తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-23

0
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

గోవిందా..గోవిందా..:

[dropcap]తి[/dropcap]రుమలలో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం బంగారు కాంతులతో మెరిసిపోతున్నది. ‘ఎప్పుడెప్పుడా, స్వామి వారిని కన్నులారా వీక్షించేద’ని భక్తులు ఆరాట పడుతున్నారు. ఈ ఆరాటం తోపులాటకు దారితీస్తున్నా, భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న భక్తులకు ఈ బాధ తెలియడం లేదు. మేము ధ్వజస్తంభానికి చేరువకాగానే శ్రీమతి శ్రీదేవి నడవలేనంటూ కుప్పకూలింది. ఆమె పడుతున్న బాధను చూసిన సెక్యూరిటీ గార్డ్ ఆమెనీ, నన్ను రద్దీగా ఉన్న ప్రధాన క్యూ నుంచి తప్పించాడు. అంత బాధలోనూ ఆమె గోవింద నామస్మరణం ఆపలేదు. నేలమీద చతికిలపడి దేక్కుంటూ ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమె దర్శనం చేసుకోగలుగుతుందా? అలాగే దేక్కుంటూనే ధ్వజస్తంభం దాటింది. అంతలో వాలెంటీర్లలో ఓ ఇద్దరు యువకులు అక్కడికి చేరారు.

‘అమ్మా మీకు తప్పకుండా దర్శనం అవుతుంది. మీకు ఇబ్బంది లేకుంటే మేము మోసుకెళతాము.’

‘ఇబ్బంది ఏముంది నాయనా, దర్శనం చేయించండి..’ అంటూ భక్తి భావం ఉప్పొంగగా వచ్చిన కంట నీరుని తుడుచుకుంది.

అప్పటి వరకు పడ్డ ఆరాటం తొలిగిపోయింది. బలిష్టమైన ఆ ఇద్దరు యువకులు – అమ్మా, అమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ శ్రీదేవిని మోసుకెళుతుంటే నేను వారి వెంట నడిచాను. గర్భాలయం లోకి తీసుకువెళ్ళి – చూడండమ్మా, శ్రీవారిని – అంటూ దర్శనం చేయించి అంతే వేగంగా బయటకు తీసుకువెళ్ళారు. బయటకు వచ్చాక వీల్ ఛైర్ పిలిపించి అందులో కూర్చోబెట్టారు. ఇదంతా క్షణాల్లో జరిగిన అద్భుతం. నేను వాళ్లకు డబ్బు ఇవ్వజూపితే వారు సున్నితంగా తిరస్కరించారు. ఎందుకో వారి పట్ల గౌరవం పెరిగింది. మీ పేర్లు ఏమిటి నాయనలారా అని అడిగాను.

వారిలో ఒకరి పేరు జయ శంకర్. మరొకరి పేరు విజయ్ కుమార్. శ్రీవారి ద్వారపాలకులైన జయ విజయులే ఈ రూపాల్లో వచ్చి, ఇక అసాధ్యమనుకున్న దర్శనం సుసాధ్యం చేశారు. శ్రీవారి అనుజ్ఞ అయితే సాటి మనుషుల రూపంలోనే దేవతలు తిరగాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తుంటారని నాకు అప్పుడు అర్థమైంది.

అసలేం జరిగింది:

అప్పుడు మేము హైదరాబాద్‌లో ఉంటున్నాము. మా అబ్బాయి రాజేష్ – విప్రో సంస్థలో పనిచేస్తూ ఆన్‌సైట్ వర్క్ మీద ఇంగ్లండ్ వెళ్ళాడు. అమ్మాయి దివ్యతో పాటుగా మేము చెన్నైలో ఉన్న మా అక్కా వాళ్ళింటికి వెళ్ళాము. మేమంతా కారు మాట్లాడుకుని తిరుపతి యాత్రకు బయలుదేరాము. కాణిపాకం వినాయకుడ్ని దర్శించుకుని తిరుపతి వస్తుంటే అరగొండ అన్న ఊరు కనిపించింది. దీన్ని అర్థగిరి అని కూడా అంటారు. ఆంజనేయస్వామి వారు సంజీవనీ పర్వతాన్ని తీసుకు వస్తుంటే అందులో కొంత భాగం విరిగి ఇక్కడ పడిందట. ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం ప్రసిద్ధి.

కారు తిరుమల గిరుల ఘాట్ రోడ్డు మీద వెళుతోంది. ఎందుకో తెలియదు, నా నోటి నుంచి ఈ పాట వచ్చింది.

‘కలవారినే కాని కరుణించ లేవా..

నిరుపేద మొరలేవి వినిపించుకోవా.

అడగవే మా అమ్మా అలివేలి మంగ..’

తిరుమలలో శ్రీవారి ఆలయానికి చేరువనే ఉన్న వైఖానస ఆశ్రమంలో మాకు బస ఏర్పాటైంది. కారు వైఖానస దగ్గరకు తీసుకువచ్చాక డ్రైవర్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేశాడు. అక్కడే ఒక విపత్తుకు, ఒక మహత్తుకు బీజం పడింది. రోడ్డు ప్రక్కన డ్రైనేజ్ కాలవలు తవ్వి, సిమెంట్ పూత పూశారు. ఇక పైన బండలు వేయడమే తరువాయి. రాత్రి ఎనిమిది ప్రాంతంలో కారుని రివర్స్ చేస్తూ పార్క్ చేశాడు. కారుకి వెనకనే అత్యంత చేరువలోనే ఈ కాలువ ఉంది. శ్రీదేవి తప్ప మిగతా వారమంతా కారు దిగి ముందువైపుకు నడిచాము. కానీ ఆమె మాత్రం వెనుక వైపుకి అడుగులు వేయడం మొదలెట్టింది. మూత లేని కాలువ ఉన్నదని గమనించలేదు. క్షణంలో కాలువలోకి పడబోయింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా కాలు జాపింది. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ప్రక్కనే ఉన్న మాకూ అర్థం కాలేదు. కుంటుకుంటూ బసకు చేరాము. పొద్దున్నే దర్శనం చేసుకోవాలి. ఆ రాత్రంతా ఆమె మూలుగుతూనే ఉంది.

దర్శనం చేసుకోవాల్సిందే అని దృఢ సంకల్పం చెప్పుకుంది. వీల్ ఛైర్ తెప్పించి దర్శనం కోసం బయలుదేరాము. మిగతా వాళ్లంతా స్పెషల్ దర్శనం క్యూలోకి వెళ్ళారు. వీల్ ఛైర్ దాదాపుగా బంగారు వాకిలి దాకా వచ్చింది. ఇక కొద్ది దూరమే. ఈ కాస్తా నడవగలను అన్న పట్టుదలతో లేచి అడుగులు వేయడం మొదలుపెట్టింది. సరిగా అప్పుడే కుప్పకూలిపోయింది. ఈవిడ బాధ చూడలేక తొందరగా దర్శనం చేసుకునే వీలు కల్పించాడు సెక్యూరిటీ వాళ్లు. ధ్వజస్తంభం దగ్గర అలా జయ విజయులు ప్రత్యక్షమవడం, దర్శనం చిటికెలో జరిగేలా చూడటం – ఇదంతా శ్రీవారి మహిమ కాక మరేమిటీ..

అప్పటి వరకు నాలో ఉన్న – తిరుమల వేంకటేశుడు కాస్ట్లీ గాడ్ అన్న భావన పటాపంచలైపోయింది. అప్పటి నుంచి పైన ప్రస్తావించిన పాట పాడటం ఆపేశాను. అనన్య భక్తికి ఆమె నిదర్శనంగా నిలిస్తే, నాలో భక్తి భావం మొలకెత్తడానికి ఈ సంఘటన దారి తీసింది.

దర్శనం అయ్యాక అశ్వనీ హాస్పటల్‌కి తీసుకు వెళ్ళాము. వాపు ఎక్కువగా ఉన్నదనీ స్పెషలిస్ట్‌కి చూపించండని తాత్కాలికంగా ముందులు వ్రాసి పంపించారు. అలా చెన్నై చేరాక విజయ ఆస్పత్రిలో టెస్ట్‌లు చేసి, ఆపరేషన్ తప్పదని తేల్చారు. అక్కాబావలు దగ్గరుండి ఆపేరేషన్ చేయించి ఓ పదిహేను రోజుల తర్వాత ప్లైట్‌లో హైదరాబాద్‌కి పంపించారు.

తిరుపతి – భీమాస్:

పెళ్లయిన కొత్తల్లో శ్రీదేవి ఒక కోరిక కోరింది.

దానిదేముందీ కోరుకో.. అన్నాను.

ఏడాది కొకసారన్నా శ్రీవారి దర్శనం చేసుకుందామండీ.

ఓసి అంతే కదా.

కానీ సంసార మాయలో పడిపోయాము. తిరుపతి యాత్ర ఎప్పుడో గాని గుర్తుకు రానంత మాయ కమ్మేసింది. అలాంటప్పుడే విష్ణువు తన లీలలు ప్రదర్శించి కళ్లు తెరిపిస్తుంటాడు.

పెళ్ళైన కొత్తల్లో ఓ సారి భీమాస్ హోటల్‌లో బసచేశాము. మేము అక్కడ దిగామని తెలుసుకున్న ఈనాడు మిత్రుడు జంధ్యాల శరత్ బాబు హోటల్ రూమ్‌కి వచ్చాడు. మాకు విషెస్ చెప్పాడు. అప్పటి నుంచి తిరుపతి వెళితే బీమాస్ హోటల్‌లో భోజన, పలహారాలు చేయడం అలవాటైంది. ఈ మధ్యనే సీనియర్ సిటిజన్ కోటాలో దర్శనం టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ జర్నీ వేళలో భీమాస్ సంగతి గుర్తుకు వచ్చి, లంచ్‌కి అక్కడకు వెళ్ళాము. అప్పటికీ ఇప్పటికీ అదే టెస్ట్. గోంగూర పచ్చడి. ఆవకాయ, పప్పు పొడి, అప్పడం, నెయ్యి.. అన్నీ బాగున్నాయి. యాత్ర వల్ల కలిగిన అలసట తొలిగిపోయినట్లు అనిపించింది. పెళ్ళైన కొత్తల్లో భీమాస్ అనుబంధం గురించి చెప్పుకుని మనసారా నవ్వుకున్నాము. రాత్రి ట్రైన్‌లో తినడానికి పెరుగన్నం, నిమ్మకాయ పులిహోర ప్యాక్ చేయించుకుని ట్రైన్ ఎక్కాము. ఈ సందర్భంగా భీమాస్ ఫౌండర్ కె.ఆర్. వెంకటాచలం గురించి నాలుగు మాటలు..

భీమాస్ పౌండర్:

కష్టపడితే ఫలితం దక్కుతుంది. నీవు చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి. ఈ సూత్రాలను బలంగా నమ్మిన వ్యక్తి కె.ఆర్. వెంకటాచలం. 1952 ప్రాంతంలో కేరళలోని పాల్కాడ్ నుంచి తిరుపతికి దగ్గర్లోనే ఉన్న చంద్రగిరి వచ్చి వెజిటేరియన్ మెస్ పెట్టారు. అప్పుడు వారి వయసు 17 సంవత్సరాలు. ఆనాడు వారు నాటిన బీజం ఇప్పుడు భీమాస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్థాయికి ఎదిగింది. వారి తదనంతరం కుమారుడు కె.వి. రంగనాథన్ కూడా 17 ఏళ్ల వయసప్పటి నుంచి వ్యాపారంలో తండ్రికి అండగా నిలిచాడు.

మొన్నీమధ్యనే భీమాస్‌కి వెళ్లామని చెప్పాను కదా, అక్కడ పెద్దాయన నిలువెత్తు చిత్రపటం కనిపించింది.

నాహం కర్తా, హరిః కర్తా:

తిరుపతి యాత్ర అనగానే గోవింద రాజ స్వామి వారి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం కూడా ముఖ్యమైనవి. బీమాస్ హోటల్‌లో లంచ్ చేశాక గోవింద రాజ స్వామి గుడికి వెళ్ళాము. వెళ్ళేటప్పుడే అనుకున్నాను. ఈసారన్నా ప్రత్యేక దృష్టితో చూడాలనీ, అందుకు కారకులైన ఓ పెద్దాయన్ని తలుచుకోవాలని సంకల్పం చెప్పుకున్నాను. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. అందుకే మంచిని పెంచు, మంచిని పంచు అన్న సూత్రం నన్ను బాగా ఆకట్టుకుంది. గోవిందరాజ స్వామి వారి దర్శనం అయ్యాక మంటపానికి ప్రక్కనే ఉన్న పార్థసారథి భగవాన్ సత్యభామ, రుక్మిణీ సహితంగా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు. ఇక్కడ రాజగోపురానికి ఎదురుగా పార్థసారథి స్వామి వారి ఆలయం ఉంటుంది. గోవింద రాజ స్వామి వారి సన్నిధానం కాదు. ఏ ఆలయానికి వెళ్ళినా గోపురానికి ఎదురుగానే ప్రధాన మూర్తులు ఉంటారు. గతంలో నేను విన్న విషయాలను శ్రీదేవితో పంచుకున్నాను.

ఈ సందర్భంగా ఐఎఎస్ అధికారిగా టిటిడీలో కూడా సేవలందించిన పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి.

ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ, అటు కేంద్రంలోనూ ఉన్నతాధికారిగా సేవలందించిన పీవీఅర్కే ప్రసాద్ పూర్తి పేరు – పత్రి వేంకట రామకృష్ణ ప్రసాద్. 1978 నుంచి 82 వరకు టిటిడీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వారిది సునిశిత దృష్టి. టిటిడికి సంబంధించినంత వరకు వారు తీసుకున్న నిర్ణయాలు, అవి అందించిన ఫలితాలు నేటికీ భక్తకోటి మరువలేరు. అందులో వారు తీసుకున్న సంచల నిర్ణయం వల్లనే దాదాపు 700 సంవత్సరాల పాటు పూజాదికాలు లేకుండా ఉండిన పార్థసారథి ఆలయం వెలుగు చూడటం. గోవిందరాజ స్వామి ఆలయం సందర్శనకు వెళ్ళినప్పుడు గాలి గోపురానికి ఎదురుగా మండపంలో కేవలం గోడ మాత్రమే ఉండటం ప్రసాద్ గారిని ఆశ్చర్య పరిచింది. లోతుగా ఆలోచించి, ఆగమ శాస్త్రకారులతో సంప్రదించి మరుగున పడిన నిగూఢ రహస్యాన్ని చేధించారు. గోపురానికి ఎదురుగా ఉన్న గోడను పగలకొట్టించారు. అద్భుతం.. పరమాత్ముని లీల అద్భుతం. గోడకు లోపలి వైపున కేవలం మూడు అడుగుల దూరాన పార్థసారధి విగ్రహం కనిపించింది. అలా 700 సంవత్సరాల తర్వాత పార్థసారధి భగవాన్ మన ప్రసాద్ గారి చొరవతో వెలుగు చూశారు. ప్రసాద్ గారు అందుకే అంటుండేవారు. నేను కర్తను కాదు, హరి మాత్రమే కర్త – అని. అలాగే మరో సందర్భంలో ఈ భాగం రచనలో మొదట్లో ప్రస్తావించిననట్లుగా ధ్వజస్తంభం కొత్తది ఏర్పాటు చేయడంలో పీవీఆర్కే ప్రసాద్ గారు తీసుకున్న సంచల నిర్ణయం వేరొకరికి సాధ్యమా. ఆ హరి కర్తగా భావించడం వల్లనే సాధ్యమైంది. వారి ఆత్మకథ పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం టైటిల్ – సర్వసంభవామ్ – నాహం కర్తా, హరిః కర్తా.

నా జీవితంలో తిరుపతి యాత్ర విశేషాలు ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. మరోసారి సందర్భోచితంగా ప్రస్తావిస్తాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here