తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-17

2
10

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ఏరువాక సాగారో:

తెల్లవారుఝాము. మంచి నిద్రలో ఉన్నాను. నేనప్పటికి ఇంకా చిన్న పిల్లాడినే. మహా ఉంటే ఎనిమిదేళ్లు ఉంటాయేమో. అమ్మ నన్ను లేపడానికి దాదాపుగా అరుస్తున్నట్లే కేకలు పెడుతోంది. గాజుల చేతితో నా వీపునీ, బుజాలను తట్టి లేపుతోంది. నాకిష్టమైన వాటిలో అమ్మ చేతి గాజుల సవ్వడి ఒకటి. ఆ సవ్వడి వినబడుతూనే ఉంది. కానీ వెంటనే లేవకుండానే, మంచానికి మరో వైపుకి తిరిగినా అమ్మ ఊరుకోలేదు. తట్టి లేపుతునే ఉంది.

‘లేరా, తెల్లారొస్తోంది. లేచి త్వరగా తయారవ్వు. పొలం దున్నడానికి వెళ్లాలి గదరా’

ఈ మాటలతో నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. ఛటక్కున మంచం దిగేశాను. హాడావుడిగా దొడ్లోకి పరిగెత్తి ఇంటికి ఈశాన్య మూలన ఉన్న బావి దగ్గరకు పరిగెత్తాను. అప్పటికే చిన జీతగాడు బక్కెటుతో నీళ్లు తోడి సిద్ధంగా ఉంచాడు. ప్రక్కన ఒక చెంబు కూడా ఉంది. బావి ప్రక్కనే ఒక రాయి మీద ఎర్ర పళ్ల పొడి ప్యాకెట్లు, ప్రక్కనే ఒకే సైజులో చింపిన తాటాకు ముక్కలు కూడా పెట్టడం ఓ అలవాటు. తాటాకు బద్దలతో నాలుక శుభ్రం చేసుకునేవాళ్లం. ఆ రోజుల్లో పళ్ల పొడి వాడటమే గొప్ప. పట్నం నుంచి వచ్చామని మా బామ్మ ఎర్ర పళ్లపొడి పొట్లాలు తెప్పించింది. తెల్ల పళ్లపొడి కూడా అమ్మేవారు. ఎర్ర పొడి కంటే తెల్ల పళ్లపొడి నాకు బాగా ఇష్టం. అప్పట్లో పల్లెల్లోకి టూత్ పేస్టులు, బ్రష్‌లు, టంగ్ క్లీనర్స్ వంటివి వాడకం లేవు. చాలా కాలం తర్వాత బినాకా టూత్ పేస్టు మార్కెట్ లోకి వచ్చింది. బినాకా వాడైతే టూత్ పేస్ట్‌తో పాటుగా చిన్నచిన్న బొమ్మలు ఇచ్చేవాడు. వాటి కోసం అదే కావాలని మారాము చేసేవాళ్లం. ఇంకా పెద్దయ్యాక రేడియోలో బినాకా గీతమాల అనే కార్యక్రమం వినేవాడ్ని.

నేను వెంటనే ఎర్ర పళ్లపొడి చేతిలో వేసుకుని చూపుడు వేలితో పళ్లు తోముకుని పుక్కిలిస్తుంటే, అమ్మ – ‘ఒరేయ్ అంత హడావిడి ఎందుకురా, నీవు రెడీ కాకుండా అరక కట్టేసి పొలానికి వెళ్లర్లేరా’ – అంది.

వేప పుల్ల – చేత చెంబు:

ఆ రోజుల్లో పళ్లు తోముకోవడానికి ఊర్లో వాళ్లు వేప పుల్లలు ఎక్కువగా వాడే వారు. అవేమో నోట్లో పెట్టుకుని కాస్త నమలగానే నోరంతా చేదు. ఆ చేదుకి నాకేమో నోట్లో లాలాజలం ఊరి వాంతులు వచ్చేటంత పని అయ్యేది. బక్కెట్లో నీళ్లతో ఎంతగా పుక్కిలించినా ఆ చేదు ఒక పట్టాన పోయేది కాదు.

ఇదంతా 1960ల దశకంలో మా ఊరు అడవిరావుల పాడులో జరిగిన సంఘటన. మా ఊర్లో అన్ని కులాల వారు పొద్దున్నే పందోము పుళ్లలతోనే దంతధావనం చేసుకునేవారు. పుల్ల నోట్లో పెట్టుకునే వీధుల్లో తిరుగుతూ కొన్ని పనులు కూడా చేస్తుండేవారు. వాటిలో పొద్దున్నే అర్జెంట్‌గా వెళ్ళాల్సిన ‘రెండో’ పని కూడా ఉండేది. ఆ రోజుల్లో టాయిలెట్స్ ఉండేవి కావు. బహిర్భూమికి వెళ్ళి విసర్జన తంతు ముగించుకోవాల్సిందే. చేతిలో తీసుకువెళ్ళే చెంబు నీళ్లు చాలకపోతే వాగులో నీరు వాడుకోవాల్సిందే. అయితే ఈ పని పూర్తి చేసుకోవడం కోసం ఊర్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలు ఉండేవి. మరుగు ఎక్కువగా ఉండే ప్రదేశాలను స్త్రీలు ఉపయోగించుకునేవారు. మరుగు అంటే తుమ్మ చెట్లో, గుబురుగా పెరిగిన ఇతర చెట్లు ఉన్న ప్రాంతాలన్న మాట. ఊరికి వాగు చాలా ముఖ్యం. ఇది మా ఊరి ప్రజల జీవన విధానంలో అంతర్భాగం. వాగు పొంగితే ప్రక్కనే ఉన్న నందిగామతో సంబంధాలు తెగిపోతుండేవి. నందిగామ వెళ్లకుండా రావులపాడు ప్రజలకు పూటగడవదు. నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లు ఒకటేమిటీ అన్నీ నందిగామకు వెళ్ళి కొనుక్కోవల్సిందే.

