వాలిపోతామా అనేలా చేసిన ఆ దేశం టర్కీ” అంటూ టర్కీ గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పటినుంచో మాకు టర్కీ దేశాన్ని చుట్టిరావాలని కోరిక. దానికి కారణం లేకపోలేదు. ‘టూరిస్ట్ హెవెన్’లా ప్రపంచాన్ని ఆకర్షించే దేశం కావడం ఒక కారణం అయితే, ఆసియా-యూరప్ రెండు ఖండాల భిన్న సంస్కృతులను తనలో ఇముడ్చుకున్న ఈ దేశాన్ని చూడాలనే ఆసక్తికి మరో కారణం. ఇలా రెండు ఖండాల భూభాగంలో విస్తరించిన నగరం ప్రపంచంలో ఇదొక్కటే. నేను మా వారు కలిసి మొదట హైదరాబాద్ నుండి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు వెళ్ళాము. ఒకప్పటి ‘కాన్‌స్టాంటినోపుల్’ నగరమే ఇప్పటి ఆధునిక ఇస్తాంబుల్ నగరం. కోటి యాభై లక్షల జనాభాతో ప్రపంచంలోనే పెద్ద నగరాల్లో ఒకటిగా పేరొందింది ఇస్తాంబుల్.

టర్కీ రాజధాని అంకారా అయినప్పటికీ పెద్ద నగరం మాత్రం ఇస్తాంబులే. కోటి 50 లక్షలకు పైగా జనంతో నిండిన ఈ నగరం ప్రపంచంలో ఎక్కువ జనాభా నివసించే నగరంగా పేరుంది. నిత్యం 15 మిలియన్ జనప్రవాహంతో పొంగిపొర్లుతుంటుంది. హైదరాబాద్ పొల్యూషన్ నుంచి వచ్చిన వాళ్లకు టర్కీ ఒక సుందరస్వప్నం అని చెప్పవచ్చు. పెద్ద నగరమంటే ఇరుకు రోడ్లు, వీధులు సాధారణమే అని మనకు అనిపించవచ్చు… కాని ఇస్తాంబుల్ ఎక్కడా ఇరుకుగా అనిపించదు. చక్కటి 8 లేన్, 6 లేన్ రోడ్లు, ప్లయ్ఓవర్లతో విశాలంగా ఉంటుంది. మెట్రో రైల్వే వ్యవస్థ, బస్, రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లతో నగరంలో ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వాతావరణ కాలుష్యం ఉండదు, చల్లగా పూర్తిగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఇస్తాంబుల్ అనగానే స్కూల్ రోజుల్లో అదొక చారిత్రక ప్రదేశంగా చదువుకున్న జ్ఞాపకం కానీ ఈ నగరం సినిక్ బ్యూటీలో కూడా ప్రత్యేకమైనదే. ఒక మహానుభావుడు అన్నట్లు ప్రపంచమంతా ఒక దేశమైతే దానికి ఒక రాజధాని అయ్యే అర్హత ఈ ఇస్తాంబుల్‌కు ఉందని’ అన్న మాటలు దీన్ని చూశాక నిజమే అనిపించాయి.

ఈ నగరంలోనే పెరాపుల్ హోటల్ లో ఉన్నప్పుడు ‘ఆగాథా క్రిస్టి’ తన ఫేమస్ నవల ‘మర్డర్ అన్ ద ఒరియంట్ ఎక్స్‌ప్రెస్’ అనేది రాశారట. ఇది సినిమాగా కూడా వచ్చింది. ఇక్కడ జేమ్స్‌బాండ్ సినిమాలే కాదు, మన మగధీర, దూకుడు వంటి సినిమాలు కూడా ఇక్కడ ఉన్న పముకలే పర్వతాల్లో షూటింగ్ చేశారు.

