తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-30

0
14

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

చిటపటలు:

[dropcap]‘మ[/dropcap]తాబులు తీసుకురండర్రా’ – అమ్మ పిలుపు.

నేను అక్కా పరుగున వెళ్ళి ఒక చేటలో ఉన్న మతాబులు అంతే పరుగున తీసుకువచ్చి అమ్మకు ఇచ్చాము.

ఒక వారం ముందే మేము పిల్లలం నాన్నతో పాటుగా దీపావళి సామన్లు అమ్మే షాపుకు వెళ్ళాము. నేనేమో అప్పుడు చాలా చిన్న పిల్లాడ్ని కదా. కాకరపువ్వొత్తి కాలుస్తుంటే కూడా అమ్మ పదేపదే ‘జాగ్రత్తరా’ అంటుండేది. ‘ఒరే, రాజు, మతాబులు, కాకరపువ్వొత్తులను కూడా జాగ్రత్తగానే కాల్చాల్రా. రవ్వలు వంటి మీద పడకుండా చూసుకోవాలేం’ – ఎంతో శాంతంగా చెబుతుండేది. ఆమె అలా అంటున్నప్పుడు మాకేం కోపం వచ్చేది కాదు. ‘అలాగే అమ్మా’ – అంటూ అమ్మ బుగ్గమీద ముద్దు ఇచ్చేసి టపాసులు కాల్చే పనిలో పడేవాళ్లం. టపాసులు కాల్చడానికి ముందు అమ్మ లక్ష్మీదేవి పటం దగ్గర్లో మమ్మల్ని కూర్చోబెట్టి తానేమో మంత్రాలు చదివేది. లక్ష్మీదేవి పటం ప్రక్కనే ఈ టపాసులున్న చేటలు, మరో ప్రక్కనేమో అమ్మ తాజాగా చేసిన రవ్వు లడ్డూల్లాంటివి ఉండేవి. ఇంకో ప్రక్కనేమో ప్రమిదల్లో దీపాలు వెలుగుతుండేవి. పూజయ్యాక అమ్మా, అక్కా ప్రమిదలను జాగ్రత్తగా పట్టుకుని ఇంటి బయట బారుగా పెట్టేవారు. అసలు ఆ దృశ్యం ఎంత బాగుండేదో. ప్రతి ఇంటి ముందు వెలుగుతున్న దీపాలు బారులు తీరి ఉండేవి. ఆ దీపాల కాంతిలో అమావాస్య రోజునే పౌర్ణమి వచ్చిందా! అన్నట్లు ఉండేది. కాస్త పెద్దయ్యాక తెలిసిందేమిటంటే, దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థమట. మరి ఈ టపాయకాయలు హడావుడంతా ఏమిటీ? అదంతా తరువాత వచ్చి చేరిందట. ఏమో కానీ, నాకైతే దీపాల వరుస కంటే టపాసులు కాల్చడం మీద, అమ్మ చేసిన మిఠాయిల మీదనే ధ్యాసంతానూ..

అసలు మా ఇంట్లో నాన్నగారు తప్ప ధైర్యశాలి మరొకరు లేరని నాకప్పట్లో బాగా తెలిసింది. ఎందుకంటే, నాన్నగారు లక్ష్మీ అవుట్లు, తారా జువ్వలు నదురు బెదురు లేకుండా కాల్చేసేవారు. అవుట్ల అయితే వొత్తికి నిప్పు అంటించగానే ఆమడ దూరం పరిగెత్తుకుంటా వెనక్కి రావడమన్నది చాలామంది చేసేదే. కానీ మా నాన్న ధైర్యశాలి కదా. ఆయినేమో అగ్గిపుల్ల గీసి అవుట్ పైన ఉండే వత్తిని వెలిగించి, అది చుర్రున కాలుతుంటే అక్కడే ఉండి చూస్తూ ఇక క్షణంలోనో, అరక్షణంలోనో పేలుతుందనగా కేవలం నాలుగడుగులు వెనక్కి వేసేవారు. అలాంటప్పుడే సినిమా హీరోలా అనిపించేవారు. హీరో కృష్ణ ఇలాగే ఫైట్ సీన్లలో డూప్ లేకుండా నటించేవారని ఆ తర్వాత మా ఫ్రెండొకడు చెబితే ఆశ్చర్యపోయాను. అందుకే డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అనేవాళ్లట ఆయన్ని. సరే మా నాన్న లోని హీరోయిజం, డేరింగ్ గురించి నాకైతే బోలుడు ఆశ్చర్యం కలిగించినా మా అమ్మ మాత్రం తెగ భయపడుతుండేది. అలా ఆమె భయపడటానికి బలమైన కారణం లేకపోలేదు.