మెట్ట సాగు:

వ్యవసాయం – ఇది ఊరి జీవనానికి ప్రధాన ఆధారం. ఇక్కడ మెట్ట పొలాలే అధికం. వర్షాధార పంటలనే ఎక్కువగా పండిస్తుంటారు. వ్యవసాయం చుట్టూనే ఊరి బతుకులు ముడిపడి ఉండేవి. మాది కూడా రైతు కుటుంబమే. నాకు గుర్తున్నప్పటికి 40 నుంచి 50 ఎకరాల పొలం ఉండేది. అయితే ఇదంతా ఒక చోటనే ఉండేది కాదు. ఊరికి మూడు వైపులా ఉండేవి. అందులో రాయలవారి చేను అని పిలుచుకునే పొలం బాగా పండేదని మా నాన్నగారు తరచూ చెబుతుండేవారు. అందుకే ఆ పొలం పేరు చెప్పగానే దాన్ని ఎలాగైనా చూడాలని అనుకుంటూ ఉండేవాణ్ణి. కాకపోతే చిన్న పిల్లాడ్ని కదా. నన్ను పొలం దగ్గరకు ఎవరు తీసుకువెళతారు? ఇంట్లో బామ్మ, అమ్మ నాన్న, పెద్ద జీతగాడు దగ్గర నుంచి చినజీతగాడి దాకా నన్నో పసికందుగా చూస్తుంటారాయె. అందుకు తగ్గట్టుగానే నేనేమో బక్కగా ఉండేవాడ్ని. పైగా నాలుగు రోజులు బాగుంటే ఐదో రోజు జలుబు వస్తుండేది. నాది మొదటి నుంచి అంతంత మాత్రపు ఆరోగ్యమే. ఇప్పటికీ అంతేలేండి. ఎండలో పట్టుమని పది నిమిషాలు నిలబడలేను. చదువులు పూర్తయ్యాక ఫ్యాన్ క్రింద ఉద్యోగాలే చేయాలని గట్టిగా అనుకున్నాను. దేవతలు నా మొర విన్నట్లున్నారు. నేను చేసిన ఉద్యోగాలన్నీ అలాంటివే. ఈ విషయంలో ఫ్యాన్ నుంచి ఏసీకి ఎదిగాననుకోండి. జర్నలిస్ట్ ఉద్యోగాలంటే రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి బయట తిరుగుతూ వార్తలు సేకరిస్తూ వాటిని ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్‌కి పంపేవి కాగా మరొకటి – ఇలా వచ్చే వార్తల ప్రాధాన్యతను అర్థం చేసుకుంటూ వాటిని ఎడిట్ చేసి పేపర్లో వేసేలా చేయడం అన్న మాట. ఎడిటోరియల్ డెస్క్‌లో పనిచేసే ఉద్యోగులు బయట తిరగాల్సిన అవసరం ఎప్పుడో గాని ఉండదు. సబ్ ఎడిటర్ దగ్గర నుంచి ఎడిటర్ దాకా ఉండే ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్ చాలా కీలకమైనది. నిర్ణయాధికారమంతా ఈ డిపార్ట్‌మెంట్‌దే. అలాంటి డిపార్ట్‌మెంట్‌లో శ్రద్ధగా పనిచేయడం ఆఫీస్‌లో నాకెంతో ఎంతో గౌరవం తెచ్చిపెట్టింది.

గిత్తల సొగసు చూడతరమా:

ఎండల్లో తిరగలేని నేను పొలానికి ఆ రోజున మొదటి సారి బయలుదేరానన్న మాట. స్నానం చేసేయగానే అమ్మ కొత్త బట్టలు తొడిగింది. నుదుట కుంకుమ బొట్టు పెట్టింది. అసలు ఆ రోజున నేనూ నాతో పాటుగా నాన్న, అన్నయ్య కూడా పొలానికి వెళ్ళాలని ఓ పదిరోజుల నుంచీ అనుకుంటున్నదే. అందుకే ఈ హడావుడి.