ఇస్తాంబుల్ నగరాన్ని రెండుగా విడదీసేది బోస్పారస్. ఇది బ్లాక్ సీతో కలుపుతుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్‌కు అవతలి వైపు ఏసియా, ఇవతలి వైపు యూరప్. మర్మరా సముద్రం ప్రపంచంలోనే అతి చిన్న సముద్రం. టర్కీస్ ప్రజలు దీనిని తియ్య సముద్రం అని పిలుస్తారు. ప్రేమగా ఆ నీరు తాగిన వారు దప్పిక తీరదంటారు. ఆ రాత్రి క్రూజ్‌లో బోస్పరప్ వంతెన రంగులు వెదజల్లడాన్ని చూశాము. అక్కడి నుంచి మేము నడుస్తూ ఉంటే చిన్న ట్రామ్లు వెళుతున్నాయి. ఎంత రష్‌గా ఉందంటే చాలా చాలా రష్‌గా ఉంది.

ఇస్తాంబుల్ నైట్ లైఫ్ యువతరాన్ని ఉర్రూతలూగించేటట్లు ఉంటుంది. బెల్లీ డ్యాన్సులు, ట్రెండీ క్లబ్బులు ఉంటాయి. అటాటర్క్ కల్చరల్ సెంటర్ సాంస్కృతిక కార్యక్రమాల వేదిక. వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ నుంచి, టర్కిష్ సంప్రదాయ సంగీతం వరకు అన్ని రకాల కన్సర్ట్‌లు, బాలేలు జరుగుతుంటాయి. ఈ క్రూజ్‌లో మేము బెల్లీ డ్యాన్స్, జానపద నృత్యాలు తిలకించాము.

రెండవ రోజు ఒక ప్రిన్సెస్ అనే ద్వీపానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము. ఆసియా తీరానికి మధ్యలో ఉండే ద్వీపం అది. అక్కడికి ఒక పడవలో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మొత్తం ఆ ద్వీపం అంతా నడుస్తూ తిరిగాము. ఆ ద్వీపం ఎంతో అందంగా ఉంది. ఆ ద్వీపం చుట్టూ మంచి మంచి ఇళ్లు, ఆ ఇళ్ళ చుట్టూ మంచిగా అలంకరించి ఉన్న బొమ్మల్ని చూడటం ఎంతో ఆనందం అనిపించింది. అక్కడే మేము సీ-ఫుడ్ తిన్నాం. ఆ సీ-ఫుడ్ చాలా రుచిగా బాగా చేశారు. ఆ తర్వాత తిరిగొచ్చి మేము గ్రాండ్ బజార్‌కు వెళ్ళాము.

పురాతన గ్రాండ్ బజార్

ఈ నగరం ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్లు – ‘కోన్ ర్యాడ్’ హెూటలను బయటి నుంచి అయినా చూడాలనుకుంటారట. అంత క్రేజ్ ఎందుకంటే దేశాధినేతలతోపాటు, ‘ఒసామా బిన్ లాడెన్’ వంటి వాళ్ళు సహితం ఈ హెూటల్లోనే బస చేశారట…! ఈ హోటల్ దగ్గరలో షాపింగ్ డిస్ట్రిక్ట్ ఉంది. అందులో లెక్కలేనన్ని మాల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాల్లో 180 – 200 షాపుల వరకు ఉంటాయి. వాటిలో గ్రాండ్ బజార్ ప్రధానమైంది. ఈ గ్రాండ్ బజార్ ప్రపంచంలోనే అతి పురాతనమైన వ్యాపారకేంద్రం. గ్రాండ్ బజార్లో అయితే ఏకంగా మూడువేల షాపులున్నాయట. ఇందులో ఇస్తాంబుల్ సంప్రదాయ వస్తువులను విక్రయించే షాపులు, ఆభరణాల దుకాణాలు ఉంటాయి. అటు సంప్రదాయ మోడల్స్ తోపాటు మోడరన్ డిజైన్స్ కట్టిపడేస్తాయి. దేనికది యునిక్‌గా ఉండడంతో దేనిని సెలెక్ట్ చేయాలన్నది అంత త్వరగా డిసైడ్ చేసుకోలేం. ముత్యాలు, ముత్యాల ఆభరణాలకు ప్రత్యేకంగా దుకాణాలున్నాయి, పాతిక-ముప్పై రంగుల ముత్యాలు చూపు తిప్పుకోనివ్వవు, లైట్ల వెలుతురులో ఇంద్రధనస్సును తలపిస్తాయి.

