తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-19

1
7

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

ఎలుక మళ్ళీ పుట్టింది:

[dropcap]నా[/dropcap] జీవితంలో అనుకోకుండా రెండు రోజులు మాయమయ్యాయి. వినడానికి చిత్రంగా అనిపించినా ఇది నిజం. జీవితం – మనం చెప్పినట్లు సాగదు. అనుకోకుండా ఇలాంటి చిత్రాలు జరుగుతుంటాయి. నా జీవన యాత్ర ఆరంభమే ఓ వింత. అందుకే అది ‘ఎలుక పుట్టింది’తో ప్రారంభమైంది. కరెంట్ కూడా లేని పల్లెటూరులో ఓ పెంకుటింట్లో చీకటి వేళలో ఎలుక పిల్ల పుట్టింది. అది పెరిగి పెద్దదయ్యాక షష్టిపూర్తి కూడా చేసుకున్నాక జరిగింది ఈ సంఘటన. నా జీవిత పుటల్లో నుంచి 48 గంటలు నాకేమాత్రం తెలియకుండా మాయమయ్యాయి.

నన్ను ఓ బల్లపై పడుకోమన్నారు. వెల్లికల పడుకున్న నాకు పైకి చూస్తే ఓ తెల్లటి బల్బు వెలుగుతూ కనిపించింది. ఆ తెల్లటి కాంతి పుంజాలు ఆ గదంతా పరుచుకున్నాయి. అంతా నా ఇష్టప్రకారమే జరుగుతోంది. ఆపరేషన్ బల్లమీద పడుకున్నాను. నాకు తెలుసు నా గుండెకు ఆపరేషన్ జరగబోతున్నదని.

‘మీ పేరు?’

‘నాగభూషణ రావు’

‘ఓకే, మీకిప్పుడు ఓ చిన్న ఇంజెక్షన్ చేస్తున్నాను’

‘అలాగా, సరే కానివ్వండి’

పైకి చూస్తున్నాను. తెల్లటి కాంతి పుంజంలో ఉన్నట్లుండి రంగులు కనిపించసాగాయి. అంతలో చీకటి అలుముకుంది.

అంతే..

***

కళ్లు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి.

అదే తెల్లటి కాంతి.

ఆ వెలుగుని చూడలేక కళ్లు మూసుకున్నాను.

జీవితం అంటే అంతే.

ఒక్కోసారి వెలుగూ భయంకరంగానే కనిపిస్తుంటుంది.. కారు చీకటిలా.

ఏదో ఒక సన్నటి రేఖ వద్ద చీకటి వెలుగవుతుంది.

నిరాశ నుంచి ఆశ చిగురిస్తుంది.

అపనమ్మకం నమ్మకమవుతుంది.

అధైర్యం ధైర్యం అవుతుంది.

ఎలాగో మళ్ళీ కళ్లు తెరిచి చూశాను. అదే తెల్లటి కాంతి. కాకపోతే బల్లమీద పడుకున్నప్పుడు, ఇంజెక్షన్ చేస్తానని డాక్టర్ చెప్పినప్పుడులా

తెల్లటి కాంతి ఈ సారి మాయం కాలేదు. నల్లటి వలయం ఆవరించనూ లేదు. ఈ సారి, ఈ తెల్లటి కాంతి. బాగా ప్రకాశిస్తూనే ఉంది. రాబోయే జీవన ఆశలకు ప్రతీకగా.

‘సార్, ఇటు చూడండి’

చూశాను.

ఒక అమ్మాయి నా బెడ్ ప్రక్కనే నిలబడి ఉంది. ఆమె ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. చిరునవ్వు ఆమె పెదాల మీద కనపించింది.

‘సార్, మెలుకువ వచ్చిందా’

‘ఆ..’

‘మీకు ఎలా ఉంది?’