ఆ రోజు ఏరువాక పౌర్ణమి (ఫుట్ నోట్ చూ.16). ఆ రోజు వ్యవసాయ కుటుంబాల వారికి పెద్ద పండుగ. ఆ ఏటికి సాగు ప్రారంభించే శుభముహూర్తం ఇదే. పొలం దగ్గరకు వెళ్లి భూమి పూజ చేసి, తొలి సాలు దున్నాలి. అందుకే ఈ హడావిడంతా. ఆ కాసేపు నేనో బుజ్జి రైతునన్నమాట ఇవన్నీ అమ్మ నాకు ముందే చెప్పింది. సరే, మా బామ్మ హడావుడి అంతా ఇంతా కాదు. వారం రోజుల ముందే నందిగామకు మనిషిని పంపించి గిత్తలకు అలంకార వస్తువులు తెప్పించింది. వాటి కొమ్ములకు రంగులు వేయించింది. దీంతో అవి మెరిసిపోయాయి. అక్కడితో ఆగలేదు. మెడలో మువ్వలు, గంటలున్న బెల్టులు కట్టించింది. వీపుకేమో అద్దాల చమకీలు అమర్చి రంగురంగు కుచ్చులు ఉన్న నడుం బెల్టులు బిగింపం జేసింది. అవి కట్టి వాటి నడుము సోకు చూసి జీతగాడు మురిసిపోయాడు. ఏరువాక పౌర్ణమికి ముందు రోజు సాయంత్రమే గిత్తలను బావి దగ్గరకు తీసుకు వెళ్ళి స్నానాలు చేయించింది. కొబ్బరి పీచుతో వాటి ఒళ్లు తోమించింది. అప్పుడు చూడాలి మా సందడి. అసలే కోడె గిత్తలాయె – చల్లనీరు తగలగానే తప్పించుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టేవి. జీతగాళ్లేమో వాటిని అదిలించి మళ్ళీ నూతి దగ్గరకు తీసుకురావడం, అవేమో గారాలు పోవడం. ఇదంతా భలే సరదాగా ఉంది. మేము వాటి దగ్గరకు పోబోతుంటే, ‘అబ్బాయి గారూ మీరు దూరం జరగండి. ఈ బూడిద కళ్లది మహా పొగరబోతుది, మిమ్మల్ని కుమ్మేయగలదు’ – అంటూ హెచ్చరించడం. అందుకు తగ్గట్టుగానే మేమూ భయపడి దూరం జరిగి, అంతలోనే మళ్ళీ సరదా పడి వాటి దగ్గరకు పోవడం – ఇదంతా చాలా గమ్మత్తుగా జరిగిపోయింది. ఈ హడావిడంతా అయ్యే సరికి చీకటి పడింది. చిన్న జీతగాడు కిరోసిన్ దీపపు బుడ్లను, లాంతరు గాజు గుబ్బను పాత గుడ్డతో తుడిచాడు. ఇలా తుడవడాని కోసం గుడ్డలో కాస్తంత ముగ్గు పొడి వేసి తుడిచాడు. అలా తుడవగానే అప్పటి వరకు నల్లగా మసక బారిన గాజు బుడ్లు, గుబ్బలు తళతళలాడాయి, అచ్చు మా ఇంటి గిత్తల్లా.

కాస్తంత చీకటి పడగానే అమ్మ మమ్మల్ని భోజనాలకు రమ్మన్నది. భోజనాలు చేస్తున్నంత సేపూ కొష్టం వైపునే నా చూపులు. అలంకరించిన గిత్తలు కదులుతుంటే వాటి మెడలో కట్టిన గంటలు మ్రోగుతున్నాయి. మువ్వల చప్పుడు ఈ గంటల మోతలో మిళితమై చక్కటి సంగీతంలా వినిపించింది. భోజనాలు కానిచ్చాక కాసేపు – రేపు పొలం దగ్గర చేసే పూజలు, పొలం దున్నడం వంటి కబుర్లు అమ్మ చెబుతుండగానే నాకేమో నిద్ర పట్టేసింది. అదిగో అలా పడుకున్న నాకు మళ్ళీ అమ్మ తట్టిలేపడంతోనే మెలుకువ వచ్చిందన్న మాట.

ఇంకా తెల్లవారలేదు. అయితే తూర్పున ఆకాశంలో అప్పటి వరకు ఉన్న చీకటి తగ్గి ఎరువు రంగు చోటుచేసుకోవడం మొదలైంది. ఆ వింత చూస్తుండగానే ఎద్దులకు అరక కట్టే పని జీతగాడు పూర్తి చేశాడు. అప్పుడు చూడాలి ఆ ఎద్దుల ఠీవి. వాటి మోపురాలకు కూడా ఏవేవో రంగుల కుచ్చులు చుట్టారు. అసలే అందంగా ఉండే కోడె గిత్తలు ఈ అలంకరణలతో మరింత అందంగా కనిపించాయి. పెళ్ళి కొడుకుల్లా సింగారించుకున్నాయి. ఒక దాని పేరు బూడిద కళ్లది అయితే రెండో దాని పేరు కాటుక కళ్లది. ఒక దాని సింగారం మరొకటి చూసుకుంటూ మురిసిపోయినట్లు ఆ కళ్లు చెబుతున్నాయి.

అంతలో అమ్మ, అక్క చెరో పళ్లెం పట్టుకుని వచ్చారు. పళ్లాల్లో పూలు, పసుపు, కుంకుమ వంటి పూజా సామాగ్రి ఉన్నాయి. జీతగాడు గిత్తలను పట్టుకుంటే అమ్మేమో జాగ్రత్తగా వాటికి నుదిటి మీద కుంకుమ బొట్లు పెట్టి వాటిమీద పూలు జల్లింది. అమ్మా అక్కా ఇంట్లోనే ఉండిపోయారు. ఇక మేము పొలానికి బయలుదేరాము. కోడెలకు కట్టిన గంటల చప్పుడు శ్రావ్యంగా వినపిస్తుంటే మా అరక ఊరు దాటి డొంక దారిబట్టి పొలానికి చేరే సరికి పూర్తిగా తెల్లారింది. పొలం దగ్గర నాన్న గారు గిత్తలకు, అరకకు, వాటికి అమర్చిన పరికరాలకు పూజలు చేశారు. మా చేత చేయించారు. ఆ తర్వాత పొలంలోని ఒక రాయి దగ్గరకి వెళ్ళి దాని మీద పసుపు కుంకుమ జల్లి కొబ్బరి కాయలు కొట్టారు. నాకూ ఒక కొబ్బరికాయ ఇచ్చారు, కానీ నా బలం చాలలేదు. దీంతో నాన్నగారే నా చేతిలోని కాయ లాక్కుని కొట్టేశారు. నేను నాన్న వైపు కోపంగా చూశాను. కానీ ఆయన నా బక్క కోపాన్ని ఏమాత్రం పట్టించుకుండా అరక సాయంతో నాగలి సాలు దున్నడం మొదలెట్టారు. అరకకు నాగలి బిగించినట్లే పొలం దున్నే మరికొన్ని పరికరాలు కూడా అమరుస్తారు. వాటిలో గొర్రు (విత్తనాలు భూమిలో నాటడానికి వాడే పరికరం), మేడి (అరక దున్నడానికి వాడే హ్యాండిల్ లాంటిది), కర్రు (ఇనుముతో చేసిన పరికరం, భూమి దున్నడానికి సాయపడే పరికరం) వంటివి ఉండేవి. చదును చేసేందుకు మరో రకం పరికరం ఉండేది. ట్రాక్టర్లు రంగప్రవేశం అరక, ఎద్దుల సాయం లేకుండానే పొలం పనులు చకచకా జరిగిపోతున్నాయి. దీంతో ఎద్దులను వేరే పనులకు వాడుతున్నారు. నందిగామలో ఇప్పటికీ తెల్లవారుఝామున ఇసుక బండ్లు వస్తుంటాయి. వాటిని లాగేది ఎడ్లే.

