తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-22

1
13

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

పెళ్ళి సందడి:

[dropcap]‘బా[/dropcap]దం ఆకుల్లో ఉప్మా పెడుతారు. మీరూ వెళ్ళండర్రా..’

అమ్మ వచ్చి చెప్పింది. దీంతో మా ఆటలు కట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్లాము. గాడి పొయ్యి దగ్గర వంట వాళ్లు చిన్న గుండిగలో వేడి వేడి ఉప్మా వండుతున్నారు. పొయ్యి క్రింద కట్టెలు మండుతున్నాయి. మేమేమో మరీ పొయ్యి దగ్గరకు వెళ్లడంతో మంట సెగ వంటికి బాగా తగులుతోంది. ఇంతలో ఓ వంట వాడు కసురుకుంటూ –

‘ఏయ్ పిల్లలు పొయ్యి దగ్గరకు రాకండీ, చర్మం కాలిపోతుంది జాగ్రత్తా..’ అంటూ హెచ్చరిక చేశాడు.

‘అమ్మ చెప్పింది, ఉప్మా పెడతారంటగా’ అన్నాడు నా ఫ్రెండొకడు.

‘ఇంకా కాలేదు, ఓ పదినిమిషాలు పడుద్ది. కాసేపు ఆడుకుని రండి’

అక్కడ సీను ఇప్పటికీ నాకు బాగా గుర్తే. వంట వాళ్లలో మగ వంట వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరో ఇద్దరో ఆడవాళ్లూ ఉన్నారు. వీళ్లంతా మడి కట్టుకునే వంట చేస్తున్నారని బామ్మ ఎంతో గర్వంగా చెబుతుంటే నేను విన్నాను. మడి గురించి అప్పటికే నాకు బోలెడు తెలుసులేండి. నా చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. మడి అంటే ఏం లేదు, తడి బట్టలు కట్టుకోవడం ఒక పద్ధతి అయితే, రెండోది తడిపి ఆరేసిన బట్ట కట్టుకోవడమన్నమాట. మడి కట్టుకున్నప్పుడు వాళ్లని ఆ బ్యాచ్ వాళ్లే అంటే, మడి కట్టుకున్న వాళ్లే ముట్టుకోవాలి. వేరే వాళ్లు ముట్టుకుంటే ఆ మడి గాలికి ఎగిరిపోతుంది. వాళ్లు ‘మయల’ పడిపోతారన్న మాట. మేమేమో పిల్లలమాయె, పైగా పొడి బట్టలు కట్టుకుని మడి పాటించే వాళ్లను గుర్తుపట్టడం కష్టం. మేమేదో ఆడుకుంటూ పొరపాటున ముట్టుకుంటే ఇంట్లో పెద్ద సీన్ క్రియేట్ అవుతుండేది. చిన్న బుజ్జాయిలం కదా, మమ్మల్ని ఏమీ అనలేరు. కాకపోతే వాళ్లే మళ్ళీ నూతి దగ్గరకు పోయి తలమీద ఓ నాలుగు చెంబులు పోసుకుని తడి బట్టలతో వచ్చేవారు. అప్పుడు వారు మరోసారి మడి బ్యాచ్‌లో చేరిపోయేవారన్న మాట. మడి – మయిల ఆచారాలు బ్రాహ్మణ ఇళ్లలో చాలా గట్టిగా ఉండేవి. వాటి పునాదులు ఎప్పుడు ఎక్కడ పడ్డాయో చెప్పడం కష్టమే అని నా ఫ్రెండ్స్‌లో తెలివిగల ఫ్రెండొకడు అనడం నేను విన్నాను. ఇలాంటి ఆచారాలు ఇప్పుడు చాలా మటుకు తగ్గాయనీ, మడి అందుకు పాటించాల్సిన ఆచారాలు అన్న విషయంలో బోలెడన్ని ఎమెండ్మెంట్స్ (సవరణలు) వచ్చాయని చెబుతుండేవారు.

సరే, మనం బాదం ఆకు – ఉప్మా దగ్గరకు వెళదాం పదండి. బ్రాహ్మణ వంటవాళ్లు టైమ్‌కి వంట అందించాలని తెగ హైరానా పడుతున్నారు. ఎంతగా అంటే, వాళ్ల ఒళ్ళంతా చమటలు పట్టేశాయి. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ దంచి కొడుతోంది. మరి ఎండాకాలం కదా. పైగా గాలి ఆడటం లేదు. కట్టెల పొయ్యి క్రింద మంట అటూ ఇటూ ఊగకుండా నిటారుగా పైకి ఎగిసిపడుతోంది. పొయ్యి మీద చిన్న గుండిగ మీద నీళ్లు సలసలా కాగుతుంటే గోధుమ రవ్వ తీసుకుని అందులో ఓ పద్ధతి ప్రకారం పోస్తూ చాలా పొడవు ఉన్న గరిటెతో గుండ్రంగా తిప్పుతున్నారు. ఉప్మా చేయడం ఒక ఆర్ట్. ఎవరు పడితే వాళ్లు ఉప్మా చేస్తే దాని రుచి తగ్గి ఉప్మా పట్ల వ్యతిరేకత పెరిగిపోతున్నదనీ, అలా పెరిగి పెరిగి చివరకు ఉప్మా వ్యతిరేక సంఘం ఏర్పడిందని తెలివైన ఫ్రెండ్ చెబుతుంటే నాకు బోలెడు ఆశ్చర్యమేసింది. దీనితో పాటుగా ఉప్మా పట్ల సానుభూతి కూడా పెరిగింది. ‘అయ్యో పాపం ఉప్మా, దీన్ని రక్షించాల’ని పెద్దయ్యాక ఉప్మా అభిమాన సంఘం పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

ఉప్మా గురించి మా ఫ్రెండ్ గాడు బోలెడు కబుర్లు చెబుతుండగానే – ‘ఉప్మా రెడీ అయింది. రండర్రా పిల్లలు’ అంటూ హెడ్ కుక్ పిలిచాడు. చిన్న గుండిగ దించి దాని ప్రక్కనే బాదం ఆకుల దొంతర, దాని ప్రక్కన కుండ నీరు, సత్తు గ్లాస్లు ఓ నాలుగు అందుబాటులో ఉంచారు. ఉప్మా కోసం పిల్లలమైన మేము ఎగబడ్డాము. ఈ రోజుల్లో ‘బపె’ (Buffet) మీల్స్ ఏర్పాటుతో పెద్ద వాళ్లే ప్లేట్స్ పట్టుకుని ఎగబడుతుండటం చూస్తుంటే, అప్పుడు పిల్లలమైన మేము ఎగబడటం తప్పే కాదని ఇప్పుడనిపిస్తున్నది. బపె పద్ధతి ఒక రకంగా మంచిదే. వండిన అన్ని ఐటెమ్స్‌ని ఒక క్రమపద్ధతిలో డిస్‌ప్లే చేస్తారు. ఎవరికి వారు వారికి కావలసింది వడ్డించుకుని హాయిగా తినవచ్చు. కాకపోతే క్రమశిక్షణ గాడి తప్పడంతో అతిథులు వారివారి హోదాలు గట్రా కూడా మరిచిపోయి ప్లేట్లు పట్టుకుని ఎగబడుతున్నారు. లోపం ఎక్కడున్నదో నాకు తెలియదు కానీ ఈ పద్ధతి నాకెందుకో నచ్చలేదు. నా చిన్నప్పుడు ఫలానా వారి ఇంట్లో భోజనాలు అనగానే అతిథి కంటే ముందు వారి ఇంటి నుంచి ఇత్తడి గ్లాసో, వెండి గ్లాసో (ఇది వారివారి స్థాయిలను బట్టి ఉంటుంది) ముందుగా వచ్చేస్తుంది. అలా గ్లాస్ పట్టుకొచ్చిన వాడు – ‘అయ్యగారు భోజనానికి వస్తామని చెప్పమన్నారయ్యా’అంటూ ఎంతో వినయంగా ఆ గ్లాస్‌ని విందుకు పిలిచిన వారికి ఇచ్చేవాడు. అలా ఇచ్చిన గ్లాస్ అప్పటికే భోజనాల కోసం విస్తర్లువేసి, వాటిపై కొద్దిగా నీళ్లు జల్లి ఉంచిన బంతి (వరుస)లో అతిథి స్థాయిని బట్టి ప్లేస్ కేటాయించేవారు. అలా అతిథి కంటే వారి యొక్క గ్లాస్ వచ్చి బంతిలో హుందాగా నిలుచ్చున్న కాసేపటికి అతిథి వచ్చేవాడు. ఇది అతిథులందరి విషయంలో కాదనుకోండి. అతిశయం ఉన్న అతిథులే అలా ప్రవర్తిస్తుంటారని నాకనిపించేది. చక్కగా విస్తర్లో, అరిటాకులో బారుగా పరిచి వాటిమీద గ్లాస్‌లు ఉంచాక, వడ్డన జరుగుతుంది, భోజనాలకు రమ్మనమంటూ ఆహ్వానం అందేది. అప్పటి వరకు కాలక్షేపం కబుర్లు చెప్పుకునే అతిథులంతా నెమ్మదిగా బంతులను ఆక్రమించేవారు. బ్రాహ్మణ బంతి భోజనాలలో అన్ని వంటకాలు పూర్తిగా వడ్డించిన తర్వాతనే ఔపోసన పట్టి భోజనాలకు ఉపక్రమించేవారు. భోజనానికి ముందు హరి నామ స్మరణమో, లేదా హర నామ స్మరణమో చేయాల్సిందే. బంతిలో అందరి భోజనం అయిన తర్వాతనే హస్తప్రక్షాలనకు (హ్యాండ్ వాష్) లేవాలి. వడ్డన కూడా ఎంతో మర్యాదగా సాగేది. పదార్థాలను కొసరికొసరి వడ్డించేవారు. అతిథి తృప్తిగా తినేవరకు ఆతిధ్యమిస్తున్న వారు వదిలిపెట్టరు. సరే..

బాదం ఆకుల్లో చిప్పడు ఉప్మా విదిలించాడు హెడ్ కుక్. నోట్లో పెట్టుకోగానే ఉప్పు ఎక్కువైంది. ఇదే విషయం తెలివిగల ఫ్రెండ్‌కి చెబితే , వాడో నవ్వు నవ్వి, కాదా ఏమిటీ, వంట వాడి చెమట కూడా ఉప్మాలో కలిసిపోయిందిగా – అంటూ పకపకా నవ్వేశాడు. వాడెప్పుడూ అంతే, ఏం జరిగినా కోపం తెచ్చుకోకుండా తేలిగ్గా నవ్వేస్తాడు. ఇదో రకంగా వరం. మనకు నచ్చనివి ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఆపలేనప్పుడు నవ్వడమే ఓ పెద్ద టానిక్ అని తర్వాత తెలుసుకున్నాను. ముఖ్యంగా గుంటూరులో సిటీ బస్సు ఎక్కినప్పుడు. ఆ విషయం ఈ భాగంలోనే తర్వాత చెబుతాను.

ఉప్మాలో ఉప్పు కాస్తంత ఎక్కువైనా రుచి మాత్రం బాగుంది. బాదం ఆకు మీద వెయించుకున్న ఉప్మా అయిపోగానే ఇంకాస్త పెట్టించుకోవడం కోసం కొత్త ఆకు తీసుకోబోతుంటే, పనివాళ్లలో ఒకడు ‘అబ్బాయి గారూ తిన్నఆకులోనే ఏయించుకోండి. కొత్త ఆకు ముట్టబోకండి’ అంటూ దాదాపుగా కసురుకున్నంత పని చేశాడు. వాడి వైపు కోపంగా చూస్తుంటే చేతిలో ఉన్న ఆకు మీదనే మరి కాస్త ఉప్మా వచ్చి పడింది.

పెద్ద వాళ్లందరూ బారుగా కూర్చుంటే వాళ్లందరి ముందు బాదం ఆకులు పరచి ఉప్మా పెట్టడం మొదలెట్టారు వంట వాళ్లు. టిఫినీలకు కూడా అంత పద్ధతి పాటించేవారు ఆరోజుల్లో.

ఇదంతా 1960వ దశకంలో నేను చూసిన ఓ పెళ్ళింటి సంగతులు. ఆ రోజుల్లో పెళ్ళిళ్లు పేరంటాలు ఇలా ఏ ఫంక్షన్ జరిగినా ఇప్పట్లా పేపర్ ప్లేట్లు, బఫె మీల్సులు, ఫంక్షన్ హాల్సు ఉండేవి కావు. ఇప్పటితో పోలిస్తే చాలా సింపుల్‌గా , సహజ సిద్ధమైన వాతావరణంలో ఫంక్షన్స్ జరిగేవి. కొన్ని సార్లు ఏ రామాలయంలోనో, వీధిలోనో పెళ్ళిల్లు జరిగేవి. ఒక ఇంట్లో పెళ్లంటే ఊరంతా పండుగే. కనీసం ఆ వీధిలోని వారంతా కలిసికట్టుగా పనిలోకి దిగేవారు. వీధికి అటు చివర, ఇటు చివర ఎడ్ల బండ్లు నిలిపేసి వీధిలో తాటాకు పందిరి వేసి పెట్రొమాక్స్ లైట్లు వెలిగించి, సన్నాయి మేళం వినిపిస్తూ నూతన వధూవరులను ఒకటి చేసే తంతు చాలా సందడిగా ఉండేది. చాలా చోట్ల ఐదు రోజుల పెళ్ళిల్లు జరిగేవి. పెళ్ళి తంతులో అన్ని ఆచారాలు ఇప్పటిలా తూ.తూ మంత్రంలా లాగించేవారు కారు. కనీసం నెల రోజుల పాటు పెళ్ళి వారి ఇల్లు కళకళలాడుతుండేది. హాడావుడి అయ్యాక ఇంటి యజమాని లెక్క చూసుకుని గుండెలు బాదుకున్న సందర్భాలూ ఉండేవి. మధ్యతరగతి రైతు తన ఇంట్లో ఒక్కో పెళ్ళికి రెండు మూడు ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చేది. మాది కూడా మధ్యతరగతి రైతు కుటుంబమే. పెళ్ళిళ్లు ఇతర ఖర్చులకు పొలాలు ఆవిరైపోవడం నాకెరుకే. సరుకులు ఇచ్చే కోమటి కొట్టు దగ్గర నుంచి పెళ్ళి జరిపించిన పురోహితుడు వరకు అందరికీ పొలం అమ్మగా వచ్చిన డబ్బు సర్ది పంపేచడం నేను చూశాను. అందుకే అంటారు – ‘పెళ్ళి చేసి చూడు – ఇల్లు కట్టి చూడు’ అని. ‘ఈ రెండూ జీవితంలో ఎదురయ్యే పెద్దపెద్ద ఖర్చుల్రా, తప్పవు, భరించాల్సిందే’ అని నాన్నగారు అనేవారు. ఆ తర్వాత నాకు కూడా బాగానే తెలిసొచ్చిన ఖర్చులే ఇవి. అదృష్టం తోడైతే పరువు కాపాడుకోగలుగుతాము. లేదంటే అపవాదులు తప్పవు.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనేక పెళ్ళిల్లు చూశాను. గుండమ్మ కథ సినిమాలో గుండక్కతో గంటన్న అంటాడూ –

‘చెల్లాయ్, పెళ్ళి గుళ్లో బ్రహ్మాండంగా చేయించాను. ఖర్చు మూడు రూపాయల ముప్పావల’

‘ఆ చేశాడాల్లే గుండక్కా, తూతూ మంత్రం పెళ్ళి, ఏదీ ఒక రూపాయి ఇవ్వు, ఏదో అలా రిక్షామీద తిరిగొస్తాం’ అంటాడు ఎన్టీఆర్.

నిజమే ఆ రోజుల్లో పేద కుటుంబాల ఇళ్లలో ఇలాగే పెళ్ళిల్లు చాలా సింపుల్ గానే జరిగేవి. వధూవరులే కాదు, అంతా చాలా సింపుల్‌గా ఉండే వారు. మరి అలాంటి సింపుల్ పెళ్ళిళ్లు ఈనాడు లేవా? అంటే ఎందుకు లేవు, జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య అన్నవరం వెళ్ళాను. అక్కడ ఆర్భాటంగా పెళ్ళిళ్లు చేసుకునే వారూ ఉన్నారు. అలాగే వంద రూపాయలకు పెళ్ళి చేసుకునే వారూ ఉన్నారు. కళ్యాణాలు జరిగే ప్రదేశంలో ఓ సింపుల్ పెళ్ళి చూశాను. వధూవరులు, పురోహితులు కాకుండా కేవలం నలుగురే అతిథులు. ఏ ఆర్భాటం లేకుండా పెళ్ళి తంతు ముగిసింది. నా చిన్నప్పుడు ఇలాంటి పెళ్ళిళ్లు చూశాను. చాలా పెళ్ళిళ్లు ఇంట్లోనే జరిగేవి. ఇంటి ఆవరణలోనే నాలుగు మామిడి తోరణాలు కట్టేసి, పచ్చటి ఆకులు, పూలతో కల్యాణ మండపం కట్టేసి పెళ్లి కానిచ్చే వారు. అతిథులు కూడా అంతే సింపుల్‌గా నేలమీదనో అరుగులు మీదనో హాయిగా కూర్చుని పెళ్ళివారు ఇచ్చిన విసిన కర్రతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళి వేడుక తిలకించేవారు.

నా మటుకు నేను ఫంక్షన్ హాల్లో పెళ్ళిల్లు చూడటం 70వ దశకం చివరి నుంచి చూసినట్లు గుర్తు. మద్యతరగతి పెళ్ళి తంతు జరిగే తీరులో మార్పు 80వ దశకం నుంచి స్పష్టంగా కనిపించింది. చేతిలో డబ్బులు ఆడకపోయినా గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో అని అప్పుజేసి పెళ్ళి ఖర్చు తడిసి మోపెడు చేయడం, ఆపైన చేతులు కాల్చుకోవడం నాకు తెలుసు. 70ల్లోనే ఫంక్షన్ హాల్సు చిన్న చిన్న టౌన్స్ లోనూ వెలిశాయి. వాటి చుట్టూ అనేక వ్యాపారాలు ఊపెక్కాయి. ఆనాటి పెళ్ళిళ్లకూ నేడు వైభవం పేరిట జరుగుతున్న హడావుడి పెళ్ళిళ్లకు సహస్రం తేడా ఉంది. పైగా ఇప్పుడు ఆ పోకడ మరీ వెర్రితలలు వేస్తున్నట్లు నాకనిపిస్తోంది. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దాని కోసం పెడుతున్న ఖర్చు గురించి ఇక మాట్లాడేది ఏముంది..

పెళ్ళి అన్నది ఏ కుటుంబంలోనైనా ఓ ముఖ్యమైన వేడుక. కాస్తంత హడావుడి, రవ్వంత అలకలు, కొండంత ఆనందం కలిస్తేనే పెళ్ళి సందడి. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్‌లో పెళ్ళి అన్నది కామన్ అయిపోయింది. గుళ్ళో పెళ్ళి అన్న మాట చాలా అరుదైపోయింది.

పెళ్ళి పిలుపల విషయంలో కూడా మార్పులు వచ్చాయి. పెద్దపెద్ద నగరాల్లో ఇంటికి వచ్చి పిలవడం తగ్గిపోతున్నది. పూర్వం బాగా దూరంగా ఉండే బంధువులకు మాత్రమే కార్డులు వ్రాసి ఆహ్వానించేవారు. ఇక ఇప్పుడు వాట్సప్ సందేశాలు చాలని సరిపెట్టుకుంటున్నారు. వాట్సప్‌లో పిలిస్తే , గిఫ్ట్ కూడా వాట్సప్ లోనే పంపితే చాలనీ, మనకీ రూపాయి ఖర్చు ఉండదని ఒకతను ఛలోక్తి విసిరాడీ మధ్య.

నేను ఆంధ్రప్రభలో చేరాక ఒక సంవత్సరం గడిచాక అంటే 1985 ఏప్రిల్ 24న పెళ్ళి చేసుకున్నాను. గుంటూరులో మంచి పేరున్న మన్నవ గిరిధర రావు గారి పెద్ద కూతురు శ్రీదేవితో వివాహం జరిగింది. సందర్భం వచ్చినప్పుడల్లా మన్నవ గిరిధర రావు గారి గురించి చెబుతూనే ఉన్నాను. వారి గురించి ఓ నాలుగు మాటలు ఇప్పుడు కూడా..

మన్నవ గిరిధర రావు:

వీరు నాకు మామగారు మాత్రమే కాదు, అనేక విషయాల్లో మార్గదర్శకులు కూడా. మన్నవ గిరిధర రావు గారు ఒక పక్క హిందూ కాలేజీలో పాఠాలు ఎంత గొప్పగా చెప్పేవారో అంతే గొప్పగా వారి రచనలు వేలాది మంది పాఠకులను ఆకట్టుకునేవి. వీరు గుంటూరు జిల్లా మన్నవ అనే గ్రామంలో పుట్టారు.

మన్నవ గిరిధర రావు గారు ఆంధ్రప్రభ – విజయవాడ ఆఫీస్‌కి తరచూ వస్తుండే వారు. అక్కడ అజంతా గారినీ, వాసుదేవ దీక్షితులు గారినీ, కందర్ప రామచంద్ర రావు గారినీ కలుస్తుండేవారు. ఆంధ్రప్రభ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ దోమలగూడాలో ఉంది. ఆ రోజుల్లో ఎడిటర్‌గా ఉన్న పొత్తూరి వేంకటేశ్వర రావు గారు అప్పుడప్పుడూ విజయవాడ కార్యాలయానికి వస్తుండే వారు. అలాంటప్పుడు వారి సన్నిహితులు వచ్చి కలుస్తుండే వారు. మా మామగారు కూడా వచ్చి కలుస్తుండేవారు. అప్పట్లో వారో రచయిత అని మాత్రమే నాకు తెలుసు. అది కూడా ఆంధ్రప్రభలో వ్యాసాలు పడుతుండటం వల్ల తెలిసింది. ఓ సారి, గిరిధర రావు గారు ఎప్పట్లాగానే ఆంధ్రప్రభ ఆఫీస్‌కు రాగానే కందర్పగారిని కలిసి ఆ తర్వాత న్యూస్ ఎడిటర్ రూమ్ లోకి వెళ్ళారు. కాసేపు అయ్యాక నాకు పిలుపు వచ్చింది. సాధారణంగా ఏదో పెద్ద పని ఉంటేనే కానీ ఓ ట్రైనీ సబ్ ఎడిటర్‌ని క్యాబిన్ లోకి రమ్మనమని అనరు. నాకు కాస్త భయం కూడా వేసింది. లోపలకు వెళ్ళాను. వాసుదేవ దీక్షితులు గారికి ఎదురుగా కూర్చున్న ఓ పెద్ద మనిషి కూర్చుని ఉన్నారు. వారిని చూపిస్తూ, ‘వీరు నీకు తెలుసా’ అని అడిగారు దీక్షితులు గారు. తెలియదండి అన్నాను వినయంగా.

‘పోనీ, మన్నవ గిరిధర రావు గారి పేరు విన్నావా’ అని మరో ప్రశ్న.

‘పేపర్‌లో చూశానండి’

‘వారే వీరు..’

‘అవునా!’

వారి గురించి దీక్షితులు గారు కొన్ని వివరాలు చెప్పారు. వారిది గుంటూరు అని, హిందూ కాలేజీలో లెక్చరర్ అనీ, అంతకు ముందు 1968 నుంచి 74 వరకు ఎమ్మెల్సీగా కూడా చేశారని, మంచి రచయిత అని ఏవోవో చెప్పారు. ఇవన్నీ నాకెందుకు చుబుతున్నారో నాకర్థం కాలేదు. బహుశా వీరి మీద వ్యాసం రాయాలేమో, అందుకే వివరాలు చెబుతున్నారనుకుంటా అని నాలో నేను అనుకుంటుండగానే , ఇక నీవు వెళ్లవచ్చు అన్నట్లు సైగ చేశారు. డెస్క్ దగ్గరకు రాగానే కందర్పగారు పిలిచి కాసేపు మాట్లాడారు. ఆ మాటల్లో కూడా గిరిధర రావు గారి కుటుంబం ప్రస్తావనే ఎక్కువ. సరే, ఏం చేస్తాము.. విన్నాము.

ఆ తర్వాత కొన్నాళ్లకి నందిగామ నుంచి కబురొచ్చీంది. గుంటూరులో పెళ్ళి సంబంధం చూడటానికి మనం వెళుతున్నామని. అప్పుడు తెలిసింది. ఆఫీస్ కబుర్ల వెనుక ఉన్న గూడార్థం.

గుంటూరులోని కృష్ణ నగర్. ఇది టౌన్‌కి ఓ మూలగా ఉండేది. బస్టాండ్‌కి చాలా దూరం. అయితే అక్కడి నుంచి సిటీ బస్సు ఎక్కితే స్వామి థియేటర్ దగ్గర దిగి, కుడి వైపు సందులోకి వెళితే గిరిధర రావు గారి ఇల్లు వస్తుంది. ఇంటి ముందు మామిడి, కొబ్బరి చెట్లు ఉండేవి. చక్కటి గాలి వెలుతురు ఉన్న ఇల్లు అది.

పెళ్ళిచూపులకు వెళ్ళి తిరిగి విజయవాడకి వచ్చాక నాకంటే అమ్మాయి పొడుగేమో అన్న సందేహం వచ్చింది. ఈ విషయం చెబితే, ‘మరి అప్పుడేం చూశావురా..’ అంటూ కాస్తంత కసురుకున్నా మరోసారి చూపులు ఏర్పాటు చేశారు. మా ఇద్దర్నీ పక్కపక్కన నిలబెట్టి – ‘రవ్వంత అబ్బాయే పొడుగు’ అని తేల్చేశారు. సరే, ఇక తరువాత ఆలోచనలు పెళ్ళి చుట్టూనే.

నందిగామ నుంచి ఎర్ర బస్సు (ఆర్టీసీ వాళ్లు పెళ్ళిళ్ల కోసం బస్సులు అద్దెకు ఇస్తుంటారు) వేసుకుని పెళ్ళి వారమంతా గుంటూరు చేరాము. అత్త గారింటికి ప్రక్కనే విడిది ఇల్లు ఏర్పాటు చేశారు. అది అప్పుడే కొత్తగా కట్టిన ఇల్లు లాగా ఉంది. కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. మరికొన్ని లేవు. ప్రతి చిన్న విషయానికీ అలిగే తత్వం లేదు కనుక అందరూ సర్దుకుపోయారు. అక్కడికి దగ్గరల్లోనే బృందావన్ గార్డెన్స్‌లో కట్టిన శ్రీ వేంకటేశ్వరా ఫంక్షన్ హాల్‌లో పెళ్ళి. పెళ్ళికూతురు ముచ్చట పడిందట – అందుకే బ్యాండ్ మేళం పెట్టించారు.

పెళ్ళి అనగానే వారివారి హోదాలను బట్టి అతిథుల్లో సెలబ్రెటీలు కూడా వస్తుంటారు. మా పెళ్ళికి వచ్చిన అతిథుల్లోనూ ప్రముఖులు ఉన్నారు. కొంత మందిని గుర్తుచేసుకుంటున్నాను.

పుచ్చా పూర్ణానందం;

వీరి గురించి నా కప్పుడు పెద్దగా తెలియదు. కొన్ని సినిమాల్లో నటించారని మాత్రమే తెలుసు. వీరు రచయిత కూడా. ముఖ్యంగా వీరి హాస్య రచనా శైలి భిన్నమైనది. ఆంధ్రప్రభలో మీసాల సొగసులు పేరిట వ్యాసాలు వ్రాశారు. వీరు వృత్తిరీత్యా న్యాయవాది. నాటకరంగంలో ప్రవేశముంది. పుచ్ఛా పుర్ణానందం గారు ఆనందభైరవి, రెండు రెళ్లు ఆరు, శ్రీవారి శోభనం వంటి సినిమాల్లో నటించారు. ఆకాశవాణి ప్రసారం చేసిన కొన్ని నాటికల్లో కూడా పాత్రలు పోషించారు.

కుర్తాళం పీఠాధిపతి:

మా పెళ్ళికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చి నూతన జంటను ఆశీర్వదిస్తూ పద్య పంచకం చదివారు. వారిలో అన్నగారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు. అసలు పేరు పోతరాజు వెంకట లక్ష్మీ వరప్రసాద రావు. అనతి కాలంలోనే భార్గవ విద్యదేవ కులపతిగానూ, ప్రసాదరాయ కులపతిగానూ ప్రసిద్ధి చెందారు. వీరు హిందూ కాలేజీలో తెలుగు లెక్చరర్. వీరు అవధాన శేఖర, ఆశుకవి కేసరి వంటి బిరుదులు పొందారు. వీరు అమ్మవారి ఉపాసకులు. తదనంతర కాలంలో వీరు కుర్తాళం శ్రీ సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామిగా ప్రసిద్ధులయ్యారు.

ఇక, ఆంధ్రప్రభ నుంచి, అలాగే విశాఖపట్నం, నందిగామ నుంచి నా మిత్రులు వచ్చారు. విష్ణు తన కెమేరాతో బోలెడన్ని ఫొటోలు తీశాడు. పార్థ సారధి, విజయబాబు, గిరీశ్ వంటి వారితో పాటుగా ఆంధ్రప్రభ ఆఫీస్ నుంచి కరుణాకర రెడ్డి, మదన్ మోహన్, ఫణిధర్ కుమార్ వంటి వారు వచ్చారు. మర్నాటి పేపర్‌లో సింగిల్ కాలమ్ వార్తగా మా పెళ్ళి వేడుక అచ్చయింది.

మా పెళ్లయిన వారం రోజులకే బావమరిది మారుతీ ప్రసాద్ వివాహం అదే వేదిక మీద జరిగింది. పెళ్ళి సందడిలో శ్రీమతి శ్రీదేవి చురుగ్గా పాల్గొంటూనే మధ్యమధ్యలో నావైపు చూస్తుండేది. నేనూ అంతే అనుకోండి. అప్పుడు ఘంటసాల మాష్టారు లీలతో కలిసి పాడిన ఈ పాట గుర్తుకువచ్చి నవ్వుకున్నాను. మరి మీరూ ఓ సారి నవ్వుకోండేం..

‘ఫక్కున నీవు నవ్విన చాలు

చక్కదనాలే ఒలికేనే,

పక్కన నీవు నిలిచిన చాలు

ప్రపంచమంతా మెరిసేను..’

దోసావకాయ:

నాకు మొదటి నుంచి దోసావకాయ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే ఆవకాయ కంటే దోసావకాయనే ఇష్టంగా కంచంలో వేయించుకుంటాను. ఈ విషయం మా అత్తగారు లక్ష్మీ రాజ్యం పసిగట్టారు. నేను నాలుగు రోజులు ఉంటానని తెలిసినప్పుడల్లా దోసావకాయ జాడీలోకి ఎక్కించి ఉంచేవారు. వారింట్లో రాత్రి పన్నెండు, ఒంటి గంటైనా వరండాలో లైట్లు వెలుగుతుండేవి. అందుకో ముఖ్య కారణం మామగారు ఆ టైమ్‌లో ఏ వ్యాసమో వ్రాస్తుంటారు. నా ఆఫీసేమో విజయవాడ పూర్ణానందం పేట కదా, ఇది ఇటు రైల్వే స్టేషన్‌కీ, అటు బస్సాండ్‌కి దగ్గరే. శ్రీమతి అక్కడ ఉన్నప్పుడు రాత్రి ఎనిమిదింటికి అయిపోయే షిప్ట్ అయితే నా పనికాగానే బస్సెక్కి గుంటూరు వెళుతుండేవాడ్ని. సుమారుగా తొమ్మిది గంటలకు గుంటూరు బస్టాండ్‌లో దిగి అక్కడే ఎదురుగా ఉన్న సిటీ బస్సాండ్‌లో బస్సు ఎక్కేవాడ్ని. పట్టాభిపురం గేట్ లోకి వెళ్ళే శ్యామలా నగర్‌కి వెళ్లే బస్సులు, కొరిటపాడు, లక్ష్మీపురం వెళ్ళే బస్సులు ఎక్కేవాడ్ని. పట్టాభిపురం గేట్ మీదగా వెళ్ళే బస్సు ఎక్కువగా ఎక్కేవాడ్ని. స్వామి థియేటర్ దగ్గర దిగి నడుచుకుంటూ అత్తగారింటికి చేరేవాడ్ని. అప్పట్లో సిటీ బస్సులు ప్రేవేట్ మేనేజ్‌మెంట్ క్రింద ఉండేవి. ప్రయాణీకులను బస్సు ఎక్కించుకోవడంలో మాత్రం తెగ తొందరపెట్టేవాళ్లు. ఎక్కీ ఎక్కగానే టికెట్ ముక్క కోసి చేతిలో పెట్టేవాళ్లు. అంతే, బస్సు మాత్రం వెంటనే కదలదు. ఒక వేళ కదిలినా కాస్తం ముందుకు పోయి. ఆగి మళ్ళీ వెనక్కి (రివర్స్) చేసేవాడు. అలా ఓ నాలుగైదు సార్లు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్‌లా బస్సుని ముందుకీ వెనక్కీ పోనిస్తూ మొదట్లో ఎక్కిన ప్రయాణీకుల సహనం నశించి బూతుల దండకం ఎత్తుకునే సమయంలో వానదేవుడు కరుణించినట్లు, తొలకరి జల్లులు కురిపించినట్లు బస్సు నెమ్మదిగా కదిలేది. మధ్యమధ్యలో ఆగుతూ, సాగుతూ ఏ పదిన్నరో, పదకొండు గంటలకో స్వామి థియేటర్ దగ్గర దింపేవాడు. విజయవాడ – గుంటూరు ప్రయాణం సాఫీగా జరిగినా ఈ సిటీబస్సు ప్రయాణం మాత్రం బీపీ తెప్పించేదిగా ఉండేది. చివరకు ఎలాగో కాళ్లీడ్చుకుంటూ అత్తగారింటికి చేరగానే ఇంట్లోని వాళ్ళంతా ఆప్యాయంగా పలకరించడంతో సిటీ బస్సు ఇచ్చిన కోపం కరిగిపోయేది. సహజంగా మర్నాడు వీక్లీ ఆఫ్ ఉన్నప్పుడే అత్తారింటికి దారేది అన్నట్లు బయలుదేరేవాడ్ని. వీక్లీ ఆఫ్ నాడు వీలుగా ఉంటే స్వామి థియేటర్‌లో సినిమా చూడటం, లేకుంటే దగ్గర్లోని ఏ గుడికో వెళ్లడం ఓ సరదా. భోజనాల వంటల్లో నాకు ఇష్టమైన వంకాయ కూర, దోసావకాయ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసేవారు.

కృష్ణనగర్ ఇంటితో ఓ చక్కటి ఆత్మీయ బంధం ఉండేది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఇల్లు అమ్మేశారు. ఆ తర్వాత ఎప్పుడూ మేము అటుగా వెళ్లలేదు. వెళితే ఆ అనుభవాలతో గుండె బరువెక్కుతుందన్న దిగులుతో ఆ సాహసం చేయలేదు.

సత్తెమ్మ చల్లటి చూపు:

పెళ్ళి సందడి ముచ్చట్లు ముగించే ముందు, నందిగామకు దగ్గర్లోని అంబారు పేట ఆలయం గురించి తప్పకుండా ప్రస్తావించాల్సిందే. పెళ్ళి – అప్పగింతలు అయ్యాక మళ్ళీ ఎర్ర బస్సు ఎక్కి నందిగామ పెళ్ళివారితో బయలుదేరాము. ఇప్పుడు నా ప్రక్కన నా జీవిత భాగస్వామి. ఇదో మధురానుభూతి. బస్సు అంబారు పేట రాగానే ఆపించారు. అది రాత్రి వేళ కావడంతో కొంత మంది మాత్రమే కిందకు దిగారు. నూతన దంపతులను సత్యమ్మవారిని దర్శించుకోమన్నారు. అమ్మ చల్లటి చూపులు మావైపు ప్రసరించినట్లు అనిపించింది. సత్యమ్మ దయతోనే మా కాపురం ఇప్పటికీ ఆనందంగా సాగిపోతున్నది. మామగారు అంటుండేవారు – మీది హ్యాపీ హోమ్ అని. పెద్దల ఆశీస్సులు ఫలించకుండా ఉంటాయా..

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here