అప్పుడు గుర్తుకు వచ్చింది. నేను ఆపరేషన్ చేయించుకోవడం కోసం ఆపరేషన్ థియేటర్‌కి వెళ్ళాను. ఏదో ఇంజెక్షన్ చేస్తానని డాక్టర్ అన్నారు. మరి చేశారా? గుర్తుకు రావడం లేదు. ఆపరేషన్ చేశారా? ఏమో ఇదీ గుర్తుకు రావడం లేదు.

నర్సుని అదే అడిగాను.

‘నాకు ఆపరేషన్ చేశారా?’

‘చేశారండి, ఆపరేషన్ సక్సెస్. మీరు రెస్ట్ తీసుకోండి’

‘ఎప్పుడు?’

‘రెండు రోజుల క్రిందట’

‘అవునా..!’

నాకు ఆపరేషన్ చేసి రెండు రోజులు అయిందా! ఈ రెండు రోజులు. అంటూ 48 గంటలు నాకెందుకు తెలియలేదు. అదే అడిగాను నర్స్ ని.

‘మీకు ఇప్పుడే స్పృహ వచ్చింది. మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు?’

అప్పుడు.. నెమ్మదిగా అంతా సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ లాగా గుర్తుకురావడం మొదలైంది.

అది నందిగామ. రిటైర్ అయ్యాక ప్రశాంతంగా నందిగామలో ఉండాలని కాపురం నందిగామకు షిప్ట్ చేశాను. అప్పటికే 60 ఏళ్లు దాటాయి. సొంత ఊరి మీద ప్రేమతో సగం, అక్కడి నాకున్న కొద్దిపాటి ఆస్తులకు సంబంధించిన పనులు చక్కబెట్టుకోవడం సగం – ఈ కారణాల వల్ల నందిగామ చేరాము. అప్పటికే మా అబ్బాయికి, అమ్మాయికి పెళ్ళిళ్లు కావడం, వారు స్థిరపడటంతో నాకీ ఆలోచన వచ్చింది. నందిగామలో సొంత ఇల్లు (చిన్నదే అనుకోండి) ఉంది. కానీ అద్దె వాళ్లు ఖాళీ చేయకపోవడంతో అన్ని సౌకర్యాలు ఉన్న వేరే ఇల్లు అద్దెకు తీసుకుని హైదరాబాద్ నుంచి సామాన్లు దింపాము. అడపాదడపా నందిగామ వెళ్లడం అలవాటే. నగర జీవనంతో పోలిస్తే నందిగామ లైఫ్ సాదాసీదాగా ఉంటుంది. కాకపోతే నా స్కూల్ లైఫ్, కాలేజీ లైఫ్‌తో ముడిపడిన ఊరు అది. అంతే కాదు, నేను ‘ఎలుక పిల్ల’లా పుట్టిన ఊరు (అడవి రావులపాడు) నందిగామకు చాలా దగ్గరే. నేను షిప్ట్ అయ్యే సమయానికి ఆ పల్లెలో కాస్తంత పొలం, ఇంటి స్థలం ఉన్నాయి. నందిగామ హైస్కూల్ గ్రౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే లేచి ఆ గ్రౌండ్‌లో వాకింగ్ చేయడం మరీ ఇష్టం. నాతో పాటు హైస్కూల్‌లో చదువుకున్న వాళ్లలో కొందరు వాకింగ్‌లో కలుస్తుంటారు. అలాంటి వారిలో మారం సత్యనారాయణ, మహంకాళి రామారావు వంటి వాళ్లు రోజూ కలుస్తుంటారు. చిన్ననాటి కబుర్లు మా మధ్య దొర్లుతుండేవి. నడకతో శరీరం, చిన్ననాటి కబుర్లతో మనసు ఎంతో ఉత్సాహం చెందేవి. ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. రోజులు హ్యాపీగా నడుస్తున్నాయి. ఇంతలో..

కరోనా.. ఈ పేరు గతంలో వినలేదు. హఠాత్తుగా వచ్చిపడింది. ప్రపంచాన్ని శాసించాలన్న పట్టుదలతో శరవేగంతో వ్యాపిస్తోంది.