కాసేపు నాన్నగారు పొలం దున్నాక మా చేత నాగలి పట్టుకోనిచ్చారు. అన్న, నేను చెరో వైపున ఉంటే నాన్నగారు మా చేత జాగ్రత్తగా పొలం దున్నించారు. ఇలా పిల్లల చేత దున్నిస్తే భూమాత సంతోషించి ఆ కుటుంబానికి ఇబ్బడి ముబ్బడిగా పంటనిస్తుందట. నా జీవితంలో ఏరువాక నాడు పొలానికి వెళ్ళి దున్నడం ఇదొక్క సారే జరిగింది. ఆ తర్వాత, మరెందుకో తెలియదు కానీ ఏరువాక పండక్కి పొలానికి వెళ్లనే లేదు. చాలు.. ఒక్క మధుర సంఘటన చాలు, జీవితకాలం గుర్తుంచుకోవడానికి. అలా నా మనసులో ఈ ఏరువాక ముచ్చట చెరగని ముద్రవేసింది. ఇప్పుడు నాగళ్లు కట్టుకుని అరక తోలుకుంటూ పొలానికి వెళ్ళి ఏరువాక దుక్కి దున్నే వాళ్లు ఉన్నారో లేదో నాకు తెలియదు.

ఏరువాక అనగానే నాకైతే ఇప్పటికీ ‘రోజులు మారాయి’ (1955) సినిమాలోని పాట గుర్తుకు వస్తూనే ఉంటుంది. కొసరాజు గారు వ్రాసిన ఈ పాటంటే నాకెంతో ఇష్టం. ఆనాటి పల్లె వాతావరణం, మరీ ముఖ్యంగా ఏరువాక పండుగ విశిష్టత చెబుతూనే మరో ప్రక్కన పొలాలు అమ్ముకుని టౌన్‌లో మేడలు కట్టేవారిపై చురకలు వేసిన పాట ఇది.

‘కల్లాకపటం కానని వాడ

లోకం పోకడ తెలియని వాడ

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా

నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా..’

ఈ పాటలో ‘చద్ది అన్నం’, ‘ముల్లగర్ర’ (ఒక కర్రకు చిన్న ఇనుప ముల్లు బిగించి ఉంటుంది, గిత్తలను అదిలించడానికి వాడే కర్ర), ‘కోటేరు’ (కాడి మీద నాగలిని సరిగా సెట్ చేయడం), ‘ఎలపడ- దాపడ’ (అరకకు ఎడమ కుడి వైపున ఉన్న ఎడ్లను అలా పిలుస్తారు) వంటి పదాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

పొలం బతుకులు:

మా ఊరి పొలాల గురించీ పొలం బతుకుల గురించి ఈ సందర్భంగా కొన్ని విశేషాలు చెబుతాను.

మా ఊరు అడవిరావులపాడు ఒక అగ్రహారం. ఒకప్పుడు చిట్టడవి. అందులో కూడా తుమ్మ చెట్లు విస్తారంగా పెరిగే ప్రాంతం. మా పూర్వీకులకు ఈనాం క్రింద సుమారు 11వందల ఎకరాల పొలంతో కూడిన ఈ ప్రాంతం లభించింది. ప్రస్తుతం (2024) నాటికి ఇందులో 120 ఎకరాలు మాత్రమే అగ్రహారీకుల సాగుబడిలో ఉంది. మిగతా పొలం అంతా అన్యక్రాంతమైంది. ఇక్కడి పొలాలు మొదటి నుంచీ మెట్ట పొలాలే. అంటే వర్షాధార భూమూలే. వర్షం ఎక్కువ పడినా, తక్కువ పడినా ఆ ఏడు పంట నష్టాన్ని రైతు చవిచూడాల్సిందే. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీరు విడుదలైనప్పటికీ కొసభూములు కావడంతో అధిక శాతం పొలాలు మాగాణిగా మారలేకపోయాయి. ఒకటో అరో మారినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చటే అయింది. అప్పట్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పొలాల వద్దకు తవ్వించిన కాల్వలు, వేయించిన గట్లు నిరుపయోగమయ్యాయి. అప్పట్లో పెట్టిన ఖర్చు బూడిదపాలైంది. కొస భూములు సంపూర్ణంగా మాగాణీ క్షేత్రాలు మారతాయన్న కోరిక తీరలేదు.

