తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-33

0
11

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

చీకటిలో వెలుగు:

[dropcap]ఇ[/dropcap]ద్దరు మనుషులు నన్నూ నాతో పాటు మరికొంత మందిని ఓ గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో వెలుతురు బాగానే ఉంది. పైగా చల్లటి గాలి వీస్తోంది. గోడకు తైలవర్ణ చిత్రాలు కనిపిస్తున్నాయి. గది మధ్యలో అందమైన టీపాయ్, దాని మీద ప్లవర్ వాజ్ – గదికి మరింత అందాన్ని తెచ్చాయి. మమ్మల్ని గదిలోకి ఎంతో సాదరంగా తీసుకువచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు ఏవో మాట్లాడుతుండగానే, మరో వ్యక్తి మా కోసం టీ – బిస్కెట్లు తీసుకు వచ్చాడు. తీసుకోండంటూ ఆఫర్ చేశారు. వేడివేడి టీ చప్పరిస్తూ, బిస్కెట్లు తింటుంటే మమ్మల్ని గదిలోకి తీసుకువచ్చిన వారిలో ఒకతను ‘మరి కాసేపట్లో మన ప్రయాణం మొదలవుతుంది’ అని చెప్పాడు. ఇక్కడో విషయం చెప్పాలి. వీరంతా అంధులు. చీకటే వీరి ఆవాసం. వారితో పాటు ప్రయాణం చేయడమే ఇప్పుడు మా లక్ష్యం.

ఈ ప్రయాణానికి మేము ముందుగానే సిద్ధమై ఉండటంతో ఆ మాటకు మేమేమీ ఉలిక్కి పడలేదు. సరే అన్నాము.

అంతలో ఓ అమ్మాయి వచ్చి – ‘మీరు లోపలకి రండి’ అంది. అలా వచ్చిన అమ్మాయి కూడా అంధురాలు. చూపు లేకపోయినా అందరిలాగానే ఠీవీగా నడుస్తూ మాకు దారిచూపిస్తుంటే మేము ఇంకో గదిలోకి వెళ్లాము. అక్కడ వెలుతురు చాలా తక్కువగా ఉంది. సూర్యాస్తమయం తర్వాత చీకటి అలుముకున్నట్లుంది ఆ గదిలోని వాతావరణం. గదిలోని గోడలకు తగిలించిన చిత్రపటాలు జాగ్రత్తగా చూస్తేనే కాని కనబడటం లేదు. అంతలో మాలోని ఒకడు తూలి పడబోయాడు. మమ్మల్ని లోపలకు తీసుకు వచ్చిన అమ్మాయి నవ్వుతూ – ‘మరేం ఫర్వాలేదు. అది టీపాయి. మీ కళ్లకు కనబడలేదు. అందుకే తూలి పడబోయారు’ – అంటూ వివరణ ఇచ్చింది.

నాకు ఆశ్చర్యమేసింది. కళ్లున్న మాకు కనిపించని వస్తువు ఆమెకు ఎలా కనిపించింది. అలవాటైన గది కాబట్టి అని సరిపుచ్చుకుందామంటే, ఆ తర్వాత ఆమె మాటల తీరు చూస్తుంటే ఆమెలో ఏదో అద్భుత శక్తి దాగున్నదని అనిపించసాగింది. కాసేపు మాతో మాట్లాడగానే మాలో ఎవరు ఎటు వైపున ఉన్నారో ఆమె చాలా తేలిగ్గా గుర్తుపట్టగలుగుతోంది. అంతలో మమ్మల్ని మరో గదిలోకి తీసుకు వెళ్ళింది. అక్కడ అంతా అంధకారమే. ఇందాకటి వరకు ఉన్న మసక వెలుగు కాస్తా మాయం అయింది. మేమంతా ఓ చీకటి లోకంలోకి అడుగుపెట్టామని అర్థమైంది. ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ ఒక వరుసలో. కాలితో నేల తడుముకుంటూ నెమ్మమదిగా అడుగుతీసి అడుగులు వేస్తున్నాము.