ఇదిగో కరోనా.. అదిగో కరోనా.. ఎటు విన్నా ఇవే మాటలు. అవే భయాలు.

2020 మార్చి నెల కంటే కొద్దిగా ముందే, ప్రపంచం కరోనా గురించి మాట్లాడుకోవడం మొదలెట్టింది. సంపన్న దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నట్లు వార్తలు విన్నాను. కంటికి కనబడని శత్రువు అది. వైరస్ గురించి ఒక సైన్స్ అధ్యయనకారునిగా నాకు బాగానే తెలుసు. కానీ కరోనా వైరస్ గురించి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తున్న వార్తలు నన్ను భయపెట్టేశాయి. దీనికి తోడు వ్యక్తిగతంగా నాకో పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిపడింది.

గుండె చప్పుడు:

మే నెల వచ్చేసింది. నేనూ రోజూలాగానే వాకింగ్‌కి వెళ్ళాను. ఒక రౌండ్ వాకింగ్ చేసే సరికి గుండెలో సన్నటి నొప్పి. చమటలు పట్టాయి. మిత్రులకు చెప్పి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నాను. కాసేపటికి నొప్పి తగ్గింది. ఇదేదో అలసట వల్ల వచ్చిందని అనుకున్నాను. అయితే అప్పటికే నా గుండె బలహీనంగా ఉన్న సంగతి నాకు తెలుసు. నేను ఆంధ్రప్రభ – హైదరాబాద్ ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడే ఓ రోజు నైట్ డ్యూటీ చేసి ఇంటికి రాగానే సన్నటి నొప్పి. ఇలాగే. అచ్చు ఇలాగే. కాసేపటికి తగ్గింది. తెల్లవారాక ఆస్పత్రికి వెళితే ఈసీజీ వంటి పరీక్షలు చేసి మందులు వ్రాసిచ్చారు. ఆ మందులు క్రమం తప్పకుండా వాడమన్నారు. నేను విజయవాడ ఆంధ్రప్రభలో పని చేస్తున్నప్పుడు ‘కులాసా’ (హెల్త్ పేజీ) వ్యవహారాలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. గుండెకు సంబంధించిన కొన్ని వ్యాసాలు డాక్టర్ రమేష్ బాబు గారిచేత వ్రాయించాను. అలా వారితో నామమాత్రపు పరిచయం ఉంది. డాక్టర్లతో పరిచయాలు బాగా ఉన్నప్పుడు నేనూ బాగానే ఉన్నాను. వారితో ఆరోగ్యపరంగా నాకు అవసరాలు రాలేదు. కానీ, హైదరాబాద్ చేరాక పని ఒత్తిడి కారణంగా గుండె బలహీనమైంది. గుండె చప్పుడు నా మాట వినడం లేదు. డాక్టర్లు చెప్పినట్లు మందులు సక్రమంగా వాడటం వల్ల ఊరట వచ్చింది. కానీ ఎప్పుడైనా స్ట్రోక్ రావచ్చని డాక్టర్లు హెచ్చరించారు. ఆ సంకట స్థితి వచ్చేసింది. అది కూడా పెద్దగా వైద్య సౌకర్యాలు లేని నందిగామలో ఉన్నప్పుడు.

వాకింగ్ నుంచి ఇంటికి చేరాను. కూరగాయలు తీసుకురమ్మనమని మా ఆవిడ అంటే సంచీ తీసుకుని బయలుదేరాను. రైతుబజార్‌కి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి చేరేసరికి మళ్ళీ నొప్పి. ఇక లాభం లేదని డాక్టర్ నాకు వ్రాసిచ్చిన మందులు వేసుకున్నాను. రాత్రి బాగానే నిద్రపట్టింది. తెల్లవారుఝామున మళ్ళీ నొప్పి. శ్రీమతిని నిద్దర లేపాను. కంగారు పడవద్దని చెప్పాను. నా మంచి మిత్రుల్లో ఒకరైన గోపు సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి చెప్పమన్నాను. విజయవాడకు తీసుకువెళ్ళి ఆస్పత్రిలో చేర్చమన్నాను. నాకు కారు డ్రైవింగ్ వచ్చు. కానీ చేయలేని స్థితి. ఒక డ్రైవర్‌ని మాట్లుడుకుని నేనూ మా ఆవిడ, మిత్రుడితో కలిసి విజయవాడ ఆస్పత్రికి బయలుదేరాము.

