తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-14

3
10

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

డింగరీ:

డింగరీని చూస్తే చాలు, తెగ భయం వేసేది. నేనే కాదు, మా ఇంట్లో వాళ్లూ గజగజా వణకి పోయేవాళ్లు. డింగరీ ఎవరి మాట వినదు. అచ్చు సీతయ్య తంతే. అది ఇంటి ముందుకు వచ్చిందంటే చాలు ఇంట్లో ఉన్న మేమంతా భయపడిపోయే వాళ్లం. అది అరిస్తే మా గుండెలు దడ దడా. దాని కన్ను గప్పి గుమ్మం దాటి బయటకు వెళ్లలేము. దాని చూపులు చాలా తీక్షణంగా ఉండేవి. అది అరిస్తే ఉరిమినట్లే..

మా ఇంట్లో వాళ్లందరినీ క్రమశిక్షణలో పెట్టేది, అది కూడా కంటి చూపుతోనే.

ఇది ఎలాంటిదంటే, మొదట్లో మమ్మల్ని తెగ భయపెట్టి, ఆ తర్వాత మమ్మల్నిందర్నీ తన దారికే తెచ్చుకున్న బహు గడుసరి. అయితే చివరకు అది మా ఇంట్లోని అందరి మనసులు గెల్చుకుంది. ఇంతకీ డింగరీ అంటే ఎవరో, ఏమిటో చెప్పలేదు కదూ.. చెబుతాను.

డింగరీ ఒక ఊర కుక్క. బాగా బలిసిన కుక్క. పొగరెక్కిన కుక్క. గోధుమ రంగు ఛాయలో అది గుమ్మం ముందు పడుకుని ఉంటే సింహం గుహముందు పడుకున్నట్లే ఉండేది. దీన్ని చూస్చే వీధిలో వాళ్లందరికీ హడల్. కూరగాయలు అమ్ముకునే బండి వాళ్లు సైతం ఓ పది అడుగుల దూరంలోనే అగిపోయి ‘అమ్మాగారూ, తోటకూర, పాలకూర, వకాయలు, బెండకాయలు’ అంటూ కేకలేయాల్సిందే. సపోజ్, డింగరీ వాళ్ల దగ్గరకు వెళితే మాత్రం అర్భక బండి వాడు పరుగే పరుగు. అంచేత.. మా ఆవిడే కేక వినబడగానే వెంటనే గుమ్మం దాటేసేది. డింగరీ రూల్ పెట్టిందంటే దానికి తిరుగే లేదు. ఈ కుక్కకి ‘డింగరీ’ అన్న పేరు పెట్టింది నేనే. మొదట్లో మమ్మల్ని తెగ భయపెట్టిన డింగరీని ఆ తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనసు బాధతో మూలుగుతూనే ఉంటుంది. డింగరీని రక్షించలేకపోయానేమో అన్న భావన మెలి తిప్పుతుంటుంది. కానీ ఏం చేస్తాం. అలా జరిగిపోయింది. కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటే డింగరీని రక్షించుకునే వాడ్నేమో.

నేను ఆంధ్రప్రభ విజయవాడ ఎడిషన్‌లో పనిచేస్తున్నప్పుడు కాలం గిర్రున తిరిగిపోయింది. ట్రైనీ సబ్ ఎడిటర్‌గా చేరిన నేను మరుసటి ఏడాదే పెళ్ళిచేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలు వారి చదువులు, ఆఫీస్ పని, కొత్తకొత్త స్నేహితులు సాంస్కృతిక కాలక్షేపాలతో కాలం గిర్రున దొర్లింది. ఆంధ్రప్రభ లోని ఆనందకర ముచ్చట్లు మరోసారి వివరంగా చెబుతాను.

హైదరాబాద్‌కి ట్రాన్సఫర్ పెట్టుకుని మహానగరానికి వచ్చేశాను. అబ్బాయి (రాజేష్) ఇంజనీర్ కాలేజీ చేరిన సంవత్సరం అది. అమ్మాయి (దివ్య) ఆరో తరగతిలో చేరిన ఏడాది. పిల్లల చదువులు, నా అవసరాలు అన్నీ కలిపి కొంత అయిష్టత ఉన్నప్పటికీ మహానగర వాసులమైపోయాం. ట్రయల్ క్రింద వచ్చినప్పుడే బంధువుల సాయంతో దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలోని వి.వి.నగర్ (వివేకానంద నగర్)లో అమ్మాయి స్కూల్‌కి దగ్గర్లోనే అద్దె ఇల్లు ఫిక్స్ చేశాం. లారీడు సమాన్లతో హైదరాబాద్ చేరాము. ఆ ఇంట్లోకి ఓ రాత్రివేళ సామాన్లు దింపినప్పుడు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి అది కూడా ఇందాక ప్రస్తావించిన కుక్కతో.

