తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-4

4
10

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

కొత్త పుస్తకం – కమ్మటి వాసన:

[dropcap]వే[/dropcap]సవి ఎండ, వడగాలి అంటే భయం లేని రోజులవి. సమ్మర్ వచ్చిందంటే చాలు బోలెడు సెలవలు. ‘చదువుకో’ అని అడిగేవారే ఉండరు. ఆట పాటలతో సెలవులు కరిగిపోతున్నాయన్న సంగతే మరచిపోయేవాడ్ని. ఇంతలో పిడుగుపాటు వార్తని ఇంట్లో వాళ్లు మోసుకొచ్చేవాళ్లు.

‘వచ్చే సోమవారం నుంచేనట వీడి స్కూల్ ప్రారంభమయ్యేది, ఒరేయ్ ఇక తిరుగుళ్లు తగ్గించు, రేపో ఎల్లుండో కొత్త టెక్స్ట్ పుస్తకాలు తెస్తాను’ అనేవారు. ఇలాంటి మాటలు నాకసలు నచ్చేవి కావు. ఈ పెద్దోళ్లున్నారే వీళ్లెప్పుడు ఇంతే, ‘చదువుకో చదువుకో’ అంటారా, బుద్ధిగా చదువుకుంటున్నామా, అంతలో ‘ఇక చాల్లే వెళ్ళి ఆడుకో’ అనో, ‘వెళ్ళి పడుకోరా’ అనో అనేవారు. ఏ మాట మీద సరిగా నిలబడరు. ఏమిటో నిలకడలేని మనుషులు.

సరే, కొత్త పుస్తకాలు కొని తెస్తామన్న మాట మాత్రం నిలబెట్టుకున్నారనుకోండి. ఇంట్లోకి కొత్త పుస్తకాలు వచ్చి వాలాయి. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఇంట్లోకి కొత్త పుస్తకాలు వచ్చిన వేళా విశేషమేమోకానీ ఆటలు, అల్లరికి స్వస్తి చెప్పేసి బుద్ధిగా కొత్త పుస్తకాలు చేతిలోకి తీసుకోవాలనిపించేది.

ఇంట్లో నాపైన అక్కా, అన్న ఉన్నప్పటికీ మా ఇంట్లో కొత్త పాఠ్య పుస్తకాలనే కొని తెచ్చే అలవాటు ఒకటుంది. కానీ, చాలా మంది ఇళ్లలో ‘పెద్దోడి పుస్తకాలున్నాయి కదా, చిన్నోడికి మళ్ళీ కొనడం ఎందుకు దండుగ’ అంటూ పాత పుస్తకాలు మొహాన పడేస్తుంటారు. అంతేనా, అన్నలో అక్కలో వాడేసిన బొమ్మలు, కలర్ పెన్సిళ్లు, చివరకు వాడిన లంచ్ బాక్స్ కూడా చిన్నోడి ‘సంపద’ అవుతాయి. పాతబడిన పుస్తకాలు, అందులో నుంచి వచ్చే అదో రకం చెమట, మురికి వాసనలు పీలుస్తూ చదువుకుంటూ సర్దుకుపోయే పిల్లలను చూసినప్పుడల్లా నాకు బోలెడు జాలేస్తుండేది. ఈ పరిస్థితి మా ఇంట లేనందుకు కాస్తంత గర్వంగానూ ఉండేది.

ఎవరింటి ఆర్థిక పరిస్థితి వారిదన్న ఆలోచన వచ్చేది కాదు. దీంతో వాళ్ల నాన్నలు సినిమాల్లో విలన్ గాళ్ళలా కనిపించే వారు. ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ వంటి పెద్ద పెద్ద పదాలు అప్పట్లో తెలియకపోయినా ఎందుకో నాన్నల్లో ‘విలన్ నాన్నలు’ ఉంటారన్న గట్టి ఫీలింగ్ వచ్చేసేది.