ఈ గ్రాండ్ బజార్లోనే అనేక హాలీవుడ్ చిత్రాల చిత్రీకరణ కూడా జరిగింది. జేమ్స్‌బాండ్ సీరిస్‌లో వచ్చిన ‘స్కైఫాల్’ అనే సినిమాలో వెంటాడే సన్నివేశాన్ని ఇక్కడే చిత్రీకరించారు. సెరామిక్స్, కార్పెట్స్, బంగారంతో చేసిన వస్తువులు, కమ్మలు, బంగారు బిస్కట్ల వరకూ అన్నీ ఈ గ్రాండ్ బజారులో దొరుకుతాయి. ఇందులో నేను గమనించింది ఏంటంటే చాలా తక్కువ బరువుతో ఉన్న బంగారు నగలను టర్కీసు వారు తయరు చేస్తారు. ఎంత అందంగా ఉన్నాయంటే వన్ గ్రామ్‌కి చక్కటి కమ్మలు వస్తాయి. ఆ కమ్మలు కూడా చాలా పొడుగుగా, ఎంతో నాజుకుగా చాలా బాగా ఉన్నాయి. వాళ్ళ పనితనం ప్రపంచంలో మరెక్కడా చూడలేమో అనిపించింది. మంచి నగిషీ ఉంది. రాత్రి పూట చక్కటి దీపాలతో వెలుగుతూ ఉన్న వాటిని చూస్తూ ఉంటే కన్నుల పండుగగా అనిపించింది. ఇక్కడ ఆ రోజు బజారు అంతా తిరిగి, అంతా చూసి వచ్చి పడుకున్నాము.

చర్చి మసీదై ఇప్పుడు మ్యూజియమైంది

ఇస్తాంబుల్లో చూడదగ్గవాటిలో మరో ముఖ్యమైనది ‘హజియా సోఫియా’. ఇది ఒక పురాతనమైన చర్చి. ఈ హజియా సోఫియాకు గొప్ప చరిత్ర ఉంది. ఇది క్రీ.శ. 360లో రోమన్లు నిర్మించిన చర్చి అట. అప్పటి నుండి వెయ్యి సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతి పెద్ద చర్చిగా విలసిల్లింది. అయితే 1453లో సుల్తాన్ మహ్మద్-ఐఐ ఆధ్వర్యంలో తురుష్కులు కాన్‌స్టాంటినోపుల్‌ని ఆక్రమించుకుని ఇస్తాంబుల్‌గా పేరు మార్చారు. అప్పటి నుండి 1954 దాకా హజియా సోఫియా మసీదుగా ఉంది. ప్రస్తుతం ఇది మ్యూజియంగా కొనసాగుతుంది. ప్రపంచంలో ఇటువంటిది ఎక్కడా కానరాదు…! ఇది ఒక అద్భుత కట్టడమనే చెప్పవచ్చు. కట్టడంలోని ప్రతి భాగం ఎంతో శ్రద్ధతో కట్టారా అనిపిస్తుంది అది. దాన్ని చూసిన తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న బ్లాక్ సీకి వెళ్లాము.

బ్లాక్ సీ

పేరుకు తగ్గట్టే ఉంటుంది ఇది. నల్లగా సముద్రపు నీటిలో కాటుక పులిమినట్లు, కారు చీకటి అలముకున్నట్లు ఉంటుంది. ఈ సముద్రం రెండు ప్రపంచ యుద్ధాలకు మౌనసాక్షి. యుద్ధనౌకలకు దారి ఇచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, మానవాళి వినాశానికి కారణమయ్యానన్న దుఃఖంతో, మనుషుల పట్ల తన నిరసన తెలియచేయడానికి సింబాలిక్‌గా నల్లరంగును పులుముకున్నదేమో పాపం అనిపిస్తుంది. కొన్ని తీరాల్లో టర్కోయిస్ బ్లూ రంగులో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నడి సముద్రంలో నలుపు తప్ప మరోరంగు కనిపించదు.