నాన్నకు తృటిలో తప్పిన ప్రమాదం:

నాన్నగారు మంగళగిరి లో పనిచేస్తున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వార్ల కల్యాణ మహోత్సవాలప్పుడు పెద్ద రథం కదిలేది. నాన్నగారు గుడులమీద ఈవో కావడంతో బదలీలపై మంగళగిరి చేరారు. అప్పుడే అమ్మలో భయం కూడా ప్రవేశించింది. ఇక్కడ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే స్వామి వారి కల్యాణమహోత్సవాలు మొదలయ్యాయి. రథం లాగడానికి అప్పట్లో పెద్దపెద్ద మోపులు వాడేవారు. ఆ మోపులు ఇరువైపులా భక్తులు లాగుతుంటే రథం కదులుతుండేది. ఒక్కోసారి భక్తుల ఉత్సాహం ఎక్కువైనప్పుడు దాని వేగం పెరిగేది. అప్పుడే ప్రమాదాలు చోటుచేసుకునేవి. వేగం తగ్గించడానికి ఓ చిట్కా ఉండేది. అదేమంటే, చప్టాలను (చెక్కతో చేసిన ఓ పరికరం) రథం వేగంగా వెళుతున్నప్పుడు చక్రాల క్రింద ఓ పద్ధతిలో పెడుతుంటే అవేమో బ్రేకుల్లా పనిచేసి రథం వేగం తగ్గేది. నాన్నకు ధైర్యం ఎక్కువని చెప్పాను కదా. పైగా ఆయన ఈవో ఆయే. రథ చక్రాల ముందే ఈయన ఆర్డర్లు ఇస్తూ నడిచేవారు. ఎవ్వరూ అడ్డు చెప్పేవారే లేరు. ఓ సారి ఏమైందంటే.. అలా నడుస్తుంటే నాన్న గారి పంచె రథచక్రం క్రిందకి వెళ్ళడంతో లాగడానికి ప్రయత్నిసుండగా అదుపు తప్పి క్రింద పడ్డారు. రథచక్రం ఆయన పక్కగా వెళ్లిపోయిందట.. గండం గడిచింది. ఈ విషయం ప్యూన్ వచ్చి అమ్మకు చెప్పడంతో అప్పటి నుంచి రథయాత్ర అనగానే అమ్మకు బోలెడు భయం ఆవహించేది.

కట్టె మిఠాయి:

తిరునాళ్లంటే మాటలా. అందునా మంగళగిరి తిరునాళ్లంటే ఆ ఊరి చుట్టుప్రక్కల ఒకటే సందడి. కల్యాణోత్సవం అయ్యాక జరిగే రథోత్సవం నాడు ఆ సందడి చూసితీరాల్సిందే. అలాంటి సందడి నుంచి పుట్టినదే ఈ పాట..

‘మంగళగిరి తిరునాళ్లకు పోతే,

జనం ఒత్తిడికి సతమతమవుతూ..’

తిరునాళ్లంటే మైకుల్లో బోలెడు పాటలు, పద్యాలు.. ఇంకా చాలా కాలక్షేపాలు. వీధుల్లో మిఠాయి పరిచిన మంచాలు.. అవునండి, మంచాల మీదనే తాటి చాప పరిచి రకరకాల మిఠాయిలు అమ్మేవాళ్లు. నాకైతే కట్టె మిఠాయి ఇష్టం. ‘మంచం మీద అమ్మే మిఠాయి వద్దులేరా, ఈగలు ముసురుతున్నాయి, బండి రాగానే కొంటాను కదా’ అని అమ్మ అంటే నేను మారాము చేసేవాడ్ని. దీంతో ఇష్టం లేకపోయినా ఓ పది పైసలు పెట్టి కట్టె మిఠాయి కొని నా చేతుల్లో పెట్టేది.