సరే, కొత్త పుస్తకాలు ఇంటికి రెక్కలు కట్టుకుని వాలగానే బోలెడు సంతోషమేసేది. నూతనోత్సాహం కట్టలు తెంచుకునేది. ఒక్క రోజులో అన్ని పాఠ్య పుస్తకాలు చదేవేయాలన్నంత పట్టుదల వచ్చేసేది. అలాంటప్పుడే, నా అంతటి అదృష్టవంతుడు ఎవ్వరూ లేరని నాకు నేనే భుజం తట్టుకునే వాడ్ని. ఇలా భుజం తట్టుకునే అలవాటు ఆ తర్వాత కూడా పోలేదు. ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒక వార్తకు పెట్టిన హెడ్డింగ్ లేదా మ్యాటర్ నాకు నచ్చగానే కుడి చేతితో ఎడమ భుజాన్ని తట్టుకునే వాడ్ని. ఈ లక్షణాన్నే ‘స్వీయ ప్రోత్సాహం’ అనవచ్చేమో.

కొత్త పుస్తకాలు చేతికి అందగానే వాటిని ప్రేమగా నిమిరేవాడ్ని. ఆ రోజుల్లోనే పాఠ్యపుస్తకాల్లో ఎంతో అందమైన బొమ్మలు ప్రింట్ అయ్యేవి. వాటిలో కొన్ని రంగు రంగు బొమ్మలు. ఉదాహరణగా ఒక ముచ్చట.. తెలుగు పుస్తకం తెరవగానే..

‘చేత వెన్న ముద్ద – చెంగల్వ పూదండ
బంగారు మొలత్రాడు – పట్టుదట్టి
సందిట తాయత్తులు – సిరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణా నిన్ను – చేరి కొలుతు’

అంటూ ఓ బుజ్జి కృష్ణుడి బొమ్మ వేసి ఆ పక్కనే ఈ పాట ఫ్రింట్ చేసేవారు. అసలు ఆ చిన్ని కృష్ణుడ్ని చూస్తేనే చిట్టి తమ్ముడు గజ్జల కాళ్లతో ఘళ్లు ఘళ్లున మా ఇంట పారాడుకుంటూ వచ్చేశాడా అన్నట్లు ఉండేది. పుస్తకంలోని ఆ చిన్ని కృష్ణుడ్ని ముద్దు పెట్టుకోవడానికి పుస్తకం ముఖానికి దగ్గరగా తీసుకువచ్చినప్పుడు.. సరిగా అప్పుడు వచ్చేది ఓ చక్కటి, కమ్మని వాసన. ఆ రంగుల పుస్తకంలో నుంచి. అనిర్వచనీయమైన ఆనందం. మనసు పరవశించే సువాసన.

ఒక్క తెలుగు పుస్తకం నుంచే కాదు, ఏ కొత్త పుస్తకం తీసుకుని ముద్దాడుతున్నా కమ్మని వాసనలే. మొత్తం కొత్త పుస్తకాల బొత్తు ఓ పూల తోటలా ఉండేది.

పుస్తకాలకు అట్టలెందుకు?

పుస్తకాలు ఇంటికి చేరి చక్కటి వాసన పీలుస్తూ మైమరిచి పోతుంటే. మరో పిడుగు పాటు వంటి వార్త చెవుల సోకేది.