నందిగామ – విజయవాడ దారిలో అంబారుపేట వద్ద సత్తెమ్మ గుడి ఉంది. అమ్మవారు చాలా శక్తిమంతురాలని నమ్మిక. ఇప్పుడంటే ఈ రోడ్డు వెడల్పు అయి, డివైడర్ రోడ్‌గా మారింది. అంతకు ముందు సింగిల్ రోడ్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. అలా జరగకుండా ఉండేందుకు అటూ ఇటూ వెళ్లే వాహనాలు ఈ గుడి దగ్గర ఆపి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇప్పటికీ అంతే. కాకపోతే డివైడర్ రోడ్ కావడంతో ప్రమాదాలు తగ్గాయి. అమ్మవారి మీద భక్తిశ్రద్ధలు మాత్రం తగ్గలేదు.

మా కారుని గుడి దగ్గర ఆపించాను. కారులో నుంచే అమ్మను దర్శించుకోండని మా ఆవిడ చెబుతున్నా వినకుండా కారు దిగి గుడిలోకి వెళ్ళాను. అమ్మ కళ్లు మిళమిళా మెరుస్తున్నాయి. ఆమె చూపుల్లో చల్లదనం నా శరీరాన్ని తాకినట్టు నాకనిపించింది. చల్లంగ చూసే అమ్మ దయ ఉండగా నాకెందుకు భయం అనుకుంటూ కారు ఎక్కాను. అదే జరిగింది. అమ్మ దయతోనే నేను పెద్ద గండం నుంచి బయటపడ్డాను.

కరోనా భయం ఉండటంతో అందునా లాక్‌డౌన్ ఉండటంతో మా విజయవాడ ప్రయాణం కష్టమవుతుందేమో అనుకున్నాము. కాకపోతే డ్రైవర్ నేర్పుగా విజయవాడ సందుల్లో నుంచి ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు.

పరీక్షలు చేశాక గుండెలో నాలుగు చోట్ల బ్లాక్‌లు ఉన్నాయనీ, బైపాస్ సర్జరీ చేయడమే మంచిదని డాక్టర్లు సూచించారు. కాకపోతే అర్జెంట్ కాదు. మందులతో ఓ వారం పది రోజులు ఆగవచ్చని కూడా డాక్టర్లు చెప్పారు. విషమ స్థితిలో ఇదే ఊరట. దీంతో కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు అంతా సమగ్రంగా మాట్లాడుకుని చివరకు రమేష్ బాబు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే నాకు బైపాస్ సర్జరీ చేశారు.

48 గంటల తరువాత కళ్లు తెరిచాను. కళ్లు మూతలు పడటం.. కళ్లు తెరుచుకోవడం. మధ్యలో 48 గంటలు గడిచిపోవడం. ఇంత సుదీర్ఘ నిద్ర ఇంతకు మునుపు నాకు తెలియదు.