‘ఇదిగో మీలో మూడవ వారు గోడని పట్టుకుని నడుస్తున్నారు. అలా పట్టుకోకండి. చీకట్లో ఫ్రీగా నడవడం నేర్చుకోండి’

మూడవ వాడిని అడిగాను. ‘గోడని పట్టుకుని నడుస్తున్నావా..’ అని అతగాడేమో ‘అవును’ అని సమాధానమిచ్చాడు.

చీకట్లో ప్రయాణం అంటే మాటలు కాదు. కానీ వారికి అది కొత్త కాదు. అక్కడ మాకు సపోర్ట్ చేస్తున్నవారంతా అంధులే. వారిది – ‘చీకటి లోకం’. కాని ఈ మాట వారితో అంటే ఒప్పుకోరు. చీకటి లోకంలో కూడా వెలుగు చూస్తామంటారు వారు. ఈ చీకటి ప్రయాణ సంఘటన 2012లో జరిగింది. అప్పుడు నేను తరంగా రేడియో స్టేషన్‌కి ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఆర్‌జేల్లో ఒకరైన భావన ఓ రోజు స్టూడియోలోకి ఎంటరవుతూనే, ‘సార్, ఇన్ ఆర్బిట్ మాల్‌లో ఓ ఎడ్వెంచరస్ వాక్ ఉంది. వెళదామా’ – అంది.

‘ఏమిటది’ అడిగాను. వివరాలు తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను.

హైదరాబాద్ లోని ఇన్ ఆర్బిట్ మాల్‌లో అంధుల పట్ల అవగాహన పెంచడానికి ఓ ఎడ్వెంచర్ షోని ఏర్పాటు చేశారు. ‘చీకటిలో సాహస ప్రయాణం’ – అన్న పేరిట ఏర్పాటైన షో ఇది. ‘డైలాగ్ ఇన్ ద డార్క్’ అంటూ రోజూ కొన్ని ప్రత్యేక షోలను ఏర్పాటు చేశారు. కంటి చూపు బాగానే ఉన్న వారు చీకట్లో ప్రయాణం చేస్తుంటే వారి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియజెబుతూ, అంధుల జీవితాలు – మనమంతా అనుకున్నట్లుగా చీకటి మయం కాదనీ, ఆ చీకట్లోనే వారు వెలుగు రేఖలు చూడగలరని తెలియజెప్పే ప్రయత్నమే ఇది. ఈ షో కోసం ముందుగా పర్మిషన్ తీసుకుని తరంగా టీమ్ – ఆర్‌జె భావన, నేను మరికొంత మంది – వారు చెప్పిన సమయానికి ఇన్ ఆర్బిట్ మాల్ లెవల్ 5లో ఉన్న ఈ ‘ఎడ్వెంచరస్ టూర్ ఇన్ ద డార్క్’ – వేదికకు చేరాము. వారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఓ గదిలోకి తీసుకువెళ్ళి టీ బిస్కెట్లు ఇచ్చి ఆ తర్వాత ఇదిగో ఇందాక చెప్పినట్లుగా డార్క్ రూమ్ లోకి దారితీశారు.

కనులుండీ చూడలేని స్థితి.

కేవలం మాటలు మాత్రమే వినబడుతున్నాయి.

అంతా అయోమయం.

ఆ పరిస్థితిలో – కళ్లున్న మమ్మల్ని జాగ్రత్తగా నడిపించింది కంటి చూపులేని వారు. ఆ కాసేపట్లో అంధుల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో వారు వివరించారు. నెమ్మదిగా మమ్మల్ని బయటకు తీసుకు వచ్చారు. అంతే.. వెలుగు రేఖలు కంటికి సోకగానే అంధునికి చూపు వచ్చినట్లు అనిపించింది.

చీకటి లోకంలో కూడా వెలుగు చూస్తూ జీవిస్తున్న వారిపై దీపావళి సందర్భంగా తరంగా రేడియోలో ఏర్పాటు చేసే ఓ ప్రత్యేక కార్యక్రమానికి రమ్మంటూ వారిని ఆహ్వానించాను. తరంగా స్టూడియోకి వారు వచ్చారు. చీకట్లో వెలుతురు అన్న లైవ్ షో తరంగా రేడియోలో ప్రసారమైంది. విన్నవారు మెచ్చుకున్నారు. నాకు తృప్తి మిగిలింది.

