తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-13

4
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

సాహసం సేయకురా డింబకా:

(హెచ్చరిక: ఈ భాగంలో నేను పేర్కొంటున్న సంఘటనల మాదిరిగా ఎవరూ చేయకూడదు. ముఖ్యంగా పిల్లలుగా ఉన్నప్పుడు ఏ సాహసకృత్యమైనప్పటికీ ఇంట్లో పెద్దవారికి చెప్పకుండా లేదా అధీకృత నైపుణ్యం గడించకుండా చేయకూడదని చెప్పడానికే ఈ సంఘటనలను తెలియజేస్తున్నానే తప్ప ప్రోత్సహించడానికి కాదని గమనించగలరు – రచయిత)

***

చాలా పెద్దయ్యాక, ఇప్పటికీ కూడానూ, ఏ గుడికి వెళ్ళినా అక్కడ గాలి గోపురం ఉంటే, దాన్ని చూసినప్పుడల్లా, చాలా చిన్నప్పుడు అంటే పది పన్నెండేళ్లు కూడా లేని పిల్లాడిగా ఉన్నప్పుడు నేను చేసిన సాహసం కళ్లముందు కదలాడుతూ ఉంటుంది. నిజానికి అది సాహసం కాదు, మరణమృదంగం. రెప్ప వాల్చి తెరిచే లోపు ఊపిరి ఆగిపోయేటంతటి ఉత్కంఠ సంఘటన అది. తలచుకుంటుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తూనే ఉంటుంది. ఇలాంటి పిచ్చి పనులు ఎవరూ చేయకూడదని ఆశిస్తూ ఆ సంఘటలోకి వెళుతున్నాను.

మంగళగిరి అనగానే కొండ పైన పానకాల స్వామి, దిగువన లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి కదా. క్రింద ఉన్న గుడి చాలా విశాలమైనది. నాలుగు వైపులా గాలి గోపురాలు ఉంటాయి. అయితే వెనుక ఉన్న గాలి గోపురం పైకి లేవలేదు. అది ప్రారంభ దశలోనే ఆగిపోయినట్లు ఆనవాళ్లు కనిపిస్తుంటాయి.

అలా ఎందుకు జరిగిందనడానికి ఏవో కొన్ని కారణాలు చెబుతారనుకోండి. సరే, ముందు వైపున చాలా ఎత్తైన గాలి గోపురం ఉంది. అది పదకొండు అంతస్తులతో ప్రక్కనే ఉన్న కొండకి నేనూ పోటీనే సుమా అన్నట్లుగా ఠీవీగా నిలబడి ఉంటుంది.

మా నాన్నగారు టెంపుల్స్‌కి ఈవో కావడంతో కొన్నేళ్లు మంగళగిరిలో ఉన్నాము. అప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదువుకుంటున్నాను. నా తోటి గ్యాంగ్‌తో ఇంటి ప్రక్కనే ఉన్న రథం ఎక్కడం దాని మీద నుంచి క్రింద ఉన్న ఇసుక కుప్పలపైకి దూకేయడం వంటి సాహసాలు మాకు అలవాటే. అదో సరదాగా ఉండేది. భయం తెలియని రోజులవి. ఒక సారి ఏం జరిగిందంటే..

స్నేహితుల గ్యాంగ్‌తో కలిసి గాలి గోపురం ఎక్కాలనుకున్నాము. క్రింద నుంచి మెట్లు ఉంటాయి. ప్రారంభంలోనే మెట్ల దారికి తలుపు ఉంటుంది. దానికి తాళం కూడా బిగించి ఉంటుంది. కానీ ఒక్కోసారి మరిచిపోవడం వల్లనో లేదా మరే కారణం వల్లనో ఆ తలుపు తెరిచినట్లు కనబడేది. మా సాహసకృత్యానికి ఈ లొసుగే ఆధారం. గాలి గోపురం ఎక్కడానికి దేవాలయం సిబ్బంది అందరికీ అనుమతి ఇవ్వరు. కాకపోతే ఈవో అబ్బాయిని కదా, చూసీచూడనట్లు ఊరుకునే వారు. అదే కొంప ముంచింది. కేవలం ఒక సెంటీమీటరో, మిల్లీమీటరో తెలియదు కానీ వెంట్రుకవాసిలో బ్రతికి బయటపడ్డ సంఘటన గురించే ఇప్పుడు చెబుతున్నది. కాలు ఇంకాస్త స్లిప్ అయిఉంటే..