ఒక్క మా ఊర్లోనే కాదు, నందిగామ మండలం అంతా మెట్ల భూములే ఎక్కువ. కందులు, జొన్నలు, పెసలు వంటివి బాగా పండేవి. ఆ రోజుల్లో మా ఇంటి ముందు మూడు రకాల పాతర్లు ఉండేవి. కందుల పాతర, జొన్నల పాతర మరొకటి పెసర కోసం. చాలా మంది ఆ రోజుల్లో అన్నం అంటే జొన్న అన్నమే తినే వారు. వరి అన్నం తినేవారు సంఖ్య చాలా తక్కువ. బియ్యం మాత్రం బయట నుంచి కొనుక్కోవాల్సిందే. ‘మన పొలంలో పండే జొన్నలు ఇంట్లో సంవృద్ధిగా ఉండగా బియ్యపు అన్నం ఎందుకురా’ – మా బామ్మ అంటుండేది. మేమేమో పట్నంలో ఉండే వాళ్లం కదా. ఏడాదికొకసారి పల్లెబాట తొక్కేవాళ్లం. అందుకే మా కోసం నందిగామ మార్కెట్ నుంచి సన్న బియ్యం తెప్పించేది. జొన్న అన్నం తయారు చేయడం కూడా చాలా కష్టం కావడంతో వరన్నం పట్ల క్రమంగా చాలా మంది ఆకర్షితులయ్యారని నాకనిపించేది. ఎందుకంటే జొన్నలు దంచాలి, పై పొట్టు లేకుండా వడపోయాలి, బాగా ఉడికేదాకా వండాలి. ఇవి బియ్యంలా తొందరగా ఉడకవు. పట్నం నుంచి వచ్చిన మా కోసం బామ్మ ఒకటి రెండు సార్లు జొన్నన్నం వండించేది. అప్పుడే చూశాను జొన్నలను నానబెట్టడాలు, రోట్లో పోసి దంచడాలు, పై పొట్టు వడబోయడాలు, కట్టెల పొయ్యిపైన వండటాలు. జొన్నన్నం తియ్యగా ఉంటుంది. వరన్నం లాగా స్మూత్‌గా తినలేము. ఆవకాయ ఎంత కలిపినా ఆ ఘాటు తెలియదు. కానీ తింటుంటే భలేగా ఉండేది. ఆ టైప్ జొన్నన్నం మళ్ళీ ఇంతవరకు తినలేదు. రోజులు మారాయి అని కొసరాజు గారు అన్నట్లుగానే ఊర్లో జొన్నన్నం తినేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. జొన్నలు తినే రోజుల్లో మనుషులు పుష్టిగా ఉండేవారు. ఒక్కడే వంద కిలోల బస్తా లేపి బండిలో ఎత్తి పడేసేవాడు. సోలెడు జొన్నలు దంచి వండితే ఒక్కడే తినేవారు. కందులు ఊర్లోనే పండటంతో కంది పప్పు రోజూ ఉండాల్సిందే. ‘జొన్నన్నంలో చారెడంత కద్ది పప్పు కలుపుకుని, చిప్ప గరిటెతో అంత ఆవకాయ వేసి, చారెడు నెయ్యి పోయించుకుని కలుపుకు తింటంటే ఇక అనారోగ్యాలు రమ్మనమన్నా రావురా’ – అనేది బామ్మ. అందుకే ఆమె సెంచరీ దాటేసి ఓ ఎడెనిమిది సంవత్సరాలు లాగించేసింది. బామ్మ అంటే మాకెంతో ఇష్టం. ఆమెను మేము ‘పాపచ్చీ’ అని ముద్దుగా పిలుచుకునే వాళ్లం. పాపచ్చీ అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. కానీ అదే పేరు మా బంధువుల్లో కూడా పాపులర్ అయింది. చివరి వరకు ఆమె చూపు తగ్గలేదు. దూరంగా ఎవరు వెళుతున్నా కనిపెట్టేసేది. అంతే దూరాన ఎవరు మాట్లాడుకుంటున్నా వినగలిగేది. బీపీలు, షుగర్లు వంటి మాటలే ఆమె జీవితంలో బహుశా ఎప్పుడూ విని ఉండదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చి – ‘నాగభూషణం ఉన్నాడా?’ అనో, ‘నాగరాజు ఉన్నాడా?’ అనో అంటే ఆమెకు కోపం వచ్చేసేది. ‘నాగభూషణం ఏమిటీ నువ్వేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా ఏంటీ, నాగభూషణ రావు అనలేవూ, అది మా మరిది గారి పేరు’ అని కసురుకునేది. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో బావగారు, మరిది గారు పట్ల అంత గౌరవం ఉండేవి. ఇక నాగరాజు అని పిలిస్తే ఆమెకు చిర్రెత్తుకొచ్చేది. కానీ ఆ పేరు మా అమ్మ ముద్దుగా పెట్టుకోవడంతో పైకి గట్టిగా ఏమీ అనలేక ‘కాలం మారిపోయింది’ అని గొణుక్కునేది.

ఆ రోజుల్లో ఇంట్లో పంట గింజలు సంవృద్ధిగా ఉంటే చాలు, డబ్బులు ఎక్కువగా తీయాల్సి వచ్చేది కాదు. పాతర్ల నిండా ధాన్యం ఉండగా డబ్బులు (నోట్లు) అసలు తీసేది కాదు మా బామ్మ. జీతగాళ్లకు జీతాలు ఇవ్వాలన్నా, కోమటి కొట్లో నుంచి సరుకులు తీసుకురావాలన్నా, కూలీ ఇవ్వాలన్నా అన్నింటికీ ధాన్యం కొలిచి ఇవ్వడమే. ఈ కొలవడం కోసం ఇంట్లోనే కొన్ని కొలత పాత్రలు ఉండేవి. వాటిలో గిద్దె, సోల, తవ్వ, మానెడు వంటివి ఉండేవి. గిద్దెడు జొన్నలు ఇస్తే బోలెడంత మిఠాయి ఇచ్చేవాళ్లు. అందుకే చిన్నప్పుడు చాలా ఏళ్ల వరకు పల్లెలో మాత్రం నేను వంద రూపాయల నోటు చూడలేదు. నా బోటి పిల్లల అవసరాలన్నీ ఐదు పైసలు, పది పైసలు పావలాలతోనే తీరేవి. అలాంటిది మొన్నీ మధ్య ఇంటి ఖాళీ స్థలంలో పెరిగిన కలుపు మొక్కలు కొట్టమని అడిగితే రెండువేలు ఇమ్మన్నారు. అసలు ఐదు వందల నోటు వచ్చాక వంద రూపాయల నోటుకి ఎక్కడా విలువ లేకుండా పోయింది. ప్రతి చిన్న పనికి కనీసం ఐదు వేళ్లు (ఐదు వందల నోటు అన్నట్లు) చూపిస్తున్నారు.