‘అదిగో హరివిల్లు’:

ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్‌లో ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న విజయ గారు ఓ సారి ఫోన్ చేసి, ‘వీలుగా ఉంటే ఓ రాగలరా’ అని అడిగారు. ‘సరే వస్తానండి’ అని చెప్పి, వీలు చూసుకుని హైదరాబాద్‌లో అసెంబ్లీ (పాతది) ఎదురుగా ఉన్న రేడియో స్టేషన్‌కి వెళ్ళాను. విజయగారు నవ్వుతూ పలకరించి, ‘మీరో చక్కటి రూపకం వ్రాయాలండి’ అని కోరారు. అంతకు ముందే విజయవాడ స్టేషన్ నుంచి మంత్రవాది మహేశ్వర్ గారు నా చేత కొన్ని రూపకాలు వ్రాయించారు. ఇక్కడ హైదరాబాద్ స్టేషన్ కోసం కూడా ఒకటో రెండో అప్పటికి వ్రాశాను. రేడియోలో నాటికలు వ్రాయడానికీ రూపకాలు వ్రాయడానికీ కొంత తేడా ఉంది. రూపక రచనలో టాపిక్‌ని సూటిగా చెప్పడంతో పాటుగా సందర్భోచితంగా నాటకీయత చొప్పించ వచ్చు. ఈ మిశ్రమ ప్రక్రియ అలవాటు కావడం వల్లనే అనుకుంటా నా యీ సాఫల్య యాత్ర (జీవనరాగాలు) రచనలో కూడా కొత్త పద్ధతిగా స్వీయచరిత్రకు నాటకీయత జోడిస్తూ వ్రాయగలుగుతున్నాను. ఇది పాఠకులను ఆకట్టుకుంటున్నది.

సరే, విజయ గారికి రూపకం వ్రాయడానికి ఒప్పుకున్నాను. ఆమె నన్ను ఓ స్టూడియోలోకి తీసుకువెళ్ళారు. అప్పుడు ఆమె చెప్పిందేమంటే..

‘అంధుల జీవితాల మీద మనం ఈ రూపకాన్ని ప్రెజెంట్ చేయాలండి. కొంత మంది అంధులతోనూ, అలాగే అంధులకు చూపు తెప్పించిన వైద్యులతోనూ మాట్లాడించాము. ఆ వివరాలు ఇదిగో ఈ టేపుల్లో ఉన్నాయి. మీరు వినండి. నోట్స్ వ్రాసుకోండి. ఆ తర్వాత రూపకానికి ప్లాన్ చేద్దురు’

వింటుంటూనే ఇదేదో ఛాలెంజ్ అనిపించింది. నాకు మొదటి నుంచి సవాళ్లు ఎదుర్కోవడం, విజయం సాధించడం కోసం పోరాటాలు చేయడం అలవాటే. టేపుల్లోని మాటలు వింటూ నోట్స్ వ్రాసుకున్నాను. వారి మాటలు వింటుంటే నాలోని రచయిత మేల్కొన్నాడు. కచ్చితంగా బాగా వ్రాయవచ్చన్న నమ్మకం కుదిరింది. విజయగారితో మరి కాసేపు మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి వారం పది రోజుల్లో రూపకం సిద్ధం చేశాను. ఆ రూపకానికి నామకరణం చేశాను. – ‘అదిగో హరివిల్లు’ అని.

రూపకం వ్రాస్తున్నప్పుడు నాకు తెలియదు దీనికి జాతీయ ప్రతిభా పురస్కారం అందుతుందని. ఈ రూపక రచనను ఇంగ్లీష్‌లో కూడా అనువదించారు. 2010లో ప్రసారమైన ఈ రూపకాన్ని తాను అప్పట్లోనే విన్నానని ఈ మధ్యనే ఒకతను చెప్పినప్పుడు చాలా సంతోషమేసింది.