అంతకు ముందు ఇంటి ఓనర్‌తో మాట్లాడినప్పుడు ఎందుకో తెలియదు గానీ, ఈ కుక్క గారు కనబడలేదు. ఆహా, విజయవాడలో మనం పెట్టే రెంట్‌కే ఇక్కడా దొరికిందంటూ మేము సంతోషపడ్డాం. తుపాను ముందు ప్రశాంతత ఇలాగే ఉంటుంది మరి. లారీడు సామాన్లు దింపుతున్నప్పుడు అది తన ఉనికిని చాటుకుంటూ అరిచింది. కానీ సామాన్లు దింపే వాళ్ల మాటలు, ఆ హడావుడి కారణంగా కాస్తంత వెనకడుగు వెసినట్లుంది. రాత్రి సామాన్లు అరకొరగా సర్దుకున్నాక కాసేపు పడుకున్నాము. తెల్లవారగానే పాల ప్యాకెట్ తీసుకు రావాలి కదా. నేను తలుపు తీశాను. అంతే..

వీధి గేట్ దగ్గర కుక్క నా వైపు అదోలా చూసింది. ఆ చూపులో నా పట్ల అవిధేయతే కాదు, నిర్లక్ష్యం శత్రు భావం స్పష్టంగా కనిపించాయి. కాసేపు ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడి దానివైపే చూస్తుండి పోయాను. అలా ఓ రెండు నిమిషాల పాటు గడిచాక కుక్కగారు ఏమనుకున్నారో ఏమో, దారి విడిచారు. పక్కకు వెళ్ళిపోయారు. బతుకు జీవుడా అని నేను వీధి చివరకు వెళ్ళి పాలప్యాకెట్లు తీసుకున్నాను. అప్పుడు ఆ కుక్కగారు గుర్తుకు వచ్చి, దాని కోసం రెండు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. నా వ్యూహం నాది. చూద్దాం, ఎలా ఫలిస్తుందో.

ఇంట్లోకి క్షేమంగా చేరాను. బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో చూసి మా అమ్మాయేమో తనకే అనుకుంది. తినబోతుంటే, ‘నీకు కాదు, బయటఉన్న కుక్కకి’ అన్నాను. ఆ మాటలకు ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్య పోయారు. పోరా మరి, అప్పటికే వీళ్లకి కూడా కుక్కగారి శౌర్య ప్రతాపాలు కొద్దో గొప్పే తెలిశాయి. అరిచే కుక్కకీ, మీదకి ఉరికే కుక్కకీ బిస్కెట్లా అన్నట్లున్నాయి ఇంట్లో వాళ్ల చూపులు. అయితే వీటితో సంబందం లేనట్లుగా పాలప్యాకెట్లు మాత్రమే ఇంట్లో ఇచ్చి రెండు బిస్కెట్ ప్యాకెట్లు చేతిలో పట్టుకుని పక్కనే ఉన్న మేడమెట్ల మీద కూర్చున్నాను. లోపల భయంగానే ఉంది. సింహాన్ని లొంగదీసుకోగలనా లేదా అన్నదే ఈ భయానికి కారణం. ఇంతలో మెట్ల క్రింద ఉన్న చిన్న గూడు దగ్గర ఏదో కదిలినట్లు అలికిడి అయింది. అటు వైపుకి తలతిప్పి క్రిందకు చూశాను. గుహలో నుంచి నిద్రలేచి ఆవలిస్తూ సింహం బయటకు వచ్చినట్లుగా కుక్క గారు బయటకు వస్తున్నారు. ఒక సారి తలఎత్తి నా వైపుకు చూసింది. మరోసారి ఇద్దరి చూపులు కలిశాయి. మూగభాసలు మొదలయ్యాయి.

నాలోని భయాన్ని కప్పిపుచ్చుకుంటూ ఓ బిస్కెట్ ప్యాకెట్లు సీల్ తీసి తింటున్నట్లు నటించాను. కుక్క గారు కూడా నన్నూ నా చేతిలోని బిస్కెట్‌ని అదే పనిగా చూస్తున్నది. నేను ఇక ఆలోచించదలచుకోలేదు. బిస్కెట్‌ని దాని వద్దకు విసిరాను. అది గడుసరి కుక్క గారే కాదు, జంపింగ్, క్యాచింగ్‌ల్లో కూడా బహు నేర్పరిలా ఉంది. బిస్కెట్ ముక్క గాలిలో ఉండగానే ఎగిరి నోట కరుచుకుంది. కుక్కలకే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఇస్తే ఈ కుక్కగారు పతకం గెల్చుకోవడం ఖాయమని అనుకుంటూ మరో బిస్కెట్ వేశాను. అంతే నేర్పుగా నోట కరుచుకుంది. అలా ఒక్కో బిస్కెట్ తింటున్న కొద్దీ దాని చూపులో నా పట్ల ప్రేమ, అభిమానం కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. ఇది చాలు, నేను విజయం పూర్తిగా సాధించడానికి.