‘పుస్తకాలకు అట్టలేయాలి ఇటు ఇచ్చేయ్’ అనేసి లాక్కునేవారు. పుస్తకాలు కొనేటప్పుడే ముందు జాగ్రత్త చర్య అన్నట్లుగా వాటికి బ్రౌన్ కలర్ షీట్స్ అట్టలేయడం కోసం తెచ్చేవారు. పుస్తకం అందునా కొత్త పుస్తకం కవర్ మీద రాసిన అక్షరాలు, బొమ్మ ఎంత బాగుండేవో. వాటని అందరికీ చూపించి సంబరపడదామనుకుంటే అన్ని పుస్తకాలకూ ఒకే రంగున్న బ్రౌన్ అట్టలేయడం చాలా అన్యాయం అనిపించేది. నాలో ఓ విప్లవకారుడు శంఖం ఊదేవాడు. అది విప్లవం అనీ గానీ, ఆ విప్లవం చుట్టూ బోలెడు సాహిత్యం అల్లుకుని ఉన్నదనీ, నాకప్పట్లో తెలియదనుకోండి. నేను పేచీ పెట్టేవాడ్ని. కానీ బలహీన వర్గాలవారి మాట చెల్లుతుందా చెప్పండి.

తెలుగు నుంచి లెక్కల పుస్తకం దాకా అన్నింటికీ బ్రౌన్ కలర్ అట్టలేసి ‘సమానత్వం’ తీసుకొచ్చామన్నట్లు తెగ ఫీలయ్యేవారు. వాటిపైన పేరు, క్లాస్ , సెక్షన్ వంటివి రాసుకోవడానికి వీలుగు ఉండే స్టిక్కర్స్ అంటించేవారు. ఈ స్టిక్కర్స్ మీద ఉండే చిన్న సైజు బొమ్మలే కాస్తంత ఊరట కలిగించేవి.

కొత్త పుస్తకాలు, నోట్ పుస్తకాలను అతి జాగ్రత్తగా స్కూల్‌కి తీసుకు వెళ్ళడానికి ఒక అల్యూమినియమ్ పెట్టె కొనేవారు. దానికి ఒక గొళ్లెం ఉండేది. ఒక్కోసారి ఆ గొళ్లెం పట్టక పుస్తకాల పెట్టె పట్టుకుని రోడ్డు మీద వస్తుంటే పుస్తకాల్లో కొన్నిజారి క్రింద పడిపోయేవి.

వాటికి మట్టి అంటుకునేది. ఇంటికెళ్లాక పుస్తకాలు మాసి ఉండటం చూసి పెద్దోళ్ల క్లాస్‌లు పీకడాలు, నా బోటి పిల్లలు అలగడాలు ఆ రోజుల్లో కామన్.

కొత్త పుస్తకం వచ్చిన వేళావిశేషమా అన్నట్లు మండే ఎండలు తగ్గి, వాన జల్లులు పడేవి. దీంతో తడిసిన మట్టి హాయినిచ్చే వాసనలు వెదజల్లేది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు జీవితంలో ఎంతో విలువైనవి. ఇవే మనతో పాటు చివరిదాకా నిలిచే నిజమైన సంపదలు.

కొత్త పుస్తకం ఇచ్చే ఉత్సాహం పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి పెంచుతుంటుందనీ, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంటుందని మా నాన్నగారు ఎవరితోనో అనడం నాకు గుర్తుంది. చదువు విలువ తెలిసిన మనిషి. పిల్లల మనస్తత్వ శాస్త్రం వంటి పుస్తకాలు చదివిన తండ్రి కాకపోవచ్చు. కానీ పిల్లల మనసెరిగిన తండ్రి. పుస్తకం పట్ల ఆసక్తి కలిగితే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది.

ఈ విషయం తర్వాత అనేక సార్లు అర్థమైందనుకోండి. అందుకే పుస్తకం చుట్టూ నా అనుభవాలు మరిన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను.

నడక నేర్పిన పుస్తకం:

అది 70వ దశకం.. పుస్తకం హస్తభూషణం అనుకునే రోజులవి. హైస్కూల్, కాలేజీ చదువులు వెలగబెడుతున్న రోజుల్లో ఇలాగే అనుకునేవాళ్లం. ఇప్పుడంటే మొబైల్ సెల్ హస్తభూషణం అయిపోయింది. ఆ రోజుల్లో రైలెక్కినా, బస్సెక్కినా, చివరకు పార్క్ లో కూర్చున్నా చేతిలో ఓ పుస్తకం. వీలు చిక్కినప్పుడులల్లా చదవడం. లేదా చదువుతున్నట్లు నటించడం.. అలా ఉండేవి సీన్లు. ఇప్పుడేమో సెల్ ఫోన్ లోనే పుస్తకాలు చదవే వీలు వచ్చేసిందాయె. ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచ విశేషాలన్నీ అరచేతిలోకి వచ్చి వాలుతున్నాయి.