అంధుల జీవితాల గురించి వ్రాసిన రూపకానికి అదిగో హరివిల్లు అంటూ క్యాచీగా హెడ్డింగ్ పెట్టడం విజయగారితో పాటు చాలా మందికి నచ్చింది. ఈ రూపకం సారాంశం..

ఎనిమిదేళ్ల పాపకి కంటి చూపు లేదు. ఆ పాపకు ఆకాశం నీలం రంగులో ఉంటుందని తెలియదు. హరివిల్లులో ఏడు రంగులు ఉంటాయనీ తెలియదు. అమ్మ చెబుతున్నప్పుడు హరివిల్లు గురించి ఆలోచిస్తూ అది ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ ఉండేది. ఒక దశలో ‘అమ్మా, హరివిల్లు నీలా ఉంటుందా..’ అని అమాయకంగా అడుగుతుంది. ఆ పాపకి ఆపరేషన్ చేసి కళ్లు అమరుస్తారు. ఆస్పత్రి బైట వాన మొదలైంది. మరో ప్రక్కన ఎండ కాస్తున్నది. ఆస్పత్రి లోపల పాప కంటికి కట్టిన క్లాత్ తొలగిస్తున్నారు. ‘అమ్మని చూస్తావా చిట్టి తల్లీ’ అని డాక్టర్ అడుగుతాడు. లేదు, నేను హరివిల్లు చూస్తానంటుంది ఆ పాప. డాక్టర్ కిటికీలోపలి నుంచి బయటకు చూసి చిరునవ్వుతో – ‘అలాగే పాపా, చూద్దువు కానీ..’ అంటూ పాపను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి ఆరుబయటకు తీసుకు వచ్చి కంటికి అడ్డుగా ఉన్న క్లాత్‌ని పూర్తిగా తొలగిస్తాడు. అప్పుడు అమ్మ అంటుంది… ‘చూడరా కన్నా, అదిగో హరివిల్లు’ – ఈ డైలాగ్ తో రూపకం ఎండ్ అవుతుంది.

రచయితగా ఎన్నో వ్రాస్తాము. కానీ ఇలాంటి రచన చేసే అవకాశం నాకు దక్కినందుకు ఇప్పటికీ ఆకాశవాణికి శాల్యూట్ చేస్తుంటాను. ఈ రూపక రచన కారణంగా అంధుల జీవితాల మీద కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత ఆర్‌జె భావన – డైలాగ్ ఇన్ ద డార్క్ గురించి చెప్పడం, ఇన్ ఆర్బిట్ మాల్‌కు వెళ్లినప్పుడు మరో సారి అదిగో హరివిల్లు గుర్తుకు వచ్చింది. అందుకే తరంగా రేడియో కోసం – చీకట్లో వెలుతురు అన్న కార్యక్రమాన్ని శ్రోతలకు అందించాను. ఇది కూడా ప్రశంసలు అందుకుంది.

చీకటి అన్నది కష్టమైతే, వెలుగు అన్నది సుఖం. కష్టసుఖాలు జీవనంలో అంతర్భాగాలే.

ఆత్మస్థైర్యం:

మనిషి దేన్నైనా కోల్పోవచ్చు కానీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకూడదని ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పడు నా సీనియర్ మిత్రుడొకరు చెప్పారు. అసలు ఆంధ్రప్రభలో ఉన్నప్పుడే ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకోగలిగాను. అది కేవలం ఒక ఆఫీస్ కాదు. నడవడికను తీర్చిదిద్దిన పాఠశాల. వ్యక్తిత్వ వికాసాన్ని మేల్కొలిపిన గురువు. ఆంధ్రప్రభ తర్వాత బతుకుతెరువు కోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేసినా ఇలాంటి వాతావరణం మరెక్కడా చూడలేదు. పనిలో ఆనందం చవి చూపిన సంస్థ అది. స్నేహబంధాన్నీ, సాంస్కృతిక బంధాన్ని పెనవేసి నడిపిన వేదిక అది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కి ట్రాన్సఫర్ పెట్టుకుని వచ్చాక యాజమాన్యంలో వచ్చిన మార్పు మూలంగా కొత్త ఇబ్బందులు తలెత్తాయి. షిర్డీ పాదయాత్ర మహిమ భాగంలో చెప్పినట్లుగా పై అధికారి వల్ల నాలోని జర్నలిస్ట్ ఆవిరయ్యాడు. స్వేచ్ఛ కనుమరుగైంది. ఈ గడ్డు కాలంలో లాంగ్ లీవ్ పెట్టాను. అప్పుడే షిర్డీ ప్రయాణం కట్టాను. తిరిగి వచ్చాక కొద్ది రోజుల్లోనే అనుకూల వాతావరణం చోటుచేసుకుంది. చీకట్లు తొలిగిపోయాయి. ఒక రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సారాంశం ఏమంటే – నన్ను ఇబ్బంది పెట్టిన గురుడు తన శిష్యగణంతో పాటుగా బయటకు వెళ్ళిపోయాడు. పరిస్థితి అయోమయంలో పడింది. మీ లాంటి సీనియర్లు వచ్చి చక్కదిద్దాలని ఆహ్వానం. సరే అని నేను బయలుదేరాను. నిన్నటి చీకటి తొలిగిపోయింది. నూతన కాంతి మది లోకి ప్రవేశించింది. అక్కడితో ఈ వెలుగులు ఆగలేదు. ఆకాశవాణి ఎఫ్ఎంలో గంటగంటకూ వార్తలు అందించడం మొదలైంది. ఆకాశవాణి న్యూస్ సెక్షన్ అధికారి ఎం.వి.ఎస్ ప్రసాద్ గారు పిలిచి నాకు నూతన బాధ్యతలను అప్పగించారు. నెలలో కొద్ది రోజులు ఈ డ్యూటీ పడేది. ఆ సమయంలోనే ఒకసారి స్టూడియోలో జాతకాలు చెప్పే వక్కంతం చంద్రమౌళి గారు పరిచయం అయ్యారు. మాటల్లో తనకు వార్తా పత్రికలో ఎడిటోరియల్ సెక్షన్ చూడాలని ఉన్నట్లు చెప్పారు. ‘దీనిదేముందండి, తప్పకుండా, రేపు రండి’ అని ఆహ్వానించాను. అలా ఆయన మర్నాడు ఆంధ్రప్రభ ఆఫీస్‌కు వచ్చారు. కాసేపు ఆసక్తిగా ఆఫీస్ పనితీరు గమనించాక, నాకో సాయం కావాలండి అని అడిగారు. చెప్పండి అన్నాను. తనకు ఒక సైటైర్ వ్రాసి ఇమ్మనమని అడిగారు. అప్పటికప్పుడు రాష్ట్ర పాలిటిక్స్ మీద రెండు మూడు పేరాలు టైప్ చేసి ఇచ్చాను. చదివి బాగుందని ప్రింట్ తీసుకుని వెళ్ళారు. ఆయన ఎందుకు అడిగారో నాకు తెలియదు. ఆ రోజు పని పూర్తి చేసుకుని నేను రాత్రి ఇంటికి చేరాను. మర్నాడు పొద్దున్నే అమెరికా నుంచి గ్రేట్ ఆంధ్రా ఫౌండర్ అరికట్ల వెంకట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. ప్రతి రోజూ ఈ వెబ్ సైట్లో వార్తలు, సెటైర్స్ వ్రాసి ఇవ్వండని కోరారు. అందుకు పేమెంట్ కూడా ఉంటుందని చెప్పారు. అలా ఆదాయపు వనరులు పెరిగాయి. ఇంతలో మా అబ్బాయి రాజేష్‌కి ఉద్యోగం వచ్చింది. ఇలా ఆర్థికంగా పుంజుకోవడంతో చీకట్లో నుంచి సంపూర్ణంగా వెలుగులోకి వచ్చినట్లయింది. గ్రహణం పూర్తిగా విడిచిందన్న భావన కలిగింది. అయినప్పటికీ కొంత మంది వ్యక్తుల వల్ల కష్టాలు, ఇబ్బందులు చవిచూడక తప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓ పాట నాలో ఆత్మశక్తిని పెంచేది. అది మీతో పంచుకుంటున్నాను.