అవును, నేను గెలిచాను. ఆ కుక్కగారు ఇప్పుడు నా కాళ్లు నాకుతూ నా చుట్టూ తిరగాడే పెంపుడు కుక్కగా మారిపోయారు. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లాలన్నప్పుడల్లా నా సాయం తీసుకునే వారు. రెండు మూడు రోజుల్లో ఆ పరిస్థితి దాటిపోయి, మా ఫ్యామిలీ మొత్తాన్నీ తన ప్రేమ చూపులతో ‘ప్యామిలీ ప్యాక్’ క్రింద తన వైపుకు తిప్పుకుంది. ఆ సమయంలోనే దానికి ఓ పేరుపెట్టాలనుకున్నాను.

మరి, పిలవాలి కదా. ‘ఏయ్ కుక్కా రా..’ అంటే దానికి కోపం వచ్చి మళ్ళీ బిగుసుకుపోతే నా ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే కాదా. అందుకే దానికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేశాను.

పాతాళభైరవిలో డింగరీ అన్న పదాన్ని (ఫుట్‌నోట్ : చూ.. 14) పింగళి గారు వాడనే వాడారు కదా. అదే దీనికి పెడదామని అనగానే మా పిల్లలకు ఇదేదో సరదాగా అనిపించి ‘ఒకే’ అనేశారు. ఆ క్షణం నుంచీ డింగరీ మా ఇంట్లో సభ్యత్వం పొందింది. మా అందరి సెక్యూరిటీ బాధ్యతలను తీసేసుకుంది. మా భయం పోయింది. మాకు ఊరట లభించింది. అలా మహానగరంలో ‘తొలి స్వేచ్ఛా పోరాటం’లో విజయం సాధించామన్న మాట.

‘ఏయ్..డింగరీ..’ అనగానే బాణంలా దూసుకు వచ్చేది. మరి ఈ డింగరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత మా ఓనర్‌ని అడిగాను. ఓనర్ గారు వేరే పేటలో ఉంటారు. ఈ ఇల్లు అద్దెకు ఇస్తూ ఉంటారన్న మాట. ఇంతకు ముందు అద్దెకు దిగిన వారు ఈ కుక్కను పెంచుకున్నారట. మంచి బ్రీడ్. గోధుమరంగు ఛాయలో బలిష్టంగా ఉండేది. పెంచిన వాళ్లు మరెందుకో తెలియదు గానీ దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇది వీది కుక్కగా మారిపోయింది. విశ్వాసం సన్నగిల్లక ఇంకా ఆ ఇంటినే పట్టుకుని ఉండేది. అలాంటప్పుడు మేము ఆ ఇంట్లోకి దిగాము. ఇంతకు ముందు దానికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు కదా. అందుకే నేను నా క్షేమం కోసం, నా కుటుంబ క్షేమం కోసం దాన్ని మచ్చిక చేసుకుని డింగరీ అని నామకరణం చేశాను. అదన్న మాట డింగరీ ప్లాష్‌బ్యాక్ స్టోరీ. ఆ ఇల్లు మాకు బాగానే నచ్చింది. కానీ ఇంటికి అతి చేరువలోనే శ్మశానం ఉందన్న సంగతి, ఆ భయాల సంగతి చెప్పకుండా డింగరీ కథ పూర్తి కాదు.

ఇటు ఇల్లు – అటు శ్మశానం:

మా ఇంట్లో వాళ్లకు కుక్కలు, పిల్లులు పెంచుకోవడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా మా ఆవిడికి (శ్రీదేవి) జంతువులను పెంచుకోవడంపై కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. ఏదైతేనేం, మేము ఆ ఇంట్లో ఉన్న ఐదేళ్లూ డింగరీ మా ఇంటి సభ్యులందరికీ సెక్యూరిటీ గార్డ్‌లా పనిచేసింది. మా ఆవిడ బజారుకు వెళ్ళినా తానూ ఆమె వెంట వచ్చేది. నేను అప్పుడు ఆంధ్రప్రభలో పనిచేసేవాడినని చెప్పాను కదా. నాకు నైట్ డ్యూటీలు ఎక్కువ. సిటీ ఎడిషన్ అయ్యాక మోటారు సైకిల్ మీద బంజారాహిల్స్ నుంచి బయలుదేరి ఇంటికి చేరే సరికి ఏ రాత్రి రెండో, రెండున్నరో అయ్యేది. అంత అర్ధరాత్రి వేళ ఇంటికి చేరువకు రాగానే వెహికిల్ చప్పుడు గుర్తుపట్టేసి ఒకటి రెండు ఫర్లాంగుల ముందే నా బండి ముందుకు వచ్చి, ఇంట్లోకి వెళ్ళే దాకా నాకు రక్షణ కల్పించేది. ‘రక్షణ’ అని ఎందుకంటున్నానంటే సరిగా ఆ ప్రాంతంలోనే శ్మశానం ఉంది. పగలంతా శవాలు కాల్చిన నేలలో ఇంకా వేడి తగ్గన్నట్లు ఆ ప్రాంతానికి రాగానే కాస్తంత వెచ్చగా ఉండేది. శ్మశానం గోడ పక్కగా వెళ్ళి మరో మలుపు తిరిగితే మా ఇల్లు వచ్చేది. అసలు శ్మశానం ప్రక్కనే ఇల్లు ఎందుకు తీసుకోవలసి వచ్చింది? ఓ చిన్న పొరపాటు. స్కూల్‌కి దగ్గర్లో ఇల్లు తీసుకుందామన్న తొందరలో ఇల్లు ఫిక్స్ చేసేసి దగ్గర్లోని బస్టాప్ వద్ద సిటీ బస్సు ఎక్కి విండోలో నుంచి ప్రక్కకు చూద్దుము కదా, శ్మశానం గేటు. లోపల కాలుతున్న శవాలు. దూరాన మరో శవం వస్తున్నట్లు డప్పు శబ్దం. సీన్ అర్థమైంది. ఎలా..? వేరే ఇల్లు చూసుకోవాలంటే కుదరదు. అప్పటికే రెండు నెలల అద్దె (నాలుగువేల నాలుగు వందలు) కట్టేశాము. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం. చూస్తూ చూస్తూ వదులుకోలేము. మా బంధువు (పెద్దాయన) దగ్గర ఈ విషయం చెబితే ఆయన నవ్వేస్తూ – ‘ఈ హైదరాబాద్ సంగతి మీకు తెలిసినట్లు లేదబ్బాయి. అసలు ఈ నగరంలో సమాధులు లేని చోటు లేనే లేదు. మరేం భయపడకండి. అయినా శ్మశానం అంటే శివుని స్థలమోయ్, మీ ఆత్మబలం, దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంటుంది’ అని దైర్యం చెప్పారు. ఇక ఏమీ చేసేది లేక సర్దుకుపోయాము. ఒక ఏడాది కాగానే ఇల్లు మారదామనుకున్నాము. కానీ విధి ఆడించే నాటకంలో మన ప్రమేయం ఏమి ఉంటుంది చెప్పండి. ఆ ఇంట్లోనే ఐదేళ్లు ఉండాల్సి వచ్చింది. అది కూడా ఎలాంటి భయాలు లేకుండా. పైగా డింగరీ లాంటి కుక్క మా ప్రక్కన ఉండగా మాకేల చింత అన్నట్లుండేది. డింగరీ మా ఫ్యామిలీకి దేవుడిచ్చిన ‘రక్ష రేకు’. అయితే ఐదేళ్ల తర్వాత మేము ఇళ్లు మారాల్సి వచ్చింది. మరో చోటకు వెళ్ళిపోయాము. డింగరీని కూడా తీసుకు వెళదామనుకున్నాను. కానీ కుదరలేదు. అప్పటికే అది పెద్దదైంది. చురుగ్గా నడవలేకపోతున్నది. ఓ సారి దాని కాలికి గాయం అయింది. రక్తం కారుతోంది. అలాగే ఇంట్లోకి వచ్చింది. నేను పేపర్ చదువుకుంటూ కుర్చీలో కూర్చుని ఉంటే అది నా ప్రక్కనే వచ్చి కూర్చుంది. బాధతో మూలుగుతోంది. నేలమీద రక్తం మరకలున్నాయి. దాని బాధ అర్థం చేసుకున్నాను. శ్రీమతిని పిలిచి గాయాలకు కట్టుకట్టే బ్యాండేజ్ క్లాత్, దూది టించర్ పట్టుకు రమ్మనమన్నాను. నేను క్రింద నేలమీద కూర్చుని గాయమైన డింగరీ కాలుని వొళ్లోకి తీసుకుని దూదితో రక్తం తుడిచాను. టించర్ వేసి బ్యాండేజ్ క్లాత్ చుట్టి ఊడి పోకుండా ముడి వేశాను. ఇంత చేస్తున్నా అది అరవలేదు. కోపంతో ఊగిపోలేదు. తన మంచికే ఇదంతా చేస్తున్నాడన్న భావన, నా పట్ల పూర్తి నమ్మకం, విశ్వాసం దాని కళ్లలో నేను అప్పుడు చూడగలిగాను. కట్టుకట్టాక కుంటూతో బయటకు వెళ్ళింది. ఆ మార్నాడు కట్టు ఊడిపోతే మళ్లీ నా దగ్గరకు వచ్చి కట్టుకట్టమన్నట్లు చూసేది. ఇలా నాలుగు రోజులు గడిచాక గాయం మానింది. మళ్ళీ చలాకీ నడవడం ప్రారంభించింది.