నాణేల్లో అర్థరూపాయి అంటే చాలా విలువనైదని నాకు ఆ రోజుల్లో అర్థమైంది. అలాంటప్పుడు రూపాయి అంటే మాటలా. మా నాన్నగారి జేబులో పది రూపాయల నోట్లు ఉండేవి. కానీ వాటిని ముట్టుకోవాలంటేనే భయం. గుంటూరు బ్రాడీపేటలో మేము ఉన్నప్పుడు ఇంటి అద్దె ముప్పయి రూపాయలు. నాన్నగారి జీతం ఏ రెండొందలో ఉండేది. అది కూడా ఓ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌కి ఇస్తున్న జీతం అన్నమాట. నాన్నగారు రిటైర్ అయ్యే నాటి జీతం 450 రూపాయలు ఉన్నట్లు గుర్తు. సరే, నేను మొదటిసారి అందుకున్న జీతం 650 రూపాయలు. పెళ్లయిన తర్వాత విజయవాడ సత్యనారాయణపురం – బాలమురళీకృష్ణ గారి వీధిలో అద్దె ఇంటికి నేను ఇచ్చింది నెలకు 330 రూపాయలు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా పల్లెటూర్లో డబ్బులు తీయకుండానే జీవితాలు సాగిపోయేవి అని చెప్పడానికే. పిల్లలకు పెళ్ళిళ్లు చేయాలన్నా కట్న కానుకల క్రింద డబ్బులు ఇవ్వాలన్నా ఆ రోజుల్లో – ఎకరం పొలం ఇస్తాము, ఏటా పంట చేతికి రాగానే ఓ పది బస్తాల జొన్నలు, ఓ బస్తా కందులు ఇస్తామని మగపెళ్ళి వారితో ఒప్పందం కుదుర్చుకోవడం నాకు గుర్తుంది. సంబంధం కుదరగానే ఒప్పందం ప్రకారం పొలం వ్రాసి ఇచ్చేవారు. మగ పెళ్ళివారు ఎడ్ల బండ్లు కట్టుకుని ఓ ఐదు రోజుల ముందే తరలివచ్చేవారు. ఎక్కడా నోట్లు తీయకుండానే ప్రశాంతంగా పండుగలు, పెళ్ళిళ్లూ జరుపుకోవడానికి వీలున్న రోజులవి.

అప్పట్లో కృష్ణాజిల్లా అంతటా ఒకే రకమైన పొలాలు ఉండేవి కావు. తూర్పు – పడమర అన్నంత తేడా ఉండేది. ఇప్పుడు జిల్లాను రెండుగా విభజించి ఒకటి కృష్ణాజిల్లా, రెండవది ఎన్టీఆర్ జిల్లా అని పిలుస్తున్నారు. విజయవాడ ఇవతల ఉన్న కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో వ్యవసాయ భూములన్నీ మెట్టసాగు క్రిందకే వస్తాయి. అటు తూర్పువైపున ఉన్న కృష్ణా జిల్లా ప్రాంతంలో (ఉదాహరణకు కంకిపాడు, కానూరు, పామర్రు, మంచిలీపట్నం, గుడివాడ) భూములు సారవంతమైనవి. మాగాణీ పొలాలు ఎక్కువ. పొలాల అమ్మకాల రేట్లలో కూడా తేడాలున్నాయి. మెట్ల పొలం పది ఎకరాలు ఉన్నా, మాగాణి పొలం ఎకరం ఉన్నా ఒకటే అన్నంత తేడా ఉంది. ఈ రేట్లలో అంతరం ఉన్నట్లుగానే ఈ ప్రాంత పల్లెలకీ, అటు వైపు పల్లెలకీ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, సంస్కృతుల్లో తేడాలున్నాయి. ఇళ్ల నిర్మాణాలు, పరిసరాలు, ఊర్లో రోడ్లు, పండగలు జరుపుకునే తీరు, సరదాలు, ముచ్చట్లు, వినోదాలు.. ఇలా అన్నింటిలో తేడాలు కనిపిస్తుంటాయి. ఈ కారణంగానే మా వైపు ప్రాంతంలోని వారికి పెళ్ళి సంబంధాలు చూసేటప్పుడు అవతలి వాళ్లతో తూగగలమా లేదా అని ఆలోచించేవారు. భౌగోళికంగా ఉన్న తేడాలు సమాజపు తీరుతెన్నులపై ఇంతగా ప్రభావితం చూపుతాయా అని ఆలోచిస్తుండే వాడ్ని.

మా ఊర్లో ఇంటి పెద్ద, పొలం అమ్మకానికి పెట్టాడంటే ఏదో పెద్ద అవసరం వచ్చినట్లే అర్థం. పిల్లల చదువులు, వ్యవసాయంలో వచ్చే నష్టాలు, పెళ్ళిల్లు, అనారోగ్యం ఖర్చులు.. ఇలా ఎన్నింటినో ఎదుర్కుంటూ ముందుకు సాగడానికి మధ్యతరగతి రైతుకు కనిపించే ఏకైక మార్గం పొలం బేరం పెట్టటమే. ఇతగాడికి అవసరం గుర్తించి కొనేవాడు చెట్టెక్కి కూర్చుంటాడు. చివరకు గతిలేక ఏదో ఒక బేరానికి పొలం అమ్మేసేవారు.