అప్పట్లో, చేతిలో ఒకటో రెండో పుస్తకాలు పట్టుకని కాలేజీ గ్రౌండ్‌లో నడుస్తుంటే ఎవరికివాళ్లు తామేదో మేధావులమన్నట్లు ఫీలయ్యేవారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు పుస్తకాలు పట్టుకునే తీరులోనూ ఓ ప్రత్యేక స్టయిల్ ఉండేది.

అమ్మాయిలు పుస్తకాల దొంతరను పూలగుత్తిలా గుండెలకు హద్దుకుని సుకుమారంగా నడిచే తీరు చూడ ముచ్చటేసేది. ఆ రోజుల్లో చాలా చోట్ల కాలేజీ అమ్మాయిలు లంగా ఓణీలే వేసుకునేవారు. దీంతో రంగు రంగుల సీతాకోక చిలకల్లా ఉండేవారు. మరి కుర్రోళ్లో.. వీళ్ల చేతుల్లో పుస్తకాలు, తామెప్పుడు జారి క్రింద పడిపోతామో వీడి నిర్లక్ష్యానికి అని భయపడుతున్నట్లు ఉండేవి, పుస్తకాలకు కనుక మాటలు వస్తే – ‘ఏమర్రా కుర్రాళ్లూ, మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లండర్రా, మమ్మల్ని పట్టుకుని అలా చేతులు నిర్లక్ష్యంగా ఊపడమేమిటీ, మమ్మల్ని గాలిలోకి ఎగరేస్తూ ఒంటి చేత్తో పట్టుకుని విన్యాసాలు చేస్తూ ఆ ఫోజులేమిటర్రా’ అని కసురుకునేవేమో.

ఏమో.. క్లాస్ పుస్తకాలే కాకుండా జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, నవలలు వంటివి కావాలంటే లైబ్రరీకి వెళుతుండేవాళ్లం. కాలేజీ లైబ్రరీకి వెళ్లేమాట అటుంచితే, ఊర్లోని లైబ్రరీకి స్టూడెంట్స్ వెళ్లడం చాలా తక్కువనే చెప్పాలి. నేను అప్పుడప్పుడు ఊర్లోని లైబ్రరీకి వెళ్ళేవాడ్ని. అక్కడికీ అమ్మాయిలు వచ్చేవారు. ఎక్కువగా నవలల కోసం. లైబ్రరీల్లో వారపత్రికలు, మాసపత్రికలు కూడా అందుబాటిలో ఉంచేవాళ్లు. వీక్లీ వంటి మేగజైన్స్ పట్టుకుని వీధుల్లోకి వెళ్లడమంటే, ఎందుకో తెలియదు కానీ కాస్తంత సిగ్గుపడేవాళ్లం. ఆ రోజుల్లో వీక్లీల్లో వచ్చే సీరియల్స్ రచనలో కొత్త పుంతలు తొక్కడం మొదలైంది. యువతీ యువకులను ఆకర్షించే అనేకానేక ప్రయత్నాలు రచయితలు, రచయిత్రులు చేసేవారు. అలాంటి సీరియల్స్‌కి మంచి క్రేజ్.

యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, ముప్పాళ్ల రంగనాయకమ్మ, మాదిరెడ్డి సులోచన వంటి రచయిత్రిలే కాకుండా యండమూరి వీరేంధ్రనాద్, ఎన్ ఆర్ నంది, మల్లాది వంటి సంచల రచయితలు పాపులర్ అయ్యారు. యండమూరి రచనా శైలి నాకు బాగా నచ్చేది. ‘తులసి దళం’ సీరియల్ కోసం ఆంధ్రభూమి వార పత్రిక ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వాళ్లం. అతి సామాన్యమైన విషయాన్ని పాఠకుడు టెన్షన్ పడేలా రాయడం వీరేంద్ర శైలి. ఉదాహరణ చెబుతాను.

‘తులసి దళం’ లేదా ‘కాష్మోరా’ సీరియలో సరిగా గుర్తుకు రావడంలేదు కానీ ఒక సన్నివేశంలో ఇంటి కప్పు నుంచి వేలాడుదీసిన కుండలో నీళ్లు పోసి, కుండకు కేవలం బొట్టు బొట్టు పడేలా సన్నటి చిల్లుపెడతారు. ఆ కుండ క్రింద ఉన్న వ్యక్తి తలపైన ఆ నీటి బొట్టు ఒకటొకటిగా పడుతూ ఉంటుంది. నీటి చుక్కలు పడుతున్నప్పుడు వచ్చే శబ్దాన్ని టప్.. టప్.. టప్.. అంటూ రచయిత రాస్తే, ప్రింటింగ్‌లో ఫాంట్ సైజ్ పెంచుతూ చివరి ‘టప్’ వచ్చే సరికి మరీ పెద్ద ఫాంట్ పెట్టడం గమనించి ఆశ్చర్యపోయాను. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి ప్రయోగాలు రచయితలు, ప్రింటర్స్ కలిసి చేసేవారని చెప్పడానికి. ఆ తర్వాతి కాలంలో ప్రింట్ మీడియాలోకి వెళ్ళాక ఇలాంటి బోలెడు జిమ్మిక్స్ ఎలా చేశారో, ఎందుకు చేసేవారో బాగా తెలిసిందిలేండి.

నేను ఆంధ్రప్రభలో పనిచేస్తున్న రోజుల్లో కొన్ని ప్రత్యేక వార్తలు (బాక్స్ ఐటెమ్స్) రాసేటప్పుడు నాకు తెలియకుండానే యండమూరి శైలి వచ్చేసేది. బాక్స్ ఐటెమ్స్ బాగా రాసే వాళ్ళను ఎడిటోరియల్ డెస్క్ లో ముద్దుగా ‘బాక్సర్స్’ అనేవారు. అలా నేనూ బాక్సర్ బిరుదాంకితుడనయ్యాను.

ఆ రోజుల్లో కొన్ని సీరియల్స్ చదవొద్దని, అవి చదివితే చెడిపోతారని మా ఇంట్లో ఆంక్షలు పెట్టేవారు. కానీ మనం ఊరుకుంటామా. ఎలాగో అలాగ పత్రిక కాపీ సంపాదించి చాటుమాటుగా చదివి, ఆ విషయం మిత్రులతో గొప్పగా చెప్పేవాడ్ని. వార పత్రికల విషయంలోనే ఇంట్లో ఆంక్షలు ఉంటే ఇక డిటెక్టీవ్ నవలలు చదవనిస్తారా ఏంటీ? అస్సలు కుదరదనే వారు. ఐతే మా స్నేహితుల్లో కొంత మంది డిటెక్టీవ్ నవలలు చదివి ఓ సినిమా కథ చెప్పినంత థ్రిలింగ్‌గా చెప్పేవారు. డిటెక్టివ్ భరత్, డిటెక్టివ్ యుగంధర్ వంటి పాత్రల పేర్లు ఇప్పటికీ గుర్తున్నాయి. డిటెక్టివ్ పుస్తకాలు సైజ్‌లో చాలా చిన్నవి. ఇది మాకెంతో సౌకర్యవంతంగా ఉండేది. పెద్ద పుస్తకాల మధ్యన ఈ డిటెక్టీవ్ నవలలు నేర్పుగా దాక్కునేవి. పుస్తకం మనిషి నడతను తీర్చిదిద్దుతుందని నూటికి నూరుపాళ్లు విశ్వసించే రోజులవి.