డింగరీకి నివాళి:

అలాంటి డింగరీ మేముండగానే ముసలిదైపోయింది. ఆ పొగరు, ఆ అరుపు తగ్గింది. ఎప్పుడూ మూలన పడుకుని ఉండేది. అదివరకటిలా మాకు ఎస్సార్ట్‌గా ఉండేది కాదు. అయినా ఇంట్లోకి మాత్రం వేరే వాళ్లని రానిచ్చేది కాదు. మా అబ్బాయి ఫ్రెండ్స్ తరచు వస్తుంటే వాళ్లనీ అడ్డగించేది. చివరకు వీళ్లందరినీ తోకాడిస్తూ రానిచ్చేది. మేము ఇల్లు మారినప్పుడు డింగరీని వదలలేక వదిలి వెళ్ళాము. చివర్లో ఓనర్‌కి ఫోన్ చేసి డింగరీని జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు పెట్టాను. అయినా దాని చివరి కాలంలో పెద్దగా చేయలేకపోయానన్న దిగులు మాత్రం ఇప్పటికీ అలాగే ఉండి పోయింది. ఆ తర్వాత కొంత కాలానికి ఎవరి వల్లనో తెలిసింది, డింగరీ చనిపోయిందని.

ఏమిటీ అనుబంధం. ఎందికీ ఆప్యాయత? ఎంత వరకు ఈ బంధం? ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. డింగరీ ఇప్పటికీ మా పిల్లలకు బాగానే గుర్తు. దాని గురించి తలుచుకుంటూనే ఉంటారు. దాని మీద ప్రేమ తగ్గలేదు. మా అమ్మాయి దివ్య వాళ్లబ్బాయిని ముద్దుగా డింగరీ అని పిలవడం అందుకు నిదర్శనం.

డింగరీ నువ్వు ఏ లోకంలో ఉన్నా, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇదే నా నివాళి. ఓం శాంతి శాంతి శాంతిః

మోగ్లీ:

ఏమిటో నా జీవిత యాత్ర చెబుతున్నప్పుడు మరో వీధి కుక్కని కూడా ప్రస్తావించక తప్పడం లేదు. డింగరీ కంటే ముందు జరిగిన సంఘటన ఇప్పుడు నేను చెప్పేది. మేము విజయవాడ సత్యనారాయణపురం – మారుతీ వ్యాయామశాల దగ్గర అద్దెకు ఉన్నప్పుడు ఓ నల్లటి కుక్క నాకూ, మా కుటుంబ సభ్యులకు బాగా దగ్గరైంది. దానికి నేను పెట్టిన పేరు ‘మోగ్లీ’. డింగరీ మొదట్లో నా రాకపోకలను ఎలా ఆటంకపరిచేదో అలాగే ఈ మోగ్లీ కూడా. దీన్ని లొంగదీసుకోవడానికి వాడిన టెక్నిక్‌నే ఆ తర్వాత డింగరీ విషయంలోనూ ఉపయోగించానన్నమాట. డింగరీ గోధుమ రంగు ఛాయలో ఉంటే ఈ మోగ్లీ గాడేమో నల్లగా జంగిల్ బుక్‌లో భగీరా లాగా ఉండేది. కాకపోతే ఇదేమో కుక్క అంతే తేడా. చీకట్లో ఏ మాత్రం వెలుతురు పడినా మోగ్లీ కళ్లు మిలమిలా మెరిసేవి. అంతే చురుగ్గా మీదకు లంఘించేది. అందుకే ఆ వీధిలో దీన్ని చూస్తే భయం. నేను విజయవాడలో పనిచేస్తున్నప్పుడు రాత్రి వేళ నా టూవీలర్ (మోటార్ సైకిల్ కాదులేండీ, అప్పుట్లో టివీఎస్ మోపెడ్ ఉండేది అదన్న మాట)మీద ఇంటికి చేరగానే మొదట్లో ఎటాక్ చేసేది. మచ్చిక అయిన తర్వాత తోకాడిస్తూ నా వెంటే లోపలకి వచ్చేది.