ఆరు మీనార్ల మసీద్…!

తర్వాత మేము అహ్మద్ కామీ అని పిలువబడే ప్రసిదద్ద నీలి మసీద్ దర్శించాము. ఇది కూడా ఇస్తాంబుల్‌లోనే ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఆరు మీనార్లున్న మసీదు ఇదొక్కటే. 1609-1616 మధ్య కాలంలో మహ్మద్ ఆగా శిల్పి పర్యవేక్షణలో ఈ మసీద్‌ని నిర్మించారట. అద్భుతమైన నిర్మాణశైలితోపాటు ఈ మసీదు లోపల సీలింగుకి ఇరవై వేల నీలిరంగు పలకలు అతికారు. అందుకే ఇది బ్లూ మాస్క్‌గా వాడుకలోకి వచ్చింది. దీని అసలు పేరు సుల్తాన్ అహ్మద్ మసీదు. ఇది యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద.

కపడోకియా

మూడోరోజు మేము కపడోకియా అనే ప్లేస్‌కి బయలు దేరాము. కపడోకియా అనే పదానికి పేరు కట్, పక్, టుకియా అనే పర్షియన్ పదాల నుండి వచ్చిందట. అందమైన గుర్రాలుండే ప్రాంతం అని అర్థం. ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే కపడోకియాలో శిలా రూపాలకు చాలా ప్రసిద్ది చెందింది. రసాయన, యాత్రిక ప్రక్రియల వల్ల సహజంగా మిగిలిపోయిన రాళ్ళ సముదాయం చూడటానికి ఒక అద్భుతమనే చెప్పాలి.

    

ఇస్తాంబుల్లో ఒక ఫైట్ ఎక్కి కేసరి’ అనే ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి కపడోకియాకు వెళ్ళాము. ఇది గోరిమె అనే పట్టణంలో ఉంటుంది. ఇదొక రాతి లోయ. కొండలు.. కోనలు, పర్వతప్రాంతాలు, వంపులు తిరిగిన రోడ్లు.. ఇక్కడ చూపు తిప్పుకోనివ్వవు. గాలి, నీటి చర్య వల్ల అపసవ్యంగా ఏర్పడిన కొండ పై భాగాలు, ఆవాసాలుగా మారిన వైనాలు ఆశ్చర్యానికి లోనుచేస్తుంటాయి. అగ్నిపర్వతపు లావాలు గడ్డకట్టి ప్రకృతి సిద్ధమైన వాన, గాలి, ఎండ, మంచులకి కరిగి ఏర్పడిన శిలా రూపాలతో ఇవి ఏర్పాడ్డాయి. పొడుగాటి ఐస్‌ఫ్రూట్‌కి పైన ఒక చిన్న ప్లేట్‌ను బోర్లిస్తే ఎలా ఉంటుందో అలాంటి పర్వత పంక్తులు ఎన్నెన్నో వందల వేలు అక్కడ ఉన్నాయి. వాటిని ఇక్కడ వీళ్ళు గోరిమి అంటారు. గోరిమి అంటే అర్థం “నువ్వు చూడలేవు” అని. అక్కడ మేము హోటల్ తీసుకొని రాత్రికి ఉండిపోయాము. రెండవరోజు పొద్దున్నే ఏం చేశామంటే సహజంగా ఉన్న ఈ రాతీ చిమ్నీలో ఒకదాని మీద ఒకటి పెట్టినట్టు ఎంత అద్భుతంగా కనిపించిందంటే దేవుడి సృష్టి ఇలా కూడా ఉంటుందా అనేటట్లు చూశాము.

