తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర -1

0
9

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ పాఠకులకు అందిస్తున్నాము.]

ఎలుక పుట్టింది

‘ఎలుక పుట్టింది’ అంటూ ఒక మనిషి జీవన సాఫల్య యాత్ర విశేషాలు మొదలు పెట్టవలసి రావడం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సృష్టిలోని ఆశ్చర్య ఘటనలన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. ఏ ప్రాణి పుట్టుక ఎందుకో, ఆ ప్రాణికి ఎంత కాలం నూకలు ఈ భూమిపై ఉంటాయో, సదరు ప్రాణి చేత ఆ దేవుడు ఏ పనులు చేయించాలనుకుంటున్నాడో , ఏ స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు.

ఈ ఎలుక పుట్టుక కూడా అంతేనేమో..

అడవి రావుల పాడు. ఇదో పల్లెటూరు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా (పూర్వ నామం: కృష్ణాజిల్లా) నందిగామ మండలంలోని కుగ్రామం. స్వాతంత్ర్యం వచ్చి ఏడుపదులు దాటినా ఇప్పటికీ కుగ్రామమే. కాకపోతే కరెంట్, వాటర్ వంటి కనీస వసతులు వచ్చాయి అంతే. ఇప్పుడే ఇలా ఉంటే స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్లకు అంటే 1957లో ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు. ఆ రోజుల్లో చీకటి పడిందంటే భయం రాజ్యమేలుతుండేది. చిమ్మచీకట్లో ఓ పాతిక కొంపలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుండేవి. ఆముదం దీపాల వెలుగు.. అంతటా నిశ్శబ్దం. జనవరి 26, చలికాలం అవడంతో ఐదున్నరకే చీకట్లు అలుముకున్నాయి. పశువులు కూడా ఇళ్ళకు చేరి సేద తీరుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పెంకుటింట్లోని వెనుక గదిలో నుంచి పసికందు ఏడుపు. మంత్రసాని – ఎఱ్ఱది ఆ నుండి పరుగులాంటి నడకతో వచ్చి అన్న మాట – ఎలుక పుట్టింది.

బామ్మ చెప్పిన మాటలు:

ఓరేయ్, నువ్వు పుట్టినప్పుడు ఎలుక పిల్లలా ఉండేవాడివిరా. మంత్రసాని ఎఱ్ఱది (1 చూ. ఫుట్ నోట్) లేదూ, అది వచ్చి చెబితే లోపలకి వెళ్ళి చూద్దును కదా, మీ అమ్మ ప్రక్కన జానెడు కూడా లేని ఆకారం కదులుతోంది. అసలే కరెంట్ లేదా, ఆముదం దీపం వెళుతురులో నువ్వు నిజంగానే ఎలుక పిల్లలా ఉన్నావ్రా.

ఇంకో సంగతి చెప్పనా.. ఈ ఎలుక పిల్లకు స్నానం చేయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిరా. కాళ్ళ సందుల్లో నుంచి దూరిపోయేవాడివనుకో – అంటుండేది. మా బామ్మ (అన్నపూర్ణమ్మ) శతవత్సరాలకు పైనే బతికిందని ఇంట్లో వాళ్లు చెప్పారు. బతికినంత కాలం మహారాణిలా బతికింది. వీధిలో వెళ్ళే ఎవరినైనా పేరు పెట్టి పిలవగల అధికార స్వరం ఆమెకు భగవంతుడు ఇచ్చాడు. వ్యవసాయ పనులు, ఇంటి పనులు ఆ అధికార స్వరంతోనే జీతగాళ్లు, పనివాళ్లతో చేయించుకునేది. అంతే ఉదారంగా వారిని ఆదుకునేది.

నా చిన్నతనం అంతా దినదిన గండంలా సాగేది. దేవుడిచ్చిన ప్రాణం ఎప్పుడు తీసుకువెళతాడో తెలియని పరిస్థితి. పైగా ఊర్లో ముసురుకుంటున్న రోగాలు. పసరు వైద్యం, నాటు వైద్యం తప్ప ఉర్లో మందిచ్చే దిక్కేలేదు. అసలు అడవి రావుల పాడు (చూ. 2) అన్న గ్రామం పేరుకు తగ్గట్టుగా అప్పట్లో ఓ చిట్టడవి. ఈ పిల్లాడిని కాపాడటం పెద్ద సవాలైంది. ఇక దేవుడి మీదనే భారం.

చిన్నతనంలో చీపురు పుల్లలా ఉండేవాడిని. ఎప్పుడూ ఏదో ఒక జబ్బు. ముఖ్యంగా బాల ఉబ్బసం. రాత్రి పడుకోగానే పిల్లి కోతలు వచ్చేవి. మా అమ్మకి నా కారణంగా నిద్రలేని రాత్రులు ఎన్నో. అర్థరాత్రి కుంపటి రాజేసి దానిపై ఉప్పు వేడి చేసి దాన్ని మూటగా కట్టి నా ఛాతీపై రుద్దేది. అలా చేస్తే నిమ్ము తగ్గుతుందని ఓ నమ్మిక. మేము మొత్తం ఐదుగురు సంతానం. పై ఇద్దరు (ఒక అన్న, ఒక అక్క) రోగాల బారినపడి మరణించారు. కామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు సరైన మందులు లేవు. కడపటి వాడినైన నన్ను కాపాడుకోవాలని అమ్మ (చూ. 3) తెగ ఆరాట పడేది.