చెక్కభజనలు:

తిరునాళ్లప్పుడు రథం దగ్గరే ఉన్న పెద్ద మైదానంలో ఒక రోజు కోలాటం, మరో రోజు చెక్క భజనలు ఇలాంటి జానపద కళారూపాలను కళాకారులు ప్రదర్శించేవారు. ఇవన్నీ మా ఇంటికి ముందున్న మైదానంలోనే జరగడంతో నాకు ఇప్పటికీ బాగానే గుర్తున్నాయి. చెక్కభజన నన్నెంతో ఆకర్షించింది. ఇంట్లో ఉన్న రెండు చెక్కలు తీసుకుని నేనూ వారిని అనుసరించేవాడిని. చెక్కభజన కళాకారులు ఒక వలయంలా నిలబడి చేతుల్లో చెక్కలు పట్టుకుని భలే నేర్పుగా భజన చేసేవారు. ఒక్కో సారి చక్కటి కథను కూడా భజన రూపంలో పాడుతూ, దానికి తగ్గట్టుగా చెక్కలు వాయిస్తూ వలయాకారంగా తిరుగుతుండేవారు. తిరునాళ్ల హడావిడి అయ్యాక నేనూ మా ఫ్రెండ్స్‌తో జోడుకట్టి చెక్కభజన ఓ ఆటలా ఆడుకునేవాడిని. ఎందుకో తెలియదు కానీ చెక్కభజన ఇప్పటికీ చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది. కానీ గతంలో మాదిరిగా ఇలాంటి కళారూపాలకు ఇప్పుడు ఆదరణ తగ్గిపోయింది.

అలాగే తిరునాళ్లప్పుడు హరికథలు, బుర్రకథలు, నాటక ప్రదర్శకనలు ఉండేవి. ఇవన్నీ ఒక క్రమపద్ధతిలో నిర్వహించడమన్నది నాన్నగారి డ్యూటీల్లో ఒకటి. ఈవో కావడంతో కళాకారుల బృంద నాయకులు ముందుగానే మా ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడి ప్రోగ్రామ్ సెట్ చేసుకుని వెళ్లేవారు. నాకు ఓ విషయం ఇప్పటికీ గుర్తుంది. హరికథ కళాకారుల్లో కొంత మంది ఒక రోజు ముందే మా ఇంటికి వచ్చేవారు. మా ఇంట్లోనే బస. హరికథ చెప్పడానికి బయలుదేరే ముందు వారి ఆహార్యం, అలాగే కాళ్లకు కట్టుకునే గజ్జలు వంటివి చూసి నాకూ హరికథ చెప్పాలని అనిపించేది. హరికథైతే చెప్పలేదు, కానీ హరికథ చెప్పే వారి వెనక కూర్చుని శృతి పెట్టె నొక్కేవాణ్ణి. అయితే అదేదో ఆట వస్తువనుకునే వాణ్ణే కాని ఇది శృతి పెట్టె అని నాకు తెలియదు. ఓ సారి కోటా సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ పెట్టారు. అప్పుడు కూడా నేను కాసేపు శృతి పెట్టె పట్టుకుని నొక్కాను. కాసేపే అని ఎందుకు అంటున్నానంటే నేను చాలా బలహీనంగా ఉండే వాడ్ని. ఓ ఐదు నిమిషాలు అవగానే చేతులు నొప్పుట్టి ఆపేసేవాణ్ణి. దీంతో హరికథ చెప్పే వారికి కోపం వచ్చేది. దీంతో నా స్థానంలో మరొకరిని నియమించే వారు. అప్పుడు నాకు బోలెడు కోపం వచ్చేది.

నేను హర్ట్:

ఇలాంటి కోపమే దీపావళికి ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా వచ్చేసింది. అయితే ఇక్కడ నా బక్కతనం, బలహీనతలు కారణాలు కావు. మేము వెళ్ళిన ఇంట్లోని వారి మనస్తత్వాలు, వారి చిటపటలూను. మనస్తత్వ శాస్త్రం గురించి నాకప్పుడు తెలియదనుకోండి. కాకపోతే కోపం బాగా వచ్చేసేది. హర్ట్ అయ్యేవాడ్ని. నేనే కాదు మా అక్క కూడా.

అప్పుడు నేను నాలుగో తరగతో, ఐదో తరగతో చదువుతున్నాను. ఇందాక చెప్పిన తిరనాళ్ల తరువాత నాకు బాగా ఇష్టమైన పండుగ దీపావళి. అదేదో మన ఇంట్లోనే జరుపుకుంటే నాకు బోలెడు సంతోషం. కానీ దగ్గరి బంధువులు పిలవడంతో గుంటూరు నుంచి ప్రయాణం కట్టి మా బంధువులున్న ఊరు చేరాము. పండుగల తలంట్లు, నరకాసుర వధ, టపాకాయలు కాల్చడం, భోజనాలు.. ఇలా అన్నింటిలోనూ ఏదో వెలితి కనిపించింది. చాలా పెద్దాయక అదేమిటని ఆలోచిస్తే అర్థమైంది. అదే.. స్వేచ్ఛ.