ఇప్పుడు మళ్ళీ బొంబాయి చర్చ్ గేట్ దగ్గరకు మిమ్మల్ని తీసుకువెళతాను..

బొంబాయిలో లైబ్రరీ అనగానే చర్చ్ గేట్‌కి దగ్గర్లో ఉన్న అమెరికన్ లైబ్రరీ గురించి చెప్పుకోవాలి. ఇది మా హాస్టల్‌కీ దగ్గరే. ఈ లైబ్రరీ చాలా అధునాతన సౌకర్యాలతో ఉండేది. నేను నందిగామలో చదువుకునే రోజుల్లో మా ఇంటికి దగ్గర్లోనే అప్పట్లో ఉండే లైబ్రరీ చూడటం తప్ప మరెక్కడా లైబ్రరీ చూడలేదు. నందిగామ లైబ్రరీ బ్లాక్ అండ్ వైట్ మూవీ అయితే అమెరికన్ లైబ్రరీ కలర్ సినిమాలా అనిపించేది. అయితే నందిగామకి అప్పుడప్పుడు విశాలాంధ్ర వారి మొబైల్ లైబ్రరీ వ్యాన్ వచ్చేది. కదిలే గ్రంథాలయం అన్న పేరు వినగానే బోలెడు ఆశ్చర్యం. ఆ వ్యాన్ మెయిన్ రోడ్డులో గాంధీ బొమ్మ సెంటర్‌కి వచ్చి ఆగగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్లేవాడిని. ఆ వ్యాన్ లోకి మెట్లెక్కి వెళితే అందులో అనేక అరల్లో పొందికగా అమర్చిన పుస్తకాల దొంతర్లు కనిపించేవి.

చాలా వాటిని కొనాలని అనిపించినా చేతిలో డబ్బులేవి? సోవియట్ యూనియన్ వారి పబ్లికేషన్స్ చవకగా దొరికేవి. వారి క్యాలెండర్ అయితే చాలా బాగుండేది.

అందమైన కొండలు లోయలు పూల చెట్లు.. ఇలా ప్రకృతి పరవశిస్తున్నట్లు మంచి కలర్ చిత్రాలతో ఈ కేలండర్ ముద్రించేవారు. అందులోని కొన్ని దృశ్యాలను కత్తిరించి న్యూయిర్ గ్రీటింగ్స్ తయారు చేసి బంధుమిత్రులకు అందజేసేవాడ్ని. గ్రీటింగ్ కార్డ్స్ కొనే ఖర్చు లేదు. పైగా సొంతంగా తయారు చేశామన్న తృప్తి.

ఇక విశాలాంధ్రవారి నరావతారం (మానవ జాతి పరిణామక్రమం), విశ్వరూపం (ఖగోళ రహస్యాల మీద), నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం ఇలాంటి పుస్తకాలు నెమ్మదిగా డబ్బులు పోగేసి మరోసారి వ్యాన్ వచ్చినప్పుడు కొనేవాడ్ని. ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు బోలెడు విషయాలు తెలిసేవి. వాటిని మిత్రులతో పంచుకుంటుంటే వారిలో కొందరు ఆశ్చర్యంగా చూసేవారు. సరే, అమెరికన్ లైబ్రరీలో సభ్యత్వం తీసుకుని చదివినా చదవకపోయినా కొన్ని పుస్తకాలు తెచ్చుకునేవాడ్ని. హాస్టల్ రూమ్‌కి వచ్చే ఫ్రెండ్స్ చూసి మెచ్చుకునేవారు. అదో రకం గర్వంగా అనిపించేది. కొన్ని పుస్తకాలు చదవడం, నచ్చిన అంశాలు నోట్స్ రాసుకోవడం చేసేవాడ్ని. అలాగే మా కాలేజీ లైబ్రరీ నుంచి సైన్స్ బుక్స్ తెచ్చేవాడ్ని, బయాలజీకి సంబంధించినవి చదువుతున్నప్పుడు సబ్జెక్ట్ తెలిసినదే అయినా ఎప్పటికప్పుడు ఏవో కొత్త గవక్షాలు తెరుచుకుని సరికొత్త దృశ్యాలు చూస్తున్నట్లు అనిపించేది. మనం చదివే కోణాన్ని బట్టి అర్థం చేసుకునే తీరు కూడా మారుతుందని తెలిసింది. జీవశాస్త్రం పుస్తకాలు అలా చదువుతున్నప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. జీవుల జీవిత చరిత్రలోనే ఎన్నో అద్భుతాలు దాగున్నాయన్నది.