ఈ ఎలుక పెరిగి పెద్దదవుతోంది. విద్యాబుద్ధులు నేర్చింది. తెలుగు మీడియంలోనే డిగ్రీ పూర్తి చేశాక మాస్టర్ డిగ్రీ చేయడం కోసం బొంబాయికి బయలుదేరింది. ఆ సంగతులు వచ్చే వారం చెబుతాను.

~

ఫుట్ నోట్:

(1) ఎఱ్ఱది: నిజం పేరు ఏమిటో మాకు తెలియదు. ఊర్లో అందరూ ఎఱ్ఱది అనే పిలుస్తుంటారు. బాగా ముసలిదయిన ఎఱ్ఱదే నాకు గుర్తు. అంత పెద్దయ్యాకే ఇంత పసిమి ఛాయలో ఉన్నదంటే కుర్రదానిగా ఉన్నప్పుడు ఎలా ఉండోదో అన్న ఆలోచన అప్పట్లో రాలేదు కానీ, ఇప్పుడనిపిస్తోంది. మాలవాడలో మారుమూలలో పుట్టినావిడ, అంత వన్నె ఎలా వచ్చిందా అని ఈ మధ్య ఆరాతీస్తుంటే ప్రతి గ్రామంలో ఆరోజుల్లో ఉండే పెద్దింటి మగరాయిళ్ల సెక్సువల్ డామినేషన్ కారణమని తెలిసింది. చాటుమాటు సరసాలు అక్కడితో ఆగుతాయా ? జీన్స్ ఊరుకుంటాయా ? ఇక చెప్పేదేముంది. రంగు రూపులోనే కాదు, స్వభావరీత్యా కూడా బ్రాహ్మణ్యం కనిపిస్తుండేదని ఊర్లో కొందరు అన్న మాట.

(2) అడవి రావుల పాడు: ఇది అగ్రహారీకుల గ్రామం. పూర్వం జమిందార్ల నుంచి ఇనాముగా పొందిన చిట్టడివిలో మొదట్లో నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు ఉండటంతో వారి అవసరాల కోసం నెమ్మదిగా ఇదో గ్రామంగా అవతరించింది. ఇప్పుడైతే బ్రాహ్మణ కుటుంబాలు క్రమక్రమంగా చెదిరిపోతున్నాయి. నందిగామ నుంచి చక్కటి తారు రోడ్డు మార్గం ఇప్పుడుంది. నా చిన్నప్పుడు మట్టి దారి. వర్షాకాలంలో వాగులు పొంగడంతో రాకపోకలు బంద్ అయ్యేవి. వేసవి కాలంలో మేము మంగళగిరి, గుంటూరు నుంచి నందిగామ వచ్చినప్పుడు మా బామ్మ మాకోసం గూడు వేసిన ఎడ్ల బండి పంపేది. మనవళ్లు, మనవరాళ్లు వస్తున్నారని తెగ సంబరపడిపోయేది. మా ఇంటి వ్యవసాయం నిలబెట్టడం కోసం ఆమె ఈ ఉర్లోనే ఉంటుండేది. మా నాన్న గారు (తుర్లపాటి వెంకట మల్లికార్జున వరప్రసాద రావు) ఎండోమెంట్ శాఖలో పనిచేస్తూ బదిలీల మీద ఊర్లు మారుతుండేవారు. అలా మంగళగిరి, గుంటూరు వంటి చోట్ల ఉండేవాళ్లం. మా రాక ఆమెకు సంబరం. ఎడ్ల కొమ్ములకు రంగులు వేయించేది. మువ్వలు గంటలున్న బెల్టులు మెడలో వేయించేది. నడుముకు తళతళా మెరిసే బెల్టులు చుట్టించేది. వయ్యారం వొలకబోస్తూ ఎడ్లు బండి లాగుతుంటే ఫర్లాంగు దూరం నుంచే ఫలానా వారి బండి వస్తుందని చెప్పేసే వాళ్లు.

(3) అమ్మ: స్వరాజ్య లక్ష్మి కానూరి వారి ఆడపడుచు. ప్రముఖ ఇంజనీర్ కానూరి లక్షణ రావు (కెఎల్ రావు)కి బంధువులే. కంకిపాడులో ఉండే మా తాత (బ్రహ్మానందం)గారు మా అమ్మ నాన్నలకి ఓ ఆవుని దానంగా ఇచ్చారట. ఈ ఆవు ఎఱ్ఱటి మచ్చలతో ఉండేది. అది వచ్చిన వేళా విశేషం. పాడి పంటల వల్ల ఇల్లు కళకళలాడుతుండేదని చెప్పేవారు. దాని సంతానం, వాటికి పుట్టిన సంతతే ఎటేటా పెరిగిపోతుండేది. 11 ఆవులు, నాలుగు కోడె దూడలు, రెండు జతల ఎడ్లు.. పశువుల కోష్టంలో ఉండటం నాకు తెలుసు. తువ్వాయిలంటే నాకు ప్రాణం. అవి కూడా నన్ను అంతగా ప్రేమించాయి. నేను ఊరు విడిచి వెళుతుంటే ఒక ఆవు దూడ ఊరి పొలిమేర దాటే దాకా బండి వెనకే వచ్చింది. దాన్ని వెనక్కి మళ్ళించడం చిన్న జీతగాడికి కష్టమైంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అమ్మ రాకతోనే పాడిపంటలు ఊపందుకున్నాయని మా బామ్మే చెబుతుండేది ఈ మాట.

 

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here