మా ఆవిడకి రెండవ కాన్పు విజయవాడలోని సత్యానారాయణ పురంలోని జనాతా క్లినిక్‌లో జరిగింది. నొప్పులు వస్తుంటే ఆస్పత్రికి తీసుకు వెళుతుంటే ఈ మోగ్లీ కూడా రిక్షా వెనుకే ఆస్పత్రిదాకా వెళ్ళింది. చిత్రమేమంటే శుక్రవారం ఉదయం మా అమ్మాయి (దివ్య) పుట్టినప్పుడు మగవాళ్లమంతా ఇంట్లోనే పడుకుంటే మోగ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం దగ్గర అదో రకంగా అరుస్తూ పిల్లిమొగ్గలు కొడుతోంది. ఏమిటా ఇది ఇలా చేస్తున్నదని అనుకుంటూ మా బావమరిది (మారుతీ ప్రసాద్)ని తోడు రాగా ఆస్పత్రికి వెళ్ళాము. ఓ అరగంట క్రితమే పాప పుట్టిందని చెప్పారు. అప్పుడు అర్థమైంది ఈ శుభవార్తను ఆస్పత్రి నుంచి ఇంటికి చేరవేయడానికే మోగ్లీ పరుగుపరుగున వచ్చిందనీ, అందుకే ఇంటి గుమ్మం ముందు ‘ఆనంద నాట్యం’ చేసిందని. మా అమ్మాయికి (పాపాయిగా ఉన్నప్పుడు) కూడా ఈ మోగ్లీ అంటే భయం ఉండేది కాదు. ఇదేమో పారాడుకుంటూ గుమ్మం దగ్గరకు వస్తే, అదేమో గుమ్మం అవతల నిలబడి పాపాయిని ప్రేమగా చూడటం నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.

ప్రేమ, ఆప్యాయత ఎక్కడ ఉంటే మూగజీవాలు అక్కడే ఉంటాయి. మన చుట్టూనే తిరుగుతాయి. మన క్షేమం ప్రతి క్షణం ఆలోచిస్తుంటాయన్న సత్యం ఈ రెండు సంఘటనల కంటే ముందే , నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే అర్థమైంది. ఆ ముచ్చట్లోకి..

తువ్వాయి:

అడవిరావులపాడు గ్రామంలో మా చిన్నప్పుడు పాడి పంట సమృద్ధిగా ఉండేవి. మా బామ్మ (అన్నపూర్ణమ్మ) గారు వ్యవసాయం పనులు చూడటం కోసం ఎప్పుడూ ఈ పల్లెనే అంటిబెట్టుకుని ఉండేవారు. నాన్నగారిది బదలీల మీద తిరిగే ఉద్యోగం. నాన్నలది ట్రాన్సఫరబుల్ ఉద్యోగమైతే పిల్లలు కూడా అనేక ఊర్లు చిన్నతనంలోనే చూసేయొచ్చన్న మాట. వేసవి సెలవులప్పుడు ఎంచక్కా సొంత ఊరు వెళ్లొచ్చన్న మాట. అలా ఓసారి అడవిరావులపాడు వెళ్ళినప్పుడు ఓ ఆవు దూడ నాకెంతో ఇష్టమైన ఫ్రెండ్ అయిపోయింది. దీన్ని ‘తువ్వాయి’ అని పిలుచుకునే వాడ్ని. ఇదేమో ఎర్రగా ఉన్నా తెల్లటి చుక్కలతో బలే గమ్మత్తుగా ఉండేది. మా ఇంట్లో ఆ రోజుల్లో పదకొండు దాకా ఆవులు, దూడలు ఉండేవి. ఓ రెండు కోడెలు, ఇంకో రెండు ఎద్దులు కూడా ఉండేవి. వీటన్నింటితో గొడ్ల కొష్టం కళకళలాడుతుండేది. తువ్వాయితో స్నేహం బాగా కుదరగానే సెలవులు అయిపోయేవి. బామ్మ బండి కట్టించేది. చూడటానికి ఎడ్ల బండే అయినా దానికి గూడు కట్టి అందంగా అలంకరించేవారు. కూర్చోవడానికి ఎండు గడ్డితో మెత్తలు పరిచేవారు. తొట్టిలో కూర్చుని జీతగాడు బండి నడిపేవాడు. అప్పుడప్పుడు మా చేత బండి నడిపించే వాడు. అయితే ఈ విషయం ఎడ్లకు ఎలా తెలిసేదో నాకు అర్థం కాలేదు గానీ, నాబోటి వాడు తొట్టిలో కూర్చుని బండి నడపడం మొదలుపెట్టగానే అవి నత్తనడక నడిచేవి. మొండికేసేవి. అదే జీతగాడు తొట్టిలో కూర్చుని తనదైన భాషలో – ‘ఓసి నీ సిగతరగ’, ‘నిన్ను బందెల దొడ్లోకి తోల’ వంటి పదాలతో అదిలిస్తుంటే ఎడ్లు నడకలో వేగం పెంచేవి. ఇంకో గమ్మత్తు చెప్పనా, ఇంటి నుంచి వేరే ఊరికి వెళ్లేటప్పుడు కంటే సొంత ఊరికి చేరేటప్పుడు మాత్రం జీతగాడు అదిలించక పోయినా ఎడ్లు ఉత్సాహంతో పరుగులు పెట్టేవి. ఇంటికి తొందరగా చేరడం కోసం అన్న మాట. మా అన్నయ్యేమో ఎడ్లకు కోడె దూడలకు పేర్లు కూడా పెట్టేవాడు. ఒక ఎద్దుకు ‘కాటుక కళ్లది’ అని, మరో దానికేమో ‘బూడిద కళ్లది’ అని. ఎందుకంటే ఒక దాని కళ్ల దగ్గరేమో కాటుక పూసినట్లు చారలుంటే, మరో దానికి బూడిద పూసినట్లు కళ్ళ దగ్గర చారలుండేవి. చాలా చోట్ల ఎద్దులకు రాముడు – భీముడు అనో, రామ్-శ్యామ్ అనో రామ-లక్షణ్ అనో పెట్టేవారు. ట్రైనింగ్ ఇస్తే ఎద్దులు భలే హుషారుగా యజమాని చెప్పినట్లు నడుచుకునేవి. బండి కాడె కూడా తలలు వంచేసి కొమ్ములతో పైకి లేపి మోపు మీద వాటంతట అవే వేసుకునేవి. అలాగే ఆవులకు పేర్లు పెట్టడం పల్లెటూర్లలో మామూలే. ఎఱ్రది, బోడిది (దాని కొమ్ములు చాలా చిన్నవి), నల్ల మచ్చలది, తెల్ల మచ్చలది, కర్రిది (నల్లగా ఉండేది), తిక్కది (దానికి కోపం జాస్తి), పొగరుబోతు, మంచావు, మొండావు.. ఇలా పేర్లు పెట్టేవారు.

వాటన్నింటి సంగతి ఎలా ఉన్నా నా బుజ్జి ఆవు దూడకు నేను పెట్టిన పేరు మాత్రం ‘తువ్వాయి’. సెలవలు అవగానే గూడు బండి కట్టించి మమ్మల్ని నందిగామ పంపేది మా బామ్మ. అక్కడి నుంచి బస్సు ఎక్కి పట్నం పోతుండే వాళ్లం. మళ్ళీ వేసవి సెలవులకే రావడం. ఏటికేడు తువ్వాయి బాగా పెరిగిపోతున్నది. అలాగే మా నడుమ స్నేహం కూడానూ. ఓ సారి మేము బండి కట్టించుకుని తిరుగు ప్రయాణంలో ఉంటే ఈ తువ్వాయి గాడు బండి వెనకే చాలా దూరం వచ్చాడు. వాడికి నేనంటే అంత ప్రేమ అన్న మాట. ఆ తర్వాత చాలాకాలానికి సొంత వ్యవసాయం ఆపేసినప్పుడు ఆవులను, ఎద్దులను ఒకటొకిటిగా అమ్మేశారు. అప్పటికే తువ్వాయి కాస్తా ఆవుగా, అమ్మగా.. అమ్మమ్మగా మారే ఉంటుంది. ఆ తరువాత అదెప్పుడూ నాకు కనబడలేదు. ఒక వేళ కనిపించినా నేను గుర్తుపట్టలేదేమో. ఏమో..

ఆటుకుట్టి:

మేకపిల్లను తమిళంలో ఆటుకుట్టి అంటారు. కుట్టి అన్న పదం పిల్లలకు అక్కడ ముద్దుపేరుగా పెట్టే వారు. మా అక్క వరలక్ష్మి పెళ్ళి మద్దాలి సీతారామారావు గారితో జరిగింది. అప్పటికే బావగారు మద్రాసులో పనిచేస్తుండటంతో అక్కడే సెటిల్ అయ్యారు. వారికి ఇద్దరు మగపిల్లలు. పెద్దవాడు విజయ్, చిన్నవాడు అజయ్. మా పెళ్ళప్పుటికి వీళ్లిద్దరూ 5 నుంచి ఏడేళ్ల వయసు వాళ్లు. మాకు అబ్బాయి (రాజేష్) పుట్టాడు. వాడు పుట్టినప్పటి నుంచీ సన్నగా బక్కపలచగానే ఉండేవాడు. మద్రాసు నుంచి ఈ పిల్లలు వస్తూ రాగానే వీడిని చూస్తూ – ‘అమ్మా వీడు ఆటుకుట్టిలాగా ఉన్నాడే..’ అనడం మొదలుపెట్టారు. ఇదీ సంగతి. అప్పటి నుంచి మా వాడి ముద్దుపేరు ‘ఆటుకుట్టి’ అయింది. ఎంత పెద్దయినా వాడి అమ్మ మాత్రం – ‘కుట్టీ.. కుట్టీ’ అంటూ ప్రేమగా పిలుచుకుంటూనే ఉంది. చిత్రమే, తమిళనాడులోని ముద్దు పేరు ఇలా మా ఇంట్లో పాపులరవడం.

మూగజీవాలను మరువకండి:

శ్రీదేవితో నా పెళ్ళి 1985 ఏప్రిల్ 24న గుంటూరులోని కృష్ణనగర్ – బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వరా కల్యాణ మంటపంలో జరిగింది. మా అత్తగారు లక్ష్మీరాజ్యం, మామగారేమో మన్నవ గిరిధర రావు గారు. ఇదెందుకు ప్రస్తావిస్తున్నానంటే, మామగారికి మూగజీవాల పట్ల ప్రేమ ఎక్కువ అని చెప్పడానికి. ఆయన తరచూ చెబుతుండే వారు ఆవులు, కుక్కలు, పక్షులు ఇలాంటి వాటికి రోజూ ఆహారం, నీరు అందజేస్తే మనకు సంతోషంతో పాటు జీవితం ఆనందకరమం అవుతుందనీ, మనం గతంలో చేసిన పాప కర్మల ఫలం నశిస్తుందని చెప్పేవారు. ఆయన రోజూ పక్షుల కోసం గింజలు, చీమల కోసం బెల్లం ముక్కలు, ఆవుల కోసం కూరగాయలు పండ్లు వంటివి రెడీగా ఉంచేవారు. దాహంతో వచ్చే పశువుల కోసం ఇంటి ముందు నీటి తొట్టి లాంటిది పెట్టి అందులో నీరు పోసి ఉంచేవారు. మమ్మల్ని కూడా అలా చేయమనేవారు. ఆయన నేతృత్వంలో చాలాకాలం వచ్చిన భారతీయ మార్గం మాసపత్రికలోనూ, ఇంకా ఆయన వ్రాసిన కొన్ని పుస్తకాల్లోనూ (హిందూ ధర్మ వైభవం, మణి పూసలు, కాంతిరేఖలు వంటివి వాటిల్లోనూ) ఈ ప్రస్తావన తీసుకువచ్చేవారు. మనవళ్లకీ, మనవరాళ్లకీ కథల రూపంలో ఇలాంటి మంచి సంగతులు బోలెడు చెప్పేవారు. ఇలాంటి తాతలు దొరకడం మనవళ్లు, మనవరాళ్ల అదృష్టమే కదా.

విశాలమైన ఇళ్లు మనకు లేకపోవచ్చు. కానీ విశాలమైన మనసు ఉంటే మూగజీవలకు ఇంత పెట్టడం, మనమూ ఆనంద పడటం పెద్ద కష్టమేమీ కాదు. ఓ సారి ఆలోచించండి.

ఇలా నా జీవన యాత్రలో తమతమ పాత్రలు పోషించిన మూగజీవాలను గుర్తుచేసుకుంటూ, ఆ విశేషాలను మీతో పంచుకునే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది.

ఫుట్‌నోట్:

14. డింగరీ: 1951లో విడుదలైన పాతాళభైరవి సినిమా కోసం పింగళి గారు డింగరీ అన్న పదం వాడారు. అందులో నేపాలీ మాంత్రికుడైన ఎస్వీఆర్ తన శిష్యుడిని ప్రేమగా డింగరీ అని అంటూ ఉంటాడు. పింగళిగారు మాటల చాతుర్యం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అనేక పదాలను ఆయన సృష్టించారు. ఈ పదం కూడా ఆయన సృష్టి అని నేనూ అనుకున్నాను. అయితే ఈ మధ్యనే తెలిసింది, ఆయన ఈ డింగరీ అన్న పదాన్ని ఓ ఇంటి పేరు (సర్‌నేమ్) నుంచి తీసుకున్నారని. ఆ తర్వాత తోడికోడళ్లు సినిమా (1957) లో కొసరాజు జానపద గీతం వ్రాస్తూ – ‘టౌను పక్కకెళ్లద్దురా డింగరీ’ అంటూ పాట వ్రాశారు. ఈ పదం జర్నలిస్టులను అనేక సార్లు హెడ్డింగ్ లు పెట్టేటప్పుడు ఆదుకున్నది. ఆంధ్రప్రభలో పనిచేసేటప్పుడు అనేక సార్లు ఈ పదం మిక్స్ చేస్తూ హెడ్ లైన్లు పెట్టినట్లు గుర్తు. ‘రైలు ప్రక్కకెళ్లద్దురా డింగరీ..’ అనో, ‘ఇంకేమీ చేయవలెరా డింగరీ’ అనో ఇలా సందర్భోచితంగా డింగరీని వాడేసి అరగదీశారు మా వాళ్లు. సరే నేను కుక్కకి ఈ పేరు పెట్టి ఆ పేరుని ఇంట్లో బాగా అరగదీశాననుకోండి. ఇదీ సంగతి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here