ఈ ప్రాంతంలో ఒక ఏడాది పంట బాగా పండితే ఆ తర్వాత రెండు మూడేళ్లు పంట అంతంత మాత్రంగా ఉండేది. ‘దండగమారి వ్యవసాయం’ అని అందుకే అనేవారు. అకాల వర్షాలు, వరదలు కాకుంటే కరువు కాటకాలు – ఇవన్నీ పల్లెకు వీడని శాపాలు. బాగా పండినప్పుడు ధాన్యం అమ్మి డబ్బు రూపంలో బ్యాంకుల్లో దాచుకోవడం ఆ రోజుల్లో చాలా తక్కువ మందికే సాధ్యమయ్యేది. పల్లెల్లో బ్యాంక్ సౌకర్యాలు అంతంత మాత్రమే. భారీగా వరదలు వచ్చినప్పుడు పాతర్ల లోని ధాన్యం కూడా పాడయ్యేది. చూస్తుండగానే కళ్ల ముందు పరిస్థితి తలక్రిందులయ్యేది. ముందు చూపుతో డబ్బులు దాచుకునే రైతులను వేళ్లమీద లెక్కబెట్టవచ్చు.

ఇప్పటిదాకా చెప్పుకున్న కారణాల వల్ల అగ్రహారికుల పొలాలు తగ్గిపోయాయి. ఊర్లో మిగతా వారి ప్రాభవం పెరిగిపోయింది. చదువుకున్న వారు నెమ్మదిగా పట్నం వాసానికి అలవాటు పడి అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అక్కడే మేడలు మిద్దెలు కట్టడం మొదలెట్టారు. ఈ కారణంగా కూడా పల్లెలోని పొలం అమ్ముకుని వెళ్ళిపోయేవారు. మా నాన్నగారు మాత్రం అటు ఉద్యోగం చేస్తూనే ఇటు వ్యవసాయం కూడా కొనసాగించారు. అయితే ఈ ‘రెండు కళ్ల సిద్ధాంతం’ వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. వ్యవసాయ పనులు సరిగా చూసుకోలేక పోయేవారు. ఆ సమయంలో మా బామ్మే పెద్ద దిక్కు అయింది. మా బుల్లెమ్మ అత్త (కస్తల సీతారావమ్మ) కూడా బామ్మతోనే ఉంటూ సపోర్ట్ చేస్తుండేది. అలా బుల్లెమ్మ అత్త కుటుంబానికీ మా కుటుంబానికీ విడదీయరాని అనుబందం ఏర్పడింది. ఆ ఇంటి పిల్ల ఈ ఇంట కోడలు (వదిన) అయింది. ఇదంతా 50 ఏళ్ల కిందటి ముచ్చట.

కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మా నాన్నగారి దగ్గర మూడు మార్గాలు ఉండేవి. వాటిలో ఒకటి స్థిరమైన ఉద్యోగం. రెండవది వ్యవసాయ దిగుబడి. మూడవది కోడె గిత్తలను, పాడి ఆవులను అమ్మడం. ఉద్యోగం ఉండటంతో కనీస అవసరాలకు లోటు ఉండేది కాదు. పంట బాగా పండినప్పుడో లేకపోతే కోడె దూడలు ఎదిగి గిత్తలుగా మారగానే వాటిని అమ్మడం వల్లనో చేతిలో డబ్బులు ఆడేవి. అలాంటప్పుడు అమ్మకి నగలు చేయించేవారు నాన్నగారు. ఆర్థికంగా బలపడటానికి మూడు మార్గాలు ఎంచుకున్నా ఒక్కోసారి ఆయనకు ఇబ్బందులు తలెత్తేవి. రోగాల బారిన పడి పై ఇద్దరు పిల్లలు మరణించడం ఓ పెద్ద విషాదం. మిగిలిన పిల్లల ఆరోగ్య సమస్యలు, చదువులు వంటి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఈదుకుంటూ వస్తున్నా అప్పుడప్పుడూ అప్పుల భారం పెరిగిపోయేది. అలాంటప్పుడు ఒకటి రెండు ఎకరాలు అమ్మేయాల్సి వచ్చేది.

మా ఊర్లో మాకున్న పొలాలకు చక్కటి పేర్లు ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు ఒక వైపున ఉన్న పొలం పేరు ‘రాయల వారి చేను’ (ఏరువాక పండుగ నాడు పొలం దున్నింది ఈ పొలం లోనే), మరో వైపున ‘చెరుకు చేను’, రోడ్డు ప్రక్కన ‘తుమ్మల చేను’, ఇంకో దిశగా ‘పార్వతమ్మ చేను’ ఇలా అన్నమాట.

ఊరు మారలేదు..:

నా చిన్నప్పుడు చిరుధాన్యాల పంటలే ప్రధానంగా ఉండేవి. ఇవి నిత్యజీవితంలో చాలా అవసరమైనవి కావడంతో డబ్బుకు బదులుగా ధాన్యం చలామణిలో ఉండేది. కాలం మారింది. ఊరూ మారింది. ఈ పంటల స్థానంలో కమర్షియల్ క్రాప్స్ పట్ల రైతులు మొగ్గు చూపడం మొదలెట్టారు. ఊర్లో ఉన్నట్లుండి పొగాకు బేరన్ వెలిసింది. ఇది వాగుకు దగ్గర్లోనే ఉండేది. అక్కడ పొగాకును తీగల మీద వ్రేలాడదీసి ఆరబెట్టేవారు. అక్కడకు వెళ్ళగానే అదో రకం వాసన కమ్మేసేది. పొగాకు వేసిన రైతు చూస్తుండగానే ఆర్థికంగా ఎదగడం చూసిన మిగతా రైతులు ఆ పంట వైపు మొగ్గడం మొదలెట్టారు. జొన్న, కంది, పెసలు వంటి సాంప్రదాయ పంటల పట్ల ఆసక్తి తగ్గిపోవడం మొదలైంది. ఈ సమయంలోనే మరో వాణిజ్య పంట మిరప మా పల్లెను డామినేట్ చేయడం మొదలెట్టింది. ఇది కూడా లాభసాటి పంట కావడంతో ఎటు చూసినా మిరప తోటలే. ఇప్పటికి కూడా మీరు మా ఊరు పొలాలవైపు వెళితే మిరప పంట ఎంతగా రైతును ఆడిస్తుందో అర్థమవుతోంది. మరో వాణిజ్య పంట – పత్తి. ఇవి కాక సుబాబులు పండిస్తే లాభాలు గడించవచ్చని సుబాబుల్ తోటల పెంపకం పట్ల కొందరు ఆసక్తి చూపారు. మా నాన్నగారు ఓ సారి మామిడి తోట వేశారు. అయితే మొక్కలు ఏపుగా పెరగలేదు. రాబడి రాలేదు. వాణిజ్య పంటల వల్ల మెట్ట పొలాల్లో సాంప్రదాయ పంటలు తగ్గిపోయాయి. బహుశా ఈ పోకడే అన్ని చోట్లకు పాకబట్టే ఇప్పుడు (2024) కిలో కంది పప్పు ధర రెండు వందల పై చిలుకు అయింది. అలాగే జొన్నలు, పెసలు రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఒక దశలో వీటినేనా మానికలతో కొలిచి పోసిందని ఆనాటి సంఘటనలు తలుచుకున్నప్పుడల్లా నేటి పోకడ చూసి మనసు చివుక్కుమంటోంది. పొలాల మధ్యలో ప్రతి రైతు కూరగాయల సాగు చేసేవాడు. అది కాకుండా ప్రతి ఇంటి ఆవరణలో గుమ్మడి సొర పాదులు, టమోటా, బెండ, వంగ వంటి ముక్కలు నాటేవారు. ఆ రోజుల్లో కూరగాయలు ఒకరింటి నుంచి మరొ ఇంటికి ఉచితంగానే వస్తుండేవి. మజ్జిగ కూడా అంతే. ప్రతి దానికీ పైసలు తీయాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ రోజులు మారాయి. ఎవరిలో మార్పు వస్తే పరిస్థితి చక్కబడుతుందో తెలియని అయోమయపు పరిస్థితి దాపురించింది. వాణిజ్య పంటలు వేస్తున్నా చేతిలో డబ్బు ఆడుతున్నా నాకు తెలిసి 50 ఏళ్లలో ఊరు పెద్దగా మారలేదు. ఊర్లోకి అడుగు పెట్టగానే ఏదో వెలితి కనబడుతోంది. అది ఏమిటో..

దాచుకునే వారు కొందరు. దాపరికం లేనివారు మరి కొందరు. హెచ్చులు పోయే ఖర్చులు చేసేవారు కొందరు. దానధర్మాలు చేసేవారు ఇంకొందరు. ఇలా అనేక రకాల కుటుంబాలు ఒక్క మా పల్లెలోనే కనబడేవి. మొత్తానికి అగ్రహారం పొలాలు కరిగిపోతున్నాయి. ‘పల్లె పెత్తనం’ చేతులు మారుతోంది. ఇప్పుడు నాబోటి వాడు వెళితే, ‘మీరెవరు బాబు?’ అని అడిగే రోజులు వచ్చేశాయి. కాలం మారింది. పరిస్థితులు మారాయి. అయినా ఆ ఊరి పట్ల నా అభిమానం చెదరలేదు. ఆ జ్ఞాపకాలు నా మదిని వీడి పోలేదు.

ఊర్లో శివాలయం, రామాలయం వాటితో నా అనుబంధం, చిన్న నాటి పల్లె వాసనలు మరోసారి..

ఫుట్ నోట్ 16:

ఏరువాక పండుగ: ప్రతి ఏట దుక్కి దున్నడం ప్రారంభించేది ఈ పండుగ రోజునే. ఏరువాక పౌర్ణమి అని అంటారు. జేష్ట శుద్ధ పౌర్ణమి రోజున వస్తుంది ఈ పండుగ. అప్పటికే తొలకరి జల్లులు పడటంతో పొలం దున్నడానికి అనుకూల వాతావరణం ప్రకృతి మాత ప్రసాదించబోతున్నదని భావించి ఆ రోజున రైతులు అరక కట్టి పొలం దున్నడానికి బయలుదేరతారు. ఆ రోజున వ్యవసాయ పనిముట్లను శుభ్రంగా కడిగి వాటికి పసుపు, కుంకుమ పూసి ప్రత్యేక పూజలు చేస్తారు. పొలంలో నామమాత్రంగా దుక్కి దున్నుతారు. ఆ తర్వాత పూర్తి అనుకూలత వచ్చాకనే పూర్తి స్థాయిలో విత్తులు నాటతారు. పూర్వం అనేక సినిమాల్లో ఏరువాక విశిష్టత చూపించేవారు. పల్లెల్లో ఏరువాక సందర్భంగా పాటలు కూడా పాడుకునే వారు. అరకలు నాగళ్లు వంటివి కనుమరుగవుతున్న సందర్భంలో ఏరు వాక జరుపుకునే తీరులో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

నాటి పల్లె ముచ్చట్లు ఇక్కడితో పూర్తి కాలేదు. ఇంకా ఉన్నాయి. నాలోని నాటక రచయితను మేల్కొలిపింది కూడా ఈ పల్లెటూరే. ఆ వివరాలు మరోసారి చెబుతాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here