పొద్దునే ఐదున్నరకు లేచి ఈ అందాలను వీక్షించడానికి మేము మా హోటలు నుండి ఒక కారు తీసుకొని హాట్ ఎయిర్‌బెలూన్లు ఉండే ప్రదేశానికి వెళ్ళాము. ఈ హాట్ ఎయిర్ బెలును 800 మీటర్ల పైకి ఎగురుతుంది. దీంట్లో ఒక పది మంది ఎక్కగానే అది మంటలాగా వెలుగుతూ పైకి వెళుతుంది. మేము కూడా అందులో ఎక్కేందుకు రడీ అయ్యాము. బెలున్లోకి ఎక్కగానే మా పైలటు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో వివరించాడు. ఫోటోలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. మెల్లిగా మా బెలునూ గాలిలోకి ఎగరం మొదలెట్టింది. మిగిలిన సిబ్బంది మాకు వీడ్కోలు పలికారు. కపడోకియాలో మొత్తం 270 బెలునూలు ఉన్నాయంట. ఏప్రిల్ నుండి ఆక్టోబర్ వరకూ హాట్ ఎయిర్ బెలూన్ విహారానికి అనువైన సమయం. మాతో పాటు ఆ విహారంలో 60 నుండి 70 వరకూ బెలూన్లు ఉన్నాయి. పై నుండి గోరిమె పట్టణం చాలా అందంగా కనిపించింది. బెలూనులో అతి ముఖ్యమైన ఘట్టం నూర్యోదయ దర్శనం మాకు ఒక మరువలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. అంత ఎత్తునుండి భానోదయాన్ని చూడటం మా జీవితంలో ఇదే మొదటిసారి. అంత ఎత్తు పైనుండి కిందికి చూస్తూ ఆ అద్భుతాన్ని వీక్షించడం చాలా చాలా బాగా అనిపించింది.

  

ఇప్పటి వరకూ ఇన్ని దేశాలు తిరిగిన కూడా ఈ చిమ్నీలు లాంటి రాతి లోయను చూడటం అనేది ఒక టర్కీలో మాత్రమే. తర్వాత నేను ఎక్కడా చూడలేదు. ఈ సహజ సంపదను చూడటానికి కళ్ళు చాలవేమో అన్నంత బాగా ఉన్నాయి. అల్మోస్ట్ మేము రెండు గంటలు తిరిగి కిందికి చేరాము. నా లైఫ్‌లో ఎయిర్ బెలున్‌లో ఎక్కడం మొదటిసారి కాబట్టి చాలా సంతోషం అనిపించింది. రెండు గంటలపాటు ఎయిర్ బెలూన్‌లో విహారం చేసిన మాకు చూస్తుండగానే సమయం గడిచిపోవడంతో మా పైలట్ ఇచ్చిన కాల్‌తో ఈ లోకంలోకి వచ్చాము. అయితే లాండ్ అవుతున్నప్పుడు అందరూ లాండింగ్ పోజీషన్ తీసుకోవాలి. అందరూ అక్కడ అమర్చిన తాళ్ళను గట్టిగా పట్టుకొని, మోకాళ్లు మడుచుకొని కూర్చోమన్నారు. అలా కూర్చున్న తర్వాత బెలూన్ మెల్లిగా కిందకు దిగింది.

అయితే ఇక్కడ కిందకి దిగిన తర్వాత అందరికి షాంపేయిన్ ఇస్తారు. ఇలా ఇవ్వడం అక్కడ అన్నిబెలూన్లలో అనవాయితీగా వస్తుంది. మొదటి సారి ఇలా ఎయిర్ బెలూన్‌లో పైకి వెళ్ళిన వ్యక్తులు తిరిగి వచ్చాక ‘థాంక్ గాడ్ మేము బతికే ఉన్నాము’ అని వైన్ తాగి ఎంజాయ్ చేశారట. దాంతో అది అనవాయితీగా వచ్చింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here