‘అపాయమ్ము దాటడానికి
ఉపాయమ్ము కావాలి
అంధకారమలిమినపుడు
వెలుతురుకై వెతకాలి.
ముందు చూపు లేని వాడు
ఎందునకు కొరగాడు.
సోమరివై కునుకు వాడు
సూక్షమ్ము గ్రహించలేడు.’

‘మత్తు వదలరా’ – అంటూ సాగే ఈ పాటలో ఎంతో జీవిత సత్యాన్ని పొందుపరిచారు కవి. జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పుడు మేలుకొలిపి సరైన బాటలోకి తీసుకు వచ్చే శక్తి ఉన్న పాట ఇది. 1966లో వచ్చిన శ్రీకృష్ణపాండవీయం సినిమా కోసం కొసరాజు వ్రాసిన ఈ పాట చైతన్య స్ఫూర్తి మంత్రం.

అలాగే, మరో పాటలో..

‘కన్నులుండి చూడలేరు కొంత మంది జనం
దారితప్పి తిరగడమే తెలివిలేని తనం’

– అని సినీ కవి అన్నట్లుగా, కొంత మంది తాము చేసేది తప్పని తెలిసినా ఒప్పుకోరు, కళ్లముందు కనబడుతున్న సత్యాన్ని కూడా అంగీకరించరు. ఇలాంటి వారు నా జీవితంలో కూడా తారసపడ్డారు. వారి వల్ల నాకు ఆర్థికంగానే కాదు, మానసికంగానూ కష్టం కలిగింది. ఇవన్నీ సరిదిద్దడానికి చాలాకాలమే పట్టింది.

తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు చేతనైతే సాయం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండిపోవాలి. అంతే కానీ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకూడదు.

స్వేచ్ఛ ఆవిరి:

కొంత మంది వింతగా ప్రవర్తిసుంటారు. మనం వాళ్లింటికి వెళ్లినా, వారే మనింటికి వచ్చినా మనకే నష్టం. కష్టం. మన స్వేచ్ఛను ఇట్టే హరిస్తుంటారు. వారితో ఉన్నంత సేపూ గాలి బిగదీసినట్లు ఫీలింగ్ వస్తుంటుంది. మన కట్టుబొట్టు వంటి స్వేచ్ఛాపూరిత అలవాట్లపై కూడా ఆజమాయిషీ ప్రదర్శిస్తారు. వారి ఆచారాలను మనపై రుద్దడానికి యత్నిస్తారు.

ఇలాంటి వారి వల్ల ఎన్నో అడ్డంకులు చీకాకులు కలిగిన మాట వాస్తవమే. ఈ సమాజ పోకడను ఒక్క పూటలో మార్చలేము. ప్రస్తుతానికి మనం చేయగలిగనదల్లా, చీకట్లో వెలుతురు కోసం ప్రయత్నించడమే. నేనూ అదే చేశాను.

వెలుతురులో ఉన్న వానికి చీకటి విలువ తెలియదు. కానీ అదే చీకటి అనే కష్టాల కడలిలో ప్రయాణిస్తున్న వానికి వెలుతురు అనే సుఖం విలువ బాగా తెలుస్తుంది. జీవనపోరాటంలో ఈ సూత్రం తెలుసుకోవాలని మా మిత్రుడొకరు చెప్పారు. నిజానికి నా జీవితం ఓ పోరాటాల మయం. చీకటికీ మరో చీకటి మధ్యన ఉన్న వెలుగు రేఖే నా బలం.

‘కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు.
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు.
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు’

– అంటారు సినారె 1978లో విడుదలైన ‘గోరంతదీపం’ సినిమా పాటలో.

‘కడలి నడుమ పడవ మునిగితే కడదాకా ఈదాలి.
నీళ్లు లేని ఎడారిలో కన్నీళ్లయినా తాగి బతకాలి.
జగమంత దగా చేసినా చిగురంత ఆశను చూడు’

– ఇదే జీవిత సత్యం. ఈ సత్యాన్ని గ్రహించిన వారికే చివరకు జీవన సాఫల్యత సిద్ధిస్తుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here