‘ఎవరిని చూడాలనుకుంటున్నారు?’ – నర్సు మళ్ళీ అడిగింది. నందిగామ నుంచి ఒక ఆస్పత్రిలో చేర్చిన తర్వాత మూడో రోజన మా అమ్మాయి అల్లుడు గారు బెంగళూరు నుంచి రాగానే మిత్రుడు సుబ్రహ్మణ్యం నందిగామ వెళ్ళిపోయారు. ఆపరేషన్ సమయంలో కరోనా ఇబ్బందితో పాటు నా గ్రూప్ రక్తం దొరకడం కష్టమైంది. నాది ఎ-నెగెటీవ్. నాలుగు బాటిల్స్ కావాలట. సోషల్ మీడియా గ్రూపుల్లో రిక్వెస్ట్ పెట్టారు. అనేకమంది స్పందించారు. కాకపోతే లాక్‌డౌన్ కావడంతో దూరం నుంచి రావడం కష్టమే. మా వాళ్లంతా టెన్షన్ పడ్డారు. మా అబ్బాయి (రాజేష్) కుటుంబం ఇంగ్లండ్‌లో ఉంది. కరోనా కారణంగా విమానాలు తిరగడం లేదు. వాడు అక్కడి నుంచే ఎప్పటికప్పుడు అమ్మాయి దివ్యతో మిత్రుడు విజయబాబుతో మాట్లాడుతూ మంచి సర్జెన్ (జయరాం పే) తో ఆపరేషన్ జరిగేలా చూశాడు. బెంగళూరు నుంచి అమ్మాయి (దివ్య) అల్లుడు (సాకేత్) రావడమే చాలా కష్టమైంది. పోలీస్ వాళ్లతో మాట్లాడటంలో చెన్నైలో ఉన్న బావగారు (మద్దాలి సీతారామారావు) ఎంతో శ్రమించారు. ఇలా ఒక టీమ్ తయారై ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఆపరేషన్ సక్సెస్ అవడంలో బయట పాత్రలు పోషించారు. రాష్ట్ర సరిహద్దులు దాటి రావడంలో అది కూడా రాత్రివేళ అమ్మాయి వాళ్లకు కష్టమైంది. అందరూ ఆందోళన పడుతున్న వేళలో ఆపరేషన్‌కి మరో ప్రక్క సన్నాహాలు మొదలయ్యాయి.

చివరకు అనుకున్నంత బ్లడ్ దొరికింది. ఆఫరేషన్‌కి మే 18 ఉదయం ముహూర్తం పెట్టేశారు. అంతకు ముందు డాక్టర్లు ఒకరిద్దరు వచ్చి కాళ్లు ఎలా ఉన్నాయో అని తేరపార చూశారు. ‘వీళ్లు నా గుండెకు ఆపరేషన్ చేస్తారా.. లేకపోతే కాళ్లకా’ – అన్న అనుమానం వచ్చింది. ఆ తర్వాత తెలిసింది నా రెండు కాళ్లకు పెద్ద కట్లు ఎందుకు కట్టారో, కాళ్లకు కూడా ఆపరేషన్ ఎందుకు చేశారో.

కళ్లు మగతగానే ఉన్నాయి. కాసేపు నిద్ర, అంతలో మెలుకువ. నర్సు నాలుగైదు సార్లు అడిగిన తర్వాత నా పెదవులు విచ్చుకున్నాయి.

‘అమ్మాయి దివ్యను చూడాలని ఉంది’ నర్సుతో చెప్పాను.

‘అలాగేనండి, పిలిపిస్తాను’

అంతలో మళ్ళీ నిద్ర. ఎంత సేపు పడుకున్నానో తెలియదు.

‘నాన్నా, నాన్నా..’ – అన్న పిలుపుకి కళ్లు తెరిచాను. ఎదురుగా అమ్మాయి. నాకెంతో ధైర్యం వచ్చినట్లు అనిపించింది. ధైర్య వచనాలు చెప్పింది. నేను నవ్వాను.

ఆ నవ్వులో ఆత్మవిశ్వాసం ఉంది.

ఆ నవ్వులో మెడికల్ టెక్నాలజీ పట్ల నమ్మకం ఉంది.

ఆ నవ్వులో మీరంతా ఉండగా నాకెందుకు దిగులు అన్న తృప్తి దాగుంది.

ఆ నవ్వులో జీవిత సారం దాగున్నది.

ఐసీయులో నాలుగు రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ విశాలమైన గదిలో నాలాగానే మరికొంత మంది గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారే. కొంత మంది ఒకటి రెండు రోజుల్లోనే రూమ్‌కి షిప్ట్ అవడం చూశాను. కానీ ఎందుకో తెలియదు నాలుగు రోజులు దాటాక గాని నన్ను రూమ్‌కి షిప్ట్ చేయలేదు. నర్సులు, డాక్టర్లు చెప్పినట్లు బుద్ధిగా ఉండటం తప్ప నాకు వేరే పనిలేదు. ఆపరేషన్ అయిన తర్వాత కంటి నిండా నిద్ర పట్టేది కాదు. ఏవో మాత్రలు ఇచ్చినా ఆ నిద్ర కాసేపే. దీంతో రకరకాల ఆలోచనలతో నా మెదడు నిండిపోయేది. ఏ కాలక్షేపమూ లేదు. మెదడు మాత్రం చురుగ్గా పనిచేస్తున్నది. కాళ్లు కదపలేని స్థితి. ఇక ఛాతీ దగ్గర కోత.. వెరసి మెడ నుంచి కాలి చీలమడమ వరకు ఏ అవయవం సరిగా కదల్చలేనంతగా కోతలు.

ఇది పునర్జన్మ. భగవంతుడు నాచేత ఏవో కొన్ని పనులు చేయించాలనుకున్నాడేమో. ఇలా ఆలోచిస్తుంటే నా చిన్నప్పుడు బామ్మ, అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పుట్టినప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడినట. స్నానం చేయిస్తుంటే కాళ్ల సందుల మధ్య నుంచి దూరి పోయేవాడినట. కాస్త పెరిగి పెద్దయినా ఎప్పుడూ ఏదో ఒక రోగం. అందుకే నన్ను అపురూపంగా పెంచారు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత ‘మళ్ళీ ఎలుక పుట్టింది’. ఏదో ప్రయోజనం తప్పకుండా ఉండే ఉంటుంది. అదేమిటో తెలియదు.

ఇలా సాగేవి ఆలోచనలు. కాలక్షేపం కోసం పాత సినిమా పాటలను గుర్తుచేసుకోవడం ప్రారంభించాను.

‘అందాల రాణివే,

నీవెంత జాణవే…’ – ఈ పాటలో ఓ చోట..

‘శ్రీవారి హృదయమూ

నాకెంత పదిలము.

నా ప్రేమ నిరతమూ

కాపాడు కవచము’

సరిగా అక్కడ ఆలోచనలో పడ్డాను. నిజమే, నా శ్రీమతి అదృష్టమే అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడటం. ఈ పాట వ్రాసిన కవి ఏ ఉద్దేశంతో వ్రాసినా, నాకైతే నా గుండె చప్పుడు కోసం శ్రీమతి శ్రీదేవి ఎంతగా తపించిందో.. తలచుకున్నప్పుడల్లా ఆగని కన్నీళ్లు.

శ్రీదేవితో పాటు సమీప బంధువులు, మిత్రులు పడిన తపన తలుచుకుంటుంటే ఇప్పటికీ నా హృదయం బరువెక్కుతూనే ఉంటుంది. పేరుపేరునా వారికి నా కృతజ్ఞతాంజలి.

ఐసీయులో ఉన్నప్పుడు, ఆ తర్వాత రూమ్‌కి షిప్ట్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఈ నా అనుభవమంతా అక్షర రూపం పెట్టాలని. కానీ ఏవో కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు యీ జీవన సాఫల్య యాత్ర (జీవనరాగాలు) కారణంగా గుర్తుతెచ్చుకోగలుగుతున్నాను. భగవంతుడు ఆదేశిస్తాడు.

ఈ ‘ఎలుక’ చేస్తుంటుంది.

అంతే.

ఐసీయులో ఉన్నప్పుడు నాలో నేను అంత్యాక్షరి కార్యక్రమం పెట్టుకుని పాత పాటలను మనసులోనే పాడుకుంటూ ఆ పాటలను విశ్లేషిస్తూ కాలక్షేపం చేసేవాడ్ని. ఈ ఆలోచనల ఫలితమే ఓపిక వచ్చిన తర్వాత నేను చేపట్టిన మెగా ఈవెంట్ – ‘ఘంటసాల శత జయంతి’ సందర్భంగా శతాధిక కార్యక్రమాల రూపకల్పన.

ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంటుంది. ఆ విషయం ఇదిగో ఇలాంటప్పుడే బాగా అర్థమవుతుంది. నా జీవితంలోనూ అదే జరిగింది. నా ‘రెండో జీవితం’ ఆనందకరంగా సాగిపోతున్నది. ఈ ఎలుక ఎన్నో పురస్కారాలు, మరెన్నో సత్కారాలు అందుకుంటున్నది. ‘సాఫల్యత’ – అన్న పదానికి ఇంతకంటే అర్థం మరొకటి ఉంటుందా అనిపించేలా సాగిపోతున్నది ఈ జీవితం.

విశ్రాంతి:

ఓపెన్ హార్ట్ ఆపరేషన్ తర్వాత ఆధ్యాత్మిక చింతన పెరిగింది. మంచి చేయాలన్న తపన కూడా. మనిషి విలువ తెలిసింది. అంతే స్థాయిలో ‘విశ్రాంతి’ విలువ కూడా అర్థమైంది. రెస్ట్ తీసుకుంటూనే మనం చేయగలిగిన పనులు ఏమిటో గుర్తించి వాటిని మాత్రమే చిత్తశుద్ధితో చేయడం అలవాటైంది. ఈ విశ్రాంతి సమయం (రిటైర్డ్ లైఫ్) లోనే అనేక జ్ఞాపకాలు నెమరువేసుకోవాలి. ఆ పనిలో పడ్డాను. ప్రతి వ్యక్తి జీవితంలో మంచిచెడులు ఉంటాయి. చెడును ప్రక్కన బెట్టి మంచి విషయాలు తలుచుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటే మానసిక ఆనందం మనసొంతం అవుతుందని అర్థమైంది. నెగెటీవ్ ఆలోచనలకు స్వస్తి చెప్పాలి, పాజిటీవ్ థింకింగ్ పెంచుకోవాలి. అందుకే –

‘మంచిని పెంచుదాం

మంచిని పంచుదాం’

ఈ నినాదంతో ఫేస్‌బుక్‌లో రేడియో స్టేషన్ (ఆడియో స్టేషన్) పెట్టి అనేక మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేశాను. ఈ లక్ష్యంతోనే నా యూట్యూబ్ ఛానెల్ (channel 5am) లో ‘తెలుగు సినిమాకు పట్టాభిషేకం’ పేరిట వందకు పైగా కార్యక్రమాలు అందిస్తూ వందలాది మంది సంగీత, సాహిత్యాభిమానులను సంపాదించుకున్నాను.

‘ఈనాడు’తో మొదలైన నా కెరీర్ ఈ విశ్రాంత జీవన వేళలో కూడా ఇంకా కొనసాగుతున్నట్లుగానే భావిస్తున్నాను. తుది శ్వాస వరకు సమాజానికి మంచి చేయాలన్న సంకల్పమే నా బలం. ‘ఆంధ్రప్రభ’తో నాకున్న విశేష అనుబంధం గురించీ, అలాగే ‘ఆకాశవాణి’, ‘తరంగా’ రేడియో స్టేషన్లలోని ముచ్చట్లు, ఇంటర్నెట్ రేడియో ప్రస్థానం, వెబ్ సైట్స్ లో వ్యాస పరంపర, విదేశీ యాత్ర అనుభవాలు.. ఒకటేమిటీ ఇలా చెప్పడానికి చాలానే మిగిలి ఉన్నాయి. ఈ తరహా ముచ్చట్లతో మనం కలిసి ప్రయాణం సాగిద్దాం. పదండి ముందుకు..

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here