కొన్ని జీవజాతులు నా ముందు నిలిచి వింత వింత కథలు చెబుతున్నట్లు అనిపించేది.

  • మొక్కలు పూలు, కాయలు కాచేది ఎవరి కోసం?
  • కొన్ని చెట్లకే ముళ్ళెందుకు?
  • మొక్కలు – మూగ మనసు బాసలు?
  • మరణం లేని జీవులు ఉన్నాయా? –

ఇలాంటి అంశాలపై నోట్స్ రాసుకునేవాడ్ని.

ఇవి ఆ రోజుల్లో చాలా తక్కువ మందికి తెలిసిన విషయాలు. పైగా తెలుగులో ఈ అంశాలపై రాలేదు. ఇప్పుడు వచ్చాయేమో నాకు తెలియదు. అందుకనే ‘జీవశాస్త్రంలో వింత వింతలు’ అన్న శీర్షిక క్రింద కొంత నోట్స్ రాసుకోవడం మొదలుపెట్టాను. బుక్ గా వేద్దామనే ఆలోచన. ఇది కూడా అమాకత్వమే. ఎందుకంటే, బుక్ పబ్లిష్ చేయడం ఎంత కష్టమో అన్న ఆలోచన కూడా చేయనంతటి అమాకత్వం.

తర్వాతి కాలంలో ఆర్థిక స్తోమత ఉన్నా, లేదా ఎవరైనా బుక్ పబ్లిష్ చేయడానికి (నవభారత్ వారితో అప్పట్లో పరిచయాలు ఉండేవి) ముందుకు వచ్చినా ఆ నోట్స్ అప్పటికే కాలమనే గాలికి ఎగిరిపోయింది. ఉద్యోగ వేట, ఆ తర్వాత కొత్త కొత్త దారుల్లో ప్రయాణాలు, అటు పైన చదువుతో సంబంధం లేని ఉద్యోగం ఇలా ఇలా జీవితంలో అనేక ట్విస్ట్‌లు ఎదురవడంతో ‘జీవ శాస్త్రంలో వింత వింతలు’ శీర్షిక నా ఆలోచన పుటల్లో ఎక్కడో అట్టడుగికి వెళ్ళిపోయింది.

జీవితం చాలా చిత్రమైనది. ఏమో మంచి అవకాశం, సమయం వస్తే ఈ శీర్షిక క్రింద వ్యాసాలు రాయగలనేమో, పుస్తకంగా ప్రచురించనూ గలనేమో.. ఐతే అనుకోకుండా ఒక పని మాత్రం చేయగలిగాను. అదేమిటంటే, టివీ5 లో పనిచేస్తున్నప్పుడు ‘మరణం లేని జీవులు’ అన్న అంశంపై మాత్రం అరగంట ప్రత్యేక కార్యక్రమం ఇవ్వగలగడం.

ఆలోచనలేమో పెద్దపెద్దవి. అడుగులేమో చిన్నచిన్నవి. మరి ఈ కుర్రాడు తర్వాత ఏమయ్యాడు? ఏం సాధించాడు? మీతో ఇంకేం చెప్పబోతున్నాడు?

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here