నిజమే, స్వేచ్ఛ లేని చోట పండగ సంతోషం ఉండదు. కొన్ని ఇళ్లు అంతే. ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి ముందే చెప్పులు విప్పేసినట్లుగానే మనం స్వేచ్ఛనూ వదిలేయాల్సిందే. ఆ ఇంట్లో లోపలకు వెళ్ళగానే మనమూ వారిలా మారిపోవాల్సిందే. లేకపోతే ‘నరక’ యాతన తప్పదు. అలాంటి ఒకటి రెండు సంఘటనలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. దీనికంటే ముందు హిందీ గురించి కాసేపు..

హిందీ – దీపావళి:

హిందీ పరీక్ష అంటే నా మటుకు నాకు పెద్ద చిరాకు. ముఖం చిటపటలాడుతూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం. టెన్త్ వరకు హిందీ భాష నేర్చుకోవాల్సిందే. నేను చదువుకుంటున్నప్పుడు విద్యా విధానం ఇలాగే ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. 70వ దశకం తొలినాళ్లలో నేను హైస్కూల్‌లో చదువు వెలగబెడుతున్నాను. ప్రతి పరీక్షకు మూడు లాంగ్వేజ్ పేపర్స్ ఉండేవి. అందులో రెండు నాకు నచ్చనివే. అందులో ఒకటి ఇంగ్లీష్ అయితే, మరొకటి హిందీ. అలా అని తెలుగులో మనమేమీ పండితులం కాదనుకోండి. హిందీలో దీపావళి వ్యాసం బట్టీ కొట్టాను. అది కూడా ఎందుకంటే, దీపావళి పండుగ అంటే ఇష్టం కాబట్టి. ‘దీవాళీ ప్రముఖ చోహార్ హై..’ అంటూ బట్టీ కొట్టి నేను పరీక్షకు వెళితే, వాడేమో ఆవు (గాయ్) వ్యాసం రాయమన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవాళీ అని ఉన్న చోటల్లా గాయ్ అని పెట్టి వ్సాసం రాసిపారేశాను. అదేమిటో నేను హిందీలో పాసయ్యాను. ‘పాపం, దిద్దే వాడిని నువ్వు ఫూల్‌ని చేశావురా..’ అని మా ఫ్రెండ్ గాడు ఏదో అపరాధం చేశావురా అన్నట్లు మాట్లాడేవాడు. అదేమో గానీ, దీవాళీ వ్యాసం వల్ల నేను హిందీ గట్టెక్కాను. అది కూడా టెన్త్ పబ్లిక్ పరీక్షలో. అందుకే ఇప్పటికీ దీపావళి రోజు ఈ సంఘటన గుర్తుకువస్తుంది. నా పేపర్ దిద్దిన హిందీ పండిట్ గారికి థాంక్స్ చెప్పుకోవడం ఆనవాయితీ అయింది. పేపర్లు దిద్దే వాళ్ల కష్టాలు వారివి. టక టకా, చెక చెకా దిద్ది పారేయాలి. మొదటి లైన్ చూసి, చివరి లైన్ చూసి ఐదు మార్కుల వ్యాసానికి ఓ మూడో నాలుగో మార్కులు వేస్తుంటారనీ, నేను పెద్దయ్యాక తెలుసుకున్న నిజం. పేపర్ దిద్దే వాళ్లకు ఏదో మనసు బాగోలేకపోతే ఇలాంటివి చోటుచేసుకుంటాయి. అయితే ఇంటావడి మీద కోపం ఒక్కోసారి పేపర్ వ్రాసినవాడి మీద కూడా పడుతుంటుందని కూడా తెలిసింది. అప్పుడు మాత్రం మనకు దక్కేది సున్నానే. సరే, నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్న రోజుల్లో నాకంటే వయసులో పెద్దయిన ఓ సబ్ ఎడిటర్ వ్రాసిన వార్త కంపోజింగ్ వెళ్ళింది. అక్కడి నుంచి ఫ్రూప్ రీడర్ సెక్షన్‌కి వచ్చింది. అది చదివిన ఫ్రూప్ రీడర్ మొదట్లో ఆశ్చర్యపోయి, ఆ తర్వాత చిటపటలాడి ఈ విషయం న్యూస్ ఎడిటర్‌కి చెప్పేశాడు. న్యూస్ ఎడిటర్ మహాశయుడు వెంటనే సదరు సబ్ ఎడిటర్ గారిని పిలిచి ‘ఏంటదీ!!’ అంటూ ఆశ్చర్యాంగా అడిగారు. ఆయన గారి చేతిలోని ఫ్రూప్ ఫ్రింట్ కాగితం ముక్క (దీన్ని గ్యాలీ అని కూడా అంటారు) తీసుకుని చదివి.. ‘సారీ’ అన్నారు ఆ సబ్ ఎడిటర్. ఇంతకీ ఆ వార్త రెండవ పేరాలో ఆయన గారు ఇలా వ్రాశారు.

  • సిమెంట్ బస్తాలు – 30
  • ఇసుక – నాలుగు బండ్లు.
  • ఇటుకలు – ఐదు బండ్లు.
  • నాపరాతి బండలు, మేస్తీ ఖర్చులు..

ఇలా ఏవేవో వ్రాశారు.

ఆయన చాలా మేధావి. ఏ అంశం మీద వార్త అయినా చిటికలో వ్రాసి పారేస్తారు. అయితే ఈ వార్త రాయడానికి ముందు ప్యాడ్‌లో నుంచి ఓ కాగితం చించి దాని మీద తాను కట్టుకుంటున్న ఇంటి నిర్మాణం అవసరాలు వ్రాసుకున్నారు. ఇంతలో వార్త వ్రాయాల్సి వచ్చింది. చకచకా వ్రాసేసి, ఆ కాగితాల బొత్తిని పిన్ చేసేటప్పుడు ఇదిగో ఈ కాగితం కూడా జత చేశారు. కంపోజింగ్ వాళ్లు అలాగే కంపోజ్ చేసేసి, ప్రూఫ్ రీడింగ్ సెక్షన్‌కు పంపారు. ‘ఇంకా నయం అలాగే పేపర్లో రాలేదు.. జాగ్రత్తగా ఉండండి’ – అంటూ న్యూస్ ఎడిటర్ గారు కోపాన్ని అణుచుకుని పైకి శాంతం పులుముకుని నవ్వుతూనే చెప్పారు.

ఆపండి.. కాల్చకండి:

సరే, దీపావళికి ఓ ఇంటికి వెళ్ళామనీ, స్వేచ్ఛలేని దీపావళి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాను కదా.. ఆ ఇంటికే వెళదాం పదండి..

మతాబు వెలిగించడానికి రెడీ అవుతుంటే ఆ ఇంటావడ పరుగు పరుగున వచ్చేసి – ‘ఆపండి..’ అంటూ అరచినంత పని చేసింది. ఏమైందో అని అంతా హడలిపోయారు. ఆవిడ గారి కంఠం కంచు కంటే ఘనం, మాటమో బండరాయి కంటే కఠినం. ఇంట్లోనే కాదు, ఊర్లోనే ఆమె మాటకు తిరుగులేదట. తనకు కావాల్సింది రాబట్టుకునే దాకా మాటలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది.

‘ఆపండి..’ అంటూ వస్తూనే, ‘ఆ మతాబులు ఇక్కడ కాల్చకండి. పొగ ఇంట్లో పడుతుంది. పైగా పూలు ఇంటి బండల మీద పడితే బండలు పాడవుతాయి తెలుసా. బయటకు వెళ్ళి కాల్చుకోండి’ –

మా అమ్మ జోక్యం చేసుకుంటూ, ‘ఏదోలే తెలియదులే వదినా, ఒరేయ్ బయటకు వెళ్ళి కాల్చుకోండి’ – అంటూ మేమే తప్పు చేస్తున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. దీంతో..

నేనూ అక్కా హర్ట్.

పాము బిళ్లలు కాల్చడమంటే నాకెంతో సరదా. అందుకనే రెండు డబ్బీల పాము బిళ్లలు తెచ్చుకున్నాను. కానీ, ఆ పాము బిళ్లలను వారింట కాల్చుకునే అవకాశం రాలేదు. మళ్ళీ ఆవిడగారే పరిగెత్తుకుంటూ వచ్చే అడ్డు తగిలింది. రోడ్డు చివర బండల మీద పెట్టి కాల్చుకోమంది. ‘మన ఇంట్లో దీపావళి అయితే వీధి చివరకు వెళ్ళి కాల్చుకోవాలా..’ – అంటూ మా అక్క గొణిగింది.

‘ఏమిటీ.. ఏమిటో అంటున్నావ్ పిల్లా’…అంటూ తీవ్రమైన చూపు చూసింది. వెంటనే మళ్ళీ అమ్మే ఆమెను శాంతింప చేస్తూ, మాకు వార్నింగ్ ఇచ్చింది.

నేనూ మా అక్కా హర్ట్.

కనీసం కాకర పువ్వొత్తిని అయినా ఇంట్లో కాలుద్దామని పెట్టె తెచ్చుకుంటే, మళ్ళ్ అదే కంఠం. ఇంటి ముందు అరుగు మీద కూర్చుని కాల్చాలన్న రూల్ వచ్చి పడింది. దీంతో నేనూ మా అక్కా హర్ట్.

‘మతాబులకు ఓ పొడవైన కర్ర పుల్ల గుచ్చి ఇంటి లోపల మనం నిలుచుని ఇంటి పైకి కర్ర పుల్ల పొడుచుకు వచ్చేలా ఉండే మతాబు చేత్తో పట్టుకుంటే. ఇంట్లో ఉండి కాల్చినట్లేనని మా అక్క గొణుగుడికి కుండబద్దలు కొట్టినట్లు సమాధనం చెప్పింది ఆ ‘బండరాయి’. ఈ పండుగ అయ్యాక మేము గుంటూరు వెళ్ళిన తర్వాత మా అక్క ఆవిడ గారికి బండరాయి అనే పేరు ఖాయం చేసింది.

సరే, మేము పిల్లలం కదా. ఇల్లు ఎలా ఉంచుకోవాలో , అందుకు అనుసరించాల్సిన రూల్స్ ఏమిటో మాకేం తెలుసు చెప్పండి. కదిలేతే తప్పు, మెదిలితే తప్పు. పడక కుర్చీలో కూర్చోగానే మరో అరుపు.. ‘ఇది తాతయ్య కూర్చునే కుర్చీ మీరు కూర్చోకూడదు’

హర్ట్ మీద హర్ట్. కోపం మీద పైకోపం.

సోఫాలో కూర్చుని కాకరపువ్వొత్తుల ప్యాకెట్ తెరుస్తుంటే మళ్ళీ అదే సీను. కాకర పువ్వొత్తి కడ్డీ సోపాకి గుచ్చుకుని అది కాస్తా పాడవుతుందట, పైగా ఆ ఊర్లో దాన్ని రిపేర్ చేసే వాళ్ళు లేరు తెలుసా అంటూ తన స్టేట్ మెంట్ కి బలమైన రీజనింగ్ జోడించి మరీ అరుస్తుంది..

నేనూ మా అక్కా హర్ట్.

ఇలా ఓ పది సార్లు హర్ట్ మీద హర్ట్ అవుతూ, ఆవిడగారి మాటలే అవుట్లులా పేలుతుంటే, ఆవిడ చూపులే చిటపటలు సృష్టిస్తుంటే ఇంక దీపావళి టపాసులెందుకు?? ఇలాంటి వాళ్లు దీపావళికి రారమ్మంటూ పిలవడాలెందుకో మా చిట్టి బుర్రలకు అర్థం కాలేదు. అయితే, తిరుగు ప్రయాణంలో మా అక్క ఇదే అడిగితే, అమ్మ శాంతంగా, ‘అందరి ఇళ్లు ఒకలా ఉండవురా.. మనమే సర్దుకు పోవాలి’ – అని అంటూ సహనం గురించి క్లాస్ పీకింది. ఇలా బోలెడన్ని హర్టులను మూట గట్టుకుని మేము గుంటూరు చేరాము.

కానీ మా ఇంట్లో అలా కాదు. ముందే చెప్పాను కదా, స్వేచ్ఛగా దీపావళి చేసుకునే వాళ్లం. కానీ నాన్న పండగకు ముందే ఆంక్షలు పెట్టేవారు. అయితే ఇవన్నీ ఆ ఇంటావిడ లాగా ఉండవు లేండి. ఇవి మా మేలు కోరేవిగానే ఉండేవి. అంటే దీపావళి టపాసులు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే ఆంక్షలే ఇవన్నీనూ. వాటిలో కొన్ని..

  • టపాసులు బజారు నుంచి తీసుకు రాగానే వాటిని పోయ్యికి దగ్గర్లో ఉంచకూడదు.
  • కర్మం చాలకపోతే కాకరపువ్వొత్తి కూడా పేలుతుంది. జాగ్రత్త.
  • తేలికపాటి టపాసులే కదా అని మరీ మొహం దగ్గరగా ఉంచుకుని కాల్చకూడదు.
  • చిచ్చు బుడ్డి వెలగలేదని ముఖం దానికి దగ్గరగా పెట్టి చూడకూడదు.
  • తాడు, కాకరపువ్వొత్తి వంటివి కాల్చేటప్పుడు గిరగిరా తిప్పేటప్పుడు ప్రక్కవాళ్లను చూసుకోవాలి.
  • చెప్పులు లేని కాళ్లతో టపాసులు కాల్చడానికి వెళ్ళకూడదు.
  • తారాజువ్వలు పిల్లలు కాల్చడం మంచిది కాదు. పెద్ద వాళ్లు కూడా నేర్పుగా కాల్చాలి.
  • అతి ముఖ్యమైనది – పిల్లా పెద్దా టపాసులు కాల్చడానికి సిద్ధమయ్యే ముందే ఇంట్లో ఓ చోటేమో బక్కెట్లో ఇసుక, మరో చోటేమో నీళ్ల బకెట్ పెట్టుకోవాలి. అగ్ని ప్రమాదం జరిగితే మంటలను వెంటనే ఆర్పడానికి.
  • కాలిన గాయాలకు ప్రాథమిక చికిత్సకు పనికొచ్చే మందుల పెట్టె సిద్ధం చేసుకోవాలి.

ఇలాంటివి మరికొన్ని చెప్పేవారు. ఇలా చెబుతుంటే మాత్రం నేనూ మా అక్కా హర్ట్ అయ్యే వాళ్లం కాదు. మన మంచికే కదా అనుకుని వాటన్నింటినీ పాటించేవాళ్లం.

చాలా పెద్దయ్యాక ఇవన్నీ ఆలోచిస్తుంటే, రూల్స్, షరతులు పిల్లలను బాగా హర్ట్ చేసేవిగా ఉండకూడదని నాకనిపించింది. పిల్లలేమిటిలేండి, పెద్దలూ ఒక్కో సారి ‘బండరాయి’ లాంటి వాళ్లు మాటలకు హర్ట్ అవుతూనే ఉంటారు. ఇలాంటి ఇళ్లకు వెళ్లకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ఆనందంగా పండుగలు చేసుకునేటప్పుడు. ఈ ఆనందం ఆవిరైతే ఇక పండుగ సరదా ఏముంటుంది చెప్పండి? ‘ఈ రోజుల్లోనూ బండరాయి లాంటి వాళ్లు ఉంటార్రా’ అంటూ ఈ మధ్యనే ఓ ఫ్రెండ్ నాతో అన్నాడు. నిజమే అనిపించింది.

మా పల్లెటూరు (అడవిరావులపాడు)లో బాగా చిన్నప్పుడు దీపావళి చాలా సాదాసీదాగా జరిగేది. ఎండు గడ్డి తీసుకుని వాటిని జడలుగా అల్లేవాళ్లు. వాటికి ఓ అంచున ఆముదంలో తడిపిన గుడ్డ పీలికలను చుట్టే వారు. ఆ తర్వాత మంటలో పెట్టగానే ఆ గడ్డి తాడుకు మంట అంటుకునేది. అది కాలుతుంటే దాన్ని గిరగిరా తిప్పేవాళ్లు. ఇప్పుడు అలాంటి దృశ్యాలు కరువయ్యాయి. మా నందిగామలో తారాజువ్వలను రెండు ముఠాల వాళ్లు నేలబారుగా విసురుకునేవారు. ఇదో యుద్ధంలా సాగేది. మెయిన్ బజారుకు దగ్గర్లోనే మా ఇల్లు ఉండటంతో వాటిలో కొన్ని మా ఇంట్లోకి కూడా వచ్చేవి. ఒక్కోసారి ముఠాల్లోని అటూ ఇటూ కొంత మంది గాయాల పాలయ్యేవారు. పోలీసులు అదుపు చేయాలని చూసినా ఈ యుద్ధం ఆగేది కాదు. అప్పుడప్పుడు ఇళ్లు తగలబడేవి. గడ్డి వాములు మంటల్లో బూడిదయ్యేవి. అందుకే దీపావళి వస్తుందంటే చాలు ఊర్లోని పెద్దలు ఇలాంటి సంఘటనలను గుర్తుచేసుకుని జాగ్రత్తలు పాటించాలని చెప్పేవారు.

నరకాసుర వధ:

దీపావళికి ముందు రోజు వచ్చే నరక చతుర్థి, దీనికి సంబంధించిన కథ ఆట్టే నాకు చిన్నప్పుడు తెలియదు. ఏదో నారకాసురుణ్ణి కాకరపువ్వొత్తితో కాల్చమనే వారు. నాన్నలైతే బయటకు వెళ్ళి అవుట్లు గట్రా పేల్చేసి – ఇంట్లోకి వస్తూనే – ‘హహ్హాహ్హా.. నరకాసురుడు చచ్చాడు’ – అంటూ నవ్వేసేవారు. మేమూ నరకాసురుణ్ణి అవుట్లతో చంపేస్తామంటే, ‘మీరు పిల్లల్రా, కాకర పువ్వొత్తులు చాల్లే’ అనే వారు. మా బామ్మ అయితే మరీనూ, ‘అవి కూడా ఎందుకురా పిల్లలకు, చేతులు కాల్చుకుంటారు, ఓ అగ్గిపుల్ల చాలదా ఏమిటీ వాడ్ని (నరకాసురుణ్ణి) చంపడానికీ..’ అంటూ రాగం తీసేది. అప్పుడు నాకనిపించేది, నరకాసురుడు ఎవడో గానీ చివరకు అగ్గిపుల్లకు కూడా చచ్చేటంత బలహీనుడేమోనని. బోలెండు పెద్దయ్యాక, కాస్తో కుస్తో సిగరెట్లు అలవాటైనప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్‌లో – ‘ఒరేయ్ నేను సిగరెట్ కాల్చేసి నరకాసురుణ్ణి చంపుతాన్రోయ్’ – అంటూ చమత్కరించేవాణ్ణి.

‘ఓ తల్లి తన కొడుకుని చంపితే దీపావళి పండుగ చేసుకోవడమా?’ అంటూ తర్కంగా మాట్లాడేవాడిని. దీంతో మా ఫ్రెండ్ గాళ్లేమో నా చుట్టూ మూగి ‘ఏమిట్రా ఆ కథ చెప్పు’ అంటూ అడిగేవారు. అప్పుడు నేనేమో నాటకీయంగా చెప్పేవాడిని. సత్యభామే కదా, నరకాసురుణ్ణి చివరకు తన బాణంతో చంపేసింది. ఆమె ఎవరనుకుంటున్నారు? పూర్వం వరాహావతారంలో విష్ణువు ఓ అసురుడి నుంచి భూమిని రక్షిస్తాడు. అప్పుడు భూమాత మనసుపడి విష్ణువుని వరిస్తుంది. ఆ భూమాతే ద్వాపర యుగంలో సత్యభామగా అవతరించి, విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని పెళ్లాడుతుంది. విష్ణువు- భూమాతలకు పుట్టిన వాడే నరకుడు. వాడిలోని చెడు లక్షణాల వల్ల అసురుడయ్యాడు. లోకకంఠకుడు అయ్యాడు. సత్యభామకు పూర్వజ్ఞానం లేకపోవడంతో యుద్ధం చేసి తన కుమారుడే అయిన నరకుడిని సంహరిస్తుంది. ‘ఇదంతా లోకకల్యాణం కోసమే దేవి’ అంటూ శ్రీకృష్ణుడేమో బాధపడుతున్న సత్యభామను ఓదారుస్తాడు. లోకకంఠకుని పీడ విరగడవడంతో లోకం ఆనంద దీపావళి జరుపుకుంటుంది. అని నేను ఎంతో కష్టపడి చెబితే, ఓ ఫ్రెండు గాడు, ‘ఇదంతా నాకూ తెలుసులేరా.. దీపావళి సినిమా చూసే కదా నువ్వు చెప్పింది?’ అంటూ తేల్చి పారేశాడు. ఏమిటో, కొంత మంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోరూ.. మనలోని టాలెంట్ సబ్జెక్ట్ మీద కాదు, అది ఎంత ఇంటరెస్టింగ్‌గా చెప్పామనే దానిలోనే. అర్థం చేసుకోరూ..

కానీ ఈ టాలెంట్‌ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తించింది. అందుకే నాటికలు, రూపకాలు వ్రాయగలిగాను.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here