తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-24

0
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

‘అచ్చు’ ముచ్చట:

[dropcap]కా[/dropcap]లేజీలో చదవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఐదేళ్ల పాటు ఒక చిన్న కోరిక తీర్చుకోవడం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయినా, తీరనే లేదు.

మా కాలేజీ వాళ్లు సావనీర్ ప్రచురిస్తుండే వాళ్లు. అందులో ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగులో కూడా ప్రతిభ కనబరిచే అంశాలు అనేకం ఉండేవి. సావనీర్ అనేది ఆ రోజుల్లో కాలేజీ స్టేటస్‌కి సింబల్‌గా ఉండేది. ఈ పుస్తక ప్రచురణ కూడా ఒక మహాయజ్ఞంలా సాగేది. ఏ శీర్షికలు పెట్టాలి, సమతూకం ఎలా పాటించాలి? ఇలాంటివి చూడటం కోసం ఒక ఎడిటోరియల్ బోర్డ్ సిద్ధమయ్యేది. ప్రధానంగా ఇంగ్లీష్, తెలుగు కంటెంట్ ఉంటే, అప్పుడప్పుడు హిందీ ఆర్టికిల్స్ కూడా చోటుచేసుకునేవి.

ఎలాగైనా ఈ పుస్తకంలో నా పేరు అచ్చవ్వాలి.

ఎస్.. ఇదే నాకోరిక.

వ్యాసం వ్రాయాలని నేను ఒక ప్రక్క ప్రయత్నిస్తుంటే, మా విష్ణు గాడేమో కార్టూన్లు వేస్తానంటూ సన్నాహాలు మొదలు పెట్టాడు.

ఒరేయ్, నేను బొమ్మలు వేస్తాను. నీవు కాప్షన్స్ వ్రాయాలి. ‘అసలు ఏ అంశం మీద కార్టూన్ వేయాలో ఇద్దరం కలసి ఆలోచిద్దామే’ అని అన్నాడు వాడు.

ఇదేదో బాగుందనుకున్నాను. వచ్చీరాని బొమ్మలు గీస్తూ ఎంత బాగున్నాయో కదా అంటూ మురిసిపోయేవాడు. అలా నాలుగైదు కార్టూన్లు – వాడి గీత, నా రాతతో సిద్ధమయ్యాయి. వాటిని మా ఇంట్లోని వాళ్లకు చూపిస్తే వాళ్లు ఫక్కున నవ్వారు. మా వాడు సంబరపడ్డాడు.

‘నీ మొహం, వాళ్లు నవ్వింది, నీ కార్టూన్ లోని జోక్‌కి కాదు, ఆ చిత్ర విచిత్ర ఆకారాలు చూసి’ – అని అనేసరికి నామీద వాడికి బోలెడు కోపం వచ్చింది. ఓ రెండు రోజులు మాట్లాడలేదు. అయితే ఆ తర్వాత మళ్ళీ వైట్ పేపర్లు, పెన్సిల్స్ పట్టుకొచ్చి , అరే మంచి ఆలోచన చెప్పరా, కార్టూన్లు గీసిపారేద్దాం – అనడంతో మా ప్రయత్నాలు మళ్ళీ మొదలయ్యాయి.

వాడి ప్రయత్నాలు అలా ఉంటే మరో ప్రక్క నేనూ నా వ్యాస రచన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ముందుగా నా దృష్టి కవిత మీద పడింది. దీని కోసం మా తెలుగు మాష్టార్ని అడిగి ఒకటి రెండు కవిత్వ పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చాను. కవిత్వం చదువుతుంటే, ఓస్, ఇంతేనా ఈ మాత్రం వ్రాసిపారేయగలన్లే- అనుకున్నాను. కొన్ని కవిత్వాలు బాగున్నాయి. కవి గారి ఆలోచన మనసుకు పట్టేసినట్లే అనిపించింది. కవిత్వం వ్రాయడం తేలికే. పట్టుమని ఓ పది లైన్లు వ్రాసే సరి. ఓ కవిత రెడీ అయిపోతుంది. అంతే, కవితా లోకంలో విహరించడం మొదలుపెట్టాను.

ఆకాశం మీద వ్రాద్ధామా..

భూమి మీద వ్రాద్ధామా?

నిరుద్యోగం మీద వ్రాసేద్దామా?

నిరుపేదల కష్టాల మీదనా..?

ఇలా ఆలోచిస్తుంటే- ‘కాలేజీ మీదనే వ్రాస్తే తప్పకుండా వేసేస్తార్రా’ అని విష్ణు సలహా ఇచ్చాడు.

మా కాలేజీకి వెనుక వైపున సాగర్ కాలువ గట్టు ఉంది. అక్కడ కొన్ని చెట్లు కూడా బాగా పెరిగాయి. వాటి క్రింద కూర్చుని సాయంత్రం వేళల్లో, అదేదో సినిమాలో కవి గారు ఆలోచన కోసం పెన్నుని బుగ్గకి ఆనించుకుని అదోలా ఆకాశం వైపు చూస్తుండటం, ఒకటి రెండు లైన్లు వ్రాశాక, లేచి గట్టు మీద అటూ ఇటూ తిరగడం వంటి చేష్టలతో కవిత్వం వ్రాసేందుకు నేను ప్రయత్నిస్తుంటే, నా క్లాస్‌మేట్ ఒకడు చెట్టు చాటునుంచి ఇదంతా గమనించి ఒక మాష్టార్‌కి చెప్పాడట. ఆయనేమో నన్ను పిలిపించి,

‘ఏమిటిదంతా?’

‘కవిత్వం సార్. కవిత్వం’

నా కళ్లలోని అమాయకత్వం, పట్టుదల చూసి..

‘ఏది ఏం వ్రాశావు. ఇటివ్వు’

ఇచ్చాను.

చదివాక మాష్టారు అదోలా నవ్వారు.

ఏమిటి దీని అర్థం – విష్ణుని తర్వాత అడిగాను.

‘నీకు కవిత్వం ఎందుకు’ – అనేమో

కాసేపు దిగులేసింది. దిగులు పడటం కాదు, మరో ప్రయత్నం చేయాలనుకున్నాను. అయితే ఈ సారి కవిత రాసే విషయంలో కాదు, వ్యాసం వ్రాయాలనుకున్నాను. విష్ణుతో చెబితే ‘ఈ ఆలోచన కూడా బాగుందిరోయ్’ – అన్నాడు.

ఈ లోపుల మరో ఆలోచన కూడా వచ్చింది. నాటిక వ్రాసి సావనీర్ కి ఇస్తే..

నాటకాలు, నాటికలు సావనీర్ లో వేయరనీ, క్లుప్తంగా చక్కటి సమాచారం, సందేశం ఇచ్చే రచన అయితే తీసుకోవచ్చని మా సీనియర్ హితవు పలికాడు. ఆయన అప్పటికే ఏబీవీపీలో యాక్టీవ్‌గా ఉన్నాడు. ఆయన దగ్గర నుంచే పాత సావనీర్లు తీసుకుని వాటిని తిరగేశాను.

ఎస్. అర్థమైంది. ఎలా వ్రాస్తే ఈ కాలేజీ వాళ్లు తీసుకుంటారో అర్థమైంది.

అంతే, ఉత్సాహం ఉరకలు వేసింది. కాలేజీ లైబ్రరీకి వెళ్ళి కొన్ని పుస్తకాలు సెలెక్ట్ చేసుకుని వాటిని తిరగేశాను. అందరికీ ఆసక్తి కలిగించే అంశాలను ఓ పదింటిని సెలెక్ట్ చేసుకుని వాటిని ప్రశ్నల రూపంలో మార్చాను. వాటి సమాధానాలు విడిగా వ్రాశాను. అంటే ఒక పేజీలో పై సగ భాగం ప్రశ్నలు. రెండవ సగభాగంలో సమాధానాలు ఉండాలన్నది నా ఆలోచన. ఈ సమాధానాలు చదవాలంటే పుస్తకం తలక్రిందులు చేయాలి. ఇదేమీ నాకు అప్పటి కప్పుడు వచ్చిన ఐడియా కాదు. ఇందాక చెప్పాను కదా, ఏబీవీపీ సీనియర్ మిత్రుడు తన వద్ద ఉన్న పాత సావనీర్లు ఇచ్చాడని. వాటిలో ఒకటి రెండు చోట్ల ఇదే ఫార్మెట్‌లో ఎవరో వ్రాసింది ఫ్రింట్ చేశారు.

ఎస్. సక్సెస్ ఫార్ములా దొరికింది. ‘మీకు తెలుసా?’ శీర్షికన ప్రశ్నలు, సమాధానాలు వ్రాసి ఎడిటోరియల్ బోర్డ్ వాళ్లకి అందజేశాను. చాలా సంతోషమేసింది.

నా కోరిక తీరబోతున్నది. నా పేరు అచ్చవుతుంది. నా ఆనందాన్ని నలుగురైదుగురితో పంచుకుని, వారడిగినట్లు గాంధీ సెంటర్లో టీ ఇప్పించాను. పాపం మా ఫ్రెండ్స్ కూడా అల్పసంతోషులు. టీతో సరిపెట్టుకునే వారు.

సావనీర్ పబ్లిష్ అయింది. కానీ నా పేరు అచ్చవలేదు.

ఇలా కాలేజీలో ఎన్ని మార్లు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విష్ణు గాడి కార్టూన్ల గతి ఇంతే. మాకెందుకో ఈ సావనీర్ సంపాదక వర్గం వారి మీద బోలెడు కోపం వచ్చింది. పైగా మా ఫ్రెండ్స్ మధ్యలో మా పరువు పోయిందాయె.

ఆ సమయంలోనే – ‘పత్రికల వాళ్లకు లెటర్స్ వ్రాయరా. వాళ్లు నీ పేరు మీద ముద్రిస్తార’ని ఫ్రెండ్స్ చెప్పారు. ఇదేదో బాగుందని ప్రయత్నించాను. ప్రముఖ పత్రికల్లో లెటర్స్ కాలమ్ చూసి, ఎలా వ్రాస్తున్నారో అర్థం చేసుకున్నాను. మంచి టాపిక్ మీద పోస్ట్ కార్డు మీద వ్రాసి పత్రికా ఆఫీస్ వారికి పోస్ట్ చేసేవాడ్ని.

ఇలా నా వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. కానీ ఇటు సావినీర్ లో కానీ, అటు పత్రికల్లో కానీ నా పేరు అచ్చులో చూసుకోలేక పోయాను. మరో ప్రక్కన విష్ణు, నేను కొన్ని కార్టూన్లు తయారు చేసి చిన్నా చితకా పత్రికలకు పంపించడం మొదలుపెట్టాము. వాటిలో కొన్ని అచ్చయ్యాయి. ఇదో పెద్ద విజయంగా భావించాము.

ఈ లోగా డిగ్రీ పూర్తవడం, నందిగామ విడిచి బొంబాయిలో ఎమ్మెస్సీ కోర్స్‌లో చేరడం జరిగిపోయింది. అది కూడా పూర్తయ్యాక గతంలో చెప్పినట్లు విశాఖలో ఉన్నప్పుడు పత్రికల్లో నా వ్యాసాలు ప్రచురితమవడం మొదలయ్యాయి. ఇక ఆంధ్రప్రభలో చేరిన తర్వాత కొన్ని వందల సార్లు నా పేరు ప్రింట్‌లో చూసుకోగలిగాను. అసలు పేరుతోనే కాకుండా ముద్దు పేర్లు, కలం పేర్లతో కూడా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. కణ్వస – పెన్ నేమ్‌తో వందలాది వ్యాసాలు వచ్చాయి. ఆంధ్రప్రభ కాలమిస్ట్‌గా ఎదిగాను. చేరిన కొత్తల్లోనే క్రికెటానందం పేరిట ప్రతి వారం వ్రాసేవాడ్ని. టిఎన్‌ఆర్ పేరిట ఈ వ్యాసాలు నందనం – సప్లిమెంట్‌లో అచ్చయ్యేవి.

కోరిక ఒకటి జనించు

తీరక ఎడద దహించు.

కోరనిదేదో వచ్చు.

శాంతి సుఖాలను తెచ్చు.

అని ఓ సినికవి అన్నట్లుగా పత్రికల్లో, పుస్తకాల్లో నా పేరు చూసి ముచ్చట తీర్చుకోవాలన్న నా కోరిక మొదట్లో తీరకపోయినా ఆ తర్వాత అనేకానేక సందర్భాల్లో ముచ్చట తీరింది. పైగా ఫ్రింట్ లోనే కాక, వెబ్ సైట్స్, టివీ కార్డ్స్ వంటి చోట్ల కూడా నా పేరు వచ్చింది. వస్తూనే ఉంది.

అక్షరాల అమరిక:

మా ఊర్లో ప్రింటింగ్ ప్రెస్‌లు ఒకటో రెండో ఆ రోజుల్లో ఉండేవి. ఓ సారి అక్షరాలు పేరుస్తుంటే చూశాను. చాలా ఆశ్చర్యమేసింది. ఒక మెటల్‌తో తయారు చేసిన అక్షరాలను చకచకా పేరుస్తూ మేటర్‌ని ఫ్రింటింగ్ సిద్ధం చేస్తున్న వ్యక్తిని చూసి , అతని చేతి కదలికలు గమనించి ఈ విద్య మనం కూడా నేర్చుకుంటే పెద్దయ్యాక ప్రింటింగ్ ప్రెస్సో, పేపర్ పెట్టి నడిపేయవచ్చని అనిపించింది. అయితే అవన్నీ అంత తేలికైన విషయాలు కావని తర్వాత తెలిసింది.

ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు లెడ్ అక్షరాల పేర్చడం, వాటిని గాలీల్లోకి ఎక్కించడం, అలా ఎక్కించిన గాలీలను ఫస్ట్ కాపీ క్రింద చేతి రోలర్ సాయంతోనే ప్రింట్ తీసి సంబంధిత సబ్ ఎడిటర్‌కి పంపించడం – నిత్యం చకచకా జరిగిపోయే పనులే. హ్యాండ్ కంపోజింగ్, మిషన్ కంపోజింగ్ వల్ల మేము వ్రాసిన మేటర్ కంపోజ్ అవుతుండేది.

అసలు ఆంధ్రప్రభలో చేరిన తర్వాతనే ప్రింటింగ్ టెక్నాలజీ గురించి అవగాహన వచ్చింది. మిషన్ కంపోజింగ్ వచ్చినా హ్యాండ్ కంపోజింగ్ సెక్షన్‌ని ఎత్తివేయకుండా రెంటినీ పారెలల్‌గా నడిపించారు. కొన్ని వార్తలు అటు, మరికొన్ని ఇటు పంపించేవారు.

ఎడిటోరియల్ డెస్క్ ఉదయం పది గంటల నుంచి రాత్రి రెండు గంటల దాకా పనిచేస్తుండేది. అందుకే షిప్ట్ పద్ధతిలో ఎడిటోరియల్ సెక్షన్ పనిచేస్తుండేది. ఎడిటర్ వంటి పెద్ద పోస్టుల వారు పదకొండు గంటల ప్రాంతంలో వచ్చేవారు. సాయంత్రం అయ్యే సరికి ఎడిటోరియల్ సెక్షన్ కళకళలాడిపోతుండేది. నాకైతే పెళ్ళి సందడిలా అనిపించేది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వార్తలను వర్గీకరించి సంబంధిత సబ్ ఎడిటర్స్ కూర్చునే చోటుకు వచ్చేలా చూసేవారు. సబ్ ఎడిటర్ డ్యూటీ ఎక్కి తన టేబుల్ వద్దకు వచ్చే ముందు అతగాడి టేబుల్ మీద వార్తల దొంతర ఉండేదన్న మాట.

ఆ రోజుల్లో (80వ దశకం) సబ్ ఎడిటర్ అంటే గౌరవ ప్రదమైన ఉద్యోగం క్రింద లెక్కే. కాలేజీ లెక్చరర్ జీతంతో సమానంగా సబ్ ఎడిటర్‌కి దక్కేది. అప్పటికే వేజ్ బోర్డ్ అమలు కావడంతో పూర్వ పరిస్థితి తొలిగిపోయి ఈ ఉద్యోగాల్లో కూడా ఆసక్తిగా చేరే విషయంలో పోటీ పెరిగింది. ఆ సమయంలోనే పిజీ చేసిన వారు జర్నలిజం పట్ల ఆసక్తి పెంచుకుని వివిధ పత్రికల్లో పనిచేయడానికి సిద్ధపడ్డారు. జర్నలిస్ట్‌లు అంటే విలేఖరులే అని అనుకుంటారు. అనేక ప్రాంతాల నుంచి వార్తలను సేకరిస్తూ వాటిని క్రమశిక్షణతో నిర్థుష్ట సమయానికి ఆఫీస్‌కి చేర్చేలా చూడటం విలేఖరుల పని. ఇప్పటిలా వాట్సప్, మెయిల్ వంటి సౌకర్యాలు లేవు. ఏ వార్త అయినా కాగితం మీద వ్రాసి ఫిజికల్‌గా పంపాల్సిందే. బస్టాండ్ ల్లోనూ, రైల్వే స్టేషన్ల లోనూ వివిధ పత్రికల వాళ్లు పోస్ట్ డబ్బాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవాళ్లు. ఊర్లలోని విలేఖరులు తాము ఆ రోజుకి సేకరించిన వార్తలు, ఫోటోలను భద్రంగా ప్యాక్ చేసి బస్సు డ్రైవర్లకో, రైల్వే సిబ్బందికో అప్పగించి ఫలానా చోట ఉన్న డబ్బాలో వేయమని చెప్పేవారు. ఒక్కోసారి తెలిసిన వారి చేతికి ఇచ్చి ఆఫీస్‌కి పంపిస్తుంటారు. ఇదో పెద్ద యజ్ఞంలా సాగుతుంటుంది. ఈ రోజుల్లో ఆ పద్ధతి కనుమరుగైంది. ఫిజికల్‌గా వార్తలు వ్రాసి ఉన్న పేపర్ కట్టలు, ఫోటోలు పంపే పద్ధతికి బదులుగా వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాల్లో సదరు వార్తా విశేషాలను విలేఖరులు ఆఫీస్‌కి చేరవేయగలుగుతున్నారు. ఒకప్పుడు ఎంతో కష్టమైన పని ఈ రోజున సాంకేతిక విప్లవంతో తేలికైంది.

జర్నలిస్టుల్లో కొంత మంది బయట వార్తలు సేకరిస్తూ వాటిని ఆఫీస్‌కి అందజేస్తుంటే, మరికొంత మంది అలా చేరే వార్తలను గ్రేడ్ చేస్తూ ఒక్కో వార్తను ఎడిటి చేస్తూ మంచి హెడ్డింగ్ పెడుతూ వాటిని సంస్కరిస్తుంటారు. వీళ్లని డెస్క్ జర్నలిస్ట్‌లు అంటారు. రిపోర్టర్స్ ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షి లాంటి వాడు. అతనికి తిరిగిందే బలం. అదే డెస్క్‌లో పనిచేసే సబ్ ఎడిటర్స్ ఆఫీస్ లోనే ఉంటూ నిర్ణీత సమయానికి ఎడిషన్ వచ్చేలా చూడాల్సి ఉంటుంది. ఇతగాడు బయట ఎక్కువగా తిరగకూడదు. అందుకే ఓ సారి ఎడిటర్ గారు ఛలోక్తిగా ఇలా అన్నారు. –

విలేఖరి తిరగక చెడిపోతాడు.

సబ్ ఎడిటర్ తిరిగి చెడిపోతాడు.

నా మటుకు నేను డెస్క్ దగ్గరకే పరిమిత మయ్యాను. కాకపోతే ఎప్పుడో ఒకసారి ప్రత్యేక కథనాలు వంటివి వ్రాయాలనిపించినప్పుడు ఎడిటర్ గారు మాబోటి డెస్క్ జర్నలిస్టులను బయటకు పంపించేవారు. ఏమాట కామాటే చెప్పుకోవాలి. మేము లోపల కింగ్‌లమే, కానీ బయటకు వెళితే మమ్మల్ని ఎవ్వరూ పెద్దగా గుర్తుపట్టరు. లోకల్ విలేఖరులకు ఉన్నంత స్థానబలిమి, పలుకుబడి మాకు ఉండవు కదా. కాకపోతే మేము వస్తున్నామంటే ఓ ప్రభుత్వ అథికారి వచ్చినట్లుగా స్థానిక విలేఖరులు మా చుట్టూ తిరుగుతూ మాకు అండగా ఉండేవాళ్లు. డెస్క్ జర్నలిస్ట్‌లను మచ్చిక చేసుకుంటే తమ వార్తలన్నీ ప్రచురిత మవుతాయనీ, ఊర్లో తమ పలుకుబడి మరింత పెరుగుతుంటుందని విలేఖరుల ఆలోచన.

కొంత మంది విలేఖరులు తమ కెరీర్‌లో వారు పనిచేస్తున్న పత్రిక కార్యాలయాలను దర్శించి ఉండకపోవచ్చు. వారి సెలెక్షన్ కూడా జిల్లా లేదా మండల కేంద్రాల్లో జరిగిపోతుండేది.

జర్నలిస్ట్ అనగానే చేతిలో సంచి, జేబులో పెన్ను, పైజమా లాల్చీ.. ఇదీ వేషధారణ అనుకునే రోజులు క్రమంగా పోయాయి. జర్నలిస్ట్ లకు డ్రెస్ కోడ్ అంటూ ఏదీ లేదు. కాకపోతే నేనైతే కొన్నాళ్లు భుజానికి సంచీ తగిలించుకుని వెళుతుండేవాడ్ని. నాలాగే మరికొంత మంది కూడా అలాగే వెళ్ళే వారు. ఈ సంచీలో పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటివి ఉండేవి. రోజువారీ పనికి తోడుగా స్పెషల్ ఆర్టికిల్స్ వ్రాయలన్నప్పుడు రిఫరెన్స్ పుస్తకాల కోసం పరుగులు పెట్టాల్సి వచ్చేది. మా ఆఫీస్‌లో ఒక లైబ్రరీ ఉండేది. క్విక్ రిఫరెన్స్ కోసం అక్కడకు వెళ్ళేవాళ్లం. బయట లైబ్రరీలు కూడా సందర్శించక తప్పేది కాదు. ప్రత్యక వ్యాసం వ్రాయడం ప్రసవ వేదన లాంటిదే. రిఫరెన్స్ పూర్తయితేనే కానీ కలం కదలదు. అందుకే చేతిలో సంచీ, అందులో రిఫరెన్స్ పుస్తకాలు, గట్రా..

మాబోటి వారికి ఈ వేదన అప్పుడప్పుడే.. పాపం, ఎడిటర్ గారికి నిత్యం ఇదే అవస్థ. ఒక్క ఆదివారం మినహా మిగతా రోజుల్లో న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ వస్తుండేవి. ఎడిటర్ గారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో వచ్చి కాసేపు సిబ్బందితో మాట్లాడి ఎడిటోరియల్ వ్రాసే పనిలో పడతారు. వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కాపీ ఎడిటర్స్, అసోసియేట్ ఎడిటర్స్ వంటి వారు సాయం చేసేవారు. ఎడిటోరియల్ సెక్షన్‌లో ఎడిట్ పేజీ విభాగంలో పనిచేసే వాళ్లుకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎడిటర్ పోస్ట్ అంత తేలికైనది కాదన్న సంగతి అప్పుడు నాకర్థమైంది. అంతే కాదు, సబ్ ఎడిటర్‌కీ ఎడిటర్‌కీ మధ్య చాలా ఉద్యోగాలు ఉంటాయని, ఒక్కో మెట్టు ఎక్కితేనే సబ్ ఎడిటర్‌గా దిగిన మనిషి ఎడిటర్ కాలేడన్న సత్యం భోదపడింది.

వార్తా సంస్థలు:

వార్తలు కొన్ని ఇంగ్లీష్‌లో వచ్చేవీ ఉంటాయి. ఆ రోజుల్లో ప్రతి పత్రికా ఆఫీస్‌లో యుఎన్ఐ, పీటీఐ వంటి వార్తా సంస్థల వారి టెలిప్రింటర్ మిషన్లు ఉండేవి. ఇవి 24 గంటలూ టక్.. టక్ మంటూ చప్పుడు చేస్తూ ప్రపంచ నలుమూలల నుంచి వార్తలను ఆఫీస్‌లకు అందిస్తుంటాయి. ప్రతి మిషన్లు లోపల వైట్ పేపర్ రీల్స్ (చుట్టలు) అమరుస్తుంటారు. వాటిమీదనే వార్తలు ప్రింట్ అవుతుంటాయి. ట్రైనీ సబ్ ఎడిటర్‌గా ఉన్నప్పుడే మాకో సూత్రం చెప్పారు.. అదేమంటే, ఆఫీస్‌లో అటూ ఇటూ తిరిగుతున్నప్పుడు యుఎన్ఐ, పిటీఐ టెలీప్రింటర్స్ మీద కన్నేసి ఉంచాలి. ఒక్కోసారి అత్యంత సంచలన వార్త వచ్చినప్పుడు ఓ ఎటెండరో చూసి అలెర్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే పత్రికా ఆఫీస్‌లో క్రింద స్థాయి ఉద్యోగి నుంచి పెద్ద స్థాయి ఉద్యోగి వరకు అందరూ యుద్ధరంగంలో సైనికుల్లా పనిచేస్తుంటారు.

ఆంధ్రప్రభలో నేను చేరిన కొద్ది రోజులకే నాకు ప్రత్యేక వ్యాసం వ్రాసే అవకాశం వచ్చింది. చాలా ఆనందం వేసింది. ఇది అందరు సబ్ ఎడిటర్స్‌కీ రాని అవకాశం. క్రియేటివిటీ, వ్రాసే సామర్థ్యం, క్రమశిక్షణ ఉన్న వారిని ఇలాంటి బాధ్యతలను అప్పగించేవారు. వ్యాసం వ్రాసి న్యూస్ ఎడిటర్ గారికి చూపించాను. వారు చదివి బాగుంది, అంటూ కంపోజ్ చేయించు – అన్నారు.

ఆ తర్వాత కాసేపటికి నా ఆర్టికల్ కంపోజ్ చేసి దానిని ఫ్రూప్ రీడింగ్ సెక్షన్‌కి పంపపడం కోసం దాన్నిఒక తోక పేపర్ మీద ముద్రించి పంపించారు. వారి పనితనం చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఫ్రూప్ రీడింగ్ అయ్యాక ఆ గాలీ పేపర్ ముక్క నా చేతుల్లోకి వచ్చి వాలింది.

చదివాను. బాగుందనిపిచింది. సంతృప్తిగా తలఊచుతూ చివర్లో నా పేరు చదువుకున్నాను. అప్పుడు కాలేజీ సావనీర్ ముచ్చట్లు గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. రిలాక్స్‌డ్‌గా ఫీలవుతూ క్యాంటీన్‌కి వెళ్ళి కొలీగ్స్‌తో టీ త్రాగి వచ్చాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here