అమ్మో. తలుచుకుంటేనే భయం వేస్తుంటుంది. జరగకూడనిది ఆ రోజు జరిగి ఉంటే నేను ఈ స్థితికి ఎదిగే వాడిని కాను, ఈ వ్యాసాన్ని మీరు చదివేవారు కూడా కాదు. దేవ దేవుడు ప్రతిక్షణం మనల్ని కనిపెడుతుంటాడనీ, ఏవో దుష్ట గ్రహాల వల్ల కలిగే ప్రమాదాలను తృటిలో తప్పిస్తాడని చెప్పడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం.

గాలి గోపురం నిర్మాణం చాలా విశిష్టమైనది. ఆ నాటి ఇంజనీర్ల (శిల్పుల) పనితనానికి అబ్బుర పోవాల్సిందే. పెద్ద పెద్ద బండలను, సున్నం, బెల్లం కలిపిన మిశ్రమాన్నీ ఒక్కొక్క అంతస్తు లేపుకుంటూ అంత ఎత్తుకు చేరవేయడం అంటే మాటలు కాదు. ఇప్పటిలా లిఫ్ట్‌లు, క్రేన్లు లేని రోజులవి. మరి ఆ మెటీరియల్‌ని ఎలా పైకి, అంటే క్రింద నుంచి చివరకు పదకొండవ అంతస్తు వరకు ఎలా చేరవేయగలిగారు? ఇందుకు వాళ్లు ఒక టెక్నిక్ వాడినట్లు ఆ గాలి గోపురం ఒక్కో అంతస్తు ఎక్కి చూసినప్పుడు అర్థమవుతుంది. ప్రతి అంతస్తుకి కప్పు మధ్యలో నలు చదరంగా, కనీసం ఒకటిన్నర మీటర్ల పొడవు వెడల్పు ఉండేలా శ్లాబ్ వేయకుండానే వదిలేస్తారు. అది పై అంతస్తుకి వెళ్ళి చూస్తే ఫ్లోర్ మీద కంతలా (చిల్లులా) ఉంటుందన్న మాట. ఇలా ప్రతి అంతస్తుకి చేయడం వల్ల మొదటి అంతస్తు ఎక్కి పై కప్పు చూడగానే మధ్యలో ఉన్న రంధ్రం వల్ల పై అంతస్తులు కనిపించేవి. అలాగే, క్రిందకు చూస్తే దిగువ అంతస్తులు కనబడతాయి. ఈ కంత నుంచే మెటీరయల్‌ని పైకి చేర్చేవారని ఆ తర్వాత అర్థమైంది. నిర్మాణ పని అయ్యాక ఎందుకో తెలియదు కానీ, ఈ కంతలను మాత్రం పూడ్చలేదు. అవి అలాగే ఉన్నాయి. (ఇప్పటి మాట కాదు, 1960వ దశకంలో నేను చూసినప్పటి మాట ఇది. ఇప్పుడు గాలి గోపురం లోపలి గదులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు)

భయపెట్టిన గాలి గోపురం:

గాలి గోపురం దగ్గరకు మా గ్యాంగ్ ఆ రోజు వెళ్లగానే తలుపులు తీసే ఉన్నాయి. అంతే ఒక్క ఉదుటున మెట్లెక్కడం మొదలెట్టాము. అలా ఎక్కుతున్నప్పుడు బోలెడు సంతోషమేసింది. ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం అన్నమాట. కానీ ఈ ఆనందం దిగేటప్పుడు లేదు. పూర్తిగా ఆవిరైపోయింది. దాని స్థానంలో భయం.. ప్రాణభయం ఆవహించింది. ఎందుకంటే..

మెట్లమీద పిల్ల గ్యాంగ్ ఊపుగా, హుషారుగా ఒక్కో అంతస్తు ఎక్కుతున్నాము. ప్రతి అంతస్తులో పైకప్పుకి చిల్లు, అలాగే క్రింద మేము నిలుచున్న చోట మధ్యలో మరో చిల్లు. ‘అరే, మనం ఆడుకోవడానికే అలా కంతలు పెట్టర్రా’ అనుకుంటూ గాలి గోపురం గదుల్లో చిందులు వేశాము. మాలో ఒకడేమో కాస్త పొడుగరి. అందుకు తగ్గట్టుగానే వాడి కాళ్లూ పొడుగే. ఉన్నట్లుండి వాడేమో ఈ కంతకి ఒక వైపున నిలబడ్డ వాడు కాస్తా హఠాత్తుగా గెంతి కంతకి అవతలవైపునకు సునాయాసంగా చేరాడు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకున్నట్లుగా విజయగర్వంతో ఊగిపోయాడు. అక్కడితో ఆగలేదు. రెచ్చగొట్టాడు. ‘మీరు చేయండర్రా భలేగా ఉంటుది’ అంటుండగానే మరొకడు కంతకి ఇటు వైపు నుంచి అటు వైపునకు గెంతాడు. వాడూ విజయం సాధించాడు. ఒకరికి ఇద్దరు తోడయ్యారు. వీళ్ళిద్దరి మాట విని మూడో వాడూ ఈ సాహసం చేసేశాడు. అయితే ఈ మూడో వాడేమో తడబడ్డాడు. కాస్తంత కంగారు పడ్డాడు. స్లిప్ కాకుండా ఎలాగో అవతలికి చేరి ఊపిరి పీల్చుకున్నాడు. కాకపోతే అంతలో సర్దుకుని తానూ విజయం సాధించానంటూ పోజిచ్చేశాడు.

ఇక మిగిలింది నేను. వీరందరి కంటే నేను పొట్టి. నా కాళ్లూ పాపం పొట్టివే కదా. కానీ ఈ ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్లు ఊరుకోరు కదా. నేను భయపడుతుంటే ఎగతాళి చేశారు. ‘ఈ మాత్రం దూకలేవా?’ అంటూ సవాల్ విసిరారు. నాకు కోపం వచ్చింది. వీళ్లకి మల్లే నా కాళ్లు ఎందుకు పొడవుగా లేవన్న దిగులు పుట్టింది. ఇంటికి వెళ్లగానే అమ్మకి చెప్పి నా కాళ్లు పొడుగయ్యేటట్లు చేయమని అడగాలని అనుకున్నాను.

‘ఏమీ కాదురా, దూకేయ్’ అని వాళ్లు అప్పటికే ఏ పదిసార్లో అనేశారు. అంతే, ఉన్నట్లుండి ధైర్యం కమ్మేసింది.

కంతలో నుంచి క్రిందకు చూస్తే దిగువన చాలా లోతు ఉన్నట్లు స్పష్టంగా కనబడుతూనే ఉంది. బహుశా అది ఏ ఐదో లేదా ఆరో అంతస్తో అయి ఉంటుంది. స్లిప్ అయితే అంతే సంగతులు అని తెలుస్తూనే ఉంది. అయినా తెలియని మొండితనం ఆవహించింది. దూకేశాను.

అది క్షణంలో ఎన్నో వొంతో తెలియదు గానీ నా స్నేహితుల్లో ఒకడు నా చేయి పట్టుకుని లాగినట్లు గుర్తు. నేను బయటపడ్డాను. కాదు, బతికి బయటపడ్డానని తర్వాత బాగా అర్థమైంది. కుడి కాలి పాదం చిల్లు అటువైపుకు చేరినా ఎడమ కాలి పాదం దాటలేకపోయింది. దీంతో బ్యాలెన్స్ తప్పి క్రిందకు పడిపోయే పరిస్థితి వచ్చేసింది. సరిగా అప్పుడు వాడు కాపాడాడట. వాడి పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు. అయినా దేవుడికి పేరు ఉంటుందా.. ఒక వేళ ఉన్నా మన తృప్తి కోసమే కదా. ఈ ప్రమాదంలో నా ఎడమ పాదం బాగా గీసుకుపోయింది.

బిక్కుబిక్కు మంటూ ఉత్సాహం ఆవిరి కావడంతో భయం భయంగా క్రిందకు దిగాము. ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని గ్యాంగ్ లీడర్ నా చేత వొట్టు వేయించుకున్నాడు. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. మాట తప్పని మనిషిని కనుక ఇప్పటికీ చెప్పడం లేదు కాకపోతే వ్రాస్తున్నాను, అంతే కదా.

తెలిసీ తెలియని వయసులో చేసే సాహసాలు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తాయో అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఆ తర్వాత చాలా కాలానికి నందిగామ మున్నేటిలో ఈతకు వెళ్ళడం, మునిగిపోవడం, మిత్రుడు కాపాడటం ‘ప్రాణ రక్షకుడు’ అన్న భాగంలో చెప్పాను కదా.

కనబడుట లేదు:

గుంటూరు – సాంబశివరావు పేటలో ఉన్నప్పుడు నేను చాలా చిన్న పిల్లాడినన్న మాట. అప్పుడు జరిగిన సంఘటనల్లో చాలా మటుకు గుర్తులేవు. అలాంటి రోజుల్లో ఓ సారి తప్పిపోయాను. ఇంటికి ఎలా చేరాలో తెలియలేదు. బాగా దాహం వేస్తుంటే వీధి పంపు దగ్గర ఆగి నీళ్లు త్రాగుతుంటే ఓ ‘నల్ల పిల్ల’ నా చేతిని గట్టిగా పట్టుకుని ఇంటికి చేర్చినట్లు గుర్తు. అంతే, అంతకంటే ఇంకా ఏవీ గుర్తులేవు. ‘ఆ నల్ల పిల్ల ఎవరై ఉంటారు అక్కా..’ అని ఈ మధ్యన అడిగితే ‘తాను పెద్దక్క అన్నపూర్ణరా’ అని చెప్పింది. జీవన యాత్ర ప్రారంభంలోనే అమ్మ నాన్నలకు ఐదుగురు సంతానం అని చెప్పాను కదా. వారిలో మొదట – అన్నయ్య (పురుషోత్తం రావు – మా తాతగారి పేరు పెట్టారు లేండి) రెండవ సంతానం పెద్దక్క (అన్నపూర్ణ – మా బామ్మ పేరు పెట్టారు) మూడవ కాన్పులో రెండో అన్నయ్య (కోటేశ్వర రావు), నాలుగవ సంతానంగా మరో అక్క (వరలక్ష్మి).

‘పెద్దక్కేరా నీ చేయి పట్టుకుని ఇంటికి తీసుకు వచ్చింది’ అని అక్క చెప్పింది. అక్కడితో ఆగలేదు. పెద్దక్కయ్య చనిపోయిన సంఘటన గుర్తుకు తెచ్చుకుని కంటనీరు పెట్టుకుంది.

పెద్దక్కకు నివాళి:

పెద్దక్క తెల్ల కామెర్లు వ్యాధితో చనిపోయిందట. ఓ నల్ల పిల్ల ఇంట్లో తిరుగుతుండటం, నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పడం వంటి చిన్నచిన్న సంగతులు తప్ప ఈ అక్కకు సంబంధించిన జ్ఞాపకాలు మరేవీ గుర్తులేవు. సాంబశివరావు పేటలో అద్దెకు ఉండేవాళ్లం. పెద్దక్కకి తెల్ల కామెర్లని గుర్తించి మందులు వేయడం మొదలు పెట్టేసరికి అది కాస్తా ముదిరిపోయిందట. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆస్పత్రిలో చనిపోయింది. డెడ్ బాడీని రిక్షాలో వేసుకుని తీసుకు వస్తే ఇంటి ఓనర్ అడ్డుపడి శవాన్ని బయటే ఉంచమనీ, లోపలకు తీసుకు రావడానికి వీలు లేదని తెగేసి చెప్పాడట. దీంతో పెద్దక్క మృతదేహాన్ని ఇంటి ముందే మురుగు కాలవ మీదనే గోడకు ఆనించి ఉంచి నందిగామ నుంచి ముఖ్యమైన బంధువులు వచ్చేవరకు ఆగి అంతిమ సంస్కారాలు చేశారట. ఆ సంఘటనని చాలా ఏళ్ల తర్వాత చిన్నక్క (వరలక్ష్మి) తలచుకుని కంట నీరు పెట్టుకుంటే నాకూ దుఃఖం ముంచుకొచ్చింది. ఇంటి ఓనర్లు ఇంత కఠినంగా ఉండటం ఆనాడే కాదూ, ఈనాడూ కనబడుతున్న ధోరణే. మనుషుల ధోరణి మారదు. పుట్టుకని వేడుకగా చూసే వారు మరణం అనేసరికి వెనకడుగు వేస్తారు. లేనిపోని భయాలతో ఇతరులను ఇబ్బందుల పాలుచేస్తుంటారు.

పుట్టిన వాడికి మరణం తప్పదు.

మరణించిన వానికి జననం తప్పదు.

అట్టి చావు పుట్టుకల మధ్య ఎంత తేడానో.. పుట్టుక సమయంలో శిశువు ఏడుస్తాడు, చుట్టూ చేరినవారు నవ్వుతారు. ఈ సందర్భంలో ఆత్రేయ ప్రేమనగర్ సినిమా కోసం వ్రాసిన పాట గుర్తుకు వస్తున్నది.

నేను ఏడ్చాను.. లోకం నవ్వింది

నేను నవ్వాను.. ఈ లోకం ఏడ్చింది

నాకింకా లోకంతో పని ఏముంది..

డోంట్ కేర్.. – అని అంటాడు కవి.

చావు పుట్టుకల మర్మాన్నీ, వాటి మధ్యన సాగే జీవన యానంలో లోకం తీరుని ఇలా చెప్పగలగడం ఆత్రేయకే చెల్లింది. ఈ పాట ఎప్పుడు విన్నా ఈ జీవన సారం గుర్తుకు రాక మానదు.

సాంబశివరావు పేట ఇంట్లో ఉన్న నేను ఎందుకని బయటకు వెళ్ళానో నాకు తెలియదు. వీధి చివరి దాకా వెళ్ళాను. మలుపు తిరిగాను. అలా నడుస్తూ మరో వీధిలోకి వెళ్ళాను. ఇలా నాలుగైదు వీధులు దాటాక వెనక్కి చూస్తే ఇల్లు కనబడలేదు. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. దాహం వేస్తుంటే నీళ్ల పంపు దగ్గర ఆగినప్పుడు ఈ పెద్దక్కే వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకుని ఇంటికి క్షేమంగా చేర్చింది. అందుకే ఈ భాగాన్ని పెద్దక్క (అన్నపూర్ణ అక్క) జ్ఞాపకార్థం అంకితం చేస్తున్నాను. పెద్దక్కకు ఇదే నా అక్షర నివాళి.

చిన్నప్పుడు తెలిసీ తెలియకుండా చేసే పనులు వల్ల ఒక్కోసారి ఎన్నో అనర్థాలు వస్తుంటాయి. అయితే బాగా ఊహ తెలిశాక అలాంటి తప్పులు చేయకూడదన్న జ్ఞానం వస్తుంది. పిల్ల చేష్టలు కనుమరుగై పెద్దరికం తొడుగులు వేస్తుంది. జీవితమంటే అంతే కదా.

రైలు నుంచి దూకడం:

ఇదేదో సినిమాలో స్టంట్ సీన్ కాదండి. బాగా పెద్దయ్యాకనే, అంటే నేను ముంబాయి (అప్పట్లో బొంబాయి)లో చదువుకుంటున్నప్పటి సంఘటన ఇది. బొంబాయిలో లోకల్ ట్రైన్స్ జన జీవనంలో అంతర్భాగమైపోయాయి. ఒకసారి లోకల్ ట్రైన్ ఎక్కి వెళుతుంటే మా ఫ్రెండ్ ఒకడు రైలు పూర్తిగా ఆగకముందే అంటే ప్లాట్‌ఫామ్ వచ్చినా పూర్తిగా ఆగక ముందే, ఛటక్కున దూకేస్తూ ‘నువ్వూ దూకేయి రా..’ అన్నాడు. అప్పుడు నాకు బొంబాయి చాలా కొత్త. తెలుగు ఫ్రెండ్ గాడు ఏం చెబితే అది చెయ్యడమే మన పని. వాడు నేర్పుగా అంటే, రైలు ఇంజన్ వైపునకే ఫేస్ పెట్టి దూకేశాడు. ఆ పని మన వల్ల అవుతుందా కాదా అన్న ఆలోచన లేకుండా నేనూ దూకేశాను. కానీ రైలు వెళుతున్న వైపుకి కాకుండా ఫేస్ వెనక వైపు పెట్టి దూకడంతో ఫిజిక్స్ సూత్రం తన పని తాను చేసేసింది. అంతే, ప్లాట్‌ఫామ్ మీద పడిపోయాను. కాకపోతే రైలు వేగం ఇంకా బాగా తగ్గడంతో పెద్దగా గాయాలు తగలలేదు. మోకాలు దగ్గర, మోచేతుల దగ్గర చర్మం చిట్లి నెత్తురు కారింది. రైలు వెళ్ళిపోతుంది. అప్పుడు స్కూల్‌లో నన్ను ఇబ్బంది పెట్టిన రైలు – స్తంభం లెక్క పరీక్షలో చేయలేక రైలు బొమ్మ వేసిన సంఘటన గుర్తుకువచ్చి అంత బాధలో నవ్వుకున్నాను. జీవితమంటే ఇంతే.

అప్పటి నుంచి సాహసాలు చేసేటప్పుడు మన సామర్థ్యం తెలుసుకుని చేయాలని నిర్ణయించుకున్నాను. అంతే కానీ, ఎవరో చెప్పారనో, ఏమేమో అనుకుంటారనో సాహసం చేస్తే ఫలితం ఇదిగో ఇలాగే ఉంటుందని అర్థమైంది. అంతే కాదు, ఒకనికి సులువుగా అనిపించే పని మరొకరికి కష్టం కావచ్చు. ఆ ఒక్కడు రెచ్చగొట్టినా ఈ మరొకడు లొంగిపోకూడదన్న మాట. చాలా ప్రమాదాలు ఇలాగే జరుగుతుంటాయి. కారు నడుపుతుంటే మన ప్రక్కన కూర్చున్న వాడే స్పీడ్ పెంచు అంటూ రెచ్చగొట్టవచ్చు. ముందు వెళుతున్న కారుని ఓవర్ టేక్ చేయమంటూ గిల్లవచ్చు. కానీ అతగాడి మాటలకు లొంగిపోతే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే అవుతుందన్న సత్యం నిదానంగా తెలిసింది. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను ప్రధానంగా ఒక సూత్రం పాటిస్తాను. అదేమంటే, జీవితంలో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తలెత్తాలో తెలియాలన్నట్టుగానే కారు నడిపేటప్పుడు కూడా ఈ రెండూ తెలియాలి. జీవితం రాగాల అల్లిక అన్నట్లుగానే వాహనం నడపడంలోనూ సంగీతం ఉంటుందన్నది నా అభిప్రాయం. చక్కటి సంగీతం వింటున్నట్లుగానే ప్రయాణం సాగాలి. అంతే కానీ గందరగోళ సంగీతంలా మారిపోకూడదు.

చివరి మాట:

ఈ సంఘటనలు చదువుతున్న మీలో కొందరికైనా ఇలాంటి చేదు అనుభవాలు ఉండి ఉండవచ్చు. ఈ మాటే నా వాకింగ్ ఫ్రెండ్ కృష్ణ శర్మ గారు (ది రిట్రీట్, కోకాపేట) ఓ సంఘటన చెప్పారు. వాళ్ల ఊర్లో దిగుడు బావి ఉండేదట. బావిలోకి దిగడానికి స్పైరల్‌గా మెట్లుండేవి. కొంత మంది పిల్లలు ఈత కోసం ప్రమాదకరమైన ఆ బావిలోకి దూకేవారట. చుట్టూ ఉన్న మెట్లలో ఎక్కడ తగిలినా ప్రాణాలు పోవాల్సిందేననీ, కానీ తోటి పిల్లలు రెచ్చగొట్టడంతో కొంత మంది నేర్పులేని వాళ్లు బలైపోతుంటారని శర్మగారు చెప్పారు. ఇలాగే మీరు చూసిన విన్న అనుభవాలు